నందాదీపం (ఆకాశదీపం) నమోస్తుతే

1
11

[box type=’note’ fontsize=’16’] రెండు ధ్వజస్తంభాలున్న ఒక దేవాలయము గురించి ఆసక్తికర పంచుకోదగ్గ పరిచయ విషయమున్న వ్యాసాన్ని అందిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు. [/box]

[dropcap]చి[/dropcap]ల్లులు గల గుండ్రని ఇత్తడి పాత్ర. అందులో వెలుగుతున్న వత్తివేసిన నూనె ప్రమిద. దీనిని ఆకాశదీపమంటారు. కార్తీకమాసములో ధ్వజస్తంభమునకు తాడుతో ఆ పాత్రను కట్టి పైన వ్రేలాడదీస్తారు. ఇది కార్తీకమాస ప్రత్యేకతగ అందరికీ తెలుసు. ప్రధాన ధ్వజస్తంభముతోబాటు నందాదీపఆకాశ ధ్వజస్తంభముగ ఖ్యాతి ఉన్న రెండు ధ్వజస్తంభాలున్న ఒక దేవాలయము గురించి ఆసక్తికర పంచుకోదగ్గ పరిచయ విషయమున్న వ్యాసమిది.

పండుగలు, పబ్బములు, వ్రతములు నోములు వస్తాయి. శుభకార్యములు, వయసు మళ్ళిన ఆధ్యాత్మికతకు, మనఃప్రశాంతతకు ఇంటిలోనే దైవస్మరణ మన సంస్కృతి. అందుకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశమును పూజగది అంటాము. దేవుని మందిరముగ ప్రతియింటా ఉంటుంది. కోవెల. గుడి, దేవాలయము, పేర్లతో ఉన్న అర్చాప్రదేశము కున్నంత ప్రాధాన్యత స్వగృహపూజామందిరానికి యిస్తాము. ధూపదీపనైవేద్యముల ఆరాధనుంది.

దేవుడిగుడిలో దీపము ఎప్పుడూ వెలుగుతూండాలి. దీనికి అఖండదీపము అని పేరు. నందాదీపముగ పలుకుబడిలో వాడుక, ధ్వజస్తంభమునకు ప్రత్యేక పాత్రవలె ఈ నందాదీప పాత్రలు ప్రమిదలు, కుందెలు మట్టి, లోహములతో చేయబడిన వాటిలో వత్తివేసి నూనె పోసి దేవుడిముందు ఉంచి ఆరకుండాచూస్తారు. ఇప్పుడు నందాదీపారాధన గుడిలో కర్తవ్యముగ అర్చకుడిది. నందాదీపం అందరూ వెలిగించకూడదన్నది ఎక్కడా లేదు.. నివాసగృహములో కూడ పూజా మందిరములో నిత్యదీముము వెలిగించడము, తులసికోటలో దీపము పెట్టడము ఆచారము. అవి పూజా మందిరము నందాదీపపాత్రలుగ కుందెలు, ప్రమిదలు రకరకాలు కనిపిస్తున్నాయి. నందాదీప సంస్కృతి అనవాళ్ళుగా చెప్పవచ్చు. మందిరము, గుడి సమానార్థకములు.. కాని ధ్వజస్తంభము లేకపోతే దేవతామూర్తి కొలువున్న ప్రదేశాన్ని మందిరముగ మాత్రమే భావించడంఉంది. ధూపదీపనైవేద్యఅర్చనతో రామమందిరము, కృష్ణమందిరము కేవలము భజన కొరకు అయినపుడు ధ్వజస్తంభ నిర్మాణముండక పోవచ్చు. ధ్వజస్తంభముంటే మాత్రము తప్పక గుడి అని పిలిపించు కుంటుంది..

శైవ, వైష్ణవ, శాక్తేయ, దేవి దేవాలయములు సందర్శిస్తాము. ధ్వజస్తంభము ప్రారంభముగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. గర్భగుడిలో ప్రవేశించి,”ధర్మార్ధకామమోక్ష చతుర్విధఫలపురుషార్ధం పుత్రపౌత్రాభివృద్యర్థం సకలకామ్యార్ధఫల సిధ్యర్థం’’ అని సంకల్పము చెప్పుకుని పరమేశ్వరుడైన అర్చామూర్తికి పూజ జరిపిస్తాము. అందుచేత ధ్వజస్తంభము లేని గుడి ఉండదు. కార్తీకమాసంలో ఈ ధ్వజస్తంభము ఆకాశదీపముతో శోభిల్లుతుంది.

