‘నయా’ వంచన

6
5

[dropcap]అ[/dropcap]ది అమెరికాలోని బే-ఏరియాలో ఫ్రీమోంట్ అనే సిటీలో ఒక ఇండియన్ రెస్టారెంట్. మానస గత పది సంవత్సరాల నుండి బే-ఏరియాలో సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం మానసతో కలసి పనిచేసిన క్రిస్టీనా అర్జెంటుగా కలవాలి అంటే, ఆమె కోసం ఎదురు చూస్తుంది. అప్పుడప్పుడూ క్రిస్టీనా మానసకి ఫోన్ చేస్తుంది. ఈ మధ్య చాలా రోజుల నుండి అంటే దాదాపు ఒక సంత్సరం నుండి ఫోన్ చేయలేదు, సడెన్‌గా ఈరోజు కలవాలి అంది. ఒక పది నిమిషాల తర్వాత వచ్చింది క్రిస్టీనా.

ఎప్పుడూ చాలా హుషారుగా, చలాకీగా ఉండే క్రిస్టీనా నడకలో ఆ ఉత్సాహం లేదు, మొఖం అంతా పాలి పోయిఉంది, చాలా నీరసంగా ఉంది. పాపం తిండి కూడా సరిగ్గా తిననట్లుంది. అసలే తెల్ల తోలు అమ్మాయి, చాలా పొడుగ్గా అందంగా ఉంటుంది, అంతటి అమ్మాయి ఇంతలా డీలా పడడం, ఒక్కసారిగా అలా చూసే సరికి మానసకి పరిస్థితి అర్థం కాలేదు. వస్తూవస్తూనే మానస దగ్గరకు వచ్చి పట్టుకొని బోరుమని ఏడుపు అందుకుంది. అనుకోని ఈ ఘటనకు మానసకి మతి పోయినంత పనయింది. ఎవరీ అమ్మాయి? ఎక్కడి కరీంనగర్? ఎక్కడి అమెరికా? ఎక్కడిదీ బంధం? ఇంత ఆత్మీయంగా పట్టుకొని ఏడుస్తుంటే గుండె తరుక్కు పోయింది మానసకి.

ఆమె తల్లి తండ్రులెవరో ఎప్పుడూ చూడలేదు మానస, కానీ ఈ రోజు క్రిస్టీనాకి మానస, కన్న తల్లితండ్రులకన్నా ఎక్కువయ్యింది. తనను నమ్మి అంత దూరం నుండి రావడం, ఇలా బాధపడటం మానస ఒక రకమైన గర్వంగా ఫీలవుతూనే, ఆమెకి వచ్చిన బాధ ఏంటో తెలుసుకోవాలి ముందు అనుకుంది. చాలా ఓదార్చడానికి ప్రయత్నించింది, పాపం ఎన్ని రోజుల దుఃఖమో అది, తొందరగా ఆగలేదు. ఆ పరిస్థితి చూస్తుంటే మానసకి కూడా దుఃఖం ఆగలేదు. కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ. అది- ఆపితే ఆగే దుఃఖం కాదు, గుండెలో ఎన్నో రోజుల నుండి గూడు కట్టుకున్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చింది.

కొంత సేపటి తర్వాత మెల్లిగా కళ్ళు తుడుచుకొని చెప్పడానికి ప్రయత్నిస్తుంది క్రిస్టీనా. అవినాశ్‌కి ఏదయినా అయ్యిందా అని ఒక్కసారి ఉలిక్కిపడింది మానస, కానీ “అవినాశ్ ఇజ్ ఫైన్” అంది ఎక్కిళ్ళు పడుతుంటే. సో .. అవినాశ్‌కి ఏమి కాలేదు, దేవుకికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది మానస. రెండు సార్లు వీపులో తట్టి “కూల్ డౌన్ .. కూల్ డౌన్” అని నీళ్ళు తాగమని గ్లాస్ అందించింది మానస.

మెల్లగా నీళ్లు సిప్ చేస్తూ ఒక్కక్క విషయం చెపుతుంటే… నమ్మలేక పోయింది మానస. ఇంతటి దారుణం జరిగిందా? మానస, అవినాశ్ ఒకే ఆఫీసులో, ఒకే టీమ్‌లో పనిచేయడం, కొద్ది రోజులకి అక్కడే క్రిస్టినా పరిచయం, ఆ తర్వాత క్రిస్టినా, అవినాష్‌ల పెళ్ళి, అన్నీ తెరలు తెరలుగా గుర్తుకు వస్తున్నాయి మానసకి. మానస మనస్సు ఒక మూడు సంవత్సరాల వెనక్కి వెళ్ళింది.

***

శాక్రిమెంటో సిటీలో అది ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ. యాభై మంది వరకు ఉద్యోగులు ఇండియా, పాకిస్తాన్, చైనా, ఫిలిప్పీన్స్ ఇలా దాదాపు అన్ని ప్రముఖ దేశాల నుండి వలస వచ్చిన వారే. కొంత మంది అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. చిన్న కంపెనీ కాబట్టి అందరూ ఒక చిన్న ఫ్యామిలీగా ఉంటారు. కంపెనీ తరుపున దాదాపు ప్రతి నెలా ఎవరిదో పుట్టినరోజు అనో, ప్రమోషన్ అనో ఏదో ఒక సందర్బంగా తరుచుగా విందు పార్టీలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ పార్టీల్లో ఉద్యోగస్తులే కాక, వారి కుటుంబ భాగస్వాములు కూడా పాల్గొంటారు.

ఆ విధంగా తరచుగా కలవడం వలన ఒకరికొకరి పరిచయాలు బాగానే అయినాయి. కేవలం కంపెనీ విషయాలు కాక తమ పర్సనల్, ఫ్యామిలీ విషయాలు కూడా ఒకరితో ఒకరు పంచుకుంటారు. రెండు రోజుల క్రితమే ఇండియా టూర్ నుండి వచ్చిన మానస, ఆఫిసు పనిలో భాగంగా తన డెస్క్ దగ్గరికి వచ్చిన కొలీగ్స్ అవినాశ్‌కి, చైనాకి చెందిన జెస్సికాకి, ఇండియాలో జరిగిన వాళ్ళ అబ్బాయి ధోతీ మరియు అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఫోటోలు చూపుతుంది. జెస్సికా, అవినాశ్, మానస ముగ్గురూ ఒకే టీం లో పని కాబట్టి ఆఫీసులో తరుచుగా కలుసుకుంటారు. జెస్సికాకి ఇంకా పెళ్ళి కాలేదు కానీ చాలా సంవత్సరాల నుండి జేమ్స్‌ని డేట్ చేస్తుంది. జెస్సికాకి పెళ్ళి చేసుకోవాలని ఉన్నా, జేమ్స్ ఎప్పుడు ప్రపొజ్ చేస్తాడా అని ఎదురు చూస్తుంది. హ్యాపీ హవర్స్‌కి జెస్సికా, జేమ్స్‌ని కూడా పిలిచేది. అందరితో బాగానే కలిసి పోయాడు జేమ్స్. జెస్సికా, జేమ్స్ ని “జె, జె” అని పొట్టి పేరుతో పిలుస్తుంటారు కంపెనీలో అందరూ.

అవినాశ్ ఢిల్లీ కాన్వెంట్ స్కూల్‌లో చదివాడు కాబట్టి మంచి ఇంగ్లీష్ మాట్లాడటం అతనికి ప్లస్ పాయింట్. అతని తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త, కొడుకుని ఎలాగయినా అమెరికా పంపించాలని మాత్రమే ఆలోచించేవాడు. కుటుంబ విలువలకన్నా వ్యాపారానికే ఎక్కువ విలువ ఇస్తాడు. అమెరికాలో అతనితో ఒక కంపెనీ పెట్టించి, తన కొడుకు ఒక “బిజనెస్‌మ్యాన్” అని పించుకోవాలని ఉబలాటం. మొత్తానికి ఇంజినీరింగ్ చేయించి తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు పత్రాలు సృష్టించి ఉద్యోగ వీసా మీద అమెరికా పంపాడు. మంచి ఎత్తు, ఆరోగ్య సౌష్టవం, ఎక్సర్‌సైజ్ బాడీ, ఎప్పుడూ బ్రాండెడ్ వేర్‌లో చాలా హుందాగా కనిపిస్తాడు, షోకులకి ఏ మాత్రం తక్కువ కానివ్వడు అవినాశ్. ఇంకా పెళ్ళి కాలేదు, ఈ మధ్యనే 26 ఏళ్ల పుట్టిన రోజు జరుపుకున్నాడు కంపెనీ ఉద్యోగులతో!

