నెచ్చెలి వెచ్చని కౌగిలిలో..

0
7

[శ్రీ సిహెచ్. సి. ఎస్. శర్మ రచించిన ‘నెచ్చెలి వెచ్చని కౌగిలిలో..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“గం[/dropcap]ట పదయ్యింది. యీ రోజుకు మీ కోర్టు వ్యవహారాలు వాయిదా వేసి, వచ్చి పడుకోండి” తలుపు ప్రక్కన నిలబడి చెప్పింది ఆరుపదుల శారదమ్మ.

వారి పతిదేవుడు భూపతి.. డెబ్బై ఏళ్ల ప్రాయం.. కాయకష్టం చేసిన శరీరం.. మాంచి ఆరోగ్యం.. కొత్తగా చూచే వారి కళ్లకు.. వారికి అరవై సంవత్సరాల ప్రాయం అనే అనిపిస్తుంది. మనిషి మంచి దృఢకాయుడు.

అది ఓ చిన్న గ్రామం.. అంతా కలసి ఓ నాలుగు వందల యిళ్లు వుంటాయి. ఊరి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు, పండ్లతోటలు.

ముక్కుసూటిగా వర్తించే భూపతిగారి మాట.. ఆ వూరి ప్రజలకు వేదవాక్యం. ఊరిజనం భూపతిగారి ఇంటిని పెద్దయిల్లు అని పిలుస్తుంటారు. జనాల మధ్య ఏదైనా సమస్య వుత్పన్నం అయితే.. యిరువర్గాలు న్యాయం కోసం.. భూపతిగారిని ఆశ్రయిస్తారు. సమస్యను గ్రహించి న్యాయంగా.. ఇరువర్గాల వారికీ చెప్పవలసిన నీతి మాటలను చెప్పి.. వారి తప్పును వారు తెలిసికొనేలా చేసి.. సమస్యను సరిష్కరిస్తారు భూపతిగారు. వారికి ఏ పార్టీతో సంబంధం లేదు. ఇండిపెండెంట్.

అదే పనిమీద ఉన్న భూపతి.. అర్ధాంగి పిలుపును విని కుర్చీలో కూర్చొని వున్నవారు వెనక్కు తిరిగి చూచారు. తలుపు ప్రక్కన నవ్వుతూ నిలబడి వున్న తన ఇల్లాలి చూపులతో వారి చూపులు కలిశాయి. ఆమెను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు విరిసింది.

ఎదురుగా బెంచీమీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు లేచి నిలబడ్డారు.

“సరే ఇక మీరు వెళ్లండి. రేపు వారిని పిలిపించి మాట్లాడతాను, మీ సమస్యను పరిష్కరిస్తాను” అనుననయంగా చెప్పారు భూపతి.

వారు వీరికి నమస్కరించి వెళ్లిపోయారు. భూపతి లేచి ముఖద్వారాన్ని సమీపించి భార్య ముఖంలోకి చూశారు చిరునవ్వుతో. “నాకు నిద్ర వస్తూవుంది..” సిగ్గుతో తలదించుకొని మెల్లగా చెప్పింది శారదమ్మ.

“పద.. నాకూ వస్తోంది” తన ఎడంచేతితో భార్య భుజంపై మెల్లగా తట్టారు భూపతి.

తొట్రుపాటుతో నవ్వుతూ భర్త ముఖంలోకి చూచింది శారదమ్మ. ఇరువురు పడకగదిలోకి ప్రవేశించారు.

శారదమ్మ తలుపును బిగించింది. ట్యూబ్ లైట్‍ను ఆర్పి, ప్రక్కనేవు బెడ్ లైట్ స్విచ్‍ని నొక్కింది.

భూపతి మంచంపై వాలిపోయారు. శారదమ్మ మంచంపైన తన స్థానంలో పడుకొంది.

