నమామి దేవి నర్మదే!!-11

2
10

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

రోజు పదిహేను

[dropcap]ఆ[/dropcap] రోజు సోమవారం. మేము ఉదయం ఏడుగంటలకు దేవాలయానికి వెళ్ళిపోయాము.

దేవాలయం దగ్గర బందోబస్త్ చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ లేదు. దూరంగానే బండి ఆపి మా సమస్త వస్తువులు, ఫోన్లు, పర్సులు కారులో వదిలి కేవలం రిక్త హస్తాలతో వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి ఏదీ తీసుకెళ్ళకూడదని చెప్పారు. నేను కేవలం నా పారాయణ గ్రంథం, నర్మదా జలం మాత్రం తీసుకున్నాను. మా వద్ద ఎక్కువ డబ్బు కూడా లేదు. మేము అలా వెళ్ళి దేవాలయం బయట అర్చకుల కోసం ఎదురుచూశాము.

కొంతసేపటికి పొడవైన ఒక ముప్పై ఏళ్ళ అర్చకుడు ఎర్రని పట్టుబట్టలలో సూర్యుడిలా వెలుగుతు వచ్చాడు. అనిల్ అతనితో మమ్మల్ని జతకూర్చాడు. మేము ఆ అర్చకునితో కలిసి దేవాలయం లోపలికి వెళ్ళాము. లోపల టికెట్ కొనుక్కొని అతనితో లోపలికి వెళ్ళాము. మహాకాలుని దర్శనం చాలా నింపాదిగా చేసుకున్నాము.

మహాకాలుడు మనం నిలబడితే మన నడుము వరకు వస్తాడు. ఎత్తుగా ఉన్నాడు. దూరం నుంచే చూడమన్నారు. విశాలమైన హాల్ ఉంది, బహుశా భస్మహారతి కోసమనుకుంటా.

మేము దర్శనం చేసుకున్న తరువాత మమ్మల్ని ఆ అర్చకుడు కోనేరు వైపు తీసుకుపోయాడు. ఆ కోనేరు చాలా విశాలంగా ఉంది. దాని చుట్టూరా ఎన్నో శివలింగాలు, నందులు ఉన్నాయి. మమ్మల్ని అతి పెద్ద లింగం దగ్గరకు తీసుకుపోయాడతను. అది కోటేశ్వర లింగం. ఆ స్వామికి మహాకాలునికి జరిగినట్లే ఉపచారాలు జరుగుతాయట.

మమ్మల్ని ఒక ప్రక్కన కూర్చోబెట్టి అభిషేకం మొదలుపెట్టించారు. ఆ శివలింగానికి ఒక ప్రక్క శివపార్వతుల పాలరాయి విగ్రహం, చిన్న వినాయకుడి విగ్రహం ఉన్నాయి. మేము మహాదేవుని ముందు కూర్చున్న తరువాత తొలుత మా గురువులను తలుచుకోమన్నారు. నేను గురుదేవులను తలచుకొని, వారిని అక్కడ ఆ లింగంలో దర్శించాను. స్వామికి అభిషేకం చాలా వైభవోపేతంగా జరిగింది. ఆ రోజు సోమవారం కాబట్టి, చాలా మంది భక్త బృందం వస్తున్నారు, పచ్చి పాలు, నీరుతో శివునికి అభిషేకం చేసి చప్పట్లు కొట్టి వెడుతున్నారు.

మాది తొలి అభిషేకం అక్కడ. అభిషేకం పూర్తి కావటానికి గంట సమయం పట్టింది. మా దగ్గర ఉన్న నర్మదానది జలంతో స్వామికి అభిషేకం చేసి మా నర్మదా పరిక్రమను ముగింపు చెయ్యమని మహాకాలున్ని వేడుకున్నాం. కొంత జలం ఇంకా మిగుల్చుకున్నాం. దాన్ని మేము మా ఇంట్లో అభిషేకంలో వాడాలి. అభిషేకానంతరం ఆ అర్చకుడు మమ్మల్ని దేవాలయమంతా తిప్పాడు. తీసుకొచ్చి బయట వదిలిపెట్టాడు.

శ్రీవారు అతనితో “చాలా సంతోషమైయింది. పూజ బాగా జరిగింది…” అన్నారు దక్షిణ ఇస్తూ.

“మీకు సంతోషమైతేనే డబ్బు ఇవ్వండి లేకపోతే వద్దు. నాకు అరగదు మీరు అసంతృప్తితో ఇస్తే…” అన్నాడతను.

మావారు ఆశ్చర్యానందాలతో మరింత ఇస్తూ “చాలా సంతోషంగా ఇస్తున్నా. ఎక్కువ ఇవ్వమనే గాని, ఇప్పటి వరకు ఎక్కువ వద్దన్న వాళ్ళని నేను చూడలేదు” అన్నారు.

“మాకు మహాదేవుడున్నాడు. ఆయనిస్తాడు…” అంటూ ఆ యువ అర్చకుడు వెళ్ళిపోతే అతని ముఖంలోని తేజస్సుకు అర్థం గోచరించింది.

దైవాన్ని నమ్మి న్యాయంగా ఉండే ప్రతివారిలో కనపడుతుందా ఆ తేజస్సు. అదే శివం. సాక్షాత్తు ఆ మహాదేవుడే ఆ రూపంలో మాకు సహయం చేశాడా ఏమి? అని మేము కొంత సేపు ముచ్చటించుకున్నాం.

అతని ముఖంలో ఆ అద్భుతమైన మెరువు ఎక్కడో కాని, ఎవరికోగాని చూడం మనం.

అక్కడ్నుంచి మేము గుడి బయటకు వచ్చి నడుచుకుంటూ గణపతి దేవాలయం, ప్రక్కనే ఉన్న అమ్మవారి దేవాలయం దర్శించాం. జగదంబ దేవాలయంలో భక్తుల తాకిడి లేదు. చాలా ఖాళీగా ఉంది.

