నమామి దేవి నర్మదే!! -3

7
13

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

[dropcap]“మ[/dropcap]న ప్రయాణం సాగదేమో?…” అన్నారు శ్రీవారు.

“ఎందుకు?” అన్నా లోలోపల భయంలో, కప్పిపుచ్చుతు.

“ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి…”

“అమెరికాలో కూడా అలాగే ఉంది చూడబోతే. ఇలాగే ఉంటుంది. అయినా మనం వ్యాక్సిన్ వేసుకున్నాముగా!!!”

“అయినా…మన జాగ్రత్త మనకుండాలి!!”

“ఇప్పుడేమంటారు?”

“చూద్దాం…”

అక్టోబర్‌లో వెళ్ళాలనుకున్నాము ముందు, కాని ఈ కరోనా మూడవ వేవ్ వల్ల మరో రెండు నెలలు వాయిదా వేసుకున్నాము.

“యాత్ర కుదరదేమో ఇలా ఉంటే” అన్నారొకనాడు మళ్ళీ.

“యాత్ర కుదురుతుంది. నీవు వస్తే కారులో…లేకపోతే నడక… ఆగవద్దు. అనుకున్నది చేద్దాం. మళ్ళీ మనకు ఎప్పటికీ కుదరదు ఇలా నీళ్ళు నములుతుంటే…”

“పరిస్థితులు బాగాలేకపోతేనూ?”

“ప్రపంచం ఇలానే ఉంటుంది ఇక. పూర్వంలా అవ్వాలనుకోవద్దు. ఇండియాలో అంతా మాములుగా తిరుగుతున్నారట కూడా…”

“తిరుగుతారులే వాళ్ళు. మన జాగ్రత్త మనదిగా!…”

“మనం మన జాగ్రత్తలో మనం ఉందాం. హోం టెస్టు కిట్లు తీసుకువెళదాం. మందులు వాడుదాం. మాస్కులు వాడుదాం. ఏదైనా సరే యాత్ర మాత్రం అనుకున్నట్లుగా ఉంటుంది…” స్థిరంగా చెప్పాను.

ఈ ప్యాకేజీలో పదిహేను రోజులకు ముందు పూర్తిగా డబ్బు చెల్లించాలి. అలా కాని పక్షంలో యాత్ర తేదీలు వారు ఖరారు చెయ్యలేరు. మేముండాల్సిన బసను సిద్ధం చెయ్యలేరు.

వచ్చే ముందే అంటే, రేపు బయలుదేరుతున్నాము ఇండియా అన్న రోజున, వాళ్ళకివ్వవలసిన పూర్తి పైకం కట్టేశాము.

ఇక యాత్ర చెయ్యాల్సిందే.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

మొత్తానికి డిసెంబర్ రెండవ వారం మధ్యన మేము పవిత్ర భారతదేశానికి రాగలిగాము.

వచ్చిన వారం రోజులు ఎవ్వరిని కలవక హోం క్వారెంటైన్ చేశాము. ఆరో నాటికి కరోనా పరీక్ష చేయించుకొన్నాము. చుట్టాల ఇంట్లో పెళ్ళి చూసుకొని, వైజాగ్ వెళ్ళాము, ముందుగా అనుకున్న కార్యక్రమం కోసము.

వైజాగ్‌లో హోటల్‌లో మంచి నీరనుకోని బాటిల్ లో  ఉన్న పంపు నీరు త్రాగేశాను, వెంటనే నాకు గొంతు పట్టి, బొంగురు పోయి, ఆరోగ్యం పాడయింది. విపరీతమైన డయేరియాతో, గొంతు ఎలర్జీ.

మా యాత్రకు ఒక్క రోజు ముందు పరిస్థితి ఆందోళనగా మారింది.

దాంతో కొంత కంగారు కలిగింది. పరిస్థితుల బట్టి అసలు మాములు రోగానికి, కరోనాకు తేడా తెలియక ఇబ్బంది పడతామని.