వారి వివాహం జరిగి నలభై రెండు సంవత్సరాలు. చుట్టాల యింటి కార్యాలకు వెళ్ళినపుడు.. తీర్థయాత్రలకు వెళ్లినపుడు, తమ యింటికి బంధుమిత్రులు వచ్చినపుడు.. పర్వదినాలప్పుడు తప్ప.. అ దంపతులు వేరు వేరు శయ్యలపై పరుండి ఎరుగరు. వారి అన్యోన్యతకు.. ఒకరిపట్ల ఒకరికి వున్న ప్రేమానురాగాలకు వారి దాంపత్య జీవితానికి యీ నాటికి పాతిక సంవత్సరాల ప్రాయమే.

భూపతి ఎంతో ప్రీతిగా.. తన కుడిచేతిని శారదమ్మ వీపు పైన వేశారు. ఆమె జరిగి తన తలను భూపతి ఛాతికి దగ్గరగా చేర్చింది. అరమూర సన్నజాజులు ఆమె తలలో వున్నాయి. వాటి సుమధుర వాసన.. భూపతి నాశికా రంధ్రాల ద్వారా లోన ప్రవేశించి.. ఆయన్ని పరవశుణ్ణి చేసింది.

“శారదా.. నేను చాలా అదృష్టవంతుణ్ణి..” పరవశంతో చెప్పారు భూపతి.

“నాకన్నానా..” మృదుమధురమైన శారదమ్మ కంఠం.

“అవును.. జీవిత గమనంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనాయి. కానీ.. నీవు.. నన్ను ఏనాడు అసహ్యించుకోలేదు. ఏ విషయంలోనూ ఎదిరించలేదు. నా ఆనందమే నీ ఆనందంగా భావించి.. నలభైరెండు సంవత్సరాలు నీ సుదీర్ఘ జీవితాన్ని అనుక్షణం నా ఆనందం కోసం.. తృప్తి శాంతి కోసమే వెచ్చించావు. నీవు నా ప్రక్కన పడుకోని రాత్రులలో.. నేను నిద్రపోలేక పోయేవాణ్ణి. యీ విషయం నీకు తెలుసా!..” విచారంగా చెప్పారు భూపతి.

“ఆ విషయం నాకు తెలుసు!.. పరిస్థితులు కారణంగా నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. నాలో నేను బాధపడేదాన్ని” మెల్లగా చెప్పింది శారదమ్మ.

“ఈ విషయంలో.. నా తమ్ముడి జీవితాన్ని తలచుకొంటే నాకు. ఎంతో విచారం.. నన్ను మించి ఎదిగాడు. నీవు చేసేది తప్పురా అని వాడికి చెప్పి.. వారించలేని దుస్థితి నాది శారదా!..”.

“ఆ విషయంలో మీరు పడే మథన నాకు బాగా తెలుసండీ!.. నేను.. రాధతో అనేకసార్లు చెప్పాను. మంచాలను వేరు చేయడం అన్నది ఆలుమగుల మధ్యన ఏ వయస్సులోను జరుగకూడదని.. కానీ ఆమె మొండిది. నా మాటలను వింటేగా పూజలు పునస్కారాలు, నోములు వ్రతాలని తన ధోరణిలో తాను వుంటుందే కాని ఆలోచిస్తేగా.. భర్తను గురించి. నలభైరెండు సంవత్సరాలకే వైరాగ్యాన్ని అలవర్చుకొని సహధర్మచారిణిగా మరిదిగారికి ఆనందాన్ని కలిగించే మాటలను కాని పనులను కాని చేయడం మానేసింది. అతన్ని గురించి పట్టించుకోవడాన్నే మరచిపోయింది” విచారంగా చెప్పింది శారదమ్మ

“వాడి బ్రతుకును బజారుపాలు చేసింది. ఆ ఒక్క విషయంలో తప్ప.. నాడు నాకన్నా అన్ని విషయాల్లో పున్నతుడు. విధి బలీయం శారదా! దాన్ని ఎవరూ ఎదిరించలేరు” విచారంగా చెప్పారు భూపతి. తన హృదయ ఆవేదన తీరేటందుకు, ఆ తలపులు మనస్సున వీడేటందుకు.. అర్ధాంగి శారదమ్మను తన అక్కున చేర్చుకొన్నారు భూపతి. పరవశంతో అతని కౌగిలిలో ఒదిగిపోయింది శారదమ్మ.