మన దక్షిణాది దేవాలయాల సాంప్రదాయం అక్కడ లేదు. నేను కొబ్బరికాయ, వస్త్రం, పూలు ఇత్యాదివి తీసుకొని లోపలికెళ్ళాను. మేము దర్శనం చేసుకున్నాం.

అమ్మవారు లక్ష్మీ సరస్వతి సమేతంగా ఉంది. ఎర్రటి వస్త్రాలు,రంగు రంగుల హారాలు.

ఆ దేవాలయ పైకప్పులో మహామేరువును చిత్రించి ఉంది. పరివార దేవతలతో చూడచక్కగా ఉంది.

నేను అక్కడే ఒక ప్రక్కన కూర్చుని నా పారాయణం చేసుకున్నా.

శ్రీవారు వెళ్ళి, కారు దగ్గర్నుంచి తన బ్యాగ్ తెచ్చుకున్నారు.

మేము బయట ఉన్న వారికి మాకు తోచినంత దానాలు చేసి, కొద్దిగా కుంకుమ కట్టుకొని వచ్చేశాము.

ఆ రోజు మా తదుపరి గమ్యం కాలభైరవ దర్శనం. ఆ దేవాలయం ఉజ్జయినికి కొద్దిగా దూరంలో ఉంది.

ఎండ ఎక్కువగా ఉంది. కాలభైరవ గుడి చుట్టూ మట్టితో చాలా అపరిశుభ్రంగా ఉంది. అక్కడ చాలా దుకాణాలలో విస్కీ అమ్ముతున్నారు చిన్న చిన్న బాటిల్స్ లో, ఎందుకని అడిగితే లోపల కాలభైరవునికి ఆ విస్కీ పోస్తారట. అది వినగానే మన పానకాల నరసింహస్వామి గుర్తుకువచ్చాడు నాకు.

మేం పూలు, వస్త్రం లాంటి పూజా సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్ళాం. పూజారి మా సంకల్పం చెప్పి ప్రసాదం ఇచ్చాడు. బయటకొచ్చి మా చెప్పుల దగ్గరకు నడుస్తుంటే ఒక సన్యాసి నేల మీద మట్టిలో దేకుతూ అడుక్కుంటున్నాడు. అందరు అతనిని చీదరిస్తున్నారు.

నా హృదయానికి ఏదో కష్టం కలిగింది. వెళ్ళి ఆయనకో పది రూపాయల నోటు ఇస్తే పక్కనున్న షాపు అతను “వీడో దొంగ. పెద్ద తాగుబోతు. డబ్బు దొరికితే చాలా తాగుతాడు. ఇవ్వకండి వీడికి…” అంటూ అరిచాడు.

“అయ్యా! లోపల దేవుడే తాగుతున్నాడు. బయట ఈ మానవుడిని వారించే వారమా?” అని నేను వచ్చేశా.

కాని పూర్వం తాంత్రికమైన పూజలలో పంచ మకారాలు వాడేవారు. నేటికి దేశంలో రకరకాల చోట ఈ మకారాలతో అర్చన ఉంది. అది బయటకు రాదు. ఇక్కడ మాత్రం మద్యం మాత్రమే మకారాలలో మిగిలిదంటారు. ఆ కాలభైరవునికి మద్యం సమర్పించి ఆయనను తృప్తిపరిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. నాకా మకారాల మీద మమకారం లేనందుకు నేను ఏ మకారం సమర్పించలేదు. సమర్పించాలనుకున్నది అహంకారమే. అందుకే మౌనంగా వచ్చేశాను.

***

మేము అక్కడ్నుంచి బయలుదేరి భర్తృహరి ఆశ్రమం వైపు కదిలాము.

భర్తృహరి సంస్కృతంలో చక్కని నీతి శతకం రాశాడు.

“సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం,

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం!

షణ్ణం రసానాం లవణం ప్రధానం,

భావవే నదీనాముదకం ప్రధానం॥”

అంటు మా చిన్నప్పుడు మేము కొన్ని నేర్చుకున్నాము. అవి భర్తృహరి రాసిన సంస్కృత శతకం లోనివి.

ఆయన గుహ, ఆశ్రమం, తపస్సు చేసుకున్న ప్రదేశం ఉజ్జయిని దగ్గరుంది.

పూర్వం ఆయన ఉజ్జయిని పరిపాలించే రాజు. ఈయన రాజ్యం వదిలెయ్యడం గురించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఏది నిజమో తెలియదు, కాని గైడ్ చెప్పినది, ఆ గుహ వద్ద ఉన్న సమాచారం మాత్రం ఇలా సాగింది…

ఒకసారి అడవికి వేటకు వెళతాడు. అక్కడ ఆయనకు ఒక సాధువు కనపడుతాడు. ఆ సాధువు పరమ బీదగా ఉంటాడు. ఆయనకు ఆహారం ఎక్కడ్నుంచి వస్తుందో తెలియదు… అయినా ఎలాంటి దుఃఖం లేకుండా పరమ శాంతంగా ఉంటాడు. ఆయనకు ఎవరో ఒకరు ఆహారం ఇవ్వటం అలాంటివి (అంటే శరీర అవసరాలు) తీరుతుంటాయి.

రాజు ఆయనను “మీరింత సంతోషంగా ఎలా ఉన్నారు. రాజైన నేను ఎన్నో ఇబ్బందులలో ఉన్నా” అని అడిగితే ఆ సాధువు “నన్ను అనుసరించు… నీకన్ని తెలుస్తాయి…” అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ సాధువు దర్శనంతో రాజుకు మార్పు కలుగుతుంది. రాజు తన తమ్ముడైన విక్రమాదిత్యునికి రాజ్యాభిషేకం చేసి, అడవిలోకి వెళ్ళిపోతాడు.

