నల్లటి మంచు – దృశ్యం 15

0
10

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-15

[dropcap][శా[/dropcap]రిక ఒకవైపు నేలమీద పరిచిన పరుపుమీద కూర్చుని, గోషాక్ స్కూల్లో ఇచ్చిన హోంవర్కు చేయిస్తోంది. ఎదురుగా గోషా పుస్తకాల సంచి అంతా తెరిచి ఉంది. పుస్తకాలు, నోట్సులు చెల్లా చెదరయి ఉన్నాయి. దగ్గరున్న కుర్చీలో టాఠాజీ కూర్చొని ఉన్నారు. శిబన్ ఒక వారగా కూర్చుని తన బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాడు. ఇంట్లో వాతావరణంలో టెన్షను కనిపిస్తోంది. టాఠాజీ – శిబన్‌ల మధ్య నడుస్తున్న గంభీరమైన వాదోపవాదాలు టాఠాజీకి కోపాన్ని, శిబన్‌కి విసుగూ – కోపాన్ని కలిగిస్తున్నాయి. శారిక, గోషా తమ పనులు చేసుకుంటున్నా, ధ్యాస మాత్రం వారిద్దరి సంభాషణ వైపే ఉంది.]

శారిక : ఇదిగో, దీని చెయ్యి గియ్యటం పూర్తయిందిగా, ఇక కాలు గియ్యి!

(గోషా నోట్సులోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే) గియ్యి! తొందరగా! ఏంటి ఆలోచిస్తున్నావు?

గోషా : (చాలా గంభీరమైన ఆలోచనా భంగిమలో) అవును గాని అత్తా! ఈ చేతి పైభాగాన్ని ‘మండ’ అంటాం కదా, మరి పాదం పై భాగాన్ని ‘పండ’ అని ఎందుకనం?

శారిక : (అతికష్టం మీద వస్తున్న నవ్వునాపుకుంటూ) దాన్ని పండ అనం… బండ అనం… అయినా నువ్వు ఇటు దృష్టిపెట్టు… ఊఁ!

గోషా: (కొంటెగా) నవ్వెందుకు ఆపుకుంటున్నావు?

(శారిక గోషా వంక తెచ్చిపెట్టుకున్నకోపంతో చూస్తుంది. అప్పుడే ఆమె ధ్యాస టాఠాజీ మాటలవైపు మరలుతుంది)

టాఠాజీ : నీకు తెలుసుకదా! ఈ మహానగరంలో నాకొచ్చే పెన్షను ఏ మూలకీ చాలదని?

శిబన్ : తెలుసు! ప్రయత్నిస్తూనే ఉన్నానుగా! (విసుగ్గా)

టాఠాజీ : డా. నసీర్ చెప్పాడు, అవసరమైతే వాళ్ల బావగారిని కలుసుకోమని… ఏమో అతనే ఏమైనా…

శిబన్ : (మాటను మధ్యలోనే తుంచి, వ్యంగ్యంగా) ఆఁ! ఔనౌను! వాళ్ల బావగారిని కలిస్తే సరి…

(కొన్ని క్షణాలు ఆగి)

మీకసలు ఏమైనా తెలుసా? లయజాన్ చేస్తాడుట. లాయజన్… అయనగారు… ఇన్ని మాటలెందుకు? దళారీ పని చేసి తింటాడని తిన్నగా చెప్పొచ్చుకదా!

టాఠాజీ : (మహాకోపంగా) నీ బుఱ్ఱ అసలు…

శిబన్ : ఇదొక్కటే మిగిలింది, ఏం చెయ్యాలన్నా!

టాఠాజీ : నీ బుజ్జు తిరుగుడు… (కాస్త అగి) ఆపాటి ఆ తలకాయని దాచుకోవటానికి ఒక గూడు దొరికిందని సంతోషించు… లేకపోతే…

శిబన్ : లేకపోతే ఏముంది? ఏ కేంపులోనే ఉండేవాళ్లం! వేలమంది ఉంటున్నారుగా!

