‘నీల’ నవలా రూప రేఖలు

    1
    9

    [box type=’note’ fontsize=’16’] “నీల చదువుతుంటే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’కి ఫిమేల్ వెర్షన్ అనిపిస్తుంది చాలా మటుకు. బుచ్చిబాబు దయానిధి ఆదర్శవాది, నీల ప్రేమ జీవి, అతను తాత్విక విచారణ చేస్తే, నీల సహజమైన ప్రేమ విచారణ చేసింది” అంటున్నారు జగద్ధాత్రి ‘నీల’ నవలని సమీక్షిస్తూ. [/box]

    [dropcap]తా[/dropcap]నా వారి నవలల పోటీలో బహుమతి పొందిన కె.ఎన్ మల్లీశ్వరికి ఈ వ్యాస ముఖంగా మరోసారి అభినందనలు. తెలుగులో నవలలు రావడం లేదన్న బాధకి ఇటీవలే వచ్చిన తానా మూడు నవలలు, వోల్గా గారి ‘గమనమే గమ్యం’ మంచి ఊరట కలిగిస్తున్నాయి. మల్లీశ్వరి నవల ‘జీవితానికో సాఫ్ట్‌వేర్’ అనిల్ స్వాతి బహుమతిని పొందింది కొన్ని ఏళ్ల క్రితం. అప్పుడు ఆ నవల తోనే నేను మల్లీశ్వరి సాహిత్యాన్ని చదవడం, అలాగే ఆమెతో పరిచయము ఏర్పడ్డాయి. ‘పెద్దక్క ప్రయాణం’ చూసి చలించి నే రాసిన రివ్యూ అప్పుడు సారంగలోనే ప్రచురితమైందని గుర్తు. మల్లీశ్వరి మంచి రచయిత్రి. అందులో సందేహం లేదు పైగా నాకు గర్వ కారణంగా అనిపిస్తుంది. ఆమెకు వాసిరెడ్డి సీతాదేవి పురస్కారం వచ్చినప్పుడు కూడా ఆమె గురించి నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం హన్స్ ఇండియాలో వచ్చింది.

    నీల గురించి: ముందుగా అంత పెద్ద అన్ని పేజీల నవల రాసిన ఓపికకు శ్రద్ధకి అభినందనలు. కథ నీల గురించి, ఆమె జీవితం ఆమె నిర్ణయాలు, ఆమె కోరికలను గూర్చి. ఇతివృత్తం చాలా చిన్నది కానీ దాన్ని పెద్ద కాన్వాస్ మీద మాగ్నిఫై చేసి చిత్రించింది రచయిత్రి. అంత ఎక్కువ పేజీల కథనం అక్కర్లేదేమో ఇంకాస్త సంక్షిప్తంగా ఉంటే ఇంకా బాగా చదివించేది అనిపించింది చదువుతుంటేనే. కథన శైలి ఝరీ ప్రవాహంగా సాగింది. కొన్ని వర్ణనలు కవితాత్మకంగా ఉన్నాయి. చిన్నారి నీల ఎలా అనాథ అయ్యిందో ఆమె జీవితం తిరిగిన మలుపులేమిటో సవివరంగా చిత్రించింది రచయిత్రి. తన తల్లిని గురించి అందరూ అనుకుంటున్న విధంపై నీలకు అంతరాంతరాల్లో అంగీకారం లేదు. అంటే ఆమెకి తల్లి చేసినది తప్పుగా అనిపించలేదు. ఇదే నీల పాత్ర స్వభావానికి ఒక గీటురాయిగా తీసుకోవచ్చును.

    ఎవ్వరూ పూర్తిగా మంచివారు కారు, చెడ్డవారు కారు, మంచి చెడు అనేవి సాపేక్షం. అంతే కాదు అసలు మంచి చెడు నిర్వచించడానికి మనకున్న ప్రమాణాలు ఏంటి? స్త్రీ పురుష సంబంధాలలో స్వేచ్ఛ పరిమాణమెంత? వివాహ సంబంధం అవసరమా? స్త్రీ స్వేచ్ఛను కోరుకుంటూనే ఒక బంధం నుండి మరో బంధం లోనికే ప్రవేశిస్తుందా? ఇలాంటి మౌలిక ప్రశ్నలన్నీ బాగా లేవనెత్తింది రచయిత్రి.  అల్లకల్లోలమైపోతున్న దాంపత్య జీవితాన్ని సరిదిద్దుకోవడమెలాగో ప్రయత్న పూర్వకంగా ‘జీవితానికో సాఫ్ట్‌వేర్’లో చర్చిస్తుంది. అలాగే నీలలో కూడా ఈ స్త్రీ పురుష  సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలనే చర్చనే ఇంకా విస్తృతంగా చేసింది.