ఇండియాలో మానస పార్టీ పేరున్న స్టార్ హోటల్లో జరిగింది. ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఖరీదయిన డిజైనర్ డ్రెస్సెస్. జిగేల్ మనే డ్రెస్సుల్లో అందరూ మెరిసిపోతున్నారు ఫొటోల్లో. “వావ్ .. బ్యూటీఫుల్ పిక్స్, నైస్ ఫ్యామిలీ, నైస్ డెకరేషన్” ఉత్సాహంగా, కొంత ఆశ్చర్యంగా అన్నది జెస్సికా. వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ, అమ్మగారి ఫ్యామిలీ, చిన్నాన్న, మేనమామలు ఇలా అందరితో గ్రూపులు గ్రూపులు గా ఫోటోలు చూపిస్తుంది.

“వాట్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ.. యు అర్ సో లక్కీ మానస ఫర్ హావింగ్ సచ్ ఎ నైస్ ఫామిలీ” పొగడ్తగా అన్నాడు అవినాశ్. ఎదుటి వాళ్ళని తన మాటలతో కట్టి పడేసే స్వభావం అవినాశ్‌ది.

“థ్యాంకూ అవినాశ్” అవినాశ్ అన్న మాటలతో కొంచెం పొంగిపోయింది మానస. పక్క రూమ్ నుండి వీళ్ళ సంభాషణలు వింటున్న క్రిస్టినా, ఫోటోలు చూడాలనే ఉత్సాహాన్ని ఆపుకోలేక తానూ జాయిన్ అయ్యింది.

క్రిస్టినా.. కొన్ని నెలల క్రితమే జాయిన్ అయ్యింది, ఇంకా పరిచయాలు ఎక్కువ కాలేదు. మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్‌ని, అత్తయ్యని మావయ్యని, మావయ్యవాళ్ళ అమ్మ గారిని ఇలా పేరు పేరున చూయించింది మానస క్రిస్టీనాకి. అంత మంది ఫామిలీ మెంబెర్స్, జాయింట్ ఫామిలీ కావడం వల్ల, మరుదులు, తోటి కోడళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కలసి ఒకే ఇంట్లో కలసి ఉండడం చాలా ఆశ్చర్యం కలిగింది క్రిస్టీనాకి.

“ఇంత మంది ఒకే ఇంట్లో ఉంటారా?” అని ఒకటికి రెండు సార్లు మరీ అడిగి తెలుసుకొని చాలా ఆశ్చర్యానికి గురయ్యింది.

ముఖ్యంగా లేడీస్ డ్రెస్సెస్, చీరలు, నగలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత సమోసా, బట్టర్ చికెన్, నాన్ లాంటి వంటలు కూడా ఆకర్షించాయి, అన్నిటిపేర్లు మరీ అడిగి తెలుసుకుంది. క్రిస్టీనా అడగక పోయినా వాటి పేర్లు, వాటిని ఎలా తినాలో కూడా చెపుతున్నాడు అవినాశ్. అందరితో కలుపుగోలుగా ఉండటం, అడగక పోయినా ఉచిత సలహాలు ఇవ్వడం అవినాశ్ ప్రత్యేకత, ఇక్కడ మరీ పెళ్ళి కాని అమ్మాయి, ఇంప్రెస్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మానస ఫొటోస్ చూపడం ఆపేసి, ఆఫీస్ సిస్టమ్ లోకి లాగిన్ అయి, జెస్సికాకి, అవినాశ్ కి ఆఫీసుకి సంబంధించిన ఫైళ్ళు చూపడానికి సిద్ధం అయ్యింది. క్రిస్టీనాకు మాత్రం ఇదంతా చాలా కొత్తగా ఉంది. అంత పెద్ద ఫ్యామిలీ, అందరూ కలసి ఉండడం కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్న అనుభూతితో తన కుబికల్లోకి వెళ్ళిపోయింది. సాధారణంగా అమెరికాలో ప్రతీ మెట్రో సిటీ లో ఎక్కడో ఒక దగ్గర ఇండియన్ రెస్టారెంట్ ఉండడం సాధారణం. ఇండియన్స్ కన్నా, అమెరికన్స్ ఇప్పుడు ఇండియన్ వంటకాలని ఇష్టపడుతున్నారు. అయితే క్రిస్టీనా అంతగా ఆశ్చర్యపడానికి, క్రిస్టీనాకి ఇండియన్ వంటలు తెలియక పోవడం వెనుక పెద్ద కారణమే ఉంది.

క్రిస్టీనా వయస్సు ప్రస్తుతం 24 ఏళ్లు. ఇండియానాపోలీస్‌కి దాదాపు వంద మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం. అండర్ గ్రాడ్ వరకు అక్కడే ఉంది కాబట్టి పెద్దగా ఇతర దేశాల వ్యక్తులతో, సంస్కృతితో పరిచయం లేదు. వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు కొన్ని రోజుల క్రింద. గ్రాండ్ పేరెంట్స్‌తో కూడా ఎక్కువ చనువు లేదు. బాయ్ ఫ్రెండ్‌తో బే ఏరియాకి వచ్చి ఎంట్రీ లెవెల్ ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ఈ మధ్యనే బాయ్ ఫ్రెండ్ కూడా బ్రేక్ అప్ చెప్పి ఇంకో అమ్మాయితో డేటింగ్‌లో ఉండడం, క్రిస్టీనా దాదాపు ఒంటరి అయ్యింది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, ఇప్పుడిప్పుడే అందరితో పరిచయాలు జరుగుతున్నాయి. ఇతర దేశాల సహోద్యోగులతో పరిచయం, వారి సంస్కృతిని తెలుసుకుంటుంది.

కొన్ని రోజుల్లోనే క్రిస్టీనా కూడా మానస, అవినాశ్, జెస్సికా గ్రూప్‌లో జాయిన్ అయ్యింది, ఈ మధ్య తరుచుగా లంచ్‌లకి, హ్యాపీ హవర్స్‌లకి బాగానే కలుస్తున్నారు. స్వతహాగా అవినాశ్ మంచి మాటకారి కావడం వల్ల అతను ఏది చెప్పినా చాలా ఆకర్షణీయంగా ఉండేది. తన ఫ్యామిలీ గురించి, ఇండియాలో బిజినెస్‌ల గురించి చెప్పడమే కాక తన ఫ్యామిలీ ఫోటోలు చూపేవాడు. ముఖ్యంగా అవినాశ్, జేమ్స్ చాలా విషయాలు చర్చించే వారు. క్రిస్టీనా తన ఒంటరితనాన్ని, బాధని జెస్సికాతో, మానసతో పంచుకునేది. మానసకి ఇద్దరు పిల్లలు, కాబట్టి ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయం కేటాయించేది, హ్యాపీ హవర్స్‌కి వచ్చినా వెంటనే వెళ్లిపోయేది. మానస తన ఫ్యామిలీ పట్ల బాధ్యతని, పిల్లల చదువుల కోసం వారి బాగోగుల కోసం పడే తపన క్రిస్టీనాని బాగా ఆకర్షించింది.

