నారాయణిపురమూ – నాటకోత్సవమూ

0
13

[శ్రీకంఠ కూడిగె గారు కన్నడంలో రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రంగనాథ రామచంద్రరావు.]

[dropcap]‘నా[/dropcap]రాయణిపుర’ అన్నప్పుడు చాలామందికి పరిచితమైన ఊరు అయివుండొచ్చు. లేదా కాకపోవచ్చు. ఇక్కడ నారాయణిపుర భరతఖండపు జంబూద్వీపపు విదేహ పట్టణం కాలానిది. లేదా భరతఖండమే అయివుండొచ్చు. చీకటిలోంచి వెలుతురులోకి వచ్చే కోరికను మోసుకుని అది అనేక శతాబ్దాల నుంచి కాపాడుకుంటూ వచ్చింది. కొండగుట్టల మధ్య పాము నడకలా ఏర్పడిన ఆ ఊరి దారి మరమత్తు చేయబడి ఇక్కడొక ఊరు ఉందని గుర్తించే స్థితిలో ఉంది. నడుము మీద వందలాది సంవత్సరాల నుంచి గుడ్డలే చూడని జనం చిల్లు పడిన తమ గుండెలను దాచుకునే స్థితికి చేరారు. ఇంటి చూరు కొబ్బరి మట్టలను వదిలి, స్థానిక పెంకుల వైపు తిరిగాయి. ఊరి కుర్రవాళ్లల్లో కొందరు కాలేజిలో చదువుకుని ఉద్యోగాలు లేక, ఊళ్లోని సోమరుల మధ్య కూర్చోవటం మొదలుపెట్టారు. ఒక ఆంతరంగిక చైతన్యం దీర్ఘకాలపు జడత్వాన్ని వదిలించుకుని, ఒళ్లు విరుచుకుని నిలుచున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వ ఋణ సౌకర్యాలు పంపుసెట్లకు లభించి ఒకప్పటి బంజరు భూములు ఇప్పుడు పచ్చదనాన్ని సంతరించుకోసాగాయి. ఒక బ్యాంకు ఈ ఊరిని దత్తత తీసుకుని ఊరికి ‘నారాయణిపుర’ అని నామకరణం చేసింది. ఊరి పునర్నామకరణం సంప్రదాయపరులైన కొందరికి అసంతృప్తి కలిగించింది. ‘మూగూరు’ అనే పాత పేరే ఉండాలనే వారి అభిప్రాయానికి చదువుకున్న యువకుల మద్దతు కూడా లభించసాగింది. ఈ మద్దతు ఒక అర్థవంతమైన చరిత్ర ఉన్న పాత పేరు మాయమైందన్న కారణంగా కాదు. నారాయణిపుర అన్నది శిష్ట సంస్కృతికి ప్రతినిధి అనే ఆక్రోశం కోసం. ఈ మధ్యన పార్టీలవారు పంచాయితీ ఎన్నికలను ఈ పేరు పట్ల ఉన్న అనుకూల, వ్యతిరేక గుంపులను మరింతగా బిగించాయి. ఊరివాకిలికి గుండెలా నిలిచి ‘నారాయణిపుర’ అనే పేరుగల కొత్త నామఫలకం ఇలాంటి ఎన్నికల సమయంలో డాంబర్‌ నలుపును పూయించుకోవటం వాడుకైంది. ఊరి గుంపుల మధ్య రగులుతున్న ఆక్రోశానికి వ్యక్త రూపమై ఈ పేరుగల రాయి నిలిచివుంది.

