నీలమత పురాణం – 16

0
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణంలోని ‘నీల’ అన్న పేరు నాగులకు సంబంధించినది. నీలుడు అన్న నాగు మతాన్ని అంటే ఇష్టాన్ని, ధర్మాన్ని చెప్పే పురాణం అన్న మాట.  నీలమత పురాణం ప్రకారం నాగుల తండ్రి ప్రజాపతి కశ్యపుడు. తల్లి దక్షుడి కూతురు కద్రువ. దేవతలు, దైత్యులు, దానవులు, ఖాసాలు, భద్రులు, గరుడుడు వీరంతా కశ్యపుడి సంతానమే. అంటే ‘నాగులు’ కూడా మానవ అవతారం కలిగిన వారే. కొందరు ఊహిస్తున్నట్లు వారు ఆటవిక జాతుల వారై, ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి వారిని లొంగదీయటం అన్నది ‘ఊహ’ తప్ప మరేదీ కాదు. ఎందుకంటే నాగులు ఆటవికులు అయితే, దేవతలు, దైత్యులు, దానవులు, ఖాసాలు, భద్రులు, గరుడుడు కూడా ఆటవికులు కావాలి. కాని వీరంతా నాగరీకులు. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నవారు. కాబట్టి వీరందరినీ ప్రధాన జీవన స్రవంతిలోని వారిగా భావిస్తూ నాగులు మాత్రం అనాగరికులుగా భావించడం కుదరదు.

నాగులు మరో ప్రాంతం నుండి ఇక్కడకు వచ్చినవారిగా కూడా భావించడం కుదరదు. నాగులు ఎక్కడి నుండో వస్తే, మళ్ళీ దేవతలు, దైత్యులు, దానవులు, ఖాసాలు, భద్రులు, గరుడుడు అంతా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినవారై ఉండాలి. కానీ నీలమత పురాణం మాత్రమే కాదు, ఏ ఇతర పురాణం కూడా వీరు ఎక్కడినుంచో వచ్చారు అన్న ఆలోచనను కూడా దరిదాపులలోకి రానీయదు. కాబట్టి నాగులు ఆటవికులు కారు, ఎక్కడి నుంచో ఇక్కడికి వలస వచ్చినవారు కారు. పైగా పురాణం ప్రకారం నాగులు గరుడుడి నుంచి రక్షించమని విష్ణువుని ప్రార్థించి సతీసరోవరంలో క్షేమంగా ఉండేట్టు వరం పొందినవారు. అంటే వారు నాగులను పూజించే వారయినా విష్ణువునూ పూజిస్తారు. విష్ణువు శయనించేది ఆదిశేషుడిపైన. నాగుల శత్రువు గరుడుడు. గరుడుడు విష్ణువు వాహనం. అంతే ఇద్దరు శత్రువులూ పూజించేది ఒకే దేవుడిని. ఒకే దేవుడి చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంటే ఎక్కడి నుంచో వచ్చినవారు ఇక్కడికి వచ్చి స్థానికులపై దురాక్రమణ చేసి వారిని ‘ఆర్యనీకరణం’ చేసారు అన్న ఆలోచన కనీసం ‘నాగుల’ విషయంలో వర్తించే వీలు లేదన్న మాట.

నీలమత పురాణం ప్రకారం కశ్మీరులో అడుగుపెట్టి దాన్ని నివాసం చేసుకున్న ప్రథమ జీవులు నాగులు. వీరు పిశాచాలతో కానీ, మనుషులతో కాని కశ్మీరును పంచుకుని బ్రతకడానికి ఇష్టపడలేదు. దాంతో కోపించిన కశ్యపుడు, ఆరు నెలలు పిశాచాలతో, ఆరు నెలలు ఇతర ప్రజలతో కలిసి బ్రతకమని ఆజ్ఞాపించాడు. నాగులు పిశాచాలతోనూ, మనుషులతోనూ కలిసి బ్రతికారు. నాగులు కొందరు మానవ స్త్రీలను ఎత్తుకుపోయిన కథలు ఉన్నాయి. మహాభారతంలో అర్జునుడు నాగలోకం వెళ్ళి ‘ఉలూచి’ని వివాహమాడుతాడు. కాబట్టి నాగులు అనగానే సగం మనిషి సగం పాము అనో, పూర్తిగా పాము అనో, ఇష్టం వచ్చినట్టు మానవుల రూపం ధరించే శక్తివంతులైన పాములు అనో అనుకునే వీలు లేదు. పైగా ప్రజలు, ముఖ్యంగా కశ్మీరు ప్రజలు నాగులను పూజించిన గాథలు అనేకం ఉన్నాయి. రాజతరంగిణిలో ఓ నాగ స్త్రీని వలచిన ‘కిన్నరుడు’ అనే రాజుపై నాగులు బండరాళ్లతో దాడి చేసి రాజధానిని నాశనం చేసిన కథ ఉంది (చూ. కల్హణ కశ్మీర రాజ తరంగిణి కథలు,’కిన్నరుడి కోరిక’). కాబట్టి నాగులు అనగానే పాములని, వారు ఆటవికులు అని ఊహించేసి నిర్ధారించటం కుదరదు. నాగులు తమకంటు ప్రత్యేక-సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పిశాచాలు, జనావాసాలతో కలవకుండా తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు.

అయితే, నాగులు ఎవరితోనూ కలిసి బ్రతకకుండా తమ ప్రత్యేకతను నిలుపుకోవాలని అనుకోవటం చూస్తే ఇప్పుడు కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం గుర్తుకొస్తుంది. ‘పిశాచాలు, మనుషులతో కలిసి జీవించం’ అని నాగులు అనగానే ‘అయ్యో, అలాగా’ అని వారిని బ్రతిమిలాడి, వారిని బుజ్జగించి, ‘బయటివారెవ్వరూ ఇక్కడ స్థిరపడకూడదు’ అని నియమాలు నిబంధనలు కశ్యపుడు విధించలేదు. కన్నెర్ర చేసి అందరితో కలిసి బ్రతకాల్సిందే అని తీర్మానించాడు. అమలు జరిపాడు. బహుశా, ఇప్పుడు కాశ్మీరులోనూ చేయాల్సింది ఇదేనేమో! ‘మేము ప్రత్యేకం’ అన్నవారికి తప్పనిసరిగా సహజీవనం, పరస్పర సహకారం నేర్పి తీరాల్సిందే!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here