నీలమత పురాణం – 4

1
13

[box type=’note’ fontsize=’16’] “కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది?” అన్న ప్రశ్నకు సమాధానం ‘నీలమత పురాణం – 4’లో లభిస్తుంది. [/box]

[dropcap]బా[/dropcap]లభావాత్ పాండుసునైర్నానీతః కౌరవైర్న వా॥ (27)

గోనందుడు బాలుడవడం వల్ల కౌరవులు కానీ పాండవులు కానీ కశ్మీరరాజును కురుక్షేత్ర యుద్ధంలో తమవైపు పోరాడమని కోరలేదు.

ఇదీ కాశ్మీర రాజ్యం కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాల్గొనపోకపోవటానికి కారణం.

జనమేజయ ఉవాచ:

దేశస్య గౌరవం చక్రే కిమర్థం ద్విజసత్తమ।
వాసుదేవో మహాత్మా యదభ్యాషిశ్చత్స్యయం ప్రియమ్॥ (30)

అప్పుడు జనమేజయుడు అడిగాడు:

“ఓ విప్రోత్తమా! వాసుదేవుడు ఎందుకని కాశ్మీరాన్ని అంతగా గౌరవించాడు? తాను ఆక్రమించకుండా ఒక స్త్రీని రాజ్యాధికారిని నియమించేటంతగా ఎందుకని గౌరవించాడీ దేశాన్ని?”

ఇది కూడా అడగవలసిన ప్రశ్ననే.

అందరూ కృష్ణుడిని ద్వేషిస్తారు. అతడిని అవమానించాలని ప్రయత్నిస్తారు. కృష్ణుడితో వైరం పూనుతారు. కానీ ద్వేషించేవారికి పది రెట్లు ఎక్కువమంది కృష్ణుడిని ఆరాధిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి కృష్ణుడి ప్రతి చర్యకు కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ ప్రశ్నవల్ల కశ్మీరు ప్రాశస్త్యం, పవిత్రతలకు కారణాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్రశ్నకు సమాధానం జనమేజయుడు ఆశించినట్టే వస్తుంది.

యేషా దేవి ఉమా సైవ కశ్మీరా నృపసత్తమ।
అశీత సరః పూర్ణజలం సురమ్యం సుమనోహరమ్॥

ఉమాదేవిదీ కశ్మీరానిదీ అభేద ప్రతిపత్తి. ఇక్కడ అనేక సుందరమైన సరస్సులు, నదులు ఉండేవి. నిజానికి కశ్మీరం అంతా ఒకప్పుడు సరస్సుగా ఉండేది.

ఇక్కడి నుంచి కశ్మీరాన్ని అతి సుందరంగా వర్ణిస్తాడు వైశంపాయనుడు. కశ్మీరు ప్రజలు ధర్మబద్ధులై యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. సత్యాన్వేషణలో, సాధనలో సమయం గడిపేవారు. వేద వేదాంగాలను అభ్యసించేవారు. క్షత్రియులు వీరులు. వైశ్యులు వ్యాపారదక్షులు. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. ఇతరులు కూడా తమ కర్తవ్యాలను సక్రమంగా చిత్తశుద్ధితో నిర్వహించేవారు. అడుగడుగునా మందిరాలతో, పవిత్ర స్థలాలతో కశ్మీరు సర్వాగ సుందరంగా అలరాలేది.

పృథివ్యాం యాని తీర్థాని తాని తత్ర నరాధిప।
ఋష్యాశ్రమ సంసంబాంధం శీతాతాప శుభం సుఖమ్॥

భూమిపై ఎన్ని తీర్థాలున్నాయో అన్నీ కాశ్మీరులో ఉన్నాయి. ఋష్యాశ్రమాలతో సుందరమైన కశ్మీరు వేసవిలో చల్లగా ఉండి సుఖాన్నిస్తుంది.

శత్రువులతో పరాజయం ఎరుగనిదై, పరాజితమవటం అన్న మాట తెలియకపోవటం వల్ల అందువల్ల కలిగే భయం తెలియనిదై, కరువు కాటకాలు లేకుండా సుఖమయంగా ఉండేది కశ్మీరు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా పండుగలతో కళకళలాడుతుండేది కశ్మీరు. దౌష్ట్యం అన్నది లేకుండా పాములు, పులులు, ఎలుగుల వంటి దుష్ట జీవుల జాడ లేకుండా ఉండేది. కశ్మీరులో  మనుషులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఆనందంతో సంబరాలు చేసుకునేవారు. అడుగడుగునా అందమైన వనాలతో, పూదోటలతో, ఆటపాటలతో స్వర్గంలా ఉండేది కశ్మీరు.

