నీలమత పురాణం-61

1
12

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]”ఇం[/dropcap]కా ఏమేం తెలుసుకోవాలని ఉంది?” అని బృహదశ్వుడు అడిగిన ప్రశ్నకు స్పందనగా గోనందుడు తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

“మహానుభావా, నాకు కశ్మీరంలోని పవిత్ర స్థలాలను గురించి వినాలని ఉంది. అవి చూడటం వల్ల కలిగే ఫలితం, వాటి గొప్పతనం వివరించవా?” అడిగాడు.

‘కశ్మీరేషు చ దేశేషు దర్శనం సంప్రకీర్తయ’

రాజు కోరిక విన్న బృహదశ్వుడు కశ్మీరంలోని పవిత్ర స్థలాల గురించి చెప్పటం ప్రారంభించాడు.

బృహదశ్వుడు వివరించిన కశ్మీరంలో పవిత్ర స్థలాల గురించి తెలుసుకునే ముందు మరో విషయం చర్చించుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో కశ్మీరానికి సంబంధించి ‘నీలమత పురాణం’ ఉన్నట్టు, ఇతర ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాంతీయ పురాణాలు ఉన్న సూచనలు లేవు.

పురాణాల గురించి ఇలా వర్ణించారు:

“They are both documents of socio-religious order of the contemporary society and the philosophy of the life of the people of the their time and of the future generations.”

మరో సందర్భంలో పురాణాలు ‘They used to serve as a unifying force’ అంటారు.

పురాణాలు సమకాలీన సామాజిక తత్వాన్ని, ప్రజల జీవన విధానాన్ని, ఆ కాలం నాటి సామాజిక మతపరమైన అంశాలను వివరిస్తాయి. పురాణాలు దేశాన్ని ఏకత్రితం చేసే సాధనాలు అన్న అభిప్రాయం పురాణాలను విశ్లేషించినవారు వెలిబుచ్చారు.

గమనిస్తే, మనకు మహాపురాణాలు, ఉపపురాణాల పాటు స్థానికంగా స్థలపురాణాలు ఉన్నాయి. పవిత్ర స్థలాల చరిత్రను, ప్రత్యేకతను ప్రకటిస్తాయి పురాణాలు. ప్రతి పవిత్ర స్థలానికి దానికి సంబంధించిన స్థల పురాణం ఉంటుంది. ఈ స్థల పురాణం ఆ స్థలం గొప్పను చెప్తూనే, ఆ స్థలానికీ భారతదేశంలోని ఇతర స్థలాలకు ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. కామాఖ్య మందిరానికి చెందిన ‘కాళిక పురాణం’ అస్సాం ప్రాంత సాంస్కృతిక సామాజిక ధార్మిక జీవనం గురించి చెప్తుంది. కానీ ‘నీలమత పురాణం’లా ఒక ప్రత్యేక పవిత్ర స్థలం కాక మొత్తం ప్రాంతానికి సంబంధించిన పురాణం మరొకటి లేదు. పురాణాలు పలు విషయాలను ప్రచారంలొకి తెచ్చి, తరతరాలకు తమ వారసత్వాన్ని ధర్మాన్ని బోధిస్తుంటాయి. అయితే ఒక ప్రత్యేక పవిత్ర స్థలానికో, ఒక ప్రత్యేక దైవానికో (శివ, విష్ణు, శక్తి) పరిమితం కాకుండా సమస్త కశ్మీరుకు ప్రత్యేకంగా పురాణం ఎందుకు అవసరమైందని ఆలోచించాల్సి ఉంటుంది.

భౌగోళికంగా కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు శీతోష్ణస్థితిలో తేడా ఉంది. అంతే కాదు, ఇతర భారత్‌తో కలిసేందుకు ఉన్న మార్గం అత్యంత కఠినమైనది. అదొకటే మార్గం కాబట్టి, దేశంలోని ఇతర భాగాలతో కశ్మీరు సంబంధాన్ని వివరిస్తూ కశ్మీరు ప్రజలకు భారత్‌తో తమ అనుబంధాన్ని తెలిపి, తాము ప్రత్యేకం కాదు, భారతీయ ధర్మం అనే మహాసముద్రంలో తమూ భాగం అని నిరూపించేందుకు, వారికి నిరంతరం గుర్తు చేసేందుకు ‘నీలమత పురాణం’ అవసరమై ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ ప్రాంతం దేశంలోని ఇతర ప్రాంతాలకు ఏదైనా కారణం వల్ల దూరమైనా తమ మూలాలను ప్రజలు మరచి పోకుండా ఉండి, సోదర భావం నెరపేందుకు, కశ్మీరును భారత్‌తో పట్టి ఉంచేందుకు ఆధారంగా నిలుస్తుంది ‘నీలమత పురాణం’ అన్న ఆలోచనతో నీలమత పురాణం ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. అందుకే ఈ నీలమత పురాణం ప్రధాన అంశం కశ్మీరు తప్ప ఏ దైవమో, ఏ మందిరమో కాదు. ‘నీలమత పురాణం’ కశ్మీరు గురించి అయినా దాని కేంద్ర బిందువు భారతీయ ధర్మం. అంతే కశ్మీరు తమ నుంచి వేరు అని ఇతర ప్రాంతాల వారు అనుకోకుండా, తాము ప్రత్యేకం అని కశ్మీరు నివాసులు అనుకోకుండా రెంటి నడుమ వారధిలా ఉందన్నమాట నీలమత పురాణం.

అందుకే విశ్వగశ్వుడి రాజ్యం సరస్సుగా మారిన కథ విన్న తరువాత గోనందుడు వెంటనే కశ్మీరంలోని పవిత్ర స్థలాల గురించి తెలపమని అడుగుతున్నాడు.

ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఏమిటంటే, అధికారం చేపట్టగానే రాజుకు మొత్తం పురాణం వినిపిస్తున్నారు. ఇది రాజుకు కేవలం తాను అధికారం నెరుపుతున్న కశ్మీరు గురించే కాదు, సమస్త భారత దేశం గురించి, భారతీయ ధర్మం గురించి అవగాహన కల్పిస్తుంది. భారతీయ ధర్మధారలో తామూ భాగమేనన్న గ్రహింపు వస్తుంది. బహుశా ఇలాంటి భావన వలనే ఏమో అతి అరుదుగా కశ్మీరు రాజులు భారతదేశంలోని ఇతర ప్రాంతాల వైపు దృష్టి నిలపటం, అదీ తాత్కాలికంగానే చూడవచ్చు. భారతదేశంలోని ఇతర రాజులు కూడా కశ్మీరాన్ని పవిత్రంగా చూడటం కనిపిస్తుంది తప్ప మరో దృష్టి కనబడదు. దేశాన్ని ఏకత్రితం చేయటంలో పురాణ సృజన ఒక అపూర్వమైన, అద్భుతమైన పద్ధతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here