నానాటి బ్రతుకు నాటకము

1
9

[box type=’note’ fontsize=’16’] “ఎప్పుడో పోతామని ప్రకృతి ధర్మాన్ని ఆపలేం. స్తబ్ధుగా వుంటే కుదరదు. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు అన్నీ వుంటాయి” అంటున్నారు పెయ్యేటి శ్రీదేవినానాటి బ్రతుకు నాటకము” కథలో. [/box]

[dropcap]ఆ[/dropcap]రేళ్ళ రోహిత్ కాన్వెంటు ఆటో దిగి పుస్తకాల సంచి కుర్చీలో పడేసి సోఫాలో పడుకుండిపోయాడు. రోహిత్ తల్లి దివ్య వాడికి తింటానికి ప్లేట్లో జంతికలు, యాపిల్ ముక్కలు పెట్టి తెచ్చింది. కాని వాడు పడుకునే వున్నాడు. ఆ పడుకున్న తీరు చూస్తే అలసటతో నిద్ర పోతున్నట్టుగా అనిపించలేదు.

“లేరా రోహిత్! కాళ్ళు కడుక్కుని డ్రస్ మార్చుకుని రా.”

కాని వాడు కళ్ళకి చేతులడ్డం పెట్టుకుని అలాగే పడుకున్నాడు.

“ఏమైందిరా రోహిత్? లే… నీరసంగా వుందా?”

కానీ వాడు సమాధానం చెప్పలేదు. ఎందుకో ఏడుస్తున్నాడు.

“ఎవరన్నా కొట్టారా?”

“ఊహు….”

“టీచర్ తిట్టిందా?”

“ఉహు…..”

“ఒంట్లో బాగాలేదా?”

“ఊహు…….”

“ఆకలిగా వుందా?”

“ఊహు……”

“డాడీ ఊరెళ్ళారని బెంగగా వుందా?”

“ఊహు…….”

“మరెందుకు ఏడుస్తున్నావు? ఏమిటో చెప్పు విసిగించక.”

“మరేమోనే… మరేమోనే…” ఏడుస్తూ చెప్పలేకపోతున్నాడు.

వాడికి మంచినీళ్ళు తాగించి, ఒళ్ళో కూచోపెట్టుకుని కళ్ళు తుడిచి, బుజ్జగించి అడిగింది తల్లి దివ్య, “ఎందుకురా అలా వున్నావు?”

వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. “మరేమోనే ….. నా ఫ్రెండు వికాస్ లేడూ?”

“ఊ…? కొట్టాడా నిన్ను?” వాళ్ళిద్దరూ కొట్టుకోరని తెలుసు. చాలా స్నేహంగా వుంటారు. వాడి చేత సమాధానం రాబట్టడానికి తెలీనట్టు అడిగింది.

“ఇవాళ వికాస్ స్కూలుకి రాలేదు.”

“మరెందుకలా వున్నావు? వాడు స్కూలుకి రాలేదనా?”

“కాదు…. మరేమోనే…. వాళ్ళ తాతగారు పోయారు” అంటూ ఏడ్చాడు. “నాకు వికాస్‌కి బోలెడు కథలు చెప్పేవారు” అంటూ మళ్ళీ ఏడ్చాడు.

ఆ పసివాడ్ని ఎలా ఊరుకోపెట్టాలో అర్థం కాలేదు దివ్యకి. వికాస్ తల్లి సంధ్య, దివ్య పక్క పక్క వీధుల్లో వుంటారు. పిల్లలవల్లే వీళ్ళు కూడా స్నేహంగా వుంటారు. ఇద్దరూ ఒకే ఆటోలో వెడతారు కాన్వెంటుకి. ఇద్దరు కలిసి ఆడుకుంటారు. వికాస్ తాతగారు చాలా మంచివారు. ఆయన వీళ్ళిద్దరికీ ఎన్నో కథలు, మంచి విషయాలు చెబుతూంటారు. శలవరోజొస్తే రోహిత్ వికాస్ ఇంట్లోనే వుంటాడు. ఒక్కోసారి అక్కడే భోంచేస్తాడు. వికాస్ తాతగారంటే రోహిత్‌కి చాలా ఇష్టం.

క్రితం రోజు ఆదివారం ఉదయం ఫోన్ చేసి చెప్పింది సంధ్య, మామగారు హార్ట్ అటాక్ వచ్చి పోయినట్టు. రోహిత్ అప్పటికి ఇంకా నిద్ర లేవలేదు. అప్పుడు వెళ్ళి చూసొచ్చింది.

తరవాత సోమవారం స్కూలుకి శలవు. శలవురోజు వికాస్‌తో ఆడుకుంటానంటే వెళ్ళనివ్వలేదు తల్లి.

మంగళవారం వికాస్ స్కూలుకి రాలేదెందుకో అని వస్తూ అక్కడికెళ్ళొచ్చాడు రోహిత్. తాతగారు లేరనేసరికి వాడి పసిమనసు తట్టుకోలేక పోయింది.

