నమామి దేవి నర్మదే!!-8

2
13

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

ఐదవరోజు

[dropcap]మే[/dropcap]ము మర్నాడు ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకొని ఉదయపు ధ్యానము చేసుకొని, నర్మదానది తీరానికి బయలుదేరాము. కుక్షికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న “మనావర్” దగ్గర ఉన్న చిన్న ఘాటుకు తీసుకుపోయాడు డ్రైవరు.

నర్మదా మాయి చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు మేము వెళ్ళిన నర్మదా తీరాలు ఎందరో భక్తులతో నిండి ఉన్నాయి. ఈ తీరం అందరికి తెలిసిన ఘాట్ కాదు. జనం లేరు అసలు. ఇద్దరు పరిక్రమవాసులు మాత్రం తమ బట్టలు ఆరవేసుకుంటున్నారు. ఘాట్ నిర్మించినది కాదు, సహజంగా ఉన్న గట్టు మాత్రమే. పదునైన రాళ్ళతో నిండి ఉంది ఆ తీరం. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. లోతు ఎక్కువగా ఉంది అక్కడ. మేము ముందు మామూలుగా చేసిన పని, నదికి నమస్కరించి ఆ నదిలో ప్రవేశించటానికి అనుమతికై ప్రార్థించటం. తదనంతరం నదికి పూజ చేసి పసుపు కుంకుమ సమర్పించటం. నేను ముందుగానే ముఖానికి పసుపు రాసుకొని, కుంకుమ దిద్దుకొని నెమ్మదిగా నదిలోకి దిగి, ముందు సంకల్పం చెప్పుకున్న తరువాత, ఆర్ఘ్యం ఇచ్చి లోపలికి జరిగి మునగటం. నీరంటే చిన్నప్పటినుంచి ఉన్న భయం నాకు ఎంత కాలమైనా తగ్గకపోవటం వింత.

ఒడ్డున ఒక పడవ ఖాళీగా ఉంది. నది ప్రవాహ వేగం అధికంగా ఉంది. అక్కడ ఒడ్డు లోతు కూడా ఎక్కువ. ఉన్నంతలో ఒక ప్రక్కన కాస్త మెరకగా ఉండి మునకలు వెయ్యటానికి వీలు కలిగిస్తోంది. మా కన్నా ముందుగా స్నానం చేసిన పరిక్రమవాసులు మమ్ములను ప్రవాహ వేగం గురించి హెచ్చరించారు. నేను నెమ్మదిగా దిగి పడవ పట్టుకొని మునిగి లేవగానే, పడవ ముందుకు వెళ్ళిపోయింది. నేను దబ్బుమని నీళ్ళలో పడ్డాను. నీళ్ళు నా నడుము వరకే ఉన్నాయనుకున్నా, కాని లోతు ఎక్కువగా ఉంది అక్కడ, పైపెచ్చు ప్రవాహవేగం, దబ్బున వెనకకు పడిపోయాను. వేగంగా ప్రవహించే నర్మద నుంచి లేవటానికి కష్టమయింది. గట్టు మీద కెక్కిన మావారు వెంటనే రాలేకపోయారు పదునైన రాళ్ళ వల్ల.

పరిక్రమవాసి ఒకరు అంత దూరం నుంచి దూకి, చేతిలోని కర్ర చాచి “పకడో దీది!!” అంటూ అరిచాడు. నాకు అతను అంత వేగంగా ఎలా దుమికాడో అర్థం కాలేదు. కర్ర పట్టుకొని లేచి నిలబడి నదిలోంచి బయటకొచ్చాను. ప్రమాదమేమి కలగలేదు. కాలు బెణికినట్టు అయింది. ఆ ఒడ్డున రెండు,మూడు సార్లు కాళ్ళు తిరిగి మెలికపడి, రాళ్ళు కొట్టుకుపోయి, దెబ్బలు తాకించుకున్నాను. నర్మదా మాత నా గుణదోషాలు, కర్మలు తొలగిస్తోందని నేను సంతోషపడ్డాను. మావారు మాత్రం కొద్దిగా దిగులుపడ్డారు నేను పదే పదే కాళ్ళకు దెబ్బలు తాకించుకోవటం చూసి….

ఆ తీరంలో చిన్న హనుమంతుని గుడి ఉంది. మేము శుభ్రమైన దుస్తులతో ఆ దేవాలయ ప్రాంగణంలోని వేప చెట్టు క్రింద కూర్చున్నాము. నర్మదామాతకు ఉపచారాల అనంతరం హారతి, నర్మదాష్టకం చదువుకున్నాము ఇద్దరం కలిసి. దేవాలయం ముందర ఒక వృద్ధుడు టీ కొట్టు పెట్టి అమ్ముతున్నాడు.

నా జపం తరువాత శ్రీవారు టీ తెచ్చి ఇస్తే త్రాగాను. ఆ ప్రశాంత వాతావరణం నుంచి కదలాలని లేకపోయినా, ప్రయాణం చెయ్యాలి కాబట్టి లేచి ఆ తాతగారికి టీ డబ్బులు ఇవ్వబోతే “వద్దు బేటీ! మీరు పరిక్రమవాసులు…” అన్నాడు భక్తితో.

మేము సంతోషంగా నవ్వాము. శ్రీవారు పదికి పది వేసి ఇచ్చి”ఉంచుకో దాదా!!” అని చెప్పి వచ్చి కారు ఎక్కారు. ఆ పల్లె ప్రజలకు నర్మదా మాయి అన్నా, పరిక్రమవాసులన్నా ఉన్న భక్తికి హృదయం పొంగింది. అసలు ఆ పవిత్ర నది చుట్టూ ప్రజల భక్తిని చూసి ముచ్చట పడని రోజులేదు.

అరగంట ప్రయాణం తరువాత మేము ధరమ్పురి అన్న రేవుకు చేరాము.

ధరమ్పురి జిల్లాకేంద్రం. ఆ ఊరిలోని నర్మదాఘాట్ ప్రఖ్యాతి చెందినది. విశాలమైన ఘాట్లు, నర్మద మీద వంతెనలతో, హడావిడితో నగర వాతావరణంలా ఉంది. ఆ తీరంలో నర్మదామాత గుడి ఉంది. శివాలయం కూడా ఉంది. ప్రఖ్యాతమైన ఆ తీరానికి చేరేసరికే అక్కడ సంతలాంటిది జరుగుతోంది. విపరీతంగా ఉన్నారు భక్తులు. మేము వెళ్ళి నదికి నమస్కరించి, పూజ చేసుకొని, ప్రోక్షణ చేసి మా వద్ద ఉన్న జలాన్ని కొంత తీసి, అక్కడి నదీజలంతో నింపుకున్నాం. నర్మదామాత దేవాలయంలో నమస్కరించి, శివాలయంలో అర్చన చేసుకొని వచ్చాము. బయట ఉన్న బిక్షగాళ్ళకు మావారు పది రూపాయల నోట్లు పంచారు. తరువాత బిస్కెట్ ప్యాకెట్ల్ కొని అందరికి పంచాము. కుక్కలు వెంట తిరుగుతుంటే వాటికి బిస్కెట్లు వేసాము. ఆవులకు అరటిపళ్ళు పెట్టి అక్కడ్నుంచి బయలుదేరాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

మహేశ్వరం

ధరమ్‌పురి నుంచి మహేశ్వరం రెండు గంటలలో చేరిపోయాము. ఉదయం పదకొండు కూడా అవలేదు. నర్మదా తీరంలో ఉన్న మధ్యప్రదేశ్ టూరిజం వారి నర్మదా రిట్రీట్ హోటల్లో చెకిన్ అయి, భోజనం చేశాము. మహేశ్వరం నర్మదా తీరంలో ఉన్న ఒక అద్భుతమైన పట్టణం.

“నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్।

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్॥”

మహారాణి రాజమాత అహల్యాబాయి హోల్కర్ రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసిన పట్టణం మహేశ్వరం.

మాహిష్మతీ అని దీని పూర్వనామం. ఎన్నో దేవాలయాలు, నర్మద నది ఘాట్లు ఉన్న దివ్య క్షేత్రం. హోల్కర్ల మహా ప్రాకారాలు, కోట, అహల్యాబాయి దేవాలయంతో పాటు ఎన్నో దేవాలయాలకు నిలయమది. అంతే కాక రాజమాత అహల్యాబాయి వృద్ధి చేసిన మహేశ్వరం ప్రత్యేక చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.

‘ఇవి అన్నీ చూడగలమా? ఈ కాస్తంత సమయంలో’ అన్న కొంత బెరుకు కలిగింది. ముందుగా మహేశ్వరం చీరలు చూద్దామని వెళ్ళాము. అక్కడ జనాలు బానే ఉన్నారు. విపరీతమైన వ్యాపారం సాగుతోంది. కోవిడ్ తరువాత ఇప్పుడే వ్యాపారం పుంజుకుంటుందని ఆ వ్యాపారస్థుడు చెప్పాడు.