అడవిలో తనకు కనపడిన సాధువును చేరుతాడు. ఆ సాధువే గోరఖ్‌నాథ్. గోరఖ్‌నాథ్ నాథ సాంప్రదాయంలో ప్రఖ్యాత గురువు. అతని శిష్యుడు మత్స్యేంద్రనాథుడు. నవనాథులని నాథ గురువులు. వీరు శివుని నుంచి వెలువడ్డారని ప్రఖ్యాతి. వీరు సాధనలో దిగ్గజాలు. వీరి సాధన పద్ధతి కూడా చాలా కఠినంగా ఉంటుంది. వీరు ప్రజలతో, భక్తులతో చాలా కరుణగా ఉంటారు. నాథ సాంప్రదాయంలో చెవులకు పెద్ద రింగులు పెట్టుకోవటం, ధుని వెలిగించటము వంటివి ఉంటాయి. వీరు చాలా మటుకు ప్రజలకు దూరంగానే ఉంటారు.

భర్తృహరి అలా గోరఖ్‌నాథ్ శిష్యుడిగా ఆయనకు సేవలు చేస్తు ముక్తి పొందాడు. భర్తృహరి రాసిన సుభాషితాలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. ఆయన సంస్కృత భాషలో గొప్ప సాహిత్యాన్ని అందచేశాడు.

ఉజ్జయినికి కొద్ది దూరంలో ఆయన తపస్సు చేసిన గుహ, నాథుల దేవాలయం ఉన్నాయి. అక్కడే గణపతి గుడి, హనుమంతుడి గుడి కూడా ఉన్నాయి. గుహ లోపలికి పాకుతూ వెళ్ళాలి. లోపలంతా చీకటిగా ఉంటుంది. నూనె దీపంలో గోరఖ్‌నాథ్, మత్స్యేంద్రనాథ్, భర్తృహరి విగ్రహలను దర్శించుకు రావాలి. అక్కడ ఈ సమాచారం తెలుపుతూ బోర్డులు కూడా ఉన్నాయి. రోడ్డు మీది నుంచి మనం దాదాపు యాభై మెట్లు దిగి వెళ్ళాలి ఈ గుహను చూడటానికి. నాథ్ సాంప్రదాయ సాధువుల పర్యవేక్షణలో ఈ గుహాలయం ఉంది. దానికి అనుబంధంగా పెద్ద గోశాల కూడా ఉంది. గోశాలలో మనం కొద్దిగా గడ్డి కొని గోవులకు తినిపించవచ్చు.

దర్శనం చేసుకొని, మేము నెమ్మదిగా మెట్లు ఎక్కి వచ్చాము. గోవులకు కొంత ఆహారం తినిపించారు శ్రీవారు.

తరువాత మేము సాందీపుని ఆశ్రమం వైపు వెళ్ళాము. పురాతన వృక్షాల ఛాయలో ఆశ్రమం ప్రశాంతంగా ఉంది.

ఉజ్జయినిలో తప్పక దర్శించే ప్రదేశం ‘రామ్ ఘాట్’. క్షిప్రానది పరమ పావనమైన నది. ఇది నర్మదానదికి ఉపనది. ఈ నది కోరిన కోరికలు తీరుస్తుందని పేరుంది. ఈ నదిలో రామ్ ఘాట్‌లో నదీమతల్లికి హారతి చూడవలసినది.

ఉజ్జయిని గుర్తుగా ఇత్తడి పాత్ర తీసుకున్నాను నేను. ఏ క్షేత్రమైనా ఇత్తడి, రాగి తెచ్చుకోవటం ఉత్తమం ప్లాస్టిక్ కన్నా. ఉజ్జయినిలో చూడదగ్గ గోపాలుని మందిరం కూడ ఉంది. అది ఊరుకు మరో వైపు. మాకు సమయం లేదని వెళ్ళలేదు. నేను నా పరిక్రమ అయ్యాక భోపాల్‌లో ఉన్న మా కజిన్ ఇంటికి వెళ్ళాలనుకున్నా, కాని కుదరలేదు. కాబట్టి మేము కొద్దిగానైనా ఉజ్జయిని నగరాన్ని నిదానంగా చూశాము.

మా పరిక్రమలో రెండో రాత్రి కూడా వరుసగా ఉన్నది ఉజ్జయినిలోనే.

మా వద్ద ఉన్న ఊలు దుప్పట్లు శ్రీవారు ఉజ్జయినిలో వృద్ధులకు పంచేశారు. తన వద్ద ఉన్నవన్ని ఆయన ఉజ్జయినిలో పేదవారికి ఇచ్చేశారు. మా వద్ద కేవలం నర్మదా జలం, పరిక్రమ మధుర జ్ఞాపకాలు, ప్రసాదాలు, నర్మద బాణలింగాలు ఉన్నాయి.

నర్మదా లోని రాళ్లను బాణలింగాలంటారు. నర్మదలోని రాళ్లను బాణలింగాలనటానికి ఒక్క కథ చెబుతారు. నర్మదా తీరంలో బాణాసురుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే “ఈ నదిలో నీవు నాకెప్పుడూ దర్శనం ఇవ్వాలని” వరం కోరతాడు.

బాణుడు కోర్కెను తీర్చడానికి భగవానుడు గుండ్రని లింగాకృతి గల రాళ్ళ రూపంలో మారిపోయాడు. అందుకే ‘నర్మదాకే కంకర్ సబ్ శివ్ శంకర్’ అనే సామెత వచ్చింది.

బాణాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగ రూపాల్లో లభిస్తూ ఉంటాడనీ, ఈ కారణంగానే వీటికి బాణలింగం అనే పేరువచ్చిందని అంటారు. శివుడ్ని ఈ బాణలింగాల రూపాన ఋషులు, దేవతలు కొలుస్తారు. బాణ లింగాలు గుడ్డు ఆకారంలో ఎంతో నున్నగా వుంటాయి.

తేనె పోస్తే ఎత్తుకునేంతగా బాణలింగాలు కనిపిస్తుంటాయి. ఏ విధమైన ఎగుడు దిగుడు లేకుండా ఒకే విధమైన కోణాలను కలిగి, ఆకర్షణీయంగా కనిపించడం బాణలింగం ప్రత్యేకత. ఇవి తెలుపు, నలుపు, నేరేడు పండు, తేనే, గచ్చకాయ రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. తంజావూరు లోని బృహదీశ్వరాలయంలో అతిపెద్ద బాణలింగం నర్మదలో లభించిందే.

