నమ్మకం చెడింది

2
10

[dropcap]”మం[/dropcap]చోడు, మంచోడు, అని ముద్దు పెట్టుకోబోతే, మూతి మీద గుద్దాడట నీలాంటోడే వెనకటికి. అలానే, నువ్వేదో మంచోడివనీ, మనూరోడివనీ నమ్మి నిన్ను నా ఇంట్లో పనికి పెట్టుకున్నాను. కానీ, నువ్విలా నా నమ్మకాన్ని చెడగొట్టి దొంగతనానికి దిగడం నమ్మకద్రోహం రా దరిద్రుడా. అయినా, నువ్వు దోచుకుపోయే ఈ డబ్బు స్వేచ్ఛగా ఖర్చుపెట్టి ఏడవలేవు. దర్జాగా శభాష్ అని బ్రతకలేవు. ఎక్కడికోపోయి బిక్కుబిక్కుమని బ్రతకాలి. ఒకవేళ నీ ఖర్మ కాలి పోలీసులకు దొరికితే నీ బతుకు బస్టాండ్ అయిపోద్ది. కావాలంటే చెప్పు, నీ జీవితం ఓ నాలుగు రాళ్ళు పెంచుతాను. లేదంటే కొంత డబ్బు ఇస్తాను. దర్జాగా ఖర్చు పెట్టుకో” చెప్పాడు శేఖరం.

“చాల్లే చెప్పొచ్చావ్ నీతి సూత్రాలు. ఎన్నాళ్లని నీ కొంపలో ఊడిగం చేయడం, జీతం తీసుకోవడం. నేనూ బంగ్లా కొనాలి, కారులో తిరగాలి. జల్సాగా బతకాలి. లక్షలు రూపాయిల్లా ఖర్చుపెట్టాలి. వేలకు వేలు, చిల్లరలా అనిపించాలి. అపుడే ఆనందం. నీ ఇంట్లో చేసే ఈ పనితో అది ఈ జన్మకి వీలు అవుతుందా? అందుకే ఈ దొంగతనం చేసి ఒక్కసారే నిచ్చెన ఎక్కేస్తాను. ఆ తర్వాత ఏ విదేశాలకో చెక్కేస్తాను. గొప్పగా జీవితాంతం బతికేస్తాను. తలుచుకుంటేనే చుక్కల్లో షికారుకి ఎళ్లినట్టుంది” చెప్పాడు ఉత్సాహంతో ఊగిపోతూ.

“ఏడిసావ్ అత్యాశ పీనుగా. అంతా అనుకున్నట్టే జరగడానికి ఇదేవన్నా సినిమానా! ఒక్కసారి తప్పటడుగు వేసావంటే మడుగులో దిగినట్టే. ఈ ఇంట్లో పని చేస్తున్నావు, మా ఇంటిలో ఓ మనిషి లాగానే కలిసిపోయావ్. ఇపుడు ఇలాంటివి చేసి నీ విలువ తగ్గించుకోవద్దు. నీ జీవితం పాడు చేసుకోవద్దు. నువ్వు చేసే ఈ పనితో నీ కుటుంబం కూడా రోడ్డున పడి అగోరిస్తుంది ఆలోచించుకో. ఏదేదో ఊహించుకుని, ఉబలాటంతో ఊగిపోయి చేసే ఒక్క పొరపాటు, జీవితాంతం ఓ తలపోటుగా మిగిలిపోవచ్చు. ఆలోచించుకో ” చెప్పాడు శేఖరం.

“చాల్లేవో. వింటున్నాను కదా అని విపరీతంగా ఉపన్యాసం ఇచ్చేస్తున్నావ్. మాటలు కట్టిపెట్టి ఈ లాకర్ పాస్వర్డ్ చెప్పు” అడిగాడు గిరి కత్తి తీసి చూపిస్తూ.

“ఇక నీ ఖర్మ. ఎనిమిది, నాలుగు, అయిదు కొట్టు. అది ఓపెన్ అవుతుంది” చెప్పాడు.