చక్కటి రంగులలో, మన్నిక గల మెత్తని సిల్క్ కాటన్ మహేశ్వరం చీరలు నచ్చని వారుండరు నాకు తెలిసి. నేను మా బంధువులకు కొన్ని చీరలు కొన్నాను. ఇండియా వచ్చిన సందర్భంలో నేను మా అక్కలకు, ఆడపడుచులకు చీరలను బహుమతిగా ఇస్తాను. ఎన్నో సంవత్సరాలుగా సంప్రదాయికంగా చేస్తున్న పని అది. ఈ సారి ఈ చీరలు తీసుకున్నాను ఇవ్వవచ్చని. ఆ చీరలను కారులో ఉంచి, మేము మహేశ్వరం కోట వైపు వెళ్ళాము.

సంవత్సరాంతం, పైపెచ్చు రెండు రోజులు సెలవులు కాబట్టేమో, జనం విపరీతంగా ఉన్నారు. ఎక్కడ చూసినా జనమే. మేము ఒక గైడ్‌ను కుదుర్చుకొని ఆ కోట, లోపలి దేవాలయాలను సందర్శిస్తూ ముందుకు సాగాము.

***

రాజమాత, కర్మయోగి, దేవిఅహల్యాబాయిహోల్కర్

మహారాష్ట్రుల ఆడపడుచు మరాఠా సుబేదారు మల్హర్ రావు ఇంటి కోడలై, మణిమకుటంగా రాజ్యాన్ని పాలించి మణిదీపమై వెలిగింది. ప్రపంచంలో ఏ చరిత్రలోనూ కనివిని ఎరుగని అత్యంత మానవీయమైన సుపరిపాలన అందించి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఆంగ్లేయులు సైతం ఆశ్చర్యంతో ఆ రాజమాతను స్తుతించారు. ఆ రాజమాత అందించిన అంతటి గొప్ప పారదర్శకమైన పరిపాలన ప్రపంచంలో మరే రాజ్యంలో మనం చూడలేం.

“రాజసంపదలు పాదక్రాంతమైనా కేవలము సాధువులా జీవించి, తన ప్రజలను కన్నతల్లిలా అక్కున చేర్చుకున్నది. ఆ రాజమాత అసాధ్యాలను సుసాధ్యాలు చేసి చరిత్రలో రాజయోగి అనిపించుకుంది” అని ఆంగ్లేయ రచయిత, పరిశీలకుడు జాన్ మెల్కాన్ ఆ తల్లిని పొగిడాడు.

ప్రతివారిని తన శాయశక్తుల ఉత్తమమైన విధానంలో జీవించమని చెప్పి అందుకు కావలసిన వనరులు అందచేసింది. రైతులకు శాంతి, వర్తకులకు వాణిజ్యం, నగరాల పెంపు, ప్రజల సౌభాతృత్వం మొదలైనవి ఆ రాజమాత పాలనలో చూస్తాం. బీదవారు లేని రాజ్యం ఆ రాజమాతది. “అందరి సంతోషమే తన సంతోషంగా జీవించిన రాజయోగి ఆమె” అంటూ అనీబిసెంటు పేర్కొన్నది. ఎందరో చరిత్రకారులు, ఆనాటి పాలకులచే గౌరవాన్ని అందుకున్న మహామనిషి రాజమాత శ్రీమతి అహల్యాబాయి హోల్కర్.

ఆమె పరిపాలించిన రాజ్యం మాళ్వా. మహేశ్వరం ఆమె రాజధాని. నర్మదా బాణలింగం ఆమె దైవం.

అహల్యాబాయి హోల్కర్ మరాఠా హిందూ కుటుంబములో క్రీ.శ. 1725లో చాండీ గ్రామంలో జన్మించింది. మరాఠాలు శక్తివంతంగా వెలుగుతున్న రోజులవి. బాజీరావు మరాఠాలను “మారాఠా కూటమి” పేరున ఏకంచేసి భారతదేశమంతా విజయ పరంపరలు సాగిస్తున్న కాలం. మాళ్వా రాజ్య సుబేదారుగా మల్హర్ రావు, కూటమిలో శక్తివంతుడు. ఆయన ఏకైక కుమారుడు ఖండేరావుకు అహల్యాబాయికి వివాహం జరిగింది. వివాహం సమయంలో అహల్యా వయస్సు ఆరు సంవత్సరాలు. ఆమె చాలా చిన్న వయస్సులోనే అత్తవారింటికి వచ్చింది.

ఆమెకు చదువుతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పించారు అత్తవారింట. మల్హర్ రావు అహల్యాబాయిలోని తెలివితేటలను గమనించాడు. అహల్యాబాయికి కాలాంతరం ఒక కుమార్తె ముక్తాబాయి, ఒక కొడుకు మాలే రావు కలుగుతారు.

ఖండేరావుకు అనారోగ్యంతోపాటు, అసమర్థత చూసి, మావగారు మల్హర్ రావు అహల్య మీదనే ఆశలు పెంచుకున్నాడు. అహల్యకు ముప్పై సంవత్సరాల వయసు ఉండగా ఖండేరావు క్రీ.శ 1754లో “కుంభేరి” అన్న గ్రామం వద్ద యుద్ధంలో మరణిస్తాడు. అహల్యాబాయి సతీసహగమనం చెయ్యటానికి సిద్ధపడుతుంది. కాని మల్హర్ రావ్ ఒప్పుకోడు. ఆమెను ఆయన రాజనీతిలో తర్ఫీదు ఇవ్వటం మొదలెడతాడు. మల్హర్ రావు యుద్ధభూమి నుంచి అహల్యాబాయికి లేఖలు రాసేవాడు. ఎవరితో ఎలా మెదలాలో ఆ లేఖలలో ఆయన వివరించేవాడు. ఎంత మంది సైనికులను పంపాలో, కొత్తవారిని నియమించటం, డబ్బును ఎక్కడ, ఎలా వినియోగించాలన్నది ఆమె తన మామగారి నుంచి నేర్చుకున్నది. మల్హర్ రావు అహల్యా బాయిని మిగిలిన సుబేదార్లు గౌరవించేలా జాగ్రత్త పడేవాడు కూడా.

క్రీ.శ 1766లో మల్హర్ రావు ఒక యుద్ధంలో మరణిస్తాడు. ఆయన తదనంతరం అహల్యాబాయి కుమారుడు మలేరావు రాజ్యానికి వస్తాడు. అనారోగ్యంతో కుమారుడు కూడా సంవత్సరంలో మరణిస్తాడు. అహల్య మాతను ఈ వరుస మరణాలు దుఃఖపూరితం చేసాయి.

హోల్కర్ల సంపన్నమైన రాజ్యానికి మగ వారసులు లేనందున దుర్బుద్ధితో తనకు నచ్చిన వారిని దత్తత తీసుకొమ్మని ఆమె మంత్రులు గంగాధర్ చంద్రచూడ్, రాహోభాలు బలవంతం పెడుతుంటారు. వారు చెప్పిన వారిని దత్తత తీసుకుంటే రాజ్యం, సంపద వారి చేతుల్లోకి వస్తుంది. అహల్యాబాయిని మెల్లగా తప్పించవచ్చని ఆలోచన చేస్తారు. అహల్య వారి మాటను పెడచెవిన పెడుతుంది. ఆమె స్వయంగా ఆనాటి పీష్వాను కలిసి తనకు సహాయం చెయ్యవలసినదిగా కోరుతుంది. మంత్రులు అహల్యాబాయికి ఎదురు తిరిగి పీష్వా సైన్యసహాయం కోరుతారు. ఆ సైన్యం వస్తుందన్న వార్త తెలిసిన అహల్యాబాయి, తన రాజ్యంలోని స్త్రీలనందరిని సమకూర్చి గుర్రాల మీద ఉంచి, చేతికి కత్తినిచ్చి యుద్ధానికి సన్నద్ధం చేస్తుంది. ఆమె పీష్వాను సాయం కోరుతూ, “నేను స్త్రీని. నా సైన్యమంతా స్త్రీలు. వారి మీద గెలుపు మీకు గెలుపుకాదు. వారి చేత ఓటమి మీకెంత అవమానమో ఆలోచించండి!” అని కబురు పంపుతుంది. పీష్వా మాధవరావు అహల్యకు సహాయం చేసేందుకు సమ్మతిస్తాడు. సైన్యంతో వచ్చి ఆమెకు రాజ్యాధికారాన్ని ఇచ్చి, ఆమె కోరుకున్న ‘తుకోజీరావు’ను దత్తతకు సమ్మతించి, వెనుతిరుగుతాడు.

ఆ రాజమాతకు ఆమె జాగీర్ మీద పూర్తి స్వేచ్ఛను, ధనం మీద ఆమెకు పూర్తి హక్కును ఇచ్చి వెళతాడు.

