నమామి దేవి నర్మదే!! -2

4
10

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

[dropcap]మ[/dropcap]రో కథనం ప్రకారం పురూరవ చక్రవర్తి తపస్సు చేసి భూమి మీదకు నర్మదను తెచ్చాడని చెబుతారు. ఈ నదినే సోమోద్భవ (సోముడంటే శివుడికున్న పేర్లలో ఒకటి) మని, మేఖల కన్యక అని, రేవా అని కూడా పిలుస్తారు. రేవా అని మనకు నేటికీ ఈ నది పరివాహక ప్రాంతములో వినిపిస్తుంది. శంకర భగవత్పాదుల వారు తమ గురువైన గోవింద భగవద్పాదుల వారిని నర్మదానది తీరములోనే కలుసుకుంటారు. నర్మదా నది పవిత్రత గురించి చెబుతూ శంకరులవారు

అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం

తతస్తు జీవజంతుతంతు భుక్తిముక్తిదాయకం

విరించివిష్ణుశంకరస్వకీయధామవర్మదే

త్వదీయపాద పంకజం నమామి దేవి నర్మదే॥

బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను నీ తేజస్సుచే రక్షించు ఓ దేవీ నర్మదా! కనబడి కనబడని అనేక పాపములను పొగొట్టు ఆయుధము కలిగి, పాపుల బంధాలను త్రుంచి భుక్తిని, ముక్తిని ఇచ్చే నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను అంటూ నర్మదాష్టకములో పేర్కొన్నారు.

ఇంత పవిత్రమైన నదికి పరిక్రమణ లేదా ప్రదక్షిణ చెయ్యాలన్న కోరిక కలిగాక అది ఎలా తీరుతుంది అన్న ఆలోచనతో అన్వేషణ సాగింది.

నర్మదా పరిక్రమ మీద ఎన్నో పుస్తకాలు వచ్చినా చాలా మట్టుకు అవి మరాఠీలోనో, హిందీ లోనో ఉన్నాయి. ఒకటి రెండు ఇంగ్లీషులో ఉన్నాయి. మన తెలుగులో మల్లాది గారిది తప్ప మరొకటి లేదు. అంతర్జాలంలో ఉన్న బ్లాగ్‌లలో ఎన్నో బ్లాగ్‌లు వివరాలు ఇచ్చి ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలు, వీడియోలుగా చేసిన ట్రావెలాగ్‌లు ఉన్నాయి. వీటి నుంచి మనం సమాచారం సేకరించవచ్చు.

నర్మద పరిక్రమ ఉత్తర భారతీయులకు, అందునా పశ్చిమాన ఉన్న వారికి బాగా తెలిసిన అలవాటైన యాత్ర. చాలా మట్టుకు ఈ యాత్ర నడిచే చేస్తారు. నడవటానికి పట్టే సమయం దాదాపుగా నాలుగు నెలలు. కొందరు సాధు సన్యాసులు కొంత నడిచి, ఆశ్రమాలలో విశాంత్రి పొంది, తిరిగి కొంతకాలం నడిచి యాత్రను పూర్తిచేస్తారు. ఇలా చెయ్యటానికి దాదాపుగా సంవత్సరం పైన ఆరునెలల కాలం తీసుకుంటారు. సాధారణంగా సన్యాసులు చాతుర్మాసంలో యాత్ర చెయ్యరు. వారు ఆశ్రమాలలో ఉండి వారి జ్ఞానం పెంపొందించుకునేందుకు చదువుకుంటారు. ఇది వారి సాంప్రదాయం. మామూలుగా కూడా చాతుర్మాసంగా లెక్కకట్టే నాలుగు నెలలు ఎవ్వరూ నర్మదా పరిక్రమ చెయ్యరు. ఆ సమయం తప్ప, మిగిలిన కాలమంతా పరిక్రమ చేస్తారు భక్తులు.

