నల్లటి మంచు – దృశ్యం 6

0
10

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-6

[dropcap][శ్రీ[/dropcap]నగర్లో రాజ్ ఇల్లు. ఎగువ మధ్య తరగతి ఇంట్లో ఒక గది. అక్కడి అలంకరణ, ఉంచుకున్న విధానం మూలమూలలా కాశ్మీరు పరిమళాలను వెదజల్లుతోంది. వగుల్ (మందపాటి చాప) పైన కాశ్మీరు దరీ, టేబిలుపైన………… తో బాటు కాళ్లను వెచ్చగా ఉంచేందుకు దళసరి ఊలు కంబళీ కూడా ఉన్నాయి. కాంగడీ (చిన్నపొయ్యి) కూడా కనిపిస్తోంది. అక్రూటు కట్టెతో అందమైన పనితనంతో చేసిన సోఫా! రాజ్‌ను కలవటానికి అతని మిత్రుడు నసీరుద్దీన్ డార్ వచ్చాడు. ఇద్దరూ తేనీరు సేవిస్తూ కబుర్లు చెప్పకుంటున్నారు]

డా. నసీర్ : దేశానికే విజ్ఞత (తెలివితేటలు, బుద్ధి) ఉన్నవారిగా పేరు పొందిన ఈ జాతికి అసలు ఏమయిందంటావు రాజ్? కాశ్మీరు శక్తిని, మన్నన – మర్యాద.. అన్నిటినీ చూడనట్లు, గమనించనట్లు వదిలేసి, ఇక్కడి నుండి మీరంతా పలాయనం చిత్తగిస్తున్నారు కదా…!

రాజ్ : (మాటను మార్చాలన్న ఉద్దేశ్యంతో) ఇప్పుడు – ఇక్కడ మీ ఎదురుగానే కూర్చున్నాను కదా డాక్టరు గారూ…!

డా. నసీర్ : అయితే తక్కిన వాళ్లను కూడా ఆపవయ్యా! వారికి బోధపరుచు.

రాజ్ : మీ ఉద్దేశంలో నేనది చెయ్యటం లేదనుకుంటున్నారా? అయితే వారితో ఎంత మాట్లాడుతానో నాకు అంత భయం కూడా వేస్తుంది.

డా. నసీర్ : ఎందుకు?

రాజ్ : వారి ప్రభావం నా మీద కూడా… అని భయం.

డా. నసీర్ : అదేం మాట?

రాజ్ : వారితో మాట్లాడాక విపరీతంగా వ్యాకులపడతాను. ఈ మధ్య పరిస్థితులు చాలా హెచ్చుగా మారిపోతున్నాయి. డాక్టరుగారూ… సామాన్యులను గురించి ఆలోచించండి…. ఇంట్లో వెచ్చగా కూర్చుని పెద్ద పెద్ద మాటలు చెప్పడం, చరిత్ర, వంశం లాటి ఉదాహరణలు ఇస్తూ…. చాలా సులభం.. కాని….

డా. నసీర్ : కాని?

రాజ్ : (అనుభవంలోకి తెచ్చుకుంటున్నట్లు)

ఊపిరి తగ్గిపోతున్నట్లు అనిపిస్తున్నప్పుడు మీకు తెలియదు. ఎలా ఉంటుందో!… చిమ్మ చీకటి కమ్ముకుంటుంది… చుట్టూ చీకటి….

డా. నసీర్ : (రాజ్ మాటలను పట్టించుకోకుండా, మధ్యలోనే తుంచేసి) అయ్యో! వారిని ఇలా వెళ్లగొట్టేందుకు భయపెడుతున్నారని ప్రజలు ఎందుకు గ్రహించుకోవటం లేదు. వారిని రెచ్చగొడుతున్నారు…. మీరు పారిపోతే, గెల్చేది వాళ్ళే…

రాజ్ : మీరు అర్థం చేసుకోవటం లేదు…

డా. నసీర్ : (ముఖం పైన ద్వేష భావం కనిపిస్తూండగా) ఆలోచిస్తూంటే, నోరంతా చేదెక్కిట్లనిపిస్తుంది. కూర్చుకున్న ఇల్లు. వాకిలితో బాటు తండ్రి తాతల జ్ఞాపకాలను కూడా వదిలేసి కూడా ప్రజలు జీవించగలరు…. అది ఎక్కడో పరాయి ఊళ్ళో!

రాజ్ : (గొంతుకలో కోపం ప్రతిధ్వనిస్తూ ఉండగా)

జీవితమే పణంగా పెట్టవలసి వచ్చినప్పుడు పూర్వీకులు గుర్తురారు!