ఏం పెట్టినా తినడం లేదు. వికాస్ తాతగార్ని, ఆయన చెప్పిన కథలని, ఆయన ప్రేమగా మాట్లాడిన మాటల్ని తలుచుకు తలుచుకు ఏడుస్తున్నాడు రోహిత్.

చిన్నవయసులో మొట్టమొదటిసారి ఎవరి మరణమన్నా చూసినప్పుడు, ఏదీ అర్థం కాని ఆ పసిపిల్లలకి మరణం గురించి తెలిసేలా చెప్పడం చాలా ఇబ్బందికరమైన విషయం.

దివ్య అంది, “ఊరుకో బాబూ! ఆయన పెద్దవారయిపోయారు కదా? అందుకే పోయారు.”

“ఐతే పెద్దవాళ్ళయాక అందరూ పోతారా? ఐతే మన తాతగారు కూడా పోతారా?”

వాడి మాటలు తప్పుగా తోచి, “ఛీ, అలా అనకూడదు. మన తాతగారు బాగానే వుంటారు. నీ పిచ్చి ప్రశ్నలింక చాలించి, రేపు చెయ్యాల్సిన హోంవర్కు చెయ్యి. పెద్దయిపోగానే పోరు. బాగా పెద్దయి, ముసలివారయాక పోతారు.”

“ముందర నేనడిగిన మాటకి జవాబు చెప్పు మమ్మీ. పెద్దవాళ్ళమయాక అందరూ పోతామా? అసలంత పెద్దవాళ్లమెందుకవాలి? చిన్నగానే వుందాం. అప్పుడైతే ఎవరూ పోరు కదా?”

“అలా ఎలా కుదురుతుంది? అది నీ చేతుల్లో వుందా? పుట్టినప్పుడెలా వున్నావో, ఇప్పుడు నువ్వలా వున్నావా? అప్పటికి ఇప్పటికి కొంచెం పెద్దయావు కదా? అలాగే అందరూ కొంచెం పెరిగి పెద్దవుతారు. మనం తెచ్చినప్పుడు జానీ కుక్కపిల్ల ఎంతుంది? చాలా చిన్నగా వుంది. ఇప్పుడు బాగా పెద్దదయింది కదా?”

“ఐతే నేనూ, నువ్వూ, డాడీ అందరం ముసలి వాళ్ళయిపోతామా? ఐతే అందరం ఎప్పుడో పోవల్సిందేనా?”

“అందరం పోవటం లేదుగాని, నన్ను విసిగించక క్రితంసారి నీ బర్త్ డేకి డాడీ నీకు మంచి పెన్ను కొన్నారుగా? అది ఓసారి తీసుకురా.”

“ఎందుకు?”

“కావాలి.”

“అదింకా ఎక్కడుంది? పాడయిపోయింది.”

“పోనీ, అదే పట్రా.”

“లేదు. పడేసా.”

“పోనీ, నువ్వు స్కూల్లో చేరినప్పుడు మంచి ఖరీదయిన బేగ్ కొన్నారుగా? అది పట్రా.”

“అదీ లేదు. పాడయిపోయిందిగా? అందుకే మళ్ళీ ఇంకోటి కొన్నారుగా? ఐనా అవి నీకెందుకు, పాతవన్నీ తెమ్మంటావు?”

“కావాలి. ఆ పెన్ను, బేగు అంటే నాకు చాలా ఇష్టం. అది మళ్ళీ తమ్ముడు స్కూల్లో చేరాక వాడికిస్తా.”

“తమ్ముడికి కొత్తవి కొను. అది పాడయిపోయాయని నీకూ తెలుసు. ఐనా నేనడిగిన దానికి సమాధానం చెప్పవేం మమ్మీ?”

“అదే చెబుతున్నా విను. పిచ్చిపశ్నలు వెయ్యకు.” ఇంక చెప్పక తప్పేట్టు లేదని రోహిత్‌కి చెప్పింది. “చూడు రోహిత్! పుట్టిన ప్రతి జీవి ఏదో ఓరోజు మరణించక తప్పదు. అందుకే జీవించినంత కాలం మంచిగా బతకాలి.”

“మంచిగా అంటే?”

“క్రమశిక్షణతో వుండాలి. చెడుపనులు చెయ్యకూడదు. ఉట్టినే కాలం వృథా చెయ్యకూడదు. నువ్వు చెయ్యవలసిన హోంవర్కు అదీ వెంటనే చేసెయ్యాలి. అందరితో మంచిగా వుండాలి. పెద్దలను గౌరవించాలి. న్యాయంగా, ధర్మంగా వుండాలి. అబద్ధాలు ఆడకూడదు. దొంగతనాలు చెయ్యకూడదు. అందర్నీ ప్రేమగా చూడాలి. దైవభక్తి కలిగివుండాలి.