పరిక్రమకే కాదు, అసలు సాధనకు ఏకాంతం ఉత్తమం. ఇద్దరు లేదా ముగ్గురితో కలిసి జట్టుగా సాగితే, వారంతా ఏక లక్ష్యం కలిగి, ఏకోన్ముఖులై ఉండాలి. లేకపోతే యాత్ర కష్టం. నర్మదా నది కొండలు, గుట్టలతో పాటు కీకారణ్యం గుండా ప్రవహిస్తుంది. అరణ్యంలో దారి తప్పే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనకు వారి భాష వచ్చి ఉండాలి. కనీసం హిందీ భాష రావాలి. నర్మదా పరిక్రమ నడకలో చెయ్యాలంటే దారిలో ఒక చోట మనం భిల్లులను ఎదుర్కోవాలి. ఆహారం కోసం చాలా మట్టుకు దారిలోని ఆశ్రమాలపైనా, పల్లె ప్రజల పైనా ఆధారపడాలి. ఎక్కడ చిన్న జాగా దొరికితే అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని సార్లు ఎలాంటి సౌకర్యం లేకపోతే చెట్టు క్రిందా, పుట్ట ప్రక్కనా ఉండాలి. త్రాగటానికి నర్మదా జలమే ఆసరా. శీతోష్ణాలకు, సుఖ దుఃఖాలకు వెరవకూడదు. కాని ఇలా చేసిన వారికి నర్మదామాయి కోరినది ఇస్తుంది. తుదకు మోక్షం కూడా…..

యాత్ర చేసినంత కాలము జుట్టు కత్తిరించరు పురుషులు. జోళ్ళు వాడరు. అలంకరణ జోలికి పోరు. కేవలం చందనం, కుంకుమ తప్ప మరొకటి వాడరు. తెల్లని వస్త్రాలనే ధరిస్తారు(సత్వ గుణం కోసం, ధర్మం పాటిస్తూ శుద్ధంగా జీవిస్తామని చెప్పటానికి తెల్లని వస్త్రం). ఒక జత వంటి మీద, ఒక జత చేతి సంచిలో ఉంచుకుంటారు.

ఈ వివరాలు మనకు ఇంటర్నెట్లో లభ్యం అవుతాయి. ముఖపుస్తకంలో కొన్ని సమూహాలు కూడా ఉన్నాయి. వారు నర్మదా పరిక్రమ గురించి వివరాలు ఇస్తూ ఉంటారు. ఆ పరిక్రమణ చేసేవారు, చెయ్యాలనుకునేవారితో కూడిన సమూహంలో మనకు సమాచారం లభ్యమవుతుంది. నాకు అర్థమయినంత వరకు నడుస్తూ యాత్ర చెయ్యటం ఉత్తమం. మోటారుపై యాత్ర మధ్యమం. ఏదో విధంగా ఈ శరీరముతో యాత్ర చెయ్యాలంటే మరి బస్సునో, కారునో ఆశ్రయించాలి.

ఈ వివరాలు తెలుసుకున్న తరువాత, ఆ సమూహాలలో నడిచి వెళ్ళే వారి కోసం ప్రయత్నించాను. కొందరు “ఫలానా రోజున బయలుదేరుతున్నాము రండి!!” అని ప్రకటించటం కూడా ఆ సమూహంలో చూశాను.

‘తెలుగువాళ్ళే బృందంగా వెడితే ఉత్తమమని తలచి, మనమే ప్రయత్నిస్తే పోలే…’ అన్న ఆలోచన కలిగి “ఎవరన్నా వస్తారా నడుద్దాం!!” అని ప్రశ్న కూడా ఒక సమూహంలో పెట్టాను.

చాలా మంది “ఆహా”, “ఓహో” అన్నారు. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు.

అది కరోనా కాలం. విమానాలు కూడా ఆగిపోయాయి. ఎక్కడి వారు అక్కడే బంధించబడ్డారు. కొంత కాలం గడిచినా ఈ నిబంధనలు సడలించటం లేదు.

ఒకతను తాను నడక ద్వారా బయలుదేరుతున్నానని సమూహంలో ప్రకటించినా నేను అందుకోలేకపోయాను. కారణం విమానాల రాకపోకలు లేనందున.