టాఠాజీ : ఎందుకలా సంధ్యవేళ అలాటి మాటలు? నోటి వెంట మంచి మాటలు రానీ…

శిబన్ : సంధ్య… అహ్హ!

టాఠాజీ : (తన గొంతుకను అదుపు చేసుకుంటూ) రాజ్‌దాన్ గారు అమెరికాలో ఉన్నంతవరకూ మనకీ ఈ గది ఉంటుంది… ఆ తరవాత ఎలాగా మనం మన ఇంటికి వెళ్లిపోతాం… (ఆఖరి వాక్యం అంటున్నప్పుడు ఒక విధమయిన హాయిని అనుభవిస్తున్న దానికి గుర్తుగా కుర్చీ వెనక భాగానికి తలను అన్చుకుంటారు. కానీ శిబన్ తరవాతి మాటలు ఆయనను గిలగిలలాడేట్లు చేస్తాయి)

శిబన్ : ఇక ఈ కలలు కనటం మానెయ్యండి మీరు! ఇల్లా? ఎవరి యిల్లు? ఏం యిల్లు? ఇంటికి వెళాంట ఇంటికి! అబ్బో! చాలానే చూశాం ఇలాంటి పగటికలలు! అక్కడ ‘మన’ అంటూ ఏం మిగల్లేదు. మనం సొరంగానికి ఇవతల పక్క ఉన్నాం. అది దాటాలన్నది కలే!

టాఠాజీ : (ఆవేదనతో) కలా!

శిబన్ : మీ రాజ్‌దాన్ గారు కూడా మనకి ఈ గది ఇచ్చి ఏం మహోపకారం చెయ్యలేదు! మూతపడున్న ఆయన ఇంటిని కాపలా కాయటానికి ఒక చౌకీదారు కావాలి! దానికీ మనం దొరికేం అంతే!

టాఠాజీ : (బాధగా) చౌకీదారు!

శిబన్ : ఔను! చౌకీదారే!… ఇలాటి హృదయం లేని నగరంలో తమ సామానంతటితో ఉన్న ఇంటిని అలా అనాథలా వదిలేసి ఎవరైనా ఏడాదిపాటు బైట దేశానికి వెళ్లే సాహసం చెయ్యగలరా? మనం దీనికి కాపలా కాసేందుకున్న చౌకీదార్లమే! మరి మనకి… నెల జీతం ఎందుకు మాట్లాడుకోలేదో?

టాఠాజీ : (బాధగా నైనా దృడమైన గొంతుకతో) నీదికాదు తప్పు… నీ వంశానిది దోషం… ఎవరు ఉపకారం చేసినా,… మంచి చేసినా కూడా… అందులో ఏదో స్వార్థాన్నే వెతకటం… (కోపం వలన పైస్థాయిలో) అతడేదో చేశాడు… కనీసం… మరి నువ్వేం చేస్తున్నావుట? చెప్పు?… ఆఁ! ఉదయం పూట పేపర్లు అమ్ముతావు… ఆ తరవాత? ఉద్యోగాల కోసం వేట… అంతే అలా వెతుక్కుంటూ గడిపెయ్యి… (శిబన్ మొహం కోపంతో ఎరుపెక్కిపోతుంది. ఇస్త్రీ పని వదిలేసి లేచి నిల్చుంటాడు)

శిబన్ : ఔను, వెతుక్కుంటూనే ఉన్నాను… కాశ్మీరు వాడినవటం నా దౌర్భాగ్యం అని నాకు తెలియలేదు…

(కాళ్లు నేలకేసి కొడుతూ గది నుంచి బైటకు వెళ్లిపోతాడు. టాఠాజీ చాలా బాధపడుతూ ఉంటారు. తల పట్టుకుని చింతాక్రాంతులవుతారు. శారిక, గోషా ఆయన్నే చూస్తూంటారు. ఆయన లేచి, వంట గదిలోకి మంచినీళ్లు తాగటానికి వెళ్తారు. ఒక గుక్కతాగి, బూట్లలో పాదాలుంచి గదినుంచి బైటకి వెళ్తారు).

