నమామి దేవి నర్మదే!!-7

1
15

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

నాలుగవ రోజు

[dropcap]అం[/dropcap]క్లేశ్వర్ దగ్గర నర్మదానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంక్లేశ్వర్ వద్ద దాదాపు సముద్రం బ్యాక్ వాటర్ అంటారు. అక్కడే నర్మద మీద గోల్డెన్ బ్రిడ్జ్ కట్టారు ప్రభుత్వంవారు పరిక్రమవాసులకు వీలుగా. కొందరు ఆ బ్రిడ్జ్ దాటటానికి ఇష్టపడరు. ఆ బ్రిడ్జ్ మీదుగా వెళితే నర్మదను దాటినట్లే అనే సంప్రదాయవాదులు కూడా ఉన్నారు. వారంతా అంక్లేశ్వర్ వద్ద బోట్ తీసుకొని, తీరం వెంట ప్రయాణించి, సముద్రంలోకి వెళ్ళి అటు తీరం వైపుకు సాగుతారు. ఈ మొత్తం కార్యక్రమానికి సమయం దాదాపు ఐదు గంటలు పడుతుంది. అందుకనే అంక్లేశ్వర్‌లో నదీతీరానికి ఉదయం నాలుగు గంటలకు చేరాలి. ఐదుకు మనకు బోట్ మొదలవుతుంది. దాదాపు ఉదయం పదికి మనలను ఆవలి తీరం చేరుస్తారు. బోట్ టికెట్లు కూడా ముందుగా కొనవలసి ఉంటుంది. మా ఆరోగ్య దృష్ట్యా మావారి కున్న సముద్ర సిక్నెస్ వలన మేము అంక్లేశ్వర్‌లో బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వాహనాలలో ప్రయాణించేవారు ఆ బ్రిడ్జ్ వాడుతున్నారని, నేను సేకరించిన వివరాలు చెబుతున్నాయి. అందుకనే మేము ఉదయం ఏడు గంటలకు బయలుదేరి అంక్లేశ్వర్ నుంచి గోల్డెన్ బ్రిడ్జ్ మీదుగా బరూచ్ చేరుకున్నాము.

బరూచ్

బరూచ్ చిన్న పట్టణం. పూర్వకాలము నుంచి ఉన్న పట్టణమిది. రేపు పట్టణమైన ఈ ఊరు పూర్వం ఎంతో ప్రముఖమైనది.

పురాణాల బట్టి చూస్తే భృగు మహర్షి ఈ ప్రదేశంలో నివసించాడు. ఆయన ఆశ్రమం ఇక్కడ నిర్మించబడి ఉంది. ఆయన పేరు మీద ఈ ప్రదేశాన్ని ‘భృగుకచ్చా’ అని పిలిచేవారు. అదే కాలక్రమంగా ‘బరూచ్’ అన్న పేరు వచ్చింది. ఈ భృగు మహర్షి ఎంతో తపఃసంపన్నుడు.

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్

యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః ( భగవద్గీత)

మహర్షులలో నేను భృగువును; మాటలలో ఓంకారాన్ని; యజ్ఞాలలో జపయజ్ఞాన్ని అని భగవానుడు గీతలో చెబుతాడు.

ఈ ఋషి పాదంలో ఒక కన్ను ఉంటుందట. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో పరీక్ష చెయ్యమని దేవతలు ఈ ఋషిని కోరుకుంటారు. ఈయన బ్రహ్మలోకం వెళ్ళి, బ్రహ్మకు దేవాలయాలు లేకుండా ఉండాలని శాపం ఇస్తాడు. తదనంతరం కైలాసంలో మహాదేవుని చూసి ఆయనకు లింగరూపంగా మాత్రమే పూజలందుకోవాలని శాపమిచ్చి, వైకుంఠం వెళతాడు. విష్ణువు ఈయన కన్ను నలిపి గర్వభంగం కలిగించాడు. తదనంతరం ఈ ఋషి బరూచ్‌లో తపస్సు చేసుకున్నాడుట. ఇది పురాణ కథనం. ఈ పట్టణము పురాతనమైనది. భారతదేశంలో ఉన్న పురాతనమైన నగరాల సాటిగా ఈ పట్టణము కూడా పేర్కొనబడింది. జనవాసంతో ఎప్పుడు కళకళలాడుతున్న పట్టణాలలో ఇది ఉంది. కాశీ పట్టణం తరువాత పురాతనమైన పట్టణం ఇదే.

