విశిష్ట నవలికలు-విభిన్న కోణాలు

0
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత డా. శాంతి నారాయణ గారి ‘నాలుగు అస్తిత్వాలు – నాలుగు నవలికలు’ పుస్తకానికి గుడిపాటి గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]

[dropcap]త[/dropcap]నకు అవసరమైన రచయితల్ని సమాజమే తయారు చేసుకుంటుంది. సమాజంలో పలు ఒత్తిళ్ళకు, బాధలకు లోనయినవారంతా రచయితలు కాలేరు. కానీ వారి సంవేదనలకు రూపం ఇచ్చే సృజనశీలురు వారి గొంతుక అవుతారు. వారి జీవిత ప్రయాణంలోని కడగండ్లకు, పోరాటాలకు చిత్రిక పడతారు. దీనికి తగిన పూర్వరంగం ఆ సమాజమే సమకూరుస్తుంది. అందుకే కొందరు రచయితలు భిన్నంగా ఆలోచిస్తారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని మామూలుగా తీసుకోకపోవడం నిజమైన రచయితల స్వభావం. ఇలాంటి అసలుసిసలు రచయితలు ఇతరులు ఉపేక్షించే అంశాలపైన దృష్టి పెట్టి సృజన చేస్తారు. మన కళ్ళ ముందర మనకు తెలిసీ తెలియకుండానే జరిగిపోతున్న దారుణాలని తమ సృజనతో ఎరుక పరుస్తారు. ఆలోచించక తప్పని అనివార్యస్థితికి పురిగొల్పుతారు. అంతేకాదు, ఒకానొక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రాంతంలో మానవుని సంవేదనలు ఎలా ఉన్నాయో తన రచనల ద్వారా తెలియజెబుతాడు రచయిత. తద్వారా చరిత్ర క్రమంలో క్రియాశీల భాగస్వామియై తన సాహిత్యాన్ని చరిత్రకు ఒక బలమైన వనరుగా అందిస్తాడు. ఇవాళ డాక్టర్ శాంతి నారాయణ సరిగ్గా ఇదే పనిచేస్తున్నారు.

కథకునిగా, కవిగా, నవలాకారునిగా, వ్యాసకర్తగా బహుళ ప్రక్రియల్లో కృషి చేస్తున్న శాంతి నారాయణ వచన రచనలు రాయలసీమ, ప్రత్యేకించి అనంతపురం సామాజిక చరిత్రకు మంచి ఉపకరణాలు. ఆయన రాసిన కథలు, పెన్నేటి మలుపులు నవల చదివితే రాయలసీమ జనజీవితం బోధపడుతుంది. రాయలసీమ జీవితంలోని సూక్ష్మకోణాలు ఎన్నో ఆయన కథలు రూపుగట్టిస్తాయి. ‘పెన్నేటి మలుపులు’ ఆ ప్రాంత జనజీవన గమనాగమనాల్ని పట్టి చూపుతుంది.

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా, వాటిని తట్టుకుంటూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శాంతి నారాయణ. ఇది వారిలో నాకు నచ్చిన అంశం. సమస్యలు వచ్చిపడ్డాయని సాహిత్యరంగానికి దూరంగా జరగలేదాయన. నిజానికి సమాజం పట్ల, సాహిత్యం పట్ల మరింత ప్రేమతో, శ్రద్దతో, మమకారంతో తన సృజనాత్మక వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇపుడు వారు తీసుకు వస్తున్న ‘నాలుగు అస్తిత్వాలు – నాలుగు నవలికలు’ పుస్తకం ప్రత్యేకమైంది. ఎవరి అస్తిత్వాన్ని గురించి వారే రాయాలనేం లేదు. రాయగలిగితే మంచిదే. కానీ ఇతరులు రాయకూడదన్న నిబంధనలేం లేవు. నిజానికి ఇవాళ్టి సంక్లిష్ట సామాజిక సందర్భంలో ఎవరయినా ఒకే ఒక అస్తిత్వానికి చెందినవారయి ఉండలేరు. మన జీవితం బహుళ అస్తిత్వాలతో ఏదో రూపంలో సంబంధం కలిగి ఉంటుంది. అనేక అస్తిత్వాల పరివేదన అనుభవించడం అత్యాధునిక మానవుని స్థితి. ఈ దృష్టితో చూసినపుడు శాంతి నారాయణ గారు నాలుగు అస్తిత్వాలకు సంబంధించిన ఇతివృత్తాల్ని తీసుకోడం ఆశ్చర్యకరం కాదు. అయితే ఈ నవలికలు చదివితే ఆయన విశాలదృష్టి, నిశిత పరిశీలన, అనుభవనేపథ్యం విస్మయం గొల్పుతాయి. రాయలసీమ జీవితానికి రచయిత ఎంతో దగ్గరగా ఉన్నారో తెలుస్తుంది.

