ఆధ్యాత్మిక అనుభూతులని కలిగించే – ‘నమామి దేవి నర్మదే’

0
13

[dropcap]ప్రా[/dropcap]తః స్మరణీయంగా మనం మన పెద్దలు నుంచి కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాం. అందులో మన పుణ్య నదుల స్మరణ చేస్తూ ఈ శ్లోకం చదువుతూ నిత్యం స్నానం చేస్తే ఆయా నదుల్లో చేసిన పుణ్యఫలితం వస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి.

“గంగేచ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిమ్ కురు.”

ఈ సప్త నదుల్లో స్నానం అత్యంత పుణ్య ప్రదం, ఫల ప్రదం. కానీ నర్మదా నది పరిక్రమ ఇంకా ఎంతో ఫల ప్రదం. ఈ ఒక్క నదికే పరిక్రమ చేసే ఆచారం అనాది నుండి వస్తుంది.

నర్మదా నది పరిక్రమ మీద తెలుగుసాహిత్యంలో 2021 వరకు శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకం ‘నర్మదా పరిక్రమ’ అందుబాటులో ఉంది. వారు 2008 అక్టోబర్ నెలలో వారి రచనలు చదివి మిత్రుడు అయిన శ్రీ వెంకటేశ్వర రావు గారితో బస్సులో చేసిన 16 రోజులు యాత్ర అనుభవాలు, వారి గత యాత్రల్లో కలిసిన యోగులు గురించి సాధారణ పాఠకుడు చక్కగా చదువుకునేలా పుస్తకరూపంలో పొందుపరిచారు.

2022 ఆషాఢ మాసంలో ఓ పవిత్ర సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో విదేశం అయిన అట్లాంటా నగరంలో వాగ్దేవి వర పుత్ర, ప్రవచన విరించి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా వారి శిష్యురాలు శ్రీమతి యల్లాప్రగడ సంధ్య గారు వ్రాసిన ‘నమామి దేవి నర్మదే’ (నర్మదా పరిక్రమ యాత్రనుభవ కదంబం) పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆ విధంగా వారి పుస్తకం ‘నర్మదా పరిక్రమ’ రెండో పుస్తకంగా తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యంలో అందుబాటులోకి వచ్చింది.

శ్రీమతి సంధ్య గారు – ‘భారతీయ యోగులు’, ‘సత్యాన్వేషణ’, ‘కార్తీకంలో కాశీ యాత్ర’ వంటి ఎంతో విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలు వెలువరించి ఎంతో ఖ్యాతిని గడించారు.

‘నమామి దేవి నర్మదే’ వారు ఎంతో శ్రమ కోర్చి వారి పతి దేవుల సహాయంతో డిసెంబర్ 27, 2021 మార్గశిర సోమవారం నాడు యాత్ర ఆరంభం చేశారు.

ఈ యాత్ర వారి ఆధ్యాత్మిక జీవితం ఇంకా ముందుకు నడపడానికి, ఈ యాంత్రిక జీవితం నుండి విరామానికి అనే స్పృహతో తక్కువ సామానుతో ఎక్కువ ఆధ్యాత్మిక భావనతో కొనసాగాలని ‘సుందర కాండ’, వారి నిత్య పారాయణ గ్రంథం ‘దేవి సప్త శతి’ పుస్తకాలు, వారి పతి దేవులు ‘యోగ వాశిష్టం’ పుస్తకాలు వెంట తెచ్చుకున్నారు.

పురాణాల్లో నర్మదా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణు పురాణంలో రేవా నది (నర్మదకి మరో పేరు) ఒడ్డున చేసుకున్న ఏకాదశి వ్రతము జీవిత కాలం వ్రత ఫలితంతో సమానం అని ప్రతీతి.