గుంపులోని కుర్రవాళ్లు ‘మూగూరు యువక సంఘం’ అని సంఘాన్ని నిర్మించుకుని సంవత్సరానికి అయిదారు కార్యక్రమాలు జరుపుతారు. ఉపన్యాసకులను పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తారు. సామాజిక మార్పు, పీడన మొదలైనవాటి గురించి చర్చిస్తారు. ఊరివారిలో కొందరు కుర్రవాళ్ల వేధింపు వల్ల వచ్చి కూర్చుని, కొద్దిసేపు విని, చివరికి ఆవులించి, “ఇవన్నీ మాకు అర్థంకావప్పా” అని ఆకువక్కలు నములుతూ కూర్చున్న చోటే తుపుక్కుమని ఉమ్మేవారు. అర్థం చేసుకున్న ఇద్దరు ముగ్గురు ప్రశ్నలు అడిగి ఏమేమో చర్చిస్తారు. ఇతరులకు వీళ్ల భావభంగిమలు తాము చూసిన బయలాటలోని పురాణ పాత్రల అభినయాన్ని గుర్తుకు తెస్తాయే తప్ప ఇంకేమీ అర్థం కాదు. సమావేశం ముగిసి బయటికి వస్తున్నప్పుడు ఒక యువకుడు అక్కడికి వచ్చిన వ్యక్తితో, “ఏమనిపించింది తిమ్మన్న?” అని అడిగితే, “నేను పొలం వైపు వెళ్లినపుడు చేశారు తమ్ముడా” అన్నాడు. నారాయణిపుర పేరుకు మద్దతు పలికే గుంపు ఊరి ఐకమత్యాన్ని తెంచకూడదనే ఏకైక ఉద్దేశంతో మూగూరు పేరును బయటికి సమర్థించి, లోలోపల కోపాన్ని వెలిగక్కేవాళ్లు. ఒకసారి ‘నారాయణిపుర’ పేరును సమర్థించే గుంపు ప్రసిద్ధ హరికథా భాగవతార్‌ చేత ‘హరికథా కాలక్షేపం’ చేయించాలని సూచించినపుడు, మరో గుంపునుంచి వ్యతిరేకత రావటంతో సంఘంలో చీలిక కనిపించసాగింది. కార్యక్రమాలు లేకుండా యువక సంఘం కార్యకలాపాలు స్తబ్ధమయ్యాయి.

ఒక ఉదయం తారాస్థాయిలో మైకు మోగసాగింది. నారాయణిపుర దేవాలయం చుట్టూ పచ్చటి తోరణాలు. హడావుడిగా పరుగులుతీసే యువకులు, ‘గజానన యువక సంఘం ప్రారంభోత్సవం’ అనే రాత కలిగిన ఓ పెద్ద బ్యానర్‌. చూసేవారికి ఆశ్చర్యం. ‘పనికిమాలిన కుర్రవాళ్లు ఒక సంఘం చాలదన్నట్టు మరొకటి పెట్టారు’ అని పెద్దల గుసగుసలు.

