సారవంతమైన జీవితాలకి అనుబంధాలు ఎందుకు అవసరమో చెప్పే ‘నన్ను దోచుకొందువటే’

0
7

[dropcap]సా[/dropcap]ఫ్ట్‌వేర్ ఉద్యోగంలో తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుని.. అది సాధించటానికి అహరహం కష్టపడే పాత్ర కార్తీక్ (నాయకుడు). ఆ ప్రక్రియలో భాగంగా తన కింద పని చేసే ఉద్యోగులతో క్రమశిక్షణ పేరిట చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు. ఎలా అంటే ఆఫీస్ పని టైంలో ఊపిరి తీసుకునే టైం కూడా వృథా అయిందని తిడతాడని🤫🤫🤫

అలా అతను ‘బాస్’ స్థానానికి రావటానికి కారణం తనకి తనే పెట్టుకున్న అసాధారణ లక్ష్యాలు!! అలా లక్ష్య సాధన ద్వారా… కంపెనీ అమెరికా పంపించాలనుకునే తమ ఉద్యోగుల జాబితాలో అతను(నే) ఉండాలని కోరిక.

ఆ లక్ష్య సాధనలో తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడనే ధ్యాస కూడా ఉండదు.

“ఇది ఈ కాలపు యువకుల్లో ఆఫీస్ పని… టార్గెట్స్… రాత్రుళ్ళు కూడా…. జీవ గడియారాలతో సంబంధం లేకుండా వేరే దేశాల టైమింగ్స్‌కి వీలుగా క్లయింట్స్‌తో కాల్స్… అదే లోకంగా బ్రతకటమన్నమాట”

కొడుకు చిన్నగా ఉన్నప్పుడే తన భార్యని పోగొట్టుకున్నా… మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా గ్రామంలో తమ వైవాహిక జీవితం గడిపిన ఆ ఇంట్లో.. ఆ పరిసరాల్లో ఆమెని తల్చుకుంటూ కొడుకుని పెంచి పెద్ద చేసి… చదివిస్తాడు నాయకుడి తండ్రి.

అక్క మృతి తర్వాత ఆ ఇంట్లోనే… బావని అంటిపెట్టుకుని ఉంటూ వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉన్న బావమరిది కూతురిని తన కొడుక్కిచ్చి పెళ్ళి చెయ్యటం ద్వారా బావమరిది సేవకి కృతజ్ఞత చూపినట్టూ ఉంటుంది… ఇంట్లో చిన్నప్పటినించీ తిరుగుతున్న పిల్లే కోడలిగానూ వస్తుందని భావిస్తాడు… నాయకుడి తండ్రి!

ఊళ్ళో వాళ్ళు… బావమరిది కూడా అలాగే అనుకుటూ ఉంటారు.

నాయనమ్మ మృతి సందర్భంలో తండ్రిని చూడటానికి గ్రామానికి వచ్చిన నాయకుడితో… మేనమామ కూతురు… తనకి మేన బావని చేసుకోవటం ఇష్టం లేదని…. ఎవరినో ప్రేమించానని చెబుతుంది. కానీ ఆ బావ…మరదలి ప్రేమ గురించి మేనమామతో ప్రస్తావించకుండా…. తనే ఆఫీస్‌లో ఎవరినో ప్రేమించాను కాబట్టి మరదల్ని చేసుకోవటం తనకిష్టం లేదని చెప్పమంటుంది.

అలా నాయిక అతని తాత్కాలిక ప్రేయసిగా నటిస్తూ రంగం మీదికి వస్తుంది. ఆ అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే వృత్తిలో ఉంటుంది కాబట్టి రసవత్తరంగా… సందర్భోచితంగా నటించి నాయకుడి తండ్రి మనసు… అభిమానం చూరగొంటుంది.

ఆ ప్రక్రియలో భాగంగా… వృత్తి-వ్యాపకాలు.. టార్గెట్లు తప్ప జీవితంలో ఇతర సారవంతమైన విషయాలు ఉంటాయని కానీ.. అవి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయని కానీ… తెలియని నాయకుడు… నెమ్మదిగా లవ్ ట్రాక్ లోకి వస్తాడు.