రచయిత తన మానాన తను బతుకుతూనే పదుగురి బతుకుతీరుని కుతూహలంతో గమనిస్తాడు. ఆకళింపు చేసుకుంటాడు. మనుషుల్లోని మంచినీ చెడునీ గ్రహిస్తాడు. ఆయా మనుషుల ప్రవర్తనకు మూలాలు ఎక్కడున్నాయో అవగాహన చేసుకుంటాడు. ఈ అవగాహన, జీవితం పట్ల చూపే దయాగుణం రచయితలో ఒక సంయమన దృక్పథాన్ని ప్రోది చేస్తాయి. ఆవేశకావేషాలకు లోను కాకుండా తన చుట్టూ వుండే జీవితాన్ని సృజిస్తాడు. .

ఈవిధమైన సృజనాత్మక క్రమంలోనే నాలుగు అస్తిత్వాల గురించి శాంతి నారాయణ రాసిన నాలుగు నవలికలు వచ్చాయి. ‘వెట్టికి వెట్టి’ దళితవాదానికి, ‘కంచం మీద కట్టడి’ బహుజనవాదానికి, ‘నూర్జహాన్’ మైనారిటీ, స్త్రీవాదాలకి, ‘రక్షకతడులు’ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యానికి దగ్గరగా ఉన్నాయి. ఈ నాలుగు అస్తిత్వాల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పరిస్థితినీ, రాయలసీమలోని సంఘర్షణపూరితమైన బతుకుతీరును దర్శింపజేశారు రచయిత.

***

ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యానంతరం కూడా దళితులు అణచివేతకు గురవుతున్నారు. రాయలసీమలో ఇది కొట్టవచ్చినట్టు కనిపించే అంశం. అనంతపురం జిల్లా వెంకటాంపల్లిలోని మాదిగవాడలోని మాదిగల చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్న భూస్వాముల అగడాలను, దౌష్ట్యాలను చిత్రించిన నవల ‘వెట్టికి వెట్టి’. అప్పు ఉన్నారనే నెపంతో దశాబ్దాల తరబడి తాతలు, తండ్రులు, కొడుకులు అంతా భూస్వాముల దగ్గర వెట్టిచాకిరి చేయాల్సివచ్చిన దారుణాన్ని చూపిన నవల ఇది. ఇంతటి దారుణం ఇప్పటికీ కొనసాగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఈ నవల చదువుతుంటే. కాని అది కఠోర వాస్తవం. నమ్మకతప్పని చేదు నిజం. అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, రాయలసీమ గ్రామాల్లోని దళితుల జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. భూస్వాముల దుర్మార్గాలకు అంతులేదు. ఈ వాస్తవాన్ని చెబుతూనే, ఆ వెట్టి నుంచి మాదిగలు విముక్తమయిన సంవిధానాన్ని చెప్పిన తీరులోనే ఆకర్షణ ఉంది.

‘వెట్టికి వెట్టిలోని సన్నివేశాల కల్పన, పాత్రల సృష్టి, కథనరీతి రచయిత ప్రతిభకు నిదర్శనం. ముఖ్యంగా అనంతపురం పల్లెల్లోని మాండలికాన్ని సజీవమైన రీతిలో వాడుకున్నారు. బైరాగి పాట, మొలకల పున్నమి నాటి సామూహిక విందు, వెట్టి చేయించుకోడానికి రెడ్డి, కమ్మ భూస్వాములు మాదిగలను పంచుకోడం, అతికారు చౌకగా వారి శ్రమని కొల్లగొట్టే కుతంత్రం ఎంత పకడ్బందీగా సాగుతుందో చెప్పారు.

ఈ నవలలో వెంకటాంపల్లి ఎస్సీ మహిళా రిజర్వుడు గ్రామపంచాయితీ. భూస్వాములు గంగమ్మ అనే మాదిగ మహిళని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేస్తారు. కానీ అధికారాలన్నీ వారి గుప్పిట్లోనే ఉంటాయి. ఆమెకు చదువు లేదు. పేరుకే ఆమె సర్పంచ్. నిర్ణయాధికారాలన్నీ రెడ్డి, కమ్మ దొరలదే. రిజర్వేషన్ల కోటా కింద దళితులు సర్పంచుల్ని చేయడంలోనూ అగ్రకులాల వ్యవహారసరళి ఎలా ఉంటుందో స్పష్టంగా చూపారు ఈ నవలలో. దొరల పెత్తనం ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ల ఎన్నిక నామమాత్రమే. అంతా దొరల అజమాయిషీలోనూ నడుస్తుంటుంది. వెంకటాంపల్లి సర్పంచ్ ఎన్నికల తీరును రచయిత చిత్రించిన విధం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే సర్పంచ్‌కు ఉన్న అధికారాలన్నీ వెంకటాంపల్లి అగ్రకుల పెత్తందార్లు అనుభవిస్తుంటారు. చివరకు ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచి మాదిగల పేర్లు రాసి, ఆ డబ్బును దొరలు తమ జేబుల్లో వేసుకుంటారు. అప్పు తీర్చలేదని కొద్దిపాటి భూములున్న మాదిగల భూముల్ని కూడా భూస్వాములే సాగు చేసుకుంటారు.