సాలగ్రామములు ఏ విధంగా పూజలు అందుకుంటున్నవో నర్మద యందలి శిలలు, త్రినేత్రముల, యజ్ఞోపవీతముల చిహ్నములతో నర్మదబాణములుగా ప్రసిద్ధి పొంది శిష్టుల పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి. జ్యోతి స్వరూపంగా ఈ బాణలింగాలని కొలుస్తారు. ఈ లింగం మన ఇంట్లో ఉంచుకుంటే మన పూజ ముందు చేసే ‘ఆవాహయామి’ అన్న ఉపచారము చేయనక్కర్లేదు. ఎందుకంటే స్వామి ఈ బాణలింగంలో సదా మన ఇంట్లో నిత్య నివాసముంటాడు కాబట్టి.

మా తిరుగు ప్రయాణపు విమానం ఇండోర్ నుంచి కాబట్టి మేము తిరిగి ఇండోర్ వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే మేము ఆ ఇండోర్ చుట్టూరా తిరిగామని అనిపించింది.

రోజు పదహారు

ఈ రోజు మా తిరుగు ప్రయాణం. ఉదయం పదికి మా విమానం. మేము ఉదయమే ఏడుకు బయలుదేరాము. పొగమంచుతో రోడ్లు కనపడటం లేదు. ఆ ఉదయం సూర్యుడు కూడ చాలా నిదానంగా ఉన్నాడో, లేక మా ప్రయాణం అయిపోవచ్చిందని దిగులుతో రాలేదేమో తెలియదు. ఆ పొగమంచు ఉదయాన మేము ఇండోర్ వెళ్ళటానికి గంట కన్నా సమయం పట్టలేదు. ఇండోరులో మ్యారియట్‌లో మేము ఉదయం ఫలహారం చేశాము. నిజానికి అదో మంచి విందులా ఉంది. మా నిబంధనలతో మేము సరిగ్గా కడుపునిండా తిని కూడ అప్పటికి పదిహేను రోజులు గడిచినందుకేమో, కాని చక్కటి దక్షిణ భారతీయ వంటకాల ఫలహారం చేశాము. అవి ఇడ్లీలే కానియ్యండి.

అక్కడ్నుంచి ఇక విమానాశ్రయం వెళ్ళాక మమ్ములను అప్పటి వరకు గైడ్ చేసిన అనిల్‌కు సెలవు చెప్పాలి. అతనికి అతని కుటుంబానికి బట్టలు, చలికి కోట్లు, కొంత క్యాష్, అతని పిల్లలకు స్వీట్లు ఇచ్చాం.

అతను కూడా చాలా ఎమోషనల్‌గా మాకు గుడ్ బై చెప్పాడు.

మేమిద్దరము మా బ్యాగులతో అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం లోపలికి నడిచాం.

***

నర్మదా పరిక్రమ చేస్తుండగా నర్మదామాయి పరిక్రమవాసులకు కనిపిస్తుందని చెబుతారు అందరు. ఆ తల్లి మీద భక్తితో నియమాలను అనుసరిస్తు, కాలి నడకన పరిక్రమ చేసిన ప్రతి వారికి కనపడుతుందని ఎన్నో ఉదాహరణలున్నాయి.

నేను తరువాత హైదరాబాదులో 106 సంవత్సరాల యోగి శ్రీ శ్రీ సదానంద గిరి స్వామిజిని కలిసినప్పుడు, నా నర్మద పరిక్రమ గురించి అడుగుతూ ఆయన తన యాత్ర గురించి చెప్పారు.

సన్యాసులు తప్పక ఈ యాత్ర ఒక్కసారన్నా చేస్తారు వారి జీవితకాలంలో. వీరు(106 సంవత్సరాలు ఉన్న ఈ యోగి) తన యాత్ర చేస్తుండగ నర్మదామాయి వీరికి రెండు సార్లు దర్శనమిచ్చిందట. వీరికి అప్పుడు అర్థం కాలేదు కాని తరువాత ఆలోచిస్తే తెలిసిందట.

“మొదటసారి వారు అడివిలో నడుస్తున్నారట. అప్పుడు రాత్రి అయింది. పడుకునేందుకు స్థలం చూసుకుంటున్నారట. ఇంతలో ఒక యువతి చాలా అందంగా ఉందట. ఒళ్ళంతా నగలు, ఆమె మంచి వయస్సులో ఉన్న అందమైన యువతి వీరిని సమీపించి “ఆకలిగా ఉంది. ఆహారమేదైనా ఇస్తావా?”

ఆయన ఆ సాయంత్రం తనకు దొరికిన రొట్టెలను తిననందుకు ఆయన వద్ద ఆహారం ఉంది. “ఉంది తీసుకో!” అని ఇచ్చారట.

“ఇంత రాత్రివేళ నీవు ఒక్కతివే ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగారు.

“దారి తప్పాను. మా అన్నలు ఉన్నారు” అని ఆహారం తీసుకొని వెళ్ళిపోయింది.

క్షణంలో అంత అందమైన యువతి ఎక్కడ మాయమయ్యిందో ఆయనకు అర్థమవలేదుట.

తరువాత మరోచోట నిర్మానుష్యంగా ఉన్నచోట ఆయన ఆహారం గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారట. నడి వయస్సు స్త్రీ ఒక ఇంటి అరుగుమీద కూర్చొని ఉంది రొట్టెలతో. వీరిని రమ్మనమని రొట్టెలు పెట్టింది. ఆయన తింటుంటే “తిను, తిను. మళ్ళీ దొరకదు తిండి ఇక్కడ…” అన్నది.

ఆమె వంటి మీద నగలున్నాయి. దండకడియాలు, తలపై పాపిడిబిళ్ళ, గాజులు, మెడలో నగలు, పెద్ద బొట్టుతో మెరిసిపోతుంది ఆమె. ఆ సాధువు కడుపు నిండా తిన్నాడు. తరువాత బయలుదేరి ఏదో విషయానికి వెనకకు చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆయనకు అప్పుడు తెలిసింది ఆమె నర్మదమాయి అని.