నర్మదా పుట్టుక కథ:

మన పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో ఉత్పన్నం అయిన గరళాన్ని పరమ శివుడు సేవించి వింధ్య పర్వతం మీద కూర్చుని ఉండగా అయన కంఠం నుండి జారిన చెమట నదిగా ప్రవహించింది. అదే నర్మదా నదిగా ప్రసిద్ధి చెందింది అని పురాణ కథనం. ఇంకో కథనం ప్రకారం పురూరవ చక్రవర్తి తపస్సు చేసి భూమి మీదకు తీసుకుని వచ్చారు.

రచయిత్రి సంధ్య గారికి నర్మద యాత్ర చెయ్యాలి అనే సంకల్పం కలిగిన నాటి నుండి అనేక విఘ్నాలు ఎదురు అయ్యాయి (ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో రెండు సార్లు అతలాకుతలం అవ్వడం). ఈ యాత్ర సజావుగా సాగాలని ఆవిడ నిత్యం మహాదేవుని ఆరాధనగా ఏక రుద్ర అభిషేకం, నర్మదా అష్టోత్తరం పారాయణం చేయడం మొదలు పెట్టారు.

‘అమ్మా! జగదాంబ! నీవే సర్వ తీర్థాలవు, సర్వ నదులవు, కృపతో పరిక్రమకి మార్గం సుగమం చెయ్యాలి.. నీ పాద పంకజాలను సేవించి జీవితంలో, సాధనలో ముందుకు తీసుకొని వెళ్లేలా చేయ్యాలి’ అని వేడుకున్నారు. ఆ విధంగా పరమేశ్వర కృపతో, జగదాంబ కటాక్షంతో యాత్రని ఆరంభం చేశారు.

రచయిత్రి సంధ్య గారు వారి పతితో కలిసి మార్గశిర సోమవారం (డిసెంబర్ 27, 2021) నర్మద యాత్రకై ఓంకారేశ్వరంలో అడుగు పెట్టారు.

మొదటి రోజు ఓంకారేశ్వర దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఓంకారేశ్వర ఆలయం వర్ణన, స్థలపురాణం గురించి సమాచారం ఇచ్చారు.

రెండో రోజు సంకల్ప దీక్ష.

రేవా తీరే తపః కుర్వాత్
మరణం జాహ్నవి తటే!
దానం దద్యాత్ కురుక్షేత్రే,
గౌతమ్యామ్ త్రి తయం వరం!!

నర్మదని దర్శించినంత మాత్రాన సర్వ పాపాలు నాశనం, నర్మద పక్కన జపం సర్వ శ్రేష్ఠం అని పురాణాలు చెబుతున్నాయి.

నర్మదా పరిక్రమకి ముందు సంకల్ప దీక్ష నదికి పూజ ఆనంతరం తీసుకోవడం జరిగింది. పురోహితులు వారి చేతికి తోరాలు కట్టిన అనంతరం యాత్ర విధి, విధానాలు చెప్పారు:

  1. రోజూ రెండు పూటలా వారికి ఇచ్చిన జలం డబ్బాలకు పూజ చెయ్యాలి.
  2. ప్రతి రోజు నర్మదా దర్శనం చేసుకుని స్నానం చెయ్యాలి.
  3. ప్రతి రోజు కలిసిన ప్రతి వారిని ‘నర్మదా హరే’ అని పలకరించాలి.
  4. ఏ ఘాట్, ఏ కుండం దర్శించినా ముందు స్వయం ప్రోక్షణ చేసుకుని, వారి వద్ద డబ్బాలో నీరు సగం ఖాళీ చేసి అక్కడ నదిలో నీరు నింపుకోవాలి.
  5. సాత్విక ఆహరం మాత్రమే స్వీకరించాలి.
  6. సబ్బు, షాంపూ వాడరాదు.
  7. జుట్టు కత్తిరించుకోరాదు.
  8. నదిని ఎక్కడా దాట రాదు.
  9. పరిక్రమ పూర్తి అయ్యాక ఏ క్షేత్రంలో యాత్ర ఆరంభం చేసారో అక్కడే వారి దగ్గర ఉన్న నది జలంతో ఓంకారేశ్వరునికి అభిషేకం చెయ్యాలి. అప్పుడే పరిక్రమ పూర్తి అయినట్లు. తరువాత వారికి కట్టిన తోరాలు తొలగించడం జరుగుతుంది.

