నీలమత పురాణం – 48

1
5

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణం నిండా పండగలు పబ్బాలు. పండగల సమయంలో చేయాల్సిన పూజలు, పాటించాల్సిన విధులతో నిండి ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాన దేవతలు, పవిత్ర స్థలాల ప్రసక్తి వస్తూంటుంది. ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే భారతదేశం నలుమూలలా పూజలందుకునే దేవతలు, పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలు కశ్మీర్ ప్రజలకు కూడా పవిత్రమైనవి, పూజార్హమైనవి అన్నమాట. అంటే కశ్మీరు భారతదేశంలోని ఇతర భాగాలకు ఏ మాత్రం తేడా లేదన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. దేశంలోని ఇతర ఏ ప్రాంతానికి దానికదే ప్రత్యేకమైన పురాణం లేదు. కశ్మీర్‌కు నీలమత పురాణం ఉన్నట్టు ఇతర ఏ ప్రాంతానికి ప్రత్యేక పురాణం లేదు. అంటే కశ్మీరు ప్రజలకు, కశ్మీరులో నివసిస్తున్న వారికి ఎవరెవరిని పూజించాలి, ఎలా పూజించాలి అన్న విషయాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నమాట. ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వస్తుంది.

ఇతర ఏ ప్రాంతానికి ఇలా ఆ ప్రాంతం ఆవిర్భావం నుంచి చరిత్ర చెప్పడం కనబడదు. ఇలా ఆరంభంలో నాగులు, పిశాచాలతో నిండి ఉన్న ప్రాంతంలోకి మనుషులు రావటం, పిశాచాలు నాగులతో కలిసి బ్రతకాలంటే ఎలాంటి పూజలు చేయాలి చెప్పాల్సిన అవసరం రావటం వేరు. కశ్మీరులో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వారికి ప్రత్యేకమైన నీలమత పురాణం అవసరం వచ్చింది.

సాధారణంగా పురాణాలలో దేవీ దేవతల గాథలు ఉంటాయి. వారు ఈ ప్రపంచాన్ని దుష్టశక్తుల నుంచి తప్పించిన విధానం గురించిన గాథలు ఉంటాయి. పూజా విధానానికి ప్రత్యేకమైన శాస్త్రాలు ఉంటాయి. కానీ కశ్మీరులో అన్ని ఈ నీలమత పురాణంలోనే లభిస్తాయి. అంటే, ప్రజలు ఎన్నటికీ మరచిపోని విధంగా పూజావిధానాలు పొందుపరచి అందించారన్నమాట. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కశ్మీరులో అతి ప్రాచీన కాలం నుండి మానవులు జీవిస్తున్నారు. కానీ నీలమత పురాణం ప్రకారం నాగులు, పిశాచాల నడుమ మనుషులు వచ్చి చేరారు. అంటే కశ్మీరులోకి మనుషులు అడుగుపెట్టే కన్నా ముందే భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో మనుషులు స్థిరపడటమే కాదు, నాగరికత కూడా ఉచ్చస్థాయిలో ఉందని ఊహించే వీలు కలుగుతుంది. ఎందుకంటే కశ్యపుడు భారతదేశంలోని పలు పవిత్ర స్థలాలను దర్శిస్తూ కశ్మీరు చేరుకున్నాడని నీలమత పురాణం చెప్తుంది. కాశ్మీరులోని పవిత్ర స్థలాల గురించి చెప్పి నీలుడు అతడిని కశ్మీరు వైపు ఆకర్షిస్తాడు. ఆపై, ప్రజలకు పాటించ వలసిన విధులు బోధిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే కశ్మీరు ఆదినుండి భారతీయుల నివాసం అని అనిపిస్తోంది. దీంట్లో సంకోచాలకీ, సంశయాలకీ తావు లేదు. అక్కడ చేరిన వారు తప్పుదారి పట్టకుండా, తమ మూలాలను విస్మరించకుండా వారి కోసం నీలమత పురాణం అందింది.