అవినాశ్ కూడా ప్రతిరోజు వాళ్ల తల్లి తండ్రులకుఫోన్ చేసి మాట్లాడడం, ఒక రోజు ఫోన్ చేయక పొతే వాళ్ళ తండ్రి నుండి ఫోన్ కాల్ రావడం కూడా క్రిస్టీనాని బాగా ఆకర్షించాయి. కారు కొనాలనుకున్న అవినాశ్‌కి, ఇండియా రూపాయల్లో దాని విలువ కట్టి తండ్రి చెప్పిన కారు మాత్రమే కొన్నప్పుడు ఆశ్చర్యపడటం క్రిస్టీనా వంతు అయ్యింది, ఒకింత తండ్రి మాటలకి విలువ ఇవ్వడం చూసి సంతోషించింది. తాను ఫోన్ చేసినా ఎప్పుడో కానీ తిరిగి ఫోన్ చేయని తండ్రి, ఈ మధ్యనే కొత్త భర్త ద్వారా ఇంకో పిల్లని కన్న తల్లి, ఎవరి లోకంలో వారు బిజీ, ఇవి క్రిస్టీనాని బాగా బాధించే విషయాలు. మానస, అవినాశ్‌ల పరిచయం వల్ల క్రిస్టీనాకి భారతీయుల పట్ల ఒక సదభిప్రాయం ఏర్పడింది.

పార్టీల్లో అందరూ వెళ్లిపోయిన తర్వాత అవినాశ్, క్రిస్టీనా మాత్రమే ఎక్కువ సేపు కూర్చుని మాట్లాడడం, అవినాశ్ మాటకారి తనం, అందగాడు కావడం ఏదో తెలియని ఆకర్షణ, ముఖ్యంగా తన ఒంటరితనం క్రిస్టీనాకి అవినాశ్ పట్ల ఆకర్షించబడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అవినాశ్‌కి కూడా గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల ఇద్దరూ కలిసి షాపింగులకి , రెస్టారెంటులకి తిరుగుతూ బాగా దగ్గరయ్యారు తొందరగానే. ఇండియన్ వంటలు, కొన్ని చరిత్రకి సంబంధించిన పుస్తకాలు ఇచ్చేవాడు అవినాశ్. తొందరలోనే క్రిస్టీనా, అవినాశ్ డేటింగ్ విషయం ఆఫీసులో అందరికీ తెలిసి పోయింది.

ప్రతి రోజు ఉదయం అవినాశ్ ఆఫీస్‌కి రాగానే మానస, జెస్సికా, క్రిస్టీనాలకి గుడ్ మార్నింగ్ చెప్పి తన కంప్యూటర్ స్టార్ట్ చేస్తూ ఏదో ఒక విషయం ట్రాఫిక్ గురించో, బ్రేక్‌ఫాస్ట్ గురించో చెపుతాడు. చిన్న విషయాన్ని కూడా చాలా ప్రత్యేకంగా చెప్పడం అవినాశ్‌కి వెన్నతో పెట్టిన విద్య, ఆ రోజూ ఏమి చెప్తాడా అని ఎదురు చూస్తుంటారు మిగతా ముగ్గురూ. ఈ మధ్య క్రిస్టీనా మాత్రం ఇంకా ఎక్కువ ఎదురు చూస్తుంది అవినాశ్ కోసం. సాధారణంగా ఒకసారి గుడ్మార్నింగ్ చెప్పి ఎవరి పని వారు చేస్తూ, కంప్యూటర్‌పై దృష్టిని కేంద్రీకరిస్తూనే మాట్లాడడం కానీ, వినడం కానీ జరుగుతుంది.

కొన్ని రోజుల తర్వాత:

ఎప్పుడూ సరదాగా ఉండే అవినాశ్ ఆ రోజు ఆఫీసుకు వచ్చి మూఢీ గా ఉండడం, ఏమీ మాట్లాడక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదో చాలా పెద్ద విషయమే ఉంటుందని గ్రహించి జెస్సికా, క్రిస్టీనా, మానస ముగ్గురూ అవినాశ్ దగ్గరికి వెళ్లి విషయం అడిగారు.

“గ్రీన్ కార్డు తిరస్కరించారు, నేను ఇంతకు ముందు పని చేసిన కంపెనీ మూసి వేసారట. వీసాకి ఇంకా ఒక్క సంవత్సరమే ఉంది, ఇప్పుడు మళ్ళీ ధరఖాస్తు చేసినా ఇంకో పది సంవత్సరాల వరకు గ్రీన్ కార్డు వచ్చే సూచన లేదు” అని చెపుతూ తెగ బాధపడుతున్నాడు.

ఎప్పుడూ సరదాగా ఉండే మనిషి ఇంత క్రుంగి పోవడం ముగ్గురినీ బాగా కలిచి వేసింది. ఏదో మార్గం ఉండక పోదు అని అందరూ భరోసా ఇచ్చారు. తెలిసిన ఫ్రెండ్స్‌తో, ఇమ్మిగ్రేషన్ లాయర్లతో మాట్లాడి చూసారు ఎవరికీ వారు. ఫలితం మాత్రం ఒక్కటే, మళ్ళీ ధరఖాస్తు చేయడం మినహా ఇంకో మార్గం లేదన్నారు.

ఈ విషయం విన్న నైజీరియా నుండి వలస వచ్చిన సహోద్యోగి స్టీవ్ “అమెరికన్ పౌరసత్వం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఏడాది తిరగకుండానే గ్రీన్ కార్డు వస్తుంది, ఆలోచించుకో.. క్రిస్టీనా ఉంది కదా!” కొంటెగా అన్నాడు అవినాశ్. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదన్నాడు.

అమెరికన్ సిటిజెన్‌తో పెళ్ళి చేసుకుంటే గ్రీన్ కార్డు వస్తుందని జగమెరిగిన సత్యం, కానీ తనకు ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలు క్రిస్టీనాని పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ అమ్మాయి కూడా ఇన్ని రోజులు తనతో డేటింగ్‌లో ఉంటుందని కూడా అనుకోలేదు అవినాశ్. ఏదో కొన్నిరోజులు తిరిగి మానెయ్యొచ్చు అనుకున్నాడు, కానీ క్రిస్టీనా చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా ప్రేమిస్తుంది అవినాశ్‌ని. కనీసం ఇంట్లో చెప్పకుండా స్వంతంగా కారు కొనే స్వతంత్రం కూడా లేదు, అదీ వాళ్ళ డాడీ చెప్పిన కారే కొనాలి. మామయ్య ఒకే ఒక కూతురు, మగ పిల్లలెవరూ లేరు కాబట్టి , కోట్ల ఆస్తి, వ్యాపారాలు, మామయ్య కూతురితో పెళ్ళి తర్వాత అన్ని తమకే స్వంతం అని తన తండ్రి ఎప్పుడో నిర్ణయించాడు. పెళ్ళి విషయం తల్లి తండ్రులకు తెలిస్తే మాత్రం ఒప్పుకునే అవకాశమే లేదు, అలాగని వారికి తెలియకుండా పెళ్ళి చేసుకునే ధైర్యం అసలే లేదు. ఇంట్లో కూడా తెలియదు అమెరికన్ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడని. అనుకోకుండా ఏర్పడ్డ పరిచయం పెళ్ళి వరకూ వెళ్ళింది. ఇప్పుడు అవినాశ్ పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుకలాగ అయ్యింది.

ఇంత తొందరగా పెళ్ళి , గ్రీన్ కార్డు గురించి మాట్లాడాలి అంటే ఏదో మొహమాటం అడ్డు వచ్చింది అవినాశ్‌కి. ముందే అమెరికన్ అమ్మాయి, ఆమె మనసులో ఏముందో, ఎలా రియాక్ట్ అవుతదో కూడా తెలియదు.