తరువాత రచయిత్రి నర్మదకి నమస్కారం చేస్తూ ‘సాధనలో ముందుకు తీసుకుని పొమ్మని, చతుష్టయాలలో ఒక్కటైనా సిద్ధించే వరం ఇమ్మ’ని ప్రార్ధన చేసుకున్నారు.

నమామి దేవి నర్మదే

నర్మద పరిక్రమలో భాగంగా అంకలేశ్వర్ నగరం చేరే సమయానికి శ్రీమతి సంధ్య గారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. జలుబు, దగ్గు ఎక్కువై యాత్ర సాగించడం కష్టమేమో అనే స్థితికి వచ్చారు. అదే ఊరులో ఉన్న వారి శ్రీవారి మిత్రులను వారు కలవవలసి ఉంది. వారి మిత్రులే వారిని వచ్చి కలుస్తాం అని చెప్పడం జరిగింది. సంధ్య గారికి కరక్కాయ ఔషధంగా వాడే అలవాటుతో వారు కరక్కాయ పట్టుకొని వస్తే బాగుంటుంది అని తలచారు. వారి మిత్రులు పత్ని సమేతంగా వచ్చి వారికీ ఓ సీసాలో వారు కోవిడ్ సందర్బంగా తాగుతున్న కాషాయం, ఓ చిన్న గుడ్డలో కర్పూరం, వేప పువ్వు, కొన్ని మూలికలు, దగ్గు మందు, కొన్ని సామాన్లతో బాటుగా కరక్కాయలు తేవడం అనే సంఘటన నర్మదామాయి కృపయే కదా అని రచయిత్రి నమ్మారు. ఆవిడ మనస్సులో

“దాసోహం తవ పాద పద్మ యుగళం అంబికే దాసోహం
శ్యామంగి శరదిందు కోటి వదనే సిద్ధాంత మార్గ ప్రియే
శాంతే శారద విగ్రహే శుభకరే శాస్త్రాది షడ్ దర్శనే
శర్వాణి పరమాత్మి కే పర శివే
ప్రత్యక్ష సిద్ధి ప్రదే
దాసోహం తవ పాద పద్మ యుగళం వందే అఖిలాండేశ్వరి!!”

అని ప్రార్థించారు.

ఇలా ఆవిడ మనసు జగన్మాత కృపకి పరవశులై మొక్కుకుని వచ్చిన ఆవిడ పేరు అడుగగా  ‘కామేశ్వరి’ అని చెప్పడం ఇంకొంత ఆశ్చర్యం కలిగి తాను ఎంతో నిష్ఠగా యాత్ర చెయ్యాలి అని వచ్చినందుకు, వస్తున్న అవరోధాలు తొలగించడం కోసం సాక్షాత్ నర్మదామాయి ఈ రూపంలో వచ్చి సహకరించిందా అనిపించింది. తరువాత వారికి యాత్ర చేయడానికి అవసరం అయిన స్వస్థత, ధైర్యం చేకూరాయి.

4వ రోజు బరూచ్ పట్టణం చేరుకొని అక్కడ నర్మద సంగమ స్థలం భావించే చోటుని దర్శించి నీలకంఠేశ్వర స్వామి ఆలయం దర్శనం.

5వ రోజు మనావర్, మహేశ్వరం, అహల్యా బాయి కోట అక్కడ విశేషాలు చెప్పారు. సంధ్య గారు అహల్యా బాయి గురించి ఎంతో విలువైన సమాచారం ఇవ్వడం జరిగింది.

