నారికేళ పురం

0
6

[dropcap]స[/dropcap]ముద్రతీరంలో పూల తోటలు, పచ్చని ప్రకృతితో అదొక అందమైన గ్రామం. ఆ గ్రామంలో చంద్రయ్య, రంగమ్మ దంపతులు హాయిగా జీవిస్తున్నారు. చంద్రయ్య కట్టెలు కొడితే, రంగమ్మ అక్కడక్కడా కాసిన పండ్లను కోసుకొచ్చి కట్టెలు, పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, అదే వారికి దిగులు!

పిల్లల కోసం వాళ్ళు అనేక పూజలు చేశారు. అయినా ఫలితం శూన్యం. ఒకరోజు రంగమ్మ పండ్ల కోసం వెళుతుంటే ఒక టెంకాయ చెట్టు కింద ఓ పెద్ద టెంకాయ పడి ఉంది. రంగమ్మ ఇంతకు మునుపెప్పుడూ అంత పెద్ద కొబ్బరికాయ చూసి ఎరుగదు! ఎంతో సంతోషంతో రంగమ్మ కొబ్బరికాయను తీసుకుని ఇంటికి వెళ్ళింది. కట్టెలు కొట్టి ఇంటికికి వచ్చిన చంద్రయ్యకి రంగమ్మ ఆ పెద్ద కొబ్బరికాయ చూపించి, “దీనిని సంతలో అమ్మితే మంచి డబ్బు వస్తుంది” అన్నది రంగమ్మ.

“వద్దు వద్దు, ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం” అని చంద్రయ్య చెబుతుండగానే కొబ్బరికాయలోంచి పసికందు ఏడుపు వినిపించింది.

ఇద్దరూ ఆశ్చర్యపోయి, ఓ కత్తితో జాగ్రత్తగా కొబ్బరికాయను పగులగొట్టారు. కొబ్బరికాయ నుండి వింత కాంతి వెలువడింది! కొబ్బరికాయ లోపల అందాలొలికే బుజ్జి బాలుడు ఉన్నాడు! వాడు కొబ్బరికాయ అంటే నారికేళంలో పుట్టాడు కాబట్టి వాడికి ‘నారికేళుడు’ అని పేరు పెట్టుకున్నారు చంద్రయ్య దంపతులు.

వాడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.

రంగమ్మ ప్రేమతో చేసి పెట్టిన తిండి తింటూ వాడు మంచి బలిష్టుడుగా తయారయ్యాడు.

ఇలా ఉండగా ఆ గ్రామానికి కొంత దూరంలో ఉన్న సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ‘కర్కశులు’ అనే రాక్షసులు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడూ ఓ పెద్ద పడవలో గ్రామానికి వచ్చి, ప్రజలను బెదరించి తినడానికి అవసరమైన సరకులు, బంగారం దోచుకుని వెళ్ళేవారు. వాళ్ళ భీకర ఆకారాలు, తలపై కొమ్ములు చూసి గ్రామంలోని వారు వారిని ఎదిరించలేక పోయేవారు!

కొన్ని నెలల తరువాత నారికేళుడు బాగా ఎదిగి మంచి బలిష్టుడుగా తయారు అయ్యాడు. వాడికి కర్కశ రాక్షసులను గురించి తెలిసింది.

“నాన్నా, నేను ఆ కర్కశుల ద్వీపానికి వెళ్ళి వాళ్ళను నా శక్తితో ఓడించి వాళ్ళ పీడను మన గ్రామానికి వదలిస్తాను”అని చెప్పాడు.

నారికేళుడి శక్తి మీద నమ్మకమున్న చంద్రయ్య దంపతులు అనుకున్నది సాధించమని ఆశీర్వదించారు. రంగమ్మ వాడికి దారిలో తినడానికి మూడు పెద్ద రొట్టెలు ఇచ్చింది. తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి మూడు రొట్టెలు మూటకట్టుకుని బయలు దేరాడు.

అలా కొంతదూరం వెళ్ళాక ఒక చెట్టు దగ్గర ఒక కోతి చాలా నీరసంగా కనబడ్డది.

“ఏం కోతి బావా అలా నీరసంగా ఉన్నావు?” అడిగాడు నారికేళుడు.

“మూడురోజుల నుండి తిండిలేదు అందుకే నీరసం” అన్నది కోతి.

“ఇదిగో ఈ రొట్టె తిను” అంటూ ఒక రొట్టె ఇచ్చాడు. రొట్టె తింటే కోతికి కొత్త శక్తి వచ్చినట్టయింది. “బాబూ ఎక్కడికి వెళుతున్నావు?” ప్రేమగా అడిగింది కోతి.

“అదిగో సముద్రంలో ఉన్న కర్కశ ద్వీపానికి వెళ్ళి ఆ రాక్షసుల అంతు చూడటానికి” చెప్పాడు.

“వాళ్ళతో ప్రమాదం నీకు సహాయంగా నేనూ వస్తాను” అని కోతి బయలుదేరింది. మార్గమధ్యంలో కోతి కొన్ని వింత ఆకుల్ని కోసి కట్టగా కట్టింది.

అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు దగ్గర నీరసంగా ఒక కుక్క, చెట్టుకొమ్మపై ఒక పక్షి నీరసంగా కనబడ్డాయి!

