నీలమత పురాణం – 10

0
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]క[/dropcap]శ్యపుడు  భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దర్శించిన పుణ్యస్థలాలు, నీలుడు కశ్యపుడికి వినిపించిన పుణ్యక్షేత్రాలు చూస్తుంటే ‘అడుగడుగున గుడి ఉంది’ అన్నమాట ఎంత సత్యమో బోధపడుతుంది. అయితే, అడుగడుగునా ఇన్ని పవిత్ర స్థలాలున్న దైవభూమి పిశాచాల మయం అవటం, రాక్షసుల భయాలకి గురవటం ఆలోచించాల్సిన అంశం.

ఇంత పవిత్రమైన ప్రాంతాలు దుష్టుల బారిన పడటం ఎంతో విచారకరమైనదైనా గమనిస్తే, దానికీ ఏదో ఒక కారణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సృష్టితో పోలిస్తే మానవ జీవితకాలం చాలా చిన్నది. లక్షల, కోట్ల సంవత్సరాల లెక్కల ముందు ఒక వంద సంవత్సరాలు సముద్రంలో నీటి చుక్క లాంటివి. కానీ నీటి చుక్క లాంటి జీవితంలో మనిషి లక్షల కోట సంవత్సరాల చరిత్రను ఆవిష్కరించాలి. లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరాలలో దాగి ఉన్న రహస్యాలను గ్రహించాలి. ఇది సాధించాలంటే వంద సంవత్సరాల జీవిత కాలం కూడా సరిగ్గా లేని మనిషి దృష్టి విశాలమవ్వాలి. ఆలోచనలకు అవధి ఉండకూడదు. తన తరువాత కూడా దర్శించగలిగిన దృష్టి ఉన్నవారి తీర్మానాలకు ఉన్న సమగ్రత, తాత్కాలిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే వారికి ఉండదు. ఉదాహరణకు ఎవరో ఏదో పని చేశారనుకుందాం. ఆ పని మంచిది కాదు. ‘దాని ఫలితం చెడుగా ఉంటుంది’ అంటే దానికి ఎవరూ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ చెడు పని చేసిన వాడు సంతోషంగా, సుఖంగా ఉన్నట్టు కనబడుతాడు కాబట్టి. కానీ ఆ పని ఫలితం వెంటనే కనబడకపోవచ్చు. కాని కొన్ని తరాలలో ఆ దుష్ఫలితం అతడు కాకున్నా, అతని వారయినా అనుభవించక తప్పదు అంటుంది కర్మ సిద్ధాంతం. కొన్ని తరాల పాటు వర్తించే కర్మ సిద్ధాంతాన్ని కొన్ని రోజులలో, గంటలలో పరిశీలించి చూసి పనికిరాదని తేల్చడం అజ్ఞానానికి నిదర్శనం, హ్రస్వదృష్టికి తార్కాణం.

జలోద్భవుడు ఉద్భవించిన విధానమే ధర్మవిరుద్ధం. సతీదేవిని చూసి మోహించిన రాక్షసుడి వీర్యం సతీసరోవరంలో పతనమవడం, దాన్ని నాగులు భద్రపరచడం వల్ల ఉద్భవించినవాడు జలోద్భవుడు. పరసతిని మోహించడం, కామించడం, అదుపులేని మోహంతో కూడిన దురాలోచన ఫలితం జలోద్భవుడు. అలాంటి దుష్టపుటాలోచన ఫలితంగా జనించిన వీర్యాన్ని భద్రపరిచి జీవం పోయటం వల్ల ఉద్భవించిన దుష్టుడు జలోద్భవుడు దౌష్ట్యంగా కాక మరో రకంగా ప్రవర్తించడం ఊహ కందని విషయం. అలాంటి దుష్టపుటాలోచన బీజాన్ని భద్రపరిచి జీవం పోసిన కర్మఫలం ఆ ప్రాంతం, అక్కడి నాగులు, అక్కడి ప్రజలు అనుభవించక తప్పదు. కాని ఇదంతా ఒక రోజులో రెండు రోజులో జరిగేది కాదు. అదీగాక ఈ సృష్టిలో ఏ ఫలితానికీ ఏదో ఒకటి కారణం ఉండదు. పలు విభిన్నమైన కారణాల ఫలితం మనకు తెలుస్తుంది. కానీ మన హ్రస్వదృష్టి వల్ల మనం ఒకటో రెండో కారణాలను ఊహిస్తాం. అవీ మెదడుకు అందకపోతే అదీ లేదు. కారణ రహితమైన ప్రపంచం ఇది అని ప్రపంచాన్ని తిట్టిపోస్తాం. అందుకే ఏదైనా ఒక విషయం విశ్లేషించాలంటే ఎంతో అధ్యయనం, విశ్లేషణతో పాటు దార్శనికత అవసరం. వ్యక్తి ద్రష్టలా ఆలోచించడం ఆవశ్యకం.

సతీసరోవరం పరిసర ప్రాంతాలన్నీ జలోద్భవుడి కారణంగా నిర్మానుష్యం అయిపోయాయి. అనేక పవిత్ర స్థలాల సందర్శనంతో పవిత్ర మనస్కుడు, పవిత్ర శరీరి అయిన కశ్యపుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు మంచి చెడుల నడుమ ఘర్షణకు ప్రాతిపదిక ఏర్పడింది. మంచి ఆలోచనకు, దుష్టపుటాలోచనలకు నడుమ ఘర్షణ సందర్భం ఏర్పడింది. ఈ సంఘర్షణను ప్రస్తావించే కన్నా ముందు ‘నీలమత పురాణం’ ప్రస్తావించిన తీర్థ స్థలాలను స్మరించాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’లో ప్రస్తావించిన కొండలు, నదులు, పవిత్ర స్థలాల గురించి ‘వేద్‍కుమారి’ పరిశోధించి “నీలమత పురాణ – ఎ కల్చరల్ అండ్ లిటరరీ స్టడీ ఆఫ్ కశ్మీర్”లో అనేక అంశాలను పొందుపరిచింది. ఆ అంశాలను స్పృశిస్తూ, ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే, మన పురాణాలను పుక్కిట పురాణాలుగా కొట్టివేస్తారు. కానీ పరిశీలిస్తే ఆ పురాణాలలో అనేక భౌగోళిక అంశాలు లభిస్తాయి. చారిత్రక ఆధారాలు పొందుపరిచి దొరుకుతాయి.

(మళ్ళీ రెండు వారాల తరువాత)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here