పేరులో”నేము”న్నది : నేం ప్లేట్

0
12

[dropcap]సి[/dropcap]నిమా అన్నది ప్రాథమికంగా దృశ్య మాధ్యమం. కానీ కొన్ని సార్లు కథ కారణంగా సంభాషణల మీద ఎక్కువ ఆధార పడాల్సి వస్తుంది. ఆ సంభాషణలు ప్రవచనాల్లాగానో, స్పీచుల్లాగానో వుండకుండానే చెప్ప దలచిన విషయాన్ని చాలా సహజంగా, సరళంగా చెప్పగలగాలి. అప్పుడింక సినిమాతో పేచీ వుండదు. కాని చాలా మంచి కథలను కూడా తెరమీదకు ఎక్కించేటప్పుడు కొంతమంది దర్శకులు విఫలమవుతుంటారు.

ఈ చిత్రం కాసేపు పక్కన పెట్టి పాత మాస్టర్లను ఒకసారి తలచుకుందాము. బెర్ట్ హాన్స్ట్రా “జూ”, “గ్లాస్” లాంటి డాక్యుమెంటరీలు తీసాడు. అవి కేవలం డాక్యుమెంటరీలా? లేదు చాలా బలమైన కథ, బలమైన దృష్టికోణాన్ని చూపించే చిత్రాలవి. ఆయన అప్పటికే ఫీచర్ ఫిలింస్ తీస్తున్నప్పటికీ తన సరదా కొద్దీ, తన పేషన్ కొద్దీ సినిమాలో ప్రయోగాలు చేస్తూ వొక్క సంభాషణా లేకుండా చిత్రాలు తీసాడు. అవి మనం ఎన్ని సార్లు చూస్తే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఇదే కోవలో ఈంస్ దంపతులు “టాప్స్” లాంటి చిత్రాలు తీసారు. కేవలం బొంగరాల గురించిన డాక్యుమెంటరీ కాదది, చాలా లోతైన విషయాలు తెలిపే చిత్రం, అర్థవంతంగా తీర్చి దిద్దిన చిత్రం. క్రిస్టఫర్ నోలాన్ ని కూడా బాగా నచ్చిన చిత్రం, నచ్చిన దర్శకులు. ఇక అలానే నార్మన్ మక్లారెన్ చిత్రాలు “పా ద ద”, “నైబర్స్”.

దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో నడిచే కొన్ని చిత్రాలు పూర్తిగా సంభాషణల మీద ఆధార పడతాయి. గోవింద్ నిహలాని పూర్తి నిడివి చిత్రమైన “పార్టీ” పూర్తిగా సంభాషణలతో నిండినది. ఆ దర్శకుడు స్వయంగా చాయాగ్రాహకుడు కూడా. అయినా సంభాషణా ప్రధానమైన కథనాన్ని తన కెమెరాతో సశక్తంగా చిత్రానికి వొక నిండు రూపమిచ్చాడు. సత్యజిత్ రాయ్ కూడా చివరి మూడు చిత్రాలు ఇండోర్స్ తీయాల్సి వచ్చి (అనారోగ్య కారణంగా) అలాంటి కథలనే ఎంచుకుని, సంభాషణలు ఎక్కువ వున్న చిత్రాలు తీసాడు. ఇక ఈ చిత్రంలో దర్శకురాలూ చేసిన పని ఏమిటంటే ప్రతి రెండు సీక్వెన్సుల్లోనూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు ఒక కీ వర్డ్ ని ఆశ్రయించాడం, కవిత్వంలోలా. అది రెండు జంటల మధ్య అయినా, ఒకే జంటలోని ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా. చాలా అంటే చాలా క్లుప్తమైన సంభాషణలతో కథనంతా చెప్పడమే కాదు, ఆ పాత్రల స్వభావం, పరిసరాలు, సామాజికత వీటన్నిటికంటే ముఖ్యంగా దర్శకురాలు చెప్పదలచుకున్న విషయం అన్నీ చెబుతుంది. “చోటా”, “డ్రైవెర్”, “డెపెండెన్సి” ఇలా ఆ పదాలు కథను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికీ, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికీ మధ్య తిప్పుతాయి.