***

“వారానికి రెండు ఆదివారాలు ఉంటే ఎంతో బాగుంటుంది కదండీ..” భర్త విజయ్ కౌగిటలో వున్న జయ అంది.

“మనకు వచ్చిన వూహలన్ని ఎంతో మధురంగా ఉంటాయి జయా!.. కానీ వూహలు వాస్తవాలు కావు కదా” చిరునవ్వుతో అర్ధాంగి పరిష్వంగపు సుఖాన్ని అనుభవిస్తూ చెప్పాడు విజయ్,

ప్రస్తుతంలో వారికి యీ మధురానుభవం నెలకు ఆ నాలుగైదు రోజులే.

జయ విజయ్‌ల వివాహం జరిగి సంవత్సరం అయింది. ఇరువురూ మధ్యతరగతి కుటుంబీకులు, తల్లిదండ్రులకు మొదటి సంతానం.

జయకు ఇద్దరు చెల్లెళ్ళు.. విజయ్‌‍కు ఒక తమ్ముడు, చెల్లి. ఆ నలుగురూ దాదాపు.. ఒకే వయస్సువారు. హైస్కూల్లో చదువుతున్నారు.

జయ విజయ్‌లు హైస్కూలు టీచర్లు, ఇరువురిదీ నెల్లూరే. దూరపు బంధుత్వం కూడా వుంది. జయ బుచ్చిరెడ్డిపాలెంలో పనిచేస్తూ వుంది. ఉదయం ఏడున్నరకు బయలుదేరి స్కూలుకు వెళ్లి.. సాయంత్రం ఆరున్నరకల్లా నెల్లూరికి చేరుకుంటుంది.

విజయ్ పనిచేసేది నెల్లూరికి పడమట వున్న సోమశిల. పెండ్లికి ఆరునెల ముందు ఆత్మకూరు నుంచి అతనికి సోమశిలకు ట్రాన్స్‌ఫర్ అయింది.

ఆ స్కూలును భూపతి గజపతి గార్ల తండ్రిగారైన చలపతిరావుగారి పేర పదిహేనేళ్ల క్రిందట నిర్మించారు. పేదపిల్లలకు హాస్టల్ వసతి కల్పించారు. పై సంవత్సరం తమ స్కూల్లో డిగ్రీ కాలేజీగా మార్చాలని ఆ అన్నదమ్ముల అభిప్రాయం. ఈ విషయాన్ని గురించి జిల్లా పరిషత్ ఛైర్మన్ గారితో కూడా సంప్రదించారు. వారు ఆమోదించారు.

ప్రతి శనివారం సాయంత్రం.. విజయ్ సోమశిల నుంచి నెల్లూరికి భార్యను కలుసుకొనేందుకువచ్చేవాడు. ఒక్కో పర్యాయం జయ సెలవు పెట్టి, తాను వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ వయస్సులో ఆ దంపతులకు ఆ అగచాట్లు తప్పలేదు.

బస్టాండులో నిలబడి వున్న విజయ్‌ను చూచారు భూపతి. చేతి సైగతో రమ్మని పిలిచారు.

విజయ్ బిత్తర చూపులతో వారిని సమీపించాడు. “ఏం పంతులూ.. ఈ సమయంలో బస్టాండులో నీకేం పని?..” అడిగారు భూపతి.

“నెల్లూరికి వెళుతున్నాను సార్!..”

“అమ్మా నాన్నను చూచేదానికా..”

భార్యను కలుసుకొనేదానికి అని చెబితే.. భూపతి ఏమంటారోనని.. వారు చెప్పిన మాటే సరి అన్నట్టు తల ఆడించాడు.