సరేగాని, నీకు కొన్న బేగ్, పెన్ను పాతవైపోయాయని పడేసావు కదా? అలాగే మనుషులు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవారైపోతారు. అప్పుడు ముసలితనం వచ్చాక అనారోగ్యాలు అవీ చేస్తాయి. అవి ఎప్పటికీ తగ్గకపోతే దేవుడు వాళ్ళని తీసుకుపోతాడు.”

“వయసు అంటే?”

“అంటే, ప్రతియేడూ పుట్టిన రోజుకి ఏళ్ళు పెరుగుతూంటాయికదా? అలా పెరిగి పెరిగి పెద్దవారైపోతారన్నమాట.”

“అలా ఐతే బర్త్‌డే చేసుకోకుండా వుంటే పెద్ద వాళ్ళం, ముసలివాళ్ళం అవము కదా?”

“బర్త్‌డేలు చేసుకోకపోయినా కాలం, రోజులు గడుస్తాయి కదా? గడియారం పాడై తిరగకపోయినంత మాత్రాన కాలచక్రం ఆగిపోదు కదా? నువ్వు బద్ధకంగా పడుకున్నా కాలం గడుస్తూనే వుంటుంది. అందుకే టైము వృథా చెయ్యకూడదు.”

“మరి ఇప్పుడు నీ వయసెంత మమ్మీ?”

“ముఫ్ఛైఐదు ఏళ్ళు. ఎందుకలా అడిగావు?”

“ఐతే నువ్వు పెద్దయ్యావా, ముసలయ్యావా?”

“మనిషికి నాలుగు స్టేజిలుంటాయి. పుట్టడం, పెరగడం, పెద్దవడం, గిట్టడం.”

“గిట్టడం అంటే?”

“మరణించడం. ఒరేయ్! ఇవన్నీ ఇప్పుడు చెప్పినా నీకర్థం కావు. నువు వయసుకు మించి ఆలోచిస్తున్నావు. అలా వుండకూడదు. స్కూల్లో ఇచ్చిన హోంవర్కు అదీ చెయ్యి. వికాస్ తాతగారు చెప్పే కథల పుస్తకాలు అనేకం దొరుకుతాయి. అవి చదువుకో. నీకెన్ని కావాలో అన్నీ కొంటా. సరేనా?”

“మరి పోయేటప్పుడు ఇవన్నీ కొనుక్కోవడమెందుకు? తినడమెందుకు?”

“అవన్నీ మనుషులకే కాదు, ప్రతి ప్రాణికి ప్రకృతి ధర్మాలుంటాయి. ఆకలేస్తే తిండి తినాలి. నిద్ర వస్తే పడుకోవాలి. నీకేదన్నా కొనుక్కోవాలనే కోరిక కలిగినప్పుడు కొనుక్కోవాలి. దాహమేస్తే నీళ్ళు తాగాలి. చెవులకి మంచి సంగీతం, దేవుని స్తోత్రాలు, మంచిమాటలు వినాలి. ముక్కుకి మంచి సువాసనలు పీల్చాలి. నీ ఇష్టాఇష్టాలని నెరవేర్చుకోవాలి. అలా అని అత్యాశకు పోకూడదు. ఆడుకోవాలని అనిపిస్తే నీ స్నేహితులతో ఆడుకోవాలి. ఎప్పుడో పోతామని ప్రకృతి ధర్మాన్ని ఆపలేం. స్తబ్ధుగా వుంటే కుదరదు. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు అన్నీ వుంటాయి. బాధలొస్తే కుంగిపోయి, సుఖాలొస్తే పొంగిపోవడం కాదు. ఏ సమస్య వచ్చినా, ఎన్ని కష్టాలెదురైనా నిలదొక్కుకునే ధైర్యంగా ముందుకు సాగాలి. అందుకే ఎప్పుడూ దైవధ్యానం చెయ్యాలి. అప్పుడు మనసుకి ఊరట లభిస్తుంది.