డా. నసీర్ : అదేంటి అలా మాట్లడాతున్నావు? (లేచి నిల్చుని ఇటు – అటు పచార్లు చేస్తుంటాడు. ఒక రకమైన భావుకతలో కొట్టుకుపోతూ) ఈ స్వర్గాన్నా ప్రజలు విడిచి వెళ్లాలనుకుంటున్నారు? దూర-దూరాల వరకూ వ్యాపించిన పచ్చని పర్వతాలు, దేవదారు, చీనారు… ఈ దృశ్యాలు, నీటిధారలు, జలలు… ఈ కుంకుమ పువ్వుల పొలాలు… ఈ సూఫీల, సంత్ల, ఫకీర్ల మాటల పాటల్లోని మార్దవం, హాయినిచ్చే గాలులు… ఎవరయినా అసలు ఈ లోయను విడిచివెళ్లాలని ఎలా ఆలోచించగలరు?… అదీ శాశ్వతంగా!

రాజ్ : డాక్టరుగారూ, ఇది జీవితంలోని చేదు నిజం. ఏం చెయ్యడం? పరిస్థితులకు జనం తల ఒగ్గక తప్పట్లేదు.

డా. నసీర్ : (తిరిగివచ్చి కూర్చుంటాడు. తన సిగారును తీసి ఇటు – అటూ పరీక్షిస్తూ, కాస్తంత మృదువైన కంఠంతో) నాకు అర్థమవుతోంది. ఇక్కడ నివసించటం కష్టమవుతోందని! కాని ఇక్కడినుండి పారిపోవటం దానికి ఉపాయం కాదే!

రాజ్ : ప్రజలకు మరో గత్యంతరం లేదని అర్థం చేసుకోవట్లేదు మీరు!

డా. నసీర్ : (ఏదో పోగొట్టుకున్న స్వరంతో) మన చెఱువులు, నదుల నీటి పైన వ్యాపిస్తున్న ఎఱ్ఱని ప్రతిబింబాలు నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా కోసిపడెయ్యటం లేదనుకుంటున్నారంటే? ఈ బాంబుల వాసన, ఈ దారి తెలియని పెద్ద పెద్ద స్లోగన్లు… (గొంతుకలో ఆవేశం) లేదు రాజ్…. లేదు, ఇవన్నీ ఎక్కువకాలం మనలేవు…. మనలేవు….

రాజ్ : డాక్టర్ సాబ్… (నిశ్శబ్దంగా ఉండిపోయినట్లు)

డా. నసీర్ : విను రాజ్ (దృఢమైన స్వరంతో) వీళ్లు సరిహద్దులు దాటివస్తున్న దీపాన్ని అరచేతిలో పెట్టుకుని దార్లు వెతుక్కుంటున్నారు. దారి తప్పిపోతున్నారు… ఈనాడు ఆ దీపాన్ని నెత్తిన మెరుస్తున్న సూరీడనుకుంటున్నారు…. కాని అది సూర్యుడు కాదు… ఈ దీపం ఆరిపోతుంది… ఆరిపోక తప్పదు రాజ్…

(రాజ్ ఆయన వంక తేరిపారి చూస్తాడు.)

నా మాట నిజమవుతుంది చూడు… తుపానొస్తుంది… వెళ్లిపోతుంది… తుఫానొచ్చి అగిపోతుంది… ఇవన్నీ కాలంతోపాటు జరిగే ఆటుపోట్లు… సమయంతో పడుతూ – లేస్తూంటాయంతే….

రాజ్ : (గొంతుకలో కాఠిన్యం) తుఫాను ముంచుకొస్తోంది.. తుఫాను ప్రళయంలా గొంతుక వరకూ వచ్చేసింది….

డా. నసీర్ : (కాస్తంత కోపగించుకుని) అరే! నువ్వు అర్థం చేసుకోవేంటి? వీథి రౌడీ ఒకడెవడో వచ్చి లారీ తిప్పేసరికి మీరంతా వెన్ను చూపి పారిపోతారా?

రాజ్ : (గొంతుకలో కాఠిన్యం మరింత హెచ్చవుతుంది) లాఠీ కాదు డాక్టరుగారూ AK 47….. డాక్టరు గారు ఒక మాటంటాను, మీరు క్షమించాలి; కొంతమంది ఇప్పుడూ హాయిగానే కూర్చున్నారు. ఎందుకో తెలుసా? ఈ తుపాకీ ఇంకా వారి వంక గురిపెట్టబడలేదు గనుక!… మీరు కూడా అలాటి వారిలో ఒకరే!

డా. నసీర్ : రాజ్!