6వ రోజు మహేశ్వరంలో నదీ స్నానం. ‘ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు నర్మదా నది పరిక్రమలో ఉన్నాం’ అనే దివ్య అనుభూతితో సహస్ర ధార, మాండు, రేవాకుండ్, ఖటే గావ్ దర్శనం.

7వ రోజు అమావాస్య విశేషం అయిన రోజున అఖండ జనవాహిని నదిలో స్నానం చేసి తరించడానికి రావడం, వారితో స్నానం చేసి పూజలు జపం నిష్ఠగా చేసుకోవడం, నేమావర్ ఆలయ దర్శనం, దారిలో అవధూత దర్శనం.

8వ రోజు ఉదిపుర. అక్కడ నది ఘాట్‌ల వద్ద ముందు రోజు అమావాస్య సందర్బంగా ప్రజలు అలక్ష్యంగా వేసిన చెత్తని శుభ్రం చేస్తున్న ఓ వృద్ధుని దర్శనం. ప్రకృతిని గౌరవించాలి, శుభ్రంగా ఉంచాలి అని ప్రకృతి పట్ల వారు చేస్తూ, యువకులు చేత చేయిస్తూ తీసుకుంటున్న శ్రద్ధకి నర్మదామాయి ప్రతిరూపంగా వారిని తలచి నమస్కరించడం. బేడాఘాట్ చౌసాతి యోగిని ఆలయ దర్శనం.

9వ రోజు జబల్పూర్, అమర్ కంటక్.

10వ రోజు రేవకుండ్ దగ్గర స్నానం ఆలయం దర్శనం.

11వ రోజు నర్మదలో బంజరు నది సంగమం అయ్యే చోట స్నానం, పూజ. అనుకోకుండా గో మాత దర్శనం, గో పూజ చేయడం, గో సేవ.

12వ రోజు నరసింహపూర్ నారసింహ దర్శనం, హౌసంగాబాద్.

13వ రోజు ఉదయం నది స్నానం పూజ, సాయంత్రం ఓంకారేశ్వరంకి తిరుగు ప్రయాణం.

భారతదేశానికి 3 ఏళ్ళ తరువాత వచ్చాక వాతావరణం, నీరు తేడా చేయడం, రోజు నర్మదా నది స్నానం వల్ల తగ్గని అనారోగ్యం అసలు యాత్ర పూర్తి అవుతుందా లేదా అనే సంశయాలతో శ్రీ మతి సంధ్య గారు బాధ పడ్డారు.

ఈ యాత్రలో రోజు పోహా, రెండు రొట్టెలు, ఆలు కూరతో వంటి పూట భోజనం అన్న ఆహార నియమాలు పాటించారు.

నర్మదామాయిని అను నిత్యం తలుస్తూ, పూజలు, స్నానాలు, జపాలు చేస్తూ కుటుంబాన్ని, మిత్రులని, సోషల్ మీడియాని దూరం పెట్టి, ఎవ్వరితో సంబంధం లేకుండా, తరచి తరచి లోపలకి చూసుకునే ప్రయత్నం చేశారు. చేసే పని శ్రద్ధగా, బాధ్యతగా, మీదు మిక్కిలి భక్తిగా, నర్మదా నది తల్లి తప్ప వేరే ధ్యాసకి అనుమతి ఇవ్వకుండా సాధనలో ముందుకు సాగాలని ప్రయత్నం చేసారు.

షీతాని ఘాట్‌లో స్నానం పూజ చేసి అంతకు ముందు దీక్ష తీసుకున్న పురోహితులు ద్వారా పూజ అనంతరం పాక్షిక దీక్ష విరమణ.

సాయంత్రం ఓంకారేశ్వరంకి చేరారు.

14వ రోజు ఉదయం ఓంకారశ్వర దర్శనం అభిషేకం వాయు లింగ ఓంకారేశ్వరునకు ముందు గురువుని తలచి స్వయంగా పంచామృత అభిషేకం, తమ వద్ద ఉన్న నర్మదా నది జలాలతో అభిషేకం. తరువాత ఆది శంకర గుహ దర్శనం. ఉజ్జయిని ప్రయాణం.

