నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు శ్రీశ్రీ -3

1
6

[box type=’note’ fontsize=’16’] మహాకవి శ్రీశ్రీ జీవితాన్ని, రచనల ద్వారా ఆయన సమాజంపై చూపిన ప్రభావాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు కోవెల సంతోష్‌కుమార్. ఇది మూడవ భాగం. [/box]

నాటికలు

[dropcap]శ్రీ[/dropcap]శ్రీ 11 రేడియో నాటికలు రాశాడు. శిల్పానికీ, వచన పద్య రచనకూ ఈ నాటికలు ప్రసిద్ధమైనవి. భూతాల కొలిమి, గవేషణ, విదూషకుని ఆత్మహత్య, గ్రామ్‌ఫోన్ రికార్డుల తిరుగుబాటు, గుమస్తా కల, మరో ప్రపంచం.. ఇవన్నీ విప్లవ భావ ప్రాతిపదికాలు. ఇక చతురస్రం, అనంతర యాత్ర, బలి అనేవి స్వప్న రచనలు.

శ్రీశ్రీ రేడియో నాటికల్లో తొలి నాటిక ఒంటరి బావి. బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న పదేళ్ల బాలికమీది అపవాదు ఈ నాటికలో కథా వస్తువు. ఇందులో సగం బావికి సంబంధించిన వర్ణనతోనే సాగుతుంది. ఇక భూతాల కొలిమి.. తన ప్రియుడిని ఎవరో హత్య చేస్తే.. అంతిమ విశ్రాంతిలో అతను ఉన్న స్మశానానికి వెళ్తున్న ప్రియురాలి మనోవేదన ఇందులో ఇతివృత్తం. తరువాతి నాటిక గవేషణ. సోషియో ఫాంటసీ నాటిక. ఒక మనిషిని ఆయుష్షు ఉండగానే అయిదేళ్ల ముందుగానే నరకానికి తీసుకెళ్తారు. అక్కడున్న న్యాయమూర్తి మృతశిశువ శరీరంలోకి ప్రవేశించమంటాడు. మనిషి శాశ్వతత్వాన్ని నిరూపించటం దీని ఉద్దేశం.

శ్రీశ్రీ నాటికల్లో ప్రసిద్ధి పొందిన రేడియో నాటిక విదూషకుని ఆత్మహత్య. మృచ్ఛకటికంలో విదూషకుడి పాత్ర ఎంత కీలకమో ఇందులోనూ విదూషకుడే సూత్రధారి. జీవితం అంతా అప్పుల పాలై.. కనాకష్టం పడుతూ చివరకు ఆత్మహత్య చేసుకోవటంతో ఈ నాటిక ముగుస్తుంది. ఆత్మహత్య చేసుకోబోతూ అతను ఒక ఉత్తరం సమాజానికి రాస్తాడు. ఈ ఉత్తరం అత్యంత విషాదాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నాటికకంతటికీ ఈ ఉత్తరమే కీలకం. ‘బతికి చచ్చిపోయాను.. చచ్చి బతికిపోయాను’ అన్న మాటలతో నాటిక ముగుస్తుంది.

గ్రాముఫోను రికార్డుల తిరుగుబాటు అన్నది ఒక విచిత్రమైన నాటిక. బానిసల తిరుగుబాటుకు ప్రతీక.. పని చేస్తున్న వాళ్లతోనే పని చేయించీ చేయించీ శ్రమదోపిడీ చేసే విధానానికి ఈ నాటిక ఓ నిదర్శనం. గ్రామ్‌ఫోన్ రికార్డులను అదే పనిగా వాడీ…. వాడీ.. చివరకు అవి అరిగిపోయిన తరువాత కూడా వాడేందుకు ప్రయత్నించే దుర్మార్గం ఈ నాటికలో ప్రధాన వస్తువు. సూత్రధారుడు రేడియోలో ‘తుది పలుకు’ అనే నాటికను వేస్తుంటే నాలుగు రికార్డులు తాము మోగేది లేదని తిరుగుబాటు చేస్తాయి. తమతో వెట్టి చేయించుకుంటున్నారని ఆగ్రహిస్తాయి. చివరకు సూత్రధారుడే గొంతులు మార్చి నాలుగు పాత్రలను పండిస్తాడు.

గుమాస్తా కల మరో నాటిక. బొటాబొటి జీతం రాళ్లతో బతికే ఓ గుమాస్తా.. తాను కనే అద్భుతమైన కలలపై ఈ నాటిక అద్భుతంగా అభివ్యక్తమయింది. ఈ నాటికలో కోనేటిరావు అనే గుమాస్తాకు మూడు రకాల కలలు వస్తాయి. మూడూ మూడు విచిత్రమైన కలలు. మొదటి కలలో అతనికి అమెరికాలో అతి పెద్ద సన్మానం జరుగుతుంది. అమెరికాలోని ప్రముఖులంతా ఈ సభలో కోనేటిరావును ప్రశంసిస్తూ ప్రసంగిస్తుంటారు. కోనేటిరావు తాను ప్రసంగిస్తుండగా కల చెదిరిపోతుంది. రెండోసారి జర్మనీలో జలాంతర్గామికి అధినేతగా ఉన్నట్లు కల వస్తుంది. యుద్ధంలో పాల్గొని విజయం సాధించే సమయంలో కల చెదిరిపోయింది. ఇక మూడవది తన స్వప్నసుందరితో డ్యూయెట్ పాడుతుండగా కల చెదిరిపోతుంది. గమ్మత్తేమిటంటే ఈ మూడు కలలు అసంపూర్ణంగానే ముగుస్తాయి. గుమస్తాగా అతని ఆశలకు ఈ కలలు ప్రతీకలు. కానీ, ఏ ఒక్క ఆశా నెరవేరదు. ‘అతని నిజమైన జీవితం ఒక స్వప్నం.. అతని స్వప్నం ఎన్నడూ సాధ్యం కాని అబద్ధం’.