(అదే సమయంలో తలుపు పైన టకటక కొట్టిన శబ్దం వస్తుంది. ఇద్దరూ గంభీరంగా తలుపు వంక చూస్తూండగా ముష్తాన్ వస్తూ కనిపిస్తాడు. ముష్తాన్ మొహంలో కొంచెం గంభీరంగా ఉంది. అతడు లోపలి కొచ్చి ఇద్దరినీ పరీక్షగా చూసి, వాతావరణం, పరిస్థితుల వలన పురెక్కినట్లు గ్రహిస్తాడు)

డా. నసీర్ : రా! ముష్తాన్! రా! రా!… మంచి సమయానికే వచ్చావు…. నేను వెళ్తున్నా… ఖుదా హాఫీజ్… (డా. నసీర్, రాజ్ చూడకుండానే వెళ్తారు. రాజ్ బిక్క చచ్చిపోయినట్లు బొమ్మలా నిల్చుండిపోయి ఆయన వెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడు)

ముష్తాన్ : రాజ్! (రాజ్ ఉలిక్కి పడి వెనకకు తిరిగి అతన్ని చూస్తాడు)

రాజ్ : కూర్చో ముష్తాన్!

ముష్తాన్ : బాగానే ఉన్నావా?

రాజ్ : (తిరిగి అలోచనల్లో మునిగిపోయినట్లు)

ఆఁ! ఆఁ! కులాసానే… కాని…

ముష్తాన్ : రాజ్! ఏమయింది?

రాజ్ : (ఆలోచనల్లో మునిగిపోయి) నాకేమయింది? నాకే అర్థం కావటం లేదు… నాకేమయిందో! (ముష్తాన్ మౌనంగా అతడినే చూస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం గొంతుకలో ధ్వనిస్తూ ఉంటుంది.) నేనిలా చేసానేంటి?… నాకే నమ్మకం లేని విషయాలను గురించి నేనెందుకు అలా మాట్లాడేను?.. నేను ఏ విషయాలయితే సరియైనవి కావని భావిస్తానో…… అలా ఎందుకు అన్నాను? ఈ రోజు …..

ముష్తాన్ : ఏమయింది?

రాజ్ : డా. నసీర్ చెప్తున్నదంతా నిజం!… కాని నేను దానిని ఎందుకు ఖండిస్తూ పోయాను?.. విచిత్రంగా ఖండించడమే కాదు, శ్రీనగర్ విడిచి వెళ్తున్న వారందరి తరఫున మూర్ఖంగా వకాల్తా పుచ్చుకు మాట్లాడటమేమిటి? అదీ శాశ్వతంగా పోతున్నవారి పక్షాన… (ముస్తాన్ నిశ్శబ్దంగా, పక్కకి కూర్చుంటాడు) డా. నసీర్ చెప్తున్న దాంట్లో తప్పేముంది?… నేను చెప్పేది అదే కదా… ఈ పర్వతాలు, ఈ చీనార్ వృక్షాలు, ఈడాల్ సరస్సులో వికసించే కలవపూలు… ఇక్కడి గాలులు… వీటన్నిటినీ ఒదులుకుని వేరే ఊరికీ… ఉహుఁ! ఎన్నటికి కాదు… ముష్తాన్ ఎంతమాత్రం కాదు… (ముష్తాన్ చూపులు కిందకి దింపుకుంటాడు రాజ్ అతడి వద్దకు వచ్చి) అంతేనా… నీ లాటి స్నేహితుడు… మిత్రులు లేకుండా నేనెలా బతకగలను… నువ్వు లేకుండా, డా. నసీర్ లేకుండా, ముష్తాన్…. ఎంతమాత్రం కాదు… (రాజ్ భావుకతలో మునిగిపోతూ గదిలో కిటికీ దగ్గర కెళ్తాడు. దాని రెక్కలు తెరవగానే సున్నితమయిన చల్లటిగాలీ, కీటికీ తెరవబడటానికే ప్రతీక్షిస్తున్నట్లు, గదిలోకి మెత్తగా ప్రవేశిస్తుంది. గాలికి రాజ్ జుట్టు ఎగురుతున్నట్లనిపిస్తుంది. రాజ్ ముక్కుపుటాలను ఉబ్బించి మరీ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటాడు. ముఖంపైన ఆనందంతో నిండిన చిరునవ్వు తొణికిస లాడుతుంది. ఊపిరి పీలుస్తుండగా అతడి కళ్లు కూడా పరవశంగా మూసుకుంటాయి. అటుపైన ముష్తాన్ మాటలినటానికి అతని వైపు తిరుగుతాడు.) నేను ఈ గాలిని పీల్చకుండా బతకగలనా? చెప్పు ముష్తాన్! నెలల తరబడి మనం ఆశగా ఎదురుచూసే ఆ మంచు లేకుండా బతకగలమా మనం? మొదటిసారి మంచు కురియగానే ‘శీన్ ముబారక్’ అంటూ కుతూహలంగా అభినందిచుకునేందుకు ఉరికే ఉత్సాహం… ఎలా జీవించగలను చెప్పు?.. కాదు… ఎన్నటికీ కుదరదు….