ఇలాంటి గ్రామానికి దళితుడైన ఓబిలేసు టీచర్‌గా వచ్చి మార్పు కోసం ప్రయత్నిస్తాడు. అది నేరుగా కాదు, రహస్యంగానే. ఎందుకంటే భూస్వాముల్ని బాహాటంగా ఎదిరించి నెగ్గుకురావడం కష్టమక్కడ. టీచర్లలో కొందరు తమ పేరున వేరేవాళ్ళతో పనులు చేయిస్తూ, దందాల్లో మునిగితేలుతున్న వైనం కూడా నవలలో చిత్రితమయింది. నిజాయితీ కలిగిన కలెక్టరును సైతం బదిలీ చేయించగల సామర్థ్యమున్న రామిరెడ్డి, శివారెడ్డి లాంటి భూస్వాముల్ని ఎదిరించి మాదిగల విముక్తికి ప్రయత్నించిన ఓబిలేసు, నాగేంద్ర, సరోజ, భవానీదేవి పాత్రల్ని చిత్రించిన తీరు ఆకట్టుకుంటుంది.

దళితుల పేరు చెప్పి ధనవంతులకు ఊడిగం చేసే దళిత నాయకులు ఉంటారనే సంగతినీ నవలలో ప్రస్తావించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు లొంగకుండా చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసే అధికారులు ఉన్నప్పుడు జరిగే మేలు ఎంత ప్రబలమైనదో కూడా చూపారు. ఏమైనా అనంతపురం పల్లెల్లో దళితుల జీవితానికి ఇది సజీవచిత్రణ. సన్నివేశాల కల్పన, స్థానిక మాండలిక భాషలోని సంభాషణలు సహజత్వంతో ఉండి కళ్ళ ముందు కథ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నవలలో నాగమ్మ పెళ్ళిని ఆసరాగా చేసుకుని నాగేంద్ర చదువు మానిపించి, పాలేరుగా మార్చిన పెత్తందార్ల దుర్మార్గాన్ని గమనిస్తే, పేదల్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి వారు చేసే కుట్రలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అలాగే బైరాగి పాట ద్వారా గ్రామంలోని పరిస్థితుల్ని ప్రతీకాత్మకంగా చెప్పడమూ విశేషం. నవలా శిల్పానికి సంబంధించిన విభిన్న అంశాలు ఈ రచనని బలోపేతం చేశాయి.

***

మనుషులు తమ మానాన తాము బతుకుతున్నప్పటికీ రాజ్యం పెత్తనం చెలాయించి వారి బతుకులతో చెలగాటమాడే కుతంత్రాన్ని విప్పి చూపిన నవలిక ‘కంచం మీద కట్టడి’. ‘సిరివరం మీట్ మార్కెట్’ అనేది ట్యాగ్ లైన్. మాంస విక్రయ కేంద్రంగా పేరుబడిన సిరివరం గ్రామపంచాయితీ పరిధిలోని పల్లెల్లో అన్నిరకాల కులాలవాళ్ళు ఉంటారు. వ్యవసాయంతో పాటు ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో తలెత్తిన ఘర్షణలకు మూలాలు ఎక్కడున్నాయో రచయిత చెప్పారు. గోపరిరక్షణ పేరుతో ఎద్దు మాంసానికీ వ్యతిరేకంగా సంఘపరివార్ లేవనెత్తిన వాదనలు, నినాదాలు సిరివరం మార్కెట్‌ను ఎలా కుదిపివేసాయో, వాటిని తట్టుకుంటూ అక్కడి జనం ఎలా సంఘటితంగా నిలబడ్డారో చెప్పడం ఈ రచన ప్రత్యేకత.

ఇది ఒకవిధంగా ప్రతీకాత్మక రచన. హిందూత్వ భావజాలాన్ని నిరసించే సృజనాత్మక ప్రతిఘటన. హిందువుల ఓట్ల కోసం కాషాయపరివారం పన్నిన కుట్రలో ఎన్నో ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. సామరస్యంగా సహజీవనం చేస్తున్న వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు ఏం తినాలో చెప్పడానికి మీరెవరని మతోన్మాదుల్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ రచన వచ్చింది. ‘కంచం మీద కట్టడి’ అనే శీర్షిక అర్థవంతంగా ఉంది. మనం ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే రచన ఇది. ప్రశ్నల్ని ఇష్టపడని పాలకవర్గాలపై విసిరిన నిరసనాగ్రం ‘కంచం మీద కట్టడి’.

