నవ్వేజనా సుఖినోభవంతు! – 2: ఆలాగుననా? ఆలాగుననే!

1
8

[box type=’note’ fontsize=’16’] ‘నవ్వేజనా సుఖినోభవంతు!‘ శీర్షికన భావరాజు పద్మిని గారు సంచిక పాఠకులకు అందిస్తున్న హాస్యరచనలివి. ‘ఆలాగుననా? ఆలాగుననే’ అనే ఈ రచనలో వివిధ మాధ్యమాలలో తెలుగు భాష అవస్థలు పడుతున్న వైనాన్ని చమత్కారంగా అందిస్తున్నారు. [/box]

[dropcap]టిం[/dropcap]గు మని ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది. ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్. మనిషి నున్నగా తోమి వెన్నెల్లో బోర్లించిన గుండు గిన్నెలా భలేగా ఉన్నాడు. ప్రొఫైల్ లోకి వెళ్లి ఫోటోలు చూద్దును కదా, సంప్రదాయం మొత్తం కరిగించి పోత పోసినట్టు, పంచె, కండువాతో ఫోటోలు. ఎక్కడెక్కడో తామర తంపరల్లా చేసిన/చేయించుకున్న సన్మానాలు, సత్కారాలు ఫోటోలు. ఇంకేమి, కవిగారనుకుంటా, నాలాగే ఎడతెగని తెలుగు భాషా ప్రేమికులు అనుకుంటా… ఏదీ, కొన్ని కవితలు చూద్దాం అని, కంటిపాప నగరమంతా వ్యాపించిన మెట్రో రైలు ట్రాక్ లాగా వైశాల్యం పెంచుకుని, పరికించసాగింది.

అట్టే వెతక్కండానే అశనిపాతంలా తగిలాయి, తెంగ్లిష్ పోస్టులు. అంటే ఇంగ్లీష్‌లో రాసిన తెలుగు చదవడం వలన వచ్చే తెగులును తట్టుకోలేక తోక తెగిన తొండలా, తొక్కుడు బిళ్ళ ఆడే తెల్ల కోతిలా, తైతక్కలాడే తీతువులా, తికమకపడ్డ తింగరిబుచ్చిలా, తడబడిపోతూ, బడతడి పడిపోతూ, తకిటతధిమి తందానా, తందానే దేవతందనానా అంటూ పాడుకుంటూ, తత్తరబిత్తరగా ఉండగా… అంటే, ఇందులో ఎన్ని ‘త’ లున్నాయో నాకు తెలీదు కానీ… మరేమీ అనుకోకండి. తెంగ్లిష్ చూస్తే, నేనిలాగే వాపోతాను.

అంచేత, ఆయన టైం లైన్ మొత్తం అంతే అన్నమాట! కానిండు. పోన్లే, తెంగ్లిష్ అయినా, ఇంట్లీష్ (తెలుగులో రాసే ఇంగ్లీష్) అయినా, తెలుగు తెలుగే కదా. ‘ఎంతైనా మన తెలుగు!’ అంటూ ఫ్రెండ్‌షిప్ అంగీకరించి, పక్కన పెట్టగానే … ఫోన్ మళ్ళీ టింగుమంది.

‘మీథో మాట్లడా వల్యున్ మి యొక దూరుస్య సర్వన దూర బాషణం యంతరము అంకెను ఇవ్వుము…’ అంటూ, పర్సనల్ మెసేజి.

‘ఎలాగెలాగ… దూరుస్య సర్వన దూర బాషణం యంతరమా? నాకు చిన్నప్పుడు టీవీలో చూసిన, దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం గుర్తుకు వచ్చింది. ఈ గాప్‌లో నాకు దూరదర్శన్ మ్యూజిక్, దానికి టిక్ టాక్‌లో గుండు మనిషి చేసిన గమ్మత్తైన అభినయం అన్నీ గుర్తుకు వచ్చాయి. మొత్తానికి నాకున్న గ్రహణ శక్తి ఈ గ్రహపాటుకు ఒక పక్క నిగ్రహం కోల్పోయి, ఆగ్రహం తెచ్చుకుంటున్నా, దాన్ని బుజ్జగించి, నా ఇంద్రియాలన్నీ కూడగట్టుకుని, ఆ తెంగ్లిష్‌లో ఆయన వెల్లడించిన గోస, నా మొబైల్ నెంబర్ కోసమని తేల్చి పారేసి, వెంటిలేటర్ లేకుండానే ఊపిరి పీల్చుకున్నా.