కొన్న నెలలు గడిచాయి. కొందరు కుర్రవాళ్లు కర్రలు, చైన్లు, కత్తులు పట్టుకుని తిరగసాగారు. వీధి ధూళిమీద పడుతున్న దబదబమని అడుగుల చప్పుడు, భోజనం చేసి చావడిలో నడుం వాల్చినవారిని, లోపలున్నవారిని బయటికి వచ్చి చూసేలా చేసింది. “ఎడమ చేతివాటం తిమ్మన్నను కంబానికి కట్టి వేశారట. రండప్పా, రండి” అంటూ కొందరు పరుగులు తీస్తున్నారు. విషయమేమిటో అర్థం కాక మరికొందరు వాళ్లను అనుసరిస్తూ పరుగులు తీశారు. ముసలివాళ్లు, కుర్రవాళ్లు, ఆడవాళ్ల తోపులాటలో ఏ ఒక్క మాటా అర్థం కాలేదు. తిమ్మన్న ముఖం మీద చిన్నచిన్న గాయలు ఏర్పడి రక్తం కారుతోంది. తలమీది జుట్టు అస్యవ్యస్తంగా ఉంది. దేవాలయం ప్రాంగణంలో ఎన్నడూ కాలు పెట్టని కొందరు ఈ రోజు లోపలికి దూరి భూమి వ్యవహారాలు జరిపే శామయ్య దగ్గర పెద్ద గొంతుకతో గొడవపడుతున్నారు. ఇటువైపు వాళ్లు నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అటువైపు వాళ్లు తిమ్మన్నను కట్టివేసిన చోటే ఆ గుంపు కొట్టుకోవటానికి పూనుకోవటం కనపించింది. ఒకడు కిందపడి, కొంత మంది జనం చెదిరిపోయినపుడు ఆడవాళ్ల రోదన పెరగసాగింది. “నీళ్లు తీసుకుని రండి..” అని ఎవరో కేక వేశారు. “అయ్యో! పిరికివాళ్లలారా, భుజాల్లో శక్తి లేక కళ్లల్లో కారం కొడతారా” అంటూ దబదబ బాదిన శబ్దాలు. ఆ కొంత సేపు వాతావరణమంతా అయోమయంగా మారింది. గొడవ మధ్య తిమ్మన్న చేతికట్టు ఎవరో విప్పి వుండాలి. నుదుటికి మందు పూస్తూ, రక్తం కారటాన్ని బొటనవేలితో ఒత్తి పట్టుకున్న యువకుడితో శామయ్య అన్నాడు- “ఈ మాత్రానికే ఇంత రాద్ధాంతం చేశారుకదా పిల్లల్లారా? పెద్దలం మేము ఉండి చచ్చినవాళ్లమయ్యాం”.

ఒక్కసారిగా యువకుల గుంపొకటి వారి మీదికి దూసుకుపొయింది. ‘పాపం! అతనిదేమి తప్పు? బట్టలు ఉతుకుతున్న ఆడమనిషి కాలుజారి నీళ్లల్లో పడిపోతే ఆమెను పైకి తీయటం తప్పా? ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిని కావాలనే ముట్టుకున్నాడని ఇలా పశువును బాదినట్టు బాదడం న్యాయమా? చావబోతున్న వ్యక్తిని బతికిస్తే అది అధర్మమా?’ మూగూరు యువకుల సంఘం కుర్రవాళ్లు కేకలు పెట్టారు. నీళ్లల్లో మునిగిపోతున్న ఆమెను ముట్టకుండా ఉండాల్సింది అంటే, ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే బతికించకడదని ఉత్త్తర్వులు ఇచ్చినట్టయ్యింది. కేవలం ముట్టడంవల్ల మైల పడేటట్టయితే, మనమంతా ఇప్పుడు కుస్తీ పట్టాం. ఆ ఆడమనిషిని అలా ముట్టుకున్న వాళ్లందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉద్వేగంలో, భయంలో ఉన్నప్పుడు స్ఫురించని ధర్మం సామాజికత నిరుత్సాపు వాతావరణంలో మొలకెత్తడాన్ని చూసి కుపితులైన యువకులు గుంపుగా ‘మానవత్వం మీది దౌర్జన్యానికి ధిక్కారం’ అని నినాదాలు చేశారు. ఒక గుంపు మరొక గుంపును కోపంతో గుర్రుగా చూస్తూ దూరంగా జరిగింది.

తిమ్మన్న ఈ ఊరిలో కింది వర్గానికి చెందినవాడైనప్పటికీ అందరికీ కావలసినవాడు. ఊళ్లో ప్రత్యేకమైన ఏ పనివున్నప్పటికీ, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పందిరి కట్టడం, కష్టసుఖాల్లో ఇతరులకు వార్త చేరవేయడం మొదలైన పనులు చేసేవాడు. సన్నగా, మంచి దృఢమైన శరీరం కల అతను అవిటివాడు కావటం వల్ల ‘ఎడమచేయి తిమ్మన్న’ అనే పేరుతో పరిచితుడయ్యాడు. అతని పరోపకారం వెనుక ఎంతో కొంత స్వార్థం కూడా కలిసి ఉందనే అనుమానం కొందరు యువకులకు ఉంది. చనువుగా మాట్లాడుతున్న స్త్రీ సమూహం వల్ల అతను చాలామంది కళ్లల్లో నిప్పుకణిక అయ్యాడు.