నవలికలో సిరివరం మీట్ మార్కెట్ ప్రాశస్త్యం, ఈ మార్కెట్ సొసైటీ కమిటీ చైర్మన్‌గా గురజాల మోహన్ సహృదయం, చైతన్యం, అతని భార్యలోని దయాగుణం, ముఖ్యంగా ముస్లింల సంయమన దృక్పథం బలంగా చిత్రితమయ్యాయి. ఇందుకు అవసరమైన సన్నివేశాల కల్పన సహజంగా ఉండి, ఈ రచనని ఆసాంతం చదివిస్తుంది.

ఒక మతాన్ని అభిమానించడం, అనుసరించడంతో ఇబ్బంది లేదు. కానీ ఇతర మతాల పట్ల, వాటిని అనుసరించే వారి పైన ద్వేషభావం ఆక్షేపణీయం. లెక్చరర్లయిన రంగనాథశాస్త్రి, రఘునాథశర్మలు అసూయాద్వేషాలతో ఇతర మతాల్ని కించపరేలా మాట్లాడటం, ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించడం, మీట్ మార్కెట్ విధ్వంసానికి కుట్ర పన్నడం ఏవిధంగా జరిగిందో స్పష్టంగా చూపారు రచయిత. మాంసాహారం మహాపాపం అన్నట్టు మాట్లాడటంలోని ఔచిత్యాన్ని చిన్నవాడయినప్పటికీ విద్యార్థి శ్రీనాథశాస్త్రి ప్రశ్నించడం గమనార్హం. ఇతని ద్వారానే మాంసాహారం ఇప్పటి ఆచారం కాదని, బ్రాహ్మణులు కూడా మొదట మాంసభక్షకులనే సంగతిని విశదపరిచారు రచయిత. యజ్ఞయాగాదుల పేరిట వందలాది పశువుల్ని వధించిన బ్రాహ్మణుల గురించి చరిత్ర చదివితే తెలుస్తుంది.

అయితే హిందూ ముస్లింల మధ్య ఐక్యతని దెబ్బతీసే మతోన్మాదులు హేతువును అంగీకరించరు. విద్వేషాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. ఇదీ వారి ఎజెండా. ఈ ఎజెండాలో భాగం కాకుండా వారిని ఏకాకుల్ని చేసి, తమని తాము ఎలా కాపాడుకోవాలో ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనాపరులు చేయాల్సిన పని. మీట్ మార్కెట్ మీద దాడి చేసిన వారి పన్నాగం నెరవేరకుండా చేయడంలో శ్రీనాథశాస్త్రి చూపిన వివేచన, చైతన్యం గమనార్హం. మత, కుల ప్రాతిపదికన సమాజాన్ని విచ్చిన్నం చేయాలనే వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సూచన ఈ పాత్ర ద్వారా తెలియజేస్తారు రచయిత. బహుళ కులాలు, మతాలు ఒకచోట కూడివుండటం సాధ్యమేనని సిరివరం గ్రామ పంచాయితీలోని పల్లెలు నిరూపిస్తున్నాయి. ఈ ప్రజల సంఘటిత చైతన్యం ప్రజల మేలు కోరే వారందరికీ అనుసరణీయం. బహుజనుల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం మరింత మెరుగుపడాల్సిన అవసరాన్ని చెబుతుందీ నవలిక.

***

మైనారిటీవాదం, స్త్రీవాదం కలగలసిపోయి వ్యక్తమైన నవలిక ‘నూర్జహాన్’. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం భూమికగా కొనసాగిన ఈ రచనలో ‘నూర్జహాన్’ ప్రధాన పాత్ర. పోలీసుల చేత దారుణంగా అత్యాచారానికి గురయి ఆసుపత్రిలో చేర్చబడిన ఆమె జ్ఞాపకాల నుంచి కథ మొదలవుతుంది. పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మహిళా సంఘాల వారు ఆమెకు అండగా నిలబడటంతో నవల ముగుస్తుంది. అయితే ఆమె నలభై ఏళ్ళ జీవితంలో ముఖ్యంగా పాతికేళ్ళ జీవితంలోని పలు పార్శ్వాల్ని ఈ నవలలో చిత్రించారు రచయిత శాంతి నారాయణ. దూదేకులవారికీ, ముస్లింలకీ నడుమ వైరుధ్యాల్ని కూడా చెప్పారు. దూదేకులు సైతం ముస్లిం సంప్రదాయాల్ని అనుసరిస్తూ సమాజంలో తమకో గుర్తింపు, గౌరవం కోసం పడే ఆరాటం ఎంత సున్నితమైనదో వివరిస్తారు. నూర్జహాన్ జీవితంలో తండ్రి సయ్యద్, మామ అక్బర్, భర్త అన్వర్, కొడుకు సలీం, కోడలు షకీల పోషించే పాత్ర ఎలాంటిదో రూపు కట్టిస్తారు. ఆధిపత్య రాజకీయాలు స్త్రీల శరీరాలతో ఆడుకునే దుర్నీతిని కూడా చూపారు రచయిత.