అహల్యాబాయి హోల్కర్లకు అధికార రాణిగా అవుతుంది. అహల్యాబాయి తుకోజీరావును తన సైన్యానికి అధ్యక్షునిగా చేస్తుంది.

మాళ్వా రాజ్యంలో ఆమెకు ఎదురు తిరిగినవారు కూడా ఆమెను సమ్మతిస్తారు. ఆమె ఇండోర్ నుంచి తన రాజధాని మహేశ్వరానికి మారుస్తుంది. మహేశ్వరం పూర్వ నామం మాహీష్మతి. ఈ పట్టణము వద్దనే ఆదిశంకరులు మండనమిశ్రునితో వాదనకి దిగి అతనిని వాదనలో ఓడిస్తాడు.

హోల్కర్లు ప్రజాధనాన్ని తాకకూడదు. అహల్యాబాయికి రాజ్యం చేతికొచ్చేసరికే ఆమె వద్ద కోట్ల ధనం ఉంది. అదీ కాక ఆమెకు పన్నుల ద్వారా కూడా ఎంతో సమకూరేది. తనకు వచ్చే ప్రతి ధనాన్ని పూర్తిగా ప్రజల కోసం వాడుతుంది. మహేశ్వరంలో ఆమె కోట, మిగిలిన రాజకోటల వలె అట్టహాసంగా కాక అవసరాలకు తగ్గట్టుగా నిర్మించుకుంది రాజమాత. మహేశ్వరానికి వ్యాపారస్థులను, బ్యాంకర్లను ఆహ్వానించి వారిచే వ్యాపారం పెట్టుకోవటానికి అనుమతులనిచ్చింది. వారికి పది సంవత్సరాలు పన్ను (tax) లేకుండా వ్యాపారం చేసుకోమందామె. మాళ్వా చుట్టుప్రక్కల ఉన్న చేనేత కార్మికులను మహేశ్వరం ఆహ్వానించి వారికి వసతులు కల్పించింది. మహేశ్వరం చుట్టూ ప్రక్కల రైతులకు పత్తి పండించటానికి అనుకూల పరిస్థితులు కల్పించింది మహారాణి.

మహేశ్వరం చీరలు ఆనాడు దేశంలోని ప్రతి రాణి కోరుకునేదట. అంతేకాదు ప్రతి మగువ ఇష్టపడేదట. అంతటి పేరు ప్రఖ్యాతులు గడించాయి ఆ చీరలు. వ్యాపారం, పరిశ్రమల వలన సంపద మరింత పెరిగింది.

ఆమె ఘోషా పద్ధతి పాటించలేదు. ప్రజలను నేరుగా కలుసుకునేది. నర్మదా మాయి మీద, సదా శివునిపై రాజమాతకి అపరమితమైన భక్తి కలిగి ఉండేది. ప్రతిదినం ఉదయం లేవగానే చేతిలో శివలింగంతో రాజప్రసాదం నుంచి నర్మదను దర్శించుకునేది. ప్రతిరోజు నర్మదాఘాటుకు ఆమె వచ్చినప్పుడు ప్రజలు ఆమెను కలిసి తమ కష్టనష్టాలు చెప్పుకునేవారు.

భర్త మరణించిన తరువాత స్త్రీలకు భర్త ఆస్తి పైన అధికారం ఉండేది కాదు. రాజమాత అహల్యాబాయి స్త్రీలకు భర్త ఆస్తి చెందాలని వారికి జీవనభృతి కలిగించబడాలని కూడా చట్టం చేసింది. అంతవరకు అగమ్యగోచరమైన స్త్రీలకు జీవితం కలిపించినది దేవీ అహల్యాబాయి.

ఆమె రాజ్యంలో దారి కాచే దొంగలు అయిన భిల్లులు ఇబ్బంది పెడుతూ ఉండేవారు. వారి బెడద ఎక్కువై వ్యాపారస్థులు  గొడవ చేస్తుంటే అహల్యాబాయి “ఎవరైతే ఆ దొంగలను పట్టి తెస్తే వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తాను” అని ప్రకటిస్తుంది. యశ్వంతరావు అనే యువకుడు ముందుకు వచ్చి తనకు సహాయంగా సైన్యానిస్తే తప్పక వారిని పట్టుకుంటానని చెబుతాడు.

అహల్యాబాయి అతనికి సాయంగా సైన్యానిస్తుంది. ఆ యువకుడు భిల్లులను పట్టి తెస్తాడు. అహల్యాబాయి వారితో మంతనాలు జరిపి, వారికి రోడ్డు పన్ను సేకరించుకొని బ్రతకమని వదిలివేస్తుంది. ఆ దొంగలు మారి ఆమె చెప్పినట్లుగా రోడ్డు పన్నుతో బ్రతకటం చేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తె ముక్తాబాయిని యశ్వంతునికిచ్చి వివాహం జరిపిస్తుంది. అల్లుడు కూడా ఒక సైన్యానికి అధ్యక్షునిగా ఆమె సేనలో ఉంటాడు.

నర్మదా నది పైన అపారమైన భక్తి అహల్యాబాయికి. నర్మదా నదిపైన 56 ఘాట్లను నిర్మించారు. ఆ ఘాట్లలో నర్మదకు హారతులు జరపటం అహల్యాబాయినే మొదలుపెట్టింది. ఆ హారతి నేటికి జరుగుతుంది. మహేశ్వరం నర్మదానది తీరంలో ఎన్నో దేవాలయాలు నిర్మంచబడ్డాయి. కొన్ని శివునివి, మరికొన్ని కృష్ణుడివి. అన్ని దేవాలయాలు నర్మదానది తీరాన్నే ఉంటాయి.

అహల్యాబాయి అల్లుడు ఆమెకు ఒక దేవాలయం నిర్మించాడు. దేశంలో మిగిలిన రాజ్యాలు యుద్ధాల నడుమ కొట్టుకుపోతుంటే, ఇండోర్ మహానగరంగా వెలిసింది. మహేశ్వరం సర్వత్రా వృద్ధి చెందింది. పన్నులు పెంచకుండానే వచ్చిపడుతున్న ధనంతో అహల్యాబాయి దేశంలోని దేవాలయాలకు మరమ్మత్తులు చేయించింది. దేశమంటే అహల్యాబాయికి ఒక్క మాళ్వానే కాదు. అఖండ భారతావని.

మహాదేవుని జ్యోతిర్లింగ దేవాలయాలను మరమ్మత్తులు చెయ్యటము, పునర్నిర్మించటము తన కర్తవ్యమని ఆమె నిశ్చయించుకుంది. ఔరంగజేబు నాశనం చేసిన వారణాసిలోని విశ్వనాథుని దేవాలయం ప్రక్కనే స్థలం కొని, విశ్వనాథునికి దేవాలయం కట్టించింది. అప్పటి వరకు హిందువులకు వారణాసిలో దేవాలయం లేకనేపాయే. ఆ తల్లి వలన కాశీ విశ్వనాథునికి మళ్ళీ ఆలయం సమకూరింది.

వారణాసిలో ఒక ఘాటుకు అహల్యాబాయి ఘాట్ అని పేరు పెట్టారు. అక్కడ ఆమె కట్టించిన రాజభవనం కూడా ఉంది. ఇటీవల కాలంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు కాశీ విశ్వనాథ్ కారిడర్ నిర్మాణంలో భాగంగా కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంగణంలో రాజమాత అహల్యభాయి హోల్కర్ విగ్రహం నెలకొల్పి సముచితంగా గౌరవిస్తూ భావితరాలకు ఆ తల్లి గొప్పతనాన్ని తెలియజేశారు.

సోమనాథ్ నుంచి పూరీ వరకు, కేదారం, బదిరి నుంచి రామేశ్వరం వరకు ఎన్నో దేవాలయాలను బాగు చేయించటమో, పునర్నిర్మించటమో చేసిందామె. ఎన్నో ధర్మసత్రాలను కట్టించింది. చెరువులను ఏర్పాటు చేయించటం, బావులను కట్టించటం చేసింది. రహదారులకు ఇరువైపుల నీడనిచ్చే చెట్లను నాటించింది. భక్తులు ఇబ్బంది పడకుండా యాత్ర చెయ్యటానికి కావలసిన ఏర్పాట్లను చూసింది. నర్మదా తీరంలోని దేవాలయాలలో ఆమె బాగు చేయించని దేవాలయం లేదంటే అతిశయోక్తి కాదు. గ్రామాలలోని బావులకు మరమ్మత్తులు గాని, నీటి పారుదలకు కాలువలు గాని ఆమె చేతనే నిర్మించబడినవి మనకు నేటికి కనపడుతాయి.

చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఏకఖండంగా గుర్తించి సనాతనధర్మాన్ని పాటించిన ధీరవనిత రాజమాత అహల్యాబాయి హోల్కర్…..