క్రిస్టీనా మనస్తత్వం గురించి ఆలోచిస్తున్నాడు అవినాశ్. క్రిస్టీనా తన తల్లి తండ్రుల విడాకుల గురించి అవినాశ్‌తో చెప్పి చాలా బాధపడేది. ఇక్కడి అమ్మాయిలకి, అబ్బాయిలకి తల్లి తండ్రులు విడిపోవడం కొత్తేమీకాదు. కానీ క్రిస్టీనా ఒక సున్నిత మనస్సు కలది, ప్రతీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఆమెని గ్రీన్ కార్డు గురించి, పెళ్ళి గురించి ఎలా అడగాలా అని సందిగ్ధంలో పడ్డాడు అవినాశ్. అవసరానికి వాడుకుంటున్నాను అని అనుకుంటుందేమో అని కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎంతైనా ఇండియన్ మెంటాలిటీ కదా, మీడియేటర్ కోసం ఆలోచించి, ఇంకేమీ ఆలస్యం చేయకుండా విషయం మానసకి తెలిపాడు.

విషయం విన్న మానసకి పరిస్థితి అంతా అర్థం అయ్యింది.

నిజం చెప్పాలి అంటే, క్రిస్టీనానే చాలా సార్లు మానసకి అవినాశ్ పట్ల ప్రేమ గురించి పరోక్షంగా చెప్పింది, కాబట్టి మానసకి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, కానీ ఇబ్బంది అంతా గ్రీన్ కార్డు గురించే! ఇంకా అవినాశ్ తల్లి తండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో అని!

అవినాశ్ వీసా ఇబ్బందులు పెళ్ళి, గ్రీన్ కార్డుకి సహాయం చేయడం గురించి అన్నీ చెప్పింది క్రిస్టీనాకి. క్రిస్టీనాకి అవినాశ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకేమీ మాట్లాడకుండా, ముందు అవినాశ్ తల్లి తండ్రులతో మాట్లాడమంది, వాళ్లకి ఇష్టం అయితే నాకేమీ ఇబ్బంది లేదు అంది. తన తల్లి తండ్రులు ఎలాగు పట్టించుకునే పరిస్థితిలో లేరు, ముందు అవినాశ్ తల్లి తండ్రులు ఒప్పుకుంటేనే పెళ్ళి అంది. క్రిస్టీనా అవినాశ్ తో ఒక బలమైన, శాశ్వత వివాహబంధాన్ని, మంచి కుటుంబ విలువలని కోరుకుంటుంది, అందుకే అవినాశ్ తల్లితండ్రులు ఒప్పుకోవాలి అంది.

క్రిస్టీనా చాలా భారతీయ సినిమాలు కూడా చూస్తుంది ఈ మధ్య. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువల పట్ల చాలా విషయాలు తెలుసుకుంది. తనకు కూడా ఒక పెద్ద కుటుంబం ఉండాలని, అందరితో కలసి ఉండాలని కలలు కనేది. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట, పెళ్ళి గొప్పతనం, వేదపఠనం తన మనసులో కదలాయి.

జెస్సికా-జేమ్స్ డేటింగ్‌లో వుండి ఇప్పటికే పది సంవత్సరాలు అయినా పెళ్ళి ఊసు ఎత్తని జేమ్స్‌తో పోల్చుకుంటే, అవినాశ్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడో అని తలుచుకుని భయపడేది, అసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉందో లేదో కూడా అర్థం కాలేదు ఇన్ని రోజులు. తన మనసులోని సందేహాలకి ఇంత తొందరలోనే సమాధానం రావడం, అదీ అవినాశ్ నుండే రావడం ఊహిస్తూనే చాలా సంతోషంగా ఉంది క్రిస్టీనాకి.

తల్లి తండ్రులతో ఏమి మాట్లాడాడో తెలియదు కానీ, పెళ్ళికి మాత్రం ఒకే అని చెప్పారు. అప్పుడప్పుడూ అవినాశ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, కొన్ని విషయాల్లో తండ్రి ఎంత కఠినంగా ఉంటాడో చెప్పేవాడు మానసకి. అవినాశ్ తల్లి తండ్రుల గురించి కొంత తెలిసిన మానస చాలా ఆశ్చర్యపడింది ఎలా ఒప్పుకున్నారని. అదే విషయం అడిగింది అవినాశ్‌ని.

“ఆయన నన్ను ఊహించుకున్న ఆ బిజినెస్, అమెరికన్ లైఫ్ అన్నిటికీ బ్రేక్ పడుతుంది అంటే దేన్నీ లెక్కచేయడు, ఆ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టాను, వెంటనే ఒకే అన్నాడు” చాలా ఈజీగా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పాడు అవినాశ్.

చివరికి మానసనే పెళ్ళి పెద్ద అయి పెళ్ళికి కావాలాల్సినవి అన్నీ సమకూర్చింది. క్రిస్టీనా కోరిక ప్రకారం హిందూ సంప్రదాయం లోనే పెళ్ళి కావాలి అంది. పెళ్ళికి అవినాశ్ తల్లి తండ్రులు వస్తే బాగుంటుంది అని క్రిస్టీనా పట్టు పట్టింది. ఇంత తొందరలో వారికి వీసాలు తీసుకోవడం, అమెరికాకి రావడం కుదరదు కాబట్టి మా ఆశీస్సులు మీతో ఎప్పటికీ ఉంటాయి అని చెప్పి ఒప్పించారు అవినాశ్ తల్లి తండ్రులు, అప్పుడు గానీ క్రిస్టీనా మనసు కుదట పడలేదు. రెండు రోజుల్లో పెళ్ళి, క్రిస్టీనా అవినాశ్‌తో ఒక కలల సౌధాన్ని నిర్మించుకుంది, ఇంటినిండా మనుషులు అంటే అత్తమ్మ, మామయ్య, మరుదులు, నానమ్మ, తాతయ్య, అల్లరి చేసే పిల్లలు ఇలా .. ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో హాయిగా నిద్ర పోయింది.

లివర్మూర్ టెంపుల్‌లో పెళ్ళి. సహోద్యోగులు, వారి కుటుంబాలు, మరి కొంత మంది మిత్రులు అవినాశ్ తరుపున వచ్చారు. క్రిస్టీనా తల్లి ఒడిలో ఒక చిన్న పాపతో వచ్చింది, తండ్రి ఏదో సాకుతో రాలేదు, తమ్ముడు మాత్రం వచ్చాడు. చర్చ్‌లో పెళ్ళి కోసం ఎవరూ అడగలేదు, క్రిస్టీనాకు కూడా పెద్దగా ఇష్టం లేదు. పెళ్ళి మండపం, పూజారితో ముహూర్తం మాట్లాడి, పెళ్ళి కి కావలసిన సామగ్రి , ఇలా అన్ని సమకూర్చింది మానస.

పెళ్ళి, హానీమూన్ అని ఒక 15 రోజుల సెలవులు తీసుకొని ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరూ ఒక్కటయ్యారు క్రిస్టీనా, అవినాశ్. మానసకి చాలా సార్లు ధన్యవాదములు తెలిపారు దగ్గరుండీ పెళ్ళి చేయించినందుకు. క్రిస్టీనా సంతోషానికి హద్దులు లేవు, ‘ఇప్పుడు తనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది, తనకంటూ ఒక కాపురం ఉంది’ అని ఊహించుకుంటూ అప్పుడప్పుడూ ఇండియాలోని తన అత్త మామలతో వచ్చీ రాని హిందీలో మాట్లాడుతుంది. అవినాశ్ తల్లి తండ్రులు, అర్థం అయ్యీ కానట్టు మాట్లాడేవారు పొడి పొడిగా.

ఆ విధంగా సంసారం బాగానే నడుస్తుంది, ఇప్పుడే పిల్లలు వద్దు అన్నాడు అవినాశ్, సరే అంది క్రిస్టీనా.