ఆత్మస్థయిర్యానికీ, ఆత్మగౌరవానికీ ప్రతీకగా నూర్జహాన్ పాత్రని చిత్రించారు రచయిత. ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ జీవితానికి ఎదురీదిన నూర్జహాన్ మహిళలలో దాగుండే ప్రబలశక్తికి ప్రతీకగా నిలిచిపోతుంది. అయితే పరిస్థితుల ప్రాబల్యం ఆమె మనోదారుఢ్యాన్ని దెబ్బతీస్తుంది. పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోవాల్సి వస్తుంది. అయితే ఆ లొంగుబాటు తన కోడలి జీవితాన్ని కూడా నాశనం చేసే రీతిలో ఉన్నపుడు ప్రతిఘటిస్తుంది. పోలీసుల హింసకు గురవుతుంది.

వ్యవసాయంలోని ఒడిదుడుకులు, లిక్కర్ బిజినెస్, 1994 నుంచి మారుతూ వచ్చిన రాజకీయాలు బతుకుల మీద పెంచిన ఒత్తిడి మొదలైన అంశాల్ని స్పృశించారు రచయిత. దాదాపు మూడు దశాబ్దాల పరిణామక్రమం నూర్జహాన్ జీవితచిత్రణతో పాటు రూపుగట్టిందీ నవలలో. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, వైసిపి పార్టీల రాజకీయ ధోరణులు… వాటికి బలయ్యే అన్వర్ లాంటి అమాయకులు, వారిని నమ్ముకున్న స్త్రీల జీవితాల్లోని అలజడి, సంక్షోభపు తీవ్రతని రచయిత ఆర్టమైన రీతిలో అక్షరీకరించారు.

ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు, పోలీస్ అధికారులు మహిళల జీవితాలతో ఏవిధంగా చెలగాటమాడుతారో నవలలో చూస్తాం. సారాయి వ్యాపారాన్ని మామూలుగానయితే అరికట్టవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని చూసీచూడనట్టు వదిలేస్తారు. లంచాలు, ముడుపులు అందుకుంటూ పబ్బం గడుపుకుంటారు. అందుకే మామనీ, భర్తనీ కోల్పోయిన నూర్జహాన్ బతుకుదెరువు కోసం సారాయి వ్యాపారాన్ని మొదలు పెట్టినపుడు చూడనట్టుగా ఉంటారు. కానీ ఆమె పొందు కోరుకున్న స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టరు అదే సాకుతో ఆమెని లొంగదీసుకుంటాడు. అంతటితో ఆగక ఆమె కోడలునీ కూడా తన దగ్గరకు పంపమనడంతో దిక్కు తోచని స్థితిలో నూర్జహాన్ దుఃఖపడుతుంది. ఆగ్రహంతో దహించుకుపోతుంది. ఇన్‌స్పెక్టర్ కుత్సితపు కోర్కెలనీ అంగీకరించదు. దీనితో ఆమె మీద కక్ష పెట్టుకొని రేప్ చేసి హింసిస్తారు పోలీసులు. వారి పాశవిక ప్రవర్తన కారణంగా చావుబతుకుల్లో ఆసుపత్రి పాలవుతుంది. మహిళ దేహం యుద్ధభూమి అనే మాటలోని వాస్తవాన్ని చిత్రించారు ఈ నవలలో శాంతినారాయణ. ప్రాంతీయ రాజకీయాలు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు మహిళల బతుకుల్లో సృష్టించే కల్లోలానికీ, సంక్షోభానికీ చిత్రిక ఈ నవల. తన చుట్టూ ఉండే జీవితం పట్ల రచయిత సృజనాత్మక స్పందనకు తార్కాణం ‘నూర్జహాన్’.

***

సరిగ్గా, ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే వ్యవసాయం కూడా లాభదాయకమే అనే వాదనలు ఈమధ్యన వినిపిస్తున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా నీళ్ళకోసం ఆకాశం వైపు ఆశగా చూసే రైతులకు వ్యవసాయం అంత సులువు కాదు. ఆధునిక టెక్నాలజీ వచ్చి, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో తోటలు పెడుతున్నప్పటికీ వ్యవసాయం సులువైన వ్యవహారం కాదు. రాయలసీమలో, ప్రత్యేకించి అనంతపురం ప్రాంతంలో వ్యవసాయం చేసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు, అగచాట్లు ఎదుర్కోవల్సి వస్తుందో చెప్పనలవికాదు. కానీ భూమినే నమ్ముకున్న రైతులు భూమినుంచి దూరంగా జరగరు. అంతేగాక అత్యాధునిక పద్ధతుల్లో సాగు పద్దతులు మార్చుకొని ముందుకు వెళ్ళాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లోనే నిజంగానే లాభాలు వస్తాయి. అయితే ఇది ప్రధానంగా నీళ్ళతో ముడిపడిన వ్యవహారం.

