నేడేదీ ఆ శ్రేయో చింతన?

0
7

[dropcap]టీ[/dropcap]కాల ప్రక్రియ ఆరంభమైన తరువాత 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు ఏటా 30 లక్షల వరకు తగ్గాయని అంచనా. పేద దేశాలలో కూడా టీకా ప్రక్రియను పటిష్ఠవంతంగా అమలు పరిస్తే ఇంకో 15 లక్షల వరకు మరణాలను తగ్గించ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

ప్రపంచ ఆర్ధికం రీత్యా చూసినా 2½ లక్షల కోట్ల ఖర్చుతో 94 దేశాలలో – పది రకాల వాక్సిన్లు వేయడం ద్వారా ఆదా అయిన మొత్తం 44 లక్షలకు పై మాటే.

ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకా రూపొందించి ఫలితాలు బావున్నాయని నిర్ధారణ అయ్యాక మరింత తయారు చేసి ఉచితంగానే పంచాడు. పెద్ద పేరు, కీర్తి, బోలెడు అవార్డులు వచ్చాయి. అయినా తన టీకా ద్వారా సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనకే అతడు తావు ఈయలేదు. ధనార్జన కోసం ప్రయత్నించలేదు. మశూచి నిరోధకత ప్రయోగం, వినియోగంపై పుస్తకాన్ని వ్రాసి స్వంతంగానే ప్రచురించాడు. ఆ పుస్తకం అనేక భాషలలోకి అనువదింపబడగా అనేక మంది వైద్యులు ఆ విధానాన్ని అవలంబించి మశూచిని పారద్రోలడంలో తమ వంతు గానూ కృషి చేశారు. జెన్నర్ జీవితాంతం మసూచి టీకాను ఉచితంగానే వేశాడు. క్రమేపీ మసూచి వ్యాధిని అరికట్టగలగడం జరిగింది. ఒక మహమ్మారి నుండి మానవాళిని కాపాడిన జెన్నర్ జీవితమంతా అతి నిరాడంబరంగా గడపడం ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం.

పోలియో:

రెండవ ప్రపంచయుద్ధం అనంతరం రష్యాలో పోలియో తీవ్ర స్థాయిలో విజృంబించింది. అప్పటికే అంటు వ్యాధుల నివారణ దిశగా విశేషంగా కృషి జరుగుతోంది. ఎంతో కాలంగా ఆ దిశగా కృషి చేస్తున్న మైఖయేల్ ఛుమకోవ్‌ను రష్యా ప్రభుత్వం ఎంచుకుంది. ఛుమకోవ్ భార్య కూడా (మరినా ఒరోషిలోవా) ప్రముఖ పరిశోధకురాలే. రష్యన్ ప్రభుత్వం ఛుమకోవ్ ఆధ్వర్యంలో/పర్యవేక్షణలో అంటు వ్యాధుల నివారణ దిశగా ఒక సంస్థను నెలకొల్పింది. 1950లలో రష్యా ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఆ సంస్థ, ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు వహించిన మిఖయేల్ ఛుమకోవ్ పోలియో వేక్సిన్ అందుబాటులోనికి రావడంలో ముఖ్యపాత్ర వహించారు.

అప్పటికే అమెరికాలోని ‘ఓహియో’లో ఛుమకోవ్ సమకాలికుడే అయిన అల్బర్ట్ సబిన్ పోలియో వేక్సిన్‌ను రూపొందించాడు. పరీక్షలలో భాగంగా 30 మంది ఖైదీలపై ప్రయోగించడమూ జరిగింది. జీవసహిత పోలియో వైరస్‌ను తగుమోతాదులో ఇస్తే పోలియోను మరింత సమర్ధవంతంగా అరికట్టవచ్చని అల్బర్ట్ సబిన్ పరిశోధనలు నిరూపించాయి. ఆ వ్యాక్సిన్ నోటి ద్వారా ఈయవచ్చు. అది మరొక సౌలభ్యం. సబిన్ వ్యావహరిక నామంగా కల అల్బర్ట్ సబిన్ ‘అబ్రహం సాపెర్‌స్టీన్’గా కూడా సుపరిచితుడు.