    ఇటీవల చాలా మంది ప్రసంగాలలో ‘స్త్రీ పురుష సంబంధాలను పునర్నిర్వచించుకోవాలి’ అనడం విని విని విసుగెత్తుతోంది. ఇంతకీ అవి ఏంటో ఒక స్త్రీ జీవితంలో అన్నది నీల చర్చకు పెట్టింది. బాగానే చర్చించింది మల్లీశ్వరి. నీల ఒక స్త్రీ జీవిత కథ. ఉద్యమాలను ఒరుసుకుంటూ సాగిన జీవిత కథ, అని రచయిత్రే స్వయంగా చెప్పింది. ఉద్యమాలను వివరిస్తూ రాసినా, ఆమె వాటిల్లో ఎందులోనూ భాగస్వామ్యం ఉన్నట్టు కనిపించదు. ఏ ఉద్యమం లోనూ ఒక బలమైన సంఘటన చిత్రించబడలేదు. స్త్రీల పొదుపు ఉద్యమాన్ని బాగా వివరంగా చర్చించింది. ఇది తెలుగు సాహిత్యంలో మొదటిసారి ఈ విషయాంశాన్ని చర్చించడం అని రచయిత్రే స్వయంగా చెప్పింది. ఈ పొదుపు పద్ధతుల్లో జరుగుతున్న అంతర్గతమైన మోసాలు, వాటికి బలై పోయిన అమాయకులు, ఇవి వెలుగులోకి తీసుకొచ్చింది వివరంగా. తమ డబ్బులు తామే అప్పు తీసుకుని వాటికి వడ్డీ కట్టుకోవడం, కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా బాధకి గురవ్వడం ఇవి కొన్ని చదివితే ఔరా ఇంత మోసమా ఇందులో అనిపిస్తుంది.

    ఉద్యమాలను గురించి వివరణ ఇస్తుంది కానీ, అయితే అందులో డైరెక్ట్ పాత్ర మాత్రం ఆమె ఏమీ పోషించదు. ముప్పై యేళ్ళ పీరియాడిక్ కథ అన్నారు కాబట్టీ ఆ మూడు దశాబ్దాలలోనూ వచ్చిన మార్పులు నీల జీవితంలో ఎలా మార్పును తీసుకొచ్చాయో బాగానే చెప్పింది. మాలతి చందూర్ గారి ‘హృదయనేత్రి’ గుర్తు ఉండే వుంటుంది అందరికీ. నీల అలాంటి ఉద్యమకారిణి కాదు. ఆమె చుట్టూ ఉన్న స్త్రీల జీవితాలు, పరిపూర్ణ, ఫాష్టరమ్మ, అజిత, లాంటివారి జీవితాలు ఎలా సాగాయో ఏకకాలంలో ఆమె జీవితంతో బాటు, చిత్రించింది. ఒక్కొకరిది ఒకో తీరు జీవితం. వాళ్ళ వివేకాన్ని బట్టీ, వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వారి జీవితాలని నిర్దేశించినట్టు చూపిస్తుంది. నీల వారి అందరి జీవితాలకి ఒక నిరంతర ప్రేక్షకురాలు.

    నీల ఒక స్త్రీ వైయుక్తిక జీవితం చిత్రణగా బాగా పండింది.  నీల బలమైన పాత్ర కాదు, సహజమైన పాత్ర. ఆమెది ఒక జీవన యాత్ర. ఆ యాత్రలో ఎన్నో మజిలీలు, మనుషులు. చివరికి తాను ఎంచుకున్న గమ్యం చేరుతుంది. మినో గురించి ఇంకొంచం తల్లి కూతుళ్ల అనుబంధం రాసి ఉంటే బాగున్ను అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పేరెంటింగ్ ముఖ్యంగా సింగిల్ పేరెంట్‌గా నీల మినో అనుబంధాన్ని, మిగిలిన వివరణ తగ్గించుకుని, రాసి ఉంటే బాగున్ను.

