నవమి – ఖండిక 6: బడుగు బ్రతుకులు

0
5

[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది ఆరవ ఖండిక ‘బడుగు బ్రతుకులు’. [/box]
[dropcap]‘బ[/dropcap]డుగు బ్రతుకులు’ – ‘నవమి’ ఖండకావ్యంలోని ఆరవ ఖండిక.

***

భరతదేశమందు ప్రభవించి జీవించు
నట్టివారిలోన నధికజనులు
ఇనుపగజ్జెలమ్మకింపారుబిడ్డలై
బడుగుజనులు నౌచు బ్రతుకువారే. (1)

తినుటకు దిండిలేక గడుదీనులు నౌచును బిక్కుజచ్చియున్
మనుటకు కాస్త గూడయిన మాది యటంచును లేకయున్ సదా
కనలుచు క్షుత్తు వేదనల గాసిలిబొందుచు ధైర్యహీనులై
జనులిల జీవయాత్రలను సల్పగనేరక గుందుచుండ్రిగా. (2)

బ్రతుకుదెరవు గోరి బండలు గొట్టుచు
వచ్చు ధనముతోడ వసుధయందు
కడుపు నిండకున్కి కాలెడిడొక్కతో
సతమతంబునౌచు జనత యుండి. (3)

పసుల గాయుచుండి వరలుచునొక్కడు
పంటకాపరౌచు బరగునొకడు
నీటి కాపలగాయు నెలవుతో నొక్కడు
బీడుపొలముగాయు బేరనొకడు
అరకదున్నగ గూలికరగుచు నొక్కడు
విత్తనాల్ జల్లగా వెళ్ళుచొకడు
నెలజీతమును జేయ నెపముతోనొక్కడు
సాలు పాలేరౌచు జనుచునొక్కడు
తనను నమ్ముకున్న తనవారికిని నింత
తిండిబెట్టుకొఱకు మెండురీతి
పవలురాత్రినాక పలుపాట్లు పడుచును
బడుగుజనులునుండ్రి భారతమున. (4)

ఒక పరి నాటు వేయగను నొక్కకసారియు కల్పుతీయగా
ఒక పరి గోతగోయగను నొక్కకబోవరి గూడుగప్పగా
ఒక పరి కళ్లమేయగను నుర్విని చేదలు గూలికేగుచున్
తికమక లేని యట్టులను తిండిని నీయదె వారి సంతుకున్. (5)

దినవెచ్చమునకునై దినదినంబును గూలి
పనులకు వెళ్లకమనగలేక
కండరాల్ గరగించి కాయకష్టముజేసి
సాధించు ధనమది చాలకునికి
ఆలుబిడ్డలగూడ నార్జింపబంపినన్
అదియును జాలకనలమటించి
కన్నసంతుకునైన గడుపునిండుగ దిండి
పెట్టంగనేరక బిక్కుజచ్చి
ఆశలడుగంట మిగుల నిరాశజెంది
వేరు మార్గంబులేకను వెతలగుంది
బక్కచిక్కిన మేనుతో బడుగుప్రజలు
ఆర్తిజెందుచు నుండ్రి యన్నార్తులగుచు. (6)

పురుషులు స్త్రీలను బేదము
అరయగ లేనట్టి రీతి నవని జనంబుల్
నిరతము బనులకుబోదురు
కరము గదమ కడుపు నింపగాంక్షించి మదిన్. (7)

రెక్కలు ముక్కలు జేసుక
మిక్కుటముగ బనులుజేసి మేదిని యందున్
డొక్కలు నింపగగోరెడి
పెక్కులు దౌర్భాగ్యులిచట బెంపొందిరిగా. (8)

గనులనందు సతము కార్యాలయములలో
ప్యాక్టరీలయందు వనులనందు
జెమటనోడ్చి యోడ్చి జీవింపనెంచుచో
జగతి నచటగూడ శ్రమయె మిగులు. (9)

పట్టెడన్నంబు కొఱకునై పవలురేలు
ఎంత శ్రమియించినంగాని సుంతయేని
ఫలితమబ్బని యట్టి యీ బడుగులకును
సాయమందించినది ప్రజాస్వామ్యమగును. (10)