15వ రోజు ఉజ్జయిని మహా కాళేశ్వర దర్శనం, అభిషేకం, కాలభైరవ దర్శనం, సందీపుని ఆశ్రమం, రామ్ ఘాట్ (క్షిప్రా నది, నర్మదకి ఉప నది).

16వ రోజు అహల్య బాయి హోల్కర్ విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం.

నర్మదా దర్శనం

యాత్రలో భిన్న సమయాల్లో భిన్న రూపాల్లో అమ్మ దర్శనం ఇచ్చింది కదా అని యాత్ర విశేషాలు జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు శ్రీమతి సంధ్య గారికి కలిగాయి.

సాధన అంటే అజ్ఞానం నిర్మూలన. మరో మాటలో చెప్పాలి అంటే అవిద్యయే అజ్ఞానం. అజ్ఞానం వదలాలి అంటే గురువుగారు ద్వారా ఉపదేశం పొంది దానిని శ్రవణ, మనన, నిధి, ధ్యాసనలతో అభ్యాసం చెయ్యాలి.

అంతటా ఉన్నది చైతన్యం, చేతన, బ్రహ్మం అన్న విషయం తెలియడమే ఆత్మ సాక్షాత్కారం. అదే ముక్తి.

ఆ బ్రహ్మాన్ని లేదా సత్యాన్ని ఎరుక తెచ్చుకోవడం కోసం చేసేది సాధన. ఇది అంత సులభం కాదు. భక్తి యోగం, కర్మ యోగం లతో మాత్రమే సాధ్యం. అందుకే నిత్య పూజలు ద్వారా సాధన మొదలు అవుతుంది.

గురువును శరణు వేడి, గురువు ద్వారా ముందుకు సాగుతారు సాధకులు.

వేదాంత గ్రంధ పఠనం, శ్రవణం, పుణ్య క్షేత్ర దర్శనం, పరిక్రమలు కర్మ నాశనం చేసి సాధనని సుగమము చేస్తాయి.

సాధకులకు శ్రద్ధ, సహనం, మౌనం, పరమాత్మ, గురువు అంటే విశ్వాసం ఉండాలి.

శ్రీమతి సంధ్య గారికి ‘ఏది ఏమైనా ఈ పరిక్రమ యాత్ర జీవితాన్ని చూసే దృక్పథంలో మార్పుని తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అనే విశ్వాసంతో ఎంతో అందంగా, శ్రద్ధగా ఎన్నో విషయాలు, అనుభవాలు అక్షర బద్ధం చేసిన ‘నమామి దేవి నర్మదే’ (నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం)ని ముగించారు.

‘చాలా చక్కని పుస్తకం చదివాను’ అనే అనుభూతి ఈ పుస్తకాన్ని పలుమార్లు చదివేలా చేసింది.

ఇంకా ఎందరో తప్పకుండా చదివి వారు వారి ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం పెంచుకోవాలి అనే సత్సంకల్పంతో శ్రద్ధగా నిష్ఠగా నాకున్న పరిమిత జ్ఞానం, గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య ఆశీస్సులతో ఈ సమీక్ష వ్రాయడం జరిగింది.

గురవే సర్వ లోకానామ్
భీషజే భవ రోగిణామ్
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణా మూర్తయే నమః

🙏🙏🙏🙏🙏🙏

నమామి దేవి నర్మదే.

🙏🙏🙏🙏

152 పుటల ఈ పుస్తకం వెల 200 రూపాయలు. పుస్తకం కావలసిన వారు: అచ్చంగా తెలుగు శ్రీమతి భావరాజు పద్మిని గారిని 8558899478 లో సంప్రదించండి.

లేదా ప్రతులు కాచిగూడ నవోదయ బుక్ హౌస్‌లో కూడ లభ్యమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here