[box type=’note’ fontsize=’16’] Sriram Chadalavada వ్రాసిన ‘How Blue is My Sapphire?’ అనే కథను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు వి.బి. సౌమ్య. [/box]
~
Original: How Blue is My Sapphire?
Author: Sriram Chadalavada
Originally published in”Rorschach’s Ink” Anthology by Writers Guild of Iowa State University, 2017
Translator: వి.బి.సౌమ్య
Note: ప్రింటులో వచ్చిన వర్షన్‌కీ, అనువాదంలో ఉన్న వర్షన్ కి కొంచెం తేడా ఉంది. ఇది రచయిత వద్దనున్న ఆఖరు చిత్తుప్రతి నుండి అనువాదం చేసాను.
***
నీలమణిలోని నీలం
భూమిని వాతావరణ మార్పు నుండి కాపాడ్డానికి మతవిశ్వాసం మనకి స్ఫూర్తినిస్తే…
ఏప్రిల్ 22, 2015
మాల్మో నగరం, స్వీడన్
శరణార్థుల కోసమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇళ్లలో ఒకదానిలో కూర్చుని షరీఫ్ తమ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు.
“ఇక మాకంటూ ఏమీ మిగలలేదు. నేను తొడుక్కున్న దిదాషా, నా భార్య మిరియం వేసుకున్న అబాయా (దిదాషా,అబాయా –సిరియన్ సంప్రదాయ వస్త్రధారణ) – మా కట్టుబట్టలతో సిరియాలో జరుగుతున్న యుద్ధాన్ని తప్పించుకుని వచ్చాము . మా బంధువులు, స్నేహితులు అంతా ఎక్కడున్నారో, అసలుఉన్నారో లేదో! ఏమీ తెలియదు. మేము మాత్రం క్షేమంగా ఉన్నామని చెప్పగలను!
అల్హందులిల్లాహ్! (“భగవంతుని స్తుతి”) స్వీడన్ చేరుకున్నాము. కొత్త దేశం. అసలు ఇంత చలి ప్రదేశాలు ఉంటాయని కూడా నేననుకోలేదు. ఎండ కాస్తూండగా, గాలి వీస్తూండగా, ఎముకలు కొరికే చలి ఉంది ఈ దేశంలో. ఇక్కడి మనుషులు మాకు ఇంత సాయం చేస్తున్నారు కానీ నిజంగా మా జీవితాల్లో ఉన్న కష్టం ఏపాటిదో వీరి ఊహకైనా అందదేమో!“
ఈ ఆలోచనల నుండి బయటకొచ్చి,”మిరియం, పాపకెలా ఉంది?” – అడిగాడు భార్యని.
“ఇంకా అలాగే ఉంది. ఏం చేద్దాము? స్వీడిష్ సోషల్ సర్వీసు వాళ్ళ క్రూరత్వం గురించి విన్నాను. తల్లిదండ్రులు చూసుకోలేరు అన్న అనుమానం వస్తే పిల్లల్ని తమతో తీసుకెళ్ళిపోతారంట. ఈ పిల్ల మనం కన్న పిల్ల కాదు. యుద్ధరంగం నుండి తప్పించుకోపోతున్న మనకి ఒంటరిగా కనిపిస్తే కాపాడి తీసుకొచ్చాము. ఇపుడు ఆ సోషల్ సర్వీసామె వచ్చి తీసుకుపోతే ఎలా??”
“మనతో మాట్లాడినావిడ మనకి సాయం చేస్తా అన్నది కదా… ఏమవుతుందో చూద్దాం.”
ఇంతలో తలుపు కొట్టిన చప్పుడైంది. షరీఫ్, మిరియం ఒక క్షణం శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. మిరియం తేరుకుని”ఆ సోషల్ సర్వీసెస్ వాళ్ళు అయితే మాత్రం రానివ్వకు.” అంటూ లోపలికి, పాప వైపుకి పరుగెత్తింది.
షరీఫ్ నెమ్మదిగా తలుపు తీసి అవతలి వ్యక్తిని చూడగానే కాస్త కుదుటపడ్డాడు.
“ఈవిడ స్వీడిష్ ఆమె కాదనుకుంటాను. ఇండియా నుంచి లాగుంది. నుదుటి మీద ఎర్రటి చుక్క ఉంది. మన ఊరికి వచ్చే వర్తకుల భార్యలు ఇలా చుక్క పెట్టుకోడం చూసాను.”
“నేను ఇండియా నుంచి వచ్చాను. ఇదిగో నా పాస్పోర్టు. మీ శ్రేయోభిలాషిని. హాని తలపెట్టను. లోపలికి రానివ్వండి.”