ఈ పట్టణం ఎందరో మహానుభావులకు జన్మస్థలం కూడా. కృష్ణభక్తులలో శ్రీకృష్ణ పంత్ ఈ ప్రదేశము వారే. జైన తీర్థంకరులలో ఇరువయ్యో తీర్థంకరుడు బరూచ్ నుంచి వచ్చినవారు. అందుకని ఈ పట్టణము జైనులకు కూడా చాలా ముఖ్యమైనది.

గ్రీకులకు, రోమన్ పాలకులకు తెలుసు ఈ రేవు పట్టణం. క్రీస్తుపూర్వం కూడా ఈ రేపు పట్టణం ఉంది. ఎంతో ప్రముఖమైనదిగా కూడా పేరుపొందింది. మొదటి శతాబ్దంలో ఈ పట్టణం ఎంతో సుసంపన్నంగా ఉండేది. ఈ పట్టణానికి నహపాణుడు రాజుగా ఉండేవాడు ఆ సమయంలో శకులు గుజరాత్ లోకి ప్రవేశించినప్పుడు ఈ నగరాన్ని కూడ జయించారు. గ్రీకుల నాణెలు ఇక్కడ చలామణి అయ్యేవి ఆ సమయంలో. మౌర్యులకు, గుప్తులకు, చండాలా రాజుల రాజ్యంలో ఈ పట్టణం ఎంతో పేరుపొందింది. అరబ్బులు ఈ రేవు పట్టణం ద్వారా భారతదేశంతో వ్యాపారం చేసేవారు. తదనంతరం రాజపుత్రులు ఆధీనంలో ఈ పట్టణం ఉండేది. మారాఠీలు ఈ పట్టణాన్ని ఎన్నో సార్లు జయించి ధనం తీసుకున్నారని చరిత్ర చెబుతుంది. ఇలా చూస్తే రేపు పట్టణంగా సుసంపన్నమైన ఈ పట్టణం ఎందరో రాజుల పరిపాలన చూసింది.

పోర్చుగీసులు కూడా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. జహంగీర్ పరిపాలనలో బ్రిటీష్ వారు ఈ పట్టణంలో తమ కార్యాలయాన్ని నిర్మించారు.

బొంబాయిని రేపు పట్టణంగా అభివృద్ధి చేసే వరకు ఈ రేవు పట్టణం ఎంతో ప్రాముఖ్యతను చూసింది. తదనంతరం ఈ పట్టణం స్థానం బొంబాయి తీసుకుంది.

ఈ పట్టణంలో నర్మదా నదిలో ఎన్నో పవిత్రమైన నదుల కలుస్తాయని నమ్మకం. ఇక్కడ నర్మద చాలా పవిత్రమైనదిగా తలుస్తారు సాధకులు. గంగ కన్నా నర్మద చాలా పవిత్రంగా ఉంటుందట!!!. ఎందరో పాపులు గంగలో మునిగి తమ పాపం కడుక్కుంటారు. గంగామాత ఆ పాపమంతా నర్మదలో స్నానం చెయ్యటము వలన కడుక్కుంటుదని మన పురాణాలు చెబుతాయి. అంత పవిత్రమైన నర్మదా నదిలో సర్వ నదుల సారం వచ్చి కలుస్తుందట ఈ బరూచ్లో, అంత పవిత్రమైనదీ తీరం.

ఇది మొత్తం యాత్రలో ముఖ్యమైన ఘాట్ కూడా. బరూచ్లో చూడటానికి గొప్ప దేవాలయాలు ఉన్నాయి. అన్ని వరుసగా ఉంటాయి కూడా. గోల్డెన్ బ్రిడ్జ్ దిగి మా కారు కుడి వైపుకు తిరిగింది. ఎడమ వైపున భృగు మహర్షి ఆశ్రమం ఉంది.