తత్ర నద్యస్తథా పుణ్యాః పుణ్యాన్యపి సరాంసి చ।
దేవాలయాః సంపుణ్యాశ్చ తేషాం చైవ తథాశ్రమాః॥
కశ్మీర మండలం పుణ్యం సర్వతీర్థమరిందం।
తత్ర నాగా హృదాః పుణ్యాస్తత్ర పుణ్యా శిలోశ్చయా॥

కశ్మీర మండలం పుణ్యతీర్థాలతో నిండి ఉంది.  నాగుల పవిత్ర సరస్సులు, అతి పవిత్రమైన పర్వతాల కాలవాలం కశ్మీరం. అతి పవిత్రమైన మందిరాలు, వాటి వెంటే ఋష్యాశ్రమాలు ఉంటాయి.

తన్మధ్యేన చ నిర్యాతా సీమన్తమివ కుర్వతీ।
వితస్తా పరమా దేవీ సాక్షాద్విమనగోద్భవా॥

ఇంత పవిత్రమైన కశ్మీరంలో, తలపై కేశాలను రెండు భాగాలుగా చేస్తూ పాపిట వేసినట్టు, రెండు భాగాలు చేస్తూ హిమాలయాలలో జన్మించిన దేవీ సమానమైన వితస్త నది ప్రవహిస్తోంది.

ఇది విన్న జనమేజయుడికి మరో సందేహం వచ్చింది.

“కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది?” ఇదీ జనమేజయుడి సండేహం. ఇది కూడా అడగాల్సిన ప్రశ్ననే.

ఇప్పుడు భూగర్భశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఎదిగి భూమి ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు, కదలికలు పరిశోధించి, విశ్లేషించి తెలుపుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా సముద్రంలో మునిగి ఉండేది అని అందుకు నిదర్శనంగా ఆ ప్రాంతంలో కొండలలో ఉన్న రాళ్ళలో శిలాజాలు (fossils), నీటిలో మాత్రమే ఉండగలిగే జీవుల ఆనవాళ్ళను చూపి తీర్మానిస్తున్నది. లేకపోతే గతంలో ఓ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండేదని రాళ్ళపై ఉన్న ఆనవాళ్ళ ద్వారా తేల్చి చెప్తోంది. ఇంకొన్ని ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ఉండెవనీ, అక్కడి రాళ్ళన్నీ లావా ఘనీభవించడం వల్ల ఏర్పడినవేననీ చెప్తోంది. ఇలా భూగర్భశాస్త్రం అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఆవిష్కరిస్తుంది.

నీలమత పురాణం రాసిన కాలంలో ‘భూగర్భశాస్త్రం’ ఇప్పుడున్న రూపంలో లేదు. అప్పటి శాస్త్రం వేరు. కానీ ఇన్ని పరిశోధనల తర్వాత భూగర్భశాస్త్రం చెప్పిన విషయాలు ఆనాటి పురాణాలలో కనిపిస్తాయి. అయితే టెర్మినాలజీ వేరు.

ప్రాజీన కాలం నాటి వాఙ్మయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని విశ్లేషించేందుకు ప్రధాన ప్రతిబంధకం సాంకేతిక పదాలు.

ఇప్పుడు మనం పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఏర్పాటు చేసిన పేర్లకు అలవాటు పడిపోయాం.

ప్రాచీన కాలంలో పురాణాలు రాసేవారికి భవిష్యత్తులో తాము చెప్పిన అంశాలు భూగర్భ శాస్త్రం పరిధిలోకి వస్తాయని, వాటికి వేర్వేరు పేర్లుంటాయని తెలియదు. భవిష్యత్తు తరాల వారు తమకు తెలిసిన టెర్మినాలజీతో పురాణాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారని వారు ఊహించలేదు. దాంతో పురాణాలలో ఆనాటి ప్రతీకలతో ఆనాటి టెర్మినాలజీతో ఆనాటి పద్ధతి ప్రకారం విజ్ఞానాన్ని పొందుపరిచారు.

జనమేజయుడి ప్రశ్నకు వైశంపాయనుడు చెప్పిన సమాధానం ఆధునిక భూగర్భశాస్త్రం ఆవిష్కరణలతో సరిపోతుంది.

