నల్లటి మంచు – దృశ్యం 8

0
10

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-8

(Flash Back)

[dropcap]రం[/dropcap]గస్థలం పై ఒక వంక కూర్చున్న సుహైల్ ఏదో గాలిపటాన్ని సరి చేస్తున్నాడు. పక్కన మరో కొన్ని గాలిపటాలు చిందర వందరగా పడి ఉన్నాయి. జిగురు డబ్బా కూడా ఉంది. మధ్య మధ్యలో లేచి నిల్చుని మాంజా రాసిన దారాన్ని పట్టుకుని గాలిపటాన్ని ఎగరవేసి చూస్తాడు. కాని సంతృప్తిగా అనిపించక పోవటంతో మళ్లీ కూర్చుని, దాన్ని బాగు చెయ్యటంలో మునిగిపోతాడు)

సుహైల్ : ప్చ్! ఈ రోజు మైదాపిండి సరిగ్గా ఉడకలేదు… కాస్తంత పల్చబడింది… అబ్బా! అతుక్కుందికీ ఎంత టైముపడుతుందో… ఊ సరే! ఏదోలా పనయితే అయింది కదా (ఊపిరి పీల్చుకున్నట్లు) అమ్మ! గొంతుక్కూర్చుని – కూర్చుని కాళ్లు పట్టుకుపోయాయి. కాస్త ఇవి ఆరే వరకూ నడుము చేరవేస్తాను. (పడుకుని, ఏదో పాటను చిన్నగా పాడుకుంటూ మళ్లీ హఠాత్తుగా లేచి గాలిపటాన్ని చూసుకుని) అమ్మయ్య! ఆరిపోయింది… ఓహోఁ! ఏమందం! ఏం రంగూ! ఇవాల్టీ ఈ గాలిపటం తక్కిన వాటినన్నిటినీ ఓడించేస్తుందంతే… (తక్కువ వయసున్నప్పటి చిలిపి రూప దాదాపు ఎగురుతూ – గెంతుకుంటూ వస్తుంది.)

రూప : (ఉత్సాహం నిండిన గొంతుకతో) సుహైల్… ఓ సుహైల్… ఎక్కడున్నావు?

(అతడిని చూసి టక్కున ఆగి) ఇలా ఈ గాలిపటాలు చేసుకుంటూ కూర్చోవటమేనా… నీ కసలు ఏమైనా తెలుసా?…

సుహైల్ : ఏంటి?

(గాలి పటాన్ని బాగు చేస్తూనే ఉంటాడు. అక్కడ పడున్న గాలిపటాల్ని రూప ఇటూ – అటూ కదిలించి పడేస్తూంటే…) అరే రూపా అయ్యో! నేను అతికష్టం మీద అతికించాను… చిరిగిపోతాయి… రూపా… రూపా… (రూప మహా ఆనందంగా రంగస్థలంపైన గాలిపటాల్లో ఊగుతున్నట్లు)

రూప : (సంతోషంగా) చిరిగిపోతే అతికించుకో!

సుహైల్ : రూపా!… రూపా…

రూప : నాకు ఎడ్మిషను దొరికి పోయింది. అది మీ కాలేజీలోనే… ఇకనుంచి మనిద్దరం ఒకే కాలేజీలో, ఒకేసారి చదువుకుంటాం…. (మళ్లీ సుహైల్ చేతిలో దారం తీసుకుని దానిని ఎగరేస్తూ ఉంటుంది. సుహైల్ ఏమీ బోధపడని వానిలా ఆశ్చర్యంగా ఆమెను చూస్తూంటాడు. నెమ్మదిగా ఆశ్చర్యం తగ్గి, తన గాలిపటాలతో ఆడుకుంటున్న రూపను చూసి పులకరించి పోతాడు. తన ఊహా జగత్తులో విహరిస్తున్న అతడు, ఆమెను చూస్తాడు… లోకం గురించి పట్టించుకోకుండా)… సుహైల్ మనం కలిసి ఉంటాం… స్కూలు తరవాత ఇప్పడు కాలేజీలోనూ కలిసే… ఒకరితో ఒకరం… మూడేళ్లు కలిసి… పూర్తిగా మూడేళ్లు! ఎప్పటికీ కలిసే ఉంటాం…

సుహైల్ : రక్షించబడ్డాం బాబూ! స్కూలు నుండి విముక్తి లభించింది….