***

నీలకంఠేశ్వరాలయం

మా కారు నీలకంఠేశ్వరాలయం ప్రాంగణంలోకి ప్రవేశించింది.

నీలకంఠుడంటే విషాన్ని దిగమింగిన మృత్యుంజయుడు, శాశ్వతుడు అయిన మహాదేవుడు చాటిన లీల. అందరు పాల సముద్రం నుంచి వచ్చిన రకరకాల వస్తువులు తీసుకుంటే పరమేశ్వరుడు మాత్రం విషాన్ని స్వీకరించాడు.

లోకేశ్వరుడు భోగాలు కాకుండా త్యాగాలలో ముందున్నాడు. పాలకుల లక్షణాన్ని చాటుకున్నాడు ప్రభువిక్కడ.

ఆయన విషాన్ని, అమృతాన్ని ఒకేలా చూడగల యోగీశ్వరుడు.

ఈ నీలకంఠుడిని సేవిస్తే రోగాలు పోతాయట. పరమేశ్వరుని సేవిస్తే భవరోగమూ పోతుంది.

శ్రీ బసవరాజు రచించిన ‘బసవరాజీయం’లో నీలకంఠుడి గురించి చెబుతాడు.

“శ్రీ నీలకంఠంభుజగేంద్ర భూషం నాగాజినం రాజకళాకలాపమ్।

గౌరీశ్వరం దేవ మునీంద్ర సేవ్యం దేవంభజే శ్రీ గిరిజానాథమ్॥

కృత్తి వాసం పురారాతి మంధకాసుర భంజనమ్।

భర్గం శైలసుతాధీశం నీలకంఠ మహంభజే॥”

పార్వతీపతి అయిన నీలకంఠుడిని నేను భజిస్తున్నాను అంటూ 25 శ్లోకాలుగా ఇవి సాగుతాయి. ఈ నీలకంఠుని సేవించుకుంటే సర్వరోగాలు పోయి సత్వర ఆరోగ్యం దొరుకుతాయట.

నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నర్మదా తీరంలో ఉన్న దేవాలయాలలో పురాతనమైనది. తప్పక దర్శించ వలసిన దేవాలయాలలో కూడా ఒకటి.

కొందరు తమ పరిక్రమను ఇక్కడ్నుంచి కూడా మొదలెట్టటం కద్దు. ఈ దేవాలయాన్ని కట్టినదే ఎవరో మనకు వివరాలు తెలియవు. కానీ యుగయుగాలుగా ఇక్కడ ఈ దేవాలయం ఉందని చెబుతారు. ఈ దేవాలయం గురించి కథలు రకరకాలుగా వినిపిస్తాయి. ఈ దేవాలయం ఉన్న చోటనే మునుపు దేవదానవులు కలిసి సముద్రమథనం చేస్తే, పుట్టిన హాలాహలాన్ని శివుడు త్రాగినాడట. ఏ కాలకూటం త్రాగిన తరువాత మహాదేవుని ఖంఠం నీలంరంగుకు మారిందో ఆ గుర్తుగా ఇక్కడ నీలకంఠేశ్వర దేవాలయం నిర్మితమైందిట.

ఆ దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఆ ప్రాంగణములో ఒక వైపు ఆశ్రమాలు ఉన్నాయి. పరిక్రమ చేసే పరిక్రమవాసులకు వారు ఆశ్రయం కలిగిస్తారు. ఒక ప్రక్కగా రెండు బస్సులు ఆగి ఉన్నాయి. మరో వైపు ఆశ్రమ వాసుల గదులున్నాయి. వాటి ప్రక్కన ఆ ఆశ్రమ ఆఫీస్ ఉంది. మరో వైపు స్త్రీలకు పురుషులకు స్నానపు గదులున్నాయి.

