నేడే చూడండి (రేపుండదు)

0
14

[box type=’note’ fontsize=’16’] “మాది బ్రహ్మాండమైన సినిమా అని ప్రచారం చేసుకోండి తప్పుకాదు. కాని అవునా కాదా అని చెప్పాల్సినది ప్రేక్షకులు” అంటున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు “నేడే చూడండి (రేపుండదు)”లో. [/box]

[dropcap]ఏ[/dropcap] వ్యాపారానికైనా “ప్రచారం” అవసరం. లేదంటే వాణిజ్య ఉత్పత్తులు వినియోగదారుల దృష్టిన పడవు. వినియోగదారులకు వినోదమూ కావాలి. సగటు భారతీయుడి ప్రప్రథమ వినోదం సినిమాయే (అప్పుడు “తోలుబొమ్మ” లాటలు. ఇప్పుడు “తోలు” బొమ్మలాటలే. “తోలు”కి చాలా ప్రాధాన్యం ఉంది) ఆ వినోదానికి సంబంధించిన వివరాలు కావాలి.

“ఏయో సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. విడుదల అవుతున్నాయి… నటీనటులెవరు?” వంటి మౌలిక అంశాల నించి చిత్రం సాంఘీకమా, పౌరాణికమా, జానపదమా వంటి ఇతర అంశాల గురించిన సమాచారం గురించి ఏభై అరవై సంవత్సరాల క్రితం సగటు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాడు. అతడికి ఆ సమాచారం అంత సులువుగా దొరికేది కాదు. తమ తమ అభిమాన నటులకు సంబంధించిన “ముచ్చట్లు” తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఉవ్విళ్ళూరేవాళ్ళు. ఒకప్పుడు కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తేనే వార్త అనే వాళ్ళు. ఇప్పుడు కుక్క మనిషిని కరిస్తే వార్తే. “24 గంటలు” వార్తలూ అయినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా 24 గంటలూ మామూలు వార్తేలే కాకుండా 24 గంటలు సినిమా వార్తులు, క్రీడావార్తలు, ఆరోగ్యం, భక్తి.. ఇలా అంశాలవారీగా వార్తా మాధ్యమాలు వచ్చేసేక కుక్క కరిస్తేనే కాదు నైజీరియాలో నల్లి కుట్టినా, చిలీలో చీమ చిటుక్కుమన్నా మన డ్రాయింగ్ హాల్లో తెలిసిపోతోంది, క్షణాలలో.

అప్పట్లో సినిమారంగ వార్తలను అందిచటంలో “సినిమారంగం” అనే పత్రిక బాగా పేరు తెచ్చుకొంది. “కినిమా” “రూపవాణీలు” కూడా బాగానే నడిచాయి. రావికొండలరావుగారి సారధ్యంలో వెలువడే “విజయచిత్ర” కోసం లైబ్రరీలలో క్యూకట్టేవాళ్ళు. ఆ క్రమంలో “సినీహెరాల్డ్” “సితార” “జ్యోతిచిత్ర” “శివరంజని”… ఇంకా “సంతోషం” ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. వాటిలో ఎన్నో కనుమరుగై పోయాయి కూడా. ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా తన కంటూ ఓ ప్రత్యేకతనం సంతరించుకొన్న సితార దాదాపుగా నాలుగు దశాబ్ధాలుగా కాలనుగుణమైన మార్పులతో కొనసాగడం విశేషమే.

