నన్ను పట్టుకున్న అమ్మ ఉయ్యాల

0
9

[మాయా ఏంజిలో రచించిన ‘Mother, A Cradle to hold me’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. మాయా ఏంజిలో కలం నుంచి వచ్చిన అద్భుతమైన మరో కవిత. ఒక శిశువు పరిణతి చెందిన వ్యక్తిగా ఎదిగే క్రమంలో కలిగిన అనుభవాలు, అనుభూతులు, తల్లి దూరంగా ఉన్నప్పుడు ఏర్పడిన అభద్రతాభావం, రకరకాలైన భావోద్వేగాలను చిత్రించిన కవిత. మదర్స్ డే సందర్భంగా ‘సంచిక’ పాఠకులకు అందిస్తున్నాం.]

~

[dropcap]నే[/dropcap]ను నీ నుంచి
రూపు దిద్దుకున్నానన్నది నిజం
నువ్వు నాకోసమే
సృజించబడ్డావన్నదీ నిజం
నీ స్వరం నా కోరకే పాడింది
నన్ను లాలించడానికే
నీ గొంతు రాగాలు కూర్చుకుంది
నా లాలిపాటల కొరకే
నీ కంఠాన్ని సవరించుకున్నావు
నీ రెండు చేతులూ
నన్ను పట్టుకునేందుకు
నన్ను ఊయలలూపేందుకే
గాలిలో నిండిన నీ దేహసుగంధం
నా ఊపిరికి పరిమళాల శ్వాసలద్దింది
అమ్మా..
గడచిన ఆ మధురాతిమధురమైన రోజుల్లో
నాతో పాటు నీకు వేరే జీవితముండేదని
కలలో కూడా నాకనిపించలేదు
నాకైతే నువ్వొక్కదానివే
నా మొత్తం జీవితానివి
~
కాలం అలా అలా గడిచిపోయింది
మనలని విడదీస్తూ
నిన్ను నేను వెళ్ళనిస్తే
నన్నెప్పటికీ వదిలి వెళ్ళిపోతావని నాకో భయం
నాకెంత మాత్రమూ ఇష్టం లేని బెంగ
నా భయాలు విని నువ్వు నవ్వావమ్మా
నేనెప్పటికీ నీ ఒడిలోనే ఉండిపోవడం
కుదరదని నాకు చెప్పావు నువ్వు
నువ్వు నాతో లేని రోజున
నేనెక్కడుంటాను
మళ్ళీ నవ్వావు నువ్వు
నాకస్సలు నవ్వు రాలేదు
నాకేమాత్రమూ చెప్పకుండానే
ఓ రోజు నన్నొదిలిపెట్టి వెళ్ళావు
కానీ త్వరగానే తిరిగొచ్చావు
మళ్ళీ అలాగే వెళ్ళావు
అలాగే తిరిగొచ్చావు
ఒప్పుకుంటా
త్వరగానే తిరిగొచ్చావు
అయినా
నా మనసు ఎంతమాత్రమూ కుదుటపళ్ళేదు
మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయావు
తిరిగి వచ్చావు
అమ్మా
నువు నా ప్రపంచంలోకి తిరిగొచ్చిన
ప్రతిసారీ, నాకో భరోసా నిచ్చావు
మెల్లగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
నువ్వనుకుంటావు – నీకు నా గురించి తెలుసని
నాకే నీ గురించి బాగా తెలుసు
నువు నన్ను గమనిస్తున్నావని అనుకుంటావు
నా కళ్ళనిండా నిన్నే జాగ్రత్తగా నింపుకున్నాన్నేను

ప్రతి క్షణంలోను
నీ నవ్వుల్నే గుర్తు చేసుకుంటూ
ముఖం చిట్లించే నీ ఆనవాళ్ళని వెతుకుతూ
నీ పరోక్షంలోను
నీలా ఉండడాన్ని సాధన చేస్తాన్నేను
అమ్మా
నువు గాలిలో పాటలు పాడినట్టు
నే పాడాలని ప్రయత్నిస్తా
నీ పాట మూలాల్లో
ఒక వేదన ఉంది ఒక రోదన ఉంది

కాంతి నీ చల్లని ముఖాన్ని ఆకర్షించేట్టుగా
నువు తల వంచుకొని
నీ వేళ్ళతో నా తల పైన తడిమినపుడు
నీ చేతితో నా భుజాన్ని తట్టినపుడు
ప్రశాంతత నాలోకి ప్రవహించినట్టుట్టుంది
నాకేదో కొత్త బలం వచ్చినట్టుగా
నేనెంతో అదృష్టవంతురాలిననిపిస్తుంది
అమ్మా
నువు నాకెప్పటికీ సంతోషంతో నిండిన హృదయానివి
నన్ను ఉల్లాసపరిచే ఉత్సాహ పెట్టే ఆనందగీతికవి
మనసారా నవ్వుకునే నవ్వులోని మధురిమవు నువ్వు
~
నీకెన్నో తెలియకుండా పోయిన ఇన్ని యేళ్ళలో
నాకిప్పుడు అన్నీ తెలుసు
బాల్యావస్థల నుంచి
నేనెన్ని ఎత్తులకు ఎదిగినా
నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానమ్మా
ఇప్పుడు నా వయసు పైబడుతున్నకొద్దీ
నీ విషయ పరిజ్ఞానానికి విస్మయపడుతున్నా
నేను నేర్చుకున్నదిక చాలమ్మా
నిజానికి నాకేమీ తెలియదు
నిన్ను చదవడం కన్నా నేను నేర్చుకోవలసిందేమీ లేదు

అమ్మలందరినీ పూజించి గౌరవించే ఈ రోజున
నీకు నా కృతజ్ఞతలు తెలుపనీ తల్లీ
నా స్వార్థపూరిత చర్యలవలన
నా అజ్ఞానం వలన
నా పెంకితనం వలన
నువ్వు విసిగి వేసారి పోయి
నన్నో, విరిగిపోయి
పనికిరాని బొమ్మని విసిరేసినట్టుగా
నన్ను నీకు దూరం చెయ్యలేదు
నీకు నాలో ఇంకా
ఆదరం, ప్రేమ, గొప్పతనం
కనిపిస్తున్నందుకు నీకు నా ధన్యవాదాలు

కృతజ్ఞతలు అమ్మా!
నీకు నా అనేకానేక ప్రేమలు తల్లీ!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.

 

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here