మహాదేవున్ని అణుక్షణము తలుస్తూ, ప్రజల కోసం జీవించిన మహారాణి ఆమె. అల్లుడు మరణించినప్పుడు కూతురు సతీసహగమనానికి తలపడితే కూతురును ఆపుతూ అహల్యాబాయి ఇలా అంటుంది.. “నన్ను చూడు. జీవితంలో సంతోషపడటానికి ఏం మిగిలింది? జీవితం పరమేశ్వరార్పణ చేసి, ప్రజలలో దేవున్ని చూస్తూ వారికి సేవ చెయ్యటానికే మనం మిగిలి ఉన్నాం. కాబట్టి మనం ప్రజల కోసం బ్రతకాలి” అంటుంది.

ఆమె చిన్న వయస్సులో భర్తను, కుమారుడిని కోల్పోయిన, తనను నమ్మిన ప్రజలకు సేవ చెయ్యటానికి, తను నమ్మిన పరమాత్మను పూజించటానికి జీవించిన మహామనిషి రాజమాత. సాధారణ సాధువులా జీవించిన కర్మయోగి, రాజయోగి ఆమె. కేవలం అవధూత ఆమె అని ప్రజలు నమ్మేవారు. ఆమె భక్తి అనన్యం. ఆమె జీవితం అసాధారణం.

పురాణాల నుంచి నడిచి వచ్చిన కారణజన్మురాలు రాజమాత అహల్యాబాయి…

ఆమె అందించిన పరిపాలన “నభూతో నభవిష్యతి” అని ఎందరో వేనోళ్ళ పొగిడారు. ఆమె వంటి పరిపాలకురాలు ప్రపంచములో లేరని ఆంగ్ల పరిశీలకుడు ప్రస్తుతించాడు.

సుసంపన్నమైన రాజ్యనీతితో తన ప్రజలకు పరిపాలన అందించిన ఆమె వంటి రాణి లేదని, రాదని నెహ్రూ తన “డిస్కవరీ ఆఫ్ ఇండియా” అనే రచనలో చెబుతాడు. అంతటి మహారాణి గురించి చరిత్రలో కాదు తప్పక మన పాఠశాల పుస్తకాలలో జతచెయ్యాలి. దేశప్రజలు అటువంటి రాణి గురించి తెలుసుకోవాలి. మన చదువులో ఆమె గురించి లేకపోవటం వలన, నర్మదా పరిక్రమ వరకూ ఆమె వివరాలు పూర్తిగా తెలియకపోవటం నా దురదృష్టం. నేను బదిరిలో ఉండగా ఆ దేవాలయ గోపురానికి తాపడం అహల్యాబాయి హోల్కర్ చేయించినదని చదివాను అక్కడ. తదనంతరం వారణాసిలో ఆమె గురించి మరింత వివరాలు తెలుసుకున్నాను. మహేశ్వరం వెళ్ళినప్పుడే ఆ తల్లి గురించి పూర్తి వివరాలు తెలుసుకో గలిగాను. ఆ తల్లి మీద భక్తితో నా హృదయం నిండిపోయింది.

ఆమె దర్భారులో నేటికి ఆమె వాడిన వస్తువులు చూడవచ్చు. ఆమె మూర్తిని దర్బారులో ఉంచారు. కోట బయట నిలువెత్తు విగ్రహం ఆమెది. మేము ఆమె పాదాలకు నమస్కరించుకుని కోట లోకి వెళ్ళాము. ఆమె దేవతార్చన అద్భుతం. ఆ దేవతార్చనలో ఎన్నో బాణ లింగాలు. అన్నింటికి ఇప్పటికి నిత్యం పూజ జరుగుతున్న గుర్తులు కనపడుతాయి మనకి.

ఆ దేవుళ్ళలో బంగారపు ఊయలలో కృష్ణస్వామి ఊగుతూ, అందమైన అద్భుతమైన రూపంలో కనిపిస్తాడు. మేము ఆ పరమాత్మునికి నమస్కరించుకొని వచ్చాం. హోల్కర్ల కత్తులు ప్రదర్శనకు పెట్టారు ఒకప్రక్క. ఆమె గది తలుపు తియ్యగానే ఎదురుగా నర్మదా నది దర్శనం కలిగేలా ఏర్పాటు ఉంది. ఆ కోట పై అంతస్తు హోటల్‌గా చేశారట. ఒకప్రక్క అహల్యాబాయి పేరు మీద ఒక పాఠశాల కూడా ఉంది.

ఆ కోటలోనే ఒక ప్రక్క భారతదేశం చిత్రపటం ఉంచి, ఆమె నిర్మించిన, బాగుచేసిన దేవాలయాల పట్టిక పెట్టారు. ఒక్క మనిషి ఇంత చేసిందా!!! అని మనకు ఆశ్చర్యం కలగమానదు. ఆమె చరిత్ర తెలుసుకున్న తరువాత మనకు భక్తి భావం కలగక మానదు. ఆమె కారణ జన్మురాలు. కేవలం పరమాత్మ తన దేవాలయాలను పునరుద్ధరణకై ఆమెను భూమి మీదకు పంపి ఉంటాడు.

రాజమాత అహల్యాబాయి గురించి గైడ్ చాలా చెప్పాడు. గైడ్ చెప్పినవన్ని వింటూ మేము ఆ ఘాట్లలో తిరిగాము. ఆ కోటను, ఆమె కట్టించిన దేవాలయాలను చూశాము. ఇవి కాక, నది మధ్య ఉన్న చిన్న దీవి మీద కూడా శివాలయం ఉంది. అది ఎంతో చరిత్ర కలది. దానిని దర్శించుకోవాలి. నర్మదానది తీరాన బోట్ కోసం కొంచం పెద్ద క్యూ నిలబడి ఉంది. మా గైడ్ వారితో మాట్లాడి మాకు టికెట్లు కొంటామంటే, శ్రీవారు మాకు మాత్రమేగా ఒక బోట్ మాట్లాడేసారు.

మేము నర్మదలో బోట్‌లో ప్రయాణించింది ఘాట్ చూడటానికే కాదు. నర్మద మధ్యలో ఉన్న బాణేశ్వరుణ్ణి నమస్కరించుకోవటానికి.

“నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై ‘న’ కారాయ నమః శివాయ”

మహేశ్వరం దగ్గర నర్మద మధ్య మనకు చిన్న దీవి, దాని పై చిన్న దేవాలయం కనపడతాయి. ఆ దేవాలయం లోని శివుడిని బాణేశ్వరుడని అంటారు. ఆ దేవాలయం ద్వాపర యుగానికి చెందినదట. పాడు పడిపోతే రాజమాత ఆ దేవాలయాన్ని పునరుద్ధరించింది. ఆమె ప్రతి ఉదయం బోట్‌లో ఆ దీవికొచ్చి ఆ దేవాలయంలోని మహాదేవున్ని పూజించి వెళ్ళేదట. ఆ దేవాలయం గురించి కథనం ఒకటి చెబుతారు.

“బాణాసురుడు భూమండలం మధ్యలో శివునికై తపస్సు చెయ్యాలనుకున్నాడట. ఆయనకు పార్వతి ఆ చోటు చూపింది. అక్కడ అప్పటికప్పుడు ఒక దీవి నిర్మించి, దానిపై శివుడిని ప్రతిష్ఠించుకొని బాణుడు తపస్సు చేశాడు. ద్వాపర యుగానికి నర్మద అక్కడ చాలా విశాలంగా ప్రవహిస్తోంది. బాణాసురుడు తపస్సుకు ఏ మాత్రం భంగం కలిగించకుండా నర్మద ఆ దీవి చుట్టూ ఆయన తపస్సు చేసుకున్నని రోజులు ప్రవహించిందట”.

బాణుడి పేరు మీదనే నర్మద లోని రాళ్ళని బాణలింగం అని పేరు వచ్చింది. మరొక వింతేమంటే ధృవ నక్షత్రం నుంచి ఒక ఊహరేఖ భూమి మధ్యకు గీస్తే ఆ రేఖ ఈ దేవాలయం మీదుగా వెళుతుంది. ఆ దేవాలయం రాతితో నిర్మించిన చిన్న గది. అందులో లింగం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. సూర్యుని కిరణాలు జాలువారుతూ నర్మద మీద ప్రతిబింబిస్తుంటే ఆ దేవాలయ సౌందర్యం ద్విగుణీకృతమైయింది.

మేము దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చాము. అక్కడ దీవి మీద దిగలేదు. దిగితే నర్మదను దాటినట్లు అవుతుందని కేవలం శివుని ప్రదక్షిణతో సరిపుచ్చుకున్నాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

ఆరోజు మేము చాలా నడిచాము. నా అడుగులు లెక్కకట్టే యాప్ ఉంటే మేము 10,000 అడుగులు దాటేశామని మొరపెట్టుకునేది.