మెడిటేషన్ హాల్ ఈ ఆశ్రమంలో ఉన్నాయి. ఈ దేవాలయంలో గోడల మీద మహాదేవుని 1008 పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ వెలిసిన స్వయంభూలింగం చిన్నది. ఈ దేవాలయానికి అనుకొనే స్నాన ఘాట్ ఉన్నది. మేము మా సామానులు, దేవతార్చన తీసుకొని నది వైపు వెళ్ళాము. దేవాలయ ప్రాంగణం నుంచి నదికి చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. నది అక్కడ చాలా విశాలంగా ఉంది. ఒక్క క్షణం నాకు రాజమండ్రిలో ఉన్న గోదావరి గుర్తుకు వచ్చింది.

ఆ విశాలమైన ప్రవాహం చూసి నర్మద మీద భక్తితో హృదయం పొంగింది.

“అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే

కిరాతసూతబాడబేషు పణ్డితే శఠే నటే।

దురన్తపాపతాపహారి సర్వజన్తుశర్మదే

త్వదీయపాదపఙ్కజం నమామి దేవి నర్మదే॥”

కిరాత – సూత – బాడబా – శరదేశములందు ప్రవహించుచు జనుల పాపములను – తాపమును నశింపచేసి సుఖమునిచ్చు ఓ దేవీ! నర్మదాదేవీ! పరమేశ్వరుని జటాజూటము నుండి పుట్టిన నీ యొక్క ఒడ్డు యందు నీ ప్రవాహ ధ్వనిని ఆనందముతో విన్నాను. నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను.

నర్మదాష్టకం నోట్లో తిరుగుతోంది. నెమ్మదిగా నదిని సమీపించాము. నది ఒడ్డున చాలా బురదగా ఉంది. కాళ్ళు కూరుకుపోతున్నాయి. రేవులో చాలా మంది ఉన్నారు. ఎవరికి వారు తమ తమ సంకల్పలతో, అర్ఘ్యాలతో బిజీగా ఉన్నారు. స్త్రీలు ఒక వైపుగా మునిగి బయటకు వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు.

ఒడ్డుకే ఆనుకొని ఒక పడవ ఆగి ఉంది. నేను నదికి నమస్కరించి, పసుపు కుంకుమలతో పూజించి ఆ పడవ పట్టుకొని మూడు మునకలు వేసి వచ్చాను. మా దగ్గర ఉన్న డబ్బాలో నీరు శ్రీవారు మార్చారు. మేము మెట్లమీదుగా దేవాలయ ప్రాంగణం లోకి వచ్చి ఒక వేప చెట్టు క్రింద కూర్చొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి మా నర్మదా పూజ చేసుకున్నాము.

నేను అక్కడ ఉన్న స్త్రీలకు కుంకుమ పెట్టి, పసుపు ఇచ్చి నా దగ్గర ఉన్నమట్టి గాజులు పంచాను. తదనంతరం మేము నీలకంఠుణ్ని దర్శించుకున్నాము. ఆ ప్రశాంతమైన ఆశ్రమంలో నర్మదా తీరాన అత్యద్భుతమైన జపం సాగింది. దాదాపు గంట తరువాత లేచి ఆరవేసిన బట్టలు సర్దుకొన్నాను. శ్రీవారికి ఆశ్రమం నచ్చింది బాగా. నేను జపంలో ఉండగా ఆయన ఆశ్రమ కార్యాలయంలో అన్నదానానికి డబ్బు కట్టి వచ్చారట. మేము చకచకా మిగిలిన గుడులలో దర్శనం చేసుకొని మా తరువాతి గమ్యస్థానమైన ‘కుక్షి’ వైపు సాగాము.

ఆనాడు గమనించాను ఉదయం నుంచి నేను ఒక్కసారి కూడా దగ్గలేదు. ఎవరో చేతో తీసినట్లుగా టక్కున మాయమయ్యింది అతంటి దగ్గు… ‘అంబా నీ కరుణ అనంతం. నేనివ్వగలిగినది ఈ ఒక్క నమస్కారమే’.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

‘బరూచ్’ నుంచి మా తదుపరి గమ్యం ‘కుక్షి’కి దూరం దాదాపు 250 కిలోమీటర్లు. గుజరాత్‌లో వడోదర దగ్గరగా ఉన్న హైవే చాలా అద్భుతంగా ఉంది, కాని ట్రాఫిక్ కూడా చాలా ఉంది. దాదాపు వంద కిలోమీటర్ల తరువాత మా రోడ్లు చిన్న రోడ్లుగా మారాయి. గుజరాత్ రాష్ట్రం నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ లోకి వచ్చాము. రహదారులు అంత గొప్పగా లేవు, కాని పర్వాలేదు. కొన్ని చోట్లా చాలా గుంతలతో ఉంది. ఐదు గంటల కాలం పట్టే ఆ ప్రయాణం ఏడు గంటలు పట్టింది.