రూప : స్కూలు నుండా? డా. సైయ్యద్ నుండా?

సుహైల్ : ఏదయితేనేం? రెండూ ఒకటే… స్కూలు పేరు ఎత్తితే చాలు, కళ్లద్దాలలోంచి తొంగిచూసే భయంకరమైన ఆయన కళ్లే గుర్తొస్తాయి బాబూ… ఎప్పుడూ భయం భయంగానే గడిపేవాడిని. ఏదో రోజు ప్రాణాలే తీస్తాడేమోనని భయమేసేది.

రూప : పాపం! అంత భయంకరంగా ఏం చేసారు కనక? స్కూలు ప్రిన్సిపాలు ఆయన, కసాయి వాడేం కాదుకద!

సుహైల్ : అవునమ్మా! నీకేం నువ్వలానే అంటావు… కాని నీకేం తెలుసు?… రెండేళ్ల నుండి నా ప్రాణాలయితే గుప్పిట్లోనే…

రూప : నీ ప్రాణాలా? (స్వగతం) అది నేను కదా!

సుహైల్ : ఏంటి?

రూప : ఏం లేదు.

సుహైల్ : బాబోయ్! ఆయన్నుండి తప్పించుకోవటం మహాకష్టం… నువ్వంటే మాత్రం నిన్ను చాలా స్పెషల్‌గా కనిపెట్టుకుని ఉండేవారు.. గుర్తుందా? ఒకరోజు నువ్వు కొళాయి దగ్గర మంచినీళ్లు తాగుతున్నావు… నా చేతికి దెబ్బ తగిలిందని కడుగుకుందామని ఆ కొళాయి దగ్గరకొచ్చేను….

రూప : అవునవును. నీ చేతి నుండి కారుతున్న రక్తపు బొట్లు చూసి నేను చాలా గాభరాపడుతూంటే నువ్వన్నావు కదా…

సుహైల్ : (గతం నాటి మాట) కంగారు పడకు నేను చెయ్యి కడుక్కుంటున్నానంతే!

(తిరిగి వర్తమానంలోకి వచ్చి) కాని నువ్వు తటాలున నా చెయ్యి పట్టుకుని కొళాయి దగ్గరకు తీసుకు వెళ్లావు!

రూప : అవును! నేను నీ చేతిని కడిగాను.

సుహైల్ : తరవాత నువ్వు నీ రుమాలుతో నా చేతిని మహా జాగ్రత్తగా నెమ్మదిగా… తుడిచి శుభ్రం చేస్తూండగా…

రూప : అప్పుడే ఎవరిదో పిలుపు వినిపించింది…

సుహైల్ : (ప్రిన్సిపాలుగారి అభినయం చేస్తూ) ఏం జరుగుతోందిక్కడ… ? ఆఁ!….

రూప : అవును… ఆయనే… డా. సైయ్యద్.. ఆయనదే ఆ పిలుపు.

సుహైల్ : ఏంటి? పిలుపంటావా నువ్వు దానిని? గర్జన… భయకరమైన గర్జనే… (తిరిగి ఇంకోసారి కఠినంగా ఉన్నట్లు అభినయిస్తూ) ఏయ్! ఏం జరుగుతోందిక్కడ…. ఆఁ!….?

రూప : నేను భయంతో వణికిపోయాను…. ఈ లోగా నీ చెయ్యి నా చేతి నుండి వీడిపోయింది.

సుహైల్ : నా కయితే ఆ గర్జన చెవుల్లో పడేసరికీ, ఒళ్లంతా చెమటలు ధార కట్టేసేయనుకో. అయ్య బాబోయ్!.. ఆ తరువాత నిన్నేమో క్లాసుకి వెళ్లమన్నారు… నువ్వెళ్ళి పోయావు… నన్ను?… నన్నేమో అఫీసుకు తీసుకెళ్లారు… నేను వేయి విధాల నచ్చచెప్పాను… సర్! నాకు దెబ్బ తగిలింది… ఆమె కట్టుకడుతోంది… అంతే… అని! అబ్బే! ఆయన నేను చెప్పినదొక్కటయినా వినిపించుకుంటేనా?..

రూప : (నవ్వి) మధ్యాహ్నమంతా నిన్ను అక్కడే నిలబెట్టి ఉంచారు…. తన ఆఫీసు గదిలో మూలకి!