మరో రేడియో నాటిక మరో ప్రపంచం. ఇది భవిష్యత్ శతాబ్దికి చెందిన మానవుని ఊహించుకుని రాసిన నాటిక. భవిష్యత్ మనిషి ఆకుపచ్చగాజు బంతిలా ఉంటాడు. అతడి పేరు ‘కనుపాప’. కాలాన్ని జయించటం, మానసిక స్వాతంత్య్ర సాధన, అద్వైత భావన అనేవి ఈ కథానాయకుడి విజయ లక్షణాలు. 1999 డిసెంబర్ మూడో తేదీన ఒక మానవుడు చంద్రలోకం నుంచి తెచ్చిన అమృతాన్ని భూమ్మీద మనుషులందరకూ ఇంజక్షన్ రూపంలో పంచుతాడు. అందరూ 30 ఏళ్ల వాళ్లవుతారు. విషమబాహువు కాస్తా సమబాహువుగా మారిపోతుంది. కథ రెండు రేఖల మీద ప్రధానంగా నడుస్తుంది. ఒక భాగం సంభాషణ అయితే, రెండోది రాజకీయం. చివరకు కాలం తాను ఓడిపోతుంది. మానవుణ్ణి నేను సృష్టించలేదు. మానవుడే నన్ను సృష్టించాడు అని గ్రహిస్తుంది.

జీవిస్తున్న వారి కాలం, మరణిస్తున్న వారి కాలాల మధ్య అంతరాన్ని చర్చించిన నాటకం అనంతర యాత్ర. బలి నాటిక పౌరాణిక గాధ.

ఈ నాటికల్లోని ప్రధాన లక్షణం తన కాలంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక భావనలన్నింటినీ, సిద్ధాంతాలన్నింటినీ అతి బలంగా.. ప్రభావ వంతంగా ప్రచారం చేయటం.

విమర్శకుడిగా శ్రీశ్రీ

‘తెలుగు విమర్శుకిడికి తిట్టడంలో ఉన్న ప్రజ్ఞ మెచ్చుకోవటంలో లేదు. వేలడంతేసి వాడు జానెడంతేసి వాణ్ణి చూసి మూరెండంతేసి వాళ్లున్నారు లేవోయ్’ అంటాడు. “తెలుగు విమర్శకుడనా అన్నాను. తెలుగు వాడన్న ప్రతివాడికీ ఉన్న గుణమే అది. సినిమాకు వెళ్లి ఈసడిస్తాడు. విందుకు వెళ్లి వెక్కిరిస్తాడు. కావ్యం చదివి కరవ్వొస్తాడు. తెలుగు వాడికి సరియైన విమర్శా ప్రామాణ్యాలు లేకపోవటమే ఇందుకు కారణమనుకుంటాను గొర్రెళ్లి తినేవాడెప్పుడూ ఉంటూనే ఉంటాడు. కానీ, కోళ్లను తినేవాణ్ణి మెచ్చుకోనక్కరలేదన్నదే ఇతని వాదం అనవచ్చును. తెలుగులో పైకి వచ్చిన వాళ్లంతా పైకి పోయిన వాళ్లే.” ఈ వాక్యాలు 1946లో ఆనందవాణి పత్రికలో శ్రీశ్రీ రాసిన వ్యాసంలోని భాగాలివి. మంచి విమర్శపై శ్రీశ్రీకి ఎప్పుడూ సదభిప్రాయమే ఉంది. ఆయన విమర్శలో దోషావిష్కరణల కంటే, గుణావిష్కరణల పాలే ఎక్కువ. ఇందుకు కారణాలకోసం పెద్దగా అన్వేషించక్కర్లేదు. ఆయన విమర్శలో పరిణతి ఉంది. విమర్శ విశ్లేషణలో పరిమితులూ ఉన్నాయి.

శ్రీశ్రీ ఎన్నడూ విమర్శకుడిగా స్థిరపడటానికి కృషి చేయలేదు. దానిపై పెద్దగా దృష్టి సారించనూ లేదు. ఆయన్ను సంపూర్ణ విమర్శకుడిగా అంగీకరించటమూ ఒక విధంగా సాధ్యమయ్యేపని కాదు. ఆయనది ప్రముఖంగా కవితాచైతన్యమే కానీ, విమర్శక చైతన్యం కానే కాదు. ఆయన పెద్ద పెద్ద వ్యాసాలు రాసిన సందర్భాలు చాలా తక్కువ. రాసినవన్నీ మినీ వ్యాసాలే. అసలు పెద్ద వ్యాసాల్ని రాయటానికి శ్రీశ్రీ పెద్దగా ఇష్టపడలేదు. అందుకోసం కష్టపడనూ లేదు. ఒక సమీక్ష రూపంలోనే ఆయన విమర్శ అంతా సాగుతూ వచ్చింది.

“కావ్య విమర్శకు అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథఆలు ఉపకరించవచ్చు. కానీ, అవి కేవలం శిల్పాన్ని నిర్దేశిస్తాయి. కావ్యవస్తువును నిర్దేశించవు.”

అందుకే ఆయన కవిత్వానికి ఫలానా మాత్రమే వస్తువు అని గిరిగీసుకోనక్కరలేదన్నాడు. కుక్కపిల్లా, సబ్బుబిళ్లా, అగ్గిపుల్లా ఏదైనా కవిత్వానికి అర్హమేనన్నాడు. శ్రీశ్రీ తన పరిధేమిటో నిర్ణయించుకున్నాడు. తనకు బాగా ఇష్టం లేని అంశాల గురించి, తనకు బాగా తెలియని అంశాల గురించి ఏ చిన్న మాటా ఎక్కడా రాయలేదు.