వారికి అలా నర్మదామాయి రెండుసార్లు దర్శనమిచ్చిందట. వారు నేను అడిగితే చెప్పారు.

***

నర్మద దర్శనం

మరి మాకు నర్మదామాయి ఎక్కడన్నా కలిసిందా???

అమ్మ హృదయానికి పదేపదే తడుతునే ఉంది. ఆమె ఏ రూపంలో అనుగ్రహించినదో ఎవరికీ తెలుసు??

ఓంకారేశ్వర్‌లో పూజారిగారు మాతో “మేము అందరితో మర్యాదగా ఉంటాము. ఎక్కువ ఏమి ఆశించం. మాయి ఏ రూపంలో మమ్మల్ని పరిక్షించటానికి వస్తుందో, మాయీ మీరేనేమో అమ్మా!” అన్నాడు.

మరి అంతేగా… అమ్మ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదుగా…

ఏ రూపం అమ్మది కాదు? ఎక్కడ లేదమ్మ? అన్న ఆలోచన కలుగుతుంది.

నర్మదా తీరంలో ఓంకారేశ్వర్‌లో మా సంచులు పెట్టి నీటిలోకి వెళ్ళటానికి మావారు సందేహిస్తుంటే, “పర్వాలేదు వెళ్ళండి!” అని ధైర్యం చెప్పిన, సామాను అమ్ముతున్న ముసలి అవ్వ కాదా నర్మదామాయి???

నర్మదలో రెండోరోజు పడిపోతే సాయం చేసిన పరిక్రమవాసి కాదా నర్మదామాయి???

అంకలేశ్వర్‌లో మావారు తన మిత్రులను కలవటానికి ముందు వెళ్ళిపోయారు. నేను తరువాత గది బయటకు వచ్చాను.

బయట ఒక అమ్మాయి ఆ హాల్ తుడుస్తోంది. నేను బయటకొచ్చే సరికే ఆమె ఒక వైపు ఆ తుడిచేవి పెట్టి, నాతో పాటు లిఫ్ట్ లోకి వచ్చింది. చూడచక్కగా ఉందామె.

నేను మాస్కు పెట్టుకున్నా, దగ్గు రావటం ఆగదు కదా.

దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఆమెతో “జట్ థ్రోట్ ఇన్ఫెక్షన్…” అన్నా

ఆమె చిన్నగా నవ్వి “ఐ నో!!” అంది.

ఆమెకెలా తెలుసు??? అది ఉట్టి దగ్గు మాత్రమే అని, కరోనా కాదని?

ఆమెనా నర్మదామాయి??

నాకింత జబ్బుగా ఉంటే, నా ఆరోగ్యం, నా గురించి నేనే పట్టించుకోను… అలాంటిది కామేశ్వరిగారు నాకోసం ఎన్ని మందులు తెచ్చారు, ఎంత ప్రేమ చూపారావిడ. ఆమె నర్మదామాయి కాదా??

బరూచ్‌లో నర్మద దగ్గర నేను బట్టలు మార్చుకోవటానికి సాయంగా నా చుట్టూరా తన చీరలు అడ్డం నిలబెట్టిన స్త్రీలు కారా నర్మదామాయి???

నేను బొట్టు పెట్టిప్పుడు, గాజులు పంచినప్పుడు వాటిని స్వీకరించిన స్త్రీలలో ఎవ్వరు కారా నర్మదామాయి???

మేము నర్మదానది ఘాట్లలో మా దగ్గరకు వచ్చి తన పాము చూపి డబ్బు తీసుకున్న స్త్రీలలో ఎవరు నర్మదామాయినో??

అవధూత దర్శనం కలిగినప్పుడు, ఆ ప్రక్కనున్న అంధులైన ఆడపిల్లలలో లేదా మాయి?

అసలు ఆ అవధూతలో లేదా మాయి?

అమరకంటక్‌లో నా దగ్గర తన పిల్లలకు నోట్స్ కావాలని వచ్చి మరీ నోటుబుక్స్ తీసుకువెళ్ళిన స్త్రీమూర్తి నర్మదామాయి కాదా??

సీతెల్ఘాట్‌లో చెట్టుక్రింద ఉన్న వృద్ధురాలేమో?

మరుసటి ఉదయం నర్మదామాయిని ‘రాధేశ్యాం’ అంటూ పూజించిన స్త్రీమూర్తి, మా ఫోటోలు తీసిన ఆ తల్లి ప్రతిరోజు నర్మదకు వచ్చి నదిని పూజించి, ఆ నదిలో స్నానం చేసి, నదికి దీపంలో హారతి ఇచ్చి వెళతారట… ఆమెయే మరి మాయి.

ఆమె మా ఫోటోలు చాలా తీశారు.

ఎవరిలో వెతుక్కోవాలో అమ్మను.

ప్రహ్లాదుడు చెప్పినట్లు

ఇందుగలడందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే! అన్నట్లు, నర్మదామాయి చూడగలిగితే సర్వత్రా ఉంది కదూ.

కాబట్టి మాకు సర్వత్రా మాయి కనిపించింది. ప్రత్యేకంగా నేను నర్మదను అని మాత్రం ఎవ్వరు కనపడలేదు. గాలి వీచటం అన్న సహజ క్రియను అనుభవించగలం కానీ, చూపెట్టలేము, అలాగే అమ్మ ఉనికిని ఆణువణువూ అనుభవించాను. ఋజువులు చూపమంటే, ఆ చూసే మాంసనేత్రాలకు సాధనా పటిమ ఉన్నదా అన్నది ప్రశ్న!!!!

***

ఎవరు జన్మ పరంపరలనుంచి వైదొలగాలని ప్రయత్నం చేస్తారో వారు ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలి. జన్మసార్థకత కోసం జీవితాన్ని గడుపుతూ, సత్యాన్ని ఆరాధిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటారో వారు సాధకులు.