పుట్టగానే పాలు తాగుతారు. తొమ్మిది నెలలయాక పాకుతారు. అన్నం ముట్టిస్తారు. పాకడమయాక మెల్లగా నడవడం నేర్చుకుంటారు. మూడేళ్ళొచ్చాక పూర్తిగా నడుస్తారు. అప్పటికి ముద్దు ముద్దుగా అన్నీ మాట్లాడతారు. పిల్లలు స్కూల్లో చేరతారు. ఐదేళ్ళొచ్చాక అక్షరాభ్యాసం, చదవడం మొదలెట్టాలి. పిల్లలు అల్లరి చేస్తారు. బలమైన ఆహారం, అలాగే ప్రొటీన్లున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువు ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. తరువాత కాలేజీ చదువు. అప్పుడే నిర్ణయించుకుని డాక్టరు చదువో, ఇంజనీరింగో, ఇంకా అనేక రకాల చదువులున్నాయి. అప్పుడింకా బాగా చదవాలి. మంచి రేంకు వస్తే, మంచి ఉద్యోగం తొందరగా వస్తుంది. ఫారిన్ ఛాన్సులు కూడా వస్తాయి. ఇంక ఆ తర్వాత పెళ్ళి. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాక జీవితంలో స్థిరపడినట్టు అన్నమాట. అంటే నీకో కుటుంబం ఏర్పడుతుంది. తరవాత నీకూ పిల్లలు పుడతారు. నువ్వెలా పెరిగి పెద్దయావో, ఎంతమంచిగా చదువుకున్నావో, నేను పెంచినట్టే, నువ్వూ పిల్లల్ని పెంచి పెద్దచేసి వాళ్ళకి వివాహం చెయ్యాలి. అప్పుడు వాళ్ళూ వాళ్ళకి పిల్లలుంటారు. ఆ పిల్లలకి నువ్వు తాతయ్యవవుతావు. నీ పిల్లలకి నేను, నాన్న నానమ్మ, తాత అవుతాం. ఇలాగే తరతరాలు ఏర్పడతాయి. తెలిసిందా? దీన్నే జీవితచక్రం అంటారు. ఇంక నన్ను విసిగించక భోంచేసి చదువుకుని పడుకో. పాపం, వికాస్ వాళ్ళ తాతయ్య కోసం ఇంకా బెంగెట్టుకుంటాడు కదా? వాడికి నువ్వే ధైర్యం చెప్పు. వాడు స్కూలుకొచ్చాక ఇద్దరూ కలిసి చక్కగా ఆడుకోండి. బాగా చదువుకోండి.”

“ఎందుకే ఆ పసివాడికి జీవితం గురించి, మరణం గురించి చెప్పడం? వాడికేమన్నా అర్ధమయ్యేడుస్తుందా? చదువు గురించి చెప్పు.”

“వాడు పసివాడా? అత్తయ్యా! అసలు వాడేసిన ప్రశ్నలు విన్నారా? ఇంకోళ్ళయితే వీపు మీద ఒక్కటేసేవాళ్ళు. నేను కాబట్టి విపులంగా చెప్పాను. ఎప్పటికైనా తెలియాల్సిన విషయాలే కదా? వాడి వయసుకి తగ్గటు ఎంత ఇబ్బంది పడుతూ చెప్పాల్సి వచ్చిందో మీకేం తెలుసు? కాని తప్పదు. వాళ్ళకీ కొన్ని విషయాలు తెలియాలి. తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు చెప్పాలి. లేకపోతే నేటి సమాజం ఎలా వుందో చూస్తున్నారుగా? టి.వి.ల్లో, సినిమాల వల్ల వాళ్ళింకా పాడైపోతారు. సరైన అవగాహన వుండదు వాటివల్ల. అందుకే ముందర నించి అన్ని విషయాలు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ వయసుకి తగినట్టుగా చెబుతూ వుండాలి. ప్రతిక్షణం వాళ్ళని కనిపెడుతూ వుండాలి. ఈ బాధ్యత తల్లిదండ్రులది, గురువులది. బైటికెడితే వాళ్ళ ప్రవర్తన ఎలా మారుతుందో తెలీదు. అందుకే ప్రతిరోజు చదువు గురించి, వాళ్ళు చేసే పనుల గురించి తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలి. పిల్లల మనసు సున్నితంగా వుంటుంది. వాళ్ళని మందలిస్తే ఇంకా చెడిపోతారు. లేక ఏ అఘాయిత్యాలో చేస్తారు. అందుకే వాళ్ళని మరీ సున్నితంగానూ, అతి గారంగానూ పెంచకుండా వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తూ ధైర్యాన్నిస్తూ, సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో చెబుతూ, జీవితం గురించి అవగాహన ఏర్పరచాలి. ఈ ప్రశ్నలు పిల్లలందరూ వేసేవే. వీడికి పెద్ద ఆలోచనలన్నీ ఇప్పట్నించే మొదలయ్యాయి. వాడు అడిగిన వాటికి చెప్పకపోతే వాడు నిద్ర పోడు, నన్ను నిద్ర పోనియ్యడు. వీడి బుర్రంతా ఆలోచనల పుట్ట. అందుకే ప్రశ్నలతో నా బుర్ర తింటాడు.” అని చెప్పి, “ఇదుగో రోహిత్! అన్నం తిందువుగాని రా.” అంటూ అన్నం కలిపి తినిపించింది.

తింటూ తింటూ మధ్యలో వాడేవో ప్రశ్నలు వేస్తుంటే, “అన్నం తింటూ మధ్యలో మాట్లాడకూడదు. పలమారుతుంది” అని ఎలాగో మరిపించి అన్నం పెట్టి, కాసేపు పిల్లల కథలు చెప్పి, హోం వర్కు చేయించి పడుకోబెట్టింది.

