నానీస్ గేంగ్ లీడర్ : కాలక్షేపం సినెమా

0
11

[box type=’note’ fontsize=’16’] “ఇంకాస్త శ్రధ్ధగా తీస్తే మెరుగైన వినోదాత్మక చిత్రం అయి వుండేది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘నానీస్ గేంగ్ లీడర్’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఇ[/dropcap]దివరకు చిరంజీవి నటించిన గేంగ్ లీడర్ వచ్చింది. బాగా ఆడింది కూడా. అందులో పాటలు చాన్నాళ్ళు విన్నారు జనం. ఇప్పుడు మరో గేంగ్ లీడర్ నాని నటించింది వచ్చింది. కాలక్షేపం బానే అవుతంది.

కథ క్లుప్తంగా చూద్దాం. వొక బేంకి నుంచి రాత్రివేళ ఆరుగురు ముసుగుల్లో దూరి ముప్పై కోట్ల దాకా దొంగలిస్తారు. చివరి క్షణంలో వొక ముసుగు దొంగ మిగతా అయిదుగురినీ చంపి ఆ సొమ్ము మొత్తం తనే చేజిక్కించుకుని, పోలీసులకు అందకుండా పారిపోతాడు. ఇది జరిగిన పద్నాలుగు నెల్ల తర్వాత సరస్వతి (లక్ష్మి) అనే వో పెద్దామె కొంతమందికి బహుమతి గెలిచారంటూ ఉత్తరాలు పంపి పిలిపిస్తుంది. అక్కడ పోగైన మిగతా నలుగురినీ కూచోబెట్టి తను చేసిన దానికి కారణం చెబుతుంది. ఆ అయిదుగురూ చనిపోయిన ఆ అయిదుగురి కుటుంబ సభ్యులు. ఇప్పుడు అనాథలు. లక్ష్మి తాము అందరూ కలిస్తే ఆ హంతకుడిని వెతికి, పట్టుకుని చంపితే తప్ప మనసు శాంతించదు అంటుంది. మొదట్లో ఒప్పుకోకపోయినా చర్చల అనంతరం అందరూ వొప్పుకుంటారు. పెన్సిల్ పార్థసారథి (నాని) అనే నేరకల్పనా నవలలు వ్రాసే రచయితకి ఈ పని అప్పచెబుదాం అంటుంది సరస్వతి. అతని నవలలు అన్నీ చదివాననీ, అంత తెలివైన వూహలు చేయగల మనిషి ఈ పనిని చులాగ్గా చేయగలడంటుంది. వీళ్ళు వెతుక్కుంటూ పెన్సిల్ ఇంటికి వెళ్ళే సరికి అతను వో ఆంగ్ల చిత్రాన్ని చూస్తూ మక్కీకిమక్కీ తెలుగు అనువాదం చేస్తుంటాడు. అదీ అతని పాత్ర. కేవలం కాపీ కొట్టి నవలలు వ్రాయగల తను ఇలాంటి కష్టమైన పని చేయలేడని మొదట నిరాకరించినా, తర్వాత వొప్పుకుని ఆ గేంగికి తను లీడర్ అవుతాడు. ఇదివరకు వో ఏంబులన్స్ డ్రైవర్ గా చేసిన దేవ్ (కార్తీకేయ) ఇప్పుడు నెంబర్ వన్ రేసర్ (racer), స్థితిమంతుడు. పెన్సిల్ ఈ నిజ జీవితపు కేసును పరిష్కరించగలుగుతాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిందే.

దీనికి దర్శకుడు విక్రం కుమార్. మనకు ఇదివరకు “మనం” అనే మంచి చిత్రం అందించిన మనిషి. ఆ ఆశలతో ఇది చూస్తే కొంత నిరాశ తప్పదు. కాని అది అతని దర్శకత్వంలో లోపం కంటే కథను సరిగ్గా అల్లకపోవడం వల్ల జరిగింది. వెంకట్ సంభాషణలు సహజంగా వుండి బాగున్నాయి. సంగీతం గొప్పగా లేదు కాని, నిన్ను చూసిన ఆనందంలో పాట కాస్త బాగుంది. సాంకేతికంగా ఈ చిత్రం బానే వుంది. నటన విషయానికి వస్తే నానీ, లక్ష్మి ల నటన బాగుంది. మిగతా వారి పాత్రలు పూర్తిగా జవసత్వాలతో నిర్మించక పోవడం వల్ల వారికి నటనా కౌశలం చూపే అవకాశం రాలేదు. తెలుగు సినెమాలో హీరో లా కాకుండా నాని వొక పక్కింటి కుర్రవాడిగా చేశాడు. అయితే హాస్యం కోసం ప్రత్యేకమైన మేనరిజంతో. అతను ఇదే నటన మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే త్వరలోనే మన ఆసక్తిని పోగొట్టుకుంటాడు. వెన్నెల కిశోర్ పాత్ర గే పాత్ర. 2019 నాటికి గేలను పరిహాసంగా చూపడం అనేది వెనకడుగే. మిగతా ప్రపంచమంతా ఎరుక కలిగిన సున్నితత్వం తో వుంటే తెలుగు సినెమాలో అవహేళనగానో, ఎగతాళి వస్తువుగానో, హాస్యం కలిగించే పాత్రగానో మిగలడం బాధాకరం. ఇలాంటి వినోద ప్రధాన చిత్రాలు చూసేటప్పుడు మనకు కాస్త యెక్కువగానే అపనమ్మకాన్ని తాత్కాలికంగా నిలపాల్సి వస్తుంది. ఇంత పెద్ద దొంగతనంలో పోలీసుల పాత్ర లేశమాత్రంగా వుండడం, చివర్న కూడా డబ్బు దాచిన సమాచారం అంది ఆ ఇంటికి వెళ్ళి ఏమీ దొరక్క తిరిగి వెళ్ళిపోవడం వగైరా కాస్త తేలికగా తీసుకోవాలి (take with a pinch of salt ని కాస్త ఉప్పుతో తీసుకోవాలి అంటే హాస్యం కాదు అపహాస్యం అవుతుంది). గాల్లోంచి వూడిపడ్డ రేసెర్ గురించి మీడియా గాని, పోలీసులు గాని ఎవరూ తనిఖీ చేయకపోవడం, రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతే ఎవరూ అనుమానించకపోవడం. ఏ బేంకిలోనైనా ముప్పై కోట్ల రూపాయలు నిలవచేస్తారా? ఇలాంటివి చాలానే వున్నాయి. ఇంకాస్త శ్రధ్ధగా తీస్తే మెరుగైన వినోదాత్మక చిత్రం అయి వుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here