సుహైల్ : అంతేనా? ఎంతలా బెదిరించారు? (ప్రిన్సిపాలును అనుకరిస్తూ) ఊఁ! మహాకొమ్ములొచ్చాయే!… ఇది డా. సైయ్యద్ షాహ్ నవాజ్ స్కూలు… ఇక్కడ అల్లరి చిల్లర వేషాలు పనికిరావు… మళ్లీ ఇంకోసారి ఇలాటి వేషాలు చూశానంటే మాత్రం… తోలు వలిచేయ్యగలను… గొఱ్ఱెకి వలిచినట్లు…. మీ అమ్మని పిల్చి నీ టీ.సీ. చేతిలో పెట్టేస్తాను…. తిరిగి ఇంటికే… (రూప అతడి అభినయం చూసి పెద్దగా నవ్వుతుంది.)

రూప : ఆ తరవాత?

సుహైల్ : ఆ తరువాత? అడక్కు మరి! స్కూల్లో ఎక్కడికి వెళ్లినా, ఆ మహానుభావుడి కళ్లు నా వీపుకే అతుక్కుపోయినట్లనిపించేది… ఇదిగో ఇంక అరుస్తారన్నట్లు…. అందులోనూ నువ్వు ఆ దరిదాపుల్లో ఉన్నావంటే చెప్పేదేముంది? నా ప్రాణాలు గుప్పెట్లోనే పెట్టకోవడం.

రూప : (నవ్వుతూ) గుర్తుందా? ఆ రోజు? నేను స్కూలుకి మిఠాయి తెచ్చుకుని వచ్చాను… అన్నయ్య పెళ్లి కుదిరిందని… నీకు తినిపించాలని! నువ్వు నోరు విప్పేవు! ఓ సగం ముక్క కొరికేవో లేదో, వెనక నుండి ఎవరో పిల్చారు! అంతే ఆ మిఠాయి అక్కడ పడేసి పరుగులు పెట్టావు. అంతే…

సుహైల్ : (ఉడుక్కున్నట్లు) తోక ముడుచుకు పారిపోయేనని కూడా అను….

రూప: పరుగే! పరుగు! ఎవరు పిలుస్తున్నారో అని కూడా చూడకుండా! ఇంతా చేస్తే తను స్కూలు ప్యూను… నూరా!

సుహైల్ : ఆఁ! నాకు తెలుసు… తెలుసులే! ఆతడు ప్యూను నూరా అని! నీకేం నువ్వు నవ్వగలవ్… ఆయన భయంకరమైన కళ్ల ముందు పడాలంటే పడితే నీకూ తెలిసేది….

(అలుగుతాడు)

రూప : (నవ్వు అపుకుంటూ) అబ్బా! సరే.. సరే… వాటన్నిటినీ వదిలెయ్! ఏంటి చిన్న చిన్న విషయాలకే అలా మూతిముడుచుకుంటావు చెప్పు?… సర్లే ఇక ఆ కళ్లు నిన్ను వెంటబెట్టవు. స్కూలు సంకెళ్లు తెగిపోయాయి! ఇప్పుడు మనం కాలేజీకి వచ్చేసేం! మూడేళ్లపాటు కాలేజీలో కలిసి ఉంటాం! ఇక మనం స్వతంత్రులం!… పీల్చేగాలి కూడా!

సుహైల్ : ఇక చుట్టుపక్కల అన్నివైపులా కూడా స్వేచ్ఛా వాతావరణమే ఉంటుంది….

(ఈ రకమైన భావాల్లో సంతోషంగా కొట్టుకుపోతున్నట్లున్న సుహైల్ ఒకవైపు వెళ్తాడు; అక్కడ అతని టేబిలుంది. దాని పై నున్న డైరీని తీస్తాడు. తనలో తానే మునిగిపోయిన ఏదో రాస్తూంటాడు. ఇటు రూప తన ఆలోచనల్లో తాను మునిగిపోయి ఉంది)