నీళ్ళు కావాలి. నీళ్ళకోసం అనంతపురం రైతులు చేసిన, చేస్తున్న పోరాటం అలవికానిది, అలుపులేనిది. ఈ నేపథ్యాన్ని తీసుకొని వ్యవసాయాన్ని నమ్ముకున్న సుజాత అనే మహిళ కేంద్రంగా రూపుదిద్దుకొన్న నవలిక ‘రక్షకతడులు’. ముద్దలాపురం అనే గ్రామం కథ నడిచే ప్రాంతం. ఈ గ్రామం గురించి “ముద్దలాపురం, అనంతపురానికి ముప్పై కిలో మీటర్ల దూరంలో, బళ్లారికి వెళ్లే రాష్ట్రీయ రహదారి పక్కనే ఉన్న వొక మంచి పల్లె. వొకవైపు మెత్తని ఎర్రని కండగలిగిన మెట్ట పొలాలతోనూ మరొక వైపు బోరుబావుల కిందున్న తోటలతోనూ చక్కని పాడి పంటలతోనూ మొన్నటి వరకూ కళకళలాడిన గ్రామం అది” అని చెబుతారు రచయిత.

ఈ గ్రామానికి చెందిన రామానాయుడు సుజాత మామయ్య. రామానాయుడు తండ్రి వెంకట్నాయుడు. అతను కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి అనుచరునిగా భూస్వాముల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా పోరాడినాడు. ఆ వారసత్వపు విలువలే పునాదిగా తన జీవితాన్ని నెట్టుకువస్తున్నాడు రామానాయుడు. ఇతని కొడుకు కార్తీక్ సుజాత భర్త. భార్యాభర్తలు ఇద్దరూ చదువుకున్నవారే. కానీ వ్యవసాయం మీద, గ్రామం మీద ప్రేమతో ముద్దలాపురంలోనే ఉంటున్నారు. తొలినాళ్ళలో వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. కానీ క్రమంగా చెరువులు ఎండిపోవడం, వానలు కురవకపోవడం, కరువు తాండవించడం, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా వస్తాయనుకున్న నీళ్ళు రాకపోవడంతో వ్యవసాయ రంగం సంక్షుభితమవుతుంది. ఆ ప్రభావం సుజాత కుటుంబం మీద కూడా పడుతుంది. పదెకరాల తోటా, ఇరవై ఎకరాల మెట్టా, చెరువు కింద ఐదెకరాల తరీ వున్న మంచి రైతుగా పేరుబడిన రామానాయుడు కుటంబమూ ఈ సంక్షోభపు తాకిడికి లోనవుతుంది.

మిరప పంట, తోటల మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. బోర్ ఉన్నా నీళ్ళు రావు. తమ తోటల పక్కన నాగిరెడ్డి కొత్తగా బోర్ వేయించడంతో అక్కడ నీళ్ళు పుష్కలంగా పారుతుంటాయి. ఇక్కడ రామానాయుడు మరో బోర్ వేయించినా నీళ్ళు పడవు. నాగిరెడ్డి బోరులోంచి వచ్చే నీళ్ళు తమ తోటల్ని నడిపితే గానీ టమాట, మిరప పంటలు బతికే పరిస్థితి తలెత్తదు. వరసకు మామ అయిన నాగిరెడ్డిని నీళ్ళు వదలమని అడిగితే ఆమె దేహాన్ని అడుగుతాడతను. నీళ్ళు కావాలంటే తనతో గడపాలంటాడు. నిర్ణయం ఆమెకి వదిలేస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. తనలో తను మథనపడి అతని కోర్కెని సమ్మతిస్తుంది. అయితే ఇదంతా నేరుగా కాకుండా సూచ్యప్రాయంగా చెప్పడంలోనే రచయిత శిల్పనైపుణ్యం దాగుంది.

నెలరోజుల్లో పంట చేతికొచ్చి నలభై లక్షల దాకా మిగులుతుంది రామానాయుడు కుటుంబానికి. కానీ ఆమె మనసు ఘర్షణ పడుతుంది. అంతర్మథనానికి లోనవుతుంది. అసలు విషయం భర్త కార్తీక్‌కు గానీ, రామానాయుడుకు గానీ తెలియదు. చివరకు తనకు వచ్చిన యోగవిద్యతో ‘బ్రహ్మకపాల యోగం’ ఆసనం వేసి ప్రాణం తీసుకుంటుంది. ఆమె చేతి మీద ఉన్న ‘మలినమైన శరీరంతో ఉండలేక…’ అనే అక్షరాలు చూసిన భర్త వెంటనే చెరిపివేస్తాడు. అందరూ పద్మాసనంలో గుండెపోటు వచ్చి మరణించిందని అనుకుంటారు. కానీ అసలు రహస్యం భర్త ఒక్కడికే తెలుసు… అయితే అందుకు నాగిరెడ్డి కారణమని అతడు గ్రహించాడో లేదో చెప్పడు. పాఠకుల ఊహకే వదిలేస్తాడు.