పెళ్ళి అయిన కొద్ది రోజుల్లో గ్రీన్ కార్డు అప్లై చేయడం, సంవత్సరం తిరగకుండానే అవినాశ్ కి గ్రీన్ కార్డు రావడం అంతా జరిగిపోయింది. సాఫీగా సాగుతుంది సంసారం. గ్రీన్ కార్డు రావడంవలన వెంటనే ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు అవినాశ్ అదీ వాళ్ళ తండ్రి ఆదేశాల మేరకు. ప్రతీ చిన్న విషయం, వాళ్ళ తండ్రితో మాట్లాడటం క్రిస్టీనాకి కొంత అసహనంగా ఉన్నప్పటికీ, తండ్రి కొడుకుల మధ్య కలగ చేసుకోదలచుకోలేదు ఎప్పుడూ.

కాలచక్రం ఒక మూడు సంవత్సరాలు తిరిగింది. అవినాశ్ బిజినెస్ బాగానే నడుస్తుంది. అవినాశ్ కంపెనీలో పని చేయడం క్రిస్టీనాకి ఇష్టం లేదు. క్రిస్టీనా తో పని చేసిన చాలా మంది ఉద్యోగం మారారు. క్రిస్టీనా మాత్రం అక్కడే ఉంది, ఎక్కువ జీతానికి ఆశపడి తనకి తెలిసినవాళ్ళ మధ్య ఉన్న ప్రశాంతతని కోల్పోయి కొత్త వ్యక్తుల మధ్య మళ్ళీ ఉద్యోగం ప్రారంభించడం తనకి ఇష్టం లేదు. తన క్లోజ్ ఫ్రెండ్ మానస కూడా ఆఫీసుకు దూరం అవుతుంది అని ఇంటికి దగ్గరలో ఇంకొక ఉద్యోగం చూసుకుంది.

పెళ్ళి అయిన తరువాత ఇండియాకి వెళ్ళి తన అత్తమామలతో, ఆడ పిల్లలతో గడపాలని చాలా ఉండేది. కానీ ప్రతి సారి ఎదో సాకుతో వాయిదా వేస్తున్నాడు అవినాశ్. ఎందుకో ఈ మధ్య అవినాశ్ ప్రవర్తనలో కొంత మార్పు గమనిస్తుంది క్రిస్టీనా.

అసహనం, అవసరం అయిన దానికీ, లేనిదానికీ కోపం తెచ్చుకోవడం ఎక్కువవుతుంది. ఒకటి రెండు సార్లు పిల్లలు కావాలి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపు చేద్దాం అంది క్రిస్టీనా! ఇప్పుడే వద్దు అన్నాడు అవినాశ్. కారణం చెప్పకుండా దాటేయడం క్రిస్టీనాకి నచ్చలేదు. అనవసరంగా నోరు జారుతున్నాడు కారణం లేకుండా. మంచి ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, ఇంకా దేనికోసం ఆగాలో తెలియలేదు క్రిస్టీనాకి, అయినా సర్దుకు పోయింది గొడవ ఎందుకని. వాళ్ళ తల్లి తండ్రులతో కూడా ఇప్పుడు చాటుగానే మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడూ ఫోన్‌లో మెసేజెస్ తనకు తెలియకుండా చదివి తొలగించడం చూసింది క్రిస్టీనా. ఎవరూ అని అంటే కంపెనీ వ్యవహారంలే అని చెప్పేవాడు. ఇంతకు ముందు ఏ మెసెజ్ వచ్చినా ఇద్దరూ చూస్తుండగానే చదివి రిప్లై ఇచ్చేవాడు. అసలు ఆఫీసు నుండి వచ్చి రాగానే, వారిద్దరూ అన్ని పనులు కలిసే చేసే వారు, నీది నాది తేడా లేదు, ఇద్దరి ఫోన్లో వాట్స్ ఆప్ మెస్సజెస్ కలిసే చదివే వారు.

దాదాపు కొల్లీగ్స్ కూడా అందరూ ఇద్దరికీ తెలిసిన వారే కాబట్టి వారి గురించి మాట్లాడుకునేవారు. కలిసే వంట చేసుకోవడం, కలిసి అంట్లు తోమడం, కలిసి లాండ్రీలో బట్టలు వేయడం, ఒకటేమిటి అన్ని పనులు ఇద్దరు కలిసేచేసేవారు. రెండున్నరేళ్ల కాపురంలో అవినాశ్‌కి తానంటే చాలా ఇష్టం అని అర్థం అయ్యింది క్రిస్టీనాకి. తనకి ఇష్టమయిన రెస్టారెంట్స్‌కి వెళ్లడం, తన హాబీలయిన పెయింటింగ్‌కి సపోర్ట్ చేయడం, ఇలా ఇక్కడా ఇబ్బంది పడలేదు అవినాశ్‌తో క్రిస్టీనా, చాలా సపోర్టివ్. కానీ అవినాశ్ కి వాళ్ళ తండ్రి అంటే మాత్రం చాలా భయం, ఆయన చెప్పినట్టు నడుచుకోవడం ఒకటే క్రిస్టీనాకి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఒక ఆరు నెలల నుండి, చాలా సార్లు ఆఫీసు నుండి లేట్‌గా వస్తున్నాడు. ఇంతకు ముందులాగ ప్రేమతో మాటాడటం లేదు, ఎప్పుడూ సరదాగా ఉండే అవినాశ్‌లో చాలా మార్పు వచ్చింది. ముందు పెద్దగా అనుమానించలేదు, కానీ అడిగితే ఏదో బిజినెస్ టెన్షన్ అంటున్నాడు. ఒకిద్దరు పాత కొల్లీగ్స్ తో మాట్లాడి, పరోక్షంగా అడిగి చూసింది, ఆఫీసు టెన్షన్ ‘కాదు’ అని అర్థం అయింది. మనసు ఏదో కీడు శంకించింది.

సాధారణంగా ఇంతకుముందు ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేవాడు, కొన్ని సార్లు డైరెక్ట్‌గా తన ఆఫీసుకి వస్తే ఇద్దరూ కలిసే వచ్చేవారు. దాదాపు ఏడు, ఎనిమిది నెలల నుండి తన ఆఫీసు వైపుకి రాలేదు.

ఒక రోజు.. సమయం సాయంత్రం ఏడు అయ్యింది, అవినాశ్‌కి ఫోన్ చేసింది క్రిస్టీనా. ఆఫీసులోనే ఉన్నాను, బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను అని కట్ చేసాడు. ఎందుకో నమ్మ బుద్ది కాలేదు, ఆఫీసు డెస్క్ ఫోన్ ఉంటుందని తెలుసు కానీ, పెద్దగా దాని అవసరం రాలేదు. ఆఫీసు నంబరుకి డయల్ చేయాలనుకుని నంబర్లు నొక్కినా కొద్దీ.. తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది.

ఒక వేళ అక్కడే ఉంటే… “నన్ను అనుమానిస్తున్నావా..?” అంటూ ఆయనలో అనుమాన బీజం నేనే వేసిన దాన్ని నేనే అవుతాను అని అనుకోని ఆ ప్రయత్నం విరమించుకుంది.

ఏమి చేయాలో అర్థం కావడం లేదు, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకి దుఃఖం వస్తుంది. పెళ్లయిన నుండీ జీసస్‌తో పాటు, హిందూ దేవుళ్ళని కూడా పూజిస్తుంది. కొంచెం సేపు భగవద్గీత కొన్ని శ్లోకాలు చదివి, వాటి అర్థ తాత్పర్యాలు తెలుసు కొని తనకు తానే సరి చెప్పుకుంది. ఒక గంట తర్వాత వచ్చాడు అవినాశ్. స్నానం చేసి రాగానే ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలని వేడి చేసి, అప్పటికే ఇలక్ట్రిక్ స్టవ్ పై వేడిగా ఉన్న చపాతీలు టేబుల్ పై సర్దింది. పెద్దగా మాటలేవీ లేకుండానే భోజనం అయ్యిందనిపించారు ఇద్దరూ.

క్రిస్టీనానే కలిగించు కొని, “ఆఫీసులో ప్రెజర్ ఎక్కువయితే కంపెనీ మానేసి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా” అంది. జవాబు చెప్పకుండా ల్యాప్టాప్ స్టార్ట్ చేసి ఏదో పని చేస్తున్నాడు నిశ్శబ్దంగా.

