నవలా నాయిక – వాణిశ్రీ

4
14

[dropcap]కొ[/dropcap]న్ని దశాబ్దాల క్రితం ఎవరైనా ఒక చిత్రాన్ని తీయాలంటే నిర్మాత, దర్శకుడు, కథా రచయిత కుర్చుని కథను చర్చించుకునేవారు. కథాచర్చలకు కొన్ని నెలల కాలం పట్టేది. అందరికీ సంతృప్తిగా అనిపించిన తర్వాత కథ ఫైనల్ చేసి, షూటింగ్ మొదలు పెట్టేవారు. కొంతకాలం తర్వాత బెంగాలీ నవలల అనువాదాలను ఆధారంగా చేసుకుని సినిమా తీసేవారు. దేవదాసు, బాటసారి, మాంగల్య బలం, తోడికోడళ్ళు వంటి సినిమాలకు ఆధారం బెంగాలీ రచయిత శరత్ రాసిన నవలలే! తెలుగు నవలలను సినిమాలుగా తీయటం అనేది అరవయ్యవ దశకంలో ప్రారంభమైంది..

60, 70, 80 దశకాలను రచయుత్రుల యుగం అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఎందరో రచయిత్రులు మధ్యతరగతి వారి జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తూ నవలలు రాసారు. అవి పత్రికలలో సీరియల్స్‌గా అచ్చయి విపరీతమైన ప్రజాదరణ పొందేవి. 1964లో మునిపల్లె రాజు రాసిన నవల ‘పూజారిణి’ని ‘పూజాఫలం’ చిత్రంగా రూపొందించారు. ఆ సినిమా కళాఖండంగా పేరుపొందింది గానీ, కాసులు కురిపించలేకపోయింది. కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్ చక్రవర్తి (1964)’ గా తీశారు. అది అఖండ విజయం సాధించటమే కాకుండా ఆ సంవత్సరం ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టిన నంది అవార్డులలో స్వర్ణనందిని సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. అక్కడినుంచీ తెలుగు నవలలను సినిమాలుగా తీయటం ఊపందుకుంది. పైన చెప్పిన రెండు చిత్రాలలోనూ నాయిక సావిత్రి. ఇంకా ప్రోలాప్రగడ సత్యనారాయణ మూర్తి రాసిన ‘కౌసల్య’ నవలను ‘తల్లిదండ్రులు (1970)’ గానూ, ‘దీపశిఖ’ను ‘రామరాజ్యం(1973)’ గానూ, మాదిరెడ్డి సులోచన రచించిన ‘సంసార నౌక’ నవలను ‘ఆడంబరాలు అనుబంధాలు (1974)’ గానూ రూపొందించారు. వీటిలో కూడా ప్రధాన పాత్ర సావిత్రే! కానీ అప్పటికి హీరోయిన్‌గా సావిత్రి కెరీర్ ముగింపుకొచ్చింది. పై మూడు చిత్రాల్లో ఆమె వేసింది సహాయ పాత్రలు. అందువల్ల సావిత్రిని నవలా నాయిక అనలేము.

రచయిత్రులు నవలలో వర్ణించినట్లు అందంగా, ఆత్మాభిమానంతో ఉండేటట్లు ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన పేరు నిస్సందేహంగా వాణిశ్రీకి వస్తుంది. ఆమె ఎన్నో నవలాచిత్రాల్లో నాయికగా నటించింది. ముఖ్యంగా యద్దనపూడి సులోచనారాణి తన నవలల్లో, నిత్యం పురుషాధిక్యతతో, అధికారాలతో విసిగిపోయిన మధ్య తరగతి స్త్రీ తనని తోటిమనిషిగా గౌరవించి, సమానాధికారం ఇస్తూ, స్నేహభావంతో చూసే వ్యక్తిని భర్తగా కోరుకున్నట్లుగా చిత్రీకరించింది. ఆ నవలలు మహిళలను విశేషంగా ఆకర్షించేవి. కలల్లో విహరింపజేసేవి. అవి సినిమాలుగా రూపొందించినపుడు రచయిత్రి వర్ణించినట్లే నాయికానాయకుల పాత్రలు ఉండేవి. ఆ చిత్రాలు మరింత ప్రేక్షకాదరణ పొందేవి.

యద్దనపూడి సులోచనారాణి రచించిన ‘జీవన తరంగాలు’ నవలను అదే పేరుతో సినిమాగా (1973) రూపొందించారు. అందులో నాయిక రోజా అచ్చ తెలుగు అమ్మాయి. నిరుపేద కుటుంబంలో పుట్టటం వలన చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా పెద్దవాళ్ళు చదివించలేదు. అంధురాలైన తల్లిని ఇద్దరు పిల్లలను వారి ఖర్మానికి వదిలి వెళ్ళిపోయిన తండ్రి, పెద్దవాళ్ళ అజమాయిషీ లేక దొంగతనాలకు అలవాటు పడ్డ తమ్ముడు, తమ ఇంట్లో నుంచీ పంపేయాలని అనుక్షణం సతాయించే మేనత్త. ఇలాంటి వాతావరణంలో రోజా ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటుంది. రోజా పాత్రను వాణిశ్రీ పోషించింది. నాయకుడు ఐశ్వర్యవంతుడు. నాయికను ద్వేషిస్తూనే అంతరంగంలో తనకు తెలియకుండానే ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమకు పేదరికం అడ్డురాదని ఈ పాత్రల ద్వారా చెప్పారు రచయిత్రి. నవలలో ఉండే అనేక మలుపులు తీసేసి, సింపుల్‌గా ముగించారు. అయినా సినిమా హిట్ అయింది.