“సరే జాగ్రత్తగా వెళ్లిరా..”

“అలాగే సార్”

“అవునూ! నీకు పెళ్ళయిందా లేదా?”

“అయింది సార్”

కొన్నిక్షణాల తర్వాత మెల్లగా చెప్పాడు విజయ్.

“అయితే ఆ అమ్మాయి ఎక్కడ వుంది..”

“నెల్లూర్లో సార్”

“అయితే నీవు నీ పెళ్లాన్ని కలిసేదానికి పోతున్నావన్న మాట.” సరదాగా నవ్వారు భూపతి.

సిగ్గుతో చిరునవ్వుతో తలదించుకొన్నాడు విజయ్.

“వచ్చేటపుడు ఆ అమ్మాయిని నీతో తీసుకురావయ్యా. మన ఇల్లు ఒకటి ఖాళీగా వుంది. అందులో హాయిగా వుండొచ్చయ్యా మీరు..”

“ఆమెను నాతో తీసుకురాలేను సార్..”

“ఏం.. ఎందుకు తీసుకురాలేవు!”

“ఆమె ఉద్యోగం చేస్తూ వుంది సార్.

“ఏం వుద్యోగం..”

“హైస్కూలు టీచర్ సార్..”

“ఏ వూర్లో..”

“బుచ్చిరెడ్డిపాలెంలో సార్”

“అట్టాగా..” సాలోచనగా అన్నాడు భూపతి.

“అవును సార్..” బిక్కమొఖంతో చెప్పాడు విజయ్.

బస్సు వచ్చింది.. జనం ఎక్కుతున్నారు.

“సార్.. బస్సు వచ్చింది.. నే వెళ్లొస్తాను సార్.. నమస్తే”

“ఆ.. ఆ.. వెళ్లిరా.. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను!” నవ్వుతూ చెప్పారు భూపతి,

పరుగులాంటి నడకతో విజయ్ బస్సు సమీపించి ఎక్కాడు.

భూపతి పరుగున బస్సును సమీపించారు.

“విజయ్.. నీ భార్య పేరేమిటి?..”

“యం. విజయ సార్..” కిటికీలోంచి తల బయటకు పెట్టి చెప్పాడు.

“సరే.. వెళ్లిరా..”

బస్సు కదిలి వెళ్లిపోయింది. భూపతి ఆ బస్టాండు రిపేరు వర్క్‌కు కాంట్రాక్టర్. తన జీపు ఎక్కి ఇంటివైపుకు బయలుదేరారు.

***

“ఏమండీ!.. మనం ముసలి వాళ్లం అయేవరకు మీరొక చోట.. నేనొక చోట.. మన కథ ఇలాగే సాగి పోవాల్సిందేనా!..” దీనంగా అడిగింది జయ.

“లేదు జయా.. త్వరలోనే మార్పు రాబోతూ వుంది.”

విజయ్.. తనకు భూపతిగారికి జరిగిన సంభాషణను జయకు వివరించాడు. జయకు ఎంతో ఆనందం. ప్రశాంతమైన మనస్సుతో జయ.. విజయ కౌగిలిలో మురిసిపోయింది.

***

టెన్త్ క్లాసుకు సైన్సు.. పాఠాన్ని చెబుతూ వుంది జయ.

అటెండర్ రాము వచ్చి వాకిట నిలబడి.. “ఎక్స్‌క్యూజ్ మీ మేడమ్.. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు” వినయంగా చెప్పాడు. జయ అతని వెనకాలే.. ప్రిన్సిపాల్ గదిని సమీపించింది. ద్వారం ముందు నిలబడి..

“మే ఐ కమిన్ సార్!..” అంది.

“యస్ మేడమ్.. ప్లీజ్ కమ్..”

జయ గదిలో ప్రవేశించింది.

“కూర్చోండి మేడమ్..” అన్నాడు ప్రిన్సిపాల్.

