నీలమత పురాణం – 38

1
4

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

చత్వారః సాగరాః పూజ్యాస్తధా పాతాళ సప్తకమ్॥

[dropcap]నీ[/dropcap]లుడు పూజించాలని చెప్తున్న అంశాల జాబితా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు నాలుగు సముద్రాలను పూజించాలని చెప్తున్నాడు. ద్వీపాలు, సముద్రాలు అయిపోయాయి. వాటి తర్వాత పాతాళ లోకాలను పూజించాలని చెప్తున్నాడు. రుక్మజ్భీమ, శిలాభీమ, నీలమృత్తిక, రక్తభీమ, పీతా భీమ, శ్వేతక్షితి, కృష్ణక్షితి వంటి ఏడు పాతాళ లోకాలను పూజించాలి.

కాలాగ్ని రుద్ర, శేష, వరాహ, హరిలను అర్చించాలి. భూః, భువః, స్వః, మహః, జనః, తపః, సత్య లోకాలను అర్చించాలి. భూమి, నీరు, అగ్ని, వాయువు, మర్త్యలోకాలను పూజించాలి.

మనస్సు, బుద్ధి, ఆత్మ, అవ్యక్త పురుషుడు, హిమవంతుడు, హేమకూటుడు, నిషాధ, నీల, శ్వేత, శృంగవనీ, మేరు, మాల్యవన్, గంధమాధన, మనసోత్తర, మహేంద్ర, మలయ, సష్య, సూక్తిమన్, ఋక్స్‌వన్, వింధ్య, పరియత్ర, కైలాస పర్వతాలను పూజించాలి.

‘నీలమత పురాణం’లో తప్పనిసరిగా పూజించాలి అని చెప్తున్న ఏ అంశం కూడా కశ్మీరుకే ప్రత్యేకం కాదు. సమస్త భారతదేశంలో ప్రతి ఒక్కరికీ పవిత్రమైనవి. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనవీ, ప్రత్యేకమైనవీ కావు. ఇవి అందరివి. ఇంతకన్నా మించిన ఐక్యతా భావన ఏముంది? వ్యక్తి దేశంలో ఏ మూలకు చెందినవాడైనా, భాష ఏదయినా ధర్మం ప్రకారంగా దేశంలో అందరు ఒకటే. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాల దేశభక్తి భావనకూ, భారతదేశంలోని దేశభక్తి భావనకూ తేడా ఉంది.

ప్రపంచంలో దేశభక్తి భావన భౌగోళిక పరిమితులకు పరిమితం. ఆయా భౌగోళిక సరిహద్దులను బట్టి దేశభక్తి భావన ఉంటుంది. అంతే. కానీ, భారతదేశంలో దేశభక్తి భావనకు భౌగోళిక హద్దులతో సంబంధం లేదు.  ఇది ధార్మిక భావన. ధర్మభక్తి భారతదేశంలో దేశభక్తికి సమానార్థకం. ఇది గ్రహించని పలువురు మేధావులు భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం దేశభక్తి భావన లేదని భావిస్తారు. భారతదేశంలో రాజ్యాలతో సంబంధం లేకుండా ధర్మం అందరినీ ఒకటి చేసింది. ధర్మం ప్రమాదంలో పడినప్పుడు, ధర్మరక్షణ కోసం ‘రాజద్రోహం’ కూడా నేరంగా భావించబడలేదు. ధర్మరక్షణ ప్రధాన కర్తవ్యం. అందుకే చాణక్యుడు నందులను పడగొట్టి చంద్రగుప్తుని రాజుని చేశాడు. రాజుతో, రాజ్యంతో సంబంధం లేని ధర్మభక్తి భారతీయుల దేశభక్తి. అందుకే కశ్మీరంలో ఉన్న ప్రజలకు వింధ్య పర్వతాన్ని, సరస్వతి నదిని పూజించమని చెప్తున్నాడు నీలుడు. ‘వింధ్య పర్వతం దక్షిణాన ఉంది: మేము ఉత్తరాన ఉన్నాం. మేము వేరు, వాళ్ళు వేరు’ అనటానికి లేదు. అందరి వేర్లూ ధర్మంలోనే ఉన్నాయి. ఈ భావన దేశ ప్రజలలో స్నేహ సౌహార్ద్ర సౌభాతృత్వ భావనలను కలిగించింది.

ఒక వ్యక్తి ఇంటి ముందుకు వచ్చాడంటే, ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చాడు? వంటి విషయాలతో సంబంధం లేకుండా ఆతిథ్యం ఇచ్చేవారు. నిన్న మొన్నటి దాక దేశంలో పలు ప్రాంతాలలో ఒక ఆచారం ఉండేది. ఒక గృహస్థు తాను భోజనం చేసే ముందు ఊళ్ళో గుడి దగ్గరకు, ప్రధాన కూడళ్ళ దగ్గరకు వెళ్ళేవాడు. అక్కడ ఎవరైనా పర దేశీయులుంటే, వారిని పిలిచి, గౌరవించి, సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టిన తరువాతనే తాను భోజనం చేసేవాడు. ఊళ్ళో తిండికి లేకుండా ఎవరయినా అభోజనంగా ఉంటే తాను భోజనం చేయకూడదన్న భావన ఒకటి, ప్రతి మనిషిలో దైవాన్ని చూడాలన్న భావన మరొకటి, అందరూ ఒకటే అన్న ఆలోచన ఇంకొకటి కలిసి ఇలాంటి ఆచారం ఏర్పాటుకు దారితీశాయి. అన్నాన్ని అమ్ముకోవటం ఒకప్పుడు నేరం. కానీ అన్నాన్ని అమ్ముకోవటం వ్యాపారంగా ఎదిగిన తర్వాత ఇలాంటి ఆచార వ్యవహారాలు వాటంతట అవే అదృశ్యం అయిపోయాయి. గతం తిరిగి రాదు. వస్తే అది గతం కాదు. కనీ గతాన్ని అర్థం చేసుకున్న వాడికి వర్తమానం బోధపడుతుంది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతాడు. కాబట్టి, మనం గతం నుంచి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నీలమత పురాణ పఠనం ఈ ఆవశ్యకతను మరింత స్పష్టం చేస్తోంది.

శచి, వనస్పతి, గౌరి, ధూమోర్న, సినీవాలి, కుంష, రాక, అనుమతి వంటి వాటిని అందమైన రూపంలో ఆరాధించాలి. అయాతి, నియతి, ప్రజ్ఞా, వాలి, వేల, ధారణి, ధాత, విధాత, ఇరావణ, సురభి, ఉచ్చైశ్శ్రవాలను పూజించాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here