తన చిన్నతనం గుర్తొచ్చింది. తను ఐదో క్లాసు చదివేటప్పుడు అమ్మమ్మగారి వూరు వెళ్ళింది శలవలకి. అదో పల్లెటూరు. అక్కడన్నీ పెంకుటిళ్ళు వరసగా వుండేవి. ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళందరూ చాలా సాయంగా, సఖ్యంగా వుండేవారు. ఒకసారి ఉన్నట్టుండి పెద్ద పెద్ద ఏడుపులు వినిపించాయి. ఏమిటా అని చూస్తే పక్కింట్లో సుందరమ్మగారు పోయారు. ఇంట్లో అందరూ చూడటానికి వెళ్ళారు. వాళ్ళతో తనూ వెళ్ళింది. సుందరమ్మ గారిని కట్టెల మీద పడుకోబెట్టారు. అందరూ ఆవిడ మంచితనం గురించి చెప్పుకుంటున్నారు. ఒకసారి అమ్మమ్మతో వాళ్ళింటికి వెడితే ఎంతో ప్రేమగా మాట్లాడి, బిస్కట్లు, జంతికలు అన్నీ పెట్టింది. “బాగున్నావే పిల్లా? నిన్నెవడు చేసుకుంటాడో గానీ అదృష్టవంతుడు” అంటూ బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడావిడ పోతే, “అమ్మమ్మా! సుందరమ్మ మామ్మగారిని ఎందుకలా వీధిలో పడుకోబెట్టారు?” అని అడిగింది.

“ఏం లేదమ్మా. ఆవిడ పెద్దావిడ కదా! దేవుడి దగ్గరకెళిపోయింది.”

“ఐతే ఇప్పుడు నేను చిన్న పిల్లనే కదా? నేనూ అలా ఆకాశమంత పెద్దయిపోయి, నేనూ దేవుడి దగ్గరకెళిపోతానా? ఐతే అంత పెద్దయాక దేముడ్ని చూడచ్చన్నమాట!’ అలా అంటూండగా, అమ్మ నా నోరు నొక్కేసి, ‘రావద్దంటే నాతో ఎందుకొచ్చావు?’ ” అంటూ కోపంగా బరబరా లాక్కుపోయి, స్నానం చేయించి, తనూ స్నానం చేసి, నన్ను పడుకోబెట్టేసింది. ఆ తర్వాత ఎదిగినకొద్దీ మరణమంటే ఏమిటో తెలుసుకుంది. అందుకే పిల్లలకి తెలియజెప్పడం మంచిదని కొడుకు రోహిత్‌కి ఆ వయసులో చెప్పాల్సిన విధంగా చెప్పింది.

ఈలోగా భళ్ళున శబ్దం వినిపించి వంటింట్లోకి పరుగు తీసింది. రెండున్నరేళ్ళ రెండో సుపుత్రుడు స్టూలెక్కి అలమారాలో వున్న, రోహిత్ పుట్టినరోజుకని తెప్పించిన కేక్, బిస్కట్లు, చాక్లెట్ల డబ్బా మూత తీసి, గూట్లో కూచుని, అవారగించి, ఐపోగానే డబ్బా పిసిరికొట్టాడు. ఆ డబ్బా పక్కనున్న గ్యాస్ గట్టుమీద పడి, అక్కడ నూనె డబ్బాకి తగిలి, ఆ నూనె అంతా ఒలికిపోయి, వంటిల్లంతా జిడ్డోడుతూ బీభత్సంగా తయారయ్యింది. ఇహ వాడి తిండి పనైపోగానే స్టూలు మీద దిగబోతుంటే ఆ స్టూలు పక్కకి జరిగి దభేల్న కింద పడ్డాడు. వాడో మొండిఘటం! ఓ పట్టాన ఏడవడు. పడితే అందరూ నవ్వుతారనే బిక్కమొహం పెట్టుకు కూచున్నాడు బాధ ఓర్చుకుంటూ. దివ్య వాడిని చూసి జడుసుకుంది. వాడి నోరంతా బిస్కట్లు, చాక్లెట్లు, కేక్ కలిపిన రంగులతో కలగలిపి, తోకొకటే తక్కువ, హనుమంతుడి మూతిలా తయారయింది. వాడిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఏంచేసినా వాడికి నామర్దాగా వుండి తెగ బాధపడిపోతాడు. వాడు చేసిన తప్పిదానికి బాధ పడి, “అమ్మా, నాకాకలేసింది. అందుకే బిస్కట్లు, చాక్లెట్లు, కేక్ తిన్నా. మరి నూనె అక్కడ ఎందుకు పెట్టావు? డబ్బా తగిలి హదే పప్పోయింది.” వాడిని ఎక్కడ తిడుతుందో తల్లి అని ముందరే సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

దివ్యకి ఓపట్టాన కోపం రాదు. రోహిత్ యక్షప్రశ్నలకి సమాధానాలు చెప్పడంలో ఈ రెండో కొడుకు నిద్రనించి ఎప్పుడు లేచాడో, ఎప్పుడు ఆ బిస్కట్ల అల్మారా గూట్లో దూరాడో గమనించలేదు.