ఆమె చేతిలో ఒక చిన్న, నల్లటి పుస్తకం లాంటిది ఉంది. దాని మీద ఇండియా ప్రభుత్వ ముద్ర ఉంది. ఆమె దాన్ని తెరిచి ఆమె ఫోటో, వివరాలు, పలు భాషల్లో ఏదో రాసి ఉన్న పేజీ చూపించింది.
“మీరు ఎవరు? ఎందుకొచ్చారు? ఆ పసి పిల్ల చావు బ్రతుకుల్లో ఉంది. ఈ స్వీడిష్ సోషల్ సర్వీస్ వాళ్ళు గనుక చూశారంటే మేమీ పిల్లని రణరంగం మధ్య నుండి క్షేమంగా తీసుకొచ్చామన్న విషయం వదిలేసి, ఆ పాపని మా నుంచి దూరం చేసి, మమ్మల్ని జైలులో పెడతారు”
“నేను మీకు సాయం చేద్దామని వచ్చాను. నన్ను నమ్మండి. పాప దగ్గరికి తీసుకెళ్లండి.”
షరీఫ్ ఆలోచనలో పడ్డాడు.”ఈమె మాట మృదువుగా ఉంది. మనిషి చూస్తే మంచామె లాగానే ఉంది. అల్లా చేసే అద్భుతాలు పలు రకాలు. ఈమె ఆయన పంపిన దూత కాబోలు- ఎవరికి తెలుసు?” అనుకుని ఆమెని మిరియం, పాప ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు.
“పాప ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. డాక్టర్లు ఏమీ తెలియడంలేదు అంటున్నారు.”
ఆ వచ్చినామె పాప దగ్గరికెళ్లి ఒక అమ్మలా దగ్గరికి తీసుకుని బుగ్గల్ని నిమిరింది. నెమ్మదిగా పాపని కప్పిన దుప్పటి తీసి ఎర్రబారిన చర్మాన్నీ, అక్కడక్కడా కాలినట్లు ఉన్న పుండ్లనీ, చీము కారుతున్న కురుపులనీ చూసింది. అక్కడక్కడా చర్మం రంగులు మారడం గమనించింది. కూనిరాగం తీస్తూ పాప దృష్టిని మరలుస్తూ ఈ గాయాలని తడమడం మొదలుపెట్టింది. ఆమె చేయి తాకిన చోటల్లా జబ్బు మాయమవడం మొదలయింది.
“యా అల్లా, పాప గాయాలన్నీ ఎలా మానుతున్నాయి? అమ్మా, నువ్వు ఇమాం వి. నీ చేతుల్లో దేవుడి మహిమని ప్రత్యక్షంగా చూస్తున్నాము..”. కళ్ల ముందు జరుగుతున్న అద్భుతాన్ని చూసి మిరియం, షరీఫ్ ఆశ్చర్యంతో అరిచారు.
ఆమె మౌనంగా నవ్వి కొన్ని నెలల క్రితం సైకోథెరపిస్టుకీ, తనకీ మధ్య జరిగిన సంభాషణని గుర్తు చేసుకుంది.
***
కాషాయం ధరించిన ఒక యువతి కటికనేల మీద కూర్చోలేక అటూ ఇటూ నడుస్తోంది.
“నా కలల కి కారణం ఏమిటి? మంటలలో నలుగుతూన్న నీలమణి కనిపిస్తోంది. నేనెప్పుడూ చూడని మనుషులు ఒక యుద్ధభూమి నుండి పారిపోతూ కనిపిస్తున్నారు, నేను ఉపచారాలు చేయవలసిన పాప కూడా ఉంది…”
దీనికి జవాబుగా ఏదో చెప్పబోతూ థెరపిస్టు ఆ యువతి చాలా అసహనంగా ఉందని గమనించింది. బలవంతంగా ఆవేశాన్ని ఆపుకుంటోందని అర్థమైంది.”శ్రద్ధా ధ్యానం (mindfulness meditation) ఏమన్నా ఉపయోగపడుతుందా?” అని అడిగింది.
“దాని వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటోంది కానీ, ఈ కలలు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. పైగా నేనసలు కలల్లో కనబడే ప్రాంతాలకి ఎప్పుడూ వెళ్ళలేదు.”
“ఇదంతా ఎక్కడ జరుగుతోంది అని నీ ఊహ?”
“నాకు యుద్ధం, వినాశనం కనిపిస్తున్నాయి. బహుశా మధ్యప్రాచ్యమేమో.”