    ఆమె నిర్ణయం ప్రభావం మినో పైన ఎలా ఉందనేది కూడా ఇంకొంచం చర్చ జరిగితే బాగుణ్ణు అనిపించింది. తన గురించి తాను తీసుకునే నిర్ణయాలే తప్ప ఎవరినీ ఇన్వాల్వ్ చెయ్యని పాత్ర నీలది. ఆ విధంగా అత్యంత సహజమైన పాత్రగా నీల మనకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. నీల నిజమైన  స్త్రీ మూర్తి, స్త్రీ గా బలహీనురాలిగా కాక, స్వేచ్ఛగా, బ్రతకాలని కోరుకునే ఒక స్త్రీ.

    చివికి పోయి అనాథగా మారిన బాల్యం నుండి, సమాజంలో ఒక విశిష్ట వ్యక్తిగా గుర్తింపు పొందాలని తాపత్రయ పడే పాత్ర. అందుకు ఆమె ఏ ఉద్యమమూ చేయదు, కానీ జీవితాన్ని తనదైన రీతిలో పరిష్కారాలు వెదుక్కుంటుంది. ఆమె సహచర్యాన్ని కోరుకుంది అన్నారు ముందు మాటలో వీరభద్రుడు గారు.,  నిజమే కానీ తనకి తానుగా మిగులుతూ, తనతో సహచరించే ఒక సహచరుడిని కోరుకుంది.

    ఇది నేటి విద్యావంతురాలైన, స్వేచ్ఛను కోరుకునే స్త్రీ జీవితంలో ఎదురయ్యే మౌలిక ప్రశ్నే. మనసుకి వివేకానికి నడుమ ఘర్షణ కొన్ని చోట్ల చాలా సహజంగా చిత్రించింది రచయిత్రి. భర్తని ఎన్నుకునే అవకాశమే లేదు ఆమెకి. అయినా కాపురం చేసింది .బిడ్డని కన్నది. అక్కడా ఒక ఆడదానిగా సహజంగా జీవించాలని విశ్వ ప్రయత్నం చేసిందే తప్ప ఆ వివాహ సంబంధపు సంకెళ్ళు తనకు తానై తెంచుకోలేదు. అనుకోకుండా లభించింది స్వేచ్ఛ వివాహం నుండి లాయర్ వసుంధర సహాయంతో. వసుంధర చేత చాలా మంచి మాట చెప్పించింది రచయిత్రి స్వేచ్చ గురించి. ఆదాటుగా విడాకుల వలన లభించిన స్వేచ్చ చాలా విస్తృతంగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమెలాగో వివేచనతో చెయ్యాలి అంటుంది వసుంధర నీలతో.  జీవిక కోసం నీల తపన, ఆర్థిక స్వతంత్రం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు, ఎలాంటి జీవన పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే తత్వం నీల పట్ల మనకి సహానుభూతిని కలుగ చేస్తాయి. పరదేశిని ప్రేమించినా వదులుకోవడంలో ఆమె పడిన ఘర్షణ, సహజంగా ఉంది. ఇంకొక స్త్రీ అతని జీవితంలో ఉండగా తాను మళ్ళీ ఆ స్థానాన్ని తీసుకోకూడదు అనుకుంది. ఏ విధమైన  రిస్కూ తీసుకోవడం ఇష్టం లేనట్టు కనిపిస్తుంది నీల.

    అయితే కేవలం ఒక స్త్రీ అతని జీవితంలో ఉన్న కారణంగానే పరదేశిని వదిలేసిన నీల మరి అందరి స్త్రీలతో సంబంధాలున్న సదాశివని ఎలా జీవన సహచరుడుగా అంగీకరించింది? ఇది కేవలం స్త్రీ మనోధర్మానికి సంబంధించిన విషయం. అందుకే నీల సదాతో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడింది. అయితే ఆమె తనకు తాను మనసులో చెప్పుకుంటుంది ఎప్పుడైనా ఈ బంధం నుండి వదిలి పోగలను అని. అది సాధ్యమా కాదా, జరిగిందా లేదా అన్నది కాదు గానీ జీవితం నేర్పిన పాఠాలకు మంచి విద్యార్ధిని నీల. అందుకే ఏ ప్రశ్నకు ఏ బదులివ్వాలో ముందరే ఆలోచించి పెట్టుకుంది. నీల చదువుతుంటే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’కి ఫిమేల్ వెర్షన్ అనిపిస్తుంది చాలా మటుకు. బుచ్చిబాబు దయానిధి ఆదర్శవాది, నీల ప్రేమ జీవి, అతను తాత్విక విచారణ చేస్తే, నీల సహజమైన ప్రేమ విచారణ చేసింది. ఆమె కోర్టులో కేసులు, తల్లి చంద్రకళ, ప్రసాద్, పరదేశి, సదాశివ, వీళ్ళను అంచనా వెయ్యడంలో తన జీవితంలో వారికి ఎంత స్థానం కల్పించాలో అన్నిటికి నీలే వాది ప్రతివాది, జడ్జీ కూడా. ఆమె జీవితంలో ఎదురైన ఎవరినీ చెడ్డ అనుకోలేదు. వారి వారి బలహీనతల్ని అర్ధం చేసుకుంది, బలాలని మెచ్చుకుంది, తనకు ఎంతవరకు కావాలో అంత వరకే వారితో సంబంధం పెట్టుకుంది. విపరీతమైన భావోద్వేగాలకు తల వంచకుండా బహు జాగ్రత్తగా అడుగులు వేసింది. అయితే ఇందుకు ఆమె తనలో చాలా సంఘర్షించింది. ఈ అంతః సంఘర్షణలో తన తల్లిది తప్పేమీ లేదనే నమ్మకం ఆమెలో బలంగా ఉంది. ఈ నమ్మకమే సహానుభూతే ఆమె పాత్ర మొత్తాన్ని నిర్వచించింది.