ధ్వజము అంటే పతాకము. వీరులు తమ గుర్తింపుకై రథముపై, ధ్వజమెత్తడం ఉంది. రధానికి ఒక యష్టి అంటే జెండా ఎగురవేసే టెక్కెపుకామ ఉంటుంది. ఈ పతాకముపై ఆ యుద్ధవీరుని గుర్తింపుగా ఒక చిహ్నముంటుంది. జెండాపై కపిరాజు అర్జునుని కపిధ్వజుడిగా చేసింది. దేవాలయములలో కూడ ధ్వజము ఈ యష్టివంటిదే. దేవాలయ టెక్కెపుకామకు ధ్వజము పేరుగ దేవాలయములో ఒకటే ధ్వజస్తంభముంటుంది.. రెండవ ధ్వజస్తంభముంటే మాత్రం ఆసక్తికర విషయం తప్పక ఉంటుంది.

తూర్పుగోదావజిల్లా ఆత్రేయపురమండలంలో పేరవరం గ్రామముంది. ఇక్కడ రుక్మిణీసత్యభామ సహిత శ్రీవేణుగోపాలస్వామి గుడికి ప్రథాన ధ్వజస్తంభమునకు మాత్రమే ధ్వజారోహణము చేస్తారు. కాని రెండువందల ఏండ్లక్రితం నుంచీ మరొక ధ్వజ స్తంభముంది మూల విరాట్టుకు రెండు ధ్వజస్తంభాల ఈ గుడిలో. రెండవ ధ్వజ స్తంభానికి నందాదీపధ్వజస్తంభమని పేరు పెట్టారు. ధ్వజారోహణ ముండదు. కార్తీకమాసములో ఆకాశదీపమై నందాదీపముగ పూజలందుతున్న ఆసక్తికర భక్తి గాథను కలిగిఉంది

రెండు ధ్వజస్తంభాల రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పేరవరం

వియ్యానికి, కయ్యానికి సమ ఉజ్జీలుగ వీరులు రథములపైన ధ్వజమెత్తుతారు. ఆ ధ్వజమెత్తడంలాంటిదే గుడిలోను కనిపిస్తుంది. నందీ భృంగీ విగ్రహ సందోహము శివుని ధ్వజవిషయమున, దేవీ విషయమున సింహము, వైష్ణవధ్వజ విషయమున సామివారిని వైనతేయుని వస్త్రముపై లిఖించి పతాకగా పేర్కొంటారు. ఆపతాకలను ధ్వజస్తంభముపై ఎగురవేయడం ధ్వజారోహణము. శ్రీవెంకటేశ్వరునికి బ్రహ్మోత్సవము ధ్వజారోహణముతోనే ప్రారంభము.

ధ్వజారోహణము భగవంతుని సకలకైంకర్య ఉత్సవాలకు ఆకాశమార్గాన సమస్త నిలింపులకు పలికే ఆహ్వనమని చెబుతారు. సర్వవిధ పాపహరణము, అపూర్వము, బ్రహ్మాది దివిజపూజితముగ ధ్వజారోహణము జరుపుతున్నారు. ధ్వజస్తంభముపై దేవాలయ పరముగ దేవునిపతాకగా ధ్వజారోహణముగ వినిపించే పేరది. కాని కయ్యమునకు కాదు మైత్రీ ఉత్సవ ఆహ్వానమది. బ్రహ్మ తొలుత ఈ ధ్వజారోహణోత్సవాలు ప్రారంభించాడంటారు. ఎక్కువ బ్రహ్మోత్సవ కార్యక్రమము గాను, దేవుని కల్యాణ సమయాలలోను ధ్వజారోహణము పేరు వినిపిస్తుంది.

విష్ణు, శంకరాధిపుల శుభాలయములు, దేవి సన్నిధానములందును విధిప్రతిపాదిక రీతిని ధ్వజారోహణము చేయాలని ఆనందరామాయణములో శ్రీరాముడు సప్తమసర్గములో ధ్వజారోహణ మహిమను వివరించాడు. శ్రీరామ సంతోష కారణము, పవిత్రము, దురితతాపహముగ పేర్కొనబడింది. ఉత్సవ సమయాలలో భగవానుని ఆహ్వానముగా చిహ్న వస్త్ర పతాకను కలిగినయష్టిగ ధ్వజస్తంభము ధ్వజము అని పిలవబడి ధ్వజారోహణము ప్రాముఖ్యమును కలిగిఉంది. అది మయూరధ్వజుడు ధ్వజస్తంభమై సాధించుకున్న భగవత్కృప.