ముష్తాన్ : (కాస్తంత కంపిస్తున్న స్వరంతో) రూప ఇంట్లో లేదా రాజ్?

రాజ్ : లేదు… రెండు… మూడు రోజులయింది జమ్మూ వెళ్లి….

ముష్తాన్ : జమ్మూ?

రాజ్ : ఔను… తన స్నేహితురాలి పెళ్లి. చిన్ననాటి స్నేహితురాలు… ఓ పది రోజులే కదా! తను వెళ్లివస్తే బాగుంటుందని నాకూ అనిపించింది.

ముష్తాన్ : మరి నువ్వు? (రాజ్ తన వంక చూసేసరికి ముష్తాన్ గొంతు కంపిస్తుంది.) అంటే నువ్వెళ్లలేదా పెళ్లికి అని?…

రాజ్ : బాగుంది! తన స్నేహితురాలి పెళ్లి… వాళ్ల మధ్య నేను… విచిత్రంగా ఉండదూ? అయినా ఇక్కడ నాకు ఫాక్టరీ…

ముఫ్తాన్ : కాని ప్రాంతంలో రెండు రోజులుగా కర్ఫ్యూ ఉందిగా… ఫాక్టరీకైతే వెళ్లటం లేదుగా….

రాజ్ : ఇవాళ కాకపోతే రేపయినా తెరుచుకుంటుందిగా… కానీ, నువ్వు ఇవన్నీ…

ముష్తాన్ : (కాస్తంత ముడుచుకుపోయినట్లు) అబ్బే ఏం లేదు!… నువ్వూ జమ్మూ వెళ్ళొస్తే బాగుండేది కదా అని…..

రాజ్ : (నవ్వేసి) జమ్మూ?… నేనేం చేస్తాను ఆ జమ్మూలో?

ముష్తాన్ : ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు చెప్పు? (గొంతుకని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ) నువ్వూ అక్కడికి ఓ వారం పది రోజులు వెళ్లి రారాదూ?…

రాజ్ : రూప కూడా అదే అంటూ వచ్చింది… తనతో బాటు నేనూ రావాలని తనకి మహాకోరికగా ఉండేది… కాని…

ముష్తాన్ : (వెంటనే) కాని ఏంటి?

రాజ్ : నీకు తెలుసుకదా ఫ్రెండ్! ఇంకెక్కడా ఉండాలనిపించదు… ఇక్కడ ఒంటరిగానయినా ఉండటానికి సిద్ధమే తప్ప… మన ఊరు, మన ఇల్లే మనవి అవుతాయి కదా!

ముష్తాన్ : తప్పేముంది? కొన్ని రోజులకి వెళ్లి రావచ్చు కదా!

రాజ్ : అబ్బ! వదిలేయ్! ఆ రాళ్ల నగరానికి ఎవరెళ్తారు లేదూ!

ముష్తాన్ : (గొంతుకలో దృఢత్వాన్ని సమకూర్చకుంటూ) అవన్నీ సరేలే గాని! నా మాట విని… ఇక్కడి నుండి కొద్దిరోజులపాటు వెళ్లిపో! (రాజ్ కాస్త ఆగి, ముష్తాన్ వంక చూసి, అతడన్న మాటల్లో లోతును పసిగట్టే ప్రయత్నం చేస్తూ)

రాజ్ : ఏంటీ విషయం?

ముష్తాన్ : (ఒణుకుతున్న గొంతుకతో) రాజ్! నువ్వు జమ్మూ వెళ్లిపో!… అంతే!

రాజ్ : కాని, ఎందుకెళ్లాలి?

ముష్తాన్ : ప్రశ్నించకు అంతే!

రాజ్ : విషయమేంటో నాకు చెప్పు!

ముష్తాన్ : చెప్పేను కదా! ప్రశ్న లెయ్యకు.

(హఠాత్తుగా లేచి, కిటికీ దగ్గర కెళ్ళి నిల్చుంటాడు. కిటికీ రెక్కలు మూసేస్తాడు. సోఫా మీద కూర్చుని తననే తదేకంగా చూస్తున్న రాజ్ వద్దకు వస్తాడు.) రేపు ఉదయం నేను… నా ఉద్దేశం… ఈ రాత్రికి ఇక్కడ ఎలాగో గడిపెయ్యమని … (గుసగుసగా) నేను రేపు ఉదయం వస్తాను.. చీకటితోనే… తయారుగా ఉండు…! నిన్ను బస్సు స్టాండు వరకూ తీసుకువెళ్లి దింపేస్తాను!

