కథే హీరో అయిన-నీదీ నాదీ ఒకే కథ.

    5
    4

    తెలుగులో మంచి సినెమాలు రావడంలేదు అని వింటూ వుంటాం. ఇదిగో అప్పుడప్పుడు ఇలా వచ్చే సినెమాలు కొత్త ఆశలను రేపుతాయి. ఈ వారం చూసిన “నీదీ నాదీ ఒకే కథ” లో వాస్తవానికి హీరో కథే. యెలాంటి ఆర్భాటాలకు పోకుండా కథ చెప్పిన తీరు. కారణం అతను యెంచుకున్న “డాగ్మ్ 95” సూత్రాలు.

    దాదాపుగా అందరి కథే ఇది : ఇంటింటి రామాయణమే. తండ్రి కొడుకు పుట్టిన సంతోషం ఆస్వాదించకుండా, అతను తనకు పేరు తెచ్చే రోజున పడాలని సంతోషాన్ని వాయిదా వేస్తాడు. బాగా చదువుకుని, తెల్ల కాలరు ఉద్యోగంలో కుదురుకుని, తనకు పేరు తేవాలన్న అతని కలలకు పంక్చరు పడుతుంది. కొడుక్కి పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. ఆకతాయితనం, జులాయితనం మాత్రమే తెలిసిన ఆ అబ్బాయి తండ్రి తీక్షణమైన మాటలకు విలవిలలాడుతాడు. యేదైనా చేసి తండ్రిని సంతోషపెట్టాలి. అప్పుడు దొరుకుతుంది వొక నేస్తం, బాగా చదువుకున్న పిల్ల. అతనికి సాయంలో భాగంగా అతన్ని వ్యక్తిత్వ వికాస తరగతులవైపు మళ్ళిస్తుంది. అవేవీ యెక్కవు. పాఠాలూ యెక్కవు. చదువు తనవల్ల కాని పని అని బాగా అర్థమైపోతుంది, అవతల ఆ వ్యక్తిత్వ వికాసాల డొల్లతనమూ బయటపడుతుంది. ఆ క్షణంలో ఆమె — “బాగా చదువుకుని, నమ్రత, విధేయతా గుణాలు గల పిల్ల”– కంఫెస్ చేసుకుంటుంది. తను కూడా ఇదంతా తన తల్లిదండ్రులకోసమే చేసింది తప్ప, ఇద్దరిదీ ఒకే కథ అంటుంది. ఇప్పుడేమిటి మార్గాంతరం? సమాజంలో యెంతమంది యెన్ని రకాల పనులు చేసుకుంటూ బ్రతకట్లేదు? తను కూడా తనకు చేతనైన పనులన్ని లిస్టు వ్రాసి తండ్రికి చూపిస్తాడు. ఆ నీలి కాలరు పనుల లిస్టు తండ్రి అహంకారాన్ని రెచ్చగొడుతుంది, పరీక్షలు ప్యాసయినతర్వాతే ఇంటికి రమ్మని ఇంట్లోంచి పంపేస్తాడు. ఇక కొడుకు తనకు చేతనైన పని చేసుకుంటూ బ్రతుకుతున్న తరుణంలో, రెండేళ్ళ తర్వాత తండ్రి కొడుకులిద్దరు కలవడం, అపార్థాలు దూరమై, కుటుంబం మళ్ళీ యేకమవడంతో కథ సుఖాంతం.