అయితే అప్పట్లో పత్రికలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. పత్రికా ప్రచురణ ఏదో ఒకటి రెండు ముఖ్యపట్టణాలలోనే జరగటం వలన, భౌతికంగా రవాణా చేస్తేనే కాని పత్రిక చేరడం సాధ్యంకాని పరిస్థితులలో వార్త పత్రికలే కొన్ని కొన్ని పట్టణాలకు మధ్యాహ్నానానికి కాని చేరేవి కావు. సినిమా విడుదలైనప్పుడు రిక్షాల మీద ఎడ్లబండ్లల, గూడుబండికి చుట్టూ పోస్టర్లు అతికించుకొని “నేడే చూడండి” అంటూ “దండోరా” తరహాలో ప్రచారం సాగేది. ఆ “నేడే చూడండి” అన్న ప్రచారానికే నటులు నాగభూషణం గారు “మరుసటికి ఉండదేనేమో” అన్న చురకవేశారు. సాధారణంగా చిత్రాలు శుక్రవారాలు విడుదవడం కద్దు. వార్తా పత్రికలు వెనుక పేజీలు సంస్థల, హీరోల స్థాయిని పట్టి “బ్లోఅప్” లతో విడుదలవుతున్న కేంద్రాల వివరాలతో నిండిపోయేవి. అయితే ప్రకటనలలో నిజాయితీ ఉండేది. “హిట్” అయితే “హిట్” “ఫెయిల్” అయితే “ఫెయిల్”. ఫెయిల్ అయితే “హిట్” అని భ్రమింపచేసే ప్రయత్నాలు ఉండేవి కావు. హిట్ అయితే “రెండవ వారం..” “మూడవ వారం…” అంటూ సగం పేజీలలోనూ, ఏభైవ రోజు, నూరవ రోజూ ప్రకటనలు కేంద్రలతో సహా పూర్తి పేజీలలోనూ ఇచ్చేవారు. పేజీకి కేటాయించిన స్థలాన్ని బట్టి ఆ చిత్రం పర్వాలేదా, విజయవంతమా నిర్ణయించవచ్చు. అయితే అభిమానం దురభిమానంగా మారడంతో హాలు బయట “హౌస్‌ఫుల్” బోర్డుని ప్రతిష్ఠాకరంగా భావించి లోపల జనం లేక పోయినా బయట… మోడదీయించే “ఏర్పాట్లు” చేసేవాళ్ళు. చిత్రం విడుదలైనప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో రెండు ధీయేటర్లలో విడుదలయ్యేది. రెండవ ధీయేటర్‌లో విరామం తరువాత కొనసాగేది కాదు. అపజయం పొందితే మెయిన్ థియోటర్‌లో కూడా నాలుగైదు వారాలతో తీసివేసి మళ్ళీ వేరే ధియేటర్లకి మార్చేవాళ్ళు. వీటినన్నింటిని కలుపుకొన్ని 50వ రోజు, వందవ రోజు అని వేసి ప్రక్కన బ్రాకెట్‌లో “సంయుక్త” అని వ్రాసేవాళ్ళు.

పండగలప్పడు వార్తాపత్రికలు ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ఎక్కవగా సినిమా ప్రకటనలే ఉండేవి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వార పత్రికలలో సినిమా పేజీలు ఉండేవి. ఆంధ్రప్రభలో ఘాటింగ్ జరుగుతున్న సన్నివేశాలను కవర్ చేస్తూ మాటలతో సహా వ్రాసేవాళ్ళు. “స్టిల్స్” అనేవి సినిమాలకి ఆయువు పట్టులాంటివి. నందమూరి, అక్కినేనిలు ఇద్దరూ ఒకే రకమైన డ్రస్‌లలో జేబుల్లో చేతులు పెట్టుకొని “గుండమ్మ కథ” కోసం ఇచ్చిన “స్టిల్” ఫోటోకి లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. కొన్ని స్టిల్స్‌లో నటరత్న, నటసామ్రాట్‌ల మధ్య “విశ్వవిఖ్యాత నటసార్వభౌమ” ఎస్వీఆర్ గారు ఉండేవారు. ఆ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటించడం “చాణుక్యచంద్రగుప్త” వరకు జరుగలేదు. “దురభిమానం” “పేడముద్దలు”గా రూపాంతరం చెంది పోస్టర్లను అలంకరిచేది. సాంకేతిక నిపుణులలో పబ్లిసిటీ గంగాధర్, ఈశ్వర్లు ప్రేక్షకులకి సుపరిచితులు. శతదినోత్సవ రజితోత్సవ వేడుకలు ఘనంగానే జరిగేవి. ఆడియో విడుదల సభలను ఇప్పుడే చూస్తున్నాం. అభిమానుల ఉత్తరాలకు బదులుగా తమతమ ఫోటోలను పంపేవారు అగ్రనటులు. సాధారణంగా యత్రా స్పెషల్స్ అన్నీ తిరుపతి నుంచి మద్రాస్‌లో నందమూరి ఇంటికి వెళ్ళేవి. ఆయన కూడా అందిరిని “ఏం బ్రదర్” అంటూ పలకరించి ఆనందపరిచేవారు. వార్తాపత్రికల తరువాత ఆకాశాణియే ప్రముఖ మాధ్యమం. ఆదివారం మధ్యాహ్నం సంక్షిప్త శబ్దచిత్రాలను మూడు గంటల సినిమాను గంటకు కుదించి ప్రసారం చేసేది. వివిధభారతిలో ఎక్కువగా హింది పాటలే వచ్చేవి. డెబ్భైల నుంచి జనరంజని వంటి కార్యక్రమాలలో తెలుగు పాటలకు “నిడివి”ని పెంచడం మొదలైంది. శనివారం జనరంజని కార్యకమంలో ప్రముఖుల ఇంటర్వులుండేవి. ఒకసారి తొలిసారిగా గాయని సుశీలతో ఇంటర్వూని ప్రకటించినప్పుడు ఆ గాన కోకిల మాటలు ఎలా ఉంటాయోనని జనం రేడియోలకతుక్కుపోయారు. నిజానికి నాగేశ్వర్రావు వంటి దిగ్గజాల జీవిత విశేషాలను అప్పటికన్నా ఇటీవలనే ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడా అవకాశం లేదు. అందుకే దేవత సినిమాలో పద్మనాభం మద్రాస్‌లో సినిమా వేషాలకోసం సినీనటుల చుట్టు తిరిగే సన్నివేశాలను జనం అపురూపంగా చూసారు. “ఎస్వీఆర్, జములను బయట ఇలా ఉంటారా?” అనుకొంటూ అబ్బురపడ్డారు.