సాధన అంటే అజ్ఞానాన్ని వదిలించుకోవటమే. మరో మాటలో చెప్పాలంటే సాధించగలిగేది సాధన. అవిద్యయే అజ్ఞానం. అజ్ఞానము అంటే నీవు వేరు, నేను వేరు భావనే, దీనినే అవిద్య అని చెప్పవచ్చు.

అజ్ఞానాన్ని వదలాలంటే గురువు ద్వారా ఉపదేశం పొంది, దానిని శ్రవణ, మనన నిధిద్యాసలతో అభ్యాసం చెయ్యాలి.

అంతటా ఉన్నది ఒక్క చైతన్యం, చేతన, బ్రహ్మం అన్న విషయం తెలియటము ఆత్మ సాక్షాత్కారం. అదే ముక్తి!!

ఆ బ్రహ్మాన్ని లేదా సత్యాన్ని ఎరుకులోకి తెచ్చుకోవటానికి ఈ సాధన. ఈ సాధన అంత సులభం కాదు. దానికే శుద్ధమైన అంతఃకరణలు కావాలి.

అంతఃకరణల శుద్దికి ఉపయోగ పడే సాధనం భక్తియోగం, కర్మయోగం. ఈ రెండూ కలిసి తదనంతరం అవి సిద్ధించటానికి జ్ఞానయోగం సహయపడుతుంది. అందుకే ముందుగా నిత్యపూజతో మొదలవుతుంది సాధన.

గురువుకు శరణు వేడి, గురువుద్వారా ముందుకు సాగుతారు సాధకులు. దీనికి అర్హత కావాలా అంటే ‘పుట్టుకే సాధనకు అర్హత’ అని జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పింది.

మరి ఆ అర్హతతో పాటూ ఈ జన్మ గురించి సత్యం గ్రహించాలన్న పట్టుదల, పరమాత్మకై తపన ఉండాలి సాధకునికి.

సహజంగా జీవించటమే సాధన. మనం మన చుట్టూ రకరకాల పొరలు పెట్టుకొని జీవిస్తూ ఉంటాము. వాటిని వదిలించుకోవటమే మన ముఖ్య బాధ్యత. అదే సాధన. ఆ సాధన పరిపక్వత కలిగేది సాధకునికి మాత్రమే తెలుస్తుంది. నియమబద్ధమైన ఆహారం, ఆసనం, ప్రాణాయామము, ధ్యానం, నిత్యపూజ, మితనిద్ర, మొదలైనవి కొన్ని నియమాలు సాధకులు పాటిస్తారు.

వేదాంత గ్రంథాలు వినటం, చదవటం, పుణ్యక్షేత్ర దర్శనం కర్మ నాశనం చేసి సాధనను సుగమం చేస్తుంది.

సాధకులకు శ్రద్ధ, సహనం, మౌనం, పరమాత్మ అంటే విశ్వాసం, గురువంటే నమ్మకం ఉండాలి.

దృక్ దృశ్య వివేకం అలవాటు చేసుకోవాలి.

రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్తు మానసమ్‌

దృశ్యా ధీవృత్తయ స్సాక్షీ దృగేవ న తు దృశ్యతే॥

సాక్షీభూతంగా చూడటం అలవాటు చేసుకోవాలి. అలా చెయ్యటము వలన నెమ్మది మీద లోలోపల ఒక మౌనం అలవాటు అవుతుంది. మౌనం ధ్యానంలోకి దింపగలదు. సాధకులకు బహిర్ మౌనమెంత ప్రాధన్యమో, అంతర్మౌనం అంతకన్నా ముఖ్యం.

ఇది సాధనాచతుష్టయాలను సాధించటానికి సహయపడుతుంది. సహనం అలవాటు అవుతుంది. సహనం వలన శాంతం, శాంతం వలన మోక్షం సిద్ధిస్తాయి.

ఇదంతా అంత సులభమైన విషయం కాదు. సాధన, గురుకృప మీద ఆధారపడి ఉంటుంది.

వీటిలో ఇటువంటి యాత్రలు, సహజంగా జీవించటం మనకు గుర్తుచేస్తాయి. వీటి వలన సాధన గట్టి పడి, మనను ముందుకు నడిపిస్తుంది.

ఏది ఏమైనా ఈ పరిక్రమ యాత్ర జీవితాన్ని చూసే దృక్ఫథంలో మార్పును తెస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

నర్మద పరిక్రమ సూచనలు:

ఎక్కడ మొదలెట్టాలి? ఎలా కొనసాగించాలి? ఎక్కడ పూర్తి చెయ్యాలి? అని చాలా మందికి సందేహం వస్తుంది. అది సహజమే. ఈ విషయమే నన్ను చాలా మంది అడిగారు.

ఈ యాత్ర చెయ్యటానికి మొదటగా మీకు భక్తి చాలు. అసలు డబ్బు ముట్టుకోకుండా నడిచి ఈ యాత్ర చేసే భక్తులున్నారు. అది ఉత్తమమైనది. నడిచే శరీర స్థితి, సమయం ఉండి, మంచి సత్సంగం ఉంటే నడకనే అత్యుత్తమమైనది. యాత్ర మొత్తం కాకపోయిన కొంత దూరమైన నడుస్తారు భక్తులు. ఈ పరిక్రమ కొంతదూరం నడిచి, మిగిలిన దూరం వాహనంలో వెళతారు. కొందరు కొన్ని క్షేత్రాలు తిరిగి వెళ్ళిపోతారు. అందులో ఓంకారేశ్వర్, మహేశ్వర్, అమర్‌కంటక్, భరూచ్, నేమావర్ వంటివి దర్శించి నర్మదానది పరిక్రమ చేశామనటం కూడా వద్దు.