క్రిస్టీనాకి ఏమీ అర్థం కాలేదు. అవినాశ్ ఫోన్‌లో ఏవో టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి, చూస్తూ ఏవో రిప్లై ఇస్తున్నాడు. కొద్ది సేపటి తర్వాత మెసేజెస్ ఆగిపోయాయి. ఫోన్ అక్కడే వదిలేసి రెస్ట్ రూమ్ కి వెళ్ళాడు. ఈ మధ్య చాలా రోజుల నుండి ఫోన్ అసలు ఎక్కడా వదలి పెట్టడం లేదు, ఇంకా ఎక్కువ సార్లు రెస్ట్‌రూమ్ లోనే వాడుతాడు. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫోన్ ని బెడ్రూమ్లో వదలి రెస్ట్‌రూమ్‌కి వెళ్ళాడు.

రెస్ట్‌రూమ్‌కి వెళ్లిన కొన్ని క్షణాల్లో ఒక మెసెజ్ వచ్చింది. “డార్లింగ్ డిన్నర్ చేశావా? ఇంకా ఇలా ఎన్ని రోజులు ఒక్క దాన్నే ఉండాలి? ఇంకా ఎప్పుడు డివోర్స్ కి అప్లై చేస్తావ్? ఇంట్లో వచ్చే నెల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయట, ఏదో త్వరగా డిసైడ్ చేసుకో! ఎంగేజ్మెంట్ అయి కూడా దాదాపు ఒక సంవత్సరం కావస్తుంది కదా! ఇంక నా వల్ల కాదు. ఏదో గ్రీన్ కార్డు కోసం అందరు ఇండియన్స్ చేసినట్టే నువ్వు కాంట్రాక్టు పెళ్ళి చేసుకున్నావ్ అన్నారు మీ ఇంట్లో.. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ కాంట్రాక్ట్?”

ఈ మెసెజ్ చూసిన క్రిస్టీనాకు తన కాళ్ళ కింద భూమి కపించినట్టు అయ్యింది. తను చదువుతుంది, చూస్తుంది కరెక్టేనా..? అని తన కళ్ళని తానే నమ్మ లేక పోయింది. ఒక్కసారిగా మనసు మొద్దు బారి పోయింది.

“ఇన్ని రోజులు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చేసుకున్న పెళ్ళి కాంట్రాక్టు పెళ్లా? ఇలా ఎలా అనగలిగాడు? ఇంత చేస్తే డబ్బులకి అమ్ముడు పోయిన దాన్ని అయ్యాను వాళ్ళ దృష్టిలో. ఆ రోజు నేను గ్రీన్ కార్డు కోసం ఈ పెళ్ళి జరగక పొతే ఇప్పుడు ఎక్కడుండే వాడు? అన్ని విధాలా నీవే సర్వస్వం అని నమ్ముకుంటే ఇంత మోసమా..? పైకి అంత నవ్వుతూ, తుళ్ళుతూ, ఉంటూ లోపట అంత విషం దాచుకుని ఉంటారా మనషులు?” ప్రశ్నల అగ్నిపర్వతం బ్రద్దలయింది తనలో, కాళ్ల కింద నేల కదిలిపోతుంది అనిపిస్తుంది. తాను కట్టుకున్న కలల సౌధం తన ముందే కుప్ప కూలిపోతుంది.

అప్పుడెప్పుడో భారతీయ స్త్రీ గురించి ఏదో పుస్తకం చదువుతుంటే, ఉండు నేను ఒక మంచి శ్లోకం చదివి వినిపిస్తాను అని అవినాశ్ స్వయంగా చదివి వినిపించిన శ్లోకం గుర్తుకువచ్చింది. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా- స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారు అని అర్థం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పిన అంత గొప్ప శ్లోకం. ఈ శ్లోకాలు, అర్థాలు చెప్పడానికే కానీ, ఆచరించడానికి కాదా? ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప సంస్కృతి! అలా ఎలా మారిపోతారు ఈ మనుషులు? ఇలాంటి స్వార్థ పరులు కూడా వుంటారా మంచి వారి ముసుకు వేసుకొని? పురుషుని చెరలో నలిగిపోతున్న అదే స్త్రీ.. వారి తల్లి కానీ, చెల్లి కానీ, అయితే ఏమవుతుందో కూడా వేదాలలో రాస్తే బాగుండు, కనీసం ఒక్కరన్నా మారేవారేమో!” ఆలోచనలు ఎక్కడికెక్కడికో పోతున్నాయి. తాను ఏమి తక్కువ చేసింది అవినాశ్‌కి?

అతని కోసం, వాళ్ళ తల్లి తండ్రుల ఇష్టాలకోసం తాను ఎన్నో మార్చుకుంది. చివరకి తనకు ఏంటో ఇష్టమయిన చర్చికి పోవడం కూడా అవినాశ్ కోసం త్యాగం చేసింది. రెస్ట్‌రూమ్‌లో నల్లా ఇప్పిన శబ్దంతో తేరుకుని, ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళ నిండా నీరు ప్రవాహమై రావడానికి సిద్ధంగా ఉంటే, అతి కష్టం మీద దాచుకోగలిగింది. వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ రాసుకుంది. ఏమీ తెలియనట్లే ఫోన్‌ని ఎక్కడినుండి తీసిందో అక్కడే వదిలేసింది.

అది తనకు తెలియాలనే ఒక స్క్రిప్టెడ్ స్కెచ్ అని అర్థమయ్యింది క్రిస్టీనాకి. చూసీ చూడనట్టు అవినాశ్‌ని పరిశీలిస్తుంది. ఏదో గొడవ జరుగుతుందని ముందే ఊహించినట్టున్నాడు, కానీ తానూ ఏమీ పట్టించుకోలేక పోవడం కొంత ఆశ్చర్యపడుతున్నట్టున్నాడు.

“ఒక మనిషి తెలియక తప్పుచేస్తే క్షమించ వచ్చు, కానీ తప్పు చేస్తున్నాడని తెలిసి, ఏమీ తెలియనట్లు నటించే వారిని ఎవరూ మార్చలేరు. పరిస్థితి ఇప్పుడు చేతులు దాటి పోయింది, మార్చాలని ప్రయత్నించడం వృధా! ఇప్పుడు అతన్ని శిక్షించే ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం, ఆ అమ్మాయి ఎలాంటి కష్టాల్లో ఉందో, ఏదో ఎర వేసి పెళ్ళికి ఒప్పించి ఉంటారు, లేకుంటే ఆల్రెడీ పెళ్ళి అయింది అని తెలిసికూడా మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తుంది? కానీ రేపు, అవినాశ్ ఈ అమ్మాయిని మోసం చెయ్యడనే గ్యారంటీ ఏమిటి?” అంత బాధలోనూ, కోపంలోనూ ఇంకో అమ్మాయికి నష్టం కలగచేయకూడదనే ఆమె మనస్సుకి సర్ది చెపుతుంది.

ఇప్పుడే చాలా ధైర్యం కావాలి, ఎట్టి పరిస్థితిలోనూ అధైర్య పడకూడదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది.

పడుకున్నట్టే కానీ, ఒక్కొక్క తీపి జ్ఞాపకం, క్రమంగా ఆ తీపి పొర మాయమై అసలైన చేదుని బహిర్గతం చేస్తున్నాయి. ఆ రోజు లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు టాట్టూ వేయించుకుందాం అని, చేతిపై ‘అవినాశ్’ అని వేసుకుంది. “అవినాశ్ నీవు కూడా వేసుకోరాదూ… అంటే, నీ పేరు నా హృదయం లోనే ఉంది, ఇంకా ఈ పై పై మెరుగులు ఎందుకు?” అని తప్పించుకున్నాడు.