సహస్రార్జున (కార్యవీర్యార్జున) దేవాలయం, రాజరాజేశ్వరీ దేవాలయం, కాశీవిశ్వనాథుని దేవాలయం, చతుర్భుజ నారాయణ దేవాలయం, భవాని మాత దేవాలయం, రామకృష్ణ మందిరం, నరసింగ దేవాలయం, గణేశుని గుడి, పండరినాథుని గుడి ఆ తీరాన ఉన్నాయి. మా గైడ్ వాటి గురించి వివరిస్తూనే ఉన్నాడు. మేము బోట్ దిగి తీరానికి వచ్చాము. గట్టు మీద ప్రజలు పుంఖాను పుంఖాలుగా ఉన్నారు. వారితో ఇంటర్వ్యూ చెయ్యటానికి ఓ విలేఖరి తిరుగుతున్నాడు. కోవిడ్ ఉన్న ఛాయలు భూతద్దమేసి వెతికినా దొరకవు. అంతలా ప్రజలు ఏమీ జరగనట్లు ఒకరి మీద ఒకరు పడి తిరుగుతున్నారు. మేము మెట్లు ఎక్కుతుండగా నాకు కాలులో (నరం లాగినట్లుగా అయి పట్టేసింది) క్రామ్ప్ (cramp) మొదలై, మోకాలు పాప్ అయి బిగుసుకుపోయింది, కదలలేకపోయాను. ఇక కదలలేనని, నా మోకాలు లాక్ అయిందని చెప్పాను. అయినా నన్ను ఇటురా, అటురా, ఈ గుడి చూడు, ఆ విగ్రహం చూడు అని లాగుతూనే ఉన్నారు. కాలు ఈడుస్తూ ఆ తీరాన తిరిగి, కొంత ఏకాంతం కావాలని తపించాను.

తీరం వెంట శివలింగాలెన్నో ప్రతిష్ఠించి ఉన్నాయి. కొందరు దూరంగా ఒక లింగం వద్ద కూర్చుని

“నమో॒ హిర॑ణ్య బాహవే సేనా॒న్యే॑ ది॒శాం చ॒ పత॑యే॒ నమో॒ నమో॑

వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యః పశూ॒నాం పత॑యే॒ నమో॒ నమః॑

స॒స్పింజ॑రాయ॒ త్విషీ॑మతే పథీ॒నాం పత॑యే॒ నమో॒ నమో॑”

అంటూ రుద్ర నమకంతో అభిషేకం చేస్తున్నారు.

శ్రీవారు గైడ్‌ను పంపించి తను దూరంగా కూర్చున్నారు. నేను కాలు ఈడుస్తూ నర్మదను సమీపించి, నర్మదలో నిలబడి కొంత సేపు జపం చేసుకున్నా. కొంతసేపటికి కొందరు వచ్చి నదిలో చేపలకు ఆహారం వెయ్యటం మొదలెట్టారు. వారు నా ప్రక్కనే ఆ పని చెయ్యటం వలన చేపలు నా ముందు వెనకగా తిరగటం ప్రారంభించాయి. ఆ చేపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటి కదలికల వలన నీళ్ళు నిరంతరాయంగా నా మీద పడుతూ నా ధ్యానాన్ని చెదరగొట్టాయి. కళ్ళు తెరచిచూస్తే చీకట్లు కమ్ముకున్నాయి. నేను నెమ్మదిగా కాలు లాగుతూ మెట్లు ఎక్కి పైకి వచ్చాను. శ్రీవారు డిస్ట్రబ్ చెయ్యకుండా ఎదురుచూస్తున్నారు. మేము మెట్లు ఎక్కి సన్నని సందుల గుండా మహేశ్వర రాజప్రసాదం ప్రక్కన ఉన్న రోడ్డు మీదకు వచ్చి డ్రైవరుకు ఫోన్ చేశాము. అతను వచ్చి మమ్మల్ని హోటల్‌కి తీసుకుపోయాడు.

గదిలో మళ్ళీ నర్మదామాయికి హారతి ఇచ్చి రోజు ముగించాము. కాని ఆ రోజు చూసినన్ని దేవాలయాలు గాని, రాజమాత అహల్యాబాయి వంటి వ్యక్తిత్వం కాని అప్పటి వరకు ఎరుగం. ఇద్దరం పూర్తిగా ఆశ్చర్యసంతోషం నిండిన హృదయంతో ఆమె గురించే మాట్లాడుకున్నాము. నర్మదామాయి మీద ఆమె భక్తి అనన్యం. రాజమాత అహల్యాబాయి అంటే నర్మదామాయికి పర్యాయపదంలా ఉండేదని గైడ్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అవును జగదంబ మానవ రూపమీమె కదా అనుకొని, ఆ తల్లి మీద భక్తితో ఆమెకు నమస్కారం చేసుకున్నాం.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

ఆరవ రోజు

“మహాగభీరనీరపూరపాపధూతభూతలం

ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలం .

జగల్లయే మహాభయే మృకండుసూనుహర్మ్యదే

త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే….”

మహేశ్వరంలో నర్మదామాయికి ఎన్నో ఘాట్లు ఉన్నా, మా ఉదయం నదీస్నానం హోటల్ దగ్గరే చెయ్యాలని నిశ్చయించుకున్నాను. శ్రీవారు ఘాట్‌కు వెళదామన్న బట్టలు రూముకొచ్చి మార్చుకోవచ్చని ఇలా నిశ్చయించుకున్నా. శరీరం మీద తరగని మమకారమా? సాధన ముందుకు పోవటమంటే సిగ్గు, లజ్జ వదిలెయ్యాలని కదా అంటారు. ఈ శరీరం నాదని, దీనిని కప్పాలన్న ఆలోచన ఉన్నంత వరకు రెండవ వస్తువుని గుర్తించటమే. రెండవది ఉన్నదంటే మనలోని ఆత్మ దర్శనం కాదు కదా!!…. అలాంటి ఆలోచనలు సైతం వంటబట్టవు.

రామకృష్ణులు ఇటువంటి వాటిని తీసెయ్యమని తన భక్తులకు చెప్పేవారు. సమాజం కోసం కొంత పద్దతి పాటించమని, సాధనలో వీటి విషయం తలపవద్దని. ఆ స్థాయి ఈ ఉపాధికి కలుగుతుందా? దిగులు కలిగింది ఈ విచారం(ఆలోచనల) వలన, అయిన ఎక్కడో బెరుకు హృదయంలో ఉన్నంత రోజులు ఆత్మదర్శనం ఎలా కలుగుతుంది? ఈ విషయం పై కొంత వ్యాకులత కలిగింది.

ఈ ఆలోచనలను పక్కన పెట్టి నదిని పూజించటానికి, ప్రతి ఉదయం రోజూలాగే ముందు గదిలో స్నానం చేసి, నదిలో మునగటానికి పసుపు కుంకుమతో ఉదయం ఆరు గంటలకే నదికి వెళ్ళాము. నది మీద పొగ మంచు తేలుతుంది. నదికి పూజచేసి నెమ్మదిగా దిగే ప్రయత్నం చేశాము. అది ఘాట్ కాదు. పైగా గడ్డితో, చెత్తతో, బురదతో కూడి ఉంది. శ్రీవారు గట్టు దగ్గర మునిగిన, నేను కొద్దిగా లోపలికెళ్ళి మునిగి వచ్చాను. గట్టున సీసా పెంకులు, చెత్త ఉన్నాయి. మనవాళ్ళు నదిని పూజిస్తూనే చెత్త వెయ్యటం చేస్తారు. ఈ కాంబినేషన్ నాకెప్పుడూ అర్థం కాదు.

నెమ్మదిగానే నా లాక్ అయిన మోకాలుతో మెట్లు ఎక్కి, పైకి వెళ్ళాము. ఫలహారం చేసి బయలు దేరుదామని అనుకున్నాము. రెస్టారెంటుకు వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని నది వైపు చూస్తూ ఉంది. మేము పలకరింపుగా నవ్వి మా ఫలహారం, టీ తీసుకుంటుంటే ఆమె పలకరించారు.

ప్రశాంతమైన ఆ ఉదయం లేలేత సూర్యుని కిరణాల మధ్య ప్రశాంతతను అనుభవిస్తున్న మాకు ఆమెతో మాట్లాడాక మరో గొప్ప వ్యక్తి తారసపడ్డారనిపించింది. ఆమె డెబ్బై ఏళ్ళ మహమ్మదీయ డాక్టరు. భోపాల్ నుంచి వచ్చారు. ఆమె గీత పూర్తిగా చదివిందట. ఖురాన్, బైబిల్ కూడా చదివానని, కాని గీత నచ్చినట్లుగా తనకు మరో గ్రంథం నచ్చలేదని చెప్పింది. ఆమె భర్త కూడా డాక్టరే. వాళ్ళ మిత్రులు మరి ఇద్దరు డాక్టర్లు అందరు ప్రతి ఆరు నెలలకు ఒక ప్రదేశం వెళ్ళి నాలుగు రోజులు ఉండి వస్తారట. మా గురించి తెలుసుకొని మా పరిక్రమ గురించి అడిగి ఆశ్చర్యపోయింది. ఆమె ఆ ఉదయం ఐదు డిగ్రీల చలిలో మేము నదిలో మునిగిరావటం చూశారట.