నా మటుకు నాకు పూర్తిగా ఒక్కసారన్నా తిరగటమే నచ్చింది. అదే పద్దతి కూడా. అందుకే నడక కుదరకపోతే మనం వాహనాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చాలా టూరిస్ట్ బస్సులు, వ్యానులు నడపబడుతున్నాయి. వాటి వివరాలు మనకు అంతర్జాలంలో దొరుకుతున్నాయి. మాకు బస్సులే కాక పదిహేను మందితో ఉన్న వ్యాన్‌లు కూడా కనపడ్డాయి. అమర్‌కంటక్‌లో మేము అలాంటి వ్యానులు చాలా చూశాము. వారంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. కొన్ని వాహనాలలో వచ్చినవారు ఒక చోట నుంచి కాకుండా వివిధ ప్రదేశాల నుంచి కలిసి వచ్చారట. వారు అమరకంటక్‌లో మేము అడగకపోయినా వారి వివరాలు చెప్పారు. వారంతా అమరకంటక్‌లో కలిసి, అక్కడ్నుంచి యాత్ర మొదలెట్టుకున్నారు. ఇలాంటి ట్రిప్ తీసుకుంటే మనకు పెద్దగా ఛాయిస్ ఉండదు. వారు తీసుకుపోయిన చోటుకు వెళ్ళాలి. వారు ఉంచిన చోట ఉండాలి. దాని ధర కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రకటనలు నేను ముఖపుస్తకం లోని నర్మదా సముహాలలో చూశాను.

అవి కాక మీరు స్వతంత్రంగా యాత్రను చెయ్యాలనుకునే వారి కోసం కొన్ని సూచనలు…

  • సొంత వాహనం ఉంటే మీరు ఆ వాహనానికి డ్రైవరును పెట్టుకోవటం బెటర్. దీని వలన మీరు మీ సాధన మీద దృష్టిని పూర్తిస్థాయిలో పెట్టవచ్చు. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తూ, యాత్ర పై దృష్టిని సారించడం ఇలా రెండు చెయ్యగల సవ్యసాచి అయితే మంచిదే.
  • మీ సమయం బట్టి ఈ యాత్ర చేస్తారు కదా! కావున మీరు చాలా త్వరగా చెయ్యాలి అని అనుకుంటే పద్నాలుగు రోజులు పడుతుంది. కాని కొంత నిదానంగా చేస్తేనే ఉత్తమం. అమరకంటక్‌లో కనీసం రెండు రోజులు, మహేశ్వరంలో మరో రెండు రోజులు ఉంటే బావుంటుంది. నదికి దగ్గరగా బస చేయటం ఉత్తమం. యాత్ర చేస్తున్న సమయంలో రోజు దాదాపుగా మూడువందల కిలోమీటర్ల ప్రయాణం చాలా బడలికగా ఉంటుంది. రోజు వంద లేదా నూటయాబై కిలోమీటర్ల ప్రయాణం చెయ్యటం ఉత్తమం. గుజరాత్‌లో ప్రయాణం కొంతే ఉన్నా, రోడ్లు బావున్నాయి కాబట్టి అటు వంటి చోట త్వరగా ప్రయాణించవచ్చు. కాని మధ్యప్రదేశ్‌లో రోడ్లు కొంత గంభీరంగా ఉన్నాయి, కాబట్టి అంత హడావుడిగా ప్రయాణించనక్కల్లేదు.
  • అమరకంటక్‌లో కాని, ఓంకారేశ్వర్‌లో కాని, మహేశ్వరంలో కాని, భరూచ్‌లో కాని యాత్ర మొదలుపెట్టవచ్చు. మీకున్న చోటుకి ఏది దగ్గరైతే దాని నుంచి మొదలుపెట్టవచ్చు. ఓంకారేశ్వర్‌ని ముందు దర్శించకపోతే, అక్కడ్నుంచి మొదలు పెట్టటం బెటర్, ఎందుకంటే మధ్యలో మీరు నదిని దాటలేరు కాబట్టి. వీలైనంత వరకు తప్పక చూడవలసిన దేవాలయాలతో పాటు ఆశ్రమాలను కూడా చూడగలిగితే బావుంటుంది. ఆశ్రమాలలో జరిగే భజనలలో పాల్గొనటం ఉత్తమం.
  • వెళ్ళిన చోట భక్తులను పలకరించి వారి కథనాలను సేకరించవచ్చు. కాని మౌనంగా యాత్ర చెయ్యటము మరి ఉత్తమోత్తమం. మౌనం వలన తమను తాము గమనించుకునే అవకాశం సాధకులకు వస్తుంది.
  • మధ్యప్రదేశ్ టూరిజం వసతిగృహాలు చాలా బావున్నాయి. వాటి ధర కూడా అందుబాటులోనే ఉంది. దారిలో చాలా చోట్ల మధ్యప్రదేశ్ టూరిజం వారి మిడ్వే బ్రేక్ అన్న భోజనశాలలు శుభ్రమైన భోజనం, రెస్టురూమ్లు అందిస్తున్నారు. అవి మరింతగా పెంచితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది వాహనదారులకు.
  • చాలా చోట్ల చిన్న చిన్న ఊర్లు, అసలు టీ హోటల్ కూడా లేనివి ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఉండని చోట్లు కూడా ఉంటాయి. మనం యాత్ర ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అలాంటి ఊర్లను దాటించేసుకోవటం ఉత్తమం. అవి గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులలో కనిపిస్తాయి.
  • మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యాత్రలో మోసం చేస్తారన్న భయం అక్కర్లేదు. చాలా ఊర్లలో పరిక్రమవాసులను ఎంతో గౌరవంగా, భక్తిగా చూస్తారు. కేవలం యాత్ర స్థలాలైన అమరకంటక్‌లో, ఓంకారేశ్వర్‌లో కొద్దిగా జాగ్రత్త అవసరము. అది కూడా వ్యాపారస్తుల నుంచి, పండాల నుంచి. ఇవి మనకు ఏ క్షేత్రంలోనైనా ఒకటే కాబట్టి వీటి గురించి జాగ్రత్త ఎప్పుడూ అవసరమే కదా.
  • ఇక వస్త్రధారణ, వస్త్రాల రంగు విషయంలో వారు చెప్పిన పద్ధతి పాటించటము మన కనీస బాధ్యతగా పరిగణించాలి.
  • నదిని దైవంగా కొలుస్తూ నదిలో చెత్త వెయ్యకుండా మంచి టూరిస్టులా ప్రవర్తిస్తే ఇంకా బావుంటుంది.
  • మన వద్ద ఉన్నది ఎంతగా వదిలించుకుంటే అంత ఉత్తమం. అందుకే దానం చెయ్యలన్న ప్రక్రియ పెట్టారు. దానంతో మనం మన అహంకారం కూడా ఇచ్చేయ్యాలి. సాటి వారి మీద మనకు కలిగే బాధ్యతతో కూడిన ప్రేమే పరమాత్మ తత్త్వం. ఆ విషయం మనసులో పెట్టుకుంటే, ఏదో మొక్కుబడిగా కాకుండా నియమాలను ఇష్టంగా అవలంబిస్తాం.

