యువభారతి వారి ‘నవ్య సాహితీ లహరి’ – పరిచయం

1
11

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

నవ్య సాహితీ లహరి

[dropcap]తె[/dropcap]లుగులో మొట్ట మొదటి నవలా రచయిత ఎవరో మీకు తెలుసా? కర్నూలులో డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి గారు.

ఇందుకు ఆయనకు ప్రేరణ – 1872 లో బెంగాల్ ప్రభుత్వ గెజెట్‌లో, అప్పటి గవర్నర్ జనరల్ ‘మేయో’ చేసిన ఒక ప్రకటన. “బెంగాలీల ఆచార వ్యవహారాలను  ప్రతిబింబించే ఒక వచన గాథ రచించినవాళ్ళకు ప్రభుత్వం బహుమానం ఇస్తుంది” అనేది ఆ ప్రకటన సారాంశం.

అప్పట్లో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరూ ఆంగ్లేయులే. వాళ్లకు దేశీయ సంప్రదాయాలు, విశ్వాసాలు, జీవన విధానంతో తగినంత పరిచయం ఉండేది కాదు. ఇంగ్లండు నుండి మన దేశానికి వచ్చేటప్పుడు ఈ దేశం గురించి వాళ్ళ కేవేవో వింత వింత అభిప్రాయాలుండేవి. బహుశా ఆ కారణం చేతనేమో,  ఇంగ్లీషు అధికారులకు దేశీయ సమాజం గురించి అవగాహన లభించాలని గెజెట్‌లో అటువంటి ప్రకటన చేయించి ఉంటారు.

నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి  ఆ కాలానికి ప్రభుత్వంలో ఒక ఉన్నతోద్యోగి కాబట్టి, ఆయన ఆ ప్రకటనను చూడడం, తెలుగులో తానూ అటువంటి రచనను చేయాలని సంకల్పించడం జరిగిపోయాయి. ఆయన అప్పటికే రచయిత కాబట్టి, చిన్నయ సూరి గారి సహకారంతో ఇంగ్లీషు నుంచి ప్రామాణికమైన న్యాయశాస్త్ర చట్టాన్ని కూడా తెనిగించారు కాబట్టి, తెలుగులో ‘ రంగరాజు చరిత్రం’ అన్న పేరుతో ఆనాటి తెలుగువారి సామాజిక ఆచార వ్యవహారాలను తెలియజేసే ఒక నవలను రచించారు.

ఆంగ్ల భాషా వాంగ్మయాలతో దాదాపు నూట యాభై ఏళ్ళ నుండి ఆంధ్రులకేర్పడిన సంబంధానికి ఫలితంగా అనేక వినూత్న సాహితీ ప్రక్రియలు తెలుగులో ప్రభవిల్లి, వికసించాయి. మానవ జీవితానికి సన్నిహితంగా ఉండి, ప్రజల విభిన్న ధోరణులను, నిత్య జీవితంలో వారెదుర్కొనే సంఘటనలను, సమస్యలను, భిన్న మనస్తత్వాలను, భౌతిక, మానసిక స్వరూప స్వభావాలను, అనుభవాలను, అనుభూతులను, ఆలోచనలను, ఆవేదనలను, ఆశయాలను – సరళమైన శైలిలో అభివ్యక్తం చేయడానికి ఆధునిక సాహితీ ప్రక్రియలు ఎంతో అనుకూలంగా అవతరించాయి.

ఈ సృజనాత్మక ప్రక్రియలలో జీవం, చైతన్యం తొణికిసలాడాలంటే, రచయితకు లేదా కవికి ఎంతో ఆలోచనాశక్తి, సమాజంపట్ల ఒక నిర్దుష్టమైన అవగాహన, జీవితానుభవం, చారిత్రక పరిణామాలను అభ్యుదయ దృక్పథంతో అవగాహన చేసుకునే శక్తి ఉండాలి. పాఠకులలో ఆలోచనలను  రేకెత్తించి, వారి మానసిక పరిధులను విస్తృతం చేసే రచనలు చేయగలిగిన నాడు రచయిత లక్ష్యం, ధ్యేయం నెరవేరినట్లే. ఒక్క వాక్యంలో చెప్పాలంటే – ‘కవి భావజలజ రవి’ కావాలి.

ఈ నేపథ్యంలో ఆంగ్ల ప్రభావంతో ఆధునికాంధ్ర సాహిత్య నందనవనంలో విరిసిన నాలుగు ప్రక్రియల – నవల, వ్యాసం, నాటిక, కథానిక – గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో యువభారతి 23వ వార్షికోత్సవాల సందర్భంగా రూపొందించి సాహితీప్రియులకు అందించిన కార్యక్రమం – ‘నవ్య సాహితీ లహరి’.

తెలుగు నవల ఉద్భవ వికాస పరిణామాల గురించి డా. అక్కిరాజు రమాపతి రావు గారు, కథానిక గురించి శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు, తెలుగు వ్యాస విలాసం గురించి ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు, ఏకాంకిక నాటికల గురించి డా. ఇరివెంటి కృష్ణమూర్తి గారు చేసిన ప్రసంగాల పాఠమే ఈ ‘నవ్య సాహితీ లహరి’.

ఈ నాలుగు ప్రక్రియలను గూర్చి, ఆంశికంగానో, అతి విపులంగానో, పండితులకూ, పరిశోధకులకూ పనికి వచ్చే పద్ధతిలో చాలా సారస్వతం తెలుగులో ఇప్పటికే ఉన్నా, నవల, వ్యాసం, నాటిక, కథానికల గురించి సమగ్రమైన పరిజ్ఞానం కలగాలంటే – ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ చిన్న పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%20%E0%B0%B2%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here