“అత్తయ్యా! చూడండి వీడల్లరి! కొంచెం వీడిని గమనించకపోయారా? వీడల్లరి భరించలేకుండా వున్నాను” అంటూ కిరణ్ మూతి ముక్కు తుడిచి స్నానం చేయించింది. ఇంకో ఆర్నెల్లు పోతే వీడిని ఏ ప్లేస్కూల్లోనో వెయ్యాలి. లేకపోతే వీడిని భరించడం కష్టం. వీడన్నలాగా వీడు ఇంకెన్ని తిక్క ప్రశ్నలు వేసి వేధిస్తాడో అనుకుంటూ, “పూర్వం ఎలా పెంచారత్తయ్యా ఐదుమంది, పదిమంది పిల్లల్ని? ఇద్దర్ని చూసేటప్పటికే నా తల ప్రాణం తోక్కొస్తోంది. ఇదుగో కొంచెం వీడ్ని చూడండి. వంటిల్లు శుభ్రం చెయ్యాలి.” అంటూ వాణ్ణి టి.వి. చూస్తున్న అత్తగారి ఒళ్ళో కూలేసింది .

వారం తరవాత వికాస్ స్కూల్ కొచ్చాక వికాస్, రోహిత్ మరింత స్నేహంగా వుండి ఇద్దరూ కలిసి మరింత బాగా చదవడం మొదలెట్టారు. ఇద్దరూ టెన్త్‌లోకొచ్చారు. పరీక్షలకి ప్రిపేరవుతున్నారు. ఈలోగా అనుకోకుండా వికాస్ పిన్ని కూతురు అక్క మాలతి, ఇంటరు చదివే అమ్మాయి టి.వి.ఛానెల్లో జరిగే పాటల ప్రోగ్రాంలో సెలక్టయి, ఇంటికి తండ్రితో స్కూటరు మీద వస్తుండగా ఎదర బస్సు గుద్దేసి చనిపోయింది. తండ్రికి తీవ్రగాయాలయాయి.

ఆమె మంచి సింగరు. తల్లితో చెబితే దివ్య చాలా బాధపడింది. బంగారం లాంటి పిల్ల. చాలా బాగా పాడుతుంది. క్రితం సారి టెన్తులో ఆమెదే ఫస్టు రేంకు. భారతదేశంలో ట్రాఫిక్ రూల్సు పాటించకుండా, సరిగా అమలు పరచని ట్రాఫిక్ పోలీసులు, అధికార్లు చలాన్లు వసూలు చేసి డబ్బులు వసూలు చేయడంలో మాత్రం రూల్సు పాటించి ప్రజల్ని పీడించుకు తింటారు. రోహిత్, వికాస్ చాలా బాధపడ్డారు. రోహిత్ అనుకున్నాడు – మరణానికి ముసలితనమే రానక్కర్లేదు. ఏ వయసు వారైనా, ఏ కారణాల చేతనైనా మరణానికి అతీతులు కారు. చేతులారా చేసుకునే కర్మలు కొన్ని, వీధి చేసే వింత చేష్టలు కొన్ని. తల్లి చెప్పినట్లు ఎన్ని బాధలున్నా జీవించక తప్పదు.

వస్తా వట్టిదే, పోతా వట్టిదే, ఆశ ఎందుకంట?

చేసిన ధర్మము చెడని పదార్థము, చేరును నీ వెంట

చిన్నప్పుడు రేడియోలో విన్న పాట గుర్తొచ్చింది.

రోహిత్‌కి కొంచెం వేదాంత ధోరణి తోడై నిర్లిప్తత అలవాటైంది.

అనుకోకుండా ఉద్యోగరీత్యా రోహిత్ తండ్రి కొన్నాళ్ళు అమెరికా వెళ్ళవల్సి వచ్చింది. కూడా దివ్య, కిరణ్ వెళ్ళారు. రోహిత్ వికాస్‌ని విడిచి రానన్నాడు. నానమ్మ దగ్గర, కొన్నాళ్ళు అమ్మమ్మ, తాత దగ్గర వుండి చదువు కొనసాగించాడు. కిరణ్ అమెరికాలోనే చదువుతున్నాడు.

తిరిగే కాలచక్రం ఆగదు కనుక ఇరవై ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. వికాస్, రోహిత్ వివాహాలు చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. పెళ్ళి ముహూర్తాలు ఇద్దరికీ ఒకేరోజు అయినందున ఒకళ్ళ పెళ్ళికి ఒకళ్ళు వెళ్ళలేదు. కిరణ్ అమెరికాలో స్థిరపడ్డాడు. ఇప్పుడందరూ సాఫ్ట్‌వేర్లే కాబట్టి కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వికాస్ పెద్ద హార్డ్‌వేర్ షాప్ పెట్టుకుని తృప్తిగా జీవిస్తున్నాడు. రోహిత్ పేరున్న పెద్ద కార్డియాలజిస్ట్.