“చలికి మునిగితే ఆరోగ్యం పాడవుతుంది” అన్నదామె.

“నర్మదామాయి అన్ని చూసుకుంటుంది. పర్వాలేదులెండి!” అన్నాను చిన్నగా నవ్వి.

ఆమె మిత్రులు, భర్త వచ్చారు. “నీవు ఎక్కడ ఉన్నా మాట్లాడుతూనే ఉంటావా!” అంటూ ఆమెను అల్లరి పెడుతున్నారు వారు.

వారందరిని మాకు పరిచయం చేశారామె. వాళ్ళు మమ్ములను విష్ చేసి వారి ఫలహారం పనిలో పడ్డారు. వారిని చూస్తే సంతోషం కలిగింది. జీవితాన్ని కులాసాగా గడుపుతు స్నేహితుల మధ్య తమ నూతన సంవత్సరం ఒక పుణ్యక్షేత్రంలో గడుపుతున్నారు. వారికి మమ్ముల్ని చూస్తే వింతగా అనిపించిందని అన్నారు. అట్లాంటాలో హాయిగా ఉండక, చలిలో ఈ నదీ స్నానాలేమిటని అడుగుతున్నారు.

మేము నవ్వాం చిన్నగా.

ఏం సమాధానం చెప్పలేదు. ఏం చెప్పగలం? మానవ జన్మ ఎత్తిన తరువాత జీవితం సాధనకు వాడటమే ఉత్తమమైనదని నా వ్యక్తిగత అభిప్రాయం.

అంతేకాక ఈ విషయభోగాలలో పడటం వ్యర్థం. ఉన్న కాసంత సమయము పరమాత్మ మీద పెట్టక వృథా చెయ్యటం కన్నా నేరముందా???

మేము ‘మా నూతన సంవత్సరాన్ని పవిత్ర నర్మదా నదీ తీరాన, జగదంబ ధ్యానంలో గడపటం కన్నా ఉత్తమంగా స్వాగతించటము ఉందా?’ అనుకున్నాము.

మేము మా ఫలహారం కానిచ్చి గదికొచ్చాము. సామాను సర్దుకొని తిరిగి మా వాహనం ఎక్కాం.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

సహస్రధార -1

మహేశ్వరానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో నర్మద నది, కొంత రాతి గుట్టల మీదుగా ప్రవహిస్తుంది. ఆ రాతి గుట్టలు చెదురుమదురుగా మారి నదిని వేయి ముక్కలుగా చీలుస్తాయి. అది జలపాతంగా కనపడుతుంది దిగువ నుంచి. ఆ ప్రదేశాన్ని సహస్రధార అంటారు.

మహేశ్వరానికి చాలా ప్రక్కనే ఉన్నందున దీనిని పిక్నిక్ ప్రదేశంగా కూడా చెబుతారు. నర్మద మీద సహస్రధారగా రెండు ప్రదేశాలు మనకు కనపడుతాయి. ఇది మహేశ్వరం దగ్గరైతే మరోటి మాండ్లా వద్ద. మాండ్లా వద్ద అది జలపాతంగా కనిపించదు. కాని మహేశ్వరం దగ్గర జలపాతంగా అగుపిస్తుంది.

పురాణ కథనం ప్రకారం – “కార్యవీర్యార్జునుడు సహస్రబాహువులతో ఉన్నవాడు. దత్త భక్తుడు. అతి పరాక్రమవంతుడు. అతనిని ఓడించినవారు లేరు. ఈ మాహిష్మతి నగరం (మహేశ్వరం) అతని రాజధాని.

అతను ఈ నర్మదాతీరంలో భార్యలతో జలకాటలాడుతు సుఖించేవాడు.

ఈ నర్మదా తీరం పరమ సుందరమైన ప్రదేశం. రావణుడు తన పుష్పకవిమానంలో ఈ నది మీదుగా ప్రయాణిస్తూ ఈ నదీమ సౌందర్యానికి ముగ్ధుడై తన విమానం దిగి నదిలో స్నానం చెయ్యటానికి వస్తాడు. నదికి ఎగువన కార్యవీర్యార్జునుడు జలకాలాడుతు తన సహస్రబాహువులతో నదిని ఆపుతాడు. రావణుడు నదిలోకి దిగే సరికే నది జలం హఠాత్తుగా తగ్గిపోతుంది. నర్మద కార్యవీర్యుని అఘాయిత్యాన్ని సహించక ఆయన చేతి వేళ్ళ గుండా ప్రవహించటం వలన వేయి ధారలుగా పారుతుంది. రావణుడు నది ఎగువకు వచ్చి కార్యవీర్యుని అఘాయిత్యాన్ని తెలుసుకొని అతనితో యుద్ధానికి దిగుతాడు. కాని కార్యవీర్యుని ముందు ఓడిపోతాడు. కార్యవీర్యుడు రావణుడిని ఖైదీ చేస్తాడు. రావణుడు తాత అయిన పులస్యమహాముని కార్యవీర్యునితో తన మనుమడిని వదలమని కోరుతాడు. ముని మీద గౌరవంతో రావణుడిని వదిలిపెడతాడు కార్యవీర్యుడు.

నర్మదా అక్కడ వేయి ముక్కలుగా ప్రవహించి నందున దీనిని సహస్రధార అని పిలుస్తారు”.

మేము అరగంటలో సహస్రధార చేరుకున్నాము.

రాళ్ళు గుట్టలుగుట్టలుగా ఉన్నాయి. వాటి మీద నెమ్మదిగా నడుస్తూ నీటి వరకు వెళ్ళాము. నీరు పెద్ద రాళ్ళ మీదుగా, మధ్యన ప్రవహిస్తోంది. చల్లటి ఆ ఉదయం వెచ్చటి సూర్యకిరణాల మధ్య, రాళ్ళ మధ్య తక్కువ లోతుతో ఉన్న నర్మదా అత్యద్భుతంగా తోచింది. నేను నా మాములు విధిగా నదికి నమస్కారం చేసి నదిలో నిలబడి జపం మొదలుపెట్టాను. అక్కడ చాలా చక్కటి ధ్యానం కుదిరింది. చాలా మంది పర్యాటకులు, అందునా టీనేజ్ వారు జంటలు జంటలుగా వస్తున్నారు. కొందరు మాత్రమే పిల్లలతో వస్తూ కనపడ్డారు. కొందరు నది మధ్య వరకూ నడుస్తున్నారు. నా జపం కానిచ్చి, నేను ఒడ్డుకు వచ్చాను. శ్రీవారు అక్కడి ఆ వాతావరణానికి, సౌందర్యానికి ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మేము తిరిగి నెమ్మదిగా రాళ్ళ మీదుగా దాటుతూ, నా కాలు మొరాయిస్తూ ఉన్నా లాగుతూ వచ్చి రోడ్డు మీదున్న మా కారు ఎక్కాం.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

మాండు:

సహస్రధార నుంచి దాదాపు మూడు గంటల ప్రయాణం తరువాత, ఎగుడుదిగుడు కొండ రహదారుల మీద ప్రయాణం చేసి మేము మాండు చేరుకున్నాము. మాండు ప్రస్తుతం చిన్న గ్రామమని అనటం కన్నా గ్రామానికి కాస్త పెద్దది, పట్టణానికి కాస్త చిన్నది అనడం ఉత్తమం.

కేవలం కొన్ని చారిత్రాత్మక భవనాలు, కోటల వలన ఆ గ్రామానికి ఆ ప్రాముఖ్యత. అది మధ్యప్రదేశ్‌లో ప్రతివారు తప్పక సందర్శించే పర్యాటక స్థలం నేడు, కాని దాని చరిత్ర చాలా గొప్పది. రాజకీయంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశంలో ఆ కోట నిర్మించబడి ఉంది. భారతదేశ నడిగడ్డ మీద ఆ కోట నిర్మించబడి ఉంది. రాజకీయంగాను చాలా కీలకమైన ప్రదేశమది.

అక్కడ లభించిన శాసనాలను బట్టి 6వ శతాబ్దంలో(555) ఆ ప్రదేశంలో కోట నిర్మాణం చెయ్యబడింది. పరమరా వంశానికి చెందిన రాజు మంజుదేవుని పేరు మీద ఆ కోటకు “మాండ్/మండపదుర్గ” అన్న పేరు వచ్చింది.