(రాజ్, ముష్తాన్‌నే చూస్తూ ఉండిపోతాడు. అతడికి ఏమాత్రం అర్థం కాదు) ఈ రాత్రి చాలా జాగ్రత్తగా గడుపు! నేను రాకుండా తలుపు ఎంత మాత్రం తెరవవద్దు. ఎవరొచ్చినా సరే…. రాజ్! ఓ రాజ్! మాట్లాడవేం?… చెప్పు తయారుగా ఉంటావు కదా! రేపు ఉదయాన్నే… రేపు ఉదయాన్నే….

రాజ్ : (ముష్తాన్‌కు ఎదురుగా వచ్చి, అతడి కళ్లలోకి సూటిగా చూస్తూ) అసలు విషయం ఏంటి?

ముష్తాన్ : (ఎదుటి నుండి తప్పుకుని) దాని వలన నీకేం తేడా పడుతుంది చెప్పు?… నేను చెప్పేను కదా!… రేపు ఉదయాన్నే… నేను (రాజ్ మళ్లీ ముష్తాన్ వద్ద కెళ్తాడు. అతడి భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. ముష్తాన్‍ను గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నిస్తాడు)

రాజ్ : విషయం ఏంటో చెప్పు ముష్తాన్! ముందు సంగతి చెప్పు! (ముష్తాన్, రాజ్ చేతిని తన భుజంపై నుండి తీసేస్తాడు. ఏదో చెప్పాలనుకుని, చెప్పలేడు. విచిత్రమైన దువిధావస్థలో పడతాడు. ఒకసారి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ మరోసారి ముఖం రెండోవైపు తిప్పేసుకుంటాడు.)

ముస్తాన్ : (అతి ప్రయత్నం మీద అతని నోటి వెంట బాణంలా మాట వస్తుంది.) నీ పేరు మిలిటెంట్ల హిట్‍లిస్ట్‌లో ఉంది!!

రాజ్ : (ఉలిక్కిపడి) ఏమన్నావ్?

ముష్తాన్ : అవును రాజ్… నీ పేరు మిలిటెంట్లు హిట్‌లిస్ట్‌లో ఉంది!

రాజ్ : (గిలగిలలాడుతూ) కాదు – కాదు, అదెలా అవుతుంది? (అంటూ – అంటూనే దభాలున కుర్చీలో అవాక్కయి నిశ్చేష్టుడయి బొమ్మలా కూలబడతాడు! Back ground లో ముష్తాన్ గొంతు వినిపిస్తుంది)

ముష్తాన్ : అలా అయితే ఎంత బాగుండును?…

(ముష్తాన్ రాజ్‌ను అక్కడే విడిచి వెళ్లూ, మళ్లీ గుసగుసగా చెప్తాడు…) రేపు పొద్దున్నే వస్తాను రాజ్! సిద్ధంగా ఉండు! (ఇప్పుడు రాజ్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. ముష్తాన్ వెళ్లిపోయాడు. బహుశా రాజ్‌కి ముష్తాన్ చెప్పిన మాట మీద ఇప్పటికీ నమ్మకం కుదరటం లేదో లేక అసలు నమ్మాలను కోవటమే లేదో, అర్థం కాని పరిస్థితి. రాజ్ జీవితంలో అతి పెద్ద ఎదురు దెబ్బ! ఈ దుర్ఘటన అతడి లోపల బైట కూడా కుదిపి పడేసింది)

రాజ్ : (స్వగతం) ఒక విచిత్రమైన, ఏదో తెలియని స్థితి ఈ గదిలోని గాలిలో ఉన్నట్లనిపిస్తోందేం? నా ఊపిరితో బాటు అది, నా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తోంది. రక్తంలో కలిసిపోయి, నా నరనరాన ప్రవహిస్తోంది. అబ్బ! భయంకరమైన ఈ రాత్రి… ఈ రాత్రికి ఏమవుతోంది?… ఈ రాత్రి అంధకారమే నాలోపల కూడా… (తన భుజాలను తడుముకొని) లేదు.. లేదు. ఈ ముష్తాన్ అలవాటు ఇది. నిజం! హాస్యాలాడటం ముషానికి ఎప్పుడూ ఉన్న అలవాటే!… తనే చేసే హాస్యాలు ఇలాగే…. (హఠాత్తుగా మౌనంగా ఉండిపోయి, మళ్లీ కొద్దిక్షణాల తర్వాత) ముష్తాన్ వెనక్కు తిరిగి వచ్చి, ‘నేను హాస్యానికన్నాను అంతే!” అంటే ఎంత బాగుండును? (రాజ్‌ని దుఃఖం ముంచెత్తుతుంది) అలా జరిగితే ఎంత బాగుండును? (రాజ్ లేచి కిటికీల చిడతలు గట్టిగా పెట్టి, తెరలు లాగి మూస్తాడు. వచ్చి కూర్చుంటాడు. అయితే, కూర్చుంటూనే కరంటు షాకు తగిలినట్లు, మళ్లీ లేచి నిల్చుంటాడు. భయం  భయంగా అడుగులు వేసుకుంటూ బైట మెయిన్ గేట్ వరకూ వెళ్లి, అక్కడ వేసిన తాళం సరిగ్గా పడిందా, లేదా అని లాగి పరీక్షించి) తాళం వేసే ఉంది… సరిగ్గానే పడింది…. (నమ్మకం కలిగించుకుని లోపలికి ప్రవేశిస్తాడు. ఇంటి వెనక భాగానికి వెళ్లి, అక్కడి తలుపు గొళ్లేలన్నీ పరీక్షిస్తాడు.)