భారతి పత్రికలో సమీక్షలతో శ్రీశ్రీ విమర్శ ప్రారంభమైంది. 1930ల నాటి భారతి సంచికలో కొంత కృత్యాద్యవస్థ కనిపించినా, 1932నాటికి సమదర్శిని పత్రికలో వచ్చిన వ్యాసంలో కొంత గ్రాంధికం కనిపించినా.. రానురానూ గురజాడ, గిడుగుల ప్రభావం, విస్తృత సాహిత్య అధ్యయనం, పాత్రికేయ వృత్తి.. అన్నీ కలగలిసి ఆయన శైలిని అందంగా తీర్చి దిద్దాయి. ఎంతగా అంటే.. తెలుగు సాహిత్య విమర్శలో లబ్ధప్రతిష్ఠులైన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ తరువాత ఆంత అందంగా రాయగలిగిన శైలిని అలవరచుకున్న వ్యక్తి శ్రీశ్రీ అని చెప్పవచ్చు. ఆయన విమర్శలో మెరుపులు మెరుస్తాయి. విద్యుత్తు ప్రసరిస్తుంది. అసాధారణమైన వేగం ఉంటుంది. ఆయన చేసే వాదనలు సాహిత్య ప్రక్రియలకు సరికొత్త నిర్వచనాలనిస్తాయి.

“జీవితమంత విశాలమైన పునాది మీద ఆకాశాన్ని చుంబించే హర్మ్యం వంటిది నా దృష్టిలో నవల అంటే.” ఇది ఆయన నవలకు ఇచ్చిన నిర్వచనం.

ఎంతోమందికి అర్థం కాని చాలా కష్టమైన యులిసిస్ నవల రాసిన జేమ్స్ జాయిస్ అంటే శ్రీశ్రీకి చాలా చాలా ఇష్టం. ఆయన గురించి, ఆ నవల గురించి సవివరంగా 1947లోనే అద్భుతమైన వ్యాసం రాసినవాడు శ్రీశ్రీ. చక్కని విమర్శకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? జాయిస్ వినూత్న శిల్ప విన్యాసాన్ని అందంగా ‘చైతన్యస్రవంతి పేరుతో శ్రీశ్రీయే అనువదించారు. ఈ ప్రయోగవాదాన్ని బలపరిచేందుకు ‘‘ఒసేయ్ తువ్వాలందుకో’’ వంటి కథలనూ రాశారు. ఈ రకమైన శిల్పవిన్యాసాన్ని ప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ వంటి వారు ముందుకు తీసుకువెళ్లారు.

సాహిత్య విమర్శలో శ్రీశ్రీ చేసిన మౌలిక ప్రతిపాదనలు సుదీర్ఘకాలం మనగలుగుతాయి. సాహిత్య విమర్శకు ‘రసన’ అనే కొత్త ప్రమాణాన్ని సూచించి సాహిత్య సిద్ధాంతకర్తగా కూడా శ్రీశ్రీ తెలుగు సాహిత్యపీఠంపై శాశ్వతంగా నిలిచిపోయాడు. ఏకకాలంలో రెండు రసాలను వ్యక్తం చేయటమే రసన అన్నాడు. కన్యాశుల్కం నాటకం ‘‘బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం’’. అదే విధంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఆరు సారాకథలు కూడా రెండు రసాలను ఏకకాలంలో పండించిందని విశ్లేషించాడు. సుదీర్ఘకాలం అస్తిత్వాన్ని నిలుపుకోగలిగిన వ్యాసాల్లో ప్రధానమైంది ‘‘ముత్యాలసరం-ఒక కృషి’’ ముత్యాలసరం వంటి చందోబద్ధమైన శాస్త్రపరమైన అంశాన్ని కొత్త పరిశీలనా దృక్పథంతో స్వీయ అభివ్యక్తీకరణ ముద్రతో అందరూ చదివే విధంగా రాయటం శ్రీశ్రీకి మాత్రమే కుదిరింది. గురజాడపై ఎంత తీవ్రమైన అభిమానం ఉన్నప్పటికీ శ్రీశ్రీ, కన్యాశుల్కంలోని లోపాలను నిష్పాక్షికంగా బయటపెట్టాడు. శిష్యుడికి పెళ్లికూతురు వేషం వేయించి పెళ్లి జరిపించటం మన నమ్మకానికి అతీతమైందన్నాడు. అదే విధంగా పాత్రలకు నామకరణ ఒకటి వాస్తవ రచనాసూత్రాలకు విరుద్ధమైందన్నాడు. కన్యాశుల్కంలో తప్పులు పట్టడం నాకిష్టం లేకున్నప్పటికీ, ఉన్న దోషాలను లేవనుకోవటం కూడా నిజమైన అభిమానానికి పుష్టినివ్వదని శ్రీశ్రీ కుండబద్దలు కొట్టాడు. అందుకే ఆయన మహాకవి కాగలిగాడు.

విచిత్రమేమంటే.. ప్రపంచమంతా అతి గొప్పగా ఆరాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ శ్రీశ్రీ కి మాత్రం మంచి కవి కాలేకపోయాడు. ప్రపంచమంతా హారతి పట్టినా, ఠాగూరును కవిగా అంగీకరించలేదు శ్రీశ్రీ. ఆయన నాటకాలు నాటకాలే కావన్నాడు. ఆయన కవిత్వం దుస్తుల మార్పులతో అక్కడ కూడా ప్రత్యక్షమవుతుందన్నాడు. ఠాగూర్ నా ఎల్లెర్జీ పేరుతో ఓ వ్యాసాన్నే రాశాడు.

1934-83 మధ్య కాలంలో దాదాపు 66 గ్రంథాలకు పీఠికలు రాశాడు. ఇందులో తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇతర రచయితలను పరిచయం చేశాడు. ఆరుద్ర కూనలమ్మ పదాలకు, శేషేంద్ర శర్మ ఋతుఘోషకూ శ్రీశ్రీ గేయరూపంలో పీఠికలు రాశాడు.

1936-69 మధ్యకాలంలో మొత్తం 20 విమర్శ వ్యాసాలు వచ్చాయి.

వచనగీతంపై శ్రీశ్రీ నిశితమైన విమర్శ చేశాడు. 1939లో రాసిన ఓ వ్యాసంలో వచనకవిత్వం అంటే చేతికి వచ్చిన రాత కాదని స్పష్టం చేశాడు. వచన గీతాలు మంచి కవిత్వంలా కాకుండా చెత్త వచనంలా వస్తున్నాయని అన్నాడు. ఒక రచయితలో ఉన్న అన్ని సుగుణాలను, దుర్గుణాలను బైటపెట్టగలిగినది సాహిత్యవ్యాసం ఒక్కటే అన్నాడు. తన వ్యాసాల్లో ఈ ప్రమాణాన్ని తుచ తప్పకుండా పాటించాడు. కన్యాశుల్కంలోని లోపాలను ప్రస్తావించటం ఇందుకు ఉదాహరణ. కవిత్వంలోనే కాకుండా విమర్శలోనూ అనితర సాధ్యంగా తనదైన మార్గాన్ని నిర్మించిన వాడు శ్రీశ్రీ.