దానికి తోడు శ్రీవారితో ఈ విషయం మాట్లాడలేదు. ఇక భారతదేశంలో, అమెరికాలో కరోనా రెండవ దశ విలయతాండవం చేస్తుంటే మనసులో ఎటో అటు వెళ్ళి సాధన చెయ్యాలన్న ఆలోచనలు ఆపాల్సి వచ్చింది.

దానికి తోడు మా అమ్మాయి వ్యాక్సిన్ వచ్చిన తరువాత ఇండియా వెళ్ళాలని కండిషన్ పెట్టింది. దాంతో వ్యాక్సిన్ కోసం నా పడిగాపులు మొదలయ్యాయి.

చిన్న పిల్ల దానిని కాదని రావచ్చు, విమానాలు మొదలయ్యాక, కాని దానిని టెన్షన్ పెట్టడమెందుకన్న ఒక ఆలోచన.

శ్రీవారితో నేను నర్మదా పరిక్రమ నడిచి చెయ్యాలనుకుంటున్నానని ఒక రోజు చెప్పాను.

ఆయన ఆశ్చర్యపడి, దాని వివరాలు అడిగారు. అప్పటి వరకు సేకరించిన వివరాలు చెప్పాను. వారి మిత్రులలో ఒకరు అప్పటికే యాత్ర చేశారని తను చెప్పారు. కాని వారి మిత్రులు కారులో పరిక్రమ చేశారని వివరాలు చెప్పారు. నాకర్థమయినంత వరకు వారి మిత్రులు నర్మదా నదికి ఒక్కసారి కాక వివిధ సమయాలలో కారులో నది ఒడ్డున ఉన్న క్షేత్రాలు దర్శించారు.

ఇలా కాదని మొదలు పెట్టిన తరువాత చివరి వరకు సాగాలని మావారితో చెప్పాను.

“అలా తిరగటానికి ఎంత కాలం పడుతుంది?” అడిగారు నన్ను.

“బహుశా నాలుగు నెలలు”

“వాట్!!!… నాలుగు నెలలు నడుస్తావా? మరి ఇల్లు, మేము?”

“ఉంటారబ్బా…. మరి సాధన సాగాలిగా…”

“ఎవరన్నా తోడు ఉంటారా??”

“తోడు దొరకటం లేదు. కాని అమ్మవారే చూసుకుంటారులే…”

“చాల్లే!!! అడవులు గుట్టలలో నీ కుంటి కాళ్ళతో తిరుగుతావా?”

“అవును!”

“నీకెంత కాన్ఫిడెన్స్???…”

“ఆ విశ్వాసం నామీద కాదు… అమ్మవారి మీద..”

“అవ్వన్నీ నాకు తెలియదు. నీవు అంత దూరం అన్ని రోజులు మమ్మల్ని వదిలి నడుస్తానని వెళ్ళటం కుదరదు…”

“సాధనకు అడ్డం రానని మాటిచ్చారు…”

“అలాగని నాలుగేసి నెలలు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో? తెలియక మేము గుండె పగలకొట్టుకోవాలా?”

“అయితే మీరూ రండి. కలిసి యాత్ర చేద్దాం…”

“నాకు కుదరదు, అన్నేసి నెలలు ఉద్యోగం వదిలి తిరగటానికి!!”

“నాకు తెలియదు. నేను వెళ్ళటానికి నాకు అనుమతి కావాలి. చాలు. మిగిలినవి అన్నీ అమ్మే చూసుకుంటుంది…”

“కారులో వెళ్ళిరా…”

“నా ఒక్కదానికి కారా?”

“కాదంటే మీ అక్కనో, ఫ్రెండ్సును తీసుకుపో??…”

“అలా కుదరదు. అలా వెళ్ళలేము. అలా చెయ్యటానికి సమజోడు, గురువులో, మనతో కలసి సాధనలో నడవగలిగే వారితో సత్సాంగత్యంలో యాత్ర చెయ్యగలము…”

“నీవు నడిచి, ఎటో తిరుగుతూ ఉంటే నీ క్షేమం కోసం నేను టెన్షన్ పడుతూ ఉండలేను…”

“అందుకే మీరూ రండి. ఇద్దరం కలసి యాత్ర చేద్దాం…..