టాఠాజీ : (తలుపువైపు చూస్తూ) ఇప్పుడే వస్తా… (శారిక ఆయన వంకే చూస్తూ ఉంటుంది. ఆయన బైటకు వెళ్లిపోతారు. ఆమె కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. గోషా తన నోట్సులో రంగులు నింపుతూ ఉంటాడు. శారిక బాధపడుతూ అటూ-ఇటూ పచార్లు చేస్తూండగా నేపథ్యంలో వేదనతో కూడిన వేణుగానం వినిపిస్తుంది.)

శారిక : (స్వగతం) మళ్లీ అదే వేణుగానం… బాధలో తడిసిముద్దయి… పహాడీ… వీహాగ్… సాయంత్రం 7 అయినట్లుంది… ఎవరు రోజూ ఇదే సమయానికి వాయిస్తారు? ఈ ధ్వని దూరం నుండి తేలుతూ, నన్ను నా వేదనతో కూడిన నీడల్లో వెతుక్కుంటూ వెతుక్కుంటుంది.

గోషా: అత్తా… అత్తా…

శారిక : (ఉలిక్కిపడి) ఏంటో చెప్పు?

(గోషా తన డ్రాయింగు పుస్తకాన్ని ఒకవైపు పెట్టి నడుము వాల్చుతాడు. శారిక తన వద్దకు వెళ్లి, జుట్టులో చేతులుపెట్టి నెమ్మదిగా నిముర్తూంటుంది)

గోషా: అత్తా …

శారిక : చెప్పు?

గోషా: ఏదైనా కథ చెప్పు అత్తా!

శారిక : ఇప్పుడు కాదు, అన్నం తిన్నాక…

గోషా : కాదు, ఇప్పుడే…

శారిక : ఇప్పుడు చెప్పటం మొదలుపెడితే హాయిగా పడుకుండిపోతావు…

గోషా : పడుకోనత్తా… ప్లీజ్.. చెప్పవా? ప్లీజ్… ప్లీజ్… నిన్న నువ్వు చెపున్న కథ చివరకొచ్చేసరికి ఏముంది చెప్పవా? చెప్పు.

శారిక : నిన్నటి కథా… ?

గోషా : అదే పేద ముసలమ్మ… అమెకీ ఒక కొడుకు ఉండేవాడు. ఆ పిల్లడేమో రాజకుమార్తెనే పెళ్లి చేసుకుంటాను అని మొండిపెట్టుపట్టేడు… ఇల్లొదిలి రాజుగారి కోటకి బైల్దేరి వెళ్తూన్నాడు… ఆ తరవాత… నేను పడుకుండి పోయేను… చెప్పు! ఏమయింది అత్తా?

శారిక : (కథలో లీనమవుతూ) వాళ్ల అమ్మేమో కొడుకుని రాజుగారి కోటకు వెళ్లకు, వెళ్లినా ప్రయోజనం ఉండదూ… అని ఆపేసింది!

గోషా : ఇప్పుడా?

శారిక : అవును… వాళ్లమ్మ అంది కదా, ‘నీ పెళ్లి ఆ రాకుమారితోనే తప్పక అవుతుంది. కానీ ఇప్పుడు కాదు, పర్వతాల పైన నల్లటిమంచు కురిసినప్పుడు అవుతుందని ఒక ఫకీరు చెప్పేడు’. ఈ మాటలు విన్న ఆ కొడుకేమో సంతోషపడి అగిపోయాడు. ప్రతి చలికాలంలో నల్లటిమంచు కురుస్తుందేమోనని ఎదురుచూస్తూనే ఉన్నాడు… వాళ్లమ్మకీ సంతోషమే… ఎందుకంటే వాళ్ల కొడుకు ఆమెను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లనేలేదుగా! అందుకు.