“మీ అమ్మా, నాన్నా చిన్నప్పుడు ఇండియా లో సైన్యానికి, టెర్రరిస్టులకు మధ్య యుద్ధంలో మరణించారు అన్నావు కదా. బహుశా మట్టుబడ్డ జ్ఞాపకం ఏదైనా ఇలా కలగా వస్తోందేమో.”
“మనందరి మీద మన గతం ప్రభావం ఉంటుంది. గతం లేనిది భవిష్యత్తు లేదు. కానీ, గతాన్ని మరిచిపోయి మనం ముందుకూ సాగగలం. నేను అలా సాగుతున్నా అని అనుకుంటున్నాను. చిన్నతనంలో దేవుడిని, దేశమన్న భావననే ద్వేషించినా, చదువుకని ఈ విశ్వవిద్యాలయాన్ని చేరుకున్న దారిలో ఎందరో నిజాయితీ గల, మంచి వారిని కలిసాను. నాకు వచ్చే స్కాలర్షిప్ కూడా ఒక హిందూ మతసంస్థ నుండి వస్తోంది. కనుక నేను గతాన్ని దాటి , భవిష్యత్తు వైపు చూడాలనుకుంటున్నాను. ఈకలలకీ నా గతానికీ సంబంధం లేదు అనుకుంటాను.”
***
ఏప్రిల్ 21, 2015
బోస్టన్ నగరం నుండి స్వీడన్ లోని మాల్మో నగరానికి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళుతున్న ఒక విమానంలో కూర్చుని “సైన్స్ ఆఫీసర్ ఆఫ్ ది చర్చి” చెస్టర్ బ్రౌన్ అంతకు ముందు జరిగిన సంఘటనలను తల్చుకుంటున్నాడు స్వగతంగా .
అతను నా వైపుకి వస్తున్నాడు. సమయం మించిపోతుంది అని అర్థమైంది. ఐఫోన్ తీసి టైము చూడాలన్న కోరికని అణుచుకుంటూ, దీర్ఘంగా ఊపిరి తీసుకుని, పది నుండి ఒకటి దాకా అంకెలు వెనక్కి లెక్కపెట్టడం మొదలుపెట్టాను….
“మిస్టర్ బ్రౌన్, వాటికన్ చర్చికి ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. మీ లేఖలో రాసిన పరిస్థితే వస్తే మన ప్రభువు ఈ భూమిని కాపాడతాడు. శాస్త్రవేత్తలకే ఖచ్చితంగా తెలియని విషయాలలో చర్చి ఏం చేయగలదో నాకర్థం కావడం లేదు. ఊరికే భయపెట్టకండి. ఇక ఈ విషయమై చర్చలు అనవసరం.” – ప్రిలేట్ (క్రైస్తవ మాట వ్యవస్థలో ఒక ప్రధాన గురువు/అధికారి) అన్నాడు.
సైన్సు, మతం ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి గల రెండు కవల మార్గాలని నా నమ్మకం. దేని స్థానం దానిది. అందుకే ఈ ఉద్యోగం చేసేందుకు వచ్చాను. భూమి భవిష్యత్తును గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్ని తప్పుపడుతున్న తిరస్కారవాదులతో చేరారు వీళ్లంతా. వీళ్ళకి ఏమి చెబితే వింటారు? వీళ్ళ అభిప్రాయం మార్చగలిగే శక్తి ఏది? నాకు చర్చి వ్యవస్థ మీద నమ్మకం పోతోంది. బహుశా ఇక కొత్త దారులు వెదుక్కోవాలేమో….
చెస్టర్ ఇలా అనుకుంటూ ఉండగా దాదాపు వారం తరువాత ఒక ఈమెయిల్ వచ్చింది ప్రిలేట్ నుండి.”మిస్టర్ బ్రౌన్, స్వీడన్ లోని సిరియన్ శరణాగతుల ఇంట్లో ఒక అద్భుతం జరిగిందంటూ వార్త అందింది. మీరు వెళ్లి మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని కొంచెం పరిశీలిస్తే బాగుంటుంది. వెంటనే బయలుదేరాలి. మీ విధేయతని, ఈ ఉద్యోగానికి మీ యోగ్యతనీ నిరూపించుకునే మంచి అవకాశం ఇది.” అన్నది సారాంశం.
నేను ఈ కొలువు మానేద్దామని అనుకున్నాను కానీ ఇదొక మంచి అవకాశంలా ఉంది. ఈ పరిశోధన అయ్యాక అలా సైక్లెడ్స్ (cyclades) దీవులకు సెలవులకి పోవచ్చేమో చూడాలి.