రూప : (స్వగతం) స్వేచ్ఛావాతావరణం!… కొత్త వాతావరణం… కాపలా ఉండదు… కాపలాదార్లూ ఉండరు… రోజూ ఉదయాన్నే బస్‌స్టాపులో కలుస్తాం మేము! కలిసే బస్సులో వెళ్తాం… దగ్గర – దగ్గరగా కూర్చొని, లేదా అప్పుడప్పుడు దగ్గరగా నిల్చుని … (అలోచించి) ఏమో నాకు మాత్రం సీటు దొరికి, నీకు దొరకకపోవచ్చునేమో కూడా కదా…. అలాటప్పుడు నేను కూర్చున్నచోటే నువ్వూ నిల్చుంటావు… నీ పుస్తకాలు నా చేతిలో పెట్టేసి…. ఆ పుస్తకాల్ని నేను ఒళ్లో భద్రంగా పెట్టుకుని కూర్చుంటాను… ప్రేమగా… (ఒక్కసారి తత్తరపడినట్లయి) అరే… నేనెంత పిచ్చిదానిని…. (కాస్త ముడుచుకుపోయి తిరిగి, సుహైల్ వంక చూస్తుంది. రాసుకుంటున్న సుహైల్‌ను చూసి కాస్తంత జంకుతూ, మెల్లిగా అతనివైపు అడుగులు వేసి, అతని డైరీని లాగుకోవాలని ప్రయత్నిస్తుంది)

సుహైల్ : అరే! (అశ్చర్యపోయి) నువ్వు…. నా డైరీని వదిలెయ్!…

రూప : (నవ్వుతూ) ఉహుఁ! నేను చూస్తాను… ఏం రాస్తూ ఉంటావో?

సుహైల్ : రూపా ప్లీజ్… వద్దు… వదులు….

రూప : (దృఢంగా) నేను చదవాలి….

(హఠాత్తుగా ఏదో ఆలోచనలో పడిన సుహైల్ అమెకి డైరీ ఇచ్చేస్తాడు. సుహైల్ ముఖం పైన కొంటెనవ్వు పొడజూపుతుంది. డైరీ పేజీలు తిరగేసిన రూప ఒక్కసారిగా విసుక్కుని, కోపంగా డైరీని మూసి, సుహైల్ చేతిలో కుక్కుతుంది)

సుహైల్ : (నవ్వుతూ) చదవటం అయిందా?

రూప : (అలిగినట్లు) నీకు తెలుసుకదా! ఉర్దూ నేను చదవలేనని… అందుకే… అందుకే ఎప్పుడూ డైరీ ఉర్దూలో రాస్తావు…!

సుహైల్ : (నవ్వుతూనే) నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావు!

(రూప మూసిన పిడికిలి చూపిస్తూ, అతడిని కొట్టడానికి ముందుకు ఉరుకుతుంది. సుహైల్ తప్పించుకుంటాడు. అయినా, రూప అతడి భుజం పైన ఒకటి కొట్టి మరీ అగుతుంది.)

రూప: (గంభీరంగా) సుహైల్…

సుహైల్ : ఊఁ!

రూప : సుహైల్! నాకు ఉర్దూ నేర్పుతావా?

సుహైల్ : (చిరునవ్వుతో) ఎందుకు నేర్పించను.

రూప : ఎప్పటినుండి?

సుహైల్ : ఈ రోజునుండే… ఈ క్షణం నుండే…

రూప : కాదు… రేపటినుండి… మొదటి పాఠం రేపు కాలేజీ నుండి వచ్చాక!

సుహైల్ : జీ! సర్‌కార్!

రూప: (ఉలిక్కిపడి) బాబోయ్! టాఠాజీ పెద్దమ్మని అడిగి దగ్గుమందు తెమ్మని పంపితే నేను ఇక్కడ… (వెళ్తూ-వెళ్తూ, మధ్యలోనే తిరిగివచ్చి) రేపు ఉదయం మనిద్దరం కలిసి వెళ్లాం… మొదటిరోజు కదా.. (కాస్త అగి) కానీ, రేపు మాత్రం నీ ఫేవరెట్ ఆ చిరిగిన బూట్లు వేసుకుని మాత్రం రావద్దు సుమా… ఈ రోజే ఒక జత కొనుక్కో.. (సుహైల్ ముడుచుకుపోతాడు. రూప వెళ్తూ – వెళ్తూ కేక వేస్తూ) రేపు నీకోసం ఎదురుచూస్తాను ఉదయాన్నే…

సుహైల్ : (దుఃఖం కలిసిన చిరునవ్వుతో) ఊఁ! చిరిగిన బూట్లు… రేపు కూడా ఆ చిరిగిన బూట్లో వేసుకోక తప్పదు మరి… (అంటూ రంగస్థలంపై నుండి వెళ్తాడు)

(Flash back పూర్తవుతుంది)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here