సముద్రమట్టానికి 2000 అడుగుల పైగా ఎత్తున, వింధ్యాచల పర్వతాలలో ఈ దుర్భేద్యమైన కోట నిర్మించబడింది. చుట్టూరా కీకార్యణంతో, కొండ మీద నిర్మించిన ఈ దుర్గాన్ని జయించటం అంత మామూలు విషయం కాదు. పరమరా వంశ రాజులు ఈ దుర్గం నుంచి మళ్వా రాజ్యాన్ని పరిపాలించారు. వారిలో భోజరాజు ప్రముఖమైన రాజు. ఆయన ధారా నగరం (నేటి ధర్) ని రాజధాని చేసుకున్నాడు. ఆయన పేరు మీద ఎన్నో కావ్యాలు ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని ఏలిన పరమరా వంశ రాజులు ఆ కోటను వృద్ధి చేశారు. వారు తమ రాజధానిని “ధర్” నుంచి “మాండు”కు తరలించినది కేవలం చుట్టూ ఉన్న రాజుల నుంచి బలవంతమైన చోటుకు వెళ్ళాలని.

పరమరా వంశ రాజులు దాదాపు 14వ శతాబ్దం వరకు మాండును రాజధానిగా చేసుకుని పరిపాలించారు. మహమ్మదీయుల దురాక్రమణలో వారు మాండును కోల్పోయారు. తరువాత మాండు చాలా సంవత్సరాలు హిందూ రాజుల చేతులలోకి రాలేదు, పరిపాలింపబడలేదు. మరాఠీలు 18వ శతాబ్దంలో మాండును జయించి తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. ఖిల్జీలు, తదనంతరం ఘోరీలు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని పరిపాలించారు. మాళ్వా నవాబు ఏలుబడిలోకి వచ్చింది తదనంతరం. ఎంతో కట్టుదిట్టమైన కట్టడం, వ్యూహాత్మక స్థలం కాబట్టి ఈ దుర్గాన్ని జయించటము ఎవ్వరికి సులభం కాదు.

ఈ దుర్గం మీద విజయం సాధించడం సామాన్యం కాదు. దీనిని హస్తగతం చేసుకున్న తరువాత ఘోరీలు, ఖిల్జీలు ఈ దుర్గంలో మరిన్ని కట్టడాలు కట్టారు. మాళ్వాను చాలా కొద్ది కాలం మాత్రం బజ్ బహదూర్ పరిపాలన చేశాడు. అతని పాలన వివరాల కంటే అతను “రాణీ రూపమతి”ల ప్రేమ గురించే ఎన్నో కథలు మనకు వినిపిస్తాయి. భారతీయ చరిత్రలో హిందూ, మహమ్మదీయ ప్రేమలలో ఇది ఒక ముఖ్యమైన ప్రేమకథ. బజ్ బహదూర్ మాండును పరిపాలించిన కాలము చాలా స్వల్పం. “ఒకరోజు అతను వేట నుంచి వస్తుండగా అతనికి, అడవిలో నర్మదానది తీరంలో చక్కటి పాట వినపడుతుంది.

మంత్రముగ్ధుడై బజ్ బహదూర్ అక్కడే నిలబడిపోతాడు. ఆ పాట పాడుతున్న చిన్న పిల్ల అక్కడి గ్రామాలకు చెందినది. గ్రామ ఠాకూరు కూతురు. తన పశువులను కాచుకుంటు పాడుతున్నది. బజ్‌ని ఆమె గానం మైమరపిస్తుంది. ఆమెను తీసుకొని మాండు వచ్చేస్తాడు. ఆమె గానంపై ప్రేమతో ఆమెను మాండులో నివసించాలని కోరుకుంటాడు. ఆమె నర్మదానది భక్తురాలు. తను నదికి దూరంగా నివసించలేనని, నదిని చూడనిదే పాడలేనని ఆమె బహదూర్‌కు చెబుతుంది. ఆమె నదిని ప్రతిరోజు దర్శించటానికి, పూజించటానికి వీలుగా బజ్ బహదూర్ రూపమతి మండపం నిర్మిస్తాడు. ఆ మండపం మాండులో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది. దానికి రెండు వైపుల ఉన్న బురుజుల నుంచి మాండు చుట్టూ ఉన్న వింధ్యాచల అరణ్యంతో పాటు, నర్మదా దర్శనం కూడా కలుగుతుంది. ఆ మండపం ప్రఖ్యాత రూపమతి మండపంగా పేరు తెచ్చుకుంది.

దానికి కొంత క్రింద దూరంలో బజ్ బహదూర్ భవనం ఉంది. రెండు అంతస్తుల ఈ భవనానికి మధ్య ఈతకొలను, చుట్టు గదులతో నిర్మితమై ఉంది. భవనం ఉపరితలంలో ఉన్న మండపాలు రాజస్థాన్ పద్ధతిలో నిర్మించి ఉన్నాయి. అత్యంత సుందరమైన మొఘల్ మరియు రాజస్థానీ శైలి మేలుకలయికల కట్టడాలలో ఇది ఒకటి. ఈ పైన మండపానికి పన్నెండు స్తంభాలతో కూడి ఉంటుంది. ఈ మండపంలో నిలబడి బజ్ బహదూర్ ప్రజలతో మాట్లాడేవాడాట.

అతను ప్రతిరోజు చేసే సంగీత కార్యక్రమం గురించి కథలు నేటికి వినపడుతాయి. ఆ భవనంలో విశాలమైన హాల్‌లో రెండు వైపుల వేదికలు ఉన్నాయి. ఒక వేదిక మీద బజ్ బహదూర్, మరో వేదికపై రూపమతి కూర్చొని సంగీత విభావరి చేసేవారట. ఆ సంగీత విభావరి అలా చాలా సమయం సాగిపోయేది. అక్కడ బయటివారికి కూడా ఆ సంగీతం వినపడేదని చెబుతారు. నేటికి ఆ మాండు చుట్టుప్రక్కల ఆ గానం గీతాలు వినపడుతాయని చెప్పుకుంటారు ప్రజలు.

బజ్ బహదూర్, రూపమతుల ప్రేమకథ ఆనాటి భారతదేశమంతా మారుమ్రోగిందట. బజ్ బహదూర్ మీద కలిగిన అసూయతో అక్బర్ చక్రవర్తి తన సైన్య అధ్యక్షుడైన ఆదమ్ అలీని సైన్యంతో పంపుతాడు. బలమైన మొఘల్ సైన్యం ముందు మాళ్వా నవాబు బజ్ బహదూర్ ఓడిపోతాడు. యుద్ధంలో మరణిస్తాడు. ఆదమ్ ఆలీ రాణి రూపమతిని తనకు దాసోహం కమ్మని కబురు పంపుతాడు. తన ప్రేమ శారీరకమైనది కాదని, దైవదత్తమైన సంగీతమే తన ప్రేమ అని రూపమతి, ఆలీని తిరస్కరించి ఆత్మహత్య చేసుకుంటుంది.

బజ్ బహాదూర్, రాణి రూపమతుల ప్రేమ మాండులోనే కాక యావత్ వింధ్యాచలమంతా వినిపిస్తుంది.

నేటికీ రూపమతి పేరున కొన్ని పాటలు జానపదులు పాడుకుంటారు.

***

మాండులో చూడవలసిన భవనాలలో “జహాజ్ మహల్” ఒకటి. ఉర్దూలో జహాజ్ అంటే పడవ. ఈ భవనానికి చుట్టూ ఉన్న సరోవరాల వలన, పైగా ఇది దూరం నుంచి చూస్తే ఒక పెద్ద పడవలాగా కనపడటం వలన ఈ భవంతికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన భవంతులలో ఇది ఒకటి.

ఈ భవనం ఎందరో రాజులకు, వేసవి విడిది. ఈ భవనం నిర్మించిన పద్ధతి వలన, వేసవిలో చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. దీర్ఘచతురాస్రాకారపు హాల్‌కు అర్ధ వృత్తాకారపు ద్వారాలు, ఒకదాని నుంచి ఒకదానికి గాలి వెళ్ళె వీలుగా నిర్మించబడ్డాయి. వీటికి పైన నిర్మించబడిన శిఖరాల నుంచి గాలి వెలుతురు పుష్కలంగా వస్తుంది. మండపాలకు గోపురాలు, స్తంభాలతో కొన్ని ఉన్నాయి. వీటి మూలంగా ఆ భవనంలో ఏ మూల కూడా గాలి వెలుతురు రాని చోటు ఉండదు. ద్వారాలకు చెక్కిన లతలు, సొగసులిడుతూ అందాన్ని తెచ్చాయి.

ఈ భవనము అక్కడి భవన సముదాయంలో ముఖ్యమైనది. పర్యాటకులను ఆకర్షిస్తున్నది కూడా. మునుపు ఇక్కడే పుష్పోత్సవం జరిపేవారు. బ్రిటీష్ కాలములో ఆ వేడుక ఆగిపోయింది. ఆ తరువాత స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ దానిని తిరిగి ప్రారంభించారు. ఆ భవనం పైనుంచి కొందరు పొరపాటున క్రిందకు పడి మరణించారని, ఎక్కువ ప్రమాదాలు జరిగేది అక్కడే అని చెప్పారు గైడ్. మేము వెళ్ళినది జనవరి ఒకటిన కాబట్టి జనాలతో తొక్కిడిగా ఉంది. పైన ఎందరో కుర్రకారులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడ పనిచేసే టూరిజం వారు ఆ పిల్లలకు భవనం అంచులకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ఆ భవనం మాత్రం అక్కడి ప్రధాన ఆకర్షణ.