కథ కేవలం సినెమా భాషలో నడిచింది.నేను సినిమా పరిచయానికి నేరుగా, సింప్లిస్టిక్ గా చెబుతున్నాను. మొదటి సీన్ లో గోళ్ళు కొరుకుతూ నీదా గౌర్ (దీప్తి పుజారి) తన భర్త ప్రత్యక్ష్ షర్మా (విషాల్ వశిష్ఠ) చేతిలో వున్న రెండు నేం ప్లేట్లూ చూసి పెదవి విరుస్తుంది. కారణం తన పేరు పెద్ద అక్షరాల్లో, భర్త పేరు కిందన చిన్న అక్షరాల్లో వుండడం. అత్తామామలకు నచ్చదంటుంది. మన పేర్లలో అక్షరాల సంఖ్య కారణంగా అలా తప్పలేదని భర్త నచ్చజెప్పినా వినదు. ఇక్కడి నుంచి మొదలవుతుంది కథ.


ఇక స్క్రీంప్లే పధ్ధతిలో చెప్పలేను కానీ క్లుప్తంగా కథ ఇది: ఆమె అతని కంటే మూడేళ్ళు పెద్ద. పైగా ప్రస్తుతం తన పేర్న ఇల్లు కొనుక్కుంది. పెళ్ళయ్యాక ఇంటి పేరు కూడా మార్చుకోదు. అత్తగారికి (మేనకా అరోరా) అభ్యంతరం వుండదు, పైగా మెచ్చుకుంటుంది కూడాను. కానీ మామయ్య (సునీల్ సిన్ హా) కు మాత్రం అహంకారం అడ్డొస్తుంటుంది. ఒకటి తనకంటే పెద్దామెను, ఎక్కువ సంపాదించేదాన్ని చేసుకుని తన కొడుకు లోకువయ్యాడనుకుంటాడు. కోడలు తన కొడుకుని కించపరిచే పనులు చేస్తుందనీ అనుకుంటాడు. అటు నీదా అనవసరంగా వ్యాకుల పడుతుంది, అపరాధ భావనను మోస్తుంది. ఎందుకలా? సమాజం ఆమె నెత్తి మీద మోపిన అన్యాయమైన బరువది. దాన్ని దించడానికి భర్త ప్రయత్నిస్తుంటాడు. ఇటు మామయ్య తను ఎవరి మీదా ఆధారపడటం ఇష్టం లేదు అనంటే, ఎక్కడా ఇన్నేళ్ళుగా పూర్తిగా నా మీద ఆధార పడ్డవారేగా, నాకంటే ఏడేళ్ళు పెద్ద అయినా ఏం సాధించారు మీరు అని ప్రశ్నిస్తుంది. ఇలా సంభాషణలతోనే స్త్రీ పురుషుల మధ్య అంకెలుగా పరచుకున్న వయసూ, సంపాదనల మీద చక్కటి వ్యాఖ్యానం ఈ చిత్రం.

అందరి నటనా బాగున్నా, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ సిన్ హా నటన గురించి. ఒక మూస పురుషుడి అహంకారాన్ని, “తెలివితేటలూ, లాజిక్కూ” కలిపి చక్కగా ప్రదర్శించాడు. సశక్తమైన డైలాగ్ డెలివరీ అతనిది. రచనా దర్శకత్వం స్రీజొని నాగ్ వి. ఆమె FTII లో చదువుకుని బ్లష్ సంస్థ కోసం లఘు చిత్రాలు తీసింది. మంచి భవిష్యత్తు వున్న దర్శకురాలు.

యూట్యూబ్ లో వుంది. చూడమని నా రెకమండేషన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here