ఏప్రిల్ 22, 2015 (ధరిత్రీ దినోత్సవం)
మాల్మో, స్వీడన్
జరిగిన అద్భుతాన్ని గురించి విచారించవలసిన అపార్టుమెంటు తలుపు తట్టాడు చెస్టర్ బ్రౌన్. ప్రాచ్య సన్యాసినిలా కాషాయ వస్త్రధారణలో ఉన్న ఒక యువతి తలుపు తీసింది.
“చెస్టర్, స్వాగతం”
గత కొన్నేళ్లలో వృత్తిలో భాగంగా ఆశ్చర్యకరమైన విషయాలు అనేకం చూసినా, విన్నా కూడా అతను అవాక్కయ్యాడు.
“మీకు నా పేరెలా తెలుసు? మిషనరీ హాస్పిటల్ వారు చెప్పారా? నా విచారణ అంతా రహస్యంగా సాగాల్సి ఉండింది! ఇలా పేరు చెప్పకూడదు.”
“ఎవరూ ఏమీ చెప్పలేదు. షరీఫ్ పాప ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న సంగతి హాస్పిటల్ వారికి చెప్పిన తరువాత అటు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ నువ్వు వస్తావని నాకు తెలుసు.”
“అస్సలాము అలైకుమ్” హాస్పిటల్ వారితో మాట్లాడిన జంట మేమే” – షరీఫ్, మిరియం వచ్చారు.
“హాస్పిటల్ వాళ్ళు ఈ పాప ఆరోగ్యం విషయంలో ఏదో అద్భుతం జరిగిందని కబురు పంపితే ఆ విషయం పరిశోధించడానికి వాటికన్ చర్చి నన్ను పంపింది.”
“డాక్టర్లు పాపకి ఇంక నయం కాదన్నారు. ఏ మందూ పనిచేయలేదు. కానీ ఈవిడ తాకిన వెంటనే పాప శరీరం మీది కురుపులు, గాయాలన్నీ మాయమైపోయాయి.”
“మొదట్నుంచీ మొదలుపెట్టండి. ఈమెని ఎక్కడ, ఎలా కలిశారు మీరు?”
“మేము సిరియా యుద్ధం నుండి పారిపోతూ ఉండగా దేశ సరిహద్దు వద్ద ఈ పాప బాగా అనారోగ్యంతో కనిపించింది. మేము వదిలేసి పోతే పిల్ల అలాగే చచ్చిపోతుంది అన్న ఊహ భరించలేక నా భార్య మనతో తీసుకుపోదాం అన్నది. దానితో ఇలా మేము మాతో పాటు స్వీడన్ తీసుకువచ్చాము. ఇక్కడికొచ్చాక ఈ యువతి మమ్మల్ని వెదుక్కుంటూ వచ్చింది” – అన్నారు దంపతులిద్దరూ.
“మీరు…” చెస్టర్ బ్రౌన్ అడగబోయాడు.
“నా పేరు ఆద్య. నేను కొలంబియా యూనివర్సిటీ లో రిలీజియస్ స్టడీస్ అన్న సబ్జెక్టులో పీహెచ్డీ చేస్తున్నా. చెస్టర్ – మీకు సమాధి స్థితి, దివ్యానుభూతి ఇలాంటి వాటిపై నమ్మకం ఉందా?”
“ఇలాంటి వాటి పై అనుమానం ఉన్నా కొంచెం విశాలదృక్పథంతో విషయాలని గ్రహించడం నా వృత్తిధర్మం”
“కొన్ని నెలలబట్టీ నాకు ఒక మండుతున్న నీలమణి గురించి, ఇక్కడ జరిగిన, జరగబోతున్న సంఘటనల గురించి కలల వంటివి వచ్చేవి.” – ఆద్య చెప్పనారంభించింది.
“అంటే?”
“నేను షరీఫ్, మిరియం లను అల్ జజీరా వార్తల్లో సిరియన్ శరణాగతులు గా చూడకముందు నా కలలో చూసాను. వార్తల్లో వచ్చాక టీవీ వారి ద్వారా వీళ్ళని కలిసాను.”
“ఈమె వచ్చి పాప గురించి అడిగినపుడు మాకు ఈమె స్వీడిష్ సోషల్ సర్వీసెస్‌కి చెందినదేమో, జబ్బుపడ్డ పాపని మా నుంచి తీసుకువెళ్లిపోతుందేమో అని భయమేసింది” – షరీఫ్ ఆద్య మాటల మధ్యలో అన్నాడు.
“నా ఇండియన్ పాస్పోర్ట్ చూపించడం ఇక్కడ నాకు ఉపయోగపడింది” అన్నది ఆద్య నవ్వుతూ.
