నయ్యిరా వాఁహీద్ మూడు చిన్న కవితలు

0
13

[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో నయ్యిరా వాఁహీద్ రచించిన మూడు కవితలని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]

నయ్యిరా వాఁహీద్ ఆఫ్రికన్ కవయిత్రి. ఇంస్టాగ్రామ్‌లో అత్యంత ప్రాముఖ్యత  పొందిన రచయిత్రి. చాలా చిన్న లేదా మినీ కవితలు రాయడంలో పేరు పొందారు. ఆమె మినీ కవితల్లో  ప్రేమ, రేసిజం, అస్తిత్వం, స్త్రీవాదం వస్తువులుగా కనిపిస్తాయి. ఆమె తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పత్రికల్లో.. ప్రసార మాధ్యమాల్లో పంచుకోలేదు. తన అభిమాన కవయిత్రిగా సోనియా ఫ్రాంచేజ్‌ను పేర్కొంటారు. సాల్ట్, నెజ్మా అనే కవితా సంపుటాలను ప్రచురించారు.

~

1) మొదటి కవిత- నా లోంచి (ఫ్రొం)
————————-
ఏమిటిది?
నేను కన్న నా కొడుకు లోలోపల.,
ఇంత దారుణమైన నరమేధం ఏం జరిగింది..?
ఎప్పుడు., ఎలా జరిగింది ఈ మార్పు?
నా చర్మం కిందనే నివసించిన అతనికి .,
నా కణాలను.,నా శరీర ద్రవాలను..
నా అవయవాలను తిని.. తాగి తయారైన అతనికి.. ఏమైంది?
మెల్లిగా అతని సుతిమెత్తని ఆత్మ క్రూరంగా మారుతున్నది ఎందుకు?
అతనికి తెలీదా అతనొక సగం స్త్రీ అని?
స్త్రీ లో నుంచి అంది పుచ్చుకున్న లాలిత్యాన్ని వదులుకోకూడదని?
నాలోపలి నుంచే ఆతను తయారయ్యాడని?
******
2) రెండవ కవిత – బర్త్ మార్క్
————————-
నేను నీ దాన్ని కాను.
ఇంత పెద్ద భూగోళాన్ని ఎంతో ప్రయాసకోర్చి నేను ఇంత దూరం ప్రయాణించింది..
ఒక మగవాడికి చెందిన సముద్రంలో కలిసిపోవడానికి కాదు!
నా శరీరం నీది కాదు.
నా నోరు నీది కాదు.
నా దేహం లోని నీరు నీది కానే కాదు.
నా లోని ఏదీ అసలు నీది కానే కాదు.
ఎప్పటి దాకా అనుకున్నావు?
నాకు నేనుగా., ఇష్టంగా
నా చేయి చాపి నీకు అందించే దాకా.. నేను నీ దాన్ని అని చెప్పేదాకా..
గుర్తు పెట్టుకో!
******
3) మూడవ కవిత -ద వర్క్- పని
————————-
చూడు., నా భుజాలు నీ ఆత్మ చేసిన
మాలిన్యంతో మరకలు పడిపోయాయి.
నా జీవితం అంతా నీ వాసన వేస్తోంది.
ఇప్పుడు నా రక్తంలో ఇంకిపోయిన
నిన్ను నా లోపలి నుంచి వదిలించుకోవడానికి.,
నన్ను నేను శుభ్రపరుచుకోవడానికి.,
కొంత సమయం పడుతుందిలే.. పట్టనీ!
…………………………………

మూలం: నయ్యిరా వాఁహీద్

అనువాదం-గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here