అక్కడ ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. అందులో “హిందోల మహల్” ఒకటి. టీ ఆకారపు ఈ భవన నిర్మాణం చాలా విచిత్రంగా చేశారు. భవనం చూడగానే మనకు అది కొంత వాలుగా ఉందని తెలుస్తుంది. దానిని 70శాతం స్లోప్‌గా ఉండేలా నిర్మించారు. దీని పేరు హిందోల్. హిందోల్ అంటే ఊయల అని అర్థమట. దీనిలో ఊయలు వేసుకు ఊగేవారట సుల్తాను స్త్రీ జనం. దీని నుంచి లోపలికి వెడితే మరిన్ని అంతఃపుర భవనాలు కనపడతాయి. ఆ అంతఃపుర భవనాలలో నిలబడితే మనకు జహాజ్ భవనంలో జరిగేవి కనపడతాయి. తన అంతఃపురం నుంచి కూడా దూరంగా జరిగే వాటిపై సుల్తాన్ ఒక దృష్టి పెట్టి ఉండేవాడట.

ఈ అంతఃపుర భవనాల మధ్య లోతైన ఈతకొలను ఆశ్చర్యం కొలుపుతాయి. మూడు అంతస్తుల భవనాలు స్త్రీజనంతో ఉండేదట.

భవనాలలో లోపల స్నానగదుల నిర్మాణం కూడా ఎంతో అధునాతనంగా ఉంది. గదిలో నీటి ఆవిరికి వీలు, ఆ ఆవిరి పోవటానికి పైన కన్నాలతో కూడి నేటి “సవనా” అనబడే ఆవిరి గదులు గుర్తుకు వస్తాయి. వారి నీటి సరఫరా పద్ధతికి రాగి గొట్టాలను వాడి భవనాలకు నీటి సరఫరా చేసుకునేవారు. సరఫరా పద్ధతి ఎంతో ఆధునికంగా ఉంది. ఆవిరి మీద వారు ఎన్నో పనులు సమకూర్చుకున్నారక్కడ. మాండ్ కోటలోని భవనాలను చూస్తే విలాసవంతమైన సుల్తానుల జీవితం మన కళ్ళకు కనపడుతుంది.

మేము ఆ భవనాలు తిరిగి అక్కడికి వెళ్ళిన ప్రధాన కారణమైన రేవాకుండ్‌కు వెళ్ళాము.

అక్కడ హీతీ మహల్, జమీమసీదు, హోషంగుషా సమాధి కూడా ఉన్నాయి. హోషంగుషా సమాధి చూపరులను ఆకర్షిస్తుంది. అదో పాలరాయి కట్టడం. ఆ పాలరాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఆ సమాధి సౌందర్యం చూసి అలాంటిదే ఆగ్రాలో కట్టించాలని షాజహాన్ తలచాడట. ఆయన తన శిల్పులను మాండు పంపి ఆ సమాధి వివరాలు తెలుసుకు రమ్మనాడని మాకు గైడ్ చెప్పాడు. చూపరులను ఆశ్చర్యంలో ముంచే వాటిని తప్పక చూడాలన్నారు. దారి గుండా వెడుతుంటే కనపడుతున్నాయి కూడా. కాని నేను చేస్తున్న నా పవిత్ర పరిక్రమలో సాధువుల సమాధులు కాక మహమ్మదీయ రాజుల సమాధులు దర్శించే ఓపిక లేక నేను రేవాకుండ్‌కు వెళ్ళిపోదామనుకున్నా.

రేవాకుండ్

రేవాకుండ్ బజ్ బహదూర్ ప్యాలెస్ ముందర ఉంది. ఈ రేవాకుండం ప్రక్కన నిర్మించిన అందమైన కట్టడం ఆ కుండంలో ప్రతిబింబిస్తూ చాలా ముచ్చటగా ఉంది. నీరు మాత్రం చాలా పాచిగా ఉన్నాయి. వాటిలో పాచిని ప్రక్కకు నెట్టి, నీటిని మా వద్ద ఉన్న నర్మదాజలంలో కలుపుకుని కుండానికి పూజ చేసి నమస్కరాలు చేసి ప్రోక్షణ చేసుకు వచ్చాము.

రేవాకుండ్‌కు నర్మదకు ఎక్కడా భౌగోళికమైన సంబంధం లేదు. భూమి లోపల అంతరాలలో ఆ కుండం లోని నీరు నర్మదానది నీరని చెబుతారు. ఆ నీటిని తీసుకోకపోతే, పరిక్రమ అసంపూర్ణమని పరిక్రమవాసుల నమ్మకం.

మా డ్రైవర్ ఆ విషయం చెబుతూ, నడిచి వస్తున్న కొందరు పరిక్రమవాసులను మాకు చూపాడు. మేము వారికి పళ్ళు, బిస్కెట్లు ఇచ్చి “నర్మదా హరే!” అని పలకరించి వచ్చాము.

మాండులో ఉన్న మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్లో భోజనం చేశాము. మధ్యప్రదేశ్ టూరిజం వారి భోజనశాలలు, హోటళ్ళు బావున్నాయి. చాలా పరిశుభ్రంగా ఉండి, ధర అందుబాటులో ఉండి పర్యాటకులకు టూరిజం మీద గౌరవం పెంచుతున్నాయి. మాండు నుంచి వస్తూ ఆ కోట గోడలను చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన గోడలు, తలుపులు ఎంత దుర్భేద్యంగా ఉన్నాయి నేటికి!!! అని ముచ్చటగా అనిపించింది. వాటి ద్వారాల గుండా రెండు కారులు పడుతున్నాయంటే ఆనాటి వారి దూరదృష్టిని ఎంతైనా పొగడాలి కదా……

నా వ్యక్తిగతమైన భావన మా టూర్‌లో రెండు ప్రదేశాలు మేము అనవసరంగా దర్శించాం. అది ఒకటి బాజీరావు సమాధి, రెండు మాండు అని. ఇది నా వ్యక్తిగతమైన భావన.

ఆ రేవాకుండ్ నర్మదా నది అంతర్భాగమని నమ్మకం నాకు కలగకపోవటమే దీనికి కారణం.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

ఖటేగావ్

మేము మాండు నుంచి ఖటేగావ్ చేరుకునే సరికే చీకటి పడింది. ఖటేగావ్ చిన్న పట్టణము. మేము ఆ సాయంత్రం చాలా అలిసిపోయాము. మాండులో నడక, నా మోకాలి దెబ్బ వల్ల కారులో కూర్చొని నా కాలు నలిగిపోయింది.

నా సుందరకాండ పారాయణం మందకొడిగా సాగుతోంది. ఆ సాయంత్రం గదికొచ్చి స్నానాదులు పూర్తి చేసి నర్మదామాయికి పూజ, హారతి చేశాము. తరువాత నా వెంట తెచ్చుకున్న ఈవెన్ థామ్సన్‌ది పుస్తకం “వేకింగ్, డ్రీమింగ్ అండ్ బీయింగ్” చదువుతూ కూర్చున్నాను.

ఇదో అద్భుతమైన గ్రంథం. వేదాంతులు, సాధకులు చదవవలసిన పుస్తకాలలో ఇది ఒకటని నా నమ్మకం. మన లోన చేతనను గ్రహించే విషయమై రచయిత మాట్లాడుతాడు ఈ గ్రంథంలో. అది తురీయస్థితి గురించి. ఆయన ఉపనిషత్తు మీద సాగే ఈ గ్రంథంలో ప్రపంచంలో కాలనిర్ణయం క్రీస్తు పూర్వంలా కాక ఉపనిషత్తులకు ముందు, ఉపనిషత్తుల తరువాత అన్న డివిజన్ పెట్టాలని, ప్రపంచములో అత్యుత్తమమైన జ్ఞానం ఉపనిషత్తులని ఉద్బోధిస్తాడు.

మన పూర్వ జ్ఞానం నేటి తరం తెలుసుకోవటానికి ఎన్ని జీవితకాలాలు పట్టాలి? వీరికి మన జ్ఞానం అపురూపమైనదనే స్పృహ కలిగించటానికి ఎవరైనా ఉద్యమిస్తే బాగుండుననిపిస్తుంది.

మొత్తానికి అలా మా ఆరవరోజు పూర్తి అయింది. నాకు దగ్గు తగ్గినా, శ్రీవారికి జలుబు దగ్గు తగ్గలేదు. నా (క్రామ్స్) కాలి నరం లాగటం తగ్గలేదు. నాకు విటమిన్ల లోపము వలన ఈ కాలి మజిల్ క్రామ్ప్ అని శ్రీవారు విటమిన్ల టాబ్లెట్ వేశారు ఆ రాత్రి. అది మరో అనారోగ్యానికి దారి తీసింది మరుసటి రోజు.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here