[box type=’note’ fontsize=’16’] “ఇంకాస్త శ్రధ్ధగా తీస్తే మెరుగైన వినోదాత్మక చిత్రం అయి వుండేది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘నానీస్ గేంగ్ లీడర్’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఇ[/dropcap]దివరకు చిరంజీవి నటించిన గేంగ్ లీడర్ వచ్చింది. బాగా ఆడింది కూడా. అందులో పాటలు చాన్నాళ్ళు విన్నారు జనం. ఇప్పుడు మరో గేంగ్ లీడర్ నాని నటించింది వచ్చింది. కాలక్షేపం బానే అవుతంది.
కథ క్లుప్తంగా చూద్దాం. వొక బేంకి నుంచి రాత్రివేళ ఆరుగురు ముసుగుల్లో దూరి ముప్పై కోట్ల దాకా దొంగలిస్తారు. చివరి క్షణంలో వొక ముసుగు దొంగ మిగతా అయిదుగురినీ చంపి ఆ సొమ్ము మొత్తం తనే చేజిక్కించుకుని, పోలీసులకు అందకుండా పారిపోతాడు. ఇది జరిగిన పద్నాలుగు నెల్ల తర్వాత సరస్వతి (లక్ష్మి) అనే వో పెద్దామె కొంతమందికి బహుమతి గెలిచారంటూ ఉత్తరాలు పంపి పిలిపిస్తుంది. అక్కడ పోగైన మిగతా నలుగురినీ కూచోబెట్టి తను చేసిన దానికి కారణం చెబుతుంది. ఆ అయిదుగురూ చనిపోయిన ఆ అయిదుగురి కుటుంబ సభ్యులు. ఇప్పుడు అనాథలు. లక్ష్మి తాము అందరూ కలిస్తే ఆ హంతకుడిని వెతికి, పట్టుకుని చంపితే తప్ప మనసు శాంతించదు అంటుంది. మొదట్లో ఒప్పుకోకపోయినా చర్చల అనంతరం అందరూ వొప్పుకుంటారు. పెన్సిల్ పార్థసారథి (నాని) అనే నేరకల్పనా నవలలు వ్రాసే రచయితకి ఈ పని అప్పచెబుదాం అంటుంది సరస్వతి. అతని నవలలు అన్నీ చదివాననీ, అంత తెలివైన వూహలు చేయగల మనిషి ఈ పనిని చులాగ్గా చేయగలడంటుంది. వీళ్ళు వెతుక్కుంటూ పెన్సిల్ ఇంటికి వెళ్ళే సరికి అతను వో ఆంగ్ల చిత్రాన్ని చూస్తూ మక్కీకిమక్కీ తెలుగు అనువాదం చేస్తుంటాడు. అదీ అతని పాత్ర. కేవలం కాపీ కొట్టి నవలలు వ్రాయగల తను ఇలాంటి కష్టమైన పని చేయలేడని మొదట నిరాకరించినా, తర్వాత వొప్పుకుని ఆ గేంగికి తను లీడర్ అవుతాడు. ఇదివరకు వో ఏంబులన్స్ డ్రైవర్ గా చేసిన దేవ్ (కార్తీకేయ) ఇప్పుడు నెంబర్ వన్ రేసర్ (racer), స్థితిమంతుడు. పెన్సిల్ ఈ నిజ జీవితపు కేసును పరిష్కరించగలుగుతాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిందే.