నమ్మకు… నన్ను నమ్మకు

4
14

[dropcap]న[/dropcap]న్ను నమ్మకు…!

నాకు కడుపు నిండినపుడు
నీ కడుపు ఎండిన వ్యథలు రాస్తాను
నా కడుపు ఎండినపుడు
నీ కడుపు మండిన కథలు రాస్తాను

నన్నెప్పుడూ నమ్మకు…!!

నీకు నినాదాల చిట్టా ఇచ్చి
నిన్ను ఎర్రటి ఎండల్లోకి తరిమేసి
చల్లని గదుల్లో తీయని షర్బతులు సేవిస్తూ
మెత్తని పరుపులపై సేదదీరుతుంటాను
అరుపుల చర్చల్లో వాదనలు చేస్తుంటాను

నన్నెన్నడూ నమ్మకు…!!!

పాత జ్ఞాపకాల చిట్టాలు వెతుకుతూ
సరిహద్దు దాటిన సాహిత్యాన్ని పరిశీలిస్తూ
నీ మస్తకంలోకి దిగుమతి చేయాల్సిన
కొంగొత్త భావజాలాన్ని రూపొందిస్తుంటాను

ఆవేదన ఆవేశం ప్రతీకారం తగుపాళ్ళలో వేస్తూ
మేధోకల్వంలో మెల్లమెల్లగా నూరుతుంటాను
అశాంతి అంతర్యుద్ధాల పడుగూ పేకల మగ్గంపై
విధ్వంసకర ప్రణాళికల చీరలను నేస్తుంటాను

నే చెప్పిందల్లా నిజమనుకోకు…!!!!

నేను నమ్మనిదాన్ని నీచే నమ్మించేస్తుంటాను
నేనే పాటించనిది నిన్ను పాటించమంటాను
నా రక్తాన్ని జాగ్రత్తగా కాచుకుంటూ
నా వారసత్వానికి విదేశీ కొలువులు కొనిపెడతాను
నా భావజాలపు వారసత్వాన్ని నీకంటబెట్టి
నీ రక్తాన్ని చెమటలా చెమర్చేయిస్తుంటాను
నీ కన్నీటిని భ్రమల కాల్వల్లో కార్చేయిస్తుంటాను

ఎందుకో … ఎందుకో…

నిజమేమిటో నీతో
ఇప్పటికైనా ఇలా చెప్పాలనిపించింది
నీ అమాయకత్వం ముందు నా మనసు
ఇన్నాళ్ళకైనా ఇలా విప్పాలనిపించింది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here