శ్రీశ్రీ వచన రచనల్లో చరమరాత్రి కథాసంపుటి ప్రత్యేకమైంది. ఇందులో ఆయన వచనం కవితాత్మకంగా సాగింది. తన వచనం సింగిల్ పన్నా కవిత్వంగా తానే చెప్పుకున్నాడు. ఇందులో కూడా ఆయన తన భావాలను, ఆదర్శాలను బంలంగా వ్యక్తీకరించటంలో వెనుకాడలేదు. 1945 నుంచి 1986 దాకా ఆయన ఆత్మకథ అనంతం వివిధ పత్రికల్లో ధారావాహికగా ప్రచురితమైంది. ‘‘ఆత్మహత్య చేసుకోవడపు అనేక పద్ధతుల్లో ఆత్మకథ రాసుకోవటం ఒకటి’’ అని తనకు తానే చెప్పుకున్నాడు.

పురస్కారాలు

అనేక సంస్థల నుంచి శ్రీశ్రీ రకరకాల బహుమానాలు అందుకున్నాడు. హైదరాబాద్‌లో దక్షిణ భారత హిందీ మహాసభ వాళ్లు శ్రీశ్రీకి ‘సాహిత్యాచార్య’ బిరుదాన్నిచ్చి సత్కరించారు. గోకక్, సివి రాజమన్నార్‌ల తరువాత ఆ పురస్కారాన్ని అందుకున్న మూడో వ్యక్తి శ్రీశ్రీయే. ఆ తరువాత సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం కింద 8వేల రూపాయల నగదు బహుమానాన్ని అందుకున్నాడు. అందులో భాగంగానే సోవియట్ యూనియన్ సందర్శనకు ఆహ్వానం అందుకుని వెళ్లి వచ్చాడు. 1979లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద 10వేల రూపాయల నగదు పురస్కారం శ్రీశ్రీకి లభించింది. అదే సంవత్సరం ఆంధ్రజ్యోతి దినపత్రిక శ్రీశ్రీని ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక చేసింది. శ్రీశ్రీ మరో నలభై రోజులు జీవించి ఉండి ఉంటే జ్ఞానపీఠ పురస్కారం లభించేది అని అంటారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎన్టీరామారావు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శ్రీశ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1970 ఫిబ్రవరి 1న విశాఖ పట్నంలో శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగింది. ఆ సందర్భంలో మొదట నిర్ణయించిన స్థలం సరిపోలేదు. చివరకు మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించాల్సి వచ్చింది. అంటే ఆయనపైన వెల్లువెత్తిన అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 1980 మార్చి మూడో తేదీన కాకినాడలో సప్తతి మహోత్సవం జరిగింది. ఆయన రచనలన్నీ హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయీ సభలో. ప్రజల్లో ఇంతటి ప్రేమాభిమానాలు పొందిన తెలుగు కవి గత శతాబ్దంలో.. ఈ శతాబ్దంలో మరొకరు లేరు.

అరసం… విరసం

1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ సమావేశం జరిగింది. దీనికి అబ్బూరి రామకృష్ణారావు హాజరయ్యాడు. విశాఖపట్నంలో భారత కమ్యూనిస్టు పార్టీ శాఖను ఏర్పరిచేందుకు ఈయన చాలా శ్రమించాడు. ఆయన దరిమిలా మానవేంద్రనాథ్ రాయ్‌కి సన్నిహితానుచరుడై తీరాంధ్ర ప్రాంతంలో రాడికల్ కమ్యూనిస్టు సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేశారు. తొలితరం భావకవిగా అబ్బూరి ప్రసిద్ధుడు. అంతే కాదు, తెలుగు నాటకరంగ ప్రవర్తకుల్లో కూడా అగ్రగణ్యులుగా పేరు సాధించిన మనీషి. లండన్ అభ్యుదయ రచయితల మ్యానిఫెస్టోను రహస్యంగా సంపాదించి చదవమంటూ శ్రీశ్రీకి అందించాడు. శ్రీశ్రీ దాన్ని అద్భుతంగా సాహితీరూపంలో పెట్టాడు. అలా అభ్యుదయ రచయితల సంఘంతో శ్రీశ్రీ అనుబంధం ప్రారంభమైంది. ఆయన వామపక్షాభిమానం దేశం సరిహద్దులు దాటింది. చైనా, రష్యాల నుంచి ఆయనకు ఆహ్వానాలందాయి. 1954లో స్టాక్‌హోంలో జరిగిన ప్రపంచ శాంతి మహాసభలకు రావాలని కూడా పిలుపు వచ్చింది. 1954 నవంబర్ 13 నుంచి డిసెంబర్ 22 వరకు మొదటి విదేశీ యాత్ర చేశాడు. 1967లో సోవియట్ యూనియన్‌ను సందర్శించాడు. 1980-81లోఇంగ్లండ్ వెళ్లి వచ్చారు. 1981మే 23, 24 తేదీల్లో చికాగోలో జరిగిన మూడో ఉత్తర అమెరిగా తెలుగు మహాసభలకు హాజరయ్యాడు. అదే సంవత్సరం జూన్ నెలలో రెండోసారి అమెరికాకు భార్యాసమేతంగా వెళ్లివచ్చాడు. శ్రీశ్రీ. ఓ పక్క విదేశీ యాత్రలు సాగుతున్నాయి. మరో పక్క సినిమా రంగంలో లబ్ధప్రతిష్ఠులైపోయారు. వస్తున్న ధనం వస్తూనే ఉంది. వచ్చిన దాంట్లో సింహభాగం అరసం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. విజయవాడలో జరిగిన అరసం అయిదో మహాసభలకు అధ్యక్షత వహించాడు. తరువాత భారత కమ్యూనిస్టు పార్టీకి ఎన్నికల ప్రచారంలో అవసరమైన సహాయం చేశాడు. కొన్నాళ్ల తరువాత గూడూరులో జరిగిన ఒక ఎన్నికల సభలో మతిస్థిమితం కోల్పోతే.. అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్రలు తనను మదరాసుకు చేర్చి కొంతకాలం మానసిక వైద్యశాలలో చికిత్స చేయించారని శ్రీశ్రీ అనంతంలో చెప్పారు. ఆరుద్ర (భాగవతుల శంకరశాస్త్రి..) శ్రీశ్రీకి మేనల్లుడు. అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడుగా ఉన్న కుందుర్తి ఆంజనేయులు తెలంగాణ వచనకవితను వెలువరించాడు. ఆయన ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే సాహితీ సంస్థను స్థాపించాడు. అందులో చేరిన యువకవుల్లో కొందరు రాజకీయ సిద్ధాంతాల కారణంగా విభేదించి బయటకు వచ్చారు. 1965లో వాళ్లు దిగంబరకవులుగా అవతరించారు. వాళ్లను శ్రీశ్రీ ఆహ్వానించాడు. వారి కవితల్ని అంగీకరించి ప్రచురించేందుకు తోడ్పడ్డాడు. సంప్రదాయ వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా… పదం పాడినా.. అడుగు కదిపినా అందరినీ అక్కున చేర్చుకున్నాడు.