70వ దశబ్దం నుంచ “ప్రచారం” ఊపందుకొంది. తొలినాళ్ళలో అగ్రనటుల పేర్లు మాత్రమే తెలిసేవి. టైటిల్స్‌లో చివరన నిర్మాత పేరు బదులుగా దర్శకుని పేరు వచ్చేది. పోస్టర్స్‌కు టాప్ క్నార్న్‌లో “కె.విశ్వనాథ్”, “దాసరి నారాయణరావు” పేర్లుతో దర్శకునికీ ప్రత్యేకతను సంతరించుకోనేవి, అప్పట్లో ప్రచారం తొలి లక్ష్యం పంపిణీదారులే “శ్రీ ఫిలింస్” “పూర్ణా” “నవయుగా”… ఇలా ఎన్నో. పంపిణీదారుడిని బట్టి చిత్రం విజయవంతం అవుతుందా లేదా అని అభిమానులు అంచనాలు వేసుకొనేవారు. విడుదల రోజున అభిమానం “పాలు” పొంగి కటౌట్లమీద కురిసేది. శతదినోత్సవం, రజతోత్సవ సభలు ఘనంగా జరిగేవి. నటీనటులను దగ్గరగా చూడగలిగే అవకాశాలు ఇస్తే తిరుపతిలో “దసరా బుల్లోడు” విజయోత్సవ సభలో అపశ్రుతులు కూడా జరిగాయి.