నారాయణేశ్వర దేవాలయం వెనుకే తుంగానదిలో వెడల్పుగా చదునుగా ఉన్న బండరాయి ఉంది. ఊరివాళ్లంతా బట్టలు ఉతుక్కునే స్థలం ఇదొక్కటే. ఆడవాళ్లు అధికంగా ఈ చోటుకు వెళ్లడానికి కారణం అక్కడ మోకాలు మట్టం వరకే నీళ్లు ఉండటం. దానికి కుడివైపున ఉన్న చిన్న బండరాయి దగ్గరికి వెళ్లాలంటే ఛాతీమట్టం నీళ్లు దాటుకుని వెళ్లాలి. ఈత వచ్చిన మగవాళ్లు, కుర్ర వాళ్లు అక్కడికి వెళతారు. ఆడవాళ్లు బట్టలు ఉతికే చోటికి కుడిభాగంలో లోతైన మడుగు ఉంది. ఆ రోజు మధ్యాహ్నం బట్టలు ఉతుకుతున్న గుంపు నుంచి ‘అయ్యయ్యో’ అనే రోదన వినిపించింది. ‘లీలావతి నీళ్లల్లో పడిరది రండి రండి’ అని. మగవాళ్ల రాయి దగ్గర ఉన్న కుర్రవాళ్లు కొందరు ఈతకొడుతూ వెళ్లినా నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆమె పడిన చోటు చేరలేకపోయారు. తిమ్మన్న కాస్సేపు ఎదురుచూసి, తానే నీళ్లలో మునిగి ఆమెను ఎత్తి బండరాయి మీద దించాడు. అప్పటికే ఆమె నీళ్లు తాగింది. ఆమె ఎక్కువ లోతున్న నీళ్లల్లో పడలేదని, తక్కువ కులానికి చెందిన తిమ్మన్న ఆమెను ముట్టి రక్షించే అవసరం ఉండలేదనీ, ‘గజానన యువక సంఘం’ లోని కొందరు సభ్యుల వాదన. అయితే కొంతమంది పెద్దల మనసులకూ తిమ్మన్న చేసింది సరైనదని అనిపించినా, వాళ్లు నోళ్లు తెరిచి ఆ మాట చెప్పలేదు. అదే గజానన యువక సంఘానికి చెందిన విరూపాక్ష మాత్రం ‘తిమ్మన్న చేసింది సరైనదని, అలా చేయకపోయివుంటే ఆమె ప్రాణాలతో ఉండేదా?’ అని అడగటం చాలామంది అసహనానికి కారణమైంది. కొందరు అతడిని వ్యతిరేకిస్తూ ‘అసలే వీళ్లు కోపంతో ఉన్నారు, ఇలాంటి సమయంలో నువ్వు ఇలా అనవచ్చా విరూపాక్షా’ అంటూ వాదించటం బహిరంగంగానే జరిగింది. చిన్నమాటలు గుంపు రోషాన్ని కెలకటంతో చేతులు చేతులు కలపటంతో ముగిసింది.

ఘటన జరిగి కొన్ని నెలలు గడిచాయి. ఊరు మునుపట్లాగే కనిపిస్తోంది. ప్రత్యేకమైన పనులు వచ్చినపుడు జనం తిమ్మన్నను గుర్తుచేసుకుంటారు. తాను చేసిన అపరాధం ఏమిటని అడిగి సమర్థించుకోలేని అతని హృదయ కారుణ్యం ఊరు వదిలేలా చేసింది. ఈ సంఘటన అతని అభిమానులలో మనోవైకల్యంగా నిలిచిపోయింది.