కొంతకాలానికి శ్రీశ్రీ ఒక్కసారిగా విప్లవ కవిగా మారిపోయాడు. 1970లో నక్సల్‌బరీ ఉద్యమాన్ని సమర్థిస్థూ ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘాన్ని మనఃస్ఫూర్తిగా శ్రీశ్రీ సమర్థించాడు. దానికి సంస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 1970 జూలై 4వ తేదీ ఓ హోటల్ గదిలో విద్వాన్ విశ్వం ఉన్నారు. అందులోనే అరసం కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి శ్రీశ్రీ అధ్యక్షత వహించాడు. అక్కడి నుంచి ఆరుద్రతో కలిసి వెళ్లి బద్రుకా కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. కానీ, తరువాత జరిగిన బహిరంగ సభకు ఉన్నట్టుండి హాజరు కాలేదు. కెవి. రమణారెడ్డితో కలిసి ఇంపీరియల్ హోటల్‌కు వెళ్లారు. ఆ హోటల్‌లోనే రాత్రి 1.30 గంటలకు విప్లవ రచయితల సంఘం శ్రీరంగం శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైంది. తీవ్ర వాదోపవాదాలు, ఆగ్రహావేశాల మధ్య విరసం అధ్యక్ష పదవిని స్వీకరించాడు. అంతటితో అరసంతో అన్ని బంధాలు, బంధనాలను తెంచుకున్నాడు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వానికి, సాధారణ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. విరసం బంధాలు.. బంధనాల మధ్య ఆయన కవిత్వం సంపూర్ణంగా విప్లవం వైపు మళ్లింది. ప్రజా చైతన్యాన్ని సృష్టించింది.

అయితే 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం విరసం సభ్యులతో ఆయనకు విభేదాలు తెచ్చిపెట్టింది. పురస్కారాన్ని తిరస్కరించాలని విరసం ఆయనకు నచ్చచెప్పింది. ఆయన ఢిల్లీకి వెళ్లి పురస్కారాన్ని స్వీకరించకుండా వెనక్కి వచ్చాడు. కానీ పదిహేను రోజుల తరువాత ఢిల్లీ నుంచి అకాడమీ చెక్కును పంపించింది. దాన్ని శ్రీశ్రీ స్వీకరించడాన్ని విరసం బహిరంగంగా నిరసించింది. అయితే అంతకు ముందు రెండు నెలల క్రితమే విరసం శ్రీశ్రీ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ విరసం అధ్యక్ష పదవికి శ్రీశ్రీ రాజీనామా చేశాడు. ఈ వ్యవహారంలో శ్రీశ్రీకి విరసం నేతలకు మధ్య తీవ్ర వాదోపవాదాలే జరిగాయి. విరసం అధ్యక్ష పదవికి శ్రీశ్రీ రాజీనామా తరువాత ఆ పదవి ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది. తనను నిరసించి తప్పించినా.. ఆయనపై ఉన్న గౌరవాభిమానాలను విరసం ఇప్పటికీ.. ఎప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉంటుంది.

హైదరాబాద్‌లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించింది. విరసంతో పాటు శ్రీశ్రీ కూడా ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో కలిసి విజయవాడ నుంచి ఓ సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాడు. ఈ ప్రకటన విషయంలో తరువాతి కాలంలో ఇద్దరి మధ్య పెద్ద దుమారమే రేగింది. శ్రీశ్రీ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కూడా విశ్వనాథ ఆరోపించారు. పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

***

సాహిత్యంలో శ్రీశ్రీ చోటు

శ్రీశ్రీ ఏనాడూ ప్రక్రియా భేధాన్ని ద్వేషించలేదు. రకరకాల ప్రక్రియలతో నిమిత్తం లేకుండా సాహిత్యాన్ని ప్రేమించాడు. కాంక్షించాడు. తనకు నచ్చిన ఇతర భాషల కవిత్వాన్ని అనువదించాడు. అది కుదరనప్పుడు మళ్లీ కొత్త కవిత్వాన్ని సృష్టించాడు. తొలి కవితా సంపుటి ప్రభవలో భావకవిత్వం బయటపడ్డా.. మదరాసు చేరుకున్న తరువాత అభ్యుదయ ఆధునిక భావాలున్న మహాకవిగా ఎదిగిపోయాడు. అతడి కన్నా వయస్సులో పెద్దవాళ్లు అయిన అడవి బాపిరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన పాటలు పాడి ప్రాచుర్యం కల్పించారంటేనే, శ్రీశ్రీ కవితా స్రవంతం ఎంత వేగంగా తెలుగు సాహిత్య సాగరాన్ని సంపూర్ణంగా ఆవరించిందో అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ అంతటి వాడు కవితా ఓ కవితాలోని శబ్ద సౌందర్యాన్ని భావనా శిల్పాన్ని, ఊహలను ప్రశంసించటం సామాన్యం కాదు.