వికాస్ భార్య సునంద, రోహిత్ భార్య నందిని కాలేజిలో మంచి స్నేహితులు. అందుకని తరవాత తరంలో కూడా ఇరుకుటుంబాల మధ్య స్నేహం మరింత బలపడింది.

రోహిత్ భార్య నందిని చదువుకున్నా, అత్తగారు దివ్యకి చేదోడువాదోడుగా వుండి ప్రతి పనిలో ఆవిడకి సాయంగా వుంటుంది. ఉదయమే లేచి తయరై, దేవుని పూజ చేసి, అత్త మామలకి, అతగారి అత్తగారు రాఘవమ్మకి, భర్తకి కాఫీలందించి, తరవాత టిఫిన్ రెడీ చేసి అందరికీ పెడుతుంది. రెండేళ్ళ క్రితం పుట్టుకొచ్చిన కొడుకు నవీన్ అంటే అందరికీ ఎంతో గారం.. వాడితో అందరికీ మంచి కాలక్షేపం. ఒకసారి వంట చేస్తుండగా దివ్యకి గుండెలో నెప్పి వచ్చి పడిపోయింది. రోహిత్ వెంటనే అన్ని పరీక్షలూ చేసి మందులన్నీ దగ్గరుండి వేస్తున్నాడు. విశ్రాంతి తీసుకోమన్నాడు. ఇంక అత్తగార్ని ఏ పనీ చెయ్యనివ్వకుండా, వంట కూడా నందిని చేస్తోంది.

మర్నాడు ముక్కోటి ఏకాదశి అని తెల్లవారు జామునే లేచి స్నానం చేసి పూజ చేసింది నందిని. అందరూ కలిసి గుడికి వెడదామనుకుంటుండగా, రాఘవమ్మ ఇంకా లేవలేదని, ‘నానమ్మా లే, తయారవు, గుడికి వెడదాం’ అంటూ రోహిత్ లేపాడు. కానీ ఆవిడ ఇంక లేవదని తెలుసుకున్నాడు. నిద్రలోనే ఆవిడ భగవంతుడ్ని చేరుకుంది.

“ఔను. అమ్మ చెప్పినట్లు ముసలివాళ్ళయితే పోతారని, వయసయిపోయింది, అందుకే అనాయాసంగా ఆవిడా వెళ్లి పోయింది. అదృష్టవంతురాలు” అనుకున్నాడు రోహిత్. అతనో పెద్దడాక్టరు. ఇప్పుడతనికి ఏ బాధాలేదు. అందుకే జనన మరణాల గురించి బాగా తెలుసుకున్నాడు.

మొట్టమొదటిసారి అటాప్సీ చేస్తున్నప్పుడు భయపడిపోయాడు. కాళ్ళు చేతులు వణికాయి. ‘నాకీ వైద్యవృత్తి వద్ద’ని గొడవ చేస్తే, ప్రొఫెసర్ గట్టిగా చీవాట్లు పెట్టి, “వైద్యవృత్తి అంటే ఏమిటనుకున్నావు? చాలా పవిత్రమైనది. వైద్యుడు నారాయణుడితో సమానం. వైద్యో నారాయణో హరిః అంటారు. ఈ వృత్తిలో దయా దాక్షిణ్యాలు పనికిరావు. అలాగని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బు సంపాదించమని కాదు. ఆపరేషన్స్ చేయాల్సి వస్తే భయపడితే, రోగి పరిస్థితేంటి? నీ దగ్గర బంధువులైనా, నీ ఇంట్లోని వారైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే, అక్కడ ప్రేమబంధాలన్నీ వదులుకుని నీ వృత్తి ధర్మం నిర్వర్తించాలి. భయపడి పారిపోతావా? అటాప్సీ ఎందుకు చేస్తారు? మనిషి శరీరంలోని ప్రతి అవయవం పని చేసే విధానం తెలుసుకోవాలి కదా? ఇక్కడ సెన్సిటివ్‌గా వుంటే కుదరదు. డాక్టరన్న వాడికి మొండితనం కూడా వుండాలి” అని అందరు విద్యార్థులకి ఇలాగే చెప్పాడు.

ఆరోజు ఇంటికొచ్చాక డల్‌గా కూచుంటే విషయం తెలుసుకుని తల్లి దివ్య కూడా ప్రొఫెసర్ చెప్పిన విధంగానే చెప్పింది.

కిరణ్ నానమ్మ పోయిందని వచ్చి చూసి వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు.

