నీలమత పురాణం – 6

1
6

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

సముద్యుక్తై ర్యథా పూర్వం సముద్భుతా మహీస్థితిః।
తత్ర దక్షో దదౌ కన్యాః కశ్యపాయ త్రయోదశ॥ (69)

[dropcap]వై[/dropcap]వస్వత మన్వంతరం ఆరంభమవుతుండగా దక్షడు తన పదముగ్గురు పుత్రికలను కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు.

నీలమత పురాణాన్ని పురాణంగా పలువురు పరిగణించకపోవడానికి కారణం, పురాణంగా వర్గీకరణకు గురికావాలంటే సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరిత అన్న అయిదు లక్షణాలు ఉండాలి. నీలమత పురాణంలో సృష్టి గురించి ఉంది. మొత్తం విశ్వం నీటిలో మునిగి ఉండడం, మనువు జీవులను కాపాడడం ఉంది. ఆ తరువాత తిన్నగా వైవస్వత మన్వంతర ఆరంభం, దక్ష ప్రజాపతి పుత్రికలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేయడంతో కథ ముందుకు సాగుతుంది. అంటే సృష్ట్యారంభం, జీవుల ఉత్పత్తి వంటి వివరాలు లేకుండా తిన్నగా ‘వైవస్వత మన్వంతరంలో దక్ష ప్రజాపతి’ అంటూ కొనసాగడంతో, ఈ దక్ష ప్రజాపతి ఎవరు? అతనికి పదముగ్గురు కూతుర్లు ఎలా కలిగారు? కశ్యపుడు ఎవరు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అంటే, నీలమత పురాణం చలామణీలోకి వచ్చేనాటికి ఇందులో వివరించని అంశాలు అనేకం ప్రజలలో ప్రచారంలో ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి నీలమత పురాణం దృష్టి ప్రధానంగా ‘నీలుడు’ చెప్పిన అంశాలపైనే ఉండడంతో అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకని అనుకొని ఉండవచ్చు. ఇదెలాగంటే, ఒక రచన చేసే సమయంలో రచయిత తన రచనలోని ప్రధానాంశం మీద నుండి దృష్టి మళ్ళకుండా ఉండేందుకు, ఇతర విషయాలు.. అవి ప్రధానమైనా, అందరికీ తెలుసని వదిలేస్తాడు. అదీగాక నీలమత పురాణం కశ్మీరుకు ప్రత్యేకమైన స్థానిక పురాణం, ఇతర ప్రాంతాలకు అంతగా వర్తించదు. కాబట్టి, విశ్వ సృష్టి ఆవిర్భావం, జీవుల ఆవిర్భావం వంటి విషయాలన్నీ చెప్పే బదులు (ఇతర జాతీయ పురాణాలలో ఉన్నాయి కాబట్టి) తిన్నగా ప్రళయం, ప్రజాపతి దగ్గరకు వచ్చేసింది ‘నీలమత పురాణం’. ఎందుకంటే నీలుడు ప్రవచించిన విషయాలు కశ్మీరుకే ప్రత్యేకం కాబట్టి తిన్నగా అసలు విషయానికి వచ్చేసింది.

పురాణాలలో గమనిస్తే ‘దక్షుడు’ ఒకడే అయినా అతని కథ రెండు భిన్న దశలలో కనిపిస్తుంది. ఒక కథలో ‘దక్షయజ్ఞం’ సమయంలో దక్షుడు శివుడి ఆగ్రహానికి గురయి మరణిస్తాడు. అప్పుడు దేవతలు గొర్రె తలను అతికించి దక్షుడిని బ్రతికిస్తారు. ఆ తరువాత దక్షుడు ఏమయ్యాడనేది ఏ పురాణం ప్రస్తావించదు. దేవీ పురాణంలో దక్షుడి తలను తెంపేందుకు భద్రకాళి వస్తుంది. పని పూర్తి చేస్తుంది. దక్షుడి జీవితంలో పురాణాలు ప్రస్తావించిన మరొక కథ సృష్టి ఆరంభం నుంచి ఉంటుంది.

బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి, అంగీరస, అత్రి, పౌలస్త్యుడు, వశిష్ఠుడు, పుహాహ, క్రతులను సృష్టించాడు. బ్రహ్మ ఆగ్రహం నుంచి రుద్రుడు రూపు దిద్దుకున్నాడు. అతని తొడ నుండి నారదుడు ఉద్భవించాడు. కుడి బొటనవేలి నుంచి దక్షుడు జన్మించాడు. బ్రహ్మ మెదడు నుంచి శౌనకుడు, ఎడమ బొటనవేలి నుంచి వీరణి అనే కూతురు జన్మించారు. వింధ్య పర్వతాలలో దక్షుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఫలితంగా మహావిష్ణు అతనికి దర్శనమిచ్చాడు. ‘అశిక్ని’ని అతనిని భార్యగా ఇచ్చాడు.

కాళికా పురాణంలో ‘వీరణీ నామ తస్యస్తు అశిక్నిత్యాపి సత్తమా’ అని ఉండడంతో అశిక్ని, వీరణిలు ఒకే వ్యక్తి రెండు పేర్లుగా భావించే వీలు చిక్కుతోంది. అశిక్ని వల్ల దక్షుడికి సంతానం కలిగింది. వారిలో సతిని శివుడు వివాహం చేసుకున్నాడు. దక్షయజ్ఞం జరిగింది.

అయితే దక్షుడి జననం గురించి పురాణాలలో మరో కథ ఉంది. ‘బర్హి’ పదిమంది కుమారులను ప్రాచేతసులంటారు. వీరు దీర్ఘకాలం తపస్సు చేశారు. వారు తపస్సు ముగించుకుని వచ్చేసరికి, భూమిపై వృక్షాలు విపరీతంగా పెరిగి భూమి అడవిలా తయారయింది. అది చూసి ఆ పది మంది ఆగ్రహంతో అడవులను దగ్ధం చేయడం ఆరంభించారు. అప్పుడు ఔషధీ దేవత అయిన చంద్రుడు (సోమదేవుడు) అడవులను సంపూర్ణంగా దగ్ధం చేయవద్దని వారించాడు. చెట్లతో వారికి సంధి చేశాడు. ఒప్పందం చేశాడు. ఫలితంగా సర్వవృక్షాల సారంగా జన్మించిన మారిశను వారికి భార్యగా అందించాడు. తన తెలివిలో అర్ధభాగం, ప్రాచేతసుల తెలివిలో అర్ధభాగం గ్రహించి అత్యంత తెలివిగల దక్షుడు వారికి జన్మిస్తాడని వాగ్దానం చేస్తాడు. ఫలితంగా వారికి దక్షుడు జన్మించాడు.

అలాంటి దక్షుడిని పిలిచి బ్రహ్మ ప్రజలను సృజించమన్నాడు. ఫలితంగా, దక్షుడు దేవతలను, మునులను, ఋషులను, గంధర్వులను, అసురులను, నాగులను సృష్టించాడు. వీరి పునరుత్పత్తి కోసం స్త్రీ పురుషు జీవుల నడుమ లైంగిక చర్యను ప్రవేశపెట్టాడు. అశిక్ని ద్వారా అయిదువేలమంది సంతానాన్ని కన్నాడు. వారు మళ్ళీ పునరుత్పత్తి జరిపే సమయానికి నారదుడు అడ్డుపడి వాళ్ళని భూమి అంచులను దర్శించి రమ్మన్నాడు. అలా వెళ్ళిన వాళ్ళు  తిరిగి రాలేదు. వారిని హర్యశ్వులంటారు. దాంతో దక్షుడు మళ్ళీ వెయ్యి మంది సంతానాన్ని సృష్టించాడు. వీళ్ళని శబలాశ్వులంటారు. వీరినీ నారడుడు ప్రపంచం నలుమూలలా విస్తరింపజేశాడు. దాంతో దక్షుడికి కోపం వచ్చి నారదుడిని దేశద్రిమ్మరికి కమ్మని శపించాడు. అప్పుడు దక్షుడు అరవైమంది పుత్రికలను కన్నాడు. వారిలో పదిమందిని ధర్మదేవుడికి, 13 మందిని కశ్యపుడికి, 27 మందిని సోముడికి, నలుగురిని అరిష్టనేమికి, ఇద్దరిని బహుపుత్రునికి, ఇద్దరిని అంగిరసుడికి, ఇద్దరిని కృశాశ్వునికి ఇచ్చి వివాహం చేశాడు.