అద్భుత భావనలు.. అపూర్వమైన భావుకత్వం, చిత్రవిచిత్రమైన భాషా ప్రయోగం, ఆకర్షణీయమైన ఉపమ, ఉత్ప్రేక్షాలంకారాలు, ప్రతీకలు.. వినూతన పదబంధాలు.. ఒకటా.. రెండా.. ఎన్నని చెప్పేది.. అత్యంత శక్తిమంతంగా అనితరసాధ్యమైన మార్గంలో కవిత్వాన్ని పాఠకుడి హృదయంలోకి నేరుగా పంపించగలిగిన వాడు. చిత్రమేమంటే.. శ్రీశ్రీ కవిత్వంలోని ఎక్కువ భాగం ప్రాచీన, సంప్రదాయిక పదజాలంతోనే ఉంటుంది. ఇవాళ్టి తరం ఏ పదజాలం వాడటానికి ఇష్టపడదో.. ఏ శబ్దాడంబరాన్ని అర్థం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందో.. అదే శబ్దజాలంతో అనంతమైన చైతన్యాన్ని సృష్టించగలిగిన వాడు శ్రీశ్రీ. ప్రాచీన పౌరాణిక పాత్రలను, ఇతిహాస అంశాలను వస్తువులుగా స్వీకరించి, వాటి ద్వారానే గతిశీలమైన, ప్రగతి మార్గంలోని ఆధునిక అర్థాలను, ఆ అంశాలకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్వచనాలను ఇవ్వగలిగాడు. ప్రాచీన ఛందస్సుల సర్ప పరిష్వంగాన్ని భగ్నం చేస్తానని, వ్యాకరణ శృంఖలాలను తెంచేస్తానని చెప్పినా.. తన ఆశయ సాధనలో అవసరమైనప్పుడు వాటిని విడిచిపెట్టలేదు. శ్రీశ్రీ తన ప్రతి పంక్తిలోనూ వృత్తిగంధి గద్యను రాశాడని మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ రచనల మీద రాసిన సిద్ధాంత వ్యాసంలో సాధికారికంగా నిరూపించాడు. మహాకవి రచనా వైశిష్ట్యాన్ని ప్రజల్లోకి కమ్యూనిస్టులు బలంగా తీసుకువెళ్లారు. సాధారణ కవులు శ్రీశ్రీని సంపూర్ణంగా అనుకరించటం ప్రారంభించారు. మహాప్రస్థానం కవితలు ఒక విధంగా తెలుగు సాహిత్య గతిని సమూలంగా మార్చివేశాయి. విశ్వనాథ అన్నట్లు శ్రీశ్రీ వచ్చి ప్రతివాడి చేతా కవిత్యం రాయిస్తున్నాడన్నది అతి గొప్ప కాంప్లిమెంట్. తన తరువాత మరో విధంగా రాయటానికి వీల్లేని విధంగా విప్లవ కవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని శాసించిన వాడు శ్రీశ్రీ. వందల వేల సంఖ్యలో కవులు వచ్చినా… ఆయన్ను అనుసరించాల్సిందే. ఆయన శైలిని, పదాలను, పదబంధాలను కాపీ కొట్టాల్సిందేన్నంతగా శ్రీశ్రీ త్రివిక్రముడిగా తెలుగు సాహిత్యాన్ని కమ్ముకున్నాడు. ఏ యువ రచయితకైనా ఆయన అందుబాటులో ఉండేవాడు. ముందువెనుకల గురించి ఆలోచించలేదు. కవి అనుకున్న వాడిని.. కవిగా ఎదుగుతాడనుకున్న వాడినెవరిని కూడా ఆయన నిరుత్సాహపరచలేదు. ప్రోత్సహించాడు. అతని మార్గదర్శకత్వానికి తిరుగులేకుండాపోయింది.

ఆయన ప్రసంగాలు ఈర్ష్యా అసూయలకు దూరమైనవి. భాషాధికారంతో, చమత్కారాలతో సంభాషణా చాతుర్యానికి శ్రీశ్రీ పెట్టింది పేరు. అందుకే ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థను నిరసించినా, సినిమా పరిశ్రమ శ్రీశ్రీని వదిలిపెట్టలేదు. ప్రేమగానే ఆదరించింది. సముచిత గౌరవాన్ని అందించింది. తన వ్యక్తిగత దౌర్బల్యాలు తనవరకే పరిమితం చేసుకున్నాడు తప్ప, శ్రీశ్రీ ఎవరినీ బాధించలేదు. తనను నిందించిన వారిని పట్టించుకోలేదు. తాను నిరీశ్వరవాదిని అని సష్టంగానే చెప్పుకున్నా.. కొన్ని చేయకతప్పలేదు. తన కుమారుడికి తిరుమల కొండపై శాస్త్రోక్తంగా ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాడు శ్రీశ్రీ. అదే విధంగా ఢిల్లీలో కన్నడ సాహిత్యపరిషత్తు వాళ్లు మురళీకృష్ణుడి చందన విగ్రహాన్ని బహూకరిస్తే.. దాన్ని కళ్లకద్దుకున్నాడు. ఈ చర్యను ఎవరు నిరసించినా.. శ్రీశ్రీ పరిగణలోకి తీసుకోలేదు. పౌరహక్కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఎమర్జెన్సీని ఎత్తివేయాలంటూ తయారు చేసిన విన్నపంపై శ్రీశ్రీ సంతకం చేయలేదు. 1977లో ఇందిరాగాంధీని, 1983లో ఎన్టీరామారావు రాజకీయ ప్రవేశాన్ని సమర్థించిన వాడు శ్రీశ్రీ.