గోషా: అప్పుడు?

శారిక : అప్పుడా? కథ కంచికి, మనం ఇంటికి!

గోషా : మరి నల్లటి మంచు కురిస్తే?

శారిక : అయ్యో! వెట్టివాడా! మంచు ఎప్పుడైనా నల్లగా ఉంటుందా? నల్లటి మంచు కురవటం అంటే ఎప్పటికీ జరగని విషయం! అని అర్థం.

గోషా : ఎప్పుడూ జరగనిది… (ఆలోచించి)

ఉహుఁ! నీకు తెలియదు అత్తా! ఉంటుంది – నల్లటి మంచు ఉంటుంది.

శారిక : (నవ్వేసి) ఔను. నీ డ్రాయింగు పుస్తకంలో (లేచి గోషా పుస్తకాలని సర్దుతూ ఉంటుంది).

గోషా: (చాలా నమ్మకంగా) నిజం అత్తా… తప్పక నల్లటిమంచు కురుస్తుంది…

(శారిక గంభీరంగా గోషా వంక చూస్తుంది)

ఒకనాడు టాఠాజీ అంటున్నారేంటో తెలుసా?… నా కొడుకు – కోడలు చచ్చిపోతేనేం? ఇంకా నల్లటిమంచు కురవలేదుకదా, తిరిగి వెళ్లే ఆశ వదిలెయ్యటానికి … అని!

శారిక : (లోపటి నుండి భయపడుతూ) పద-పద! రాత్రి చాలా అవుతోంది… ఏదో తినేసి పడుకోవాలి…

(రూప ప్రవేశిస్తుంది. ముఖం పైన సంతోషం)

రూప : (సంతోషం నిండిన గొంతుకతో)

ఇది విన్నావా శారికా?

(శారిక ఆమె వంక చూస్తుంది)

ఈ రోజు ఈయనకీ బజార్లో… డా. నసీర్ కలిసేరుట. ఆయన కూడా రెండేళ్ల నుండి దిల్లీ లోనే ఉన్నారుట… (గంభీరంగా) ఎవరి భయం వలన వాళ్లు తమ ఇల్లు – వాకిలి వదులుకున్నారో… ఈ పరాయి ఊళ్లో ఉండవలసి వచ్చిందో… ఆ గుల్లా…

శారిక : ఆ గుల్లా?

రూప : ఆ గుల్లా చచ్చిపోయాడు!

(శారిక, రూప ఒకరివంక ఒకరు చూసుకుంటారు. వారిద్దరి చూపులూ ఒక దానితో ఒకటి ఊసులు ఎన్నెన్నో చెప్పుకుంటాయి. గోషా భుజాలెగరేస్తూ, అక్కడినుండి వెళ్తాడు)

గోషా : గుల్లా చచ్చిపోయాడు! గుల్లా చచ్చిపోయాడు (వెళ్తాడు)

రూప : శారికా! (పిలుస్తూ దగ్గరగా వెళ్లి కౌగలించుకుంటుంది. గొంతుక పూడుకుపోతుంది) శారికా… వాళ్లు ఇంటికి మళ్లీ వెళ్లిపోతున్నారు… వారి గుల్లా అయితే చనిపోయాడు…. మరి మన గుల్లా ఎప్పుడు పోతాడో? (ఏడ్చేస్తుంది) ఎప్పుడు? ఎప్పుడు పోతాడో గుల్లా? (శారిక అమెను వీపుమీద మెల్లిగా తడుతూ ఉంటుంది. ఆమె కళ్లు కూడా తడిగా ఉన్నాయి. ఆపైన దూరంగా వచ్చి, రంగస్థలం ముందరి బాగానికొస్తుంది. ఏదో ఆలోచిస్తున్నట్లుంటుంది. రూప అమె హావభావాలు కాస్త తికమకగా గమనిస్తూ ఉంటుంది). శారికా… ఏమయింది?