జయ వారి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ప్రిన్సిపాల్ గారు నవ్వుతూ.. “మేడమ్, మీకు మీవారుంటున్న సోమశిలకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఇదిగో ఆర్డర్..” తన చేతిలోని కవర్‌ను జయకు అందించాడు ప్రిన్సిపాల్.

జయ.. వారి మాటలను నమ్మలేకపోయింది. ఇది కలా.. నిజమా!.. సంతోషంతో కళ్లు మూసుకొంది.

“మేడమ్.. మీరు చాలా మంచివారు. దేవుడు ఎప్పుడూ మీకు మంచే చేస్తాడు. మీరు ఈ రోజే రిలీవ్ కావచ్చు..” నవ్వుతూ చెప్పాడు ప్రిన్సిపాల్.

ఆనందంగా.. వారు అందించిన కవర్‌ను అందుకొంది జయ. ప్రిన్సిపాల్ గారు రిలీవింగ్ లెటర్‌ను మరో కవరులో వుంచి ఆమెకు యిచ్చారు.

“ధన్యవాదాలు సార్!..” వినయంగా చేతులు జోడించింది.

“విష్ యు ఆల్ ది బెస్ట్ మేడమ్..” చెప్పారు ప్రిన్సిపాల్.

జయ స్టాఫ్ రూమ్‌కి వెళ్లి తన స్నేహితులకు.. తన ట్రాన్స్‌పర్ విషయాన్ని తెలియచేసింది. ప్రీతిగా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. లాంగ్ బెల్ మ్రోగింది. జయ స్కూలు భవనం ముందుకు వచ్చింది.. ఎదురుగా.. నవ్వుతూ నిలబడివున్న విజయ్‌ను చూచింది. పరవశంతో అతన్ని సమీపించి తన చేతిలోకి అతని చేతిని తీసుకొంది.

భూపతి.. జిల్లా పరిషత్తు చైర్మన్ గారితో మాట్లాడి జయను సోమశిలకు ట్రాన్స్‌ఫర్ చేయించారు. సంతానం లేని భూపతి దంపతులు వంద వివాహాలు వారి ఖర్చుతో జరిపించారు. ఎదుటివారి కళ్లల్లోని ఆనందాన్ని చూచి వారు ఆనందిస్తారు.

తమ్ముడు గజపతికి ఇద్దరు పిల్లలు, శౌరి, శరణ్య.. హైస్కూల్లో చదువుతున్నారు. వీరి పంచప్రాణాలు ఆ యిద్దరి బిడ్డలమీదనే. పేద పిల్లలను వారి పిల్లలుగా భావించేవారు.

జయ విజయ్‌లు సోమశిల చేరారు. ఆ రాత్రి భూపతి శారదమ్మలు వారిని విందుకు ఆహ్వానించారు. సరస సంభాషణతో విందు భోజనం ముగిసింది.

శారదమ్మ మూడు మూరల మల్లెపూలను జయ తల్లో తురిమింది.. “ఇదిగో!.. మీ బెడ్రూమ్ తాళం..” అంటూ అందించింది.

జయ విజయ్‌లు.. వారికి పాదాభివందనం చేశారు. వారు తమకు ఇచ్చిన యింటికి వచ్చారు. పడకగది తాళం తీశారు. వారి కళ్ళను వారు.. నమ్మలేకపోయారు.

పందిరిమంచం పూలతో అలంకరించి వుంది. పాలు, పళ్లు అన్నీ క్రమంగా టేబుల్‌పై అమర్చి వున్నాయి. తమ అదృష్టానికి జయ విజయ్‍లు అంతులేని ఆనందంతో పొంగిపోయారు. జయ సర్వాన్ని మరచి విజయ్ కౌగిలిలో ఒదిగిపోయింది.

‘నెచ్చెలి వెచ్చని కౌగిలిలో..’ తలలోని మల్లెల మత్తులో.. విజయ్ ఈ లోకాన్ని మరచి పరవశంతో సురలోక విహారం సాగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here