ఎప్పుడూ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తాలూకు ఆలోచనలతో అసహనంగా.. చిరాకుగా ఉండే నాయకుడు…. నాయికని ఆకట్టుకోవటానికి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించటానికి కూడా సిద్ధపడతాడు. కానీ జీవితంలో ఏ రసాలు.. భావోద్వేగాలు అప్పటివరకు తెలియని నాయకుడు… తన ప్రొఫెషన్ తప్ప ఈ భూమి మీద క్లిష్టమైన… కృషి చెయ్యాల్సిన విషయాలు ఇంకేమీ లేవనుకుంటాడు.

కధ రసకందాయంలో పడే వేళకి… ఆఫీస్‌లో అనుకున్న టైంకి ప్రాజెక్ట్ పని అవలేదని… దానికి తన అశ్రద్ధే కారణమని బాస్ అనేసరికి… అప్పటికి తన ప్రాజెక్ట్ పూర్తి చేసి నాయికతో… అప్పటివరకు తన ప్రపంచంలో ‘తను’ ‘అమెరికా వెళ్ళటం’ అనే ఆశ తప్ప ఈ ప్రేమలు… భావోద్వేగాలు తనకి సూట్ అవ్వవని… ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేస్తాడు. వాళ్ళ నాన్నకి కూడా తనకి నిజంగా ఏ లవ్ స్టోరీ లేదని నిజం చెప్పేస్తానంటాడు.

ఇంతలో నాయకుడి తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతకటం కష్టమని చెబుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కథ లవ్ ట్రాక్‌లో నడిచి…. నెమ్మదిగా నాయకుడు ఆ వైపు మొగ్గుతాడే కానీ… ప్రొఫెషన్.. లవ్ మధ్య నలుగుతూ… తండ్రి కోసం మళ్ళీ తన ప్రేయసిగా నటించమని కోరతాడు.

ఆ తరువాత జరిగే కొంత మెలోడ్రామా… నాయికా-నాయకుల మధ్య మనస్పర్థలు…. తన గమ్యమైన అమెరికా అందినట్టే అంది చెయ్యిజారిపోవటం… ఇలా ప్రేమ… వృత్తి చీకటి.. వెలుగులుగా జీవితంతో ఆడుకుని చివరికి అమెరికా వెళ్ళే ముందు తండ్రి దగ్గరకి గ్రామానికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ మాటల ద్వారా… కేవలం మంచి ఉద్యోగం.. మంచి జీతం… అమెరికా జీవితం ప్రతి అమ్మాయి కోరుకోదు అని తెలుసుకుంటాడు.

తను అప్పటివరకు పడుతున్న కష్టం…. తండ్రి పోగొట్టుకున్న పొలం తిరిగి సంపాదించి అతన్ని ఊళ్ళో నలుగురి ముందు గౌరవంగా నిలబెట్టాలనే తన ధ్యేయం కోసమని.. ఆ ప్రయత్నంలో భార్యని పోగొట్టుకుని కొడుకు కోసమే బ్రతుకుతున్న తండ్రి గురించి ఆలోచించలేకపోయానని… అమెరికా వెళ్ళి ఇంకా దూరమై తండ్రిని ఎవ్వరూ లేని ఒంటరివాడిని చెయ్యలేనని అర్థం చేసుకోవటం… కొంతకాలం నటించమని తన జీవితంలోకి ఆహ్వానించిన నాయికనే వివాహం చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది.

ఈ చిత్రంలో… ఈ కాలంలో యాంత్రికంగా బ్రతికే యువకులు ఏం పోగొట్టుకుంటూ… అదంతా తమ… తమ కుటుం సభ్యుల అభివృద్ధి కోసమే అని ఎలా తమని తాము మోసం చేసుకుంటుంటారో… ఇంట్లో మనుషుల మధ్య అనుబంధాలు అనేవి సారవంతమైన జీవితాలకి ఎందుకు అవసరమో… తరచు కుటుంబ సభ్యులు కలుసుకుంటూ ఉండటం ఎందుకు అవసరమో పతాక సన్నివేశంలో చక్కగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here