    నీల ఒక ఆధునిక స్త్రీ, తన జీవితాన్ని సహజాతాల్లో పడి కొట్టుకుపోకుండా నిలదొక్కుకుని నిలబడిన స్త్రీ. మనసులో ఎన్ని సంఘర్షణలు ఉన్నా బయటికి మాత్రం నిశ్చలంగా ఉండాలని తన మూర్తిమత్వాన్ని తీర్చి దిద్దుకున్న స్త్రీ. ఆ విధంగా నీల పాత్ర మనకు గుర్తు ఉంటుంది. ‘జానకి విముక్తి’లో జానకిలా నీలది కూడా ఒక వ్యక్తిగత స్వేచ్ఛకై పోరాటమే. వివాహ సంబంధాలను గౌరవించవచ్చును లేదా వద్దనుకుంటే మానుకోవచ్చును అన్నది ఆమె లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం కానే కాదు. ఈ సమస్యలు అందరివీ అనిపించినప్పటికీ వీటికి పరిష్కారం మాత్రం ఎవరికి వారే వెదుక్కోవాలి. ఇదే జీవన రీతి నీల కూడా అదే చేసింది. ఆమె ఎవరికి ఏ సందేశమూ ఇవ్వలేదు. తన జీవితాన్ని ఎలా దిద్ది తీర్చుకోవడానికి ప్రయాసిస్తూ ప్రయాణించిందో దాన్ని వివరించింది. సముద్రం ఎందుకు ముందుకెళుతుందో, ఎందుకు వెనుకకు తగ్గుతుందో అనే ప్రశ్నతోనే కథ మొదలవ్వడం ముగియడం మళ్ళీ “చివరికి మిగిలేది” గుర్తు చేస్తుంది.

    మల్లీశ్వరి ప్రాక్టికల్‌గా రాయగలదు. నీలలో కొంత ఆ స్వభావాన్నుండి దూరమై కొంచం భావుకత ఎక్కువైనట్టు అనిపించింది. ‘పెత్తనం’, ‘శిశువాదం’ రాసిన మల్లీశ్వరిగా ఇంకా మంచి బలమైన రచనలు చేయాలని అవి ప్రాపంచిక స్థాయిలో గుర్తింపు పొందేవిగా ఉండాలని ఆశిస్తాను, ఆకాంక్షిస్తాను. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నవల ఉండలేకపోతుంది అన్న చంద్ర కన్నెగంటి గారి మాటనే ఉదహరిస్తూ అందుకు మన స్థాయి పెరగాలని ఆయన ఆశించినట్టుగానే నేనూ ఆశిస్తున్నాను. తను ఆశిస్తోన్న నవల ఇది కానప్పటికీ అటువంటి ఒక మంచి దారిలో ఈ నీల ఒక ఆశారేఖ మాత్రమని చెప్పిన వీరభద్రుడిగారి మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. మల్లీశ్వరి ఇంకా చాలా రాయాలి. రాస్తుంది. భారతీయ స్థాయికి వెళ్ళే రచన చేస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఇంత పెద్ద నవల రచనకు మాత్రం ఆమె ఏకాగ్రతకి, పట్టుదలకి, శక్తికి అభినందనలు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here