“అప్పుడే ఈమె దేవదూతలా వచ్చి పాపని కాపాడింది. ఇలాంటి అద్భుతాన్ని ఇంత దగ్గరగా చూడడం మా అదృష్టం.” – మిరియం కూడా ఆ సంభాషణలో చేరింది.
“సరే, మీరు ఆ పాప కి ఏదో అద్భుతాన్ని ప్రదర్శించి నయం చేశారు అని అనుకుందాము – అలా ఎలా జరిగిందనుకుంటున్నారు?” చెస్టర్ ప్రశ్నించాడు.
“పాపకి జ్వరం ఇంకా తగ్గలేదు. నా అంతర్దృష్టిని అనుసరించి చూస్తే మీరు రావడమే ఈ పాప పూర్తిగా కోలుకోడం అన్న సంఘటనలోని చివరి అంకం.”
చెస్టర్ నమ్మశక్యం కానట్లు చూసాడు.
“మీరు ఉద్యోగం మానేయాలి అనుకోడానికి ఏదైనా కారణం ఉందా?” – ఆద్య అడిగింది.
“మీకు ఈ విషయం…” అవాక్కవుతూ అడిగాడు.
ఆద్య నవ్వి చెస్టర్‌ని పాప దగ్గరికి తీసుకెళ్లింది.
“ఉండండుండండి. ఈ పసిపిల్ల అసలు మనిషి పిల్లలా లేదు కానీ జ్వరం అన్నది నిజమే.” చెస్టర్ ఆశ్చర్యపోయాడు.
“నా కలల లోని మండుతున్న నీలమణి … మన సౌర కుటుంబం లోని ఏకైక నీలి గ్రహం – మన అందరి నివాస స్థలం – ఈ భూమి. ఈ పాప భూమికి మానవ రూపం. ఇపుడు చెప్పండి ఈ పాప ఎందుకు ఇంత అనారోగ్యంతో ఉందో?”
చెస్టర్ కి నోటమాట రాలేదు.”వాతావరణ మార్పు! దానిని ఆపడానికి ఇదా కావలసింది? మతాలూ, జాతులకు అతీతంగా ఇలా అందరూ కలిసికట్టుగా భూమిని కాపాడుకోవాలి అనమాట!” అన్నాడు ఆశ్చర్యంతో.
“మనమంతా వేర్వేరు చోట్ల నుంచి ఇక్కడికొచ్చి కలిసాము… మన అమ్మని, మన అస్తిత్వాన్ని, మన గయా (ప్రాచీన గ్రీకు దేశపు కథలలో ఉండే భూదేవి)… మన భూదేవిని … ఆరోగ్యకరంగా ఉంచే బాధ్యత మనకి లభించింది.”
“ప్లీజ్… దయచేసి నన్ను ఇదంతా వీడియో తీయనివండి”
“మిరియం, షరీఫ్, ఇదే సరైన సమయం. మీరు పాపని మీ చేతుల్లోకి తీసుకోండి. నేను ప్రార్థన చేస్తాను.”
ఆ దంపతులు పాపని చేతుల్లోకి తీసుకుని చూస్తూండగా ఆద్య పాప కోసం ప్రార్థన చేసింది. చెస్టర్ ఇదంతా వీడియో తీసాడు. చివరికి పాప జ్వరం తగ్గినట్లే ఉంది.
చెస్టర్ ఆనందానికి హద్దుల్లేవు.”నాకు మళ్ళీ నమ్మకం అన్నది పుట్టింది. మన నీలమణి నిజంగా ఎంత నీలం! మనం దీన్ని ఇలాగే ఉంచుకుందాము!”
ఉపసంహారం:
2015 మే: చెస్టర్ తాను రికార్డు చేసిన వీడియోని, ఆ సంఘటన పరమార్థాన్ని వివరిస్తూ పాంటిఫికల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కి రిపోర్టు రాసి పంపాడు.
2015 జూన్: Laudato Si పేరిట ప్రపంచ పౌరులని ఉద్దేశిస్తూ పోప్ ఫ్రాన్సిస్ రాసిన 180 పేజీల లేఖలో అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసి వాతావరణ మార్పుని అడ్డుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చాడు.
2016 ఏప్రిల్: వాతావరణ మార్పుని అడ్డుకునే ఈ పోరాటంలో పాల్గొనడానికి ముందుకొస్తూ ఇండియా పారిస్ క్లైమేట్ అకార్డ్ మీద సంతకం పెట్టింది. వివిధ మత సంస్థలకు ప్రతినిధిగా ఆయా సంస్థల సభ్యులని పర్యావరణ పరిరక్షకులుగా ఉండమని ప్రోత్సహిస్తూ ఆద్య కదిలింది.
***