అప్పట్లో ‘సాక్’ వాక్సిన్‌ను ‘కట్టర్’ షార్మా పెద్ద ఎత్తున తయారు చేసింది. ఆ తయారీ ప్రక్రియలో జరిగిన పొరపాటు కారణంగా వాక్సిన్ ట్రయిల్ ఫలితాలు బెడిసికొట్టాయి. ఆ నేపధ్యంలో అమెరికన్ మెడికల్ రిసెర్చి సెంటర్ ‘క్లినికల్ ట్రేయల్స్’ను కఠినతరం చేసింది. సాక్ వాక్సన్ పరీక్షలకు సంబంధించి 1956లో జరిగిన సదస్సులో ఛుమకోవ్, సబిన్‌లు కలుసుకోవడం జరిగింది. ఆ పరిచయం స్నేహంగా మారింది.

అయితే అప్పట్లో వ్యక్తిగత, దేశ ప్రయోజనాలకంటే మానవాళి శ్రేయస్సుకు పెద్ద పీట వేయబడిన రోజులు. ఆఖరి దశ వరకు వచ్చిన సబిన్ పోలియో వాక్సిన్‌ను ప్రయోగించి ఫలితాలను పరిశీలించడానికి – అమెరికాలో ‘సాక్ వాక్సిన్’ బెడిసికొట్టడంతో కఠినతరం చేసిన నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఆ పరిస్థితులలో సోవియట్ యూనియన్‌లో పోలియో చుక్కల వాక్సిన్ ప్రయోగాలకు మిఖయేల్ ఛుమకోవ్ విశేషంగా కృషి చేసి ప్రభుత్వం అనుమతులు సంపాదించాడు.

ఛుమకోవ్ ఆతని భార్య మరినా ఒరోషిలోవా ఆ వాక్సిన్ చుక్కల మందును మొదటగా తమ బిడ్డలకే వేశారు. ట్రయల్స్ తీరు తెన్నులు, ఫలితాలను పరిశీలించడానికి 1959లో సబిన్‌ను రష్యా ప్రభుత్వం ఆహ్వనించింది. ఫలితాలను పరిశీలించిన సబిన్ సంతృప్తిని ప్రకటించడంతో 1960 నాటికి 7 కోట్ల 70 లక్షల మందికి వాక్సిన్ ఈయడం జరిగింది. అందరూ 20 సంవత్సరాలు మించని వారే. ఫలితాలు బాగుండటంతో 60ల నుండి అమెరికాలో కూడా పోలియో ఓరల్ వాక్సిన్ పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చింది. 1963లో సోవియట్ ప్రభుత్వం ఛుమకోవ్‌ను అత్యున్నత పురస్కారంతో సత్కరిస్తే ఆ గౌరవం సబిన్‌కు కూడా చెందుతుందని అతడు బాహాటంగా ప్రకటించాడు. అమెరికాకు కృతజ్ఞత తెలిపాడు. సబిన్/అబ్రహం సాపెర్‌స్టేన్, మిఖయేల్ ఛుమకోవ్ సంయుక్త కృషి కారణంగా ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలు (ఇంచుమించుగా) పోలియో నుండి విముక్తి పొందాయి.

అలా రెండు పెద్ద దేశాలు, వేరు వేరు సిద్ధాంతాల ప్రాతిపదికన నడుస్తున్న ఆ దేశాల ప్రభుత్వాలు, ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న వాతావరణంలో సైతం మానవాళి శ్రేయస్సుకై కృషి చేస్తున్న శాస్త్రజ్ఞులను దేశాల రాజకీయ సిద్ధాంత వైరుధ్యాలకు అతీతంగా గుర్తించి గౌరవించడమే కాక యథాశక్తి సహకరించాయి. వారి పరిశోధనా ఫలితాలను, నిర్వహణా పద్ధతులను, సమాచారాన్ని రెండు దేశాలూ పంచుకున్నాయి. ఏన్నో సంవత్సరాలు శ్రమించి తాను రూపొందించిన పోలియో వాక్సిన్‌పై సబిన్ పెటెంట్‌ను తీసుకోలేదు. ఏ మాత్రం ధనాపేక్ష లేకుండా సర్వహక్కులూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దాఖలు పరిచాడు. ఆ కారణంగానే పోలియో ఓరల్ వాక్సిన్ అతి తక్కువ ధరలో లభ్యమోతుంది.

పోలియో నివారణలో సబిన్, ఛుమకోవ్‌ల కృషితో పాటుగా అమెరికా రష్యా ప్రభుత్వాల పాత్ర విస్మరించలేనిది.