నారాయణిపురానికి కొత్త చైతన్యం ప్రాప్తించింది. హైస్కూల్‌, జూనియర్‌ కాలేజి ఊళ్లో ప్రారంభమయ్యాయి. వ్యవస్థ మార్పుకు ఎదురుచూసే అధ్యాపకులు, యువకులు ఒక్కటై దేశ పరిస్థితుల గురించి చర్చించసాగారు. బస్సులు తిరగటం, నాటక ప్రదర్శనలు, ధార్మిక సామాజిక సాంస్కాృతిక సంబంధ కార్యక్రమాలు ఆరంభం కావటం వల్ల ఊరు అభివృద్ధి చెందింది అనే పరిస్థితి ఏర్పడిరది.

పండుగలలో, జాతరలలో బయటినుంచి వచ్చిన నాటక బృందాలను పిలిపించి నాటకాలు వేయించడం అమల్లోకి వచ్చింది. ఈ మధ్య చదువుకున్న యువకుల సంఖ్య పెరగటం వల్ల తామే నాటకం నేర్చుకుని ప్రదర్శించటం జరిగేది. ప్రతిసారీ పౌరాణిక నాటకాలే ప్రదర్శిస్తూ ఉండటంవల్ల నూతన అగాహనలకు పూరకమయ్యేలా నాటకం వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

రంగురంగుల మంటపం. మైకాసురిడి అరుపులు. ఆ చప్పుడు వెనుకకు జరుగుతున్నట్టే రంగురంగుల కాంతి మెరుస్తుంది. తెర జరుగుతుంది.

రాజవీధి దృశ్యం. తెరమీద ఒక రాజభవనం. దాని ఆధారంగా మనం దాన్నొక రాజ్యమని అనుకోవాలి. మోకాలిపైకి గోచి పోసి కట్టిన పంచెతో, తంబూర పట్టుకున్న వ్యక్తి దాసుల భంగిమలో కనిపిస్తాడు. రాగయుక్తంగా పాడుతూ వస్తున్నప్పటికీ ప్రేక్షకులకు ఆ పాత్ర ఏదో స్పష్టంకాదు. అతని కోసిన ముక్కు గాయం పచ్చిగా కనిపిస్తుంది. ప్రేక్షకుల వైపు ముఖం తిప్పి, “రాజు వస్తున్నట్టు కనిపిస్తోంది. నేను ఇప్పుడు మీకు కనిపించటం సమంజసం కాదు. మళ్లీ మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పి మరుగవుతాడు. మొదటి దృశ్యం ముగిసిన సూచనగా దీపం ఆరిపోతుంది.

దీపం వెలిగినపుడు ముగ్గురూ రాజులు వేదిక మీద మూడు దిక్కులలో వచ్చి నిలబడుతారు. వాళ్లల్లో మధ్యన నిలుచున్నవాడు ముందుగా మాట్లాడటం మొదలుపెడతాడు. “మహాశయులారా! మా వంశస్థులు ఎంతో కష్టంతో రాజ్యాన్ని నిర్మించారో మీకు తెలుసు. మీ మీ ఊళ్లను అవలోకించినా చాలు. మా కాలంలో దేశం ఎలాంటి స్థితికి వచ్చిందో మీకు తెలుస్తుంది. ఎందరో దురదృష్టకరమైన జీవితాలకు నా సానుభూతి ఉంది..” అంటుండగానే మేడమీద కూర్చున్న పిచ్చుక ‘రెట్ట’ వేసింది. తన తెల్ల అంగీ, ధోవతులను గాభరాగా చూసుకున్నాడు. ప్రేక్షకులను, వేదికను మరిచి “భటులారా, దుస్తులు మలినమయ్యాయి. శుభ్రం చేసే ఏర్పాట్లు చేయండి” వాళ్లు బట్టలు విప్పుతున్నప్పుడే అతను చెప్పిన చివరి మాట: “నా ఇరుపక్కల నిలుచున్నవారు నా అన్నాతమ్ముళ్లే. మాది మూలతా ఒకటే తండా. రాను రానూ వేరై నిలబడ్డాం. జీవకోశాలు ఒకటి అనేకంగా పగిలినట్టు. అయితే చివరిమాటగా చెప్తాను. వాళ్లు నాలాగే కనిపిస్తారు. చివరికి వాళ్లనే నేనని భావించి ఓటు వేస్తారేమో, జాగ్రత్త! మరోసారి బాగా చూసుకోండి. నాకు మీసాలు లేవు. పొట్ట వాళ్లకన్నా తక్కువ. నిలబడటానికి చేతికర్ర అవసరం లేదు.”

