నీలమత పురాణం-73

0
6

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కృత్వా జగామ్ కశ్మీరాన్ తథైవాసో మహీపతిః।
ఆప్లుత్య తీర్థేషు తదా గృధకూటముపాగతమ్॥

శుద్ధ సరస్వతీ రామస్య చైవ సంయోగం యత్ర గచ్ఛతః।
తత్ర స్నాతస్య రామస్య కరౌ శుద్ధి ముపాగతౌః॥

[dropcap]21[/dropcap] మార్లు దేశమంతా తిరిగి క్షత్రియులను సంహరించినందు వల్ల పరశురాముడి చేతులు రక్తంతో నిండిపోయాయి. ఎంత కడిగినా అది పోవడం లేదు. దాంతో అతడు పితృ దేవతలను ప్రార్థించాడు. “నువ్వు శరణువేడినవారిని, భయంతో పారిపోతున్నవారిని వేటాడి మరీ చంపావు. అందువల్ల నీ శరీరం సర్వం పాపమయం అయిపోయింది. కాబట్టి తీర్థయాత్రలు చేయి. పవిత్ర స్థలాల మట్టి స్పర్శతో, తీర్థాలలోని పవిత్ర జలంతో నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. నువ్వు సంపూర్ణంగా పవిత్రమైన తరువాతనే నీ చేతులకు అంటిన రక్తం పోతుంది. నీ రెండు చేతులు రక్తం నుండి పరిశుభ్రమైన తరువాత తపస్సు చేయాలి” అని అతని పూర్వీకులు అన్నారు.

వారి మాటను మన్నించి పరశురాముడు తీర్థయాత్రలు ఆరంభించాడు. పవిత్ర స్థలాలను దర్శించాడు. అలా పవిత్ర తీర్థాలలో నిత్యం స్నానం చేస్తూ కశ్మీరులోని గృధకూటం చేరాడు. శుద్ధ నది, సరస్వతి సంగమంలో స్నానం చేయటంతో సంపూర్ణంగా పవిత్రుడయ్యాడు. తన పాపం సంపూర్ణంగా పరిహారమవటంతో సంతుష్టడయిన రాముడు ఆ ప్రాంతానికి ఒక వరం ఇచ్చాడు. ‘ఈ పవిత్ర సంగమ స్థలంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. వ్యక్తి పవిత్రుడవుతాడు. భృగులోకాలు అతనికి ప్రాప్తిస్తాయి’ అన్నాడు. అలా శత్రువులను సంహరించిన వారంతా ఈ సంగమ స్థలంలో స్నానమాడి పాపాలను పోగొట్టుకుంటారు, ప్రవిత్రులవుతారు.

పథేశ్వర వద్ద ఘోరమైన తపస్సు చేశాడు రాముడు. తరుసో బ్రహ్మసార వద్ద ఉద్భవించిన పుణ్యోదయ నది చేరుకున్నాడు. ఇక్కడ రాముడు తపస్సు చేయటం వల్ల నడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ‘రామప్పద’ అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఒక సంవత్సరం పాటు ఈ ప్రాంతంలో తపస్సు చేసిన రాముడు గృధకూట పర్వత పాదాల వద్ద తపస్సు ప్రారంభించాడు.

రాముడి పాపాలు నశించి అతని హస్తాలు రక్తరహితమయిన ప్రాంతం పుణ్యోదయ నదికి సమీపంలోనే ఉంది. అతడికి దగ్గరలోనే ‘అవంత’ అనే నాగుల రాజు ఉండేవాడు. అక్కడ రాముడు కఠినమైన తపస్సు చేశాడు. అక్కడ శాంఖ్ఞి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

రాముడు అక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆశ్రమస్వామి దర్శనం కోసం వచ్చాడు. ఆశ్రమస్వామికి అర్పించటానికి తనతో పాటు ఒక గోవును కూడా తెచ్చాడు. అయితే ఆశ్రమస్వామిని చేరకముందే దారిలోనే ఆ గోవు మరణించింది. ఇది బ్రాహ్మణుడిని దుఃఖంలో ముంచివేసింది. అతడిలో తీవ్రమైన పశ్చాత్తాపం రగిలింది. దుఃఖించాడు, బాధపడ్డాడు. గోవు శవాన్ని అక్కడే వదిలి విచారిస్తూ, దుఃఖిస్తూ గమ్యం లేకుండా తిరగసాగాడు. అలా తిరుగుతూ అతడు రాముడు తపస్సు చేస్తున్న స్థలానికి వచ్చాడు. రాముడు అతడి దుఃఖానికి కారణం అడిగాడు. ఆ బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పాడు. రాముడు తన దివ్యదృష్టితో చూసి జరిగినదంతా గ్రహించాడు. “ఇందులో నీ తప్పు లేదు. ఒక గంధర్వ కన్య, గోవు రూపం ధరించి నారదుడిని అవమానించింది. దాంతో కోపించిన నారదుడు ఆ కన్యను గోవుగా మారిపొమ్మని శపించాడు. ఆమె తన తప్పు గ్రహించి క్షమించమని వేడుకొంది. ఆమె పశ్చాత్తాపానికి ప్రసన్నుడయిన నారదుడు ఆమె గోవుగా మారిపోయిన తరువాత ఓ బ్రాహ్మణుడు దైవానికి అర్పించేందుకు గోవును తీసుకుని గృధకూట పర్వతానికి వస్తాడని, అక్కడ సంభవించే మరణం వల్ల శాపవిముక్తి అవుతుందని చెప్పాడు. ఫలితంగా ఆ గోవు పర్వతం అధిరోహించే దారిలో మరణించింది. గంధర్వ కన్య శాపవిముక్త అయింది. కాబట్టి గోవు మరణ దోషం నిన్ను తాకదు. గోదానం పుణ్యం నీకు లభిస్తుంది. నువ్వు బాధ పడాల్సిన పని లేదు. కాబట్టి ఆశ్రమానికి వెళ్ళు. స్వామి దర్శనం చేసుకో. స్వామి దర్శనంతోటే నీ పాపాలన్నీ నశిస్తాయి. కానీ ఈ సంఘటన వల్ల నాకు ఒక ఆలోచన స్ఫురించింది. ఆశ్రమస్వామి దర్శనం కోసం వచ్చేవారంతా ఎంతో కష్టపడి కొండను ఎక్కుతారు. స్వామికి అర్పించటం కోసం వెంట తెచ్చే గోవులకు కూడా కొండ ఎక్కటం ఎంతో కష్టంగా ఉంటుంది. వాటిని కష్టపెట్టిన పాపం వల్ల గోదానం వల్ల లభించే పుణ్యం సమసిపోతుంది. అందుకని కొండపైన ఉన్న స్వామి విగ్రహాన్ని కొండక్రిందకు తెచ్చి కొండ పాదం వద్ద ప్రతిష్ఠిస్తాను. ఇందువల్ల భక్తుల కష్టాలు తగ్గుతాయి. భక్తులు దానం ఇచ్చిన పశువులకు కూడా కష్టం తగ్గుతుంది” అన్నాడు. తన సంకల్పం నెరవేరేందుకు భగవంతుడి అనుమతి కోసం తపస్సు ప్రారంభించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here