తండ్రి మాటకు విలువిచ్చే మంచి కొడుకు అని సంతోషించింది కానీ, తండ్రీ కొడుకులు ఇద్దరూ కలసి ఆడుతున్న నాటకం అని గ్రహించ లేక పోయింది క్రిస్టీనా.

“పెళ్ళికి రమ్మంటే వీసా దొరకదు అని దాటేసారు కానీ, ఇంకా కొన్ని రోజులలో విడిపోయే పెళ్ళికి డబ్బులు వృథా అని, ప్రతీ దాన్ని డబ్బులతో కొలిచే ఆ బిజినెస్ మాన్ తండ్రి అసలు పెళ్ళికి రాలేదు” అని ఇప్పుడు అర్థం అవుతుంది క్రిస్టీనాకి. పిల్లలని కనడం వాయిదా వేసింది కూడా పక్కా తండ్రి వేసిన ప్లానే అని అర్థం అయ్యింది. మూడు సంవత్సరాల ఎన్నో మధుర రాత్రులు, ఇప్పుడు కాళ రాత్రుల్ని తలపిస్తున్నాయి. మొత్తానికి అవినాశ్ ఒక వెన్నుముక లేని తండ్రి చాటు తనయుడు అని అర్థం అయ్యింది. మనసు చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎంత ఆపుకోవాలన్నా ఆగని దు:ఖం తన్నుకొని వస్తుంది. తనకి మనసు బాగాలేనప్పుడు, తల్లి తండ్రులు గుర్తుకు వచ్చినప్పుడు అండగా ఉండి ఓదార్చిన భుజం, ఇప్పుడు పక్కనే ఉన్నా పనికి రాకుండా పోయింది. రెండు కళ్ల నుండి వరదలా పారిన కన్నీళ్లు దిండుని పూర్తిగా తడిపేసాయి, ఆ కన్నీటి తడి వెచ్చగా తగులుతుంటే ఎప్పుడో నిద్రపట్టేసింది క్రిస్టీనాకి.

***

విషయం పూర్తిగా అర్థం అయ్యింది మానసకి. క్రిస్టీనాని ఓదార్చింది. మానస సలహా పై క్రిస్టీనా అవినాశ్ తండ్రితో మాట్లాడింది, కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయింది అని అర్థం అయ్యింది ఇద్దరికీ. పెళ్లప్పుడు అంత తొందరగా ఆ తండ్రి ఎలా ఒప్పుకున్నాడు అని చాలా రోజులు సందేహంగా ఉండేది మానసకి. “ఆయన నన్ను ఊహించుకున్న ఆ బిజినెస్, అమెరికన్ లైఫ్ అన్నిటికీ బ్రేక్ పడుతుంది అంటే దేన్నీ లెక్కచేయడు ” అవినాశ్ ఏమి చెప్పి ఒప్పించాడో ఆ బిజినెస్ ప్లాన్ అంతా ఇప్పుడు అర్థం అయ్యింది మానసకి.

పెళ్లప్పుడు అవినాశ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి, అప్పుడు ఆ పెళ్ళి అవసరం అయ్యింది, ఇప్పుడు గ్రీన్ కార్డు, బిజినెస్ అంత సెట్ అయ్యింది కాబట్టి, ఇప్పుడు ఇంకో పెళ్ళి అవసరం అవుతుంది తన వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికా వరకు విస్తరించడానికి. వారికి మనసులతో పనిలేదు, కావలసింది కేవలం డబ్బు, డబ్బు డబ్బు. వీసా ముఖ్యం, కొడుకు అమెరికాలో స్థిరపడటం ముఖ్యం, ఆ తర్వాత తన బిజినెస్ ని ఇక్కడికి విస్తరించడం ముఖ్యం. తన కొడుకుకి వరకట్నం రూపంలో రానున్న ఇంకో రెండు ఫ్యాక్టరీలు ముఖ్యం. అవినాశ్ తండ్రి మాటలని ఆలోచిస్తుంటే చాలా విషయాలు అర్థం అయ్యాయి మానసకి, పాపం క్రిస్టీనాకి ఇండియాలో పెళ్ళి ఒక వ్యాపారం అని ఇంకా అర్థం కాలేదు. ప్రేమ, ఆప్యాయతలు, నచ్చని విషయం సూటిగా చెప్పడం మాత్రమే తెలిసిన క్రిస్టీనాకి , ప్రేమ వెనుక ఇంత కుట్ర ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. అవును, అమెరికాలో పెళ్ళి – విడాకులు సాధారణం అని తెలుసు, కానీ వారికి కూడా ప్రేమ, మనసు, ఆప్యాయతలు, అనురాగాలు కూడా ఉంటాయి కదా!

ఆర్ధిక స్వతంత్రం ఉన్నచోట మనసును చంపుకొని జీవించే పరిస్థితి పురుషుడికి గానీ, స్త్రీకి గానీ ఎవ్వరికీ రాదు. ఇప్పుడు ఇండియాలో కూడా విడాకులు సాధారణం. క్రిస్టీనా లాంటి వారు చాలా అరుదు, ప్రతీ దాన్ని గుడ్డిగా నమ్మేస్తుంది, నమ్మిన దాన్ని మనసా, వాచా ప్రేమిస్తుంది, అనుచరిస్తుంది. దానికి ఆమె అమెరికన్ అని కానీ, ఇండియన్ అని కానీ కాదు, ఒక మనసున్న మంచి మనిషి. సాటి వాడు కష్టాల్లో ఉంటే, చూస్తూ కూర్చునే రకం కాదు. కానీ నమ్మించి మోసం చేయడం మాత్రం అవినాశ్‌కి మాత్రమే చెల్లింది. స్త్రీల పట్ల వేధింపులు, వరకట్నపు చావులు, మాన భంగాలు, పరువు హత్యలు ఈ మధ్య ఇండియాలో జరిగిన, జరుగుతున్న జరిగిన కొన్ని సంఘటనలు వివరించింది మానస.

మానస తో మాట్లాడిన ఆ ముప్పై నిమిషాల్లో క్రిస్టీనాకి అర్థం అయ్యిందేమిటంటే ” అవినాశ్, వాళ్ళ తండ్రి “కీ” ఇస్తూ ఆడిస్తున్న ఒక బొమ్మ లాంటి వాడు, మొత్తం ఈ డ్రామాకి సూత్రదారుడు అవినాశ్ తండ్రి. ఏది చేయాలన్నా ముందు వాళ్ళ తండ్రి నుండే ప్రారంభించాలి” అని.

“మనుషులు డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారతారా? ఒక చక్కటి జంటను తమ స్వార్థం కోసం ఇలా విడదీస్తారా..? ఆలోచిస్తూ ఇంకా ఎట్టి పరిస్థితిలో అవినాశ్ గురించి ఆలోచించ కూడదని ఒక నిర్ణయానికి వచ్చి మానస దగ్గర సెలవు తీసుకొని పక్కనే ఉన్నబార్ట్ ట్రయిన్ స్టేషన్లకు బయలు దేరింది క్రిస్టీనా.

***

ట్రయిన్లో కూర్చుంది క్రిస్టీనా కానీ మనసు మాత్రం ట్రయిన్ కన్నా వేగంగా పరుగిడుతుంది. మానస చెప్పిన స్త్రీల పట్ల వివక్షలు, వేధింపులు, హత్యలూ గూగుల్ చేసి చాలా విషయాలు తెలుసుకుంది క్రిస్టీనా. బిడ్డల జీవితాలు తల్లి తండ్రులే నాశనం చేస్తున్నారని అర్థం అయ్యింది ఇప్పుడు. మానస అవినాశ్ ప్రవర్తన పట్ల అడిగిన ప్రశ్నలు మెల్లిగా గుర్తుకు తెచ్చుకుంటుంది. మరొక్క సారి అవినాశ్ గురించి ఆలోచించింది ప్రశాంతంగా. అవినాశ్ తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించింది లేదు, వేధించింది లేదు. అటు వాళ్ళ తండ్రికి ఎదురు చెప్ప లేక, ఇటు తనతో నిజం చెప్పలేక ఇద్దరి మధ్యలో నలిగిపోయాడని మాత్రం అర్థం అయ్యింది. ఆవేశానికి పోతే అనర్థాలే తప్ప, ఎక్కడా అనుకున్నవి జరగలేదు అని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంది. అంత వరకు ఉన్న కోపం స్థాయిలో ఇప్పుడు మరొక కోణంలో మనసు ప్రయాణిస్తుంది బార్ట్ ట్రైన్ తో పాటుగా. రాత్రి సరిగా నిద్రపోలేదు కదా, కొద్దీ సేపట్లోనే నిద్ర పట్టేసింది.