ఈ నవలలో నీటి ప్రాజెక్టుల పేరుతో రచయితల్ని దగాచేస్తున్న రాజకీయాల పట్ల సునిశితమైన విమర్శ ఉంది. రచయిత శాంతి నారాయణకు కృష్ణా జలాల పట్లా, నీటి వనరులపైనా, హంద్రీనీవా రూపురేఖల పట్లా దాని ద్వారా పారే నీళ్ళ పట్ల సమగ్రమయిన అవగాహన ఉందని ఈ నవల తెలియజేస్తుంది. హంద్రీనీవా ప్రాజెక్టు పేరుతో పాలకవర్గాలు ఆడుతున్న నాటకాల్ని చెబుతారు. ఈ ప్రాజెక్టును సరిగా అమలుచేసి గ్రామాలకు నీళ్ళు అందించే విషయంలో చేస్తున్న తాత్సారాన్ని ప్రశ్నిస్తారు.

“మనకు వానలు పడకపోవచ్చు పెదనాయనా, అటువైపు గోదావరీ కృష్ణా నదుల్లో ఇంకా ఇరవై డ్యాముల్ని నింపుకోగల్గినన్ని నీళ్లు ఇప్పటికే సముద్రం పాలయిపోయినాయి గదా! భూమి విస్తీర్ణాన్ని బట్టి అనంతపురం జిల్లా ప్రజలు బతికే హక్కుగా పొందవలసిన, ప్రభుత్వాలు కేటాయించవలసిన నూటఇరవై నూటాముప్పై టీయంసీల నీళ్లు మనకు వచ్చివుంటే మన చెరువులూ కుంటలూ వంకలూ వాగులూ నీళ్లతో కళకళలాడకుండా వుండేవా? అవన్నీ నీళ్లతో కళకళ లాడితే బావుల్లో నీటి కొరత వుంటుందా తిమ్మప్ప చిన్నాయనా? దీనికంతా కారకులెవరంటారు? పోనీ, అంత దూరదృష్టి, అత్యంత వెనకబడిన ఈ ప్రాంతంపైన దయాదృష్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోతేమానె, ఈ సంవత్సరం శ్రీశైలం డ్యాం నిండుకుండ మాదిరి వుంది కదా, ఇచ్చిన హామీ ప్రకారం హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి కేటాయించిన నలభై టీఎంసీల నీళ్లను తోడి, ప్రాజెక్టుకిందున్న పిల్ల కాలువలన్నిటికీ నీళ్లొదిలితే మనకు ఈ గతి పట్టేదా?” అని బాధగా ప్రశ్నించింది ఈ నవలలోని సుజాత. ఇది సుజాత సంవేదనగా వ్యక్తమయినప్పటికీ రచయిత శాంతినారాయణకు అనంతపురం జిల్లా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ఉన్న సమగ్ర అవగాహనని ప్రతిఫలిస్తుంది. తను చేస్తున్న రచనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సాకల్యంగా చెప్పడానికి ఈ రచయిత ఎంతగా అధ్యయనం చేస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

నీటి సమస్య ప్రస్తావనతో కూడిన ఈ నవలలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ సంవేదన ప్రతిఫలిస్తుంది. నూర్జహాన్ నవలలో మాదిరిగానే ఇక్కడా సుజాత బాధితురాలు. ఇద్దరూ జీవితానికీ ఎదురొడ్డి పోరాడినవారే. కాని వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసే రాజకీయ, ఆర్థికమూలాలు ఎంత బలీయమైనవో ఈ నవలికలు చెబుతాయి. రెండింటిలోనూ స్త్రీల శరీరాల్ని బలి తీసుకునే పురుషాధిపత్యపు క్రూరత్వాన్ని చూస్తాం. నూర్జహాన్, సుజాతలు ఇద్దరూ తమ కుటుంబం కోసం ఆలోచించారు, శ్రమించారు. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. నూర్జహాన్ తన కోడలిని కాపాడుకోవటం కోసం బలయింది. సుజాత తన కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి తనంతటతానుగా నిష్క్రమించింది. కుటుంబానికి ఏ అపవాదు రావద్దన్న సంకల్పంతోపాటు, తనని చూసి నవ్వే అవకాశం తనని వాడుకున్న నాగిరెడ్డికి ఇవ్వరాదన్న పట్టుదలనే ఆమెని ఆత్మత్యాగానికి పురిగొల్పింది.

***

రచయితగా శాంతినారాయణ అంతర్లోకాల అలజడిని పట్టిచూపే నవలికలు ఇవి. వీటిని రాయడానికి ఆయన ఎంతగా కల్లోలానికి లోనయి ఉంటాడో ఊహించడం కష్టం. ఎందుకంటే తను సృజించే పాత్రకు కలిగే కష్టం సైతం రచయితని దుఃఖపెడుతుంది. భరింపలేని దిగులుకు లోను చేస్తుంది. తన జీవనానుభవపరిధిలో అన్యాయానికి బలయ్యే మనుషులెందరినో ఆయన చూసి ఉంటారు. కానీ ఆ మనుషుల్ని తన రచనల్లో పాత్రలుగా సృష్టించి లోకానికి పరిచయం చేయాల్సి వచ్చినపుడు పడే వేదన వర్ణనాతీతం. అయితే చుట్టూ ఉండే వాస్తవాల్ని శిల్ప ఔచిత్యానికి భంగం కలిగించకుండా రాయడంలో రచయిత కౌశలం దాగుంది. వాస్తవాన్ని పఠిత హృదయం ద్రవించేలా రాయడం రచయిత అనుసరించే శైలీశిల్పాల మీద ఆధారపడి వుంది. కథనంలో ఎక్కడా రచయిత తొట్రుపాటుకు లోను కాడు. ప్రతి సంఘటన, ప్రతి పాత్ర ఎక్కడ ఎలా ఒదిగిఉండాలో అలాగే ఉంటుంది. అంతేగాక తను చెప్పదలుచుకున్న విషయాలని సూచ్యప్రాయంగా ప్రస్తావిస్తూనే పాఠకుల్ని కథ వెంట నడిపించుకుపోతాడు. నూర్జహాన్ నవలలో ఒకచోట “అది 1994వ సంవత్సరం. ఎన్టీరామారావు మహానాయకుడుగా గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాలమది” అని చెబుతారు. ఇవి కేవలం అంకెలు కాదు. 1994 అని చెప్పడం ద్వారా ఆనాటి రాజకీయాల్ని, ఆర్థికపరిస్థితుల్ని, ఆ కాలపు బతుకు తీరుతెన్నుల్ని, మనుషుల్లోని విలువల్నీ, ద్వంద్వాల్నీ సూచిస్తున్నారు.

అలాగే ‘రక్షకతడులు’ నవలలో బ్రహ్మ కపాలయోగం ప్రస్తావనని మొదట్లో పిల్లలతో మాట్లాడుతున్న సందర్భంలో తీసుకువస్తారు. ఆ ఆసనం ప్రత్యేకతని కథాకథనంలో భాగంగా సుజాత తన మామయ్యకు చెబుతుంది. నవల ముగింపులో ఈ యోగాసనం ద్వారానే ఆమె తన ప్రాణాల్ని వదిలివేస్తుంది. చేయితిరిగిన రచయిత కల్పనాచాతుర్యానికి ఇది మరో ఉదాహరణ. మొదట చేసిన యోగాసనం ప్రస్తావనకు ముగింపులో సమాధానం లభిస్తుంది.

శాంతి నారాయణ రచనల్లో చాలా వాటికి ఈ విధంగా దగ్గర సంబంధం ఉంది. ఇక ఈ నాలుగు నవలికలు ఆయా ప్రాంతాల్లోని నుడికారం, పలుకుబడి, మాండలికపు భాషా సొగసులతో పాఠకులకు చిత్రమైన పఠనానుభవాన్ని అందిస్తాయి. ఆయా పాత్రలు తమదైన సహజమైన భాషనే మాట్లాడతాయి. ఇలా మాట్లాడటమే భాషకీ, మనుషులకీ అందం. ‘రక్షకతడులు’ నవలికలో ఈ అంశం ప్రస్తావన కూడా ఉంటుంది. తమ నేటివిటీకి తగ్గ భాషనే ఎవరయినా మాట్లాడటం ఎంత మంచిదో చెప్పకనే చెప్పడం విశేషం.

ఈ నాలుగు నవలికల్లో అస్తిత్వ సంవేదన మాత్రమే కాదు, గత నాలుగు దశాబ్దాల కాలాన అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిణామాల చరిత్రకు ఆనవాళ్ళున్నాయి. భూస్వామ్యం, రాజకీయం, పెట్టుబడి, పాలకవర్గాల దాష్టీకం జనం బతుకులతో చెరలాటలాడిన తీరును చెబుతాయి ఈ నవలికలు. దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, సాంకేతికంగా పురోగమిస్తుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ పల్లెల్లో బతుకు మారలేదు. ముఖ్యంగా మహిళల బతుకు మరింత భయానకంగా తయారయింది. ఈ వాస్తవాల్ని తెలియజేస్తూ ఆలోచింపజేయడం రచయిత శాంతినారాయణ సాహిత్య సాఫల్యం. ప్రజల మీద, చుట్టూ ఉన్న జీవితం మీద రచయిత శాంతి నారాయణకు ఉన్న ప్రేమ, నిబద్దతలకు నిదర్శనం ఈ నాలుగు నవలికలు. పుస్తకంగా రావడానికి ముందే వీటిని చదివి, నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశమిచ్చిన డా॥ శాంతి నారాయణకు ధన్యవాదాలు.

– గుడిపాటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here