పక్షికి, కుక్కకు కూడా ఎంతో కరుణతో చెరొక రొట్టె ఇచ్చి వాటికి శక్తి వచ్చేట్టు చేశాడు. అవి కృతజ్ఞతతో నారికేళుడితో బయలుదేరాయి. చిత్రంగా నారికేళుడికి ఆకలి వెయ్యడం లేదు. అయినా వాడు వింత శక్తితో మరింత బలిష్టుడుగా తయారయ్యాడు.

అలా నారికేళుడు కుక్క, కోతి, పక్షితో సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడు. ఎక్కడినుండో అతిపెద్ద కొబ్బరి చిప్ప వారి దగ్గరకు వచ్చింది.

సంతోషంగా అందరూ దానిలో ఎక్కారు. అంతే వేగంగా కొబ్బరి చిప్ప పడవ కర్కశ ద్వీపానికి వెళ్ళింది. ఆ ద్వీపంలో ఒక పెద్ద కోట ఉంది. కోట చుట్టూ ఓ ఎత్తైన ప్రహరీ ఉంది. దాని పెద్ద ద్వారం, ద్వారం తలుపుకి తాళం వేసి ఉన్నాయి. ముగ్గరూ కొబ్బరి చిప్ప నుండి దిగాక,

“ఇక్కడే ఉండండి… నేను వెళ్ళి కోట సంగతి కర్కశుల సంగతి చూసి వస్తాను” అని చెప్పి పక్షి ఎగురుతూ వెళ్ళి కోట కిటికీ లోంచి కర్కశులు ఏం చేస్తున్నది చూసి వచ్చింది.

“లోపల అందరూ మాంసం తింటూ, సారాయి తాగుతూ, భయంకరంగా పాటలు పాడుతున్నారు” చెప్పింది పక్షి.

“తలుపు తాళం తీయాలి”అన్నాడు నారికేళుడు.

“నేనే తీస్తాను” అని పక్షి ఎగిరి వెళ్ళి తన ముక్కుతో తాళం తీసింది! చకచకా కుక్క, కోతి నారికేళుణ్ణి వెంబడించాయి. మెల్లగా తలుపు ఓరగా తీసి చూస్తే కర్కశులు ఆనంద డోలికల్లో కనబడ్డారు. వాళ్ళ కొమ్ములు ఏదో వింత కాంతిని వెదజల్లుతున్నాయి! వాళ్ళ శక్తి వాళ్ళ కొమ్ముల్లో ఉన్నట్టు నారికేళుడు గమనించాడు. కోతికి ఈ విషయం చెప్పాడు.

“ఎందుకైనా మంచిదని మనం వచ్చేటప్పుడు మత్తును కలిగించే ఆకులు కోసి కట్టగా కట్టాను. వాటిని వాళ్ళు తినే ఆహారంలో కలుపుతాను” చెప్పింది కోతి. కోతి కోటపై నుండి ఆకుల్ని రహస్యంగా నలిపి ఆహార పదార్థాలలోకి జారవిడిచింది. అది తెలియక ఆహారం తిన్న కర్కశులు మత్తుగా పడిపోయారు. కుక్క, నారికేళుడు లోపలికి వెళ్ళి వాళ్ళ కొమ్ములు విరిచేశారు. కుక్క విరిగిన కొమ్ముల్ని నోట కరచుకుని దూరంగా పారవేసింది. కొంతసేపు అయ్యాక వాళ్ళ మత్తు దిగి లేచారు. చూస్తే కొమ్ములు లేవు! వారి శక్తులన్నీ పొయ్యాయి

“మేము గ్రామం నుండి వచ్చాము, ఇక గ్రామాన్ని దోచుకుంటే మిమ్మల్ని చంపేస్తాను” అని బెదిరించాడు నారికేళుడు. ఒక కర్కశుడు పెద్ద కర్రనెత్తుకుని నారికేళుడి మీదకు వచ్చాడు. అంతే నారికేళుడు ఒక్క గుద్దు గుద్దేసరికి ఆ కర్కశుడు పడిపోయాడు. వాడు తన శక్తి పోయినట్టు గ్రహించి, నారికేళుడి కాళ్ళమీద పడ్డాడు. మరుక్షణం కర్కశులు మామూలు మనుషులుగా మారిపొయారు.

“మేము ఎప్పుడో చేసిన పాపాల వలన ఒక ముని శాపం వలన కర్కశులుగా మారిపొయ్యాం. నీ వలన శాప విముక్తి పొందాము. మేము వెళ్ళి పోతున్నాం, కోటలో ఉన్న బంగారం మీదే తీసుకవెళ్ళి మీ ఊరి ప్రజలకు ఇవ్వండి. అవన్నీ మీ ఊరినుండి దోచినవే” అని చెప్పి మంచిగా మారిన కర్కశులు ఎటో వెళ్ళిపోయారు.

అక్కడి నిధులను కొబ్బరి చిప్ప పడవలోకి చేర్చి కోతి, పక్షి, కుక్కతో గ్రామానికి చేరారు. గ్రామస్థులకు ఆ నిధి పంచారు. ఇక కర్కశుల బాధ ఆ గ్రామ ప్రజలకు లేకుండా చేసిన మేలుకు నారికేళుడి పేరు మీద ఆ ఊరికి ‘నారికేళ పురం’ అని ప్రజలు పేరు పెట్టుకున్నారు.

(జపాను జానపద కథకు అనుసృజన)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here