నీలమత పురాణం-66

0
9

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పధీశ్వరాఖ్యాస్తతేష్ఠో దేవస్తా యతనో భవత।
ఆరు రోహ యదు శైలం పథా దేవో మహేశ్వరః॥

[dropcap]పా[/dropcap]ర్వతిని కొండ క్రిందనే ఆపి తాను దాన్ని అధిరోహించడం ఆరంభించాడు మహేశ్వరుడు. ఆయన పర్వతాన్ని ఏ దారి నుంచి అధిరోహించాడో, ఆ దారిలో ఇష్టపథేశ్వర మందిరం వెలసింది.

మహేశ్వరుడి పాదం తనను తాకటంతోటే తాను పవిత్రమయ్యానని గ్రహించిన పర్వతం మహేశ్వరుడి పాదస్పర్శను మరింతగా వాంఛిస్తూ ఆయన ఎంత ఎత్తు ఎక్కితే అంతగా తన పొడవును పెంచసాగింది. ఎంత ఎక్కినా శిఖరం అందకపోవడంతో మహేశ్వరుడు అలసిపోయాడు. అప్పుడు ఆయన జరుగుతున్నది గ్రహించాడు.

మహేశ్వరుడు ఎంత ‘భోళా’ అయినా అంత త్వరగా గ్రహించగలదు.

పర్వతం చేస్తున్న పనికి శివుడు ఆగ్రహించాడు. పట్టరాని కోపంతో పర్వతం తలపై అంటే పర్వత శిఖరంపై కాలితో ఒక తన్ను తన్నాడు.

అప్పటి నుంచి ఆ పర్వతానికి ‘ముండపృష్ట’ అన్న పేరు వచ్చింది. అయితే శివుడి పాదతాకిడి వల్ల ఆ పర్వతం సాంతం అతి పవిత్రమయింది. అందువల్ల ఎవరయినా అపవిత్రమూ, అశుద్ధమూ అయిన మాటలు మాట్లాడితే, ఈ పర్వతానికి తన మొత్తం శరీరాన్ని తాకిస్తే ఆ పాపం పరిహారమవుతుంది. అయితే మహేశ్వరుడు కాలితో తన్నడం వల్ల ఆ పర్వతం మనిషి రూపాన్ని ధరించింది. ముకుళిత హస్తాలతో పరమశివుని ధ్యానించింది. ‘నేను బాధలో ఉన్నాను’ అని ప్రార్థించింది.

అప్పుడు ఆ పర్వతుడిపై జాలి పడి శివుడు అన్నాడు:

“నా కాలి తాకిడితో నీ శిఖరం నుండి వెలువడిన జలాన్ని ‘కృపాణి తీర్థం’ అని పవిత్రంగా భావిస్తారు ప్రజలు” అన్నాడు.

శివుడు పర్వతానికి ‘ముండపృష్ట’ అన్న నామం ఇవ్వటంతో పర్వతం సుందరాకారం ధరించింది. దాని సౌందర్యానికి ఆకర్షితులై అప్సరసలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ అది ‘అప్సరస తీర్థం’గా ప్రసిద్ధి చెందింది.

బ్రహ్మపాదమనే అందమైన పవిత్రస్థలాన్ని దర్శించిన శివుడు ఆనందపరవశుడై హంస రూపం ధరించాడు. హంస రూపాన్ని ధరించి పర్వతాన్ని పడగొట్టాడు. పర్వతంలో హంస రూపంలో భగవానుడు ఏర్పరిచిన మార్గం ‘హంస ద్వారం’గా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వార దర్శనం సకల పాపాలను హరిస్తుంది.

