నీలమత పురాణం – 17

1
13

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నా[/dropcap]గుల విషయంలోనే కాదు భారతీయ చరిత్రకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సమస్య వస్తుంది. దీనికి ప్రధాన కారణం భారతదేశ చరిత్రను విదేశీయులు తమ దృష్టితో నిర్ణయించటం. అలా నిర్ణయించటంలో కూడా నిష్పక్షపాత ధోరణి, వైజ్ఞానిక దృక్పథం, నిజంగా సత్యావిష్కరణ చేయాలన్న నిశ్చయం ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. కానీ, ఆరంభంలో సత్యావిష్కరణ కోసం ప్రయత్నించిన వారిలో ఉన్న నిజాయితీ తరువాత వచ్చిన వారిలో లోపించడంతో భారతదేశ చరిత్ర మొత్తం సందేహాలు, ఊహలు, అసంబద్ధాలు, అనౌచిత్యాలు, అబద్ధాలతో నిండిపోయింది. స్వాతంత్ర్యం సాధించిన తరువాత కూడా విదేశీయులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మడాన్ని ప్రామాణికంగా భావిస్తూ తీర్మానాలు, సిద్ధాంతలు చేయటం, లభిస్తున్న ఆధారాలను, విదేశీయుల సిద్ధాంతాలలో ఒదిగింప చేయాలన్న ప్రయత్నాలు భారతదేశ చరిత్రను అతలాకుతలం చేశాయి.

నిజానికి భారతదేశంలోకి వేరే దేశాల వారు వచ్చారని, భారతీయ ధర్మం అన్నదాన్ని వేరే వారు ఏర్పరిచారని నిరూపించాలని విదేశీయులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆర్యులు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి ‘వేదం’ రాశారని తీర్మానించారు. వచ్చిన చిక్కు ఏమిటంటే విదేశీయులు ఆర్యులను ఇక్కడికి తెచ్చే కన్నా ముందే ఇండస్, సరస్వతీ నదీ తీరాలలో నాగరికత వెలిగిపోతోందని తరువాత తేలింది. దాంతో మొహెంజొదారో, హరప్పా లను ఆర్యులను నాశనం చేశారని ఓ సిద్ధాంతం, నదులు ఎండిపోవడం వల్ల ఆ నాగరికత అంతమయిందని మరో సిద్ధాంతం ఏర్పాటు చేశారు. ఇప్పటి నాగరికతకూ, ప్రాచీన భారతంలో పరిఢవిల్లిన నాగరికతకూ ఎలాంటి సంబంధం లేదని తీర్మానించారు. కానీ ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చినట్టు నిరూపించే ఒక్క ఆధారం లేదు. కనీసం ఒక్క ఇటుక, ఒక్క కత్తి, ఒక్క కుండ పెంకు, ఒక్క ఎముక ముక్క, ఒక్క చిల్లర నాణెం,  ఒక్కటి కూడా ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, ఇక్కడివారితో పోరాడారని, ఇళ్ళు కట్టుకున్నారని నిరూపించే ఆధారం లేదు. అయినా ఆర్యులు ఇక్కడ స్థిరపడ్డారని చరిత్ర చెబుతోంది. దాన్ని నిజమంటున్నారు.

ఆర్యులు సరస్వతీ నదీ తీరాన వేదం ప్రకటించారని వేదం తెలిసిన ప్రతివారికీ తెలుస్తుంది. కానీ విదేశీయులు ఆర్యులు ఇక్కడికి వచ్చారని చెప్తున్న సమయానికి సరస్వతీ నది అదృశ్యం అయింది.  సరస్వతీ నది ఉచ్చ దశలో ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే వేదం మరో రెండు వేల ఏళ్ళు వెనక్కి వెళుతుంది. అప్పుడు మొహెంజొదారో, హరప్పా నాగరికతలు ఉచ్చ దశలో ఉన్నట్టు ఆధారాలు చెప్తున్నాయి. అంటే, వేదం ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు కాదు, ఇక్కడివారే దర్శించారని అనుకోవాల్సి వస్తుంది. అలా అనుకుంటే ఆర్యులు ఇక్కడికి వచ్చారన్న సిద్ధాంతం దెబ్బతింటుంది. కాబట్టి ఆధారాలను విస్మరించి మరీ ఆధారాలు లేని ఆర్య సిద్ధాంతాన్ని పట్టుకుని వ్రేలాడుతున్నారు భారతీయ చరిత్ర పరిశోధకులు. తాము పట్టుకుని వ్రేలాడుతున్న సిద్ధాంతం కేవలం ‘ఊహ’ అని తెలిసి కూడా అదే ‘నిజం’ అంటున్నారు. దొరుకుతున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు.

కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఆధారాలనే కాదంటున్న ‘వైజ్ఞానిక దృక్పథం’ కల చరిత్ర పరిశోధకులు, పురాణాలన్నీ నాగులు ఇక్కడివారే అనటాన్ని ఎన్ని ఆధారాలున్నా ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే, పురాణాల ప్రకారం నాగులు ఇక్కడ సృష్టి ఆవిర్భావం నుంచీ ఉన్నారు. అలా ఉంటే భారతీయ ధర్మం, సంస్కృతి ఒక అవిచ్ఛిన్న ధారలా ప్రవహిస్తున్నట్లు తేలుతుంది. అలా అనుకుంటే మరి ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు ఏమైపోవాలి? కాబట్టి ఈ వైపు కనీసం గుడ్డి కన్నును తిప్పేందుకు కూడా ఇష్టపడడం లేదు ఆధునిక విజ్ఞానవంతులైన చరిత్ర విశ్లేషకులు. ఇదెలాంటిదంటే ముందే ఒక వ్యక్తి పరిమాణాన్ని నిశ్చయించి, బట్టలు కుట్టించి, మనిషిని వాటిల్లో కుదించాలని ప్రయత్నించడం లాంటిది. పట్టకపోతే, బట్టలను మార్చడం కాదు, మనిషిని కోసి మరీ బట్టల్లో ఇరికించాలనే ప్రయత్నం లాంటిది.

గమనిస్తే ఋగ్వేదం నాటి నుంచీ నాగులను దేవతలుగా పూజించటం కనిపిస్తుంది. యజుర్వేదంలో నాగులకు అర్పించవలసిన విషయాల ప్రస్తావన ఉంటుంది. అధర్వవేదంలో నాగులు దైవాలన్న భావన కనిపిస్తుంది. గృహ్య సూత్రాలు, అశ్వలాయన సూత్రాలు వంటి సూత్రాలలోనూ ‘నాగపూజ’ కనిపిస్తుంది. దాంతో ‘నాగులు’ అంటే ‘పాములు’ అన్న భావన స్థిరపడుతుంది. కానీ నీలమత పురాణంతో సహా ఇతర పురాణాలను పరిశీలిస్తే, ‘నాగులు’ మనుషులే అనిపిస్తుంది. కాబట్టి నీలమత పురాణంలోని ‘నాగులు’ కశ్మీర్‌లోని తొలి మనుషులు అనుకోవటంలో పొరపాటు లేదు.

నాగులను ఆరు నెలలు పిశాచాలతోనూ, ఆరు నెలలు మనుషులతోనూ సహజీవనం చేయమని కశ్యపుడు ఆదేశించాడు. దాంతో నాగులకు సహజీవనం తప్పలేదు.

ఇక్కడ ఒక సూక్షమైన అంశం ఉంది. మనిషికి అంతా తనకే కావాలని ఉంటుంది. ఇతరులతో పంచుకోవాలని ఉండదు. కానీ తప్పనిసరి అయితే, తప్పించుకునే వీలు లేకపోతే పంచుకుంటాడు సంతోషంగా. మనిషిలో రాజీ పడే మనస్తత్వం కూడా ఉంటుంది. అయితే, ఒక్కసారి ఏదైనా ప్రత్యేకంగా అందితే దాన్ని వదులుకునేందుకు ఇష్టపడడు. గరుడుడి బారి నుంఛి తప్పించుకునేందుకు కశ్మీరులో క్షేమంగా ఉండవచ్చని నాగులు కశ్మీరు చేరారు. తమ నివాసం చేసుకున్నారు. అందుకే తమది అనుకున్న కశ్మీరును పిశాచాలు, మనుషులతో పంచుకునేందుకు ఇష్టపడలేదు. కానీ కశ్యపుడు వారి అయిష్టాన్ని ఖాతరు చేయలేదు. కన్నెర్ర చేశాడు. దాంతో పరిస్థితితో రాజీపడి సహజీవనం ఆరంభించారు నాగులు. కాబట్టి, ఇకనైనా కశ్మీరు భారతదేశంలో అంతర్భాగమనీ, ఇతర ప్రాంతాల లాంటిదే తప్ప ప్రత్యేకం కాదు అన్న భావన అటు కశ్మీరులోనూ, ఇటు దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ కలిగించే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తికి తాను ప్రత్యేకం అన్న భావన వచ్చిందంటే, దాన్ని నిలుపుకోవటం కోసం ఎంతకయినా తెగిస్తాడు. కానీ తాను ఎంత ప్రత్యేకమో, ఇతరులు అంతే ప్రత్యేకం, ఈ ప్రత్యేకతలు కాపాడుకుంటూ కూడా కలిసి మెలిసి ఉండక తప్పదన్న భావన కలిగించాల్సిన ఆవ్యశ్యకతను నీలమత పురాణంలోని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here