    సినెమాలో కథే ముఖ్య పాత్ర. ఆ తండ్రి కొడుకులుగా దేవి ప్రసాద్, శ్రీవిష్ణు బాగా నటించారు. పాటలు, సురేశ్ బొబ్బిలి సంగీతమూ చాలా బాగున్నాయి. యెక్కువ మెలోడ్రామా లేకపోవడం నచ్చింది. చలనశీలమైన జీవితంలో వొక సరళరేఖనే పట్టుకు వేలాడే ఆ తండ్రి మంకు పట్టు అతన్ని యెలా అమానవీకరణకు గురిచేస్తుందో చూస్తే కాస్త భయం వేస్తుంది. ఇటు చిన్న పిల్లవాడూ కాదు, అటు యెదిగినవాడూ కాదు కొడుకు. అతనిలో ఆకతాయితనం, చిన్నపిల్లలకుండే నిర్లక్ష్యం స్థానంలో ఆలోచన, ఆరాటం, ప్రయత్నాకాంక్ష, జీవితపు నిర్ణయాలు తీసుకునే స్థితి ఇవన్నీ క్రమంగా మనకు దర్శకుడు వేణు ఊడుగుల సమర్థవంతంగా చూపించాడు. జీవితం రోజూ వేనవేల రంగుల్లో పూచే పూలలా తనని తాను మనకు సమర్పించుకుంటూ వుంటే, మనమేమో అమాయకంగానో, మొండిగానో, గొర్రెలాగానో కళ్ళకిరుపక్కలా కనబడకుండా నల్లని పరదాలు కట్టుకున్న గుర్రంలా దౌడు తీస్తుంటాం. మనం మొన్నటిదాకా ప్రభుత్వ ఉద్యోగాలని, నిన్నటిదాకా ఐటి ఉద్యోగాలని పరుగులు తీశాము. జీవితాదర్శం ఆనందం అన్న ధ్యాస పోయింది.

    నిజం చెప్పాలంటే యే చదువూ అబ్బకపోతేనే మిగతా పనులు చేసుకోవడం కాదు. మన చుట్టూ సమాజంలో యెంతో మంది వ్యవసాయమని, మరొకటని జయప్రదంగా చేసి వార్తలకెక్కుతున్నారు. ఇక పోతే సంపాదన విషయంలో కూడా మనం తెల్ల కాలరు ఉద్యోగస్తులకంటే బాగా సంపాదించేవాళ్ళని “నీలి కాలరు పనులు” చేస్తూ చూస్తాము. వొకదాన్ని నిరసించడానికి మరోదాన్ని గ్లోరిఫై చేయకపోవడం నచ్చింది. ఈ సమాజంలో కొడుకుని స్వతంత్రంగా నిలబడగలిగేలా చేయడం తండ్రి నుంచి ఆశిచతగ్గ గుణం, అంతేకాని అతన్ని అయోమయపరచి, ఆత్మన్యూనతకు గురిచేసి యెటూకాకుండా చేయడమైతే కాదు.

    ఇంత చెప్పాక కొన్ని నచ్చని సంగతులు కూడా చెప్పాలి నేను. ఆ కుటుంబంలో వొక్కొక్కరు వొక్కో యాసలో మాట్లాడడం, శ్రీవిష్ణు లో కూడా ఆసాంతం చిత్తూరు యాస వుందదు. తండ్రి కొడుకుల బంధాన్ని చూపించినంత చక్కగా శ్రీవిష్ణు సాత్నాల బంధాన్ని చూపించలేదు. సంభాషణలు బాగున్నాయి. నాకు అనిపించేది యేమిటంటే బాలచందర్ సినెమాల్లో కూడా సంభాషణలు చాలా బలంగా వుండడమే కాకుండా గుర్తుండి పోతాయి. నాకు అంతులేని కథలో సంభాషణలు ఇప్పటికీ గుర్తే. దానికి కారణం అతను ఆ పాత్రలను చాలా పటిష్టంగా మలుస్తాడు. నాకు వేణులో అతని ప్రభావం కొంచెం కనిపిస్తుంది (నిజమో కాదో ఆయనే చెప్పాలి). అయితే ఈ విషయం కూడా గుర్తుపెట్టుకుంటే ముందు ముందు ఇంకా బాగా తీసే అవకాశం వుంది. ఇంకా చిల్లర మల్లర దోషాలున్నా అంతగా పట్టించుకోవాల్సినవిగా అనిపించడంలేదు.

    వేణు ఊడుగుల నుంచి మరిన్ని మంచి చిత్రాలకోసం యెదురు చూడొచ్చు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here