అందుకే వైజాగు నుంచి రాగానే మేము తెచ్చుకున్న కిట్‌తో టెస్టు చేసుకున్నా. రిజల్ట్ నెగిటివ్.

మేము ఇక పన్నెండు గంటలలో యాత్రకు బయలుదేరుతామంటే అప్పుడు మాకు టూర్ అరెంజ్ చేసిన వారి వద్ద నుంచి మేము ఉండే ప్రదేశాల వివరాలు, చూడబోయే ప్రదేశాల వివరాలు, కారు నంబరు, డ్రైవరు వివరాలు ఇత్యాదివి పంపారు. వాటిని ప్రింట్ తీసి పెట్టారు శ్రీవారు. ఆ ప్యాకేజ్‌ను రోజు చదివి బట్టీ పట్టాను ఈ ప్రయాణంలో.

హైదరాబాద్ వచ్చి ముందుగా ఏర్పాటు చేసుకున్న సామాను ఇద్దరం చెరో పెట్టెలో సర్దుకున్నాము.

విమానంలో తీసుకువెళ్ళే సామాను బరువుపై నిబంధన అనే కాక, మాకు మేము ఎంత తక్కువ వీలైతే అంత తక్కువలో ఉండాలన్న సంకల్పం. ఈ యాత్ర మా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడపటానికి, ఈ మెటీరియల్ జీవితం నుంచి విరామానికి అన్న స్పృహ ఇద్దరిలో ఉన్నందున, మేము మా వెంట తీసుకుపోయే సామాను చాలా మితంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాము.

మా యాత్ర కాలం పదహారు రోజులు.

ముందుగా సిద్ధం చేసుకున్న తెల్లని చుడీదార్లు రెండు జతలు, (సత్వ గుణం కోసం, ధర్మం పాటిస్తూ శుద్ధంగా జీవిస్తామని చెప్పటానికి తెల్లని వస్త్రం) మాములువి రెండు, మడి చీర ఒకటి, మాములు చీరలు రెండు. దేవాలయాలకి చీరతో వెళ్ళాలనే నిబంధనను అనుసరించి అలా సర్దుకున్నాను. శ్రీవారు తన భారతీయ వస్త్రధారణ (పంచలు, కుర్తాలు) మూడు సెట్లు తెచ్చుకున్నారు. చెరో దుప్పటి, నాకు కప్పుకోవడానికి శాలువా,ఆయనకి మరో దుప్పటి సర్దుకున్నాము.

యాత్రలో పారాయణానికి నేను సుందరకాండ సిద్ధం చేసుకున్నాను. యాత్ర రోజులలో ప్రయాణంలో ‘సుందరాకాండ’ పారాయణం మొదలు పెట్టి చివరినాటి పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో. శ్రీవారు ‘యోగ వాశిష్టము’ చదుకుంటానని అది తెచ్చుకున్నారు. మా రోజు వారి కాలకృత్యాల సరుకులు. ఇవి కాక పుణ్యస్థలాలలో పారాయణ చేసేందుకు నా పారాయణ గ్రంథం అయిన దేవిసప్తశతి, దీపంకుందు, పసుపు, కుంకుమ, చందనము, వత్తులు, అక్షింతలు ఉన్న చిన్న డబ్బా, హారతికి కర్పూరము, ఏకహారతి, గంట, పంచపాత్ర, అరివేణం, జపమాల, ఆసనం ఇత్యాది సామాను దేవతార్చనకు సర్దుకున్నాను. రోజు విశేషాలు రాసుకోవటానికి నా ఐప్యాడ్ తెచ్చుకున్నాను. శ్రీవారు నోట్ బుక్, పెన్ను పెట్టుకున్నారు. ఇద్దరివి పాస్పోర్ట్ లను, OCI (Overseas citizen of India) అందుబాటులో పెట్టుకున్నాము.

వ్యాక్సిన్ వేయించుకున్న కార్డ్, ఆధార్ కార్డ్ కూడా మా వద్ద ఉంచుకున్నాము.