సినిమా “నిజం” కాదు, ఓ అందమైన అబద్దం అని అందరికీ తెలిసినా సినిమాల మీద, సినీ నటుల మీద వ్యామోహం అంతే పెరుగుతోందనే చెప్పాలి. నటులు అభిమానులు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకోవటం సహజమే. నటుల పట్ల “ఆరాధనా” భావం చెడ్డది కాకపోయినా “హద్దు”లో ఉండటం చాలా అవసరం. అభిమానంలో స్వచ్ఛత ఉండాలి. ప్రముఖ నటుల చిత్రాలు విడుదలైనప్పుడు హడావిడి కనబడుట సహజం. కాని క్రొత్త నటులకి ముఖ్యంగా కుర్రహీరకోల సినిమా అభిమానుల తాకిడి అసమజంసం. ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండానే అభిమానించే నటుడెలా అయ్యాడు అన్నది తర్కానికి అందదు. ఆ నటుడు ఎవరో ఒక నటుని కుమారుడవడమే కారణం. ఈ మధ్య కొన్ని కార్యక్రమాలకి పెయిడ్( PAID) అని ప్రస్తావించటం జరుగుతోంది. అంటే ఇది కూడా ఓ రకంగా “PAID FOLLOWING” అని చెప్పక తప్పదు. ఇప్పుడు పెద్ద సినిమాలన్ని ఉన్న అన్ని థియేటర్లులోనూ విడుదలవుతున్నాయి. అంటే సినిమా చూడాలనుకొని బయలుదేరిన ప్రేక్షకుడు “ఆ సినిమా” కోసమే కాకపోయినా “ఆ సినిమానే” చూడల్సి వస్తోంది. “ఒక వేళ” సినిమా బాగలేదు అనేదే సమీక్ష అయితే ఆ వార్త పొక్కే లోపునే. ఎక్కువమంది “చూసేలా“ చేయ్యాలన్నదే నిర్మాతల అభిప్రాయంగా కనబడుతోంది. సినిమాల విడుదలలు కాడా వార్తలలో ముఖ్యాంశాలుగా తీసుకోబడుతున్నాయి. ఇంక విడుదల రోజున ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఫస్ట్‌షో చూసి వస్తున్న కుర్రాళ్ళకు మైకు ఇచ్చి ఎలా ఉందని అడుగుతారు. అసలు ఫస్ట్ ఆటకు వచ్చారంటేనే అందునా కుర్రకారు… వెర్రి అభిమానులే అవుతారు… వాళ్ళను అడిగితే “సూపర్ ” “కత్తి” అంటూ వ్యాఖ్యానాలు చేయ్యడం మామూలైపోయింది. ప్రజాభిప్రాయం తీసుకోవడం తప్పు కాదు. కాని మైక్ ఇచ్చేముందు ప్రసారం చేసే ముందు వ్యాఖ్యాతల “విజ్ఞత”ను పరిశీలించాలి. “నోరు విప్పటం” “గొంతు తెరవడం” ప్రజాస్వామ్మమే కాని నోటికొచ్చినట్లు మాట్లాడటం ప్రజాస్వామ్యం కాదుగా. ఇంక విడుదల తేది మొదలు ఆ హీరో హీరోయిన్స్, నిర్మాత, దర్శకులు ఆ సదరు సినిమాని తియ్యడానికి ఎన్ని పాట్లుపడ్డారో వివరించటం మొదలు పెడతారు. చిత్రం విజయం సాధిస్తే విజయ యాత్రలు… కాస్త అటు ఇటుగా ఉంటే “ప్రమోషన్” ప్రయత్నాలు. టి.విలో వాళ్ళే.. బయటకెడితే ఏ థియేటర్‌లో చూసినా అదే సినిమానే. ప్రేక్షకుడికి ఛాయిస్ లేకుండా పోతోంది. గతంలో మేం ఓ మంచి సినిమాని తీసాం.. “నేడే చుడండి” “తప్పక చూడండి” అని ప్రకటించే వాళ్ళంతే. ఇప్పుడు “సినిమాలే కాదు నటులు” కూడ ప్రేక్షకుల మీద రుద్దుబడుతున్నారు. “ఇదే సినిమా”, “వీడే నటుడు” అన్న చందాన ఉంటోంది వ్యవహారం. సినిమా తప్ప వేరే వ్యాపకం తెలియని ప్రేక్షకుడు చూడక చస్తాడా? ఒక్కోసారి ఆ ఇంటర్వూలు అనుభవజ్ఞులైన నటులు దర్శకులతో చేసిన బాగుంటుంది. చేసింది ఒక్క సినిమా… నిన్నటి వరకు ఎవరో తెలియదు. రేపు ఇంకో సినిమా చేస్తారో లేదో తెలియదు. “ఊపు” మీద ఓ నాలుగైదు సినిమాలు చేసినా ఓ నాలుగేళ్ళ తరువాత కనబడతాడన్న గ్యారంటీ లేదు. వాళ్ళ అనుభవాలని మనం వినాలి! వినక తప్పటం లేదు. కేవలం ఒక సినిమా చేసిన వాడు నటుడు కాదని వారితో ఇంటర్వూలు సరికాదని ఈ వ్యాస రచయిత ఉద్దేశం కాదు. నాటికి నేటికీ ప్రచార సాధనాలలో వచ్చిన మార్పులని పరిశీలించటమే ఉద్దేశం. గతంలో ఇటు వంటి అవకాశాలు రామారావు, నాగేశ్వర్రావులకే కాదు… వారి వారసులకు కూడా తొలినాళ్ళళ్ళో లేవు. నాటి మేటి నటుల అనుభవాలని అభ్రిప్రాయాలని ఈ రీతిన వినే అవకాశం అప్పట్లో లేదు. సాంకేతికత తెచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోమని చెప్పటమే లక్ష్యం. వ్యాఖ్యానించటానికి “అర్హత” ఉండాలి. వ్యాఖ్యానం “ప్రభావం” చాలా రకాలుగా ఉంటుంది. అందుకే కదా ప్రకటనలలో ప్రముఖుల చేత తమతమ వస్తువులని వాడమని చెప్పింస్తుంటారు. నూటికి నూరు శాతం అన్నీ అందరకీ నచ్చవు. డెబ్భైశాతం ప్రజలైనా అంగీకరించే విధంగా సమీక్షలుండాలి. క్రొత్త వాళ్ళది నటన కాదని మంచి సినిమాలు రావటం లేదని చెప్పటం లేదు. కాల్ షీట్లు దొరకాయని కాలి షీట్లు ఇచ్చిన నటులని దృష్టిలో పెట్టుకొని రీల్స్ చుట్టేయడానికి, స్క్రిప్ట్ మొత్తం సిద్దం అయ్యాకే ఏ పాత్రకి ఎవరు న్యాయం చెయ్యగలరని ఆలోచించి చిత్రాన్ని తెరకెక్కించటానికి చాలా తేడా ఉంది. ఎన్టీరామారావుగారిని దృష్టిలో పెట్టుకొని “పాతాళభైరవి”లోని “తోటరాముడు” పాత్ర సృష్టించబడలేదు. అప్పటికే నాగేశ్వరరావుగారు జానపద కథానాయకుడుగా వెలుగుతున్నారు. స్టార్ కదా అని ఆయననూ అనుకోలేదు. కాకతాళీయంగా ఓ సాయంత్రం ఆ అగ్రనటులిద్దరూ టెన్నీస్ ఆడుతుంటే వారి కదలికలను బట్టి తోటరాముడి పాత్రకు రామారావుని నిర్ణయించడం జరిగిందట. పాత్రల ఎన్నికల విషయంలో దర్శకనిర్మాతలే కాదు నటులు కూడా విజ్ఞతను పాటించేవారు. శ్రీకృష్ణుని పాత్రకు తాను తగనని ఎన్టీఆర్నే తీసుకొమ్మని అక్కినేని గారు చిత్రాలను వదులుకొన్నారు కూడా.