శారిక : అక్కా నీకో సంగతి తెలుసా?… ఎన్నో ఏళ్లనుండి తరుచుగా నేనొక కలను కంటూ వస్తున్నాను… పదే పదే అదే కల!

రూప : కలా? ఏం కల?

(శారిక తన స్వప్నంలో మునిగిపోయినట్లు చెప్పుకుంటూ పోతుంది)

శారిక : ఒక పచ్చటీ లోయ ఉంది. దానిలో గుంపులకొద్దీ గొఱ్ఱెపిల్లలు… తెల్లవి, నల్లవి, బూడిద రంగువి, రంగు రంగులవెన్నో… గొఱ్ఱెపిల్లలే, గొఱ్ఱెపిల్లలు… అప్పుడే హఠాత్తుగా (రంగస్థలంపైన తిరుగుతూ) లోయంతా నాలుగువైపులా మంచుతో కప్పబడిన పర్వతాలు పుట్టుకొస్తూ ఉంటాయి… మెల్లి మెల్లిగా… (పరుగు పెడుతూ) ఇక్కడా… అదిగో అక్కడా… అలా అలా పెరిగిపోతూ ఉంటాయా పర్వతాలు… అంతేనా? అవి వాటి రంగును కూడా మార్చేసుకుంటూ ఉంటాయి…

(గొంతుకలో గాంభీర్యం వస్తుంది)

అదిగో ఆ తెల్లటి పర్వతాలు ముందు బూడిద రంగులోకి… అటుపైన సిరా రంగులో… ఆ తర్వాత నల్లగా… పూర్తిగా కాటుక నలుపులోకి…

రూప: (బాగా కంగారు పడుతూ) శారికా! నువ్వు…

శారిక : (తన మాటనేం వినిపించుకోకుండానే)

ఆ తరువాత దూరంగా, మసక-మసకగా ఉన్నచోటునుండి ఒక ఆకారం సాక్షాత్కరిస్తుంది. చేతిలో పచ్చని ఆకుల కట్టలు… ఆ ఆకారం రెండిటీగా విడిపోతుంది… ఆకులు కూడా రెండు వేర్వేరు భాగాలుగా విడిపోయి, రెండు వేర్వేరు దారుల్లో వెళ్తూ కానవస్తాయి…

రూప : శారికా! నువ్విలా వచ్చికూర్చో! విను…

శారిక : గొఱ్ఱెపిల్లలు వాటిని వెంబడిస్తూ పోయి, అవీ రెండుదారుల్లో చీలిపోతాయి. నాకు భయం, గాభరాగా అనిపించి నేను గట్టిగా అరుస్తాను… (స్వప్నంలో అరుపును అభినయిస్తుంది) అగండి వినండి… అటు వెళ్లొద్దు. మీరు విడిపోతున్నారు… ఆగండాగండి. నా మాట విని, ఆగండి… నన్ను వినండి… (బాగా ఆయాసపడుతూ) పరిగెడుతూ-పరిగెడుతూ నేను ఆ చీలికతోవ వద్దకు వస్తాను… ఇప్పుడు ఎటువెళ్లాలి … ఇటా? అటా? లేక నేనూ రెండుగా విడిపోయేదా?