సులోచనా రాణి రాసినదే మరో నవల ‘విజేత’ ను ‘విచిత్ర బంధం (1972)’ చిత్రంగా తీశారు. ఇందులో వాణిశ్రీ మొదటి సగభాగం ఐశ్వర్య వంతురాలు, మోడరన్ డ్రెస్‌లు వేస్తుంది. రెండో సగభాగానికి వచ్చేసరికి ఐశ్వర్యం అంతా పోయి కాయకష్టం చేసుకుని జీవిస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితులలో తన మీద అత్యాచారం చేసిన నాయకుడిని ద్వేషిస్తూ ఉంటుంది. ఆమె మనసు గెలుచుకుని దగ్గర కావాలని శతవిధాల ప్రయత్నిస్తాడు నాయకుడు. చివరికి ఇద్దరికీ పుట్టిన బిడ్డ వల్ల చేరువ అవుతారు. స్త్రీకి ఉన్న ఒకే ఒక్క బలహీనత.. పిల్లలు. మాతృత్వమే వారిని కలుపుతుంది. ‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి..’ అనే దీపావళి పాట అత్యంత ప్రజాదరణ పొందింది.

యద్దనపూడి రాసిన మరో నవల ‘సెక్రటరీ’. ఆడపిల్ల పరాయి మగవాడితో మాట్లాడితేనే నిందలు వేసే సమాజంలో మగబాస్ దగ్గర సెక్రటరీగా ఉద్యోగం చేయటం ఒక సాహసం. ఈ నవల వచ్చింది 1966లో, సినిమాగా తీసింది దాదాపు పదేళ్ళ తర్వాత 1976లో. ఆ నవలకు ఉన్న పాపులారిటీని బట్టి అప్పటికి టాప్ హీరోయిన్‌గా ఉన్న వాణిశ్రీని నాయికగా తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెది ద్విపాత్రాభినయం. ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించిన వారికే అర్థం అవుతుంది.

నాయకుడు రాజశేఖరం లక్షాధికారి. డాక్టర్ (గుమ్మడి) గారి అమ్మాయి గీత (వాణిశ్రీ)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ ‘నేటిదా, ఒకనాటిదా నీకూ నాకూ ఈ బంధం..’ అని పాడుకుంటారు. కానీ ప్రమాదవశాత్తూ ఆమె చనిపోతుంది. అవే పోలికలతో ఉన్న జయంతి (వాణిశ్రీ) ని చూసి వెంటపడుతూ ఉంటాడు. ఆమె ఆ అతిచనువు భరించలేక దూరంగా పారిపోతూ ఉంటుంది. చివరికెపుడో అర్థం చేసుకుంటుంది. వాణిశ్రీ బాగా నటించినా నవల లాగా సినిమా అంతగా విజయం సాధించలేదు. మరో నవల ‘ఆత్మీయులు (1969)’లో కూడా వాణిశ్రీ నాయికగా నటించింది. ఇది ప్రధానంగా అన్నాచెల్లెళ్ళ కథ కాబట్టి హీరోయిన్‌కు ప్రాధాన్యత తక్కువ. కానీ పాటలలో చాలా హుషారుగా పెళ్లి కాని అమ్మాయిగా నటించింది వాణిశ్రీ.

కె. రామలక్ష్మి రచించిన ‘ఆడది’ నవలని ‘జీవనజ్యోతి (1975)’ గా తీశారు. ఇందులో వాణిశ్రీ తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది. తల్లి పాత్రలో పల్లెటూరి స్త్రీ గానూ, కూతురుగా ఆధునికం గానూ నటించింది. కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అనే ఇతివృత్తంతో నిర్మించిన ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు, సద్దు చేశారంటే ఉలుకులికి పడతాడు’ అనే సి.నారాయణ రెడ్డి రాసిన పాట మాతృత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. వాణిశ్రీకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. వాణిశ్రీ నటించిన గొప్ప చిత్రాలలో ఇది తప్పనిసరిగా చెప్పవలసినది. కె. రామలక్ష్మి రచించిన మరో నవల ‘కరుణ కథ’ ని ‘అభిమానవతి (1975)’ గా తీశారు. ఇందులో కూడా వాణిశ్రీనే నాయిక. నా అనేవాళ్ళు లేకుండా అనాథాశ్రమంలో పెరిగినా, మొక్కవోని ధైర్యంతో, ఆత్మాభిమానంతో జీవన పోరాటం సాగించిన కరుణ కథ మహిళా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