వెంటనే ఆతృతగా, పెదాలు తడుపుకుంటూ, చక చకా ఆ నెంబర్ ఆశగా నొక్కేసాడు గిరి. అంతే, “వామ్మో” అని గావు కేక పెట్టి, కాకిలా కిందపడిపోయాడు.

కొద్దిసేపటికి లేచాడు. కానీ అతని చేతులూ, కాళ్ళూ కట్టేసి ఉన్నాయి. అతనికి ఏం అర్థం కాలేదు. “ఏవిటి అయ్యగారు ఇది. ఇందాక ఏం జరిగింది” అడిగాడు గిరి ఆవదం తాగినట్టు మొహం పెట్టి.

“నీ బొంద జరిగింది. ఆ లాకర్ని తెరవడానికి ఒక నెంబరూ, నీలాంటి వాళ్ళ పని పట్టడానికి ఒక నెంబరూ ఉంటుంది. ఆ నెంబర్ నొక్కితే షాక్ కొట్టేలా ఏర్పాటు చేసి ఉంటుంది. అది తెలియక, నువ్వు నేను చెప్పిన నెంబర్ టక టకా నొక్కేసావ్, తాటిపండులా నేల మీద పడ్డావ్” చెప్పాడు శేఖరం.

“సో సారీ అయ్యగారు, ఇలా ఇంకెప్పుడూ చేయను. కార్ ఏదో కడగమన్నారుగా. కడిగేసి, ఆ తర్వాత కూరగాయలు తెచ్చేస్తాను. ఇక నుండి ఇలా ఎద్దులా ప్రవర్తించకుండా బుద్ధిగా నా పని చేసుకుంటానండీ” చెప్పాడు చిన్నగా నవ్వేస్తూ.

“ఆ ఆఫర్ ఎప్పుడో ఎక్స్‌పైర్ అయిపోయింది. నువ్వు అత్యాశతో చేసిన ఈ ఒక్క పని వల్ల నీ జీవితం, కుళ్ళిన అల్లం అయిపోయింది. నీ భార్య వంట మనిషి ఉద్యోగం కూడా ఊడిపోయినట్టే. ఎందుకంటే నిన్ను ఇలా పోలీసులకు పట్టిస్తున్నానని ఆమె మేం తినే వాటిలో ఏమైనా కలిపి మమ్మల్ని ఖతం చేయొచ్చు. ఇంజినీరింగ్ చదివిన మీ అబ్బాయికి, నా కంపెనీలో ఉద్యోగం రికమెండ్ చేశాను. ఇప్పుడు అది కూడా విరమించుకున్నాను. కొద్దిసేపట్లో పోలీసులు కూడా వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు” చెప్పాడు శేఖరం అసహనంగా.

“అంత మాట అనకండి అయ్యగారూ. ఈ ఒక్కసారికి తూచ్ అనుకోరాదూ. ఎంతైనా మీ ఇంట్లో పనిచేసినవాడ్ని. ఇలా నా బతుకు పంక్చర్ చేయకండీ” బ్రతిమాలాడు గిరి.

“బుడగ పగిలిన తర్వాత ఊదినా ప్రయోజనం ఉండదు. నమ్మకం కూడా అంతే. ఓ సారి చెడి పోయాక తిరిగి కుదరదు. నువ్వు నమ్మించి మోసం చేశావ్” చెప్పాడు శేఖరం .

“అలా అయితే, మీరూ ఓ రకంగా నన్ను నమ్మించి మోసం చేసినట్టే, లాకర్ నెంబర్ నొక్కమని చెప్పి నన్ను షాక్‌కి గురి చేశారు. ఇది తొండి” అంటుండగానే ‘అనుభవించు రాజా అనుభవించు రాజా’ అనే పాట టీవీలో వస్తోంది. ఇంతలో పోలీసులు వచ్చి గిరిని అరెస్టు చేసి తీసుకుపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here