యువభారతి వారి ‘నన్నయ కవితా వైభవం’ – పరిచయం

0
10

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

నన్నయ కవితా వైభవం

[dropcap]గా[/dropcap]సట బీసటగా జన వ్యవహారంలో ఉన్న భాషను ప్రమాణీకరించి, సున్నితమైన, సమున్నతమైన భావాలను ప్రకటించడానికి అనుకూలంగా తీర్చి దిద్ది, కావ్యరచనకు యోగ్యంగా సమలంకరించి, నన్నయ భట్టు, కవిగా తెలుగుజాతికి ప్రాతః స్మరణీయుడైనాడు.

వేదాలనూ, పురాణాలనూ, శాస్త్రాలనూ, అందులో ఉండే విజ్ఞానాన్నీ అవగతం చేసుకుని తన సమకాలీన ప్రజలకు కథల రూపంలో అందివ్వాలనుకున్నాడు. మహాభారతం తన ఆశయానికి సరి తూగింది. సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అందులోని అర్థం బోధపరచాలని అనుకున్నాడు. అంతేకాని అనువాదానికి పూనుకోలేదు.

ఆ కాలంలో తెలుగులో కావ్యం వ్రాయడం అంటే పండితులకు ఇష్టంలేని పని చెయ్యడం. నన్నయ తెలుగులో కావ్యం వ్రాసి, కొత్త పుంతను తొక్కి, ప్రజల భాషకు పట్టం కట్టి, ప్రజా బాహుళ్యానికి కవిత్వం ఉపయోగపడాలనే సిద్ధాంతానికి ఆనాడే అంకురార్పణ చేశాడు. పెద్ద పెద్ద సమాసాలకూ, కొరకరాని కొయ్యలవంటి శబ్దాలకూ, అశ్లీలమైన వర్ణనలకూ, అన్వయ కాఠిన్యంతో కటకట పట్టే పద్యాలకూ తన కావ్యంలో చోటు లేకుండా చేశాడు. తెలుగునూ, సంస్కృతాన్నీ అందంగా మలచి చక్కని కావ్యం అందించాడు. నన్నయ కావ్యం చదవడం అంటే సరళమైన కవిత్వాన్ని ఆస్వాదించడమే.

నన్నయకు పూర్వం తెలుగు ఎలా ఉండేదో, నన్నయ దాన్ని ఎలా తీర్చిదిద్దాడో, అతని కవిత్వం ఎంత గొప్పదో పరిశోధన చేసి, తెలుగులోకానికి అందజేసిన విద్వత్కవులు ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు. జలదస్వన గంభీరమధురమైన తన వాగామృతధారలతో యావదాంధ్ర దేశాన్నీ పునీతం చేసిన వాగ్మివతంసులు. ఎన్నో అష్టావధానాలు చేసిన అన్వర్థ నామధేయులు. సంస్కృత భాషాభినివేశం, ఆంగ్లభాషా సంపర్కం, ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య సిద్ధాంత పరిజ్ఞానం శ్రీ అవధాని గారిని ఆదర్శాచార్యులను చేసింది. ఎందఱో తెలుగు గురువులకు ఆయన గురువులు.

నన్నయ తెలుగు సేసిన మహాభారతం లోని రమ్యమైన పద్యాలకు, ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి రుచిర వ్యాఖ్య – ఈ పుస్తకం.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

 లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here