“మదర్ తెరిసా.. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇండియాలో శారీరక రోగాల భారీన పడ్డ ఎందరో రోగుల చికిత్స నిమిత్తం తన జీవితాన్నే త్యాగం చేసింది, ఇప్పుడు భారత దేశంలో శారీరక చికిత్సకన్నా, తన మామ లాంటి వారికి సామాజిక చికిత్స అవసరం” అనుకుంది క్రిస్టీనా.

“గ్రీన్ కార్డు రాగానే సర్వస్వం అర్పించిన అమ్మాయిని, ఆమె మనసును అర్థం చేసుకోక, అంతా మరచి పోయి కులం, మతం, వరకట్నం, డబ్బు కోసం బంధుత్వం గుర్తుకు వచ్చిన ఈ సమాజంలోని అవినాశ్ లాంటి వెన్నుముక లేని మనుషులు, పెళ్ళి చేసుకుని కెరీర్ కి హెల్ప్ చేసిన అమ్మాయిని, ఐ.పి.ఎస్ రాగానే కోట్ల కట్నం, కులం గుర్తుకు వచ్చి విడాకులు తీసుకో అంటూ బెదిరించే మగ మహారాజులు, దిశ, నిర్భయ, టేకు లక్ష్మి, మానస లాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఎందరో మానవ ముసుగు కప్పుకున్న క్రూర మృగాల ఆట కట్టించడం చాలా అత్యవసరం” నిద్రలో కూడా ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళుతున్నాయి.

“హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టి, నారాయణుడి కోసం తండ్రినే ఎదిరించాడు, కానీ అవినాశ్ నేర్చుకున్నదేమిటి ఆ కథలో? డబ్బు, ఆస్తి, మతం అనే జాడ్యం పట్టుకున్న తండ్రికి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య విలువ చెప్పలేడా? దైవ సన్నిధిలో అగ్ని సాక్షిగా వేసిన ఆ మూడు ముడుల విలువ ఆ తండ్రికి తెలియదా?”

“తల్లి తండ్రులని, రాజ్యాన్ని, సర్వ సుఖాలని వదలిపెట్టి కట్టుకున్న భర్త కోసం అడివి బాట పట్టిన సీతను చివరికి స్వంత భర్తనే అనుమానిస్తే.. పాపం, భర్త పరువు కాపాడటం కోసం అగ్ని పరీక్షకు సిద్ధం అయ్యింది ఆనాడు సీత!”

“భర్తకు కళ్ళు లేవు అని, తనూ జీవితం అంతా గుడ్డిగా బతికిన గాంధారి లాంటి మహా పతివ్రతలు పుట్టిన దేశంలో, స్త్రీలు తిరిగిన చోట దేవతలు తిరుగుతారు అన్న సంస్కృతిలో అదే స్త్రీకి, ఆమెకు ఒక మనసుందని, కనీసం ఆమెను మనిషిగా కూడా గుర్తించని ఈ సమాజానికి ఇప్పుడు సీత, గాంధారిలతో పనిలేదు. తండ్రి మాట విని కన్న తల్లినే ఖండించిన పరుశురాములూ అవసరం లేదు ఈ సమాజానికి” తాను చదివిన భారతీయ కథలు గుర్తుకు వస్తున్నాయి క్రిస్టీనాకి.

“సావిత్రి భర్త ప్రాణం కోసం యమధర్మరాజునే ఎదిరించింది, ఇప్పుడు నన్నే కాదనుకున్న అవినాశ్ కోసం నేను యముడు లాంటి తన మామని ఎదిరించాలి? ఇప్పుడు అవినాశ్ చేతిలో ఏమీ లేదు, అంతా తన మామ చేతిలో ఉంది. మామకు కావలసిన ఆ విడాకులు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి” తన చేతిలో ఒక బలమైన ఆయుధం ఉన్న అనుభూతిని పొందింది క్రిస్టీనా.

తనకు తెలిసిన ఇమ్మిగ్రేషన్ అటార్నీకి ఫోన్ చేసి “శామ్ మ్యారేజ్ “, ” గ్రీన్ కార్డు పరిమితు”ల గురించి చాలా విషయాలు తెలుసుకుంది. తన అనుమతి లేనిదే అవినాశ్‌కి ఎలాంటి అనుమతులు లభించవని అర్థం అయ్యింది క్రిస్టీనాకి. తాను ఎదిరించాల్సిన యమధర్మ రాజు తన మామ. యముడి చేతిలో ఉండాల్సిన యమపాశం లాంటి గ్రీన్ కార్డు ఇప్పుడు తన చేతిలో ఉంది.

శాంఫ్రాన్సిస్కో స్టేషన్ రాగానే దిగి నడుస్తుంది. ఇండియన్ వీసా కోసం అడుగులు ఇండియన్ కాన్సులేట్ వైపు పడుతుంటే, మనసు ఢిల్లీ వీధుల్లో పరుగెడుతుంది.

కాన్సులేట్ లో అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేసి ఇచ్చింది. కొద్ది సేపు కూర్చో మని ఆఫీసర్ చెప్పడంతో వెయిటింగ్ ఏరియాలో కూర్చుంది.

“అయిగిరి నందిని – నందిత మేదిని విశ్వ వినోదిని -నందినుతే ” దుర్గాష్టకం మెల్లిగా లీలగా వినిపిస్తుంది. తిరిగి చూసింది, అది దసరా నవరాత్రుల సమయం కాబట్టి దుర్గామాత విగ్రహాన్ని అమర్చారు అక్కడ. తనకు చాలా ఇష్టమయిన పాట, మంచి రైమింగ్ ఉండటంతో ఒక్కసారి వినడంతోనే బాగా నచ్చడంతో చాలా సార్లు విన్నది. ఆలోచనలు మాత్రం తనను వదలట్లేదు, ప్రతి సన్నివేశం తనకు అనుకూలంగా , తనను సమర్దిస్తున్నట్టుగా ఊహించుకుంటుంది. అన్వయించుకుంటుంది.

“ఇప్పుడు మహిషాసురులను, నరకాసురులను అంతమొందించే ఆది శక్తులు, కాళీమాతలు, దుర్గమాతలు కావాలి” ఆలోచనలు మరింత పదునెక్కాయి.

కొద్ది సేపటి తర్వాత:

“క్రిస్టీనా..నీ ఇండియా వీసా రెడీ” అన్న కాన్సులేట్ అధికారి పిలుపుతో ఆలోచనలను పక్కకు పెట్టి పాస్‌పోర్ట్ తీసుకుంది.

“అవినాశ్ చేసిన ఈ ‘నయా’ వంచనకి ఇది ఒక ‘ప్రతి వంచన’ అని అవినాశ్‌కి తెలిసే సమయం ఆసన్నమయింది” అనుకుంటూ చేతిలో పాస్‌పోర్ట్ పట్టుకుని నడుస్తుంటే… మదర్ తెరిస్సా – జాలి, ప్రేమ, కరుణ ని వదలి కసితో ఖడ్గం పట్టుకుని ఈ కాలపు నరకాసురులను, మహషాసురులను తరిమి తరిమి కొట్టినట్టు కనపడుతుంది క్రిస్టీనా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here