నాన్న బాటలో

0
5

[dropcap]అ[/dropcap]యిదేళ్ళ పిల్లాడి చిట్టి చేతిని చక్కగా పట్టుకున్న వాళ్ళ నాన్న, కబుర్లూ అవీ చెబుతూ తనతో పాటు నెమ్మెదిగా నడిపిస్తూ తీసుకెళుతున్నాడు. ఆ చిన్న బాబు దారిలో ఉన్న వాటిని చేతితో చూపుతూ ఏవేవో ప్రశ్నలడుగుతున్నాడు. వాళ్ళ నాన్న కొంత సేపు ఆగి, ఆ బాబు ఎత్తుకి కిందకి వంగి, అడిగిన వాటికి చిరునవ్వుతో సమాధానం చెప్తున్నాడాయన.

ఆ దృశ్యంతో శేఖర్‌కి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రాసాగాయి. శేఖర్ అటువైపే ధీర్ఘంగా చూస్తూ, అవును మా నాన్న కూడా నా చిన్నప్పుడు  నన్ను అచ్చం ఇలానే నడిపిస్తూ తనతో పాటే తీసుకుని వెళ్ళేవారు. పలానా చోటికి అని ఏం లేదు. మా సందు చివర ఉన్న పాల పేకెట్లు అమ్మే బడ్డీ నుండీ మా పక్క వీధి కిరాణా దుకాణం వరకూ నన్ను చక్కగా నడిపిస్తూనే తీసుకెళ్ళేవారు. ఇలా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికన్నమాట. నాన్నా ఎత్తుకో అని మారాం చేస్తే, ఆ మాటా, ఈ మాటా చెప్పి ఆ విషయం మరిపించేవారు.

అయితే, ఇదివరకంతా నన్ను బుల్లెట్ బండిపై రై మంటూ జాయ్ రైడ్‌కి తీసుకుని వెళ్లిన నాన్న, ఆ తరువాత మాత్రం నన్ను చేయి పట్టుకుని ఎందుకు నడిపిస్తూ తీసుకెళ్లేవారో నాకు చాలా కాలం తర్వాత కానీ అర్దం కాలేదు. నేను  లేక లేక కలిగిన సంతానం కావడంతో ఎప్పుడూ నన్ను ఎత్తుకునే ఉండేదట అమ్మ. బాగా గారం చేయడంతో కొంత భారీగా  ఒళ్ళు చేసానట. ఓ సారి జ్వరానికి డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళితే, పిల్లలకి కొంతలో కొంత వ్యాయామం అవసరమనీ, అందుకే ఆటలు ఆడించడం, లేదా చేయి పట్టుకు నడిపించడం చేయాలని, అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పారట. కానీ మా నాన్నమ్మ ఆ డాక్టర్ మాటల్ని తోసిపుచ్చిందట. వాళ్లలాగే చెబుతారు, అయినా వైద్యుల దృష్టికి అన్నీ వ్యాధులుగానే కనిపిస్తాయి. అతని మాటలు పట్టించుకుంటే మనకి మిగిలేది మనో వ్యధే. అయినా తిండి కలిగి కండ కలిగితేనే కదా బండి చక్కగా నడిచేది. పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దొస్తారు. మరీ చిక్కి చీపురు పుల్లల్లా, పలచగా బలుసాకులా  అయిపోతే ఎలా అని దిష్టి తీసి పడేసి, ఓ తాయత్తు మెడలో ముడేసి, కాస్త పప్పన్నంలో గిన్నెడు నెయ్యి పోసి తినిపించడం చూసిన నాన్నకి ఆ పద్దతి నచ్చలేదట. దాంతో అప్పటి నుండీ నాకు పెట్టే ఆహారంలో  నెయ్యి, కార్బోహైడ్రేడ్ ఫుడ్ తగ్గించమని చెప్పారట. అలాగే నాకు అసలు నడక లేకపోతే ఎలా అని ఆలోచించి ,ఆయన కావాలని నడిచి వెళుతూ నన్నూ ఆయన కూడా తీసుకెళ్ళేవారు.

అలా ఆ అయిదేళ్ళ ప్రాయం నుండీ అలవాటయిన ఆ నడక అలా నాతోనే ఉండిపోయింది. చిన్న చిన్న పనులకి ఇప్పటికీ బండి తీయను. కాళ్ళు ముడుచుకోకుండా చక్కగా నడిచే వెళతాను. ఎక్కడికైనా కొంచెం దూరం నడిచి వెళ్ళాలి అనుకున్నపుడు, అబ్బా మరీ అంత దూరమా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ తెగించి ఓ నాలుగు అడుగులు వేస్తే ఇహ ఆగమన్నా నడక ఆగదు. చక్కా నడిచి వెళ్లిపోవచ్చు. అలవాటయిపోతుంది. అలా నడిచి వచ్చాక కొంచెం సేపు కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. ఒళ్ళు గుల్ల తేరినట్టు తేలిగ్గా అనిపిస్తుంది. కనుక ఐ లవ్ వాకింగ్. అలాగే  నాన్నకి థాంక్స్.

ఇప్పుడు నాకు యాభై అయిదు దాటిపోయాయి. కానీ డయాబెటిస్‌తో సహా ఏ సమస్యా లేదు. ఆరోగ్య సమస్యలే కాదు జీవితంలోనూ ఏ సమస్యా లేదు. కారణం ఆయన నడకతో పాటు నడత కూడా నేర్పారు. నాన్న ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడేవారు. కోపం వస్తే మౌనంగా ఉండిపోయేవారు. ఉన్నంతలో ఎప్పుడూ ఎవరో ఒకరికి చిన్న, చితకా సాయం చేస్తుండేవారు. నిత్యం భగవద్గీతని చదివేవారు. సమస్య వచ్చిందని బాధపడితే ఏమీ రాదు, పరిష్కారం ఉంటుంది ఆలోచిద్దాం అని అమ్మకి ధైర్యం చెప్పేవారు. అలా ఆయన నేర్పిన నడక, నడత ఇప్పటికీ నేను పాటిస్తున్నాను. కనుక సమస్యలు వచ్చినా భయం లేదు. ఎందుకంటే నేను నడుస్తున్నది నాన్న చూపిన బాటలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here