***

ముగింపు

ఈ యాత్ర మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసమన్న విషయం గుర్తుపెట్టుకుంటే, ఈ యాత్రలో వచ్చే ఇబ్బందులు మనలను ఎక్కువగా కష్టపెట్టవు. మనుషులు ఎంత నలిగితే అంతగా పురోగమిస్తారు, కాబట్టి ఈ యాత్ర సమయంలో వచ్చే అనుభవాలను, అడ్డంకులను వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగమనానికి సోపానాలుగా గుర్తిస్తే యాత్ర ఫలితం అద్భుతంగా ఉంటుంది.

ఆ మాటకొస్తే జీవితంలో వచ్చే ప్రతి అనుభవం వ్యక్తిగత పురోగతి కోసమన్న జ్ఞానం కలగాలి. అదే మానవ జన్మ పరిపక్వత. ఆ జ్ఞానం కలిగిన తరువాత కష్టసుఖాలకు అలజడి పడే మనస్సు శాంతిస్తుంది. మనసు శాంతి పొందితే, మౌనం అలవడుతుంది. ఆ మౌనమే ఆత్మను పరిచయం చేస్తుంది. ఇదే మన పెద్దలు స్థితప్రజ్ఞత అని చెప్పారు.

ఏ యాత్ర ఫలమైనా భౌతిక ఫలాపేక్ష లేకపోతే ఉత్తమం. అహంకారమన్న కారాన్ని వదిలేసే యత్నమే యాత్ర ఫలమని చెప్పాలి. ఎంత చంపినా తిరిగి లేచేదే అహం. ఆ అహన్ని అర్పణ చెయ్యటమే ఇటు వంటి యాత్రల పరమపథం. అందుకే అటువంటి నియమాలు ఇట్టి యాత్రలో ఉంటాయి.

మన డాబు, దర్పం వదిలేసి కేవలం సాధకులుగా, నర్మదామాయి భక్తులుగా యాత్ర చేస్తే ఫలితం తప్పక మహోన్నతంగా ఉంటుంది. మనకు రావలసినవి ఎలాగు రాక మానవు. లేనివి ఏం చేసినా రావు, కాబట్టి సాధకులు స్వఆత్మ మీదికి దృష్టి మరల్చటం ఉత్తమం. ఈ యాత్ర పేరుతో దూరాలు తిరగటం అంటే హృదయం లోలోన దాగిన ఆత్మను మరింతగా ఎరుకలోకి తెచ్చుకోవటానికే. ఎంతగా అంతర్ముఖమవుతే, అంతగా యాత్రఫలం సిద్ధిస్తుంది. ఇటువంటి యాత్రలు సాధకులకు తప్పక సహాయకారులు. దాని ఫలితం మనకు వెంటనే కనపడకపోయిన పారమార్థికమైనది సదా జత కూడుతూనే ఉంటుంది. ఈ యాత్ర చేశాక అనుకోకుండా ఎందరో ఆత్మదర్శులను దర్శించే అవకాశం కలిగింది.

వారు సాధనలో ముందుకు వెళ్ళటానికి తగిన సూచనలు ఇవ్వటం కూడా జరిగింది. అనుకోకుండా అందరు మహానుభావుల ఆశీస్సులు దొరకటం కేవలం నర్మదామాయి దీవెనలే తప్ప మరొకటి లేదు.

యాత్రలు చెయ్యటమన్నది సాధనలో భాగం కాబట్టి వాటిని ముక్తి కలిగే వరకు కొనసాగించటమే పద్ధతి. ముగింపు పలకాలి కాబట్టి యాత్రను ముగించినా, ఆ యాత్ర తాలుకు సుగంధం మా హృదయాలలో కస్తూరి సువాసనల మాదిరిగా గుబాళిస్తూనే ఉంది. ఆ యాత్ర మా జీవితాలలో మార్పు తెచ్చింది.

వ్యక్తిగతంగా, భౌతికంగా, పారమార్థంగా.

ఈ యాత్ర గురించి తెలుగువారికి తెలిసినది తక్కువ. ఈ నర్మదా పరిక్రమ యాత్ర మీద మనకు తెలుగులో లభ్యమవుతున్న సాహిత్యం కూడా చాలా అరుదు. నర్మదా తీరంలో నినసించే వారు కూడా “పరిక్రమనా? అదేంటి?” అని అడగటం మాకు తెలుసు.

మల్లాది గారి పుస్తకం ఉన్నా కూడా ఆ వివరం తెలిసిన వారు అరుదు.

ఈ గ్రంథం వలన నర్మద గురించి, నర్మద పరిక్రమ గురించి కొందరికైనా తెలిస్తే నర్మదా పరిక్రమ ఫలం లభించినట్లే కదా!

ఎంత మందికి వీలైతే అంత మందికి ఈ యాత్ర విషయాలు చేరవెయ్యాలనేది మా గురువాజ్ఞ కాబట్టి, పరమాత్మ కృపతో గురువనుగ్రహంతో ఇది గ్రంథస్తం చెయ్యబడింది.

ఎల్లరకు నర్మద కృప అందాలని జగదంబను ప్రార్థిస్తూ…

మంగళమ్ మహత్త్!!!

ఽఽ@@స్వస్తి@@ఽఽ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here