నీలమత పురాణం – 34

0
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యస్మాద్భవతి కర్తవ్యా తస్య పూజా తతో ద్విజ।
రమ్య శిలామయీ కార్యాం కశ్మీరం తం చ పూజయేత్॥

[dropcap]అం[/dropcap]దమైన కశ్మీరాదేవి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని పూజించాలి. పూలు, సుగంధ ద్రవ్యాలు వంటివి మూడు రోజులు దేవికి అర్పించకూడదు. వస్త్రాలు, ఆహారం వేడి పదార్థాలు అందిస్తూ అర్చించాలి. అంతే విగ్రహాన్ని అలంకరించకూడదన్న మాట ఆ మూడు రోజులు. ఈ కాలంలో దేవీ పూజను మహిళలే నిర్వహించాలి. ఎట్టి పరిస్థితులలో పురుషులు దేవిని పూజించకూడదు, పూజలు నిర్వహించకూడదు.

కృష్ణపక్షం ఎనిమిదవ రోజున మహిళలు దేవికి స్నానం చేయించాలి. ఆ తరువాత పలురకాల మూలికలు కలిపిన నీటితో ద్విజులు దేవికి స్నానం చేయించాలి. సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, ఆభరణాలు, ఫలాలతో దేవిని స్నానం చేయించిన తర్వాత (అభిషేకం చేసిన తరువాత) పూలమాలలు, వస్త్రాలు, పలురకాల ఆభరణాలు, ఆహారం, ప్రత్యేకంగా తీసిన ఆవుపాలతో దేవిని పూజించాలి. దేవికి అర్పించే ప్రతిదాన్ని త్రికోణాకారంలో తయారుచేయాలి. పొట్టు ఉన్న బియ్యం, పొట్టు తీసిన బియ్యం, పిండితో ఈ ప్రసాదాన్ని తయారు చెయ్యాలి. ప్రసాదం బంధుమిత్రులకు పంచాలి. అగ్నిని, బ్రాహ్మణులను కూడా పూజించాలి.

శుభ్రంగా స్నానమాడి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, అందంగా అలంకరించుకుని చక్కని దుస్తులు వేసుకున్న మహిళలను ఆ రోజు సంతోషపెట్టాలి. ఆ రోజు వారికి ఇష్టమైనట్టు వ్యవహరించాలి. ఏది వారికి ఆనందం కలిగిస్తుందో అది చేయాలి.

ఇక్కడ ఒక్క నిమిషం ఆగాల్సి ఉంటుంది.

కశ్మీరులో ప్రతి రోజూ ఓ పండుగ. ప్రతి ఘడియ సంబరాలు. ఆటలు, పాటలు, అందమైన  అలంకరణలు, అందరూ సహపంక్తి భోజనాలు చేయటం స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటు గమనించాల్సిన అంశం ఏంటంటే మహిళలకు ప్రాధాన్యం. అవకాశం దొరికినప్పుడల్లా మహిళలను ఆనందపరచాలి అని చెప్పడమే కాదు, వారికి ప్రాధాన్యం ఇవ్వడం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, దేవీ పూజ కూడా కొన్ని రోజులలో మహిళలు మాత్రమే నిర్వహించాలని నిర్ద్వందంగా తేల్చి చెప్పడం కనిపిస్తుంది. అంటే, ఇప్పుడు కొందరు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నట్టు భారతీయ మహిళలు చారిత్రకంగా వంట ఇంటి కుందేళ్ళు, అణచివేతకు గురయినవారు కారన్న భావన కలుగుతుంది. కశ్మీరు, లడక్ ప్రాంతాలలో ఇప్పటికీ మహిళలకు ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతాలలో మహిళలు రాజ్యం చేసేవారనటానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో మహిళల మాటే శాసనం. అంతే కాదు రాణి సుగంధాదేవి, డిద్ధాదేవి వంటి వారు కశ్మీరును పరిపాలించారు. యశోవతి బాలగోనందుడి పేరిట రాజ్యం చేసింది. ఇదంతా చూస్తే, భారతీయ ధర్మంలో, సాంప్రదాయంలో మహిళలకు అగ్రస్థానం ఇవ్వటమే కాదు, వారు సామాజిక అభివృద్ధిలో కీలకమైన పాత్రలు నిర్వహించారనిపిస్తుంది. కానీ కాలక్రమేణా పలు చారిత్రక అంశాల వల్ల, పరిస్థితులు మారటం వల్ల సమాజంలో పెనుమార్పులు సంభవించడం వల్ల ఈనాడు భారతీయ ధర్మంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారన్న ఆరోపణలు చేసే వీలు చిక్కిందేమో అనిపిస్తుంది.

అదీ గాక, ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూపిస్తూ ప్రాచీన కాలం నుంచి ప్రతి ఒక్కరినీ శాపనార్థాలు పెడుతూ భారతీయ ధర్మం ‘పనికి రానిది’, ‘లోపభూయిష్టం’ అన్న దుష్ట భావన స్థిరపరచాలని కొందరు పనికట్టుకుని దుర్వ్యాఖ్యలు చేస్తూ, దుష్ట భావనలు ప్రచారం చేస్తున్నారనీ అనిపిస్తుంది. అయితే భారతదేశంలో పలు ప్రాంతాల చరిత్రను, సామాజిక వ్యవస్థను, ధార్మిక వ్యవస్థనూ పరిశీలిస్తే, ఇలా దుష్ప్రచారం చేసేవారి నైచ్యం, దౌష్ట్యం స్పష్టమవుతాయి.

ఒక నది అనంత దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నది నీరు ఆరంభంలోని స్వచ్ఛత – సాగర సంగమం వరకూ అలాగే ఉండాలనుకోవటం కుదరదు. దారిలో కలుస్తున్న అనేక ఉపనదులు, ఇతర కాలుష్యాల ప్రబావం నీటిపై ఉంటుంది. అలాగని దోషాల్ని నీటికి అంటగట్టడం, ఆ నది పనికి రానిది అనటం మూర్ఖత్వమే కాదు, నైచ్యం కూడా. వీలయితే నదిలో కలిసే కాలుష్యాల స్వరూపాన్ని అర్థం చేసుకుని, నీటిని శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. నీటిని స్వచ్ఛం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతే కానీ మొత్తం నది పనికిరానిద్, నీరు వ్యర్థం అని ఎవరైనా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారంటే, అదే పనిగా రంధ్రాన్వేషణ చేస్తూ, దోషాలెన్నటమే పనిగా పెట్టుకున్నారంటే వాళ్ళ ఉద్దేశాలను గమనించి, విశ్లేషించాల్సి ఉమ్టుంది. నిజా నిజాలు తెలపాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here