కోడూరి కౌసల్యాదేవి రచించిన ‘ప్రేమనగర్’ నవలని అదే పేరుతో సినిమాగా తీశారు 1971లో. ఇందులో వాణిశ్రీ ఒకే రంగు చీర, అదే రంగు గాజులు, బొట్టు, పూలుతో టెండ్ సెట్టర్ అయింది. అమ్మాయిలు అందరూ వాణిశ్రీ వేషధారణను అనుకరించేవారు. ఈ సినిమాలో రకరకాల చీరలతో షోకేస్ లో బొమ్మలా అందంగా కనిపిస్తుంది వాణిశ్రీ. ఆ రోజుల్లో బట్టల షాపుల్లో షోకేస్‌లో బొమ్మని వాణిశ్రీ లాగ మోచేతుల వరకు ఉన్న జాకెట్‌తో, లాగి బిగించి కట్టిన చీరతో, ఎత్తైన కొప్పుతో, ఎడమ చేతిలో చిన్న హాండ్ బ్యాగ్‌తో అలంకరించి పెట్టేవారు. “నేను ప్రేమనగర్‌లో డెబ్భై చీరెలు కట్టాను. మేకప్‌కు మూడు గంటలు కేటాయించేదానిని. నా కలర్ ఏమిటో నాకు తెలుసు. శరీరం మీద నలుపు కొద్దిగా కూడా కనబడకుండా మెయింటైన్ చేసేదాన్ని” అని చెప్పింది వాణిశ్రీ ఒక సందర్భంలో.

కోడూరి కౌసల్యాదేవి ‘చక్రవాకం’ నవలని 1974లో చిత్రంగా రూపొందించారు. యస్.వి.రంగారావు, అంజలీదేవి, కృష్ణకుమారి, వాణిశ్రీ, చంద్రకళ, శోభన్ బాబు, రాజసులోచన వంటి హేమాహేమీలు నటించినా ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దానికి కారణం సినిమాలో ఎక్కువ భాగం విషాదంగా కొనసాగుతుంది. ‘వీణలోనా తీగెలోనా ఎక్కడున్నదీ రాగం..’ అనే వీణ పాట ప్రాచుర్యం పొందింది.

బాపు దర్శకత్వంలో వచ్చిన ‘గోరంతదీపం (1978)’ లో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. ఈ చిత్రానికి నేరెళ్ళ రామలక్ష్మి రాసిన నవల ఆధారం. పరిస్థితులు కాలనాగులై కాటువేయటానికి వచ్చినప్పుడు కన్నీరుకారుస్తూ లొంగిపోదు ఆధునిక స్త్రీ, ధైర్యం అనే వాడికర్ర తీసుకుని ఎదుర్కొంటుంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా మనసు రణరంగమవుతుంది. మగువ జీవన పోరాటానికి మహత్తర చిత్రణ ‘గోరంత దీపం’. ఇందులో ‘రాయినైనా కాక పోతిని రామపాదము సోకగా, బోయనైనా కాక పోతిని పుణ్యకావ్యము రాయగా..’ అనే ఆరుద్ర రచించిన శ్రీరామ భక్తిగీతం వైవిధ్యంగా ఉంటుంది. ఎంతో భక్తిభావంతో గానం చేసారు సంగీతసరస్వతి సుశీల. గోరంత దీపం చిత్రం కథ, నటీనటుల నటన బాగున్నా యావరేజ్ గానే ఆడింది.

పైన చెప్పిన చిత్రాల్లో చాలా వరకు ఏ.యన్.ఆర్., లేదా శోభన్ బాబు నాయకులుగా నటించారు. వాణిశ్రీని నవలానాయిక అన్నట్లుగానే, వారిని నవలానాయకులు అనేవారు. వాణిశ్రీ వివాహం చేసుకుని సినిమాలు విరమించిన తర్వాత నవలానాయికగా జయప్రద పేరు తెచ్చుకుంది. యద్దనపూడి రచించిన నవలలు రాధాకృష్ణ, గిరిజాకళ్యాణం, అగ్నిపూలు, మధుర స్వప్నం, పోల్కంపల్లి శాంతాదేవి రచించిన చండీప్రియ, కోడూరి కౌసల్యాదేవి రచించిన శంఖు తీర్ధం మొదలైన నవలా చిత్రాల్లో నాయిక జయప్రదే! నవలని సినిమాగా తీస్తే విజయం తథ్యం అనుకునేవారు. ఆ రోజుల్లో స్త్రీల రచనలకు ఎంత ఆదరణ ఉండేదంటే, కొంతమంది రచయితలు కూడా స్త్రీల పేర్లు పెట్టుకుని రచనలు చేసేవారు. 1985 తర్వాత సాహిత్యంలో అనేక మార్పులు చేసుకున్నాయి. క్షుద్ర సాహిత్యం చోటు చేసుకున్నది. కుటుంబ కథలు తగ్గిపోయి సస్పెన్స్ థ్రిల్లర్స్ రాసాగాయి. వాటిలో కొన్ని సినిమాలుగా తీసినా విజయం సాధించినవి తక్కువ. కొంతకాలానికి నవలలను సినిమాలుగా తీయటం అనే సాంప్రదాయానికి తెరపడింది.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here