నీది కాని నేను

0
12

[dropcap]“చూ[/dropcap]డండి రాజారావు గారూ.. మీరెన్ని చెప్పినా నేనామెతో కలిసి కాపురం చెయ్యటం జరగదు. అరె!! నాకామె అంటే ఇష్టం లేదని చెబుతుంటే ఎవరూ వినిపించుకోరేం? ఎప్పుడో నా  చిన్నప్పుడు మా నాన్న, మామయ్యకి మాటిచ్చాడని, నాకు ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా, సుశీలని పెళ్లిచేసుకోవడానికి బలవంతంగా ఒప్పించారు. నాన్న పోరు పడలేక ఈమె మెడలో తాళి కట్టాను. ఈమె రాకతో మాకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. పెళ్లయిన రోజునే మా నాన్నని పరలోకానికి పంపించేసిన ఈమె ముఖం చూస్తేనే నాకు ద్వేషం కలుగుతోంది. నేనీమెని తాకింది లేదు. ఇప్పటికైనా విడాకులు తీసుకుని, తనకి నచ్చినవాడిని పెళ్లి చేసుకోమనండి. కావాలంటే భరణంగా నెలకి పదివేలు చొప్పున పంపిస్తాను. నాకొచ్చే జీతానికి ఆ మాత్రం ఇవ్వడం కూడా ఎక్కువే” నిష్కర్షగా చెప్పేసాడు భాస్కర్.

“అలా అనొద్దు బావా! నువ్వు తప్ప నాకెవరున్నారు? మావయ్య గుండె ఆగి చనిపోతే దానికి నేనేం చెయ్యను? నాది నష్ట జాతకం అనుకోవడానికి, నా వల్ల పుట్టింటివాళ్ళకి జరిగిన అనర్థమేదీ లేదు. నేను పుట్టాకే నాన్నకి అన్నీ కలిసొచ్చాయట. ఇప్పుడు నువ్వు వెళ్లిపోమన్నావని పుట్టింటికి తిరిగి వెళ్లిపోతే, నా తరువాతి ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి కాదు. మా అమ్మా, నాన్నలకి నేను భారం కాలేను. కష్టమైనాసరే.. ఓ పని మనిషిగానైనా సరే ఏదో ఓ మూల పడుంటాను. ప్లీజ్! నాకు విడాకులివ్వొద్దు” బ్రతిమాలుతోంది సుశీల.

“ఈ రెండేళ్లు నిన్ను భరించినదే ఎక్కువ. ఇక నావల్ల కాదు. నీపై నాకు ఎలాంటి ఇష్టం కలగలేదు. నన్ను విసిగించొద్దు. నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది” కరాఖండిగా చెప్పేసాడు భాస్కర్.

తప్పనిసరి పరిస్థితుల్లో భాస్కర్‌కి దూరంగా వెళ్లిపోయింది సుశీల. కానీ పుట్టింటికి మాత్రం తిరిగివెళ్లలేదు. తాను చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం వెతుక్కుని, తన కాళ్ళ మీద తాను నిలబడింది. మళ్లీ పెళ్లి చేసుకున్న భాస్కర్ అదే ఊళ్ళో కొత్త పెళ్ళాంతో కాపురం పెట్టాడు.

***

ఇద్దరు పిల్లలు కలిగాక, పదేళ్లు కాపురం చేశాక, భాస్కర్ రెండో భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన భర్త స్నేహితుడైన తరుణ్ మాయలో పడి, ఇంటినీ, పిల్లల్నీ, భర్తనీ నిర్లక్ష్యం చెయ్యడం మొదలుపెట్టింది. నయానా భయానా నచ్చచెప్పి, భార్యని దారిలోకి తెచ్చుకోవాలనుకున్న భాస్కర్, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో  విసిగిపోయాడు. సమస్యను తట్టుకోలేక తాగుడికి బానిసయ్యాడు. నిత్యం తగువులతో ఇల్లు నరకంగా మారింది. పిల్లల ఎదురుగానే తరచూ గొడవపడడం వల్ల పిల్లల మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది. తల్లి దగ్గరకీ, తండ్రి దగ్గరకీ కూడా వెళ్లడం మానేసారు.

ఒకరోజు పిచ్చివాడిలా కళావిహీనంగా మారిన భాస్కర్ అనుకోకుండా తారసపడడంతో, అతని వాలకం చూసి, జరక్కూడనిదేదో జరిగుంటుందని భయపడింది సుశీల.

“బావా! ఏమిటిది? ఎందుకిలా అయిపోయావు!?” కన్నీళ్లతో ఆమె పలకరించేసరికి, మొహం చెల్లక పక్కకి తిప్పుకున్నాడు.

తనకి జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకోకుండా, ఆత్మీయంగా పలకరించిన సుశీల కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు. ఒక్కసారిగా తన గుండెల్లో బాధనoతా ఆమెకి చెప్పుకోవాలనిపించినా, సంశయంతో ఆగిపోయాడు.