పురాణాలలో దక్ష ప్రజాపతి 60మంది పుత్రికల పేర్లు కూడా ఉన్నాయి.

కశ్యపుడి భార్యలు: అదితి, దితి, దను, అరిష్ట, కద్రువ, సురస, ఖస, సురభి, వినత, తామ్ర, క్రోధనక, ఇడ, ముని.

ధర్మదేవుడి భార్యలు: అరుంధతి, వాసు, యమి, లంబ, భాను,  మరుద్వతి, సంకల్ప,  ముహూర్త, సంధ్య, విశ్వ.

సోముడి భార్యలు: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, తారకం (ఆర్ద్ర), పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రోణ, శ్రవిష్ట, ప్రాచేతస, పూర్వప్రోష్ఠపాదమ్, ఉత్తర ప్రోష్ఠపాదమ్, రేవతి

అయితే దక్షుడికి మరో భార్య ప్రసూతి (ఉత్తానపాదుడి సోదరి) ద్వారా 24గురు పుత్రికలు కలిగారు. వీరిలో పదముగ్గురిని ధర్మదేవుడు, ఒకరిని భృగు, సతిని శివుడు, మరీచి, అంగీరసుడు, పౌలస్త్యుడు, పులహుడు, క్రమ ఒక్కొక్కరిని – అనసూయకు అత్రిని, ఊర్జకు వశిష్ఠుడికి, స్వాహాను అగ్నిదేవుడికి ఇచ్చి చేశాడు.

అయితే ఈ విషయాలన్నీ చెప్పకుండా నీలమత పురాణం తిన్నగా కశ్యపుడికి 13మంది పుత్రికలను ఇచ్చి వివాహం చేయడంతో చెప్తుంది. నీలమత పురాణంలో ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక నిముషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.

మన పురాణాల్లో ఉన్న అనేక విషయాలు మన బుద్ధికి విరుద్ధంగా తోస్తాయి. ప్రాచేతసులు చెట్లను కూల్చడం, చెట్ల పుత్రికను వివాహమాడటం, పదిమందికి ఒకడే పుత్రుడుదయించడం, దక్ష ప్రజాపతికి వేల కొద్దీ కొడుకులు కలగడం, వారు దేశాలు పట్టిపోవడం, మళ్ళీ 60 మంది కూతుళ్ళను కనటం, వారిని గంపగుత్తగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం, మళ్ళీ ఇంకో భార్యకు 13 మంది కలగటం – ఇదంతా అభూత కల్పనలుగా, అనౌచిత్యంగా, పుక్కిట కథలుగా అనిపించవచ్చు. దాన్లో ఎవరి దోషం లేదు. కాని ఒక విషయం – మనం దాన్ని ఏ దృష్టితో చూస్తామో… అలా కనిపిస్తుంది. దోషం విషయంలో ఉండదు, చూసే దృష్టిలో ఉంటుంది.

