నవమి – ఖండిక 2: ఉన్నమాట

0
9

[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది రెండవ ఖండిక ‘ఉన్నమాట’. [/box]
[dropcap]ఉ[/dropcap]న్నమాట – ‘నవమి’ ఖండకావ్యంలోని రెండవ ఖండిక.

***

ఉన్నమాట

పండితుండననుచు ప్రావీణ్యడనటంచు
గర్వపడుట నరుని ఘనతగాదు
ప్రజకు మేలునీని పాండిత్యమదియేల?
ఉన్నమాట చెప్పుచున్నమాట. 1

మనసునందునొకటి మాటయందొకటియు
కల్గియున్నవాని కపటయండ్రు
చిత్త శుద్ధి లేకనుత్తమ నరుడేన?
తలచనెందునే విధాత్రియందు. 2

గొప్పకొరకు బోయి కూడిన ధనమంత
ప్రజకు ఖర్చుజేయ పాడిగాదు
గొప్పలకును బోవ చిప్ప చేతికివచ్చు
అనుచు నెరుగుటలను నంచితంబు. 3

నీతి లేని నియతి నిలకడ లేని
మనుజు జన్మమెట్లు మహితమౌను
తావి లేని పువ్వు ధరణి వెల్గొందునా?
తెలుసుకోగదయ్య తెలుగువాడ. 4

పెద్ద లెపుడు పప్పుముద్దలేయంచును
పిల్లతెంచుచుంట పిదపదనము
పెద్ద లిలను పసిమి ముద్దలగుదురంచు
భావనంబు జేయ భావ్యమగును. 5

అన్నిమాకె తెలియునన్నిట మేమేను
అనుచు దలచువాడు అజ్ఞడగును
ఫలముకున్న తీపి పసిపిందకుండునా ?
తెలుసుకొనుట నీతి యిలను ప్రజకు. 6

నేనె చదివితంచు నేనె గొప్పయటంచు
విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు
తాడి నెక్కువాని తలదన్నువాడుండు
అంచు తెలుసుకొనుట అవని నీతి. 7

పేర్మిమీరజెప్పు పెద్దలమాటలు
చెవినివేయకుంట చెడ్డతనము
పెద్దవారి మాట చద్దియన్నపుమూట
మహినిబడగు నీతి మర్మమిదియ. 8

స్వార్థచింతనమ్ము వ్యర్థప్రసంగమ్ము
వంచనంపు బుద్ధి వైరగుణము
పుడమి గల్గునట్టి పురుషుండునధముడే
నంచుతెలియ నరునికవసరంబు. 9

వాంఛితార్థమునకు వంకరబుద్ధితో
సంచరించు వాడు వంచకుండు
మోసగానికెపుడు మోదంబుకల్గునా?
తెలుసుకొనగదయ్య తెలుగువాడ. 10

ధనము మీద తీపి మనము మండగరేపి
మంచిగుణముమాపి, మౌఢ్యుజేయు
లోభగుణమువాని లోలత్వమట్టుల
నిఖిలజగతిలోని నీతి యిదియ. 11

కూర్మియున్నయట్లు గొప్పగ నటియించి
కుట్ర జేయువాడు కుటిలుడగును
మేకతోలు తోడ మెకమున్నరీతిగ
మంచి మాటయిదియ మహితహృదయ. 12

తాను తప్పుజేసి తప్పించుకొనజూచి
దోషమోరులపైన ద్రోయువాడు
వాడు నరుడుకాడు పరమదుర్మార్గుండు
తెలిసిమెలగవయ్య తెలుగువాడ. 13

పెద్దవార్లనిలను పెద్దగ వేధించి
లబ్ధినందజూచు లుబ్ధజీవి
కుటిలనీతితోడ కూలిపోవుట తప్ప
వెంటనేమిగొనును వెడలునాడు. 14

ఉన్నపళముగానె యుర్వి కోటిగడింప
నూహ జేయువాడు నూర్జితుండ?
మతి యొకింతలేని మందమతియెకాని
ప్రజల సత్యమిదియ ప్రధితహృదయ. 15

మమత సమతతోడ మనుగడ సాగించు
మనుజుడ నగవాడె మహినిజెల్లు
మంచి తనముగల్గ మాధవుండేనురా
ఉన్నసత్యమిదియ కన్నలార. 16

ఎదుటివారి తప్పు నెత్తెత్తి చూపుచు
మనుజుడ రయలేడు తనదు తప్పు
ధరణిలోన నెఱ్ఱ గురివిందయట్లుగ
సత్యమరసి నీవు సాగుమయ్య. 17

సరసమేమి లేని సంభాషణంబేల
సార మింతలేని చదువదేల
రుచియి శుచియు లేని పచనంబునదియేల
ధ్యాస లేని యట్టి ధ్యానమేల ? 18

ప్రజకు మేలు జేయు ప్రబలమౌధ్యేయాన
మెలగుచుండువాడు అలఘజీవి
అట్టివాడె ధాత్రినారాధనలనందు
నీతి యిద్ది లోకరీతి యిద్ది. 19

దైవచింతనంబు ధర్మస్వభావంబు
సత్యశాంతగుణము సాధువృత్తి
నరునకున్ననతడు నారాణండగు
మహిత సూక్తియిద్ది మరువవలదు. 20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here