శివుడు పర్వత పృష్టి భాగాన్ని కాలితో తన్నటం, అక్కడ నుండి నీరు ఊరటం, హంస రూపం ధరించి పర్వతంలో రంధ్రం చేయడం, అది ‘హంస ద్వారం’గా ప్రసిద్ధి పొందటం వంటి గాథలు ఆయా ప్రాంతాలలో సంభవించిన భూ కదలికల వల్ల ఏర్పడిన భౌగోళిక స్వరూపాల గాథలు అనిపిస్తాయి. భౌతిక శక్తులకు ఆధ్యాత్మికతను అద్ది ప్రకృతిని పవిత్రంగా మలచటం అనిపిస్తుంది. ఇది భారతీయ ధర్మంలో అడుగడుగనా కనిపిస్తుంది.

భారతీయ ధర్మం మనిషి ప్రకృతిపై ఆధారపడి బ్రతికే జీవి అన్నది స్పష్టంగా గ్రహించింది. అందుకే మానవ జీవితాన్ని ప్రకృతితో పాటు కలిసి జీవించే రీతిలో రూపొందించింది. చెట్లు, ఓషధులు, నదులు మాతలు. పర్వతాలు పవిత్రం. ఇలా కనపడే ప్రతీ దానిలోనూ భగవంతుడిని దర్శించాలని తపన పడుతుంది భారతీయ ధర్మం. దాంతో మనిషి విశ్వప్రణాళికలో తానూ భాగమని గ్రహిస్తాడు. తను ప్రకృతితో మమేకమై జీవించాలి తప్ప, ప్రకృతి వేరు, తాను వేరు అని భావించకూడదు అని అర్థమవుతుంది. ప్రకృతితో కలిసి సహజీవనం సాగించడం సర్వసాధారణమవుతుంది.

భారతీయ జీవనంలోని నిత్యనైమిత్తిక కర్మలన్నీ ఈ దిశలో సాగుతాయి. ఈ లక్ష్యం ప్రదర్శిస్తాయి. కాబట్టి పురాణ గాథ వినగానే శివుడు ఏంటి, కాలితో తన్నటం ఏమిటి, అటు నుండి నీరు రావటం ఏంటి? అంతా illogical, trash అని కొట్టి పడేసే ముందు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. మన పురాణాలను ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అన్ని చెప్పేవి. ఇక్కడ కూడా ‘ఇలా జరిగింది’ అని చెప్తున్నాయి. ఆ ‘ఇలా జరిగింది’ అన్న దాన్ని పైపైన కన్పించేదాన్ని తొలగించి కాస్త లోతుగా వెళ్ళి చూస్తే అద్భుతమైన శాఖలు కనిపిస్తాయి. లోతుగా వెళ్ళటం కష్టం అనుకుని ఒడ్డున కూర్చుని రాళ్ళు విసురుతుంటే ఒరిగేదేమీ లేదు!

నాటిక, సందిత వంటి పవిత్ర స్థలాలను సందర్శించిన దైవం కపిలతీర్థం చేరుకున్నాడు. అక్కడ బ్రాహ్మణులు, దేవతలు, ఋషులు కలిసి యజ్ఞం చేయడం చూశాడు.

హంస రూపంలో ఉన్న మహేశ్వరుడిని చూసిన బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్న బ్రహ్మను చూసి శక్ర ప్రార్థన చేశాడు.

“దేవదేవా, విశ్వకారణం నువ్వు. ముల్లోకాలకు అధిపతివి. అందరికీ దైవానివి. విశ్వమంతా ఆవరించి ఉన్నావు. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప మరో కారణం లేదు. ముల్లోకాలలో చరాచర సృష్టి అంతా నువ్వే. సృష్టి, స్థితి, లయకు కారకుడవు నీవు. నువ్వు కళ్ళు తెరిస్తే ముల్లోకాలు జన్మిస్తాయి. నువ్వు నిద్రిస్తే ముల్లోకాలు నాశనమై అదృశ్యమవుతాయి. నీ శక్తి వల్లనే భూమిపై చరాచర జాలం జీవించగలుగుతోంది. నీ దయ వల్లనే జలం ఉత్పన్నమవుతోంది. నీ తేజం వల్లనే ప్రపంచంలో అన్నీ జ్వలిస్తున్నాయి. నీ శక్తి వల్లనే వాయువు వీస్తోంది.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here