అశ్వమేధములు చేసిన గొప్పరాజుగ మయూరధ్వజుడనేరాజు కథ జైమినీభారతముగ అందిన అశ్వమేధపర్వములో వస్తుంది. బ్రాహ్మణవేషములో కృష్ణుడు రాజును పరీక్షించాడు. ధర్మరాజు, అర్జునుడికి అతని దాతృత్వశీలతను చాటిచెప్పాడు. తన కుమారుని ఒక సింహము ఆహారముగా కోరిందని కృష్ణుడు చెప్పాడు. వదిలెయ్యాలంటే భార్యాబిడ్డలు స్వయంగా శరీరములోని కుడివేపు భాగాన్ని కోసి సమర్పించాలనాడు. మయూరధ్వజుడు మాయాబ్రాహ్మణ శ్రీకృష్ణుని బాలుని రక్షిస్తానని సిద్ధపడ్డాడు. తను పనికి రాకుండాపోయానని ఎడమశరీరభాగము కన్నీరు కార్చింది. అంతటి మహాదాత మయూరధ్వజుని కీర్తిచిహ్నగాథగా ధ్వజస్తంభము మూలవిరాట్టుకు ఎదురుగా గుడిలో నిర్మింపబడుతోంది.

రెండుధ్వజస్తంభాలుగల గుడిగా పేరవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీవేణుగోపాలస్వామి ఆ గ్రామ క్షేత్రపాలకుడు. దేవాలయము ఎప్పుడు నిర్మింపబడిందో తెలియదు. ప్రజలు వ్యవసాయదారులు. పశుసంరక్షణ స్వామి భారముగా నిశ్చింతగా ఉంటారు. కాటన్ దొర ఆనకట్ట నిర్మాణానికి ముందే ఊరు దేవాలయము ఉన్నాయి. పురాతన దేవాలయమునకు ఒక ధ్వజస్తంభమే ఉండేది. మయూరధ్వజుని ఖ్యాతికి కాదు భక్తిభావన ధ్వనించిన రెండవధ్వజ నిర్మాణము దైవసంకల్పము నాస్తికతను దూరము చేస్తుంది.

గౌతమి గోదావరి పాయలో రెండువందల సంవత్సరాల క్రితము లంక వ్యవసాయ రైతుల కథ యిది. ప్రవాహము, ఊర్లకు మధ్య వరదగట్టుగ ఏటిగట్లు నిర్మాణము తక్కువ ఎత్తులో ఉండే రోజులవి. సాధారణంగా ఏటిగట్టుకు దిగువనే ప్రవాహముండేది. గోదావరి ఉగ్రరూపం దాల్చినపుడు ఇప్పటికీ ఈ ఏటిగట్టును దాటి గ్రామాన్ని ముంచుతుంది. వరదసమయంలో తప్ప, మిగిలిన సమయాలలో రైతులు ఏటిగట్టుదిగి నావలమీద లంకలకు ప్రయాణించి నేటికీ వ్యవసాయము చేస్తున్నారు. వరద సమయంలో ఎంత ఎత్తు పెంచినా నేటికీ గోదావరి ప్రవాహం గ్రామంలోకి ప్రవేశించే ప్రమాదముంది. అలా రెండువందల ఏళ్ళ క్రితము అలాంటి వరద సమయాన ఏటిగట్టుమీద నిలబడి ఇద్దరు రైతులు గోదావరమ్మ పరవళ్ళు తిలకిస్తున్నారు.

అది వరద సమయము. కాబట్టి గోదావరి ప్రవాహము ఉధృతముగా ఉంది. ఏ క్షణాననైనా ప్రవాహము ఏటిగట్టును దాటి గ్రామంలో ప్రవేశించవచ్చని ఏటిగట్టు సంరక్షణలో రైతాంగం అప్రమత్తంగా ఉన్నారు. ఆ సమయాన ఈ ఇద్దరు రైతులు ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెద్దమానును చూశారు. అది చాలా విలువైనదని గ్రహించారు. సాహసించి ఏటికెదురీది దుంగను పట్టుకున్నా ప్రవాహవేగానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. సుడిగుండంలో వలయాకారంగా తిరగసాగారు. భయంతో వేణుగోపాల స్మరణ చేయసాగారు. ఎటుపోతున్నారో తెలియదు. దుంగనుమాత్రం వదలేదు. చీకటి పడింది.