గమనిస్తే, భారతదేశ చరిత్రలో మధ్యయుగంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తురుష్కుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లోకి పారిపోయారు. కొన్ని తరాల తరువాత వారు మూలాలు మరచిపోయి కొండజాతివారిగా స్థిరపడ్డారు. కానీ వారి అలవాట్లు, పద్ధతులు కానీ వారికి తెలియకుండానే వారి మూలాలను వారికి గుర్తుచేస్తుంటాయి. కానీ వారికి ఆ స్పృహ ఉండదని పరిశోధకులు తేల్చారు. బహుశా ఇలా కొండల్లో, కోనల్లో తలదాచుకున్న వారు ఒక వ్యవస్థను ఏర్పరచుకొని ఉంటే, వారికి ఇలాంటి పురాణాలు ఉండేవేమోనని ఒక పరిశోధకుడు అభిప్రాయపడ్డాడు. అయితే కశ్మీరు ఆవిర్భావం నాటి పరిస్థితులు వేరు. మధ్యయుగంలో రాక్షసుల లాంటి శత్రువులు జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నప్పుడు, ప్రాణాలు అరచేత పట్టుకుని అనుక్షణం భయంతో జీవిస్తున్న వారి పరిస్థితులు వేరు. కానీ ఇప్పటికీ వారి జీవన విధానం, పద్ధతులను తులనాత్మకంగా అధ్యయనం చేస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలికి వస్తాయి. భారతదేశ చరిత్రలో ఇంకా వెలికి రాని అద్భుతమైన సత్యాలు అనేకం అణగి ఉన్నాయని నిరూపిస్తాయి.

ఆయుధాలు, పనిముట్ల పూజలు అయిన తరువాత అందరూ సంతోషంగా ఆహారాన్ని స్వీకరించాలి. మహిళలు పూలు, పండ్లతో నిండిన వృక్షాలను పూజించాలి. దేవతలను పూలు, సుగంధ ద్రవ్యాలతో పూజించాలి. పక్షులకు ఆహారాన్ని అందించాలి. స్నేహితులకు, బంధువులకు, బ్రాహ్మణులకు, తమపై ఆధారపడిన వారికి, సేవకులకు శుక్లపక్షంలో 8, 4, 14, 9 రోజులలో భోజనాలు అందించాలి. దేవతలను పూజించినంత పవిత్రంగా, ఆ విగ్రహం ముందు ఆహారాన్ని స్వీకరించాలి. సంవత్సర ఆరంభంలో కూడా దేవతను ఇలాగే పూజించాలి. అయితే పూజించిన ప్రతిసారీ పక్షులకు ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు.

వృక్షాలు పూలు పండ్లతో విరబూసిన అప్పుడు భార్య, పిల్లలు, సేవకులు, మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లాలి. శుభ్రంగా స్నానమాచరించి, అందంగా అలంకరించుకొని, మంచి దుస్తులు ధరించి శ్యామదేవతను పూజించాలి. పూలు, ధూప దీప నైవేద్యాలతో, నెయ్యి, తేనెలతో పూజించాలి. బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. ద్రాక్షపండ్లను నైవేద్యంగా అర్పించాలి. ద్రాక్షతో పాటు ఆహారాన్ని సేవించాలి. ఆపై పాటలు, నృత్యాలతో సంబరాలు చేసుకోవాలి.

జ్యోతిష్కులు చెప్పిన సమయాన్ని అనుసరించి పూజలు చేయాలి. నక్షత్ర సమూహాలు, చంద్రుడు, గ్రహాలకు పూలు, సుగంధ ద్రవ్యాలు, నైవేద్యాలతో అర్చించాలి. బ్రాహ్మణులను, అగ్నిని పూజించాలి. సంగీత వాయిద్యాలు, గానాల నడుమ సంబరాలు చేసుకోవాలి.

అధర్వణ వేదాన్ని అనుసరించి రాజు లక్ష హోమము, కోటి హోమాలు నిర్వహించాలి. ఇవన్నీ నిత్యం తప్పకుండా జరపాల్సిన కార్యాలు. రాజులు ప్రతి సంవత్సరం, తాము సామ్రాజ్యాన్ని అధిరోహించిన రోజున మళ్లీ సింహాసనాన్ని కొత్తగా స్వీకరించినట్టు పట్టాభిషేక మహోత్సవాన్ని గొప్పగా నిర్వహించాలి. అంటే ఇన్నేళ్ల నుంచి రాజ్యం చేస్తున్నానన్న అహంభావం రాజుకు కలగకుండా ప్రతి సంవత్సరం అప్పుడే రాజ్యాన్ని స్వీకరించినట్లు భావించాలి. కొత్తలో ఉండే పట్టుదలను, సాధించాలన్న తపనను ప్రతి సంవత్సరం కొత్తగా ఉత్తేజభరితంగా ఉంచుకోవాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here