చదువుసంధ్య లేదు సంస్కారమును లేదు
కూడుగుడ్డ లేదు గూడు లేదు
ప్రగతి సుగ్గతి లేదు ప్రాభవమ్మును లేదు
వైద్యసేవ లేదు వారికిలను. (11)

వాడు లేక యున్నవసుధనెవ్వనికైన
పనులు పూర్తికావు ఘనత రాదు
అట్టివానికిపుడు నన్నంబు కరువాయె
ధర్మభూమి నింత దైన్యమేమి? (12)

రంతిదేవుడు నేలిన రాజ్యమందె
దానగుణమది లోపింపదావు గలదె
పేదప్రజలకు నెందేని వెదకిచూడ
ధర్మమడుగంటెనా యేమి ధాత్రియందు. (13)

తిగన తిండిలేక తికమక పడుచుండి
గూడులేక మిగుల కుములుచుండి
వైద్యసేవ లేక వంతలం గుందుచు
బిక్కుజచ్చి పేద స్రుక్కుచుండె. (14)

కళ్ల లోన కాంతి కనుమరుగయిపోవ
తోలు గూటి మేను దూలిపోవ
బ్రతుకు బండ్లనీడ్వ గతుకుల దారిలో
శక్తిహీనులయ్యు సాగుచుండ్రి. (15)

ఎన్నిమతంబులొచ్చినను నెందరు బూజ్యలును ద్భవించినన్
ఎన్ని ప్రబోధవాక్యములు నిజ్జగమందున వ్యాప్తి జెందినన్
ఎన్ని మరెన్ని చట్టములు నింపెసలారగ జన్మమందినన్
చెన్నుగ పేదవారికిని జేయరు సాయమిదేమి పాపమో. (16)

ప్రక్కవాడు మిగుల స్రుక్కుచునుండగ
పట్టనట్టులుంట దిట్టతనమ
జాలిమాలినట్టి జన్మంబు జన్మమా
తలచనెందునేని ధరణి యందు. (17)

ఏ మతంబునైననే ప్రవక్తయునైన
బడుగు జనుల సుంత బాగు జేయు
మంచు జెప్పెగాని వంచనంబునుజేయ
బోధలిడగ లేదు పుడమి ప్రజకు. (18)

నల్లధనముతోడ నవనవలాడుచు
తెల్లధనము తోడ బేజమంది
బడుగు ప్రజల బాగు పట్టించుకొనలేరు
భారతీయులకిది భావ్యమగున? (19)

వాని దారిద్య్రభూతముంబారద్రోలి
బ్రతుకు బండలుగానీక బడుగుజనుల
కన్నపానాదులందించి యాదుకొనుట
ఉత్తమోత్తమ ధర్మమౌ యుర్వియందు. (20)

ధర్మభూమిలో వదాన్యతయును లేక
కర్మభూమి యందు గరుణరాక
బడుగుజనులు మిగుల బాధలం గలగగ
భారతమునకదియు బ్రగతిపథమ. (21)

ఉన్నవాడు కరమునున్నతుడౌచుండ
లేనివాడు మిగుల లేమిగ్రుంగ
తారతమ్యమిలను తారాపథమునంట
చూచుచుండె ప్రభుత చోద్యముగను. (22)

దనుజగుణమురెచ్చె దౌష్ట్యంబు హెచ్చెను
మానవతయు జచ్చె మమత వ్రచ్చె
మనుజు మనమదిట్లు మహిని రూపొందంగా
బడుగువారికిలను బ్రతుకుగలదె? (23)

వారికాహారమిచ్చియు నీరునిచ్చి
గూడునిచ్చియు బ్రతుకెడు జాడనిచ్చి
ఆదుకొనకున్నచోనింక హ్లాదమున్నె
భరతదేశంపు గరిమయు దరగకున్నె. (24)

కలిగినట్టివారు గాంక్షతో వీరికి
సాయమీయ నెంచి సాగవలయు
ధర్మసంస్థలెన్నో ధరలోన వెలసియు
ఉపకరింపబూనుటూర్చితంబు.(25)

ప్రభుత గూడ వీరి ప్రారబ్ధమును ద్రోల
పాటుపడగనెంచి పథకములను
రాష్ట్రమందు నిల్పి రాబడింబెంచుచో
బడుగు బ్రతుకులెన్నో బాగుపడును. (26)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here