ఇండియాలో చాలా వరకు ఆధార్ మా ఫోటో ఐడిగా చూపాము. పాస్‌పోర్టు ఎవ్వరు అడగలేదు.

శ్రీవారిని తన లాప్‌టాప్  తేవద్దని కోరాను. అక్కడకొచ్చి కూడా, ఇంకా ఈ భౌతిక వ్యవహారాలు లావాదేవీలు వద్దని, వీటిని ఈ పదిహేను రోజులు వదిలెయ్యాలని కోరితే, ఆయన సరేనని లాప్‌టాప్ లేకుండా ప్రయాణమయ్యారు.

సోషల్ మీడియాను వదిలేసి, ఫోనుల మీద కాక ధ్యానం, జపం మీద మనసు పెట్టి పరిక్రమ చెయ్యాలన్న గట్టి సంకల్పంతో ఉన్నాము. అమ్మాయి శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది. ప్రతిరోజు మాట్లాడాలని పట్టు పట్టింది. పైగా అక్కయ్య వాళ్ళు వివరాలు చెప్పకపోయినా కనీసం వాట్సాప్ స్టేటస్‌లో ఫోటోలు పెట్టమని కోరారు. ఇండియాలో వాట్సాప్ సేట్టస్ బాగా చూస్తారని అప్పుడే అర్థమయింది.

మా దగ్గర రెడీ క్యాష్ ఎక్కువగా పెట్టుకోలేదు.

ఎక్కడికక్కడ ఏటిఎమ్‌లు ఉన్నాయి కదా అని, పైపెచ్చు ఇప్పుడు ఇండియాలో గూగుల్ పే ఎక్కువ వాడుతున్నారు.

నర్మదా పరిక్రమ” అని హిందీలో రాసిన బ్యానర్ ఒకటి సిద్ధం చేయించి పెట్టుకున్నాను. అది కూడా మాతో పాటు తీసుకుపోయాము. ఆ బ్యానర్ మాకెంతో ఉపయోగపడిందీ పరిక్రమలో.

మాతో పాటు కెమెరా తీసుకుపోలేదు. ఫోనులోనే ఫోటోలను తీసుకున్నాము. ఐఫోన్ ఫోటోలు చాలని అనుకున్నాము మేము. కాని మంచి కెమెరా తీసుకుపోయి ఉంటే ఫోటోల మీద శ్రద్ద పెట్టేవాళ్ళమేమో?. అదో బంధమని అనిపించి వదిలెయ్యటం జరిగింది.

కొన్ని ఎమర్జెన్సీ మందులు కూడా ప్యాక్ చేసుకున్నాము. అన్ని ఒక చిన్న పెట్టలోకి వచ్చేశాయి.

ఇద్దరం చెరో పెట్టెతో సిద్దమయ్యాము.

మేము హైదరాబాద్ నుంచి ముందుగా ఇండోర్‌కి విమాన మార్గంలో వెళ్ళి, అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మా యాత్ర చెయ్యాలని నిర్ణయించుకున్నాము. అందుకని మేము హైదరాబాద్ నుంచి ఇండోర్‌కు  విమాన టికెట్లను కొనుక్కున్నాము.

ఇండోర్‌కు హైదరాబాద్ నుంచి తెల్లవారు జామున ఐదుకు ఒకటి, సాయంత్రం మరోటి. ఉదయం ఫ్లైట్ అయితే మంచిదన్న భావనతో ఉదయం విమానం ఖరారు చేసుకున్నాము.

వైజాగ్ నుంచి ఆ ముందురోజు రాత్రి వచ్చి, నాతో ఉన్న మిత్రులను దింపి ఇంటికి చేరేసరికే శనివారం అర్ధరాత్రి ఒకటి. తరువాతి రోజు అంటే, ఆదివారం నాడు పెట్టెలతో సర్దుకోవటం, చివరి నిముషం హడావిడి, ఆరోగ్యం పాడై నేనూ…

“నమశ్శివాయ సాంబాయ సగణాయ ససూనవే

కైలాసాచల వాసాయ మహాదేవాయ శంభవే॥”మహాదేవుని మదిలో ప్రార్థిస్తూనే ఉన్నాను.