వికాస్ తల్లికి రోహిత్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా, అతని తల్లి దివ్యకి మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చి ఆస్పత్రికి తీసుకొస్తే, ఆపరేషన్ మధ్యలో ఆపేసే పరిస్థితి లేదు. అతడికి కబురు చెప్పడానికి వీలు కాని పరిస్థితి. వెంటనే జరగవల్సిన వైద్యం అందక దివ్య అనంతలోకాలకి వెళిపోయింది.

తనో పెద్ద కార్డియాలజిస్ట్ అయివుండి తల్లిని కాపాడుకోలేక పోయిన దౌర్భాగ్యస్థితి దాపురించినందుకు బాధ పడ్డాడు. ఆవిడ ముసలిదేం కాదు. కానీ సరైన సమయానికి వైద్యం అందలేదు. దివ్య తల్లి, తండ్రి భోరున ఏడ్చారు ‘ఆ భగవంతుడు మమ్మల్నయినా తీసికెళ్ళలేదే’ అని. మరణానికి చిన్న, పెద్ద, ముసలి తారతమ్యాలు లేవు. పుట్టుక తెలీదు. మరణం తెలీదు. ఎవరో అన్నట్లు కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం.

రెప్పపాటు జీవితం. మరణానికి జీవించటానికి సన్నదారం అడ్డు. అది దాటితే ఫరవాలేదు. అది తెగిపోతే…..

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు.”

జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు అన్నీ కలిసే వుంటాయి. కష్టాలొస్తే కుంగిపోయి, సుఖాలొస్తే పొంగిపోడం కాదు. ధైర్యంగా ముందుకు సాగాలి. అందుకే జీవించినంత కాలం మంచి పనులు చేస్తూ, మంచిగా వుండి జన్మ సార్థకత చేసుకోవాలి. తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మరణించాక వాళ్ళ గురించి మంచిగా చెప్పుకోవాలి. అప్పుడే వాళ్ళ కీర్తి అజరామరంగా నిలుస్తుంది.

రోహిత్ వికాస్ తల్లికి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది.

తనని కూడా బాబూ, బాబూ అంటూ ఎంతో ప్రేమగా చూసే రోహిత్ తల్లి పోయినందుకు, అదే సమయానికి తన తల్లికి ఆపరేషన్ జరుగుతున్నందువల్ల ఆవిడకి వైద్యం అందకే పోయిందని ఎంతో కలత చెందాడు వికాస్.

అదే సమయానికి వికాస్‌కి కూతురు పుట్టిందని సంతోషించి ఆ పాపకి రోహిత్ తల్లి దివ్య అని పేరు పెట్టారు.

***

రోహిత్ తన చేతుల మీదుగా ఎన్నో ఆపరేషన్లు చేసాడు. ఎంతోమందికి ప్రాణదానం చేసాడు. తల్లిని బతికించుకోలేకపోయానే అనే బాధ ఒక్కటే వెన్నాడుతుంది.

రోహిత్‌కి వికాస్‌కి వయసులు పైబడ్డాయి.

పండితపుత్రుడు పండితుడు కాలేక పోవచ్చేమో కాని, ఖచ్చితంగా, ఎవరు కాదన్నా హీరో కొడుకు హీరోయే అవుతాడు, డాక్టరు కొడుకు డాక్టర్ అవుతాడు.

అందుకే రోహిత్ తన కొడుకు నవీన్‌ని తనలాగే మంచి డాక్టర్‌గా తీర్చిదిద్దాడు. అతడూ పేరున్న కార్డియాలజిస్ట్. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి వైద్యం చేస్తున్నారు. క్షణం తీరికుండదు. వికాస్ కూతురు దివ్య మంచి గైనకాలజిస్ట్. దివ్యని రోహిత్ కొడుకు నవీన్ కిచ్చి వివాహం చేసారు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, కవలలు. వాళ్ళ పేర్లు రోహిత్, వికాస్. చెరో మనవడ్ని దగ్గర పెట్టుకుని, ముద్దు ముచ్చట్లు చూస్తూ శేషజీవితం సాగిస్తున్నారు వాళ్ళ తాతలైన రోహిత్, వికాస్.

రోహిత్‌కి తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వస్తూంటాయి. ఆవిడ మరణమే ఎప్పుడూ వేధిస్తూ వుంటుంది.

నానాటి బ్రతుకు నాటకము

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము

నట్టనడిమిదీ జీవితము

కట్టకడపటిదీ కైవల్యము….

ముందు తరం రోహిత్, వికాస్ మంచి స్నేహితులు. తరవాతి తరం వాళ్ళ పిల్లలు రోహిత్, వికాస్ మంచి సోదరులు.

ఆ పిల్లలిద్దరికీ రోహిత్ తన చిన్నప్పుడు వికాస్ తాతగారు చెప్పిన కథలు చెబుతున్నాడు.

‘అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టారు. ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు…….

తరతరాల కథనే ఈ తరం వాళ్ళకి కూడా అందిస్తున్నాడు తాత రోహిత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here