భూగర్భశాస్త్రం ప్రకారం ఒకప్పుడు హిమాలయ ప్రాంతమంతా టెథిస్ అనే సముద్రంతో నిండి ఉండేది. ఇది 70 మిలియన్ సంవత్సరాల నాటి పరిస్థితి. అప్పటికి భూమి ప్లేట్ల (ఫలకల) రూపంలో సముద్రంలో కదులుతూండేది. అలా కదులుతున్న ఇండో – ఆస్ట్రేలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్లు ఢీకొన్నాయి. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ విడివడి ఆస్ట్రేలియా ఇండియాగా ఏర్పడ్డాయి. మ్యాన్మార్ లోని అరకన్ యోమా, అండమాన్ నికోబార్ ద్వీపాలు, బంగాళాఖాతం ఈ రెండు ప్లేట్లు ‘ఢీ’ కొనడం వల్ల ఏర్పడ్డాయి. టెథిస్ సముద్రాన్ని ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ కప్పేయడం వల్ల యూరేషియన్ ప్లేట్‌తో ఢీ కొన్నప్పుడు అక్కడున్నవన్నీ మడతలు పడి పైకి తోయబడ్డాయి. అలా ఏర్పడ్డ ముడత పర్వతాలు మంచుతో కప్పబడడం వల్ల హిమాలయ పర్వతాలు అన్నారు. అందుకే హిమాయల పర్వతశిఖరాలపై సముద్రంలో ఉండవలసిన జీవజాలాల ఆనవాళ్ళున్నాయి. దాన్నిబట్టి ఒకప్పుడివన్నీ సముద్రంలో భాగమనీ, రెండు ప్లేట్లు ఢీ వల్ల కలిగిన ఘర్షణ వల్ల పర్వతాలుగా ఏర్పడ్డాయని ఊహిస్తున్నారు. ఈ కదలిక ఇంకా సాగుతోంది. అందుకే ఈ ప్లేట్లు ఢీకొన్న ప్రాంతాలలో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. భూకంపాలు వస్తూంటాయి. ఈ సమయంలో ఏర్పడినవే యూరప్ లోని ఆల్ఫ్స్ పర్వతాలు. ఈ ప్లేట్ల కదలికల శాస్త్రాన్ని ‘ప్లేట్ టెక్నానిక్స్’ అంటారు. పై నుంచి చూస్తే ఆల్ప్స్ పర్వతాలనూ, హిమాలయ పర్వతాలను ఒకే రేఖతో కలపవచ్చని తెలుస్తుంది. అంటే ప్లేట్లు తాకిన అంచువెంబడి పర్వతాలు ఏర్పడ్డాయన్నమాట. ఇప్పటికే ఇండియా ప్లేటు సంవత్సరానికి 67 మి.మీ. చొప్పున కదులుతూ ఆసియా ప్లేట్ వైపు దూసుకుపోతోంది. మరో పది మిలియన్ సంవత్సరాలలో ఇండియా ప్లేట్ ఆసియా ప్లేట్‌తో ఢీకొంటుంది. ఇప్పటికే జరుగుతున్న కదలికల వల్ల హిమాలయాలు సంవత్సరానికి 5 మి.మీ. ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అందుకే భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. హిమాలయాలలో హిమనీనదాలు ఉండడం వల్ల, వాటి కదలికల వల్ల కూడా భౌగోళిక స్వరూపం రూపాంతరం చెందుతోంది. ఇంత మంచు కరగడం వల్ల నదులు ఏర్పడ్డాయి, సరస్సులు ఏర్పడ్డాయి.

ఇలాంటి ఒక సరస్సు ప్రస్తుతం కశ్మీరు ఉన్న ప్రాంతంలో ఉండేది. దాన్ని సతీసరోవరం అని అంటూంటారని చెప్తున్నాడు వైశంపాయనుడు. దాని కన్నా ముందు ఆయన చెప్పిన వివరాలు, మనం పైన తెలుసుకున్న భూగర్భశాస్త్రం వివరాలితో పోలిస్తే ‘అద్భుతం’ అనిపిస్తుంది.

“ఒకప్పుడు సరోవరంగా ఉన్న ఈ ప్రాంతం కశ్మీరంగా ఎలా రూపాంతరం చెందింది?” అన్న జనమేజయుడికి తిన్నగా సమాధానం ఇవ్వడు.