దృశ్యం మూడు మొదలయ్యే సమయానికి మొదటి రాజు నిర్గమించాడు. అతను వదిలి వెళ్లిన మైకు ముందు మిగతా ఇద్దరూ హడావుడిగా వచ్చి నిలుచున్నారు. మైకుకు ఇద్దరూ ఒకేసారి నోరు పెట్టడంతో, వాళ్ల మాటలు కలగలిసిపోయి జనం కంగారుపడకూడదని వాళ్లల్లో ఒకడు వెనక్కు జరిగాడు. రెండో రాజు మాట్లాడసాగాడు. “నేనే ఎక్కువ కాలం రాజ్యభారాన్ని వహించినవాడిని. నా పాలనాకాలంలో అంతా ఎంతో క్రమబద్ధంగా ఉండేది. అభివృద్ధి ఉండేది. ప్రజలు ఊరకే కూర్చుని సోమరులు కాకుండా పనులలో నియమించినవాడిని. మేము ముగ్గురం ఈ రోజు వేరు వేరుగా నిలబడి మాట్లాడుతుండవచ్చు. రేపటి రోజున ఒక్కటి కావచ్చు. రాజవంశపు చరిత్ర కథనే ఇంత. నేను బీదవారైన మీ అభివృద్ధికి నా జీవితాన్ని ధారపోస్తాను. ఇది నిజం-’ అన్నప్పుడు సభ బిగ్గరగా చప్పట్టు కొట్టింది.

దృశ్యం నాలుగు- మూడవ రాజు వంతు. మాటలు వింటూ నిలబడటానికి శక్తిలేక కూర్చున్న ఇతను రెండు మూడుసార్లు లేచి నిలబడటానికి ప్రయత్నించాడు. సభ మధ్యలో ‘వెళ్లిపోవటానికి రావాలా?’ అనే కేక వినిపిస్తుంది. కష్టపడి నిలబడి ఆవేశం వచ్చినవాడిలా మాట్లాడసాగాడు. నా వృద్ధాప్యంలోనూ ఇక్కడ నేను ఎందుకు ఉండటానికి ప్రయత్నిస్తున్నానో తెలుసా? నా దీర్ఘ పాలనానుభవం దేశం పాలిట నష్టం కాకూడదని. మళ్లీ మీరు నన్ను ఎన్నుకుంటే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన ఒకడిని రాజుగా పొందిన కీర్తి మీదవుతుంది.

వేదిక మీద దీపం ఆరి, మళ్లీ వెలుతురు వచ్చే సమయానికి రెండవ, మూడవ రాజు ఒకరికొకరు ఆసరా ఇచ్చుకుని నిలబడి ప్రజలకు నమస్కారం చేస్తారు. అభిప్రాయ భేదం వల్ల మొన్నమొన్నటివరకూ మనం వేరుగా ఉన్నాం. ఇప్పుడు ఇద్దరమూ ఒక్కటయ్యాం. ‘మా వ్యతిరేకత ఏమున్నప్పటికీ సర్వాధికారి అయిన మొదటి రాజు మీద’. ప్రజలు మళ్లీ చప్పట్లు కొట్టారు.