ఇప్పుడెలా రాగలరు? … వెనకనుంచి వాళ్లిస్తే, ముందు నుండి పారిపోతాను… ముందునుండి వచ్చేరంటే వెనక నుండి… (అనుకుంటూ తిరిగి గదిలోకి ప్రవేశిస్తాడు. కొన్ని క్షణాలు అసహనంగా నిలబడి ఇటు, అటూ చూస్తాడు. కుర్చీలో కూర్చుంటాడు. తిరిగి వెంటనే లేచి, దీపాలు ఆర్పేస్తాడు. గుసగుసలాడుతున్నట్లు….) వెలుగుంటే నేను లోపల ఉన్నానని వారికి అర్థం అయిపోతుంది…

(ఒక కొవ్వొత్తిని వెలిగించి, దానిని పట్టుకుని మెట్లవైపు వెళ్తూ, భయపడుతున్న గొంతుకతో) ఆఁ! ఇక్కడ ఈ మెట్లపైన కూర్చుంటే, వాళ్లు నేనిక్కడ ఉన్నానని ఎంతమాత్రం పసిగట్టలేరు… (గొంతుక్కూర్చుంటాడు. చలికి బాగా ఒణుకుతున్నాడు. పక్కను ఉన్న కాంగడీ (కుంపటి) సెగను పరీక్షిస్తాడు. అది కాస్తా చల్లారి పోవటంతో వారకు తోసేస్తాడు.) ఈ కాళరాత్రి గడిచేది ఎలా?…. కడుపులో ఆకలి… బుర్రలో భయం… అటుపైన ఈ చలి… అబ్బా! చలి తిన్నగా ఎముకల్లోకి దూరుతోందేం చెప్మా? (పళ్లు కటకటలాడతాయి. కూర్చునే కొవ్వొత్తిని చూస్తూనే ఉంటాడు. తక్కువ స్వరంలో) అమ్మో! ఎటువంటి భయంకరమైన నిశ్శబ్దం? (అప్పుడే బైట, వీధి కుక్కల ఏడుపూ, కొందరు మనుష్యుల అడుగుల చప్పుళ్లూ వినిపించటంతో భయంతో ఒణికి పోతాడు. ఇంతలో అడుగుల చప్పుళ్లు దూరమవుతాయి. కొవ్వొత్తి పొగ కూడా భయంలోకి మారుతోన్నట్లనిపిస్తోందతనికి) అబ్బా! ఈ … సుదీర్ఘమైన రాత్రి… ఎప్పటికయినా దీనికి అంతం అంటూ ఉంటుందా?…. ఏ ఫకీరు నుంచయినా అంతులేని రాత్రిగా ఉండాలన్న ఆశీర్వాదం తీసుకుని వచ్చిందా ఏం?… కొంపదీసి ఇది నాకు ఆఖరి రాత్రి కాదు కద! (ఒక్కసారి భయంతో ఒణికి పోయి) దీన్నేనా జీవితం అంటారు? ఇది మృత్యువు కాదూ? బతికుండగానే మరణం! జీవన్మరణం! (ఇప్పుడు రాజ్ ముఖంపైన భయం స్థానే ఒక వైరాగ్య భావం లాంటిది కదులూ ఉంటుంది. అతడు తన ఆలోచనల్లో కొట్టుకు పోతూండగా బైట గేటువద్ద కాలింగ్ బెల్లు మోగుతుంది. అతడు ఉలిక్కి పడతాడు) ముష్తాన్ వచ్చేసేడా? ఇంకెవరయినా అయితే? (తన చేతి గడియారం చూసుకుంటాడు.)…. తెల్లవారింది, ఐదయింది… (గొంతుకలో నమ్మకం ధ్వనిస్తూండగా) బహుశా ముష్తానే అయి ఉంటాడు. కానీ… ఒక్కడే అయితేనే తలుపు తెరుస్తాను… ఒక్కడే కాకపోతే? ముందు కాస్త తొంగి చూసి… ఒక్కడే కాకపోతే తలుపు తెరవను… (తొంగి చూసి) అమ్మయ్య! ఒక్కడే వచ్చాడు…

(లేచి బైటకు వెళ్లిన రాజ్, గేటు తాళం తెరుస్తాడు. అక్కడ ముష్తాన్ సైకిలుతో సిద్దంగా ఉన్నాడు. అతడు పొడవాటి కోటు తొడుగుకున్నాడు. తలమీదున్న టోపీపై నుండి మప్లరు చుట్టుకున్నాడు.)