ఉడిగిపోతున్న జవసత్వాలను ఉగ్గ బెట్టుకుంటూ, ఉడుం పట్టు పట్టి, చివరాఖరికి నెంబరిచ్చాను.

ఫైర్ ఇంజెన్ వారి ప్రమాద ఘంటికలా వెంటనే మొబైల్ మ్రోగింది. అకాల మేఘం లాగా నా మేధస్సును ముంచేసిన ఆ కాల్ సారాంశం ఏమిటంటే, ఆయన భాషాభిమాని, అంతే కాదు, ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారిలా ఎవరైనా ఒక్క ఆంగ్ల పదము వాడినా ఊరుకోరు. ఆ సినిమాలో కోటా గారి పాత్ర ‘నిశివర్నోష్ణోదకము గ్రోలుడు… చతుష్ చక్ర శకట నివాస స్థానమునకు గొనిపోయి…’ లాంటి పదాలతో హడల గొట్టేసి, ‘ఆ నిశివర్నోష్ణోదకమునే ఆంగ్లమున కాఫీ అందురు. ఇదియును తెలియదు తమ శ్రాద్ధము,’ అంటూ మందలిస్తూ నవ్వులు పుట్టిస్తుంది. ఆ దైవం సృష్టించిన ఈ పాత్ర మొబైల్‌లకు, మౌస్‌లకు, ట్యాబులకు బారసాల చెయ్యకుండానే ఎవరికీ అర్ధం కాని నామకరణం చేసి, ‘మీర్రు ఆంగ్ల పదాము వాడినారు. నా చెవిలో ఏడంగులాల మేకు వేశినారు,’ అని హడలగొట్టేస్తుంది. ఇప్పుడూ, కాలాన్ని బట్టి కొన్ని పదాలు వాడాలి కాని, ఎలక్ట్రానిక్ షాప్‌కు వెళ్లి, నాకు శీఘ్రమే ‘ఏది కావలెనన్న అది వెతికి పలికెడిదియును, కసిరి కొట్టినను పెదవి కదపనిదియు, పాడమన్న పాడెడిదియు, పిలచిన పలికెడిదియు అగునొక గోళాకార యంత్రమును అనుగ్రహింపుడు,’ అని అడిగితే, సీదా ఎర్రగడ్డ మెట్రో రైలు ఎక్కిస్తారు.

ఇంతకూ నేను వర్ణించిన ఆ గోళాకార యంత్రము ఏమని యోచించుచుంటిరా? ఆ యొక్క గోళాకార సమాచార దూర భాషణ విద్యుత్ యంత్రమునే ఆంగ్లమున – అలెక్సా అందురు! ఇదియును తెలియదు, తమ నవ్వులు!

మరో ముచ్చట చెప్పనా! ఈ ఆటో కరెక్షన్ సాములోరికి తెలుగు టైపింగ్ రాదు. ఆ తెంగ్లిష్ చదవలేక, తెలుగు టైపింగ్ నేర్చుకోమంటే, నన్ను వెంటనే ఫేస్బుక్ లో బ్లాక్ చేసేసుకున్నారు. మరి అంతగా తెలుగు అభిమానం ఉన్నవారు, తెలుగు టైపింగ్ తెలుసుకోవచ్చు కదా! తెంగ్లిష్‌లో బాదడం ఎందుకు? ఏది ఏమైనా, ఆయన చెవుల్లో మేకులేసి, వాటిల్ని తిరిగి అయిస్కాంతాలతో తీసే పని నాకు తప్పిందని సంతోషించాను.

ఈ గుణపాఠంతో నైనా నేను తోక ముడుచుకు కూర్చోవాలా? హబ్బే, కమెడియన్‌లకు ఇలాంటి విషయాలలో పెద్దగా పట్టింపులు ఉండకూడదని అప్పుడెప్పుడో ఝరూక్ శాస్త్రి గారు చెప్పారు.

ఇంతకూ ఏమయ్యిందంటే, ‘రాతలు-కోతలు’ అనే అప్పుడే పుట్టిన నవజాత వాట్స్ ఆప్ గ్రూప్ లో ఓ చక్కనమ్మ కాగితం పడవల్లా కవితలు వదులుతోంది. ఆమెకు కొందరు భజన బృందం పళ్ళాలు కొడుతున్నారు. ఏవిటా అని చూద్దును కదా, మధ్యలో ఒక పంక్తి పంటి కింద రాయిలా తగిలింది.