“కుదరదు…”

మా సంభాషణ ఇలా సాగుతూనే ఉండేది. ఎటూ తెగేది కాదు. కాని మనస్సులో మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను నర్మదా పరిక్రమ చెయ్యాలని. అది 2020 సంవత్సరంలో మనస్సులో కలిగిన సంకల్పం.

కాశీకి వెళ్ళాలంటే కాలభైరవున్ని ఆరాధించాలి. బదిరిలో ప్రవేశించాలంటే గంటాసురుని అనుమతి కావాలి.

మరి నర్మద పరిక్రమ చెయ్యాలంటే ఏం చెయ్యాలి?

ఎవరిని ప్రార్థించాలి?

ఆ నర్మదామాయినే ప్రార్థించాలి.

త్వదీయ పాద పంకజం- నమామి దేవి నర్మదే!!

***

సర్వ మంగళకరమైన మహాదేవుని ఆరాధన అని ఆలోచన కలిగింది. అందుకే ప్రతి ఉదయం ఏకరుద్రంతో మహాదేవునికి అభిషేకం, నర్మదా అష్టోత్తరం చెయ్యటం మొదలెట్టాను.

సామ్బో నః కులదైవతం పశుపతే సామ్బ త్వదీయా వయం

సామ్బం స్తౌమి సురాసురోరగగణాః సామ్బేన సన్తారితాః ।

సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజే

సామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥ (దశశ్లోకిస్తుతి – శంకరాచార్య విరచితం)

‘అమ్మా! జగదాంబ! నీవు సర్వ తీర్థాలవు, సర్వ నదులవు. కృపతో అనుమతినివ్వు. నీ పాదపంకజాలను సేవించి జీవితంలో, సాధనలో, ముందుకు నడవటానికి’ యని…..

కొన్ని రోజులు మహదేవుని సేవ చేసిన తరువాత ఒక పుణ్యతిథిన శ్రీవారు నర్మదా పరిక్రమకు కారులో వచ్చేందుకు సమ్మతించారు, ఎన్నో షరతుల మీద. ఈ విధమైన అంగీకారంతోపాటు, మహాదేవున్ని అర్పించితే కొన్ని రోజులకు పరిస్థితులు బాగుపడటం కూడా కనిపించింది. విమానపు రాకపోకలు కూడా మెదలయినాయి. ప్రపంచాన్ని కుదిపిన సూక్ష్మజీవిని కట్టడి చేసే మందు, టీకాల రూపేణ ప్రజలకు అందించటం మొదలయ్యింది.

అమెరికాలో టీకా సహజంగానే త్వరగా ప్రారంభమైయింది. వారిచ్చే వరుస క్రమంలో ఏ విధమైన(risk group) ప్రత్యేకతలు లేని మేము చివరకు పడ్డాము. ఎలాగోలా అంతవరకు ఎదురుచూసి, టీకాలు రెండు వేసుకోవటం కూడా జరిగింది.

ఇక ఇండియా వెళదాం, నర్మదానదిని దర్శిద్దాం.. అన్న తొందర కలిగింది. మేము ఈ పరిక్రమకు ఎలా వెళ్ళాలి?, ఎక్కడ కారు రెంట్ తీసుకోవాలన్న పరిశోధన మెదలుపెట్టాను. అది 2020 చివరాఖరున.

భారతదేశంలో యాత్రలకు సంబంధించిన కొన్ని కంపెనీలు వారు మన కోసం ఇచ్చే సౌకర్యాలు, యాత్రకు అయ్యే ఖర్చు ఇత్యాది కొన్ని ప్రకటనలు చూశాను. వారందరికి మెయిల్ పంపి వివరాలు కనుక్కున్నాను. ఈ నర్మదా యాత్ర విచిత్రమైయింది, అంటే ఒకే చోట మొదలు పెట్టి అక్కడే అంతం అని లేదు. నది తీరాన ఎక్కడైనా మొదలు పెట్టి, మొదలు పెట్టిన చోట పూర్తి చెయ్యటము ఇందులో ప్రథమ విధి.

