నల్లటి మంచు – దృశ్యం 11

0
8

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-11

[Flash Back పూర్తవగానే దిల్లీలో పండిత్ శ్రీకంఠ్ వౌఖలూ గారి ఇల్లు దృశ్యమే కనిపిస్తుంది. టాఠాజీ చెట్టు మొదలు పై నుండి లేచి కిటికీ వద్దకు వస్తారు. చిరునవ్వు నవ్వుకుంటూ కిటికీని మూసేస్తారు. అక్కడికి శారీక ఏదో తీసుకుని కిందికి వస్తుంది.]

టాఠాజీ : (తనలో తను ఏదో లోకంలో మునిగి పోయినట్లు, మెల్లిగా) షీన్ ముబారక్…. షీన్ ముబారక్!

శారిక : (వింటుంది గాని, అర్థం కాక) షీన్ ముబారక్? మీరేమన్నారు? ఏమయినా అన్నారా?

టాఠాజీ : అబ్బే ఏం లేదు… ఈసారి ‘ఖిచిడీ అమావాస్య’ ఏ రోజు పడుతోందా! అని

శారిక : (కాస్తంత గాభరాగా) ఏంటి?

టాఠాజీ : ఖిచిడీ అమావాస్య అంటున్నాను. బహుశా శలవు రోజే పడొచ్చు. శనివారమో – ఆదివారమో…

శారిక : మీకు హఠాత్తుగా ఖిచిడీ అమావాస్య ఎందుకు గుర్తొచ్చింది? చెయ్యమంటే, ఈ రోజే వండేస్తాను….

(రూప వస్తుంది)

టాఠాజీ : ఆహాఁ! అలా – ఎలా? చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావేంటి?… ఈరోజే చేస్తానని… ఏ పండుగ రోజుకు దాని ప్రత్యేకత ఉంటుంది కదా! (కాస్త ఆగి) అన్నట్లు బోయటోఠ్ ఉత్తరం రాసేడు… వాళ్ల కాకా వస్తున్నాడని! ఈసారి ఖిచిడీ అమావాస్యని (పుష్యబహుళ అమావాస్య నాడు జరుపుకుంటారు) తను కూడా చూస్తాడీసారి!

రూప : అవును మనందరితో కలిసి ఇక్కడే ఖిచిడీ తింటారు కూడా… (కాస్తంత గంభీరంగా) కాని కాకా… ఎందుకొస్తున్నాడో?

టాఠాజీ : ఏదో ముఖ్యమైన పనే పడుంటుంది… ఏమో… పెళ్లి చేసుకుందికి అమ్మాయిని చూసుకుందికి వస్తున్నాడేమో! మంచిదే! ఎవరయినా ఇంటికి వస్తేనయినా కాస్తంత సందడిగా ఉంటుంది… మీరు కూడా అప్పటివరకూ…

రూప : లేదు… లేదు మేము కేవలం రెండు-మూడు రోజులుంటామంతే! అక్కడా మా అత్తగారూ ఒక్కరే ఉన్నారు. ఎక్కువ రోజులుండటం కష్టం.

టాఠాజీ : అవును ఎవరి సంసారం వారిది… అదెలా ఉన్నాసరే … మీ అమ్మే గనక బతికి ఉంటే ఖిచిడీతోబాటు దేశవాళీ చేపలనూ వండేది…

రూప : అందరికన్న ముందు డాబా మీదకు వెళ్లి యక్షుడి కోసమని ఉంచి వచ్చేది.

శారిక : మనం రాత్రంతా యక్షుడి కోసమని అలా ఎదురు చూసేవాళ్లం… ఆ యక్షుడు వస్తే, అతని వజ్రాలు – రత్నాల టోపీని లాక్కుందామని…

రూప : కాని, ఆ యక్షుడు ఎప్పుడూ రాలేదు…

శారిక : కాని మనం ఈరోజుకీ నిరీక్షిస్తూనే ఉన్నాం. (ఏదో లోకంలో ఉన్నట్లు) మన ఇంటికీ గృహదేవతకీ దూరమయి కూడా, ఈ రోజుకీ మనం నిరీక్షిస్తూనే ఉన్నాం…. మనస్ఫూర్తిగా అతడు రావాలని కోరుకుంటాం; తప్పక ఏదో ఒకరోజు వచ్చేస్తాడన్న బలమైన నమ్మకంతోటే ఈ పండగని ఏటా జరుపుకుంటాం… తన వజ్రాల – రత్నాల టోపీని తలమీద తొడుక్కుని తప్పకవస్తాడు…

టాఠాజీ : (కుర్చీ చెయ్యి ఆసరాతో తిన్నగా కూర్చుంటూ) శారికా… శారికా…

శారిక : (ఉలిక్కిపడి) ఆఁ!

టాఠాజీ : (శారిక ధ్యాసను మరల్చేందుకు మాట మారుస్తూ) గోషా ఏడి తల్లీ?

శారిక : వచ్చేస్తూ ఉంటాడు… స్నేహితుడితో వెళ్లాడు… ఎదురుగా పార్కులోకే…

టాఠాజీ : సరే.. సరే… మంచిదేనులే…వాడికీ కాస్త మనసు మారుతుంది… రూపా! రాజ్ ఏడమ్మా?

రూప : ఓల్డ్ దిల్లీ వెళ్లేరు… బహుశా టింబర్ మార్కెట్టు … వచ్చేసరికి సాయంత్రం కావచ్చన్నారు…

టాఠాజీ : మంచిదేనమ్మా… పదండి బైటకెళాం… పార్కులో కూర్చుని కాసేపు నీరెండ ననుభవిద్దాం. అమ్మో! దిల్లీలో ఎండాకాలం నిప్పులు చెరుగుతుంది.

రూప : పదండి టాఠాజీ!

(ముందు టాఠాజీ, వెనకే రూప, శారిక వెళ్లారు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here