ఆ ఇద్దరు రైతులలో ఒకరు ‘నాదెళ్ళ’ ఇంటిపేరు కుటుంబీకుడు. మరొకరు ‘రావిపాటి’ ఇంటిపేరువారి కుటుంబీకుడు. ఈ ఇద్దరూ తమవారిని తలచుకుని విచారిస్తూ గజేంద్రమోక్షణములోని గజేంద్రుని స్థితిలా స్వామిని ప్రార్ధించారు, తమ కుటుంబసభ్యుల వద్దకు చేర్చమని ప్రార్ధన చేశారుట. తెల్లవార్లూ దుంగ మీదే నీటిలో ప్రవాహములో గిరగిర త్రిప్పబడ్డారు. తెల్లవారింతరువాత చూసుకుంటే దుంగతోసహావారు గుడి ప్రాంగణములో ఉన్నారు. ఊరిలోకి గోదావరి ప్రవేశించింది. చుట్టూ జలమయము. ఆ జలప్రవాహముతోనే వారు గుడివద్దకు దుంగతోసహా కొట్టుకుని వచ్చారు.

తాము అలా ప్రాణాలతో బయటపడడం స్వామి మహిమగా భావించిన రైతులు ఆ దుంగ ఒడ్డూపొడవు ధ్వజస్తంభమంత పొడవుండడం చూసి విస్తుపోయారు. అది స్వామికి ఆర్తత్రాణప్రాణరక్షణ ధ్వజస్తంభముగా గుర్తుగా నిర్మాణము చేస్తామని మ్రొక్కుకున్నారు. మయూరధ్వజ ఖ్యాతిగా తప్ప ప్రధానధ్వజస్తంభము స్వామికుండగా, రెండవది ఇతరులఖ్యాతిగా నిర్మాణ విమర్శకు వారు తల ఒగ్గలేదు. ధ్వజస్తంభము నిర్మించారు. అయితే ‘నాదెళ్ళ,- రావిపాటి’ వారి నందాదీప ధ్వజస్తంభముగా ఒప్పుకోవలసివచ్చింది. దేవాలయోత్సవాది సమయములలో ఏమోగాని కార్తీకమాసమన్ని రోజులూ ధ్వజస్తంభ నందాదీపఖర్చు 200 ఏండ్లుగా ఈ రెండు కుటుంబాలు పంచుకుంటున్నాయి

ఇటీవల ఈ ధ్వజస్తంభము పడిపోయింది. 11-10-2019 వతేదీన ఈ రైతులవంశీకులు ‘నాదెళ్ళ- రావిపాటి’ కుటుంబీకులు పునఃప్రతిష్ఠ గావించారు. ఆత్రేయపురమండలంలో ఆంధ్రా తిరుపతిగా, ఏడువారాలవ్రతమహిమ వేంకటేశ్వరునిగా ప్రసిద్ధిచెందిన వాడపల్లి గ్రామానికి 11 కి.మీ దూరంలో రావులపాలెం-బొబ్బర్లంక బస్సురూటులో ‘పేరవరం’ గ్రామం ఉంది. బొబ్బర్లంకకు 3 కి.మీ దూరంలో ఉన్న రెండు ధ్వజస్తంభాల రుక్మిణీ, సత్యభామసహిత శ్రీ వేణుగోపాలస్వామిని వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన దారిలో దర్శించవచ్చు. వ్యాసరచయితనైన నేను ఈ పేరవరం గ్రామవాసిని. ఆకాశదీపం ఒకప్పుడు ఓడలకు దారి చూపడనికి ఎత్తైన ప్రదేశముగ ధ్వజస్తంభముపై వెలిగించారు. కాని ఆధ్యాత్మికంగా ఆకాశమార్గాన పయనించే పితృదేవతలకు దారి తప్పిపోకుండ ఉత్తమలోకాలు గుర్తించి చేరుకుందుకు దారివెలుగులని భావించడం ఆధ్యాత్మికత. కార్తీకదీపోత్సవమును ఏ పేరుతో పిలిచినా ఆకాశవీథిలో సంచరించే దేవతలకాహ్వానమా ఆకాశదీపము నందాదీపము నమోస్తుతే అనిపించాలి. పితృదేవతలు తరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here