అందుచేతనే ఎన్ని వీడియోలు చూసినా, ఎంత సమాచారం చదివినా ఎక్కడో కొంత కంగారు, కన్ఫ్యూజన్ వచ్చాయి. పద్నాలుగు రాత్రులు ఎక్కడ ఆగి, ఎక్కడ తిరిగి ఎక్కడ తేలాలి? వీటన్నింటికీ ఒక యాత్ర స్పెషల్ వారితో యాత్ర బుక్ చేసుకోవటమే మంచిదన్న తలంపు కలిగింది. అదే విషయం శ్రీవారితో చెబితే, ఆ యాత్ర ప్యాకేజ్ అందించే వారితో మాట్లాడదామన్నారు.

నాలుగు కంపెనీలను పరిశీలించి అందులో ఇద్దరు సమాధానాలు ఇచ్చాక, ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవటం జరిగింది. ఆ ఒక్కరు మనమడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానమివ్వటం, చూడాలనుకున్న ఆశ్రమాలను అనుసంధాన పరుస్తూ, యాత్రను నిర్మించటం, ఆంగ్లం మాట్లాడగలిగిన డ్రైవరును కుదర్చటం మొదలైనవి ముఖ్యమైనవి.

నా మట్టుకు నాకు ఈ యాత్ర అప్పటికే ఎంతో సుఖవంతమైన యాత్ర. నేను సాధనలో భాగం లగ్జరీలకు దూరంగా ఎంత వీలైతే అంతగా శరీరాన్ని కష్టపెడుతూ చెయ్యాలనుకుంటాను. అది యోగశాస్త్రం బట్టి సాధనలో మునుముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సాధన జీవునికి అంతర్ముఖమవ్వటానికి ఉపకరం. జీవిత సుఖాపేక్షకు కాదు, అందుకే ఒక యాత్రా బస్సులో వెళ్ళదామంటే శ్రీవారు ససేమిరా అన్నారు. వారి కారణం ఒకటే సమయం, రెండు శుభ్రం. ఆయనకు ఉన్న ఎలర్జీ వల్ల ఆయన కొంత శుభ్రమైన వాటినే కోరుకుంటారు. శుభ్రమైన పరిసరాలు, ఆహారం, హోటల్ గదులు ఇత్యాదివి. నేను ఇక పేచీ లేకుండా యాత్ర సంభవిస్తే చాలన్న భావనలో ఉన్నాను. అందుకే వారు కోరినవన్నీ ఇస్తామన్న ఇండియన్ హాలీడే వారి ప్యాకేజిను తీసుకున్నాము.

వారిస్తామన్న కారు కాదని శ్రీవారు తమకు అలవాటైన SUV తరహా వాహనం ఇన్నోవా కావాలన్నారు. బసకు ఏర్పాటు చేసే ప్రదేశాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు.

ఇండియన్ హాలిడే వారి మేనేజరు అన్నింటికి “సరే” అన్నారు.

ఆ ప్యాకేజీ తీసుకోవాలని మేము నిర్ణయించుకొనే సరికే మార్చి 2021 వచ్చేసింది. వారికి మేము ఆనాటి పరిస్థితులు సరి అయి విమానపు రాకపోకలు సవరించిన తరువాత ఇండియా వచ్చి యాత్ర చెయ్యగలమని చెప్పాము. వారు సరే అన్నారు. కాని ముందుగా మమ్ములని కన్ఫమ్ చేసి కొంత డబ్బు కట్టమన్నారు. శ్రీవారు “సరే” అని టూకీగా పదిహేను వేలు పంపించారు.

మా యాత్ర గురించి నమ్మకం కలిగి హృదయం తేలికైయింది. మా ప్రయాణం ఖరారు అయిందన్న నమ్మకం కలిగింది. ఇన్నాళ్ళ సందిగ్ధ అవస్థ పోయి ఇక యాత్ర మీద మనస్సు కేంద్రీకరిద్దామన్న తలపు కలిగింది. విఘ్నేశ్వరుని పెళ్ళికి వేయి విఘ్నాలని నానుడి. ఇంతలో మూడవ దఫా సూక్ష్మజీవి వస్తోంది అన్న ప్రచారం మొదలయ్యింది…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here