నర్మదా పరిక్రమ“లో అందరు చెప్పేది షోలాపూర్ జడి. ఆదివాసులైన భిల్లులు ఉండే అడవి ప్రదేశం. ఆ అడవి గుండా ప్రయాణించే భక్తులను భిల్లులు దోచుకుంటారని ఇతిహాసం. భిల్లుల దోపిడిపై చాలా కథలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు పాదచారులైన నర్మదా పరిక్రమ వాసులకి తెలియాలి. మా డ్రైవర్ మాత్రం బరూచ్ నుంచి కుక్షి వెళ్ళి దారిలో మధ్యలో ఎక్కడ ఆగటానికి ఇష్టపడకపోవడం కూడా కారణం ఇదే. ఆ అడవి మార్గంలో భిల్లులు చీకటి పడితే ఊరుకోరని, తప్పక అటకాయిస్తారని అతను చెప్పాడు. అందుకే కుక్షికి వెళ్ళటానికి ఆత్రం పడ్డాడు. ఈ అడవి గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఎందరో వీరి గురించి మంచి మాటలే చెబుతారు. వీరు ధనం తీసుకొని, ఆహారం పెట్టి పంపుతారట. ఎవ్వరికి హాని చెయ్యరు, కానీ వస్తువులు మాత్రం తీసుకుంటారని చెబుతారు.

మేము కార్‌లో ప్రయాణించినందున, పైపెచ్చు బాగా తెలిసిన డ్రైవర్ కాబట్టి మాకు ఈ విషయం తెలియదు. కానీ డ్రైవర్ చెప్పటం, వారి విలువిద్యా కౌశలం అత్యద్భుతం. వీరికి ఎదురు నిలువలేరు ఎవ్వరు. వాళ్ళని విలువిద్య పోటీకి పంపితే మనకు ఫస్ట్ ప్రైజ్ గ్యారెంటీ అని అన్నాడు మా డ్రైవర్….

మేము కుక్షికి చేరిన తరువాత ఆనాడు దాదాపు నాలుగు గంటలకి మేము భోజనం చెయ్యగలిగాము. కుక్షి చాలా చిన్న ఊరు. గ్రామపు వాసన వీడక పట్టణపు సొగసు అద్దుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ ఊరు నర్మద ఒడ్డున లేకపోయినా మాకు దారిలో ఉన్నదని అందులో వసతి ఏర్పరిచారు. ఆ ఊరిలో దొరికిన వసతి పర్వాలేదు. కొంత వరకు శుభ్రంగా ఉంది. కొత్తగా కట్టిన ఆ హోటల్‌లో క్రింద లాన్ ఆకుపచ్చ తివాచిలా ఉంది. మేము వెళ్ళే సరికే అక్కడ కొంత హడావుడి నడుస్తోంది. ఆ రోజు డిసెంబరు 31. బహుశా సాయంత్రం ఏవో పార్టీలు ఉన్నట్లుగా ఉన్నాయి. సాయంత్రానికి గట్టిగా సంగీతం పెట్టారు. ఆ రాత్రి నేను నర్మదామాయికి పంచోపచారాలతో హారతి ఇచ్చి కొంత జపం చేసుకున్నాను. శ్రీవారికి జలుబు మరీ ఎక్కువగా ఉన్నందున ఆయన మందు వేసుకొని పడుకున్నాడు. నాకు దగ్గు బాగానే తగ్గింది, కాని కొంత అలసటగా ఉంది. బహుశా రోజూ 250 కిలోమీట్లరు ప్రయాణం వల్ల కాబోలు…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here