(భయంతో వణుకుతూ)

చీలిపోవటమంటే రెండు ముక్కలవటం… (పరిగెడుతుంది) లేదు… లేదు! నేను తిరిగి మరలిపోతాను… కాదు…

రూప : శారికా! నీకేమయింది? నువ్వు బాగానే ఉన్నావా?…

శారిక : ఔనూ, ఈ పచ్చదనమంతా పాకుడు నాచుగా ఎందుకు మారిపోతోంది?… లేదు… ఈ పాకుడు మీద నేనొక్కదాన్నే… లేదు -లేదు. (భయపడుతున్న గొంతుకతో) అప్పుడే నేనొక స్వరాన్ని… చూస్తాను… కాదు-కాదు వింటాను… ఒక శబ్దం…. దూరం నుండి ఒక బరువైన గొంతుక విన వస్తుంది. (అభినయిస్తూ) మంచు నల్లబడలేదు… వెనక్కి తిరిగి చూడు, మంచు నల్లగాలేదు.

(వేగంగా వెనక్కి తిరిగి)

నేను వెనక్కి తిరుగుతాను… చూస్తే… నిజమే… ఆ పర్వత శిఖరంపైన దూదిలాటి తెల్లటి మంచు తొంగిచూస్తూ కనిపిస్తుంది.

(ఒక్కక్షణంపాటు నిశ్శబ్దంగా ఉండి, తిరిగి గుసగుసలాడుతున్నట్లు)

ఆ స్వరం మళ్లీ వినిపిస్తుంది. (అభినయిస్తూ) చూశావా… ఇదంతా పైనుండి పోసిన రంగు మాత్రమే… కిందనున్న మంచుమాత్రం ఎప్పటిలాగే తెల్లగా – స్వచ్ఛంగా ఉంది… ఒక్కటంటే ఒక్క వాన చాలు… ఒక వాన పడగానే గొఱ్ఱెపిల్లలన్నీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి… తప్పక వచ్చేస్తాయి…

(శారిక ఈ పరిస్థితిని చూసి రూప చాలా కంగారు పడుతూ ఉంటుంది)

రూప : రాజ్-రాజ్, టాఠాజీ… చూడండి…. చూడండిలా… శారికా…

శారిక : గొఱ్ఱెపిల్లలు వెనొక్కచ్చేస్తాయి… మంచు నల్లబడలేదు. … నల్లమంచు కురవలేదు…. (లోపటి నుండి రాజ్, టాఠాజీ, శిబన్ పరుగు-పరుగున వచ్చి, కంగారు కంగారుగా రూపతో సహా అందరూ శారికను చుట్టుముడతారు. ఆఖర్న పరిగెట్టి వచ్చిన గోషా అత్త పరిస్థితి చూసి, ఆమెకు అతుక్కుపోయి)

గోషా : అత్తా! (మళ్లీ ఆమెకు అతుక్కుపోతాడు.)

టాఠాజీ,శిబన్, రాజ్ : శారికా-శారీకా.

శారిక : (గోషాను తన చేతుల్లోకి తీసుకుని తనవంక తిప్పుకుని) గోషా! నల్లటిమంచు కురవలేదురా నాన్నా! కురవలేదు నల్లటి మంచు… (శారిక మధ్యలో ఉంది. గోషా అమె వంక చూస్తూ అమెతోటే ఉన్నాడు. శారిక కూడా గోషా వంకే తదేకంగా చూస్తోంది. తక్కినవారంతా కంగారుగా ఉన్నారు. అందరూ బొమ్మల్లా ఉండిపోతారు. దృశ్యం ఫ్రీజ్ అయిపోతుంది. నేపథ్యంలో కవితాపంక్తులు వినవస్తాయి…)

నల్లటి మంచు అంటే అపనమ్మకం
నాలుగు దిక్కులా అంధకారమన్నట్లు
రేపటి చిన్ని బాటసారి ప్రశ్నిస్తాడు,
అలాటి మంచు కురిసిందా, చెప్పు అంటూ!
వర్తమానం అందికదా, రేపు నీది.
మెరిపించి దీనిని జాగ్రత్త చేసుకో!
మురికిని కడిగి, తీర్చిదిద్దుకో
మెరిపించి దీనిని భద్రపరుచుకో!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here