ముగింపు

పూర్వం మతమే సైన్స్.. ఇవాళ సైన్సే మతం. శాస్త్ర యుగంలో దానికి వ్యతిరేకులైన వాళ్లంతా అంధులే. శ్రీశ్రీ కూడా ఈ శాస్త్రీయతనే ప్రజాశ్రేయోమార్గంగా ఎంచుకున్నాడు. పాత బంధనాలన్నీ తెచ్చుకుని కొత్త దారిని పరుచుకున్నాడు. తాను అందులో నడిచాడు. తన తరువాతి వారిని నడిపించాడు. ఆయన ఏది చెప్పినా పలికే పద్ధతిలో, భావించే విధానంలో నూతనత్వం కనిపిస్తుంది.

తిరుపతి వేంకట కవులు కవిత్వాన్ని ఉద్యమంగా నడిపారు.. ‘వ్యాకరణం ఒక త్రోవ.. మహాకవులొక త్రోవ’ అంటూ సాహిత్యాన్ని ఉక్కు సంకెళ్ల నుంచి తెంచి దానిని మధురాతి మధురగతిలోకి తీసుకువచ్చారు. ‘వీరి కవిత్వం ప్రాచీన కవిత్వానికి భరతవాక్యం.. నవ్య కవిత్వానికి నాంది’ అన్నారు తొలితరం జర్నలిస్టు ముట్నూరి కృష్ణారావు. ఈ జంట కవులు ఆద్యతనాంధ్రకవి ప్రపంచ నిర్మాతలని అన్నారు. అసలు తెలుగు కవిత్వం నిరంతరం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అసలు మన జాతిలోనే ఆవేశ పరవశత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. పద్యం అంటే తెలుగుజాతి పరవళ్లు తొక్కుతుంది. దేశంలో మరే భాషకూ లేని అద్భుత సాహితీ ప్రక్రియ పద్యం. దీన్ని చదివే తీరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది తిరుపతి వేంకటకవుల చేతిలో పడి కొత్త అందాల్ని దిద్దుకుంది.

దీని తరువాత వచ్చింది అతి నవ్యకవిత్వం. అభ్యుదయ కవిత్వం. ఇది సామ్యవాదానికి సంబంధించింది. దీనికి యుగకర్త శ్రీశ్రీ. సాహిత్యానికి, సామ్యవాదానికి పొత్తు కలిపిన వాడు శ్రీశ్రీ. మనిషి జీవితానికి కొత్త విలువలు కట్టిన ఒక ప్రవక్త. శ్రీశ్రీ యుగం అంటే సమాజ వాద యుగం. తెలుగునాట సోషలిస్టులు నవశక్తిని ప్రారంభించారంటే దానికి మూలం శ్రీశ్రీ. ఆ తరువాత అదే స్ఫూర్తితో కమ్యూనిస్టులు ‘‘ప్రజాశక్తి’’ని ప్రారంభించారు. శ్రీశ్రీ కవిత్వం సామాన్య జనరంజకంగా ఎందుకు మారింది?

ఒకటి తాను ప్రజల సాంఘిక పరిస్థితులను విపరీతమైన రసానుభూతితో వివరించాడు. రెండువది అక్షరాల కూర్పు నుంచి, భావాల అభివ్యక్తి వరకూ అత్యద్భుతమైన శిల్పాన్ని ప్రదర్శించాడు. రసాన్ని హృదయ భేదకంగా చెప్పగల వాడు నిస్సందేహంగా మహానుభావుడనే చెప్పాలి. అందుకే శ్రీశ్రీ మహా కవి అయ్యాడు. జనం గుండెల్లోకి నేరుగా దూసుకుపోవటానికి.. శాశ్వత స్థానం సంపాదించటానికి శ్రీశ్రీ రసరాజులైన కరుణ, వీర రసాలను ఎంచుకున్నాడు. కొంపల్లె జనార్ధనరావు స్ఫూర్తిగా రాసిన స్మృతి కవిత అపూర్వం. ఒకటా రెండా.. మహా ప్రస్థానం నిండా ఇవి కొల్లలు.. మిగతా రచనల్లోనూ ఈ రెండు రసాలకే అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం, సిప్రాలి… ఇలా ఏది చూసినా.. చదివినా ఈ రెండు రస ప్రాధాన్యం దాటి శ్రీశ్రీ వెళ్లలేదు. అంతులేని దుర్భరమైన, దారుణమైన దృశ్యాలను కవిత్వంలో అత్యంత ప్రభావవంతంగా అభివ్యక్తం చేసిన మరో అభ్యుదయ కవి తెలుగు సాహిత్యంలో దుర్భిణీ పెట్టి వెతికినా కనిపించడు. అనంత మైన చైతన్య జ్వాలలను పాఠకుడి గుండెల్లోకి ఇంజెక్ట్ చేసినట్లు తన కవిత్వంలో రగిలించిన వాడు శ్రీశ్రీ కాకుండా ఇంకో అభ్యుదయ కవికి సాధ్యమయ్యేది కాదు. ఈ చైతన్యం కేవలం సామ్యవాదిదే కాదు.. అందరిదీ కూడా.. ఈ సమాజంలో దారుణ పీడనానికి గురవుతున్న ప్రతి ఒక్క ప్రజదీ ఈ చైతన్యం. అందుకే ఆయన్ను కేవలం కమ్యూనిస్టు కవిగానో.. విప్లవ కవిగానో.. ఒక వర్గానికో.. ఒక సంఘానికో.. ఒక భావోద్వేగానికో పరిమితం చేసి చూడటం సరికాదు. ఆయన సర్వజనులకు కవి. ఆయన కవిత్వం సార్వజనీనం. ప్రజలందరికీ సంబంధించింది. వారి కష్టంలోంచి.. వారి దుఃఖం లోంచి.. వారిపై జరుగుతున్న అత్యాచారం లోంచి, దౌర్జన్యాల్లోంచి పుట్టుకొచ్చిన కవిత్వం అది. మహా ప్రస్థానం యోగ్యతా పత్రంలో చెప్పినట్టు దేశాలకు ఉత్సాహాలకి కదిలిపోయే యువక సైన్యాలకి కొత్త రక్తాన్ని కదను తొక్కించే మార్చింగ్ బాండ్ శ్రీశ్రీ.