మా విమానం సోమవారం ఉదయం ఐదు గంటలకు, ఆ విమానం అందుకోవాలంటే ఇంటి నుంచి ఉదయం మూడింటికి బయలుదేరాలి. మేము తెల్లారక మునుపే లేచి రెండున్నర కల్లా స్నానాదులు ముగించి బయలుదేరాలనుకున్నాము. కాని ఆ రాత్రి నా ఆరోగ్యం బాగులేక నేను వంటిగంట వరకు పడుకోలేక పోయాను. పైపెచ్చు హృదయం లోలోపల మాటలకందని ఆందోళన, ఉత్సుకత… ఎలా సాగుతుందో అని భయం. ఆ రాత్రి ఒక గంట నిద్రపోయి ఉంటాను మొత్తం మీద. అనుకున్నట్లుగా తెల్లారి మూడు గంటలకు ముందుగా బుక్ చేసుకున్న కారులో హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం బయలుదేరాము. ఉదయం పావు తక్కువ నాలుగుకల్లా విమానాశ్రయం చేరాము. ముందు రోజే వెబ్ చెకిన్ చేశాము కాబట్టి, ఆ రోజు పెట్టెలతో ఇచ్చెయ్యటమే. బ్యాగులు ఇచ్చి, సెక్యూరిటీ చెక్ తదనంతరం, గేటు వద్దకు వెళ్ళిపోయాము.

మేము ప్రయాణించేది ‘ఇండిగో’ వారి విమానం.

డొమెస్టిక్ ట్రావెల్ కు వాడే విమానాలు కొన్ని పరమ చిన్న విమానాలు. చార్టర్డ్ విమానాలలా ఉంటాయి. చిన్న పట్టణాలకు ఆ విమానాలు వాడుతారనుకుంటా. ఈ ఇండిగో వారి విమానం చాలా చిన్న విమానం. మొత్తం ప్రయాణికులు యాభై మందికి మించి పట్టరు అందులో. వేగం కూడా తక్కువ. నెమ్మదిగా వెళుతుంది. మాములు విమానాలంత ఎత్తుకు కూడా వెళ్ళదనుకుంటా. ఆ రోజు విమానంలో ఎక్కువ మంది లేరు.

మేము ఫలహారం కూడా బుక్ చేసుకున్నందుకు మాకు విమానంలో స్నాక్స్ ఇచ్చారు. మేము కేవలం డ్రైప్రూట్స్ తీసుకున్నాము. హైదరాబాద్ నుంచి ఐదున్నరకు బయలుదేరి రెండున్నర గంటల తరువాత అంటే దాదాపు ఎనిమిది గంటలకి ఇండోర్ కు చేర్చింది.

శ్రీవారు అంతకు ముందే మమ్ములను తీసుకువెళ్ళే డ్రైవరుతో మాట్లాడారు. మేము చేరుకునే సమయం గురించి వివరాలు ఇచ్చారు.  విమానం ఆగగానే శ్రీవారు ఆ డ్రైవరుకు ఫోన్ చేసి, అతను వచ్చాడని రూఢి చేసుకున్నారు. ఆ ఉదయం సూర్యోదయపు వేళ మేము ఇండోర్ అహల్యాబాయి హోల్కర్ విమానశ్రయంలోకి నడిచి, మా పెట్టెలను తీసుకున్నాము.