ఇదే ప్రశ్నని గోనందుడు తీర్థయాత్ర సమయంలో బృహదీశ్వరుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు అని సమాధానం చెబుతాడు.

బృహదీశ్వరుడు – ముందు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళటానికి ఒక నెల పడుతుందని, ఇలాంటి రెండు నెలలు కలిస్తే ఒక ఋతువు అవుతుందనీ, మూడు ఋతువులు ఒక అయనం అవుతుందనీ, రెండు అయనాలు ఒక సంవత్సరం అవుతుందని చెప్తాడు. తరువాత ఇలాంటి నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు కలియుగం అవుతుందని చెప్తాడు. ఇంతకు రెట్టింపు ద్వాపర, మూడు రెట్లు త్రేతా యుగం, నాలుగు రెట్లు కృతయుగం అని చెప్తాడు. ఇలాంటి 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. మన్వంతరం సమాప్తి కాగానే ప్రళయం వస్తుంది, చరాచర సృష్టి అంతా నశిస్తుంది.

భూర్లోకమాశ్రితాః సర్వా నాశమాయాంతి సర్వథా।
ఏకార్ణవం జగత్సర్వం తదా భవతి భూపతే ॥

సృష్టి లోని సర్వం నశించడంతో, జగత్తంతా ఒక మహాసముద్రం అనిపిస్తుంది.

శేషం చినశ్యతే సర్వ జంబూద్వీపం విశేషతః।
తదా వినష్టె లోకేఽస్మిన్మహాదేవః స్వయం ప్రభు॥

జంబూద్వీపం పూర్తిగా నాశనమైపోతుంది. అలా నాశనమయ్యే విశ్వాన్ని కాపాడేందుకు సముద్రం నీటిలోకి మహా విష్ణువు స్వయంగా ప్రవేశిస్తాడు.

ఇలాంటి స్థితిలో సతీదేవి నౌక రూపం ధరిస్తుంది. మనువు జీవజాలాలను, బీజాలను ఆ పడవలో ఉంచుతాదు. చేప రూపంలో విష్ణువు పడవను తీసుకువెళ్ళి పర్వతాలలో కట్టేస్తాడు. ఆ పర్వతం పేరు నౌబంధనా. ఈ పర్వత దర్శనం అన్ని పాపాలను, భయాలను నశింపజేస్తుంది. అలా ఒక కృతయుగం కాలం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది.

విదధాతి ప్రజావర్గే యథాపూర్వమరిందమ్।
నౌదేహేన సతీ దేవీ భూమిర్భవతి పార్థివ॥
తస్యాం తు భూమై భవతి సరస్తు విమలోదకమ్।
షడ్యోజనాయతం రమ్యం తదర్ధేన చ విస్తృతమ్ ॥

మళ్ళీ సృష్టి ఆరంభమైన తరువాత, నౌక రూపంలో ఉన్న సతీదేవి భూమిగా మారుతుంది. ఆ భూమిపై నిర్మలమైన నీరు గల ‘సతీదేశమ’నే సరస్సు ఏర్పడుతుంది. ఆరు యోజనాల పొడవు, అందులో సగం వెడల్పు గల అత్యద్భుతమైన ఈ సరస్సులో దేవతలు జలకాలాడతారు.

ఇలా ఏర్పడిందన్నమాట ‘సతీ సరోవరం’.

ఈ లెక్కలు, యుగాలు, మన్వంతరాలు, సతీదేవి  నౌకా రూపం ధరించడం, నీరు భూమిగా మారటం ఇవన్నీ ఈనాటి వైజ్ఞానిక దృష్టితో చూస్తే హాస్యంగా, అవహేళనార్హంగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ప్రతీకలు, ఆ కాలం నాటి టెర్మినాలజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పురాణాలు, పౌరాణిక గాథలు ఎంత కట్టుకథలుగా అనిపించినా అవి కట్టుకథలు కావు, గట్టి కథలు అనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకునేందుకు మనం ‘విజ్ఞానం’గా భావిస్తున్న విజ్ఞానాన్ని దాటి చూడాలనిపిస్తుంది.

భూగర్భశాస్త్రం, 70 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ‘అద్భుతం’గా భావిస్తాం, అదే కలియుగం నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు,ఇందుకు నాలుగు రెట్లు కృతయుగం అని, 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం అని అంటే ‘పుక్కిటి పురాణ లెక్కలు చెప్పకు’, పొమ్మంటారు. ఇదీ మన దృష్టి.

(మిగతా వచ్చే సంచికలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here