***

పుట్టుకను గురించి శ్రీశ్రీ తల్లి గర్భంలోంచే ఊహించాడో.. తన మరణం తరువాత ఏం జరుగుతుందో కూడా ఆయన స్పష్టంగా ముందే చెప్పాడు.

‘‘నేను మరణించాను.. నాకు 1990లలో చచ్చిపోవాలని ఉంది. (శ్రీశ్రీ అస్తమించింది 1983లో) బహుశా విమాన ప్రమాదంలో లేదా జలగండం వల్ల? అదీ ఇదీ కాకపోతే నేలమీదనే కాలధర్మం.

నా శవం చుట్టూ చాలా మంది చేరి ఏడుస్తున్నారు. ‘‘ఎందుకేడుస్తారు? ఇప్పుడేమయిందని’’ అని నేనెంతో ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. ‘‘అనంతర కార్యక్రమం గురించి ఆలోచించమన్నారెవరో! దహన సంస్కారం ఎజెండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నా నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకి నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరామూ అంగీకరించను.. చుట్టూ మూగిన వాళ్లలో కొంత మందికి నేనొకసారి రాసిన మరణ శాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, నేను చచ్చిపోయాక జరగవలసిన మొట్టమొదటి పని నా శవాన్ని విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి అప్పగించటం అని రాశాను. ఆ తరువాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజీ విద్యార్థుల్లోని నిరీశ్వర వాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష. ఏడ్చి ఏడ్చి ఆగిపోయిన వాళ్లు ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఏడవమనండి. నాకేం అభ్యంతరం లేదు. పత్రికల వాళ్లకి కావలసినంత కాపీ. ఏమిటేమిటో రాసేస్తున్నారు. రాసుకోమనండి. నాకేం అభ్యంతరం లేదు.

విరసం వాళ్లు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్థించాను.

నా కొడుకే వచ్చి తన చేతుల్లో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్. అయినా అదే వీల్లేదంటాన్నేను. మతం తోనూ, మతం తాలూకు మూఢ విశ్వాసాలతోనూ ఆమరణాంతం పోరాడే నన్ను మళ్లీ ఆ ఊబిలోకి ఎవరు దించాలనుకున్నా నేనెంత మాత్రమూ అంగీకరించను. ’’

ఇది శ్రీశ్రీ తన మరణం తరువాత జరగబోయే వ్యవహారాన్ని మరణానికి ముందే ఊహించి రాసిన అనంతం. వాస్తవానికి అక్షరాలా జరిగింది అదే. 1983 జూన్ 15వ తేదీ సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో శ్రీశ్రీ భౌతిక జీవితం పరిసమాప్తమైంది. కేన్సర్ వ్యాధితో బాధపడి శ్రీశ్రీ కన్నుమూశారు. అయితే ఆయన వీలునామా ప్రకారం శ్రీశ్రీ భౌతిక దేహాన్ని కింగ్ జార్జి ఆసుపత్రికి అప్పగించలేదు. శ్రీశ్రీ కుటుంబ సభ్యులు అన్యథా భావించారు. ఆయన భౌతిక కాయాన్ని సంప్రదాయ ఆచారాల ప్రకారం శాస్త్రోక్తంగా దహనం చేశారు. సంపూర్ణంగా కర్మకాండ నిర్వహించారు. ఆయన అస్థికలను, చితాభస్మాన్ని వారణాసికి తీసుకువెళ్లి గంగానదీ జలాలలో నిమజ్జనం చేశారు. శ్రీశ్రీ అంతిమయాత్రలో తెలుగు సాహిత్యలోకం సమస్తం పాల్గొంది. చితి రాజుకుంటున్న సమయంలో విప్లవ చయితలు శ్రీశ్రీ రాసిన ఊగరా.. ఊగరా ఉరికొయ్యను పట్టుకొని అన్న పాటను ముక్తకంఠంతో పాడారు. నక్సల్‌బరీ ఉద్యమాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీ రాసిన పాట ఇది.

శ్రీశ్రీ కవిత్వం కోసం పుట్టాడు..

శ్రీశ్రీ కవిత్వం కోసం బతికాడు.

శ్రీశ్రీ తాను రాసిన కవిత మారుమోగుతుండగా కాలి బూడిదైపోయాడు.

శ్రీశ్రీ తన చరిత్రకాలంలోనే చిరకీర్తిని ఆర్జించాడు.

శ్రీశ్రీ తన తరువాతి కాలంలోనూ జీవిస్తున్నాడు.

కవిత్వం ఉన్నంత కాలం.. కవిత్వ అనుభూతి ఉన్నంతకాలం.. కవిత్వ ఆస్వాదన ఉన్నంత కాలం.. పీడిత తాడిత బాధా సర్ప ద్రష్టుల కష్టాలు ఉన్నంతకాలం.. శ్రీశ్రీ బతికే ఉంటాడు. ఆయన మహాప్రస్థానం మార్మ్రోగుతూనే ఉంటుంది. విప్లవ చైతన్య జ్వాల రగిలిస్తూనే ఉంటుంది. సార్వకాలికమైన, సార్వజనీనమైన విశ్వకవి శ్రీశ్రీ.

ఉపయుక్త గ్రంథాలు..

  1. మహాప్రస్థానం.. శ్రీశ్రీ
  2. ఖడ్గసృష్టి… శ్రీశ్రీ
  3. అనంతం.. శ్రీశ్రీ
  4. శ్రీశ్రీ సన్మాన సంచిక
  5. వెలుతురు కొలను-గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి.
  6. మహాకవి శ్రీశ్రీ.. బూదరాజు రాధాకృష్ణ
  7. మరో ప్రస్థానం -శ్రీశ్రీ
  8. నవ్యాంధ్ర సాహిత్యంలో శ్రీశ్రీ అవతరణ- రోణంకి అప్పలస్వామి.
  9. శ్రీశ్రీ-కె.వి రమణారెడ్డి
  10. మహాకవి.. రాచకొండ విశ్వనాథ శాస్త్రి

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here