ఇండోర్‌ను ఏలిన హోల్కర్ రాజవంశీయులలో ‘కర్మయోగి రాజమాత శ్రీమతి అహల్యాబాయి’ ఎంతో ప్రసిద్ధురాలు. ఆమె ఇండోర్ రాజ్యాన్ని ముప్పై ఏళ్ళు ప్రజారంజకంగా పరిపాలించిన స్త్రీమూర్తి. కర్మయోగినిగా, రాజయోగినిగా పేరుగాంచిన ఆమె గురించి యూరోపియన్లు, ఆంగ్లేయులు కూడా ప్రస్తుతించారు. కాని మన దురదృష్టము ఏమంటే చరిత్ర పుస్తకాలలో మనం వీరి గురించి తెలుసుకోలేము. చరిత్ర విద్యార్థినైన నేను ఆమె గురించి చరిత్రలో చదివినది శూన్యం. (ఆమె గురించి వివరాలు నా యాత్రలో భాగమైన మహేశ్వరం గురించి ప్రస్థావించినప్పుడు సోదాహరణంగా వివరించగలను-రచయిత్రి) విమానాశ్రయానికి ఆ తల్లి పేరు పెట్టడం కూడా చాలా నచ్చింది. మనకు తెలుగు రాష్ట్రాలలో నాయకులు, వీరులు కరువైనట్లు అన్నింటికి గాంధీ కుటుంబాల పేరుతో పీడిస్తారు. అదో పరమ చీదరగా ఉంటుంది నాకు. మన నాయకులను మనము తలుచుకోకపోతే ఎవరు తలుచుకుంటారు? కొంత ఆత్మగౌరవం నిలబెట్టుకోవటం తెలుగువారు ఎప్పుడు తెలుసుకుంటారో? ఇత్యాది ఆలోచనలు ఆ విమానాశ్రయం చూసాక కలిగాయి. విమానాశ్రయంలో ఆమె నిలువెత్తు చిత్రపటంతో అలంకరణ ఉంది. అది చూడగానే హృదయం పొంగి ఆ తల్లి మీద భక్తి మెండయింది.

మేము విమానశ్రయం నుండి బయటకు వచ్చే సరికే మా కోసం ఇన్నోవాతో  సిద్దంగా ఉన్నాడు అనిల్ అన్న పేరున్న డ్రైవరు. అలా ఇండిగో విమానంలో ఇండోర్ వచ్చి ఇన్నోవా ఎక్కి మా యాత్రను మొదలుపెట్టాము.

“శంభో మహాదేవ దేవ। శివ శంభో మహాదేవ దేవేశ శంభో॥

శంభో మహాదేవ దేవ। శివ శంభో మహాదేవ దేవేశ శంభో॥” అంటూ మార్గబంధు స్తోత్రం తలుచుకున్నాను. అప్పయ్య దీక్షితులు రచించిన ఈ స్తోత్రం మన ప్రయాణంలో కలిగే విఘ్నాలు తొలగిస్తుంది.

ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే హేమంత ఋతువు చల్లదనం శరీరాలకు చల్లగా తోచి హాయినిచ్చింది. హృదయపు ఆందోళన తగ్గి, యాత్ర గురించి ఆలోచన మొదలయింది. ఇండోర్ అందమైన నగరం. ప్రస్తుత కాలం భారతదేశంలోని రెండవ శ్రేణి నగరాలలో ఉత్తమమైనదిగా, శుభ్రమైనదిగా దానికి ఎంతో పేరుంది. చక్కటి దేవాలయాలు, రాజ భవనాలలతో చూడటానికి ఎన్నో ఆకర్షణలు ఉన్న నగరం అది. మెట్రో నిర్మాణం జరుగుతోంది నగరంలో. అయినా దుమ్ము ధూళి ట్రాఫిక్ ఇబ్బంది లేదు. సాఫీగా సజావుగా మేము నగరం మధ్యగా ఉన్న చక్కటి మార్గం మీదుగా ఓంకారేశ్వరం వైపుకు సాగాము.  అలా ఆ ప్లవ సంవత్సర మార్గశిర మాస సోమవారం నాడు (డిసెంబరు 27,2021) మా అదృష్టాల పంటగా మేము మా పవిత్ర నర్మదా యాత్రకై ఓంకారేశ్వరంలో అడుగు పెట్టాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here