‘నీ ఆశల పరి మలం నన్ను తాకుతోంది’

ఎలాగెలాగా ? ‘పరి మలం తాకుతోందా?’ హతవిధీ! పరిపరి విధముల తాకుతోందా? పరిగెత్తుకు పోయి డేకుతోందా?

ఎలాగో గుండె చిక్కబట్టుకుని, ‘అలాక్కాదమ్మా, పరిమళం అనాలి… ఇలా రాస్తే తప్పు అర్ధం వస్తుంది’ అని మర్యాదగానే చెప్పాను.

“ఓలమ్మో, చూసారా ఈ విపరీతం ! భాషలో మాండలికాలు ఉండవా? నువ్వేమన్నా తెలుగు అమ్మోరివా? నేనేమైనా నీ విద్యార్ధినా? హే పాతక్, హే ఘోరకలి, హే ఆక్రందన, హే దుఃఖిత చూసారా ఈ సాహిత్య దాడి? వెంటనే స్పందించండి. బీ ఇన్ యువర్ లిమిట్స్!” అంది ఘాటుగా.

వెంటనే సదరు కలం పేర్లున్న కవులంతా, ఆకలిగొన్న కాకికి కర్నూలు మిరపకాయ దొరికినట్టు నా మీద పడ్డారు. వారంతా ఫేస్బుక్ సహకార సంఘం (అంటే మరేం లేదండి లైకులు, కామెంట్ల వాయినాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకునేవారు) సభ్యులని నాకు చిటికెలో అర్ధమయ్యింది. వెంటనే నా బుర్రలో జ్ఞాననేత్రం వెలిగి, విడ్జెట్ స్పిన్నర్ లాగా తిరగసాగింది. ఆ గ్రూప్ లోంచి నేను జంప్ అని వేరే చెప్పకర్లేదనుకుంటా!

ఈ సోషల్ మీడియాతో అసలు ఎందుకొచ్చిన గోలని ఎంచక్కా టీవీ పెట్టాను… అందులో ఆంకరమ్మ ఇలా మాట్లాడసాగింది.

“ఈ రోజున నాగరంలో జరిగిన విందులో ఎంతో మంది ఫాల హారం చేసారు. ఈ వేడుకలో శానా మంది స్వేద తీరారు. ఇందులో పాల్గొనలేక పోయినందుకు హంతవ్యులము అని ముక్కు మంత్రి గారు చెప్పారు.

విగ్గు నాన ఖూని దండాయుధం గారికి ప్రబుత్వం ‘ఎక్సిలెన్స్ అవార్డు’ ను వేలు వరించింది. ఈ అవార్డును గేలి చినందుకు ఆయన తన ఘర్షాతి రేకాగ్ని చెప్పినారు. ఈ సందర్భంగా ఆయనకు తస్కారం చెయ్యాలని ‘కాస్కో నా వాస్కోడిగామా’ సంస్థ సంక పిల్చింది….”

ఆ తర్వాత ఆమె పెదాలేంటో కదులుతూనే ఉన్నాయి కానీ, నాకేం వినిపించలేదు.

అయినా ‘ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం’, అని ఎప్పుడో పెద్దలు చెప్పినట్లు వదిలెయ్యక, ఏ పుట్టలో ఏ పాముందో అని నగీనాలో శ్రీదేవి డాన్స్ చేసి భంగపడుట ఏల? ఎఫ్2 సినిమాలో వెంకీ చెప్పినట్లు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, లోలోపలే వెంకీ ఆసన్ వేసుకుని, ‘అంతేగా! అంతేగా!’ అని దిగమింగుకోవాలి. ఎవరేమన్నా, ‘ఆచార్యదేవా! ఏమంటిరి ఏమంటిరి?’ అంటూ ఎన్.టి.ఆర్ లా ఆక్టివ్ మోడ్ లోకి వెళ్ళకుండా, ‘ఆలాగుననా? ఆలాగుననే!’ అని తలాడించి ఊరుకునేవారి జన్మ ధన్యమని సంయమన పురాణంలో చెప్పారు! ప్రయత్నించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here