మన పురాణాలన్నీ పనికిరానివి, అర్థం పర్థం లేనివి, ఏదో ఉబుసుపోక అల్లిన కట్టుకథలని అనుకుంటే అవి అలాగే కనిపిస్తాయి. ముఖ్యంగా వాటిని విదేశీయుల దృష్టితో చూస్తే ఇంకా ఘోరంగా కనిపిస్తాయి. సాధారణంగా ఇరుగుపొరుగువారిలో కూడా ఒకరి పద్ధతులు మరొకరికి వింతగా, అసహ్యంగా తోస్తాయి. ఉదయం నాలుగు గంటలకు లేచేవాడికి, ఏడయినా లేవని వాడిని చూస్తే అసహ్యం కలుగుతుంది. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచేవాడికి, క్రమశిక్షణగా ఉంటూ, శౌచ్యం పాటించే వాడిని చూస్తే జాలి, ద్వేషం. లంచం తీసుకునేవాడికి తీసుకోని వాడిని చూస్తే భయం, ద్వేషం. ఇలాంటి పరిస్థితి ఇద్దరు వ్యక్తుల నడుమనే ఉంటే, ఒక జాతి మరొక జాతిపై ఆధిపత్యం సాధించినప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కాబట్టి ఎలాగయితే, గ్రీకు పురాణాలను, ఇతర విదేశీ పురాణాలను సానుభూతితో, అవగాహనతో, వాటిలోని ఆంతర్యాలను, ప్రతీకలను, అంతర్గతపుటాలోచనలను విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయో, అలాగే భారతీయ పురాణ గాథలను కూడా భారతీయ దృక్పథంతో అవగాహన చేసుకొని, సానుభూతితో, ప్రతీకలను గుర్తించి అవగతం చేసుకుని ఆలోచించాల్సి ఉంటుంది.  అంతే తప్ప, బొటన వేలి నుంచి పుట్టడం ఏమిటి? తొడ నుంచి పుట్టడం ఏమిటి? అని ఈసడిస్తే ఎవరికీ ఒరిగేది ఏమీ లేదు.

పౌరాణిక గాథలను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఒక పద్ధతి కనిపిస్తుంది, ఒక ప్రణాళిక కనిపిస్తుంది. దేశం నలుమూలలో ఉద్భవించిన విభిన్న పురాణ గాథలు, విస్తరించిన విభిన్న పురాణాలలోనూ ఒక ఏక సూత్రత కనిపిస్తుంది. దేశమంతా ఒకే భావన, ఒక ‘ఐక్య’ భావన కనిపిస్తుంది. ఇది అత్యద్భుతమైన విషయం. ప్రతి అయిదడుగులకూ భాష, దృక్పథం, జీవన విధానం మారిపోయే పరిస్థితులలో అనాది కాలం నుంచీ అంతర్గతంగా అత్యద్భుతమైన ‘ఐక్యత’ను సాధించటం ఏ నాగరికతలోనూ, ఎక్కడా కనిపించదు. భారతదేశంలోని ఒక రాష్ట్రమంత చిన్న చిన్న దేశాలున్న ‘యూరప్’లోనే భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న పౌరాణిక గాథలు కనిపిస్తాయి. అలాంటిది కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కశ్యపుడు కనిపిస్తాడు. దక్షుడు కనిపిస్తాడు. దక్షుడి పదముగ్గురు పుత్రికలను కశ్యపుడు వివాహమాడుతాడు. ఇదెలా సాధ్యమైంది? ఆనాడు టెలివిజన్లు లేవు. సెల్‌ఫోన్లు లేవు. ఇంటర్‍నెట్‍లు లేవు. క్షణంలో సమాచారం ప్రపంచం నలుమూలల విస్తరించే వ్యవస్థ లేదు. అయినా ఈ ఐక్యత, ఏక సూత్రత ఎలా సాధ్యమైంది? దాన్ని సాధ్యం చేసిన వ్యవస్థ, ఆనాటి వ్యక్తులు ఎంత అద్భుతం! కాబట్టి ఆయా గాథలను తేలికగా కొట్టేసి, చులకన చేసి, కాలర్లెగరేసి ‘ఇంటలెక్చువల్స్’, ‘ప్రోగ్రెస్సివ్’ అయిపోవటం కన్నా ఆగి, ఆలోచించి, విశ్లేషించుకోవటంలోనే ‘విజ్ఞత’ ఉంటుంది.

(మళ్ళీ రెండు వారాల తరువాత).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here