వీధి దృశ్యానికి ముందు కనిపించిన ముక్కు గాయపడి స్వామి, అతని సహచరులు రంగస్థలం మీద కనిపిస్తారు. జేగంట, తంబూర, తాళాల ధ్వని. కోసిన ముక్కులకు కుంకుమ అద్దటం వల్ల ప్రతి ఒక్కరి ముఖం భయంకరంగా కనిపిస్తోంది. అయితే ఎవరి ముఖంలోనూ బాధ కనిపించటం లేదు. ‘నారాయణ! నారాయణ!’ అంటూ ఆవేశభరితంగా గంతలేయటం మొదలుపెడతారు. వేదిక మరోమూల నుంచి ముగ్గురు రాజులు ప్రవేశిస్తారు. మొదటి రాజు- ‘ఇంత మంది ముక్కులు కోయించుకుని సంతోషంతో గంతులు వేయటం చూస్తే కచ్చితంగా వీరికి భగవంతుడి దర్శనం కలిగివుండాలి. మనందరి జీవిత లక్ష్యం పరమాత్ముడి సాక్షాత్కారమేకదా? ఒకరిద్దరు చెప్పేది అర్ధసత్యం. చాలామంది చెప్పేది పరమసత్యం అన్నదే మా ‘పాలనా నీతి’ అని చెప్పి సభను చూశాడు. ‘మహారాజుకు జయం కలగాలి’ అనే ప్రతిస్పందన అటువైపు నుంచి వచ్చింది. మహారాజు ప్రధాన సన్యాసికి ముక్కు కోయమన్నట్టు నివేదించుకుంటున్నప్పుడు మిగతా ఇద్దరూ తమకు ముందుగా నారాయణుడిని చూసే అవకాశం లభించాలని పోటీగా ముందుకొచ్చారు. సన్యాసి మంత్రం పఠించి, దీక్ష బోధించి, ముక్కు కోశాడు. మహారాజుకు కళ్లకు చీకటి కమ్మినట్టు అయ్యింది. నారాయణుడి దర్శన ఆవేశంలో సన్యాసి ముఖాన్నే చూశాడు. చాలాసేపు ఏమీ కనిపించలేదు. బదులుగా గతంలో రాజద్రోహానికి, ప్రజాద్రోహానికి శిక్షకు గురై ముక్కు పోగొట్టుకుని పరారి అయిన తన అన్న కొడుకు ముఖమే సన్యాసి గడ్డం మధ్య కనిపించినట్టయింది. మహారాజు ఆవేశంతో గంతులేయసాగాడు. నారాయణుడి దర్శనం కలుగుతుండవచ్చని చాలామంది భావించి ఇష్టపూర్వకంగా రాజును అనుసరించారు. తర్వాత మహారాజు ప్రజలకు నారాయణుడు కనిపించటానికి అనుకూలమయ్యేలా ముక్కులు కోయించుకోవటానికి రాజాజ్ఞను వెలువరించాడు.

నాటకం ముగింపు. ‘మూగూరు యువక సంఘం అధ్యక్షులచేత. ‘మూగూరు చరిత్ర’ ఆధారంగా రచింపబడిన ఈ నాటకం మార్మికంగా ఉంది. నాటకం వీక్షించిన తరువాత మా ఊరికి ‘మూగూరు’ అనే పేరే అర్థవంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉపన్యాసం ముగిసింది. ఏదో గుసగుసల అయోమయం. హర్షోద్గారం. ధిక్కారం. విద్యుత్‌ దీపాలు ఆరిపోయివుండాలి. మందకాంతి వెదజల్లుతున్న పెట్రోమాక్స్‌ కింది భాగంలో నీడలు ఒకదాని మీద ఒకటి పడి పోట్లాడుకున్నట్టు కనిపిస్తుంది.

కన్నడ మూలం: శ్రీకంఠ కూడిగె

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here