ప్రస్తుతం:

పెన్‍సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధనల పరిజ్ఞానాన్ని బయోన్‌టెక్, మోడర్నాలు వాక్సిన్ల తయారీలో వాడుకుంటున్నాయి. ఆ సాంకేతిక పరిజ్ఞానంపై పేటెంట్ హక్కులు తానే ఉంచుకుని పెన్‍సిల్వేనియా యూనివర్సిటీ ఆ కంపెనీలకు ఉప లైసెన్సులు మాత్రమే ఇచ్చింది.

1970లో రూపొందింపబడిన మన పేటెంట్ చట్టాలు 1971 నుండి అమల్లోకి వచ్చాయి. వాటిలోని సెక్షన్లు 92, 100, 102ల ప్రకారం ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కంపెనీలకు కంపల్సరీ లైసెన్సులు ఈయగల వెసులుబాటు ఉంది. లాభాపేక్ష గురించి కాక కేవలం ఆరోగ్య ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనడానికై ఏ మందునైనా తయారు చేయడానికి ఈ అనుమతులు కంపెనీలకు వెసులు కల్పిస్తాయి. ప్రపంచ వాణిజ్యం ఒప్పందంలోని ‘ట్రిప్స్’ సైతం దీనికి అంగీకరించింది. మన దేశంలో సుప్రీంకోర్టు హైకోర్టులు సైతం కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కంపెనీలను కంపల్సరీ లైసెన్సులు మంజూరు చేయాలని సూచించాయి.

కంపల్సరీ లైసెన్సింగ్ గురించి నాట్కో ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నది కూడా. కొన్ని నెలల క్రిందట ‘రెమిడిసివర్’ను కోవిడ్ చికిత్సలో వాడుతున్నప్పుడు దానికి కొరత ఏర్పడింది. ధరలు చుక్కలనంటాయి. రెండు కంపెనీలు అత్యవసర అనుమతుల కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (C.D.S.C.O)కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

కోవిడ్ – 19 నాటికి మారిన ప్రపంచ వాతావరణం:

వివిద దేశాలకు చెందిన 250 కంపెనీలు టీకాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే ముడి సరుకు కొరత, టీకా తయీరీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందివ్వడానికి ఫార్మా కంపెనీలు సుముఖంగా లేకపోవడం వంటి అంశాలు కోవిడ్ వేక్సిన్ ఉత్పత్తిని అధిక మొత్తంలో చేపట్టడానికి అడ్డంకిగా మారుతున్నాయి. నిధులు అందించి ఆర్డర్లు బుక్ చేసుకుంటే వాక్సిన్ కంపెనీలు ఉత్పత్తి చేయగలుగుతాయి. 35  కోట్ల డోసుల ఉత్పత్తికి అవి సిద్ధంగా ఉన్నాయి. 400 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం అవుతాయి.

టీకాల తయారీలో 8 సంవత్సరాల మించి అనుభవం ఉన్న ‘కెనడా బయోలైజ్‌’కు జాన్సన్ అండ్ జాన్సన్ తన టీకా తయారీకి అనుమతి ఈయలేదు. అమెరికాకు చెందిన పైజర్ కంపెనీ టీకా సప్లైలు కావాలంటే అమెరికాకు మిలటరీ బేస్‌లు కావాలని బ్రెజిల్, అర్జెంటీనాలతో బేరం పెట్టడం లేదా షరతు విధించడం తెలిసిందే. అదే పైజర్ చైనాలో ‘ఫాసూన్‌’కు లైసెన్సు ఇచ్చింది. మందుల కంపెనీల గుత్తాధిపత్యానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు దేశాల రాజకీయాలను శాసిస్తున్నాయి.

అనేక దేశాలలో వైద్య వ్యవస్థ చాలా శక్తిమంతంగా ఉంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు సేవలలో పాలు పంచుకోకుండా ఉండటానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తోంది. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వాల ఖర్చు ప్రపంచ సగటు జి.డి.పిలో 5.4%. మన దేశంలో ఆరోగ్య రంగంపై ఖర్చు జి.డి.పిలో 1.5%. దానిని 2.5 శాతానికి పెంచాలన్న ఆలోచన రావడం మంచి పరిణామామే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here