చనువుగా చెయ్యి పట్టుకుని, తాను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లింది సుశీల. అతనికిష్టమైనవన్నీ వండిపెట్టి ప్రేమగా తినిపించింది. ఇబ్బంది పడుతూనే భోజనం పూర్తయ్యిందనిపించాడు భాస్కర్. చీకటి పడుతుండడంతో పిల్లలు గుర్తొచ్చి, ఇక నేను వెళ్తాను అంటూ లేచి, ఇంటిముఖం పట్టాడు.

మర్నాడు సుశీల ఆఫీసు నుంచి వచ్చేసరికి, గేటు ముందు భాస్కర్ నుంచుని ఉండడం గమనించి, లోనికి రమ్మని ఆహ్వానించింది. అలా తనకి మనసు బాగాలేని ప్రతిసారీ సుశీల ఇంటికి వెళ్లి కాసేపు కూచునేవాడు భాస్కర్.

కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే తనని ఓదార్చే సుశీల దొడ్డ మనసుకి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ఈమెని నేనెందుకు దూరం చేసుకున్నాను?’ అని తనలో తానే మథనపడసాగాడు.

పిల్లలిద్దరికీ స్కూలు  సెలవులు రావడంతో వారిని అమ్మమ్మా, తాతయ్యల దగ్గర వదిలి వచ్చాడు భాస్కర్. మనసు బాగలేక సాయంత్రం నేరుగా సుశీల ఇంటికి వెళ్ళాడు. ఆమె ముభావంగా ఉండడం గమనించి, “ఏమయ్యింది సుశీలా? ఎందుకలా ఉన్నావు?” అని అడిగాడు.

“బావా! ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోకు. నేనిక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాను. నువ్విలా పదే పదే వచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు పది రకాలుగా అనుకుంటున్నారు. ఇక మీదట ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి.. నీ మనసుకి ఊరటనిచ్చే నా మాటలు నీకెప్పుడూ తోడుంటాయి” ఇక అక్కడికి రావొద్దన్నట్టు చూచాయగా చెప్పింది సుశీల.

ఆమె మాటల్లోని భావాన్ని గ్రహించిన భాస్కర్ లేచి వెళ్లిపోబోయాడు. తల తిరిగి, నుంచున్నచోటే కూర్చుండిపోయాడు. కంగారుగా అతన్ని పట్టుకుని పడకుండా ఆపిన సుశీల, దగ్గరగా రావడంతో, ఆమె మీదకి వాలిపోయాడు భాస్కర్. తన చుట్టూ బలంగా అల్లుకుంటున్న అతన్ని దూరంగా నెట్టేసి, కోపంగా చూస్తూ వెళ్లిపోమన్నట్టు చేత్తో బయటకి చూపించింది సుశీల.

ఆ క్షణం ఆమె గుండెల్లో ఒకటే కలవరం.. ‘తల్లీ, తండ్రీ ఇద్దరూ గాడి తప్పితే, ఆ పిల్లల భవిష్యత్తేమిటి?’ ఇలా అనుకున్నాక ఎందుకో స్థిమితంగా వుండలేకపోయింది. ఇక మీదట భాస్కర్‌ని తన దగ్గరకి రానివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పుడే ఆమెకి సమస్యను ఎలా పరిష్కారించాలో బోధపడింది. వెంటనే తరుణ్ భార్యని కలిసింది.

***

“అమ్మా! సుశీలా!! ఊరు విడిచి వెళ్లిపోతూ భాస్కర్ ఈ లెటర్ నీకిమ్మని చెప్పాడమ్మా!” అంటూ రాజారావు గారిచ్చిన లెటర్ తీసుకుని గబగబా చదవడం మొదలు పెట్టింది సుశీల.

సుశీలా!

ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలో పరిపూర్ణమైన ఉదాహరణగా నిలిచిన నిన్ను కాదనుకున్న నేను ఎంత దురదృష్టవంతుడినో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నీకు నేను చేసిన అన్యాయం క్షమించరానిది. అయినా పెద్ద మనసుతో నన్ను క్షమించావు. నాకు తెలుసు.. నీ మనసులో నా పట్ల ఇంకా అనురాగం ఉంది. లేకపోతే నా సంసారం చక్కదిద్దాలని నువ్వింతగా తాపత్రయపడవు. ఒక భర్తగా నీకు జీవితాన్నివ్వలేకపోయాను.. కానీ నీ బావగా అడుగుతున్నాను.. ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఒక్కసారి మా ఇంటికి వస్తావు కదూ!

నీ గౌరవానికి భంగం కలిగేలా నీ ఇంటికి నేను రాను. కానీ నా కాపురాన్ని నిలబెట్టిన దేవత ఎప్పుడూ నా మనసులో పూజలందుకుంటూనే ఉంటుంది. నన్ను మన్నిస్తావన్న ఆశతో..

నీ బావ,

భాస్కర్.

ఉత్తరాన్ని చదివిన ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ‘నీలో ఈ మార్పు పదేళ్ల క్రిందటే వచ్చి ఉంటే ఎంత బాగుండేది బావా!’ గుండెలకి హత్తుకున్న కాగితంపై అక్షరాలు ఆమె కన్నీటికీ తడిసి ముద్దవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here