విలువలు అన్ని రంగాలలోను పడిపోతున్నాయి. సినిమాలు కాబట్టి “వలువలు” కూడా చిన్నవైపోతున్నాయి. అది వేరే విషయం. పెరుగుతున్న సాంకేతికత ఎల్లలను జరిపేస్తోంది. గతంలో చిత్రం రీలీజైనప్పుడు విజయవాడ ప్రేక్షకుల స్పందన కోసం చూసేవారు. విజయవాడలో ఆడితే అన్ని చోటలా ఆడుతుంది. కొన్ని చిత్రాలు మిగతా చోట ఆడకపోయినా విజయవాడలో బాగా నడిచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు విడుదల రోజున అమెరికా ప్రేక్షకుల స్పందన కూడా తీసుకోవలసివస్తోంది. ఎంత హడావుడి చేసినా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టినా తొలిసారిగా కొటిరూపాయలు వసూలు చేసిన తెలుగు సినిమా “మేగ్నమ్ ఓపస్”గా చెప్పుకోదగింది “లవకుశయే” నేటి వందకోట్లకన్నా నాటి “కోటి”కే విలువ పెచ్చు. స్వచ్ఛందంగా బళ్ళు కట్టించుకొని వెళ్ళి మరీ చూసారు జనాలు. ప్రక్షకులకే ఛాయిస్ లేకుండా చేసి వార్తపత్రికలలో టివీ ఛానెళ్ళలో ఊదర కొట్టి ఎటు చూసినా ఆ సినిమాయే కనబడేటట్లు చేసి కోట్లు సంపాదిస్తే “కొల్లగొట్టడం” అన్నదే సరైన పదం. కొల్లగొట్టే వారిని దొంగలంటారనుకొంటా. అవును వందల కోట్లు ఖర్చు పెట్టారు, రాబట్టడానికి పథకాలు వేసేరు. కాని ఈ క్రమంలో చిన్న నిర్మాతలు కొట్టుకు పోతున్నారు ధియేటర్లు లేక. కొన్ని సినిమాలు బాగున్నా ఇంకా ఆడుతున్నా మరిన్ని రోజులు ఆడగలిగినా థియేటర్ల నుంచి ఖాళీ చెయ్యాల్సి వస్తోంది కొందరు వాపోతున్నారు. “బ్రతుకు బ్రతికించు” అన్నది లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే తపన గలిగిన మంచి దర్శకులున్నారు. డబ్బుకు లోటు లేదు. డబ్బు రాబట్టుకోనే తెలివి తేటలున్నాయి. మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. “భారీ” సినిమా మాత్రమే మంచి సినిమా కాదుగా. చిన్న దర్శకులు, నిర్మాతలు కూడా మంచి సినిమాలు తీయాగలరుగా. మాది బ్రహ్మాండమైన సినిమా అని ప్రచారం చేసుకోండి తప్పుకాదు. కాని అవునా కాదా అని చెప్పాల్సినది ప్రేక్షకులు. అంతిమ తీర్పు ప్రేక్షకులదే కావాలి. ఎంత మభ్యపెట్టినా, మీ సినిమాని మాత్రమే చూసేటట్లు నిర్బంధించినా ప్రేక్షకులే విజేతలు. గుర్తు పెట్టుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here