ముష్తాన్ : (గుసగుసగా) పద.. తొందరగా! రా! రా!

రాజ్ : (కాస్తంత ఏమీ తోచనట్లు, వెనక ముందు లాడుతూ) నేను… ఇంట్లోంచి… ఇప్పుడే కాస్తంత సామాను…..

ముష్తాన్ : (తిరిగి గుసగుసగానే) రాజ్… అసలు టైము లేదు…. నన్నెవరూ చూడకుండా…. పద… పద….

రాజ్ : లోపలికి వచ్చెయ్యి…. నేను ఇప్పుడే (లోపలికి వెళ్లిపోతాడు. ముష్తాన్ కూడా తన సైకిలును ఆపి, లోపలకు ప్రవేశిస్తాడు. గదిలో నిలబడి రాజ్‌ను చూస్తాడు. రాజ్ ఏదో తెలియని దిక్కుతోచని స్థితిలో అన్నట్లు నిల్చున్నాడు. అతడి తలంపులో రూప వచ్చి నిల్చుంటుంది)

రూప : (రంగస్థలం పైకి వచ్చి) ఒక్క పది, పదిహేను రోజులంతే! ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి… ఖాళీగా వదిలెయ్యవద్దేం! అసలే ఈ మధ్య రోజులేం బాగులేవు….

(రాజ్ కళ్లలో తడి కదులుతుంది. రూప రంగస్థలపై నుండి తప్పుకుంటుంది.)

ముష్తాన్ : (చాలా తక్కువ ధ్వనితో) రాజ్! త్వరగా పద!… వెల్తురు వచ్చేలోగా మనం ఇక్కడి నుండి వెళ్లిపోగలగాలి!

(ఇంకా రాజ్ ఊగిసలాడుతూనే ఉన్నాడు. హఠాత్తుగా ముస్తాన్‌కి ఏదో గుర్తొచ్చి జేబులో చెయ్యి పెట్టి తీసి) రాజ్… ఇదిగో… కాస్తంత డబ్బు! దగ్గరుంచుకో!

రాజ్ : (ఆర్ద్రమైన గొంతుకతో కాస్తంత తడబడుతూ) అబ్బే.. వద్దు… నా దగ్గరుంది!

ముష్తాన్ : నాకు తెలుసులే, కాని… ఉంచుకో!

(రాజ్ అందుకోక పోవడటంతో, ముష్తాన్ బలవంతంగా అతడి జేబులో కూరుతాడు) రాజ్! ప్లీజ్! తొందరగా పద!

(రాజ్ బైటకు వెళ్లబోతుండగా ముస్తాన్ ఆపి) బైట చాలా చలిగా ఉంది – తలపైన ఏదైనా – (రాజ్ అతడి వంక చూస్తాడు. పక్కనే ఉన్న ఊలు టోపీని తలపైన పెట్టుకుంటాడు. మప్లరును సరిగ్గా చుట్టుకుని, బైటకు నడుస్తాడు. అప్పుడే వీధి వాకిలిలో పెట్టిన పువ్వుల గోలేలు కనిపిస్తాయి. అతడి కోటుకు ఒక మొక్క కొమ్మ తగులుకుంటుంది. అతడు తిరిగి కొమ్మను జాగ్రత్తగా వదిలించుకుంటూ ఉండగా, మళ్లీ రూప అతనికీ గుర్తొచ్చింది.)

రూప: (రంగస్థలం పైకి వచ్చి) నేను వెళ్లేక కాస్తంత ఈ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. మధ్య, మధ్యలో కాస్తంత ఎండ పొడ చూపిస్తూ ఉండండి…. నేను తిరిగి వచ్చేక కూడా నా పువ్వులు నాకు ఇలాగే విచ్చుకుని తాజాగా కనిపించాలి సుమా! రూప రంగస్థలంపై నుండి నిష్క్రమిస్తుంది. రాజ్ తడి కళ్లలో నుండి రెండు బొట్లు కన్నీళ్లు రాలుతాయి. అతడు ముందుకు సాగిపోతాడు. ముష్తాన్ సైకిలుపై కూర్చుని రాజ్‌ను పిలుస్తాడు.)

ముష్తాన్ : రాజ్… పద…. పద….

(రాజ్ తలుపు వేస్తూ ఉండబోతూండగా, ముష్తాన్ అతడిని వారిస్తాడు) ఓహ్! ఈ గడియలు… తాళాలు అన్నీ వదిలి ముందుపద… మనం పోవాలి… (రాజ్ వచ్చి, ముష్తాన్ సైకిలు ముందు కూర్చోవటానికి ప్రయత్నిస్తూండగా, అతనికేదో గుచ్చుకుంటుంది)

రాజ్ : (నడుము పట్టుకుని) ఏంటిది…?

ముష్తాన్ : సారీ! (తన కోటులో ఏదో సరిచేసుకుంటూ) పిస్తోలు ఇది!

రాజ్ : (ఉలిక్కి పడి) పిస్తోలా?

ముష్తాన్ : గాభరాపడకు…. కేవలం జాగ్రత్త కోసం అంతే! (ముష్తాన్ కూడా చలికి ఒణుకుతున్నాడు) అబ్బా! ఇంత చలిలో చేతులు, కాళ్లు కదిల్చేదెలా?

రాజ్ : అయ్యో ముష్తాన్! నీ చేతులు ఒణుకుతున్నాయ్… నేను పోనీ సైకిలు తొక్కనా?

ముష్తాన్ : (సైకిలు హేండిలు సరిగ్గా పట్టుకుని) నువ్వు మరీ ఎక్కువ ఒణికి పోతున్నావు… సరే, కూర్చో! కూర్చో!… ఇరుకు సందుల్లోంచి పోదాం… ఇకనైనా కూర్చుంటావా…? (రాజ్ సైకిలుపైన కూర్చోబోతూ ఆగి, వెనక్కు తిరిగి ఇంటిని చూస్తాడు. అతడికి మొదటి అంతస్థు బాల్కనీకి వేలాడ గట్టిన దిష్టిబొమ్మ ఫొటో కానవస్తుంది. తిరిగి ఆలోచనల్లోకి రూప వచ్చి నిల్చుంటుంది. రంగస్థలంపైకి రూప ఒక స్థూలు తెచ్చుకొస్తుంది)

రాజ్ : (గతాన్ని అభినయిస్తూ) ఇదేంటి, ఈ రాక్షసుడి బొమ్మ తీసుకొచ్చావు?

రూప : అవును, ఇది రాక్షసుడి మొహమే!… దీనిని దిష్టిబొమ్మ అంటారు; అర్థమయిందా?… (దిష్టి బొమ్మను సరిగ్గా పెట్టటానికని స్థూలు పైకి ఎక్కుతుంది.) ఇంటి వైపు చూసే వారెవరి దృష్టి అయినా ముందు దీనిపైనే పడుతుంది… బహుశా గాలికి కాబోలు అప్పుడప్పుడు పక్కకి తిరిగిపోతూ ఉంటుంది.

(హఠాత్తుగా రాజ్ వంక చూసి) అలా చూస్తున్నావేంటి?

రాజ్ : దిష్టి బొమ్మని!

రూప : (స్థూలు పైన నిల్చునే) కొత్త ఇంటి ముందు వేలాడగట్టాను. మన ఇంటిని చెడు దృష్టినుండి ఇదే రక్షిస్తుంది… (దిగి, దిష్టిబొమ్మకు నమస్కరిస్తుంది.)

దిష్టిబొమ్మ స్వామీ! మా ఇంటిని రక్షించటంతో బాటు ఈ తోటను కూడా కాస్త కనిపెట్టాలి… (గంభీరంగా) ఇంట్లో బాంధవ్యాల వెచ్చదనం ఎల్లవేళలా ఉండాలి… ఈ కాంగడీ (కుంపటీ)ల్లో వేడి నిలిచి ఉండాలి…. బంధువుల కోసం వంటింట్లో కాఫీ ఎప్పుడూ తయారుగా ఉంటూ ఉండాలి… (రూప నిష్క్రమిస్తుంది. రాజ్ కళ్లు వర్షిస్తూ ఉంటాయి)

ముష్తాన్ : రాజ్! ఏం చూస్తున్నావు?

రాజ్ : (వణికే గొంతుకతో) దిష్టిబొమ్మ…. (వ్యంగంతో కూడిన చిరునవ్వుతో) ఇంటిని చెడు దృష్టి నుండి రక్షిస్తుంది!

ముష్తాన్ : రాజ్!

(రాజ్ సైకిలు వద్దకు తిరిగి వస్తాడు. వెక్కి వెక్కి ఏడుస్తాడు. ముష్తాన్ కళ్లలో కూడా నీళ్లున్నాయి. రాజ్ భుజంపై చెయ్యి ఉంచి, ముష్తాన్ అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. అటుపైన ముష్తాన్ మెల్లగా సైకిలును తీసుకుని, విలపిస్తున్న రాజ్‌కు భుజం ఆసరా ఇస్తూ, రంగస్థలంపై